నేడు డాక్టర్స్ డే
డాక్టర్ బొల్లినేని భాస్కర్‌రావు,
ఎండీ అండ్ సీఈవో, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్
ఇవ్వాళ కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (కిమ్స్) సంస్థ దాదాపు వెయ్యి పడకలతో జంటనగరాల్లో ఒక పెద్ద సంస్థగా ఆవిర్భవించి ఉంది. కానీ ఇలాంటి సంస్థ అంత తేలిగ్గా ఉనికిలోకి రాలేదు. దీని వెనక మా అమ్మ సంకల్పం, మా నాన్నకు వచ్చిన వ్యాధి, మా చెల్లెలి దైన్యం... ఇలా ఎన్నో. ఇక్కడ పేర్కొన్న చివరి రెండు అంశాలూ అందరికీ అందుబాటులో ఉండేలా, అతి చవకగా వైద్యచికిత్స అందించాలన్న దీక్షను నాలో నింపాయి.
జీవితం పట్ల నా దృక్పథాన్ని రెండు సంఘటనలు తీవ్రంగా ప్రభావితం చేశాయి. మొదటిది మా నాన్నగారికి వచ్చిన ఈసోఫేజియల్ క్యాన్సర్. రెండోది మా చెల్లెలికి అవసరమైన ఆపరేషన్. కేవలం రూ. 5,000 ఉంటే ఆమెకు ఆపరేషన్ పూర్తవుతుంది. దాన్ని సమీకరించడానికి మాకు చాలా సమయం పట్టింది. ఆ జాప్యమే మా చెల్లెలి పక్షవాతానికి దారితీసింది. జీవితం నేర్పిన కఠిన పాఠాల నుంచి నేను నేర్చుకున్నదేమిటంటే... ఇతరులకు సహాయపడాలంటే మొదట నేను ఇవ్వదగిన స్థానంలో ఉండాలి. అందుకు న్యాయంగా డబ్బు సంపాదించాలి. ఇక రెండోది నేనో వైద్యచికిత్స కేంద్రాన్ని ప్రారంభించాలి.
అక్కడ సాధారణ అందుబాటు ధరల్లోనే పెద్ద పెద్ద సంక్లిష్టమైన చికిత్సలు సైతం అందాలి. చికిత్స కంటే నివారణ మేలు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇన్ని సంకల్పాలతో తొలుత కేవలం 150 పడకలతో ఆసుపత్రిని ప్రారంభించాను. ఇప్పుడిక్కడ 1000 పడకలతో అత్యాధునికమైన పెద్ద ఆసుపత్రి రూపొందింది. జీవితపు పాఠాలను ప్రేరణగా తీసుకుంటే, వాస్తవ సంఘటనలనుంచి స్ఫూర్తి పొందితే ఎలాంటి లక్ష్యాలనైనా సాధించవచ్చు అనే సత్యాన్ని యువతకు తెలియజేయడం కోసమే ఈ కొన్ని విషయాలు యువతకోసం చెబుతున్నాను.
ఆ సంఘటనలే కిమ్స్ ఆవిర్భావానికి బీజం వేశాయి
Published Mon, Jun 30 2014 11:35 PM | Last Updated on Sat, Sep 2 2017 9:36 AM
Advertisement