ప్రమాద ప్రాంతం
సాక్షి, హైదరాబాద్/జగిత్యాల జోన్: ప్రకృతి ప్రకోపించలేదు.. బాంబులు పేలలేదు.. తూటాలు విరు చుకుపడలేదు.. కేవలం అధికారుల నిర్లక్ష్యమే 60 నిండు ప్రాణాలను బలిగొంది. రూ.800లకు ఆర్టీసీ అధికారులు కక్కుర్తి పడటం వల్లే ఇంతటి ఘోర ప్రమాదం జరిగింది. ఉద్యోగులపై అధికారుల వేధింపులే కొండగట్టు బస్సు ప్రమాదానికి కారణంగా నిలిచాయి. మృతుల సంఖ్య పెరిగేందుకు స్థానిక అధికారుల తీరు కారణమైంది. వారి వేధింపులు, టార్గెట్ల కారణంగా ఎంతో సీనియారిటీ ఉన్న ఉద్యోగులు కూడా రక్షణ చర్యలు పక్కనబెట్టి, ఓవర్‌లోడ్ ఎక్కించుకోవాల్సిన దుస్థితి. ప్రభుత్వం ఆర్టీసీ డిపో మేనేజర్‌ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంది.
మెమోలు, వేధింపులు :గ్రామీణ ప్రాంతాల్లో నడిచే పల్లె వెలుగు బస్సుల్లో పెద్దగా ఆక్యుపెన్సీ రేషియో ఉండటం లేదని మొదటి నుంచి ఆర్టీసీ మొత్తుకుంటోంది. దీన్ని అధిగమించేందుకు ఆయా డ్రైవర్లు, కండక్టర్లకు ఎక్కువ మందిని ఎక్కించుకోవాలని టార్గెట్లు పెడుతున్నారు. బస్సు నిండా మంది ఉన్నారని స్టాపులో బస్సు ఆపలేదని తెలిస్తే తెల్లారి ఆ కండక్టర్, డ్రైవర్లకు చుక్కలు చూపిస్తారు. దీంతో అధికారులు చెప్పినట్లు వారు చేయాల్సి వస్తోంది.
అదనపు ఆదాయం రూ. 828!
కొండగట్టు నుంచి ఘాట్ రోడ్డు ద్వారా జగిత్యాల ప్రధాన రహదారి 3 కి.మీ. దూరం. ఇందుకు బస్సు ఎక్కితే కేవలం రూ.6 చార్జీ. అదే జీపు ఎక్కితే రూ.20కిపైగా వసూలు చేస్తారు. కండక్టర్ కూడా బస్సు సామర్థ్యం కన్నా అదనంగా 10 మందిని ఎక్కించుకున్నా పెద్దగా ప్రమాదం ఉండేది కాదు. దీనికి అదనంగా మరో 36 మందిని ఎక్కించుకోవడం వల్ల బస్సుపై ఓవర్‌లోడ్ పడింది. ఇంతచేస్తే ఈ 36 మంది ద్వారా టికెట్‌కు రూ.23 చొప్పున ఆర్టీసీకి వచ్చే అదనపు ఆదాయం కేవలం రూ.828.
మహిళల మరణానికి కారణం ఇదే..!
ప్రమాదానికి గురైన బస్సు వాస్తవ సామర్థ్యం 55 సీట్లు. ఈ బస్సు కొండగట్టుకు వచ్చే సరికి అప్పటికే బస్సు నిండా జనం ఉన్నారు. మంగళవారం కావడంతో అక్కడ భారీగా ఉన్న భక్తులంతా బస్సు ఎక్కా రు. మహిళా సీట్లు కాస్త విశాలంగా ఉండటంతో ఐదుగురికిపైగా సీట్లల్లో సర్దుకున్నారు. ఘటనాస్థలి వద్ద ఉన్న స్పీడు బ్రేకర్ల వద్దే బస్సు అదుపు తప్పింది. కుడివైపు ఉన్న ప్రయాణికులుఅంతా డ్రైవరుపై పడిపోవడంతో అతను బస్సును అదుపు చేయలేకపోయాడని స్థానికులు తెలిపారు. దీంతో నేరుగా వెళ్లి పక్కనే ఉన్న కందకంలో పడిపోయింది. బస్సు కుడివైపు భాగం నేలను బలంగా ఢీకొంది. ఈ తీవ్రతకు సీట్ల న్నీ విరిగిపోయాయి. ఆ ధాటికి శరీరాలు నలిగిపోయాయి.
‘ఘాట్’మీదుగా 44 ట్రిప్పులు..
కొండగట్టు ఘాట్ రోడ్డు మీదుగా ఆర్టీసీ వేములవాడ డిపోకు చెందిన 11 బస్సులు రోజూ 44 ట్రిప్పులు కొన్నేళ్లుగా నడుస్తున్నాయి. జగిత్యాల డిపో బస్సును కొడిమ్యాల మండలంలోని రాంసాగర్, హిమ్మత్‌రావుపేట, శనివారంపేట, డబ్బు తిమ్మయ్యపల్లె గ్రామాల కోసం కొంత కాలంగా దొంగలమర్రి మీదుగా నడిపిస్తున్నారు. తిరిగి అదే మార్గంలో వెళ్తుండటంతో ఆర్టీసీకి అనుకున్నంత ఆదాయం రావట్లేదు. దీంతో కొండగట్టు పుణ్యక్షేత్రం మీదుగా వెళ్తే భక్తుల రాకపోకలతో ఆదాయం పెరుగుతుందని జూలై 12 నుంచి దొంగలమర్రి నుంచి రావడం, కొండగట్టు నుంచి కిందకు దిగేలా రూటు మార్చారు. దీంతో కి.మీ.కు ఆదాయం రూ.12 నుంచి రూ.15కు పెరిగింది. దీంతో కొండగట్టు ఘాట్‌రోడ్డు మీద నుంచే బస్సు నడిపిస్తున్నారు.
‘సన్‌షైన్’లో నలుగురికి చికిత్స
హైదరాబాద్: కొండగట్టు ప్రమాద ఘటనలో గాయపడిన నలుగురు బాధితులు సికింద్రాబాద్ సన్‌షైన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నలుగురిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. జగిత్యాలకు చెందిన రాజవ్వ (52), సత్తవ్వ (39), శనివారంపేట్‌కు చెందిన రాజయ్య (50), తిమ్మాయిపల్లికి చెందిన విజయ (45)లను బుధవారం రాత్రి జగిత్యాల నుంచి సన్‌షైన్ ఆస్పత్రికి తీసుకుని వచ్చారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉందని మరో 48 గంటలు గడిస్తే కానీ ఏది చెప్పలేమని డాక్టర్లు వెల్లడించారు. వీరి చికిత్సకు అయ్యే ఖర్చును ఆర్టీసీ భరిస్తుందని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ వినోద్ కుమార్ ఆస్పత్రికి లేఖ రాసి ఇచ్చారు. దీంతో వీరికి ఆస్పత్రి వైద్యులు చికిత్స మొదలుపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment