Telangana News: జిల్లాలో పనిచేయని మిషన్లు 34.. మూలుగుతున్న అప్లికేషన్లు..
Sakshi News home page

జిల్లాలో పనిచేయని మిషన్లు 34.. మూలుగుతున్న అప్లికేషన్లు..

Published Mon, Aug 28 2023 1:08 AM | Last Updated on Mon, Aug 28 2023 1:57 PM

- - Sakshi

వరంగల్‌: వరంగల్‌ సన్‌షైన్‌ ఆస్పత్రిలోని లింగ నిర్ధారణ పరీక్షల మిషన్‌ పనిచేయక రెన్యూవల్‌కు దరఖాస్తు ఇచ్చారు. అలాగే, ఆ మిషన్‌ను క్రాష్‌ (పగులగొట్టడానికి) చేయడానికి అనుమతివ్వాలని వైద్యారోగ్యశాఖకు అర్జీపెట్టుకున్నారు.

► వరంగల్‌ బాలాజీ ఆస్పత్రిలో 2001 నుంచి స్కానింగ్‌ ఉంది. ప్రస్తుతం వారు వాడుతున్నది మూడో మిషన్‌. రన్నింగ్‌లో లేని రెండు మిషన్లను ధ్వంసం చేస్తామని దరఖాస్తు పెట్టుకోగా.. పెండింగ్‌లోనే ఉంది.
► వరంగల్‌లోని మరో ప్రైవేట్‌ ఆస్పత్రికి లింగ నిర్ధారణ చేసే మిషన్‌ ఉంది. ఆస్పత్రిని హనుమకొండకు మార్చిన సమయంలో పాత ఆస్పత్రిని మూసివేశామని, మిషన్‌ వాడలేము.. క్రాష్‌ చేయాలని వేడుకున్నారు.
► వరంగల్‌, హనుమకొండ జిల్లాల విభజనలో భాగంగా వరంగల్‌ జిల్లాకు రెండు కోర్టు కేసులతో ఉన్న ఆస్పత్రులు వచ్చాయి. వీటిలోని స్కానింగ్‌ మిషన్లు ఇప్పుడు పనిచేయని స్థితిలో ఉన్నాయి.

        ఇలా వివిధ కారణాలతో లింగ నిర్ధారణ పరీక్షలు చేసే మిషన్లను పగులగొట్టేందుకు అనుమతివ్వాలని కొందరు దరఖాస్తు చేసుకుంటే.. ఇంకొందరు తమ వద్దకు ఏ కేసులు వస్తలేవని ప్రతి నెలా జిల్లా వైద్యారోగ్యశాఖకు పంపే ఎఫ్‌ ఆడిట్‌ ఫాంలో విన్నవిస్తున్నారు. అయితే ఏడాదిన్నర నుంచి వినతులు ఇస్తున్నా చర్యలు తీసుకోవడంలో అడుగు ముందుకు వేయడంలేదు. పీసీ అండ్‌ పీఎన్‌డీటీ యాక్ట్‌ కింద రన్నింగ్‌లో లేని మిషన్లపై చర్య తీసుకునే విషయమై ఎలాంటి మార్గదర్శకాలు లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

స్టేట్‌ రిజిస్ట్రేషన్‌ వ్యాలిడిటీ ఉన్నంత వరకు ఆ మిషన్ల ఫంక్షనింగ్‌ ఉండడంతో జిల్లాస్థాయిలో అధికారులు ఏమి చేయలేకపోతున్నారు. రాష్ట్ర వైద్య ఉన్నతాధికారులకు విన్నవించినా చట్టంలో స్పష్టత లేక ఈ మిషన్లను ఏం చేయాలన్న దానిపై సందిగ్ధం నెలకొంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వస్థాయిలో నిర్ణయం తీసుకోవాలని వైద్యవర్గాలు కోరుతున్నాయి.

జిల్లాలో పనిచేయని మిషన్లు 34..
పీసీ అండ్‌ పీఎన్‌డీటీ యాక్ట్‌ కింద 2001 నుంచి అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ క్లినిక్‌లు, ఇమేజింగ్‌ సెంటర్లు ఇప్పటివరకు 102 రిజిస్టర్‌ అయి ఉండగా.. 68 మాత్రమే నడుస్తున్నాయి. మిగిలినవి 34 రన్నింగ్‌లో లేవు. అయితే వీటిలో జిల్లా విభజనలో వరంగల్‌ అర్బన్‌ నుంచి కొత్త వరంగల్‌ జిల్లాలో చేరిన వరంగల్‌, ఖిలావరంగల్‌ మండలాలకు చెందినవే 22 ఉన్నాయి.

ప్రతి నెలా ఐదో తేదీన జిల్లా వైద్యారోగ్య విభాగానికి వచ్చే ఎఫ్‌ ఆడిట్‌ ఫాంలో పనిచేయని మిషన్ల వివరాలు వస్తున్నాయి. వీటిపై వైద్యవిభాగాధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి అవి వాస్తవంగా పనిచేయడం లేదా.. ఏమైనా లింగ నిర్ధారణ పరీక్షలు జరిగే అవకాశం ఉందా అన్న దిశగా దృష్టి సారించాలని ఇటీవల కలెక్టర్‌ ప్రావీణ్య అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఆరోగ్యశ్రీ కోసమే అక్కడ మిషన్లు..
ఆప్తమాలజీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్‌ వైద్యం అందించే ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తించాలంటే పీసీ పీఎన్‌డీటీ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి కావడంతో ఆ మిషన్లు తీసుకుంటున్నారు. ఇలా దాదాపు 10లోపు మిషన్లు ఉన్న ఆస్పత్రుల యాజమాన్యాలు అవి రన్నింగ్‌లో లేవని చెబుతున్నాయి. ఇలాంటివి దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే వాటిని క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాల్సిన అవసరం ఉందన్న వాదన వినిపిస్తోంది.

రాష్ట్రస్థాయిలో పాలసీ తేవాలి..
నిర్వహణలో లేని స్కానింగ్‌ మిషన్ల సెంటర్ల లైసెన్స్‌ రద్దు చేయాలి. ఆ మిషన్‌ను సీజ్‌ చేసి పరిశ్రమకు లేదా.. ఇతరులు ఎవరైనా కొనుగోలు చేసుకుంటే ఇచ్చేలా డీఎంహెచ్‌ఓ ద్వారా జరిగేలా చూడాలి. దీనిపై రాష్ట్రస్థాయిలో తెలంగాణ వైద్యారోగ్యశాఖ పాలసీ తీసుకురావాలి. తిరిగి లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. స్కానింగ్‌ మిషన్లు తయారు చేసే పరిశ్రమలను కూడా పీసీ పీఎన్‌డీటీ చట్టంలోకి తేవాలి. – మండల పరశురాములు, అభ్యుదయ సేవా సమితి అధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement