ఆరోగ్యదాతలు... అభయప్రదాతలు | National Doctors' Day | Sakshi
Sakshi News home page

ఆరోగ్యదాతలు... అభయప్రదాతలు

Published Mon, Jun 30 2014 11:14 PM | Last Updated on Sat, Sep 2 2017 9:36 AM

National Doctors' Day

నేడు డాక్టర్స్ డే
 
 ఆ చేత స్టెతస్కోప్ గుండెకు ఆనగానే రోగికి అభయం...
 ఆ చేత సూదిమందో, చేదుమందో పడగానే రోగికి నయం...
 ఆ చేత కట్టుకట్టించగానే ఎంతపెద్ద గాయమైనా మాయం...
 అందుకే డాక్టర్ అంటే సాక్షాత్తూ భగవంతుడి స్వరూపం...
 డబ్బులిచ్చి సేవలు తీసుకునేవారు మరింకెక్కడైనా డిమాండ్ చేస్తారేమోగానీ... డాక్టర్ దగ్గర వినయంగా సేవను స్వీకరిస్తారు.
 అదీ వైద్యవృత్తి గొప్పదనం. అదే వైద్యులకు గర్వకారణం.
 అయితే... డాక్టర్లకూ వృత్తిగతమైన విజయాలూ పరాజయాలుంటాయి.
 వృత్తిపరమైన విజయసంతృప్తులుంటాయి, భావోద్వేగాలుంటాయి.
 వేదనలూ రోదనలూ ఆవేదనలూ వాళ్ల గుండెల్నీ పిండేస్తాయి.
 నేడు డాక్టర్స్ డే సందర్భంగా తమ తమ వైద్య వృత్తిజీవితాలలోని అనేక మరపురాని, మరవలేని సంఘటనలను ప్రస్తావిస్తున్నారు కొందరు ప్రముఖ డాక్టర్లు.
 తమలోకి అంతర్ముఖులై కొందరూ, తమ స్ఫూర్తిని పంచి సమాజానికి మంచి చేద్దామని మరికొందరూ తమ అంతరంగాలను అరమరికలు లేకుండా ఆవిష్కరించారిక్కడ.
 రండి... వాళ్ల విజయ వీచికలనూ, ఉద్విగ్న.. ఉద్వేగాలను చదవండి.
 గుండె తడిమే భావాలతో మమేకమై వాళ్ల భావోద్వేగాలను మనమూ పంచుకుందాం పదండి.

 
 పారాడిన పాదాలకు నివాళి!
 డాక్టర్ గురవారెడ్డి,  మేనేజింగ్ డెరైక్టర్ అండ్ చీఫ్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్,
 సన్‌షైన్ హాస్పిటల్స్, సికింద్రాబాద్


ఆరోజు ఇంకా గుర్తే నాకు. ఆదివారం. నా మేనత్త భోజనానికి పిలిస్తే వెళ్లాను. నాన్న చెల్లెలు - వనస్థలిపురంలో ఉంటుంది. మనవడు ఆస్ట్రేలియా నుంచి వచ్చాడని - బంధువర్గానికంతటికీ విందు ఏర్పాటు చేసింది. నాన్న తరఫు బంధువులు చాలామంది హైదరాబాద్‌లో ఉన్నారు. అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనానికి ఉపక్రమించాం.
 
నా మేనత్త స్నేహితురాలు (ఆమెను సావిత్రి అందాం) కూడా ఆ రోజు ఆ బృందంలో ఉంది. సావిత్రిగారికి రెండు నెలల కిందే రెండు మోకాళ్ల ఆపరేషన్ చేశాను. బాగా కోలుకుంది. ఆమె తన జీవితాన్ని మునపటిలాగే పూర్తిగా ఆస్వాదించడం మొదలుపెట్టింది.
 
సావిత్రి నా దగ్గరికి వచ్చి ఒక కోరిక కోరింది. ‘‘డాక్టర్‌గారూ... నా కాళ్లకు ఆపరేషన్ చేసి పునర్జన్మను ఇచ్చారు. అలాగే నా స్నేహితురాలు లక్ష్మికి మీరే ఆపరేషన్ చేయాలి. ఆమె గత పదేళ్ల నుంచి నడవడం లేదు. ఆమె ఈ దగ్గర్లోనే ఉంటుంది. పది నిమిషాలు రాగలరా?’’ అని అడిగింది. అందరితో కబుర్లు చెప్పుకుంటూ ఆనందిస్తున్న నాకు - ఈ అభ్యర్థన కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. అయినా మర్యాదగా ఉండదని ఆమెతో పాటు లక్ష్మిని చూడటానికి వెళ్లాను.
 
ఆ ఇల్లు ఓ చిన్న గల్లీలో ఉంది. కారు ఆపి నడుచుకుంటూ వెళ్లాం. లక్ష్మి యాభై ఏళ్ల ఇల్లాలు. ఆమెకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చి చిన్న వయసులోనే మోకాళ్లు అరిగిపోయాయి. గత పదేళ్ల నుంచి మోకాళ్లు వంగిపోయి నడవలేని స్థితిలో ఉంది. సాధారణంగా ఇలాంటివారు వీల్‌చైర్‌కే పరిమితమైపోతారు. సొంతంగా ఏ పనీ చేసుకోలేక - కుటుంబం మీద ఆధారపడుతూ ఉండిపోతారు. మోకాళ్లు ఒంగిపోయిన ఆమె... కుంగిపోయి ఉంటుందనుకున్నా. కానీ... ఓ పసిపాప పారాడినట్లు పాకుతూ తన పనులన్నీ చేసుకుటోంది. ఇద్దరు కొడుకులు, కోడళ్లున్నా వాళ్ల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే... జీరాడే కాళ్లతో పారాడుతూ ఆమె జీవితంతో పోరాడుతోంది.
 
ఇంట్లో తనకో గదిని అమర్చుకుంది. అందులో అన్నీ సమకూర్చుకుంది. ఆ వస్తువులన్నీ అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసుకుంది. అడుగు ఎత్తులోనే తనకు అందేలా చూసుకుంది. టీవీ, గ్యాస్ పొయ్యి, మంచినీళ్ల బిందె, మంచం, అద్దం... ఇలా అన్నీ అందేలా... అందుబాటులో.
 అలా పాకుతూనే అవలీలగా నాకు కాఫీ చేసిచ్చింది. బాత్‌రూమ్‌లోకి వెళ్లి అలవోకగా ముఖం కడుక్కుని వచ్చింది. కాకపోతే అంతులేని ఆత్మస్థైర్యం అల్లంత ఎత్తున! అంతటి ఎత్తు తాలూకు క్రీనీడ... నొప్పి రూపాన కాస్తంత ఆ ముఖాన!! అంతే.
 
అరగంట పట్టింది ఆపరేషన్‌కు ఆమెను ఒప్పించడానికి. ‘‘నేను నా పనులన్నీ చేసుకుంటూనే ఉన్నాను కదా. నాకు ఆపరేషన్ ఎందుకు?’’ అన్నది ఆమె ప్రశ్న. ‘‘మీ నొప్పి తగ్గిపోతుంది. కాళ్లు నిటారుగా వస్తాయి. మళ్లీ మామూలుగా నడవచ్చు కదా’’ అని నేను.
 
ఆ మర్నాడు ఆమె ఆసుపత్రిలో చేరడం, ఆపరేషన్‌కు ముందుగా నిర్వహించే పరీక్షలన్నీ చేసేయడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. మోకాళ్లు పదేళ్ల నుంచి ఒంగిపోయి ఉన్నాయి కాబట్టి వాటిని తిన్నగా చేయడానికి ట్రాక్షన్ అమర్చి ఓ వారం తర్వాత ఆపరేషన్‌కు రెడీ చేశాం. రోజూ రౌండ్స్‌కు వెళ్లినప్పుడు లక్ష్మి దగ్గరే ఓ పది నిమిషాలు గడిపేవాణ్ణి. ‘‘డాక్టర్‌గారూ... నేను మళ్లీ నడవగలనా?’’ అని రోజూ అడిగేది. నడకవస్తే పుట్టపర్తి సాయిబాబాని చూడాలను దనేది. ఆపరేషన్ రోజు రానే వచ్చింది. సాయిబాబాను ఉపాసించే గురువారం రోజే ఆపరేషన్ చేయాలని కోరింది. నాలుగు రోజుల తర్వాత లక్ష్మి నడక మొదలుపెట్టినప్పుడు ఆమె కళ్లలో ఆనందాన్ని ఊహించుకుంటూ ఆపరేషన్ చేస్తున్నాను. అంతలో హఠాత్తుగా అనస్థటిస్ట్ ‘ఓ మైగాడ్’ అనడం వినపడింది. తలెత్తి చూస్తే అనస్థటిస్ట్‌తో పాటు ఆయన బృందమంతా పెద్దప్రాణాన్ని కాపాడే పనిలో నిమగ్నమై కనిపించారు.
 
లక్ష్మి పదేళ్లకు పైగా నడవకుండా ఉండిపోవడంతో ఆమె కాలిలోని రక్తనాళాల్లో ఒక చోట రక్తం గడ్డకట్టుకుపోయింది. ఆ గడ్డ కదిలిపోయి ఊపిరితిత్తుల్లోకి చేరిపోయింది. దాంతో పల్మనరీ ఎంబాలిజమ్ అనే కండిషన్ ఏర్పడి కార్డియాక్ అరెస్ట్‌లోకి వెళ్లి ఆమె గుండె ఆగిపోయింది. అందుకే ఆమెను రక్షించడానికి మిగతా బృందమంతా సీపీఆర్  అనే ప్రక్రియ ద్వారా ఆ హృదయాన్ని మళ్లీ స్పందింపజేయడంలో నిమగ్నమై ఉన్నారు. నేను ఆపరేషన్ ఆపేసి మ్రాన్పడి చూస్తుండిపోయాను. అరగంట పాటు విఫలయత్నం. విషాదం... లక్ష్మి ఆపరేషన్ టేబుల్ మీద చనిపోయింది.
 
‘‘మా అమ్మ కుంటుతూనో, పాకుతోనో, ప్రయాసతోనో మా ముందు ఉండేది డాక్టర్. అమ్మను లేకుండా చేశారు కదా’’ అంటూ ఆ ఇద్దరు కొడుకులు ఆవేదనగా అన్నప్పుడు ఎక్కడికైనా పారిపోవాలని అనిపించింది.
 
నేను కోలుకోవడానికి నెలరోజులు పట్టింది. దేవుడు ఇలా ఎందుకు చేస్తాడో? లక్ష్మి తనంతట తాను నా దగ్గరికి రాలేదే? నా మేనత్త స్నేహితురాలు సావిత్రికి నేను ఆపరేషన్ చేయడం వల్ల అది విజయవంతమై... ఆమె నన్ను లక్ష్మి దగ్గరకు తీసుకెళ్లింది. ఆమె నన్ను వేడుకోవడం ఎందుకు? అలా వేడుకోగానే నా వేడుకను వదిలిపెట్టి మరీ నేను లక్ష్మి ఇంటికి వెళ్లడం ఎందుకు? ఆమెను కన్విన్స్ చేసి మరీ ఆపరేషన్‌కు ఒప్పించడం ఎందుకు? ఇలా ఆమె నా చేతుల్లో పోవడానికేనా? అర్థం కాని ప్రశ్నలెన్నో?!
 
వారం తర్వాత (గురువారం నాడు) లక్ష్మి ఉన్న వార్డ్ తాలూకు సిస్టర్-ఇన్‌ఛార్జ్ నాకో కవర్ ఇచ్చింది. లక్ష్మి ఆ కవర్‌ను సిస్టర్‌కు ఇచ్చి... వచ్చే గురువారం నాకు ఇమ్మని అందట. ఆ కవర్ విప్పి చూస్తే... సాయిబాబా బొమ్మ, కొద్దిగా విభూది, యాభైవేల రూపాయలు! గుండెపిండినట్లయ్యింది. కళ్లు చెమర్చాయి. ఇప్పటికీ లక్ష్మి పాక్కుంటూ వచ్చి నాకు కాఫీ ఇచ్చిన క్షణమే గుర్తుకొస్తోంది. నా కళ్లలో నీళ్లూ ఆ గుర్తుకు తోడుగా వస్తాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement