నేడు డాక్టర్స్ డే
డాక్టర్ ప్రీతమ్ కుమార్ రెడ్డి, పీడియాట్రీషియన్
రెయిన్‌బో చిల్డ్రెన్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్
ఓ చిన్నారిని రక్షించడానికి డాక్టర్‌గా నేను వ్యాధితోనే కాదు... కాసేపు ప్రకృతితోనూ పోరాడాల్సి వచ్చింది. అది 2006 వ సంవత్సరం. గుంటూరులోని పెద్ద పీడియాట్రీషియన్లలో ఒకరి నుంచి ఆ కాల్. ఏడాది వయసు చిన్నారి వెంటిలేటర్‌పై ఉన్నాడు. సివియర్ నిమోనియా విత్ ఏఆర్‌డీఎస్ అనే కండిషన్‌తో బాధపడుతున్నాడు. పిల్లాడిని తరలించడానికి ఏడు గంటల సమయం అవసరం.
అంతసేపూ ప్రాణాలు కాపాడుతూ ఉండటం కష్టమే. కాల్ రాగానే రాత్రి 9 గంటలకు బయల్దేరిపోయాను. పొద్దున్నే 4 గంటలకు అక్కడికి చేరి పిల్లాడ్ని పరీక్షించాను. అతడికి అన్ని వసతులూ ఉన్న కేంద్రంలో చికిత్స అవసరం. మా డ్రైవర్‌నూ, మిగతా సిబ్బందినీ కాసేపు విశ్రాంతి తీసుకొమ్మని ఉదయం 9 గంటలకు గుంటూరు నుంచి ప్రయాణం ప్రారంభించాం. మధ్య దారిలో భోరున వర్షం.
కనపడని రోడ్లు. ఎక్కడ గుంట ఉందో, మరెక్కడ రోడ్డు ఉందో, ఇంకెక్కడ వాగు ఉందో తెలియనంతగా మింటికీ మంటికీ ఏకధారగా వర్షం. పెద్ద హాస్పిటల్‌కు చేర్చి వెంటనే అతడిని ‘హై ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్’ పై ఉంచాం. అలా వరసగా ఏడురోజుల పాటు ఆ వెంటిలేటర్‌పై చికిత్స చేశాం. పన్నెండో రోజున అతడు ప్రమాదం నుంచి బయట పడ్డట్లుగా ప్రకటించాం. ఇప్పుడా పిల్లాడి వయసు తొమ్మిదేళ్లు. చక్కగా స్కూలుకెళ్తున్నాడు.