Sunshine Hospitals
-
జిల్లాలో పనిచేయని మిషన్లు 34.. మూలుగుతున్న అప్లికేషన్లు..
వరంగల్: వరంగల్ సన్‌షైన్ ఆస్పత్రిలోని లింగ నిర్ధారణ పరీక్షల మిషన్ పనిచేయక రెన్యూవల్‌కు దరఖాస్తు ఇచ్చారు. అలాగే, ఆ మిషన్‌ను క్రాష్ (పగులగొట్టడానికి) చేయడానికి అనుమతివ్వాలని వైద్యారోగ్యశాఖకు అర్జీపెట్టుకున్నారు. ► వరంగల్ బాలాజీ ఆస్పత్రిలో 2001 నుంచి స్కానింగ్ ఉంది. ప్రస్తుతం వారు వాడుతున్నది మూడో మిషన్. రన్నింగ్‌లో లేని రెండు మిషన్లను ధ్వంసం చేస్తామని దరఖాస్తు పెట్టుకోగా.. పెండింగ్‌లోనే ఉంది. ► వరంగల్‌లోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి లింగ నిర్ధారణ చేసే మిషన్ ఉంది. ఆస్పత్రిని హనుమకొండకు మార్చిన సమయంలో పాత ఆస్పత్రిని మూసివేశామని, మిషన్ వాడలేము.. క్రాష్ చేయాలని వేడుకున్నారు. ► వరంగల్, హనుమకొండ జిల్లాల విభజనలో భాగంగా వరంగల్ జిల్లాకు రెండు కోర్టు కేసులతో ఉన్న ఆస్పత్రులు వచ్చాయి. వీటిలోని స్కానింగ్ మిషన్లు ఇప్పుడు పనిచేయని స్థితిలో ఉన్నాయి. ఇలా వివిధ కారణాలతో లింగ నిర్ధారణ పరీక్షలు చేసే మిషన్లను పగులగొట్టేందుకు అనుమతివ్వాలని కొందరు దరఖాస్తు చేసుకుంటే.. ఇంకొందరు తమ వద్దకు ఏ కేసులు వస్తలేవని ప్రతి నెలా జిల్లా వైద్యారోగ్యశాఖకు పంపే ఎఫ్ ఆడిట్ ఫాంలో విన్నవిస్తున్నారు. అయితే ఏడాదిన్నర నుంచి వినతులు ఇస్తున్నా చర్యలు తీసుకోవడంలో అడుగు ముందుకు వేయడంలేదు. పీసీ అండ్ పీఎన్డీటీ యాక్ట్ కింద రన్నింగ్‌లో లేని మిషన్లపై చర్య తీసుకునే విషయమై ఎలాంటి మార్గదర్శకాలు లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. స్టేట్ రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు ఆ మిషన్ల ఫంక్షనింగ్ ఉండడంతో జిల్లాస్థాయిలో అధికారులు ఏమి చేయలేకపోతున్నారు. రాష్ట్ర వైద్య ఉన్నతాధికారులకు విన్నవించినా చట్టంలో స్పష్టత లేక ఈ మిషన్లను ఏం చేయాలన్న దానిపై సందిగ్ధం నెలకొంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వస్థాయిలో నిర్ణయం తీసుకోవాలని వైద్యవర్గాలు కోరుతున్నాయి. జిల్లాలో పనిచేయని మిషన్లు 34.. పీసీ అండ్ పీఎన్డీటీ యాక్ట్ కింద 2001 నుంచి అల్ట్రా సౌండ్ స్కానింగ్ క్లినిక్‌లు, ఇమేజింగ్ సెంటర్లు ఇప్పటివరకు 102 రిజిస్టర్ అయి ఉండగా.. 68 మాత్రమే నడుస్తున్నాయి. మిగిలినవి 34 రన్నింగ్‌లో లేవు. అయితే వీటిలో జిల్లా విభజనలో వరంగల్ అర్బన్ నుంచి కొత్త వరంగల్ జిల్లాలో చేరిన వరంగల్, ఖిలావరంగల్ మండలాలకు చెందినవే 22 ఉన్నాయి. ప్రతి నెలా ఐదో తేదీన జిల్లా వైద్యారోగ్య విభాగానికి వచ్చే ఎఫ్ ఆడిట్ ఫాంలో పనిచేయని మిషన్ల వివరాలు వస్తున్నాయి. వీటిపై వైద్యవిభాగాధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి అవి వాస్తవంగా పనిచేయడం లేదా.. ఏమైనా లింగ నిర్ధారణ పరీక్షలు జరిగే అవకాశం ఉందా అన్న దిశగా దృష్టి సారించాలని ఇటీవల కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆరోగ్యశ్రీ కోసమే అక్కడ మిషన్లు.. ఆప్తమాలజీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్ వైద్యం అందించే ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తించాలంటే పీసీ పీఎన్డీటీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కావడంతో ఆ మిషన్లు తీసుకుంటున్నారు. ఇలా దాదాపు 10లోపు మిషన్లు ఉన్న ఆస్పత్రుల యాజమాన్యాలు అవి రన్నింగ్‌లో లేవని చెబుతున్నాయి. ఇలాంటివి దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే వాటిని క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాల్సిన అవసరం ఉందన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్రస్థాయిలో పాలసీ తేవాలి.. నిర్వహణలో లేని స్కానింగ్ మిషన్ల సెంటర్ల లైసెన్స్ రద్దు చేయాలి. ఆ మిషన్‌ను సీజ్ చేసి పరిశ్రమకు లేదా.. ఇతరులు ఎవరైనా కొనుగోలు చేసుకుంటే ఇచ్చేలా డీఎంహెచ్ఓ ద్వారా జరిగేలా చూడాలి. దీనిపై రాష్ట్రస్థాయిలో తెలంగాణ వైద్యారోగ్యశాఖ పాలసీ తీసుకురావాలి. తిరిగి లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. స్కానింగ్ మిషన్లు తయారు చేసే పరిశ్రమలను కూడా పీసీ పీఎన్డీటీ చట్టంలోకి తేవాలి. – మండల పరశురాములు, అభ్యుదయ సేవా సమితి అధ్యక్షుడు -
కరోనాపై వాస్తవాలేమిటి ?
-
రూ. 800.. 60 ప్రాణాలు!
సాక్షి, హైదరాబాద్/జగిత్యాల జోన్: ప్రకృతి ప్రకోపించలేదు.. బాంబులు పేలలేదు.. తూటాలు విరు చుకుపడలేదు.. కేవలం అధికారుల నిర్లక్ష్యమే 60 నిండు ప్రాణాలను బలిగొంది. రూ.800లకు ఆర్టీసీ అధికారులు కక్కుర్తి పడటం వల్లే ఇంతటి ఘోర ప్రమాదం జరిగింది. ఉద్యోగులపై అధికారుల వేధింపులే కొండగట్టు బస్సు ప్రమాదానికి కారణంగా నిలిచాయి. మృతుల సంఖ్య పెరిగేందుకు స్థానిక అధికారుల తీరు కారణమైంది. వారి వేధింపులు, టార్గెట్ల కారణంగా ఎంతో సీనియారిటీ ఉన్న ఉద్యోగులు కూడా రక్షణ చర్యలు పక్కనబెట్టి, ఓవర్‌లోడ్ ఎక్కించుకోవాల్సిన దుస్థితి. ప్రభుత్వం ఆర్టీసీ డిపో మేనేజర్‌ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంది. మెమోలు, వేధింపులు :గ్రామీణ ప్రాంతాల్లో నడిచే పల్లె వెలుగు బస్సుల్లో పెద్దగా ఆక్యుపెన్సీ రేషియో ఉండటం లేదని మొదటి నుంచి ఆర్టీసీ మొత్తుకుంటోంది. దీన్ని అధిగమించేందుకు ఆయా డ్రైవర్లు, కండక్టర్లకు ఎక్కువ మందిని ఎక్కించుకోవాలని టార్గెట్లు పెడుతున్నారు. బస్సు నిండా మంది ఉన్నారని స్టాపులో బస్సు ఆపలేదని తెలిస్తే తెల్లారి ఆ కండక్టర్, డ్రైవర్లకు చుక్కలు చూపిస్తారు. దీంతో అధికారులు చెప్పినట్లు వారు చేయాల్సి వస్తోంది. అదనపు ఆదాయం రూ. 828! కొండగట్టు నుంచి ఘాట్ రోడ్డు ద్వారా జగిత్యాల ప్రధాన రహదారి 3 కి.మీ. దూరం. ఇందుకు బస్సు ఎక్కితే కేవలం రూ.6 చార్జీ. అదే జీపు ఎక్కితే రూ.20కిపైగా వసూలు చేస్తారు. కండక్టర్ కూడా బస్సు సామర్థ్యం కన్నా అదనంగా 10 మందిని ఎక్కించుకున్నా పెద్దగా ప్రమాదం ఉండేది కాదు. దీనికి అదనంగా మరో 36 మందిని ఎక్కించుకోవడం వల్ల బస్సుపై ఓవర్‌లోడ్ పడింది. ఇంతచేస్తే ఈ 36 మంది ద్వారా టికెట్‌కు రూ.23 చొప్పున ఆర్టీసీకి వచ్చే అదనపు ఆదాయం కేవలం రూ.828. మహిళల మరణానికి కారణం ఇదే..! ప్రమాదానికి గురైన బస్సు వాస్తవ సామర్థ్యం 55 సీట్లు. ఈ బస్సు కొండగట్టుకు వచ్చే సరికి అప్పటికే బస్సు నిండా జనం ఉన్నారు. మంగళవారం కావడంతో అక్కడ భారీగా ఉన్న భక్తులంతా బస్సు ఎక్కా రు. మహిళా సీట్లు కాస్త విశాలంగా ఉండటంతో ఐదుగురికిపైగా సీట్లల్లో సర్దుకున్నారు. ఘటనాస్థలి వద్ద ఉన్న స్పీడు బ్రేకర్ల వద్దే బస్సు అదుపు తప్పింది. కుడివైపు ఉన్న ప్రయాణికులుఅంతా డ్రైవరుపై పడిపోవడంతో అతను బస్సును అదుపు చేయలేకపోయాడని స్థానికులు తెలిపారు. దీంతో నేరుగా వెళ్లి పక్కనే ఉన్న కందకంలో పడిపోయింది. బస్సు కుడివైపు భాగం నేలను బలంగా ఢీకొంది. ఈ తీవ్రతకు సీట్ల న్నీ విరిగిపోయాయి. ఆ ధాటికి శరీరాలు నలిగిపోయాయి. ‘ఘాట్’మీదుగా 44 ట్రిప్పులు.. కొండగట్టు ఘాట్ రోడ్డు మీదుగా ఆర్టీసీ వేములవాడ డిపోకు చెందిన 11 బస్సులు రోజూ 44 ట్రిప్పులు కొన్నేళ్లుగా నడుస్తున్నాయి. జగిత్యాల డిపో బస్సును కొడిమ్యాల మండలంలోని రాంసాగర్, హిమ్మత్‌రావుపేట, శనివారంపేట, డబ్బు తిమ్మయ్యపల్లె గ్రామాల కోసం కొంత కాలంగా దొంగలమర్రి మీదుగా నడిపిస్తున్నారు. తిరిగి అదే మార్గంలో వెళ్తుండటంతో ఆర్టీసీకి అనుకున్నంత ఆదాయం రావట్లేదు. దీంతో కొండగట్టు పుణ్యక్షేత్రం మీదుగా వెళ్తే భక్తుల రాకపోకలతో ఆదాయం పెరుగుతుందని జూలై 12 నుంచి దొంగలమర్రి నుంచి రావడం, కొండగట్టు నుంచి కిందకు దిగేలా రూటు మార్చారు. దీంతో కి.మీ.కు ఆదాయం రూ.12 నుంచి రూ.15కు పెరిగింది. దీంతో కొండగట్టు ఘాట్‌రోడ్డు మీద నుంచే బస్సు నడిపిస్తున్నారు. ‘సన్‌షైన్’లో నలుగురికి చికిత్స హైదరాబాద్: కొండగట్టు ప్రమాద ఘటనలో గాయపడిన నలుగురు బాధితులు సికింద్రాబాద్ సన్‌షైన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నలుగురిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. జగిత్యాలకు చెందిన రాజవ్వ (52), సత్తవ్వ (39), శనివారంపేట్కు చెందిన రాజయ్య (50), తిమ్మాయిపల్లికి చెందిన విజయ (45)లను బుధవారం రాత్రి జగిత్యాల నుంచి సన్‌షైన్ ఆస్పత్రికి తీసుకుని వచ్చారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉందని మరో 48 గంటలు గడిస్తే కానీ ఏది చెప్పలేమని డాక్టర్లు వెల్లడించారు. వీరి చికిత్సకు అయ్యే ఖర్చును ఆర్టీసీ భరిస్తుందని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ వినోద్ కుమార్ ఆస్పత్రికి లేఖ రాసి ఇచ్చారు. దీంతో వీరికి ఆస్పత్రి వైద్యులు చికిత్స మొదలుపెట్టారు. -
ఆరోగ్యాన్ని నీళ్లలో ముంచేయకండి..!
ఈ భూమ్మీద జీవం ఆవిర్భవించడానికి కారణం నీళ్లు. ఈ నేల మీద జీవం మనుగడ సాగించడానికి కారణం నీళ్లు. ఇలాంటి నీళ్ల గురించి ప్రజల్లో ఎన్నో అపోహలున్నాయి. అన్నానికి ముందు అస్సలు నీళ్లు తాగవద్దని అంటారొకరు. అన్నం తిన్నాక కూడా ఎంతో సేపటివరకు నీళ్లు ముట్టుకోవద్దని అంటారు ఇంకొకరు. ఆరోగ్యం చక్కగా ఉండాలంటే సాధ్యమైనంత ఎక్కువ నీళ్లు తాగాలంటారు వేరొకరు. అసలు ఆరోగ్యం కోసం నీళ్లను ఎలా ఉపయోగించుకోవాలి, రోజుకు ఎన్ని నీళ్లు తాగాలి, ఎందుకలా తాగాలి అనే అనేక విషయాలను తెలుసుకుందాం. దాంతోపాటు మన ఆరోగ్యాన్ని నీళ్లలో ముంచేసి దాన్ని ఊపిరాడకుండా చేసే బదులు, ఆ నీటినే జీవజలంగా మార్చుకోవడం ఎలాగో తెసుకోవడం కోసమే ఈ ప్రత్యేక కథనం. ప్రతిరోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లకు తగ్గకుండా తాగితేనే ఆరోగ్యం అంటూ రాస్తూ ఉంటాయి కొన్ని పత్రికలు. నీళ్లు తాగండి... బరువు తగ్గండి అంటూ చెబుతాయి మరికొన్ని సంచికలు. అసలు ఒక వ్యక్తి తన మంచి ఆరోగ్యం కోసం ఎన్ని నీళ్లు తాగాలి? రోజువారీ జీవక్రియలకు నీటి అవసరం ఎంత అన్న విషయాలు చూద్దాం. ప్రతిరోజూ ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాల్సిందేనా? ముందు మనం ఎన్ని నీళ్లు తాగాలన్నది పక్కన పెట్టి... అసలు మన శరీరం ఎన్ని నీళ్లను కోల్పోతుందో చూద్దాం. ప్రతిరోజూ మన శరీరం ఒకటి నుంచి ఒకటిన్నర లీటర్ల నీటిని విసర్జిస్తుంటుంది. మూత్రం ద్వారా, చెమట ద్వారా మన శరీరం నుంచి నీళ్లు బయటికి పోతాయని మన అభిప్రాయం. కానీ మలం ద్వారా, మనం వదిలే ఊపిరి ద్వారా కూడా నీళ్లు బయటకు వెళ్లిపోతుంటాయి. ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఎనిమిది గ్లాసులనో, రెండు లీటర్లనో... ఇలా నిర్ణీతంగా ఇంత ప్రమాణంలో నీరు తాగాలనే నియమం అవసరం లేదు. గుర్తుంచుకోవాల్సిందల్లా మన శరీరానికి ఎంత నీరు అవసరమో, అంత నీరు తాగాలనే. అంటే దాహమైనప్పుడల్లా అది తీరేలా నీళ్లు తాగాలి. మనకు అవసరమైన నీళ్లు... కేవలం నీళ్లతోనేనా? కాదు... మనం తినే అన్నంలోనూ నీళ్లుంటాయి. మనం వండే కూరగాయల్లో నీరుంటుంది. ఇక మనం తీనే పండ్లు, పాలు, పండ్లరసాలు... వీటన్నింటిలోనూ ఉండేది నీళ్లే. ఇలా ఆహారంతో పాటూ మనం మరెన్నో నీళ్లను అదనంగా తీసుకుంటుంటాం. కేవలం తాగే నీళ్లేగాక... ఇలా అన్నింటినుంచి మన శరీరం తీసుకునే నీళ్లనన్నింటినీ కలుపుకుంటూ వచ్చే పరిమాణాన్ని ‘రిఫరెన్స్ డెయిలీ ఇన్‌టేక్’ (ఆర్డీఐ) ఆఫ్ వాటర్ అని వ్యవహరిస్తాం. మరి మనం ఎన్ని నీళ్లు తాగాలి? తాగే నీళ్లేగాక అన్ని రకాల ఆహారాల పదార్థాల నుంచి 18 ఏళ్లు దాటిన ఒక పురుషుడు తీసుకునే రిఫరెన్స్ డెయిలీ ఇన్‌టేక్ (ఆర్డీఐ) దాదాపు 3.7 లీ/పర్ డే. ఇక 18 ఏళ్లు దాటిన మహిళ ఆర్డీఐ 2.7 లీ/పర్ డే. అయితే ఈ సంఖ్యలను సగటుగా భావించవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి వ్యాయామం చేసేవాడైతే అతడి ఆర్డీఐ మారుతుంది. అలాగే ఒక వ్యక్తి ఒక చలివాతావరణం నుంచి వేడిమి ఎక్కువగా ఉండే వాతావరణానికి వెళ్లగానే అతడి ఆర్డీఐ మారిపోతుంది. అలాంటప్పుడు ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవడానికి ఎంత నీరు తాగాలన్నదానికి ‘ఫ్లూయిడ్ బ్యాలెన్స్’ అనే అంశమే కీలకం. అంటే మనం విసర్జించే నీరు, మనం తీసుకునే నీటి మధ్య సమతౌల్యం ఉండేలా చూసుకోవడం అన్నమాట. ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అన్నదే ఒక ఆరోగ్య సూచిక... ఒక వ్యక్తి బరువు 70 కిలోలు అనుకుందాం. అతడి జీవక్రియల అవసరాలకు ప్రతిరోజూ 1.750 లీటర్ల నీళ్లు కావాలనుకుందాం. ఈ నీళ్లలో 650 ఎంఎల్. నేరుగా మంచినీళ్లు తాగడం వల్ల అతడికి దొరుకుతాయి. అతడు తినే ఆహారం ద్వారా మరో 750 ఎం.ఎల్. లభ్యమవుతాయి. ఇక మిగతా 350 ఎం.ఎల్. మన శరీరంలోని జీవక్రియల్లో జరిగే ఆక్సిడేషన్ ప్రక్రియ ద్వారా లభిస్తాయి. అంటే... అతడి జీవక్రియలకు 1.750 (ఒకటీ ముప్పావు లీటర్) నీళ్లు అవసరమైనా... అతడు తాగేది మాత్రం 650 ఎం.ఎల్. మాత్రమే. ఇంతకంటే ఎక్కువ నీళ్లు తాగారే అనుకుందాం. అప్పుడు ఆరోగ్యవంతుడిలో ఆ నీళ్లను మూత్రపిండాలు బయటకు పంపిస్తాయి. ఒకవేళ అతడికి ఏ గుండెజబ్బులో, హైబీపీనో, కాలేయ వ్యాధులో, మరే మూత్రపిండాల వ్యాధో ఉంటే? అప్పుడు ఆ అదనపు నీటిని మూత్రపిండాలు బయటకు పంపలేవు. నీళ్లుతో బరువు తగ్గుతారా / చర్మం మెరుస్తుందా? ఒక వ్యక్తి ఫ్లూయిడ్ బ్యాలెన్స్‌కు తగినట్లుగా నీళ్లు తాగితేనే ఆ వ్యక్తి సరైన బరువును కలిగి ఉంటాడు. మనం తీసుకునే ఆహారాన్ని శక్తిగా మారే క్రమంలో ప్రతి 100 క్యాలరీలను ఖర్చు చేయడానికి కనీసం అరకప్పు నీళ్లు కావాలి. దీనికి తగినట్లుగా నీళ్లు తీసుకుంటూ... ఆహారం కంటే ఒకిన్ని నీళ్లు ఎక్కువగా తీసుకుంటే ఆ మొత్తం పొట్టలోకి చేరి ఆహారం తీసుకోడానికి అవకాశం లేకుండా చూసి బరువు తగ్గడానికి కొంతవరకు ఉపకరిస్తుంది. అలాగే చర్మం బిగుతుగా ఉండేందుకు తగినంతగా నీరు ఉన్నంత వరకే అది బాగుటుంది. అంతేగానీ... ఎక్కువ నీళ్లు తీసుకోవడం వల్ల చర్మం మరింత బిగువుగా ఉంటుందనేదీ, ఆ బిగువును కోల్పోకుండా ఉండటానికి నీళ్లు ఉపకరిస్తాయనే అంశం కేవలం అపోహలు మాత్రమే. ఆరోగ్యసమస్యలుంటే డాక్టర్ సలహా మేరకే నీళ్లు తాగాల్సిందే... ఒక వ్యక్తికి గుండెజబ్బులు, రక్తపోటు, మూత్రపిండాల వ్యాధి ఉంటే అతడు తీసుకునే అదనపు నీటిని మూత్రపిండాలు బయటకు పంపలేవు. దాంతో ఆ నీళ్లు అతడి కాళ్లలో చేరి, కాళ్లవాపు వస్తుంది. కొందరిలో ముఖంలోకి చేరి ముఖం వాచినట్లుగా కనిపిస్తుంది. అందుకే ఆరోగ్యం కోసం ఎన్ని ఎక్కువ నీళ్లు తాగితే అంత మంచిది అన్న సూత్రం అన్ని వేళలా పనిచేయదు. డాక్టర్ టి.జి. కిరణ్‌బాబు సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ సన్‌షైన్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
ఆరోగ్యదాతలు... అభయప్రదాతలు
నేడు డాక్టర్స్ డే ఆ చేత స్టెతస్కోప్ గుండెకు ఆనగానే రోగికి అభయం... ఆ చేత సూదిమందో, చేదుమందో పడగానే రోగికి నయం... ఆ చేత కట్టుకట్టించగానే ఎంతపెద్ద గాయమైనా మాయం... అందుకే డాక్టర్ అంటే సాక్షాత్తూ భగవంతుడి స్వరూపం... డబ్బులిచ్చి సేవలు తీసుకునేవారు మరింకెక్కడైనా డిమాండ్ చేస్తారేమోగానీ... డాక్టర్ దగ్గర వినయంగా సేవను స్వీకరిస్తారు. అదీ వైద్యవృత్తి గొప్పదనం. అదే వైద్యులకు గర్వకారణం. అయితే... డాక్టర్లకూ వృత్తిగతమైన విజయాలూ పరాజయాలుంటాయి. వృత్తిపరమైన విజయసంతృప్తులుంటాయి, భావోద్వేగాలుంటాయి. వేదనలూ రోదనలూ ఆవేదనలూ వాళ్ల గుండెల్నీ పిండేస్తాయి. నేడు డాక్టర్స్ డే సందర్భంగా తమ తమ వైద్య వృత్తిజీవితాలలోని అనేక మరపురాని, మరవలేని సంఘటనలను ప్రస్తావిస్తున్నారు కొందరు ప్రముఖ డాక్టర్లు. తమలోకి అంతర్ముఖులై కొందరూ, తమ స్ఫూర్తిని పంచి సమాజానికి మంచి చేద్దామని మరికొందరూ తమ అంతరంగాలను అరమరికలు లేకుండా ఆవిష్కరించారిక్కడ. రండి... వాళ్ల విజయ వీచికలనూ, ఉద్విగ్న.. ఉద్వేగాలను చదవండి. గుండె తడిమే భావాలతో మమేకమై వాళ్ల భావోద్వేగాలను మనమూ పంచుకుందాం పదండి. పారాడిన పాదాలకు నివాళి! డాక్టర్ గురవారెడ్డి, మేనేజింగ్ డెరైక్టర్ అండ్ చీఫ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, సన్‌షైన్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ ఆరోజు ఇంకా గుర్తే నాకు. ఆదివారం. నా మేనత్త భోజనానికి పిలిస్తే వెళ్లాను. నాన్న చెల్లెలు - వనస్థలిపురంలో ఉంటుంది. మనవడు ఆస్ట్రేలియా నుంచి వచ్చాడని - బంధువర్గానికంతటికీ విందు ఏర్పాటు చేసింది. నాన్న తరఫు బంధువులు చాలామంది హైదరాబాద్‌లో ఉన్నారు. అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనానికి ఉపక్రమించాం. నా మేనత్త స్నేహితురాలు (ఆమెను సావిత్రి అందాం) కూడా ఆ రోజు ఆ బృందంలో ఉంది. సావిత్రిగారికి రెండు నెలల కిందే రెండు మోకాళ్ల ఆపరేషన్ చేశాను. బాగా కోలుకుంది. ఆమె తన జీవితాన్ని మునపటిలాగే పూర్తిగా ఆస్వాదించడం మొదలుపెట్టింది. సావిత్రి నా దగ్గరికి వచ్చి ఒక కోరిక కోరింది. ‘‘డాక్టర్‌గారూ... నా కాళ్లకు ఆపరేషన్ చేసి పునర్జన్మను ఇచ్చారు. అలాగే నా స్నేహితురాలు లక్ష్మికి మీరే ఆపరేషన్ చేయాలి. ఆమె గత పదేళ్ల నుంచి నడవడం లేదు. ఆమె ఈ దగ్గర్లోనే ఉంటుంది. పది నిమిషాలు రాగలరా?’’ అని అడిగింది. అందరితో కబుర్లు చెప్పుకుంటూ ఆనందిస్తున్న నాకు - ఈ అభ్యర్థన కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. అయినా మర్యాదగా ఉండదని ఆమెతో పాటు లక్ష్మిని చూడటానికి వెళ్లాను. ఆ ఇల్లు ఓ చిన్న గల్లీలో ఉంది. కారు ఆపి నడుచుకుంటూ వెళ్లాం. లక్ష్మి యాభై ఏళ్ల ఇల్లాలు. ఆమెకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చి చిన్న వయసులోనే మోకాళ్లు అరిగిపోయాయి. గత పదేళ్ల నుంచి మోకాళ్లు వంగిపోయి నడవలేని స్థితిలో ఉంది. సాధారణంగా ఇలాంటివారు వీల్‌చైర్‌కే పరిమితమైపోతారు. సొంతంగా ఏ పనీ చేసుకోలేక - కుటుంబం మీద ఆధారపడుతూ ఉండిపోతారు. మోకాళ్లు ఒంగిపోయిన ఆమె... కుంగిపోయి ఉంటుందనుకున్నా. కానీ... ఓ పసిపాప పారాడినట్లు పాకుతూ తన పనులన్నీ చేసుకుటోంది. ఇద్దరు కొడుకులు, కోడళ్లున్నా వాళ్ల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే... జీరాడే కాళ్లతో పారాడుతూ ఆమె జీవితంతో పోరాడుతోంది. ఇంట్లో తనకో గదిని అమర్చుకుంది. అందులో అన్నీ సమకూర్చుకుంది. ఆ వస్తువులన్నీ అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసుకుంది. అడుగు ఎత్తులోనే తనకు అందేలా చూసుకుంది. టీవీ, గ్యాస్ పొయ్యి, మంచినీళ్ల బిందె, మంచం, అద్దం... ఇలా అన్నీ అందేలా... అందుబాటులో. అలా పాకుతూనే అవలీలగా నాకు కాఫీ చేసిచ్చింది. బాత్రూమ్లోకి వెళ్లి అలవోకగా ముఖం కడుక్కుని వచ్చింది. కాకపోతే అంతులేని ఆత్మస్థైర్యం అల్లంత ఎత్తున! అంతటి ఎత్తు తాలూకు క్రీనీడ... నొప్పి రూపాన కాస్తంత ఆ ముఖాన!! అంతే. అరగంట పట్టింది ఆపరేషన్‌కు ఆమెను ఒప్పించడానికి. ‘‘నేను నా పనులన్నీ చేసుకుంటూనే ఉన్నాను కదా. నాకు ఆపరేషన్ ఎందుకు?’’ అన్నది ఆమె ప్రశ్న. ‘‘మీ నొప్పి తగ్గిపోతుంది. కాళ్లు నిటారుగా వస్తాయి. మళ్లీ మామూలుగా నడవచ్చు కదా’’ అని నేను. ఆ మర్నాడు ఆమె ఆసుపత్రిలో చేరడం, ఆపరేషన్‌కు ముందుగా నిర్వహించే పరీక్షలన్నీ చేసేయడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. మోకాళ్లు పదేళ్ల నుంచి ఒంగిపోయి ఉన్నాయి కాబట్టి వాటిని తిన్నగా చేయడానికి ట్రాక్షన్ అమర్చి ఓ వారం తర్వాత ఆపరేషన్‌కు రెడీ చేశాం. రోజూ రౌండ్స్‌కు వెళ్లినప్పుడు లక్ష్మి దగ్గరే ఓ పది నిమిషాలు గడిపేవాణ్ణి. ‘‘డాక్టర్‌గారూ... నేను మళ్లీ నడవగలనా?’’ అని రోజూ అడిగేది. నడకవస్తే పుట్టపర్తి సాయిబాబాని చూడాలను దనేది. ఆపరేషన్ రోజు రానే వచ్చింది. సాయిబాబాను ఉపాసించే గురువారం రోజే ఆపరేషన్ చేయాలని కోరింది. నాలుగు రోజుల తర్వాత లక్ష్మి నడక మొదలుపెట్టినప్పుడు ఆమె కళ్లలో ఆనందాన్ని ఊహించుకుంటూ ఆపరేషన్ చేస్తున్నాను. అంతలో హఠాత్తుగా అనస్థటిస్ట్ ‘ఓ మైగాడ్’ అనడం వినపడింది. తలెత్తి చూస్తే అనస్థటిస్ట్తో పాటు ఆయన బృందమంతా పెద్దప్రాణాన్ని కాపాడే పనిలో నిమగ్నమై కనిపించారు. లక్ష్మి పదేళ్లకు పైగా నడవకుండా ఉండిపోవడంతో ఆమె కాలిలోని రక్తనాళాల్లో ఒక చోట రక్తం గడ్డకట్టుకుపోయింది. ఆ గడ్డ కదిలిపోయి ఊపిరితిత్తుల్లోకి చేరిపోయింది. దాంతో పల్మనరీ ఎంబాలిజమ్ అనే కండిషన్ ఏర్పడి కార్డియాక్ అరెస్ట్‌లోకి వెళ్లి ఆమె గుండె ఆగిపోయింది. అందుకే ఆమెను రక్షించడానికి మిగతా బృందమంతా సీపీఆర్ అనే ప్రక్రియ ద్వారా ఆ హృదయాన్ని మళ్లీ స్పందింపజేయడంలో నిమగ్నమై ఉన్నారు. నేను ఆపరేషన్ ఆపేసి మ్రాన్పడి చూస్తుండిపోయాను. అరగంట పాటు విఫలయత్నం. విషాదం... లక్ష్మి ఆపరేషన్ టేబుల్ మీద చనిపోయింది. ‘‘మా అమ్మ కుంటుతూనో, పాకుతోనో, ప్రయాసతోనో మా ముందు ఉండేది డాక్టర్. అమ్మను లేకుండా చేశారు కదా’’ అంటూ ఆ ఇద్దరు కొడుకులు ఆవేదనగా అన్నప్పుడు ఎక్కడికైనా పారిపోవాలని అనిపించింది. నేను కోలుకోవడానికి నెలరోజులు పట్టింది. దేవుడు ఇలా ఎందుకు చేస్తాడో? లక్ష్మి తనంతట తాను నా దగ్గరికి రాలేదే? నా మేనత్త స్నేహితురాలు సావిత్రికి నేను ఆపరేషన్ చేయడం వల్ల అది విజయవంతమై... ఆమె నన్ను లక్ష్మి దగ్గరకు తీసుకెళ్లింది. ఆమె నన్ను వేడుకోవడం ఎందుకు? అలా వేడుకోగానే నా వేడుకను వదిలిపెట్టి మరీ నేను లక్ష్మి ఇంటికి వెళ్లడం ఎందుకు? ఆమెను కన్విన్స్ చేసి మరీ ఆపరేషన్‌కు ఒప్పించడం ఎందుకు? ఇలా ఆమె నా చేతుల్లో పోవడానికేనా? అర్థం కాని ప్రశ్నలెన్నో?! వారం తర్వాత (గురువారం నాడు) లక్ష్మి ఉన్న వార్డ్ తాలూకు సిస్టర్-ఇన్ఛార్జ్ నాకో కవర్ ఇచ్చింది. లక్ష్మి ఆ కవర్‌ను సిస్టర్‌కు ఇచ్చి... వచ్చే గురువారం నాకు ఇమ్మని అందట. ఆ కవర్ విప్పి చూస్తే... సాయిబాబా బొమ్మ, కొద్దిగా విభూది, యాభైవేల రూపాయలు! గుండెపిండినట్లయ్యింది. కళ్లు చెమర్చాయి. ఇప్పటికీ లక్ష్మి పాక్కుంటూ వచ్చి నాకు కాఫీ ఇచ్చిన క్షణమే గుర్తుకొస్తోంది. నా కళ్లలో నీళ్లూ ఆ గుర్తుకు తోడుగా వస్తాయి.