Kondagattu Bus Accident
-
మంత్రులకు చేదు అనుభవం
సాక్షి, జగిత్యాల : మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్లకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం హిమ్మత్ రావు పేటకు వెళుతున్న మంత్రుల వాహనాలను రాంసాగర్ చౌరస్తా వద్ద కొండగట్టు బస్సు ప్రమాద బాధితులు, రైతులు అడ్డుకున్నారు. కొండగట్టు బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు వెంటనే పూర్తిస్థాయి పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఆరు కుటుంబాలకు రావలసిన పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వెంటనే ఇవ్వాలని రోడ్డుపై బైటాయించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో మండలంలోని చెరువులు, కుంటలు నింపాలని ఆందోళన చేపట్టారు. 15 నిమిషాల పాటు మంత్రుల వాహనాలను ఎటూ కదలనీయకుండా అడ్డగించారు. అనంతరం పోలీసు బందోబస్తు మధ్య మంత్రులు హిమ్మత్ రావు పేటకు బయలు దేరారు. -
కొండగట్టు బస్సు ప్రమాదానికి ఏడాది
సాక్షి, చొప్పదండి: ఆ భయానక క్షణం ఇంకా వారిమదిలో మెదులుతోంది. ఆ బస్సు ప్రమాద గాయాలు నిత్యం సలుపుతున్నాయి. కన్నవారిని.. ఉన్నవారిని.. కట్టుకున్నవారిని.. ఆత్మీయులను.. అయినవారిని దూరం చేసుకుని ఏడాది అవుతున్నా.. ఆ కన్నీళ్లు నేటికీ ఆరడం లేదు. వారి కష్టాలు తీరడం లేదు. గుర్తుకొచ్చినప్పుడల్లా.. గుండెలవిసేలా రోదిస్తున్నారు. సరిగ్గా ఏడాది క్రితం.. అదో ఘోర కలి. దేశంలోనే అతిపెద్ద ప్రమాదం.. జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్‌రోడ్డుపై బస్సు ప్రమాదం జరిగి నేటికి ఏడాది.. 65మందిని పొట్టన పెట్టుకున్న ఆ ‘మృత్యుఘాట్’ సంఘటన దృశ్యాలు పలువురి మదిలో ఇప్పటికీ మెదులుతూనే ఉన్నాయి. వందమందికి పైగా ప్రయాణించిన బస్సులో 24మంది ఘటనాస్థలంలో.. 41మంది చికిత్స పొందుతూ ప్రాణాలు విడవగా.. మరెందరో మంచానికే పరిమితమయ్యారు. బస్సు ప్రమాద బాధితుల్లో ఏడుగురికి పరిహారమే అందలేదు. దీంతో కొడిమ్యాల మండలంలోని నాలుగు గ్రామాల వారిని పలుకరిస్తే.. కన్నీళ్లే మాటలుగా వస్తున్నాయి. కొండగట్టు బస్సుప్రమాదం జరిగి నేటికి ఏడాదవుతున్నప్పటికీ.. నాటి పెనువిషాదం నుంచి కొడిమ్యాల మండలంలోని నాలుగు గ్రామాలు ఇంకా తేరుకోలేదు. చనిపోయినవారి జ్ఞాపకాలతో కుటుంబ సభ్యులు దుఃఖిస్తుండగా, మానని గాయాలతో, చికిత్సకోసం అయ్యే ఆర్థికఇబ్బందులతో క్షతగాత్రులు నరకయాతనను అనుభవిస్తున్నారు. ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలు, గాయపడ్డ బాధితుల ఒక్కొక్కరిది ఒక్కో విషాదగాథ. నాటి సంఘటనపై ఎవరిని కదిలించినా కన్నీళ్లు వెల్లువెత్తుతున్నాయి. జీవితకాలపు విషాదాన్ని మిగిల్చిన బస్సుప్రమాదం నుంచి బాధిత కుటుంబాలు ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు కనిపించడంలేదు. ఆ ప్రమాదంలో 65 మంది మృతిచెందగా, 50 మంది గాయపడ్డారు. ప్రభుత్వం అందించిన పరిహారం బాధితకుటుంబాల వేదనను తీర్చలేదు. నాయకుల పరామర్శలు వారిలో ఆత్మస్థైర్యం నింపలేదు. విధివంచితులు తమ తలరాతలను తల్చుకుని తల్లడిల్లిపోతున్నారు. చీకటి రోజుకు ఏడాది.. కొండగట్టు: చీకటి రోజుకు నేటితో ఏడాది. దేశంలోనే అదో పెద్ద ప్రమాదం. ఆ ఘ టనలో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమైనాయి. గతేడాది సెప్టెంబర్ 11న ఆర్టీసీ బస్సు లోయలో పడి 65మంది చనిపోయారు. క్షతగాత్రులు ఇప్పటికీ మంచాల్లోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఘాట్‌రోడ్డు మూసివేత.. ఘటన జరిగిన వెంటనే అధికారులు ఘాట్‌రోడ్‌ను పూర్తిగా మూసివేశారు. ఎలాంటి వాహనాలకు అనుమతులు ఇవ్వలేదు. అనంతరం రోడ్డు సెఫ్టీ అథారిటీ ఐపీఎస్ డీజీపీ కష్ణప్రసాద్, ఢీల్లీకి చెందిన పలు రోడ్డు సెఫ్టీ సంస్థలు, ఇతర అధికారులు ఘటనా స్థలారనికి చేరుకుని ప్రమాదతీరును పరిశీలించారు. నూతన ఘాట్ ఇలా.. ఘటన తర్వాత అధికారులు దాదాపు కోటి రూపాయలతో ప్రమాద స్థలంతో పాటు మరికొన్ని చోట్ల రెయిలింగ్, క్రాష్ బేరియర్స్, బూమ్ బేరియర్స్, కల్వర్ట్స్, రక్షణ గోడలు, దొంగలమర్రి నుంచి నాచుపెల్లి జేఎన్టీయూ మీదుగా సూచికబోర్డులు ఏర్పాటు చేశారు. పాత ఘాట్ రోడ్డు 1.5కి.మీ ఉండగా రోడ్డు సెఫ్టీ, ఆర్అండ్బీ అధికారులు పర్యవేక్షించిన మార్పు చేసి 300మీటర్లు అదనంగా పెంచారు. దొంగలమర్రి నుంచి నాచుపెల్లి, జేఎన్టీయూ, అక్కడనుంచి కొండమీద ఉన్న వై జంక్షన్ సమీపంలోని హరిత హోటల్, ఆలయం ఎదురుగా బీఎస్ఎన్ఎల్ టవర్ దిగువ వరకు, అక్కడి నుంచి ప్రమాదం జరిగిన స్థలం వరకు కొత్త రోడ్డుమ్యాప్ 9.6 కిలో మీటర్లు సిద్ధం చేశారు. రూ.111 కోట్లతో నాలుగు లైన్ల రహదారిని నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు. 10కి.మీ. అదనపు రవాణా.. ఘాట్‌రోడ్డు బంద్ కావడంతో దిగువ కొండగట్టు నుంచి దొంగలమర్రి మీదుగా గుట్టమీదకు చేరుకునేందుకు దాదాపు 10కి.మీ. ప్రయాణం పెరిగింది. దీంతో భక్తులకు కావాలసిన వాహనాలు ఆర్టీసీ వారు ఏర్పాటు చేశారు. చిన్నపాటి అవస్థలు పడుకుంటూ భక్తులు కొండకు చేరుకొని దర్శనం చేసుకొని వెళ్తున్నారు. అంతుచిక్కని వైనం.. ఘాట్‌రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందో ఇప్పటికీ అధికారులు అధికారికంగా తెలపడంలేదు. డ్రైవర్ నిర్లక్ష్యమా? బ్రేకులు ఫెయిల్? అధిక లోడ్? బస్సు ఫిట్నెస్ లేకపోవడం?ఇలా అనేక సందేహాలు ఉన్నాయి. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు అధికారులు కొండ మీద నుంచి మరో బస్సును నడిపి పరీశీలించారు. స్థానిక అధికారులు, ఢిల్లీ నిపుణులు కొండకు వచ్చి అనేక విధాలుగా ఆధారాలు సేకరించుకొని వెళ్లారు తప్ప నేటికి ప్రమాదం ఎలా జరిగిందో స్పష్టం చేయలేకపోయారు. బస్సు నేటికి మల్యాల పోలీస్‌స్టేషన్ వద్దే ఉంది. బతికున్నందుకు బాధపడుతున్నా.. శనివారంపేటకు చెందిన గోలి లక్ష్మికి అనారోగ్యంగా ఉండడంతో ఆసుపత్రికి వెళ్లేందుకు తోడుకోసం కోనాపూర్‌లో ఉండేకూతురు ఎల్లమ్మను రమ్మంది. బస్సుప్రమాదంలో కూతురు చనిపోయింది. లక్ష్మి రెండుకాల్లు, రెండుచేతులు విరిగాయి. నుజ్జునుజ్జయిన ఎడమకాలును వైద్యులు మోకాలు పైభాగం వరకు తొలగించారు. మిగతా కాలు, రెండు చేతులకు రాడ్లువేశారు. లక్ష్మి తానున్నచోటునుంచి కదలలేదు. కొట్టివేసిన కాలుకు ఇన్ఫెక్షన్ వచ్చి చీముకారుతుంద ని, నొప్పి భరించలేకపోతున్నానని వృద్ధురాలు చేసే రోదనలు చుట్టుపక్కలవారికి కంటనీరు తెప్పిస్తున్నాయి. ప్రతీ పదిహేను రోజులకోసారి జగిత్యాలలోని ఆసుపత్రికి వెళ్లేందుకు అయ్యే ఆర్థికభారాన్ని వారి పేదకుటుంబం భరిం చలేకపోతోంది. లక్ష్మికి కాలు తొలగించినా వికలాంగ పెన్షన్ రావడంలేదు. తనకు జైపూర్కాలును అమర్చాల ని బాధితురాలు కోరుతున్నది. అమ్మమ్మ వెంట తీసుకెళ్లడంతోనే తన తల్లి చనిపోయిందని మనవడు సరిగా మాట్లాడడంలేదు. తానుకూడా అదేరోజు కూతురుతోపాటు చనిపోతే బాగుండేదంటున్న వృద్ధు రాలి వేదన కఠిన హృదయాలను సైతం కరిగించేలా ఉన్నది. నడవలేక నరకయాతన.. హిమ్మత్‌రావుపేటకు చెందిన పెంచాల లక్ష్మి, కూతురు సౌందర్య ప్రమాదంలో గాయపడ్డారు. ఉపాధి కోసం బ్రూనై వెళ్లిన భర్త నర్సయ్య తిరిగివచ్చాడు. లక్ష్మి కాలుచర్మం పూర్తిగా పాడవడంతో శరీరంలోని వేరేప్రదేశంలోని చర్మాన్నితీసి కాలుకువేశారు. కాలుకు, చేయికి రాడ్వేశారు. కొత్తగా వేసిన చర్మానికి ఇన్ఫెక్షన్వచ్చి కాలు వాచింది. మంచం దిగి నడవలేని పరిస్థితిలో వేదనపడుతున్నది. – తల్లితో సౌందర్య -
రహదారుల రక్తదాహం
సాక్షి, హైదరాబాద్: రహదారులు రక్తమోడుతున్నాయి.. రోడ్డుమీద రయ్యిమని దూసుకుపోతున్న వాహనాలు క్షణాల్లో ప్రమాదాల తలుపు తడుతున్నాయి. ఇష్టానుసారంగా వెళ్తున్న వాహనాలు ప్రమాదాలకు కారణమవుతూ నేరుగా ప్రయాణికులను యమపురికి చేరుస్తున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం ప్రమాదాలకు ప్రధాన కారణంగా చెబుతున్నారు రోడ్డు భద్రతా అధికారులు. రోడ్డు రవాణా, రహదారుల శాఖ నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా ఏటా నాలుగు లక్షలకుపైగా ప్రమాదాలు జరుగుతుండగా, 1.6 లక్షల మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షలాది మంది గాయాల పాలవుతున్నారు. వేలాదిమంది వికలాంగులుగా మిగులుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణలో సాలీనా దాదాపు ఆరువేల మంది ప్రజలు మరణిస్తున్నారు. జనవరి 1 నుంచి మే 16 వరకు జరిగిన రోడ్డు ప్రమాదాలు పరిస్థితి తీవ్రతను చెబుతున్నాయి. తెలంగాణవ్యాప్తంగా రోజుకు సగటున 55 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటుండగా అందులో దాదాపు 17 మంది మరణిస్తున్నారు, 64 మంది గాయపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది రోజుకు మరణించిన వారి సంఖ్య సగటున 18 ఉండటం గమనార్హం. వేగం తొలికారణం గత పదేళ్లుగా వాహనరంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. దీనికితోడు చక్కటి రోడ్లు, జాతీయ రహదారులు అందుబాటులోకి వచ్చాయి. గతంలో రోడ్డు మీద వ్యక్తిగత వాహనాలు కూడా తక్కువగా ఉండేవి. నేడు హైదరాబాద్‌లోనే కాక జిల్లా ల్లోనూ వ్యక్తిగత వాహనాల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుంది. పెరిగిన వాహన సామర్థ్యం కూడా ప్రమాదాలకు హేతువుగా మారుతోంది. 2000 నుంచి 5000 సీసీల వరకు సామర్థ్యమున్న కార్లు రోడ్ల మీదకు వస్తునాయి. ఇక బస్సుల్లోనూ అంతే. వాహనాల వేగం కనీసం 100 నుంచి 120 కి.మీ.ల స్పీడుకు తగ్గకుండా వెళ్తున్నారు. ఇలాంటి వాహనాలు ప్రమాదాలకు గురైతే.. ప్రాణనష్టం అధికంగా ఉంటుంది. దీనికితోడు ఫిట్‌నెస్‌లేని రవాణా వాహనాలు రోడ్ల మీద తిరగడం కూడా ప్రమాదాలకు మరో ప్రధాన కారణం. కొండగట్టు ప్రమాదంలో ఏకంగా 64 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. అప్పటికే ఆ బస్సు 13 లక్షల కిలోమీటర్లు తిరిగి ఫిట్నెస్ లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇక ప్రైవేటు ట్రావెల్స్ స్పీడ్‌కు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. వీళ్లు త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్న ఆత్రుతతో 120 నుంచి 150 కి.మీ.ల స్పీడుతో బస్సులను నడుపుతున్నారు. 2013లో డ్రైవర్ అతివేగానికి పాలమూరులో బస్సు కల్వర్టును ఢీకొట్టినప్పుడు కూడా 40 మందికిపైగా ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. ఏటేటా రోడ్డు ప్రమాద మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. గతేడాది మొత్తం 6,603 మంది వివిధ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోగా 2019లో మే 17వ తేదీవరకు 2,403 మంది విగతజీవులుగా మారారు. ఈ ఏడాది ముగిసేందుకు మరో ఏడునెలల సమయం ఉంది. ఈ లెక్కన గతేడాది కంటే అధిక ప్రమాదాలు నమోదయ్యే అవకాశం ఉందని రోడ్ సేఫ్టీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల వారీగా.. ప్రమాదాలు.. తాజాగా తెలంగాణవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాలపై రోడ్‌సేఫ్టీ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. ఇందులో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతోపాటు, కరీంనగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట కమిషనరేట్లు కూడా ఉన్నాయి. వీటితోపాటు ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీమ్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి– కొత్తగూడెం, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ, నల్లగొండ, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో జనవరి 1 నుంచి మే 17 వరకు చోటు చేసుకున్న వివిధ రోడ్డు ప్రమాదాలు జాబితా సిద్ధమైంది. మరణించినవారి, క్షతగాత్రుల వివరాలు కూడా పొందుపరిచారు. 263 ప్రమాదాలు, 274 మంది మరణాలతో సైబరాబాద్ రాష్ట్రంలోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతంగా నమోదవ్వగా, అతి తక్కువగా 28 ప్రమాదాలు, 28 మంది మరణాలు కుమ్రంభీం జిల్లాలో నమోదయ్యాయి. ఈ నివేదిక ప్రకారం.. మే 16వ తేదీనే తెలంగాణలో 72 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా, 16 మంది మరణించారు. 59 మంది గాయపడ్డారు. -
2018 : కన్నీటిని మిగిల్చిన కొండగట్టు ప్రమాదం
కొండగట్టు ప్రమాదం ఎంతో మంది జీవితాల్లో కన్నీటిని మిగిల్చింది.. కథువా ఘటన మనిషిలో కనుమరుగైన మానవత్వాన్ని చూపింది.. ఉన్నావ్ దుర్ఘటన రాజకీయ ఒత్తుడులను చవిచూసింది.. సమాజానికి సిగ్గుచేటుగా దాచేపల్లి ఘటన.. ప్రేమికుడి కోసం భర్తను హత్య చేయించడం మానవ సంబంధాల ఉనికిని చూపెడుతోంది.. ఈ ఏడాది సంచలనం రేపిన ఘటనలను ఓ సారి చూద్దాం.. సంచలనం రేపిన కథువా దుర్ఘటన (జనవరి 10-17) జమ్మూకశ్మీర్‌లోని కథువాలో 8 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలిక కనిపించకుండా పోయిన వారం రోజుల తర్వాత ఆమె మృతదేహాన్ని కథువా గ్రామానికి కిలోమీటరు దూరంలో గుర్తించారు. ఈ కేసులో ఏప్రిల్ 16వ తేదీన విచారణ ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ కేసులో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. విషాదం మిగిల్చిన విమానం ఆఫ్రికాలోని అల్జీరియాలో ఏప్రిల్ 11న జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 257 మంది దుర్మరణం చెందారు. రాజధాని అల్జీర్స్ నుంచి టేకాఫ్ అయిన విమానం కొద్ది సేపటికే సమీపంలోని పొలాల్లో కుప్పకూలింది. మృతుల్లో ఎక్కువ మంది ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులే ఉన్నారు. ఉలిక్కిపడేలా చేసిన ఉన్నావ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లోని ఓ యువతిపై బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో బాధితురాలి తండ్రిని ఏప్రిల్ 5వ తేదీన అక్రమ ఆయుధాల చట్టం కింద అరెస్ట్ చేశారు. ఆయన అదే రాత్రి మృతి చెందడం కలకలం రేపింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమం జరగడంతో.. ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. మానవత్వానికి సిగ్గుచేటు.. దాచేపల్లి ఘటన (మే 3-5) గుంటూరు జిల్లా దాచేపల్లిలో 9 ఏళ్ల బాలికపై 55 ఏళ్ల వృద్దుడు అన్నం సుబ్బయ్య అత్యాచారానికి పాల్పడటం కలకలం సృష్టించింది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు 17 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. చివరకు నిందితుడు గురజాల మండలంలోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమికుడు కోసం భర్త హత్య (మే 7)విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి మండలంలో సరస్వతి అనే వివాహిత పెళ్లైనా వారం రోజులకే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించడం స్థానికంగా కలకలం రేపింది. ఫేస్బుక్లో పరిచయమైన యువకుడిని ప్రేమించిన సరస్వతి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఈ హత్య దుండగులు చేసినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరిపిన పోలీసులు సరస్వతిని నిందితురాలిగా తేల్చారు. పడవ బోల్తా.. 26మంది మృతి (మే 15) పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి సమీపంలో గోదావరిలో లాంచీ మునిగిపోయిన ఘటన ఉభయ గోదావరి జిల్లాలను వణికించింది. ఈ దుర్ఘటనలో దాదాపు 26 మంది మృతి చెందారు. మే 15 సాయంత్రం దేవిపట్నం నుంచి కొండమొదలు బయలుదేరిన లాంచీ సుడిగాలుల తీవ్రతకు బోల్తాపడింది. మేనమామే.. మృగంలా మారి! (జూన్ 15) మానసిక వికలాంగులైన చిన్నారులను సొంత మేనమామే దారుణంగా హత్య చేశాడు. మిర్యాలగూడలోని తన అక్క వద్ద నుంచి పిల్లల్ని తన రూమ్‌కు తీసుకువచ్చిన మల్లికార్జునరెడ్డి ఈ అమానవీయ చర్యకు పాల్పడ్డాడు. చివరకు నిందితుడు మృతదేహాలను అర్ధరాత్రి కారులో తరలిస్తూ పోలీసులకు చిక్కాడు. ఎనిమిదేళ్ల బాలికపై.. (జూన్ 26) మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో ఎనిమిదేళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అతి కిరాతకంగా అత్యాచారనికి పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు వ్యతిరేకంగా మహిళలు మధ్యప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది.. (జూలై 1) దేశ రాజధాని ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద రీతిలో చనిపోవడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. మూఢ నమ్మకాలపై విశ్వాసంతో.. మోక్షం పొందడం కోసమే వారంతా సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి. వారి ఇంట్లో లభించిన ఆధారాలు కూడా ఈ వాదనకు బలం చేకూర్చేలా ఉన్నాయి. ఆరుగురు విద్యార్థులు, ఒక వివాహిత గల్లంతు.. (జూలై 14) తూర్పుగోదావరి జిల్లా పశువుల్లంకలో నాటుపడవ గోదావరి నది పాయలో బోల్తా కొట్టిన దుర్ఘటనలో ఆరుగురు విద్యార్థులు, ఒక వివాహిత గల్లంతయ్యారు. చిన్నారులు ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అనాథ శరణాలయంలో దారుణం! (జూలై) బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఓ అనాథ శరణాలయంలో 34 మంది మైనర్ బాలికలపై నిర్వాహకుడు బ్రజేష్ లైంగిక దాడికి పాల్పడిన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ముంబైకి చెందిన ‘టిస్’ చేపట్టిన సోషల్ ఆడిట్‌తో ఈ దారుణం బయటపడింది. ఈ ఘటనలో బాధిత బాలికలు ఇచ్చిన వాంగ్మూలాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. కరక్కాయతో కాటువేశాడు! (జూలై) హైదరాబాద్ కేపీహెచ్బీలో కరక్కాయ పొడి పేరుతో జరిగిన ఘరానా మోసం వెలుగుచూసింది. బాధితులకు వేల రూపాయలు ఎరగా చూపిన నిందితులు కోట్లాది రూపాయలతో ఉడాయించారు. ధర్మపురి సంజయ్‌పై ఆరోపణలు (ఆగస్టు) ప్రముఖ రాజకీయ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ కుమారుడు సంజయ్ నర్సింగ్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు రావడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసులో సంజయ్ 20 రోజలు పాటు సారంగపూర్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కన్నీటిని మిగిల్చిన కొండగట్టు ప్రమాదం (సెప్టెంబర్ 11) జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో 60 మంది దుర్మరణం పాలయ్యారు. ఆర్టీసీ చరిత్రలోనే అతి పెద్ద బస్సు ప్రమాదంగా ఇది నిలిచింది. ఆర్టీసీ అధికారుల తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విమర్శలు తీవ్ర స్థాయిలో వెలువెత్తాయి. మిర్యాలగూడ పరువు హత్య! (సెప్టెంబర్ 14) మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య తెలుగు రాష్ట్రాలో సంచలనం రేపింది. మిర్యాలగూడకు చెందిన అమృత, ప్రణయ్‌లు ఈ ఏడాది జనవరిలో ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కూతురి ప్రేమ వివాహన్ని తట్టుకోలేకపోయిన మారుతి రావు ప్రణయ్‌ను అంతమొందించాడు. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరిగింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. మావోయిస్టుల చేతిలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హతం! (సెప్టెంబర్ 23) మన్యంలో మాటు వేసిన మావోయిస్టులు విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే కిడారి సోములను దారుణంగా కాల్చి చంపారు. దాదాపు 65 మందితో కూడిన మావోయిస్టు దళం ఈ దాడికి పాల్పడినట్టుగా తెలిసింది. నిఘా వ్యవస్థ వైఫల్యం వల్లనే ఈ దాడి జరిగిందనే విమర్శలు ఉన్నాయి. మిస్టరీగా ఖషోగ్గి హత్య (అక్టోబర్ 2) ఇస్తాంబుల్‌లోని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయానికి వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ జమాల్ ఖషోగ్గీ హత్యకు గురికావడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. కనీసం ఆయన మృతదేహాం కూడా లభించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఖషోగ్గీ హత్య వెనుక ఉంది సౌదీ అరేబియా ఉందనడానికి తమ దగ్గర ఆధారాలున్నాయంటూ టర్కీ ప్రభుత్వం పేర్కొంది. తనపై విమర్శనాత్మక కథనాలు రాసినందున ఖషోగ్గీని సౌదీ యువరాజు సల్మాన్ చంపించారనే ఆరోపణలు వచ్చాయి. రావణాసురుడి దహణం.. 59మంది దుర్మరణం (అక్టోబర్ 19) పంజాబ్ అమృత్‌సర్‌లో దసరా వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. జోడా ఫాటక్ ప్రాంతంలో రావణ దహనాన్ని వీక్షిస్తున్న వారిపైకి రైలు మృత్యువులా దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 59 మంది చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. అండమాన్‌లో అమెరికన్ టూరిస్ట్ హత్య (నవంబర్) అండమాన్, నికోబార్ దీవుల్లో నివసించే సెంటినెలీస్ తెగ చేతిలో జాన్ అలెన్ చౌ అనే అమెరికన్ టూరిస్ట్ దారుణ హత్యకు గురయ్యారు. బయటివారి ఉనికిని ఏమాత్రం ఇష్టపడని ‘సెంటినెలీస్’ తెగ వారు ఈ చర్యకు పాల్పడ్డారు. కాగా, అలెన్ క్రైస్తవ మత ప్రచారం కోసం అక్కడికి వెళ్లారు. ఆలయంలో విష ప్రసాదం.. 15మంది మృతి (డిసెంబర్ 14) కర్ణాటక చామరాజనగర జిల్లా సుళ్వాడిలోని చిక్క మారమ్మ ఆలయంలో విష ప్రసాదం తిని 15 మంది మృతి చెందటం సంచలనంగా మారింది. ఆధిపత్య పోరు ముసుగులో పగతో ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు ఇమ్మడి మహదేవస్వామి తన మనుషులతో ప్రసాదంలో మోనోక్రోటోఫాస్ అనే పురుగుల మందు కలిపి ఈ ఘోరానికి పాల్పడినట్టు తెలింది. -
ప్రణయ్‌ను సుపారీ ఇచ్చి మరీ చంపించాడు!
2018 సంవత్సరం.. తెలంగాణకు మాయని గాయాలను మిగిల్చింది. ప్రమాదాలు, పరువు హత్యలు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేశాయి. కొండగట్టు బస్సు ప్రమాదం కలవరపరిచింది. టపాసులు పేలి డజను మంది మృత్యువాత పడ్డారు. కులం కోసం ప్రేమించుకున్న వారిని, కన్న వారిని కూడా చూడకుండా కడతేర్చారు. చలికి రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న కుంపటి జీవితాలను బుగ్గిపాలు చేసింది. డబ్బుకు లోకం దాసోహం అన్నట్లుగా మారిన తీరును కొందరు అక్షరాల సత్యం చేశారు. నౌహీరా షేక్ డిపాజిట్ల కుంభకోణం వేల కుటుంబాలను ఆగం చేసింది. – సాక్షి, హైదరాబాద్ ప్రమాదపు చావులు.. దేశ చరిత్రలోనే భారీ ప్రాణనష్టం కొండగట్టు బస్సు ప్రమాదంలో జరిగింది. సెప్టెంబర్ 12న జరిగిన కొండగట్టు ఘాట్‌రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా పడి 62 మంది ప్రయాణికులను పొట్టన పెట్టుకుంది. ఈ ఘటనతో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. హైదరాబాద్ నుంచి రామగుండం వెళ్లే రాజీవ్ రహదారిపై వరుస రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగించాయి. ఈ ఏడాది మేలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం 11 మందిని బలిగొంది. ప్రముఖ సినీ నటుడు, నందమూరి హరికృష్ణ నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి చెరువుగట్టు వద్ద కారు ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు. అర్థంలేని పరువు హత్యలు.. ప్రేమించి పెళ్లి చేసుకోవడం నచ్చకపోతే వాళ్ల బతుకు వాళ్లను బతకనివ్వాల్సింది. కానీ అర్థం లేని ఆవేశాలకు పోయి కులాంతర వివాహం చేసుకున్నందుకు కన్న కూతుర్ల జీవితాలనే కాలారాశారు. మిర్యాల గూడలో ప్రణయ్ పరువు హత్య రాష్ట్రంలో సంచలనం రేపింది. తన కూతురిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడని, ప్రణయ్‌ను సుపారీ ఇచ్చి మరీ చంపించాడు అమృత తండ్రి మారుతీరావు. ఇలాంటి ఉదంతమే మంచిర్యాలలో కూడా చోటుచేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్న కన్న కూతురినే తల్లిదండ్రులు, సోదరుడు కలసి గొంతు నులిమి చంపేశారు. కులాంతర వివాహం చేసుకున్నారనే కోపంతో కూతురు, అల్లుడిపై ఎర్రగడ్డలో నడిరోడ్డుపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచాడు ఓ తండ్రి. అదృష్టవశాత్తు వారిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. హవాలా హవా.. పైకి పార్శిళ్లలాగే ఉన్నా వాటిలో మాత్రం హవాలా డబ్బు సరఫరా అవుతోంది. హైదరాబాద్ నుంచి ముంబైకి హవాలా డబ్బును ఆంధ్రా పార్శిళ్ల సంస్థ రవాణా చేస్తుండగా రైల్వే పోలీసులు పట్టుకున్నారు. రూ.66 లక్షల హవాలా సొమ్మును సీజ్ చేశారు. ఏకంగా రైళ్లలోనే హవాలా డబ్బు రవాణా జరగడం ఈ ఏడాది చర్చనీయాంశమైంది. వెయ్యి కోట్లు మింగేసింది.. హీరా గోల్డ్ పేరుతో 8 రాష్ట్రాల్లో డిపాజిట్లు వసూలు చేసినా ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. రూ.వెయ్యి కోట్లకు పైగా పలు రకాల స్కీముల పేరుతో డిపాజిట్ల రూపంలో సేకరించింది ఆ సంస్థ యజమాని నౌహీరా షేక్. రాజకీయ వేడి.. ఏడాది చివర జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హవాలా డబ్బు ఏరులై పారింది. రూ.125 కోట్లకు పైగా నగదును పోలీస్ శాఖ స్వాధీనం చేసుకోగా, అందులో హవాలా డబ్బే దాదాపు 40 కోట్లకు పైగా ఉంది. వరంగల్ పెంబర్తిలో పట్టుబడ్డ కేసులో మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, కాంగ్రెస్ నేత మద్దిరాజు రవిచంద్ర పేర్లు బయటపడటం కలవరం రేపాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు, విచారణ రాజకీయంగా వేడిని రగిలించాయి. ఎన్నికల ప్రచారం ముగియడానికి ముందు రోజు రేవంత్‌రెడ్డి ముందస్తు అరెస్ట్ పోలీసు శాఖకు, ఉన్నతాధికారులకు మాయని మచ్చగా మిగిలింది. ఈ అరెస్ట్ వ్యవహారంపై హైకోర్టు చేసిన ఘాటు వ్యాఖ్యలు సంచలనం రేపాయి. సంచలన తీర్పులు.. 2007లో జరిగిన హైదరాబాద్ గోకుల్ చాట్, లుంబినీ పార్క్ జంట పేలుళ్ల కేసులో న్యాయస్థానం ఈ ఏడాది సంచలన తీర్పు వెలువరించింది. నిందితుల్లో ఇద్దరికి ఉరిశిక్ష విధించగా, మరొకరికి జీవిత ఖైదు విధించింది. మద్దెల చెరువు సూరి అలియాస్ గంగుల సూర్యనారాయణరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న భానుకిరణ్‌కు జీవితఖైదు విధిస్తూ సీఐడీ కోర్టు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం శిక్ష ఖరారు చేసింది. నర్సింగ్ విద్యార్థులకు వేధింపులు.. నర్సింగ్ కాలేజీలను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ మాజీ మంత్రి, రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ కుమారుడు సంజయ్‌ను నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శాంకరీ నర్సింగ్ కాలేజీలోని 11 మంది నర్సింగ్ విద్యార్థినులు దీనిపై నేరుగా హోంమంత్రికి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, పాతబస్తీలోని నిజాం మ్యూజియం నుంచి రూ.300 కోట్ల విలువైన వస్తువులను కొట్టేశారు దుండగులు. ప్రాణాలు బలితీసుకున్న కుంపటి.. చలి వేస్తుండటంతో వెచ్చదనం కోసం ఇంటిలో పెట్టుకున్న బొగ్గుల కుంపటి ఆరుగురి ప్రాణాలను బలిగొంది. జూబ్లీహిల్స్‌కు చెందిన బుచ్చివేణి, ఆమె కుమారుడు పద్మరాజు పొగకు ఊపిరాడక మృతిచెందగా, ఆ మరుసటిరోజే శామీర్‌పేట బొమ్మరాసిపేట గ్రామంలో కోళ్లఫారంలో పనిచేస్తున్న మహబూబ్‌నగర్‌కు చెందిన నలుగురు వలస కూలీలు ఇదే రీతిలో మరణించడం సంచలనం రేపింది. కాల్చేసిన బాణసంచా.. రోజువారీ కూలీలుగా పనిచేసుకునే కుటుంబాల్లో అగ్నిప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. వరంగల్ శివారులో బాణసంచా తయారీ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది కూలీలు దుర్మరణం చెందడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కాగా, హైదరాబాద్‌లోని పాతబస్తీ చాంద్రాయణగుట్టలో బాసిత్‌తో పాటు నలుగురిని ఐసిస్ మాడ్యూల్ కోసం పనిచేస్తున్నట్లు గుర్తించి ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
నెలరోజులైనా పరిహారం ఇవ్వరా?
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కొండగట్టు ఆర్టీసీ ప్రమాద బాధిత కుటుంబాలు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం కోసం ఆందోళన లు ఉధృతం చేస్తున్నాయి. ప్రమాదం జరిగి నెలరోజులు కావస్తున్నా.. పరిహారం అందకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పరిహారం కోసం ఈ నెల ఐదో తేదీన జగిత్యాలలో ధర్నాకు దిగిన విషయం విదితమే. జాయింట్ కలెక్టర్ రాజేశం హామీతో ఆందోళనను విరమించిన మృతుల కుటుంబాలు.. బుధవారం మళ్లీ కొడిమ్యాల, మల్యాల మండలాల సరిహద్దు దొంగలమర్రి వద్ద దర్నా నిర్వహించా లని మంగళవారం నిర్ణయించారు. ఇది తెలుసుకున్న మల్యాల సీఐ, కొడిమ్యాల ఎస్ఐ ధర్నా చేయకుండా భగ్నం చేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం అందుతుందని, జిల్లా అధికారులతో మాట్లాడిస్తామన్నారు. 40మంది బాధిత కుటుంబాలు కలెక్టర్ శరత్, జేసీ రాజేశంను కలసి తమకు రావాల్సిన నష్టపరిహారాన్ని ఇప్పించాలని కోరాయి. వారం లో పరిహారం అందేలా చర్యలు తీసుకుంటా నని కలెక్టర్ చెప్పడంతో వారు శాంతించారు. త్వరలోనే ఆదుకుంటాం: కలెక్టర్ కొండగట్టు ప్రమాద బాధిత కుటుంబాలను త్వరలోనే ఆదుకుంటామని కలెక్టర్ శరత్ తెలిపారు. అంత్యక్రియలకు రూ.20 వేలు ఇచ్చామని. ఆర్టీసీ రూ.3లక్షల చొప్పున అన్ని కుటుంబాలకు పంపిణీ చేశారన్నారు. ప్రభు త్వం నుంచి రావాల్సిన రూ. 5లక్షలు త్వరలోనే మంజూరు కానున్నాయని పేర్కొన్నారు. పరిస్థితి దయనీయం: ప్రమాదంలో గాయాలపాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న.. వికలాంగులుగా మారిన వారి కుటుంబాల పరిస్థితి దయనీయంగా తయారైంది. బాధితులం దరూ నిరుపేదలే కావడంతో మెరుగైన వైద్యం పొందలేని స్థితిలో ఉన్నారు. మండల పరిధిలో గాయాలపాలైన 43 మందిలో కొందరు పూర్తి గా కోలుకోలేకపోయినా.. ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలు వారిని డిశ్చార్జి చేశారు. కాళ్లూ చేతులు విరిగి మంచానికే పరిమితమైన వారు రెండ్రోజులకోసారి వైద్య పరీక్షలకు వెళ్లాలన్నా రవాణా ఖర్చులు లేక వెళ్లలేని స్థితిలో ఉన్నారు. -
కొండగట్టు బాధితులు ఇంటికి వెళ్లొచ్చు!
సాక్షి, హైదరాబాద్: కొండగట్టు ఆర్టీసీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారి పరిస్థితి దయనీయంగా ఉంది. గాయపడ్డవారిలో నలుగురు ఇంటికి వెళ్లొచ్చని ఆస్పత్రి వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. హైదరాబాద్‌కు క్రమం తప్పకుండా వైద్యపరీక్షల కోసం తీసుకురావాలని డాక్టర్లు సూచించారు. చేతిలో చిల్లిగవ్వలేని కూలీ కుటుంబాలమైన తమకు అదెలా సాధ్యమంటూ వాపోతున్నారు. 62 మంది ప్రయాణికు లను బలితీసుకున్న ఆ దుర్ఘటన నుంచి క్షతగాత్రులు, మృతుల కుటుంబాలు ఇంకా తేరుకోలేదు. సెప్టెంబర్ 11న బస్సు ప్రమాదం జరిగాక రాజమ్మ, సత్తవ్వ, విజయ, రాజయ్య తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లారు. అప్పటి నుంచి వీరు హైదరాబాద్‌లో సన్‌షైన్ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల కళ్లు తెరిచిన విజయ, సత్తవ్వలను శనివారం జనరల్ వార్డుకు మార్చనున్నారు. రాజవ్వ శుక్రవారం స్పృహలోకి వచ్చింది. తీవ్రంగా గాయపడ్డ రాజయ్య మాత్రం ఇంకా కోమాలోనే ఉన్నాడు. వీరంతా ఇంకా కొన్ని నెలలపాటు చక్రాల కుర్చీకే పరిమితమవ్వాల్సిన పరిస్థితి. ఈ నలుగురూ రోజువారీ కూలీలు. మందులు, రెగ్యులర్ చెకప్‌లకు హైదరాబాద్‌కు ఎలా రావాలా? అని ఆందోళన చెందుతున్నారు. 18 రోజులుగా హైదరాబాద్‌లో ఉండటానికి భోజనం ఖర్చులకే అప్పు చేశామని, భవిష్యత్తులో చికిత్స, మందులు తమకు తలకుమించిన భారమని వాపోతున్నారు. ఏర్పాట్లు చేస్తున్నాం కొండగట్టు బస్సు ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందిస్తున్నాం. డిశ్చార్జ్ అయినవారికి మేమే అంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తాం. వారిని ఇంటి వద్ద దించేదాకా మాదే బాధ్యత. డిశ్చార్జి అయిన క్షతగాత్రులకు జగిత్యాలలో రెగ్యులర్ చెకప్‌ల కోసం ఇప్పటికే కలెక్టర్‌తో మాట్లాడాం. వారి చికిత్స విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – జీవన్ ప్రసాద్, ఆర్ఎం, కరీంనగర్ దుబాయ్‌లో ఉద్యోగం మానేసి వచ్చాను మా అమ్మ మెల్లిగా కోలుకుంటోంది. గర్భవతి అయిన నా సోదరిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో నా చెల్లి చనిపోయింది. ఆ విషయం ఇప్పటికీ మా అమ్మకు చెప్పలేదు. విషయం తెలిసి దుబాయ్ నుంచి వచ్చేశాను. ఇప్పుడు నా ఉద్యోగం పోయింది. డాక్టర్లు చెకప్‌ల కోసం హైదరాబాద్‌కు తీసుకురమ్మంటున్నారు. అంత డబ్బు మా దగ్గర లేదు. దయచేసి జగిత్యాల లేదా కరీంనగర్లో మాకు చికిత్స అందించే ఏర్పాటు చేయండి. – అనిల్, విజయ కుమారుడు, తిమ్మాయపల్లి తలకు మించిన భారం నేను దుబాయ్‌లో ఉద్యోగం చేస్తాను. సెలవుల కోసం వచ్చినపుడు ఈ దుర్ఘటన జరిగింది. ఇక అప్పటి నుంచి నేను దుబాయ్ వెళ్లలేదు. అమ్మ ఈ రోజే కళ్లు తెరిచింది. నన్ను గుర్తుపట్టింది. అదే సమయంలో డాక్టర్లు మరో రెండురోజుల్లో పంపిస్తామని చెప్పారు. దీంతో ఇంటికెళ్లాక అమ్మను ఎలా చూసుకోవాలో అర్థం కావడం లేదు. మా వద్ద సదుపాయాలు లేవు. దయచేసి అమ్మ పూర్తిగా కోలుకోనేదాకా చికిత్స ఇప్పించాలని మనవి. – సాయి, రాజవ్వ కుమారుడు, జగిత్యాల -
కొండగట్టు ప్రమాదం: ఆగని కన్నీళ్లు
జగిత్యాలజోన్/కొండగట్టు/ధర్మపురి: ప్రజలు సుభిక్షంగా ఉండాలనే నారాయణ బలిహోమం నిర్వహిస్తున్నట్లు శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి అన్నారు. ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు బోల్తాపడి 62మంది చనిపోయిన కొండగట్టు ఘాట్‌రోడ్డు ఆవరణలో బుధవారం నారాయణ బలి శాంతిహోమం నిర్వహించారు. కార్యక్రమానికి కొడిమ్యాల మండలంలోని పలు గ్రామాల నుంచి మృతుల కుటుంబాలు భారీగా తరలివచ్చారు. ఘటనాప్రదేశాన్ని చూసి, వారి కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుని బోరున విలపించారు. ఈ సందర్భంగా పరిపూర్ణానందాస్వామి మాట్లాడుతూ.. దేశంలోనే కొండగట్టు బస్సు ప్రమాదం ఘోరమైందన్నారు. ప్రమాదంలో మరణించిన వారిని తీసుకురాలేమని, ఉన్నవారికి మంచి జరగాలనే ఉద్దేశంతో నారాయణబలిహోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ హోమం ద్వారా ప్రేతాత్మకు విముక్తి, ఆత్మశాంతి కలుగాలని కోరుతున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. సంఘటన స్థలం వద్ద శాస్త్రోత్తకంగా పిండ ప్రదానం చేసి వాటిని ధర్మపురి గోదావరిలో కలుపుతారని వెల్లడించారు. బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి పిల్లలకు ఉచిత వసతి, విద్యను అందించేందుకు జగిత్యాల జిల్లా కేంద్రంలో బాలుర కోసం వాల్మీకి అవాసం, బాలికల కోసం భగిని నివేదిత అవాసాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. తాను సాయం అందిస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైదికులు డాక్టర్ బాచంపల్లి సంతోష్‌కుమార్ శర్మ, కరీంనగర్, జగిత్యాల బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జీలు బండి సంజయ్, ముదుగంటి రవీందర్‌రెడ్డి, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వెంకట్ రాజ్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ సంఘ్ చాలక్‌లు డాక్టర్ శంకర్, డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. కన్నీరు.. మున్నీరు.. కొండగట్టు ప్రమాద ఘటనాస్థలానికి భారీగా మృతుల కటుంబసభ్యులు వచ్చారు. ఎవరి మోహంలో నిరునవ్వు లేదు. కన్నీరు ఆగడం లేదు. ఘటనాస్థలాన్ని చూసిన వారు తమ వారిని గుర్తు చేసుకుని గుండెలవిసేలా రోదించారు. ముందుగా పండితులు మృతుల కుటుంబసభ్యులపై గోదావరి పుణ్యతీర్థం చల్లారు. అనంతరం హోమం, పూజలు, సామూహిక పిండాలు ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అక్కడే అన్నదానం నిర్వహించారు. పంచభూతాల పరిరక్షణతో క్షేమం.. పకృతిని ఆరాధిస్తూ పంచభూతాలను పరిరక్షించడం ద్వారా దేశం సుభిక్షంగా ఉంటుందని శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి పేర్కొన్నారు. కొండగట్టు మృతుల పిండాలను ధర్మపురి గోదావరిలో కలిపారు. అనంతరం ఆర్అండ్బీ వసతిగృహంలో మాట్లాడారు. ధర్మపురిలో సాక్ష్యాత్తు భగవంతుని సొమ్ముకే రక్షణ లేకపోవడంతో శోచనీయం అన్నారు. ధర్మపురి పవిత్ర గోదావరిలో కొంతకాలంగా డ్రయినేజీ నీరుకలుస్తూ కాలుష్య కోరల్లో చిక్కుకోగా దీన్ని నివారించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడిందని అన్నారు. పంచభూతాల్ని పవిత్రంగా కాపాడుకోవల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఘాట్‌రోడ్ ప్రమాదంపై మరో బస్సుతో పరిశీలన ఘాట్‌రోడ్‌పై బస్సు ప్రమాదంపై అధికారులు కదిలారు. ఈ ఘటనపై రాష్ట్ర రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ కృష్ణప్రసాద్ ఇప్పటికే మూడుసార్లు కొండగట్టు చేరుకుని అన్ని శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించారు. దీంతో స్థానిక అధికారుల్లోనూ కదలిక వచ్చింది. మరోవైపు బుధవారం నల్గొండ జిల్లా ఆర్ఎం విజయ్‌కుమార్ ఘటనస్థలానికి వచ్చి ఘాట్‌రోడ్‌పై ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు సేకరించారు. మరో ఆర్టీసీ బస్సును కొండపై నుంచి కిందకు తీసుకొచ్చారు. వచ్చేక్రమంలో ఘాట్‌రోడ్ స్పీడ్ బ్రేకర్ల వల్ల ప్రమాదం జరిగిందా..? టర్నింగ్‌లతోనా.. ? ప్రమాద సమయంలో బస్సు స్పీడు ఎంత ఉంది.. ? ఎంత స్పీడులో ఈ ప్రమాదం జరిగింది.. ? ఆ సమయంలో బ్రేకులు ఫెయిలయ్యాయా...? అని అనేక కోణాల్లో పరిశీలించారు. ప్రమాద సమయంలో ధ్వంసమైన రెయిలింగ్‌తోపాటు ప్రమాదకరలోయనూ పరిశీలించారు. -
‘కొండగట్టు’ ఘటనపై హైకోర్టులో పిల్
సాక్షి, హైదరాబాద్: జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో గాయపడిన వారికి సరైన వైద్యసేవలు అందించలేదని, మృతదేహాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్.ఇంద్రసేనారెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ ఘటనలో 62 మంది మృతి చెందిన విషయం తెలి సిందే. కాలం చెల్లిన బస్సును నడిపేందుకు అనుమతి ఇచ్చిన జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ హనుమంతరావు, ఇతరుల గురించి మల్యాల పోలీసుల ఎఫ్.ఐ.ఆర్.లో ఉండేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కొండగట్టు ప్రాంతంలో ప్రమాద హెచ్చరిక బోర్డులు కూడా లేవని, బస్సులో 57 మంది ప్రయాణించేందుకు వీలుండగా 105 మం దితో కిక్కిరిసి వెళతూ ప్రమాదానికి గురైం దని వివరించారు. బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులను అనుమతించరాదని, ప్రమాదాల్లో గాయడిన వారికి నాణ్యమైన వైద్యమందించేందుకు మల్టీస్పెషాలిటి హాస్పిటళ్లకు తీసుకువెళ్లేలా చేయాలని కోరారు. -
‘ప్రజల ప్రాణాలు పోతున్నా కేసీఆర్ తీరు మారదా’
సాక్షి, నల్గొండ : ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న భయానక ఘటనలపై కేసీఆర్ స్పందించిన తీరు సరికాదన్నారు. ప్రేమ వివాహం కారణంగా మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ కుంటుంబ సభ్యులను శుక్రవారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడతూ.. ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్ ప్రాణాలు తీయడం అత్యంత బాధకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎప్పుడూ ఫామ్‌హౌక్‌కే పరిమితమయ్యే కేసీఆర్.. సచివాలయానికి రాకున్నా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు తక్షణమే స్పందించాలని హితవు పలికారు. కొండగట్టు బస్పు ప్రమాదంలో 60 మంది చనిపోయినప్పుడు కూడా కేసీఆర్ రాకపోవడం విస్మయం కలిగిచిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పరువు హత్యలపై కఠిన చట్టాలు తెస్తామని వెల్లడించారు. చదవండి : మిర్యాలగూడలో పరువు హత్య చదవండి : కొండగట్టులో ఘోర రోడ్డు ప్రమాదం.. 60 మంది దుర్మరణం -
చెదిరిన బతుకు చిత్రం!
కొడిమ్యాల (చొప్పదండి): జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. చాలా మంది కాళ్లు, చేతులు కోల్పోయి జీవచ్ఛవాలుగా మిగిలిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎందుకు బతికాంరా దేవుడా..! అని రోదిస్తున్నారు. అయినవారు లేక.. ఆదుకునేవారు కనిపించక.. దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతు న్నారు. ప్రమాదంలో 58 మంది గాయపడగా, అందులో కొడిమ్యాల మండలానికి చెందినవారే 47 మంది ఉన్నారు. డబ్బుతిమ్మయ్యపల్లికి చెంది న 11 మంది, హిమ్మత్‌రావుపేటకు చెందిన 10 మంది, శనివారంపేటకు చెందిన 11 మంది, రాంసాగర్‌కు చెందిన 9 మంది, తిర్మలాపూర్‌కు చెందిన ఐదుగురు, సంద్రాలపల్లికి చెందిన ఒక్క రు ఉన్నారు. క్షతగాత్రులు జగిత్యాల, కరీంనగర్, హైదరాబాద్ ఆçస్పత్రుల్లో చికిత్స పొందుతున్నా రు. తిర్మలాపూర్ గ్రామానికి చెందిన ఎన్.లక్ష్మికి, ఎ.లింగవ్వకు 2 కాళ్లు, చేతులూ విరిగిపోయాయి. ప్రస్తుతం వీరు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే గ్రామానికి చెందిన తైదల లింగయ్యకు 2 కాళ్లు విరిగిపోయాయి. తైదల లతకు కుడిచేయి విరిగింది, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. వీరి కుటుంబసభ్యులు ఆస్ప త్రులకే పరిమితమై వారికి సేవలు చేస్తున్నారు. ఇళ్లకు తాళాలు వేసి.. ప్రమాదంలో డబ్బుతిమ్మయ్యపల్లికి చెందిన కొంపెల్లి విజయ రెండు కాళ్లు విరిగాయి. ఈమె భర్త నచ్చయ్య 15 ఏళ్ల క్రితమే మృతి చెందాడు. కొడుకు తిరుపతి ఆర్నెల్ల క్రితం దుబాయ్‌కి వెళ్లాడు. కూతురు స్వప్న ఇంటికి తాళం వేసి తల్లి వెంట కరీంనగర్ ఆస్పత్రిలో ఉంటోంది. ఇదే గ్రామానికి చెందిన లైసెట్టి శారద రెండుకాళ్లు విరిగాయి, తండ్రి కమలాకర్ దుబాయ్‌లో ఉండగా.. తల్లి లక్ష్మితో పాటు చెల్లి జయ, తమ్ముడు గణేశ్ బాధితురాలితో ఆస్పత్రిలో ఉంటున్నారు. సందడిగా ఉండే వీరి ఇంటికి తాళం పడింది. పెద్దమ్మ కళావతిని ప్రమాదంలో కోల్పోయింది. డబ్బుతిమ్మయ్యపల్లికి చెందిన సీహెచ్ విజయకు రెండుకాళ్లు, పక్కటెముకలు విరిగాయి. మనవడు సూరజ్‌కు కాళ్లకు గాయాలయ్యాయి. బాధితులు హైద రాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. బాధితురా లి ఇద్దరు కుమారులు, కోడళ్లు ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ప్రమాదంలో గోల్కొండ విజయ పక్కటెముకలు విరిగాయి. గర్భవతైన కూతురు సుమలతను ప్రమాదంలో కోల్పోయింది. కొడుకు అనిల్ ఆస్పత్రిలో తల్లి వెంట ఉంటున్నాడు. ఇదే గ్రామానికి చెందిన వనితకు కడుపులో తీవ్ర గాయాలు కావడంతో హైదరాబా ద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. భర్త సంజీవ్‌రెడ్డి సింగపూర్ నుంచి వచ్చి ఆస్పత్రిలో ఉంటున్నాడు. పక్కటెముకలు విరగిన గడ్డం జలజ హైదరాబాద్‌లోనే చికిత్స పొందుతోంది. ‘హిమ్మత్’ కోల్పోయింది బస్సు ప్రమాదంతో హిమ్మత్‌రావుపేట తన హిమ్మత్‌ను కోల్పోయింది. గ్రామానికి చెందిన లంబ మల్లవ్వ కాళ్లు విరిగాయి, కోడలు రజిత కాలు, చేయి విరిగింది. కొడుకు మహేష్ దుబాయ్ నుంచి వచ్చి, తల్లి, భార్యకు సపర్యలు చేస్తున్నాడు. ఎ.రమకు కాళ్లు, చేతులకు తీవ్ర గాయా లయ్యాయి. భర్త, పిల్లలు లేకపోవడంతో తమ్ము డు ఆస్పత్రిలో ఆమెతో ఉన్నాడు. ఆరె రాజమ్మ కా ళ్లు విరిగి హైదరాబాద్‌లో చికిత్స పొందుతోంది. రాంసాగర్.. విషాదసాగరం రాంసాగర్ గ్రామం విషాద సాగరమయ్యింది. గ్రామానికి చెందిన డి.అనిత కాలు విరిగింది, ప్రమాదంలో భర్త స్వామి చనిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బీ కీర్తన కాలుకు గాయాలయ్యాయి. ప్రమాదం లో కూతురు రితన్యను కోల్పోయింది. డిగ్రీ వి ద్యార్థినులు వైష్ణవి, సంగీత కాళ్లు, చేతులకు గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొం దుతున్నారు. సాహితికి గాయాలయ్యాయి. -
ఎవరిని కదిలించినా కన్నీళ్లే
-
ఆగని కన్నీళ్లు..!
చితి మంటలు ఆరలేదు.. కన్నీటి ధారలు ఆగలేదు.. ‘కొండగట్టు’ పల్లెల్లో కొడిగట్టిన విషాదం కొండంత శోకాన్ని మూటకట్టింది. ప్రమాదం జరిగి మూడురోజులు గడిచినా.. ఆ పల్లెల్లో విషాదం వీడలేదు. ఎవరినీ కదిలించినా కన్నీళ్లే. పచ్చని పొలాలు.. పాడి పంట.. కులవృత్తులు.. ఏ ఇంటి పెరడి చూసినా నిండాకాసిన కూరగాయలు. పాలు అమ్ముకుని కొందరు, పనికిపోయి ఇంకొందరు ఇలా.. ఏ గడప చూసినా.. పట్టెడన్నం తిని చల్లగా బతికిన ఊర్లవి. ‘కొండం’త అభివృద్ధి, సింగారించుకున్న ప్రజా జీవన సౌందర్యం ఆయా గ్రామాలకే సొంతం. ఇదంతా నాలుగు రోజుల కిందటి ముచ్చట. ఇప్పుడా పల్లెలు కళతప్పాయి. ఏ ఊరు చూసినా పెనువిషాదమే.. ఏ ఇళ్లు చూసినా విషాదఛాయలే.. ఏ గుండె తట్టినా కన్నీటిధారలే.. వెక్కివెక్కి ఏడ్చిన పల్లెజనం కళ్లలో నీళ్లూ ఇంకిపోయాయి. అయినా.. ఏడుపు ఇంకా మిగిలే ఉంది. తల్లికోసం బిడ్డ.. బిడ్డ కోసం తల్లిదండ్రులు.. భర్తను గుర్తుచేసుకుని భార్య.. భార్యను మరవలేని భర్త.. పని కోసం బయటికి వెళ్లి, తిరిగిరాని తోడుకోడళ్లు. అంతులేని విషాదం ఆ ఊళ్లలో చోటు చేసుకోగా.. ఇప్పుడా గ్రామాలు గణేష్ ఉత్సవాలకు కూడా దూరంగా ఉన్నాయి. ఎక్కడా చూసినా సిద్ధమైన మండపాలు.. గ్రామ పంచాయతీ కార్యాలయాలు, పెద్ద మనుషుల ఇళ్లలో వినాయకుడి విగ్రహాలు.. ఊహించిన ఘటనతో విషాదం నిండిన ఆ పల్లెలు వినాయక ఉత్సవాలను జరుపుకోవడం లేదు. కొండగట్టు పల్లెల నుంచి ‘సాక్షి’కథనం.. సాక్షిప్రతినిధి, కరీంనగర్/సాక్షి జగిత్యాల: చిన్నా, పెద్ద, స్త్రీ, పురుషుల వయోభేదం లేకుండా కన్నుల పండుగలా జరుపుకునే గణేష్ నవరాత్రోత్రి ఉత్సవాల కళ ఆ గ్రామాల్లో తప్పింది. శనివారంపేట, హిమ్మత్‌రావుపేట, డబ్బుతిమ్మాయిపల్లె, రాంసాగర్‌లో ఏర్పాటు చేసి న గణేష్ మండపాలు వెలవెలబోతున్నాయి. ఈనె ల 11న కొండగట్టు ఘాట్‌రోడ్‌పై నుంచి లోయలో పడిన ప్రమాదంలో 62మంది మరణించిన సం గతి తెలిసింది. ఈ గ్రామాలకు చెందిన 43 మంది కొండగట్టు దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు, గర్భిణులు, విద్యార్థులు ఉన్నారు. ఈ పల్లెల్లో ఏ వాడ, ఏ గల్లికి, ఏ ఇంటి తలుపు తట్టినా ఆ విషాదకరమైన సంఘటననే తలచుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. కేవలం మృతుల కుటుంబాల్లోనే కా దు.. గ్రామస్తులందరిలోనూ నిస్తేజం. పదేళ్ల చి న్నారి నుంచి పండు ముసలి వరకు ఎవర్ని తట్టినా గుండెచెరువే.. అందరి కళ్లలోనూ ఇదే విషాదం. నిన్నటివరకు ఆ దారి గుండా అంజన్న చెంతకు వెళ్లాలనుకున్న భక్తులు ఇప్పుడు ఆ మార్గమంటేనే వెనకడుగు వేస్తున్నారు. ఆర్టీసీ యాజమాన్యం డీజి ల్ పొదుపు.. లాభాపేక్ష ఆ ఊళ్లను వల్లకాడుగా మార్చింది. మృతులపై ఆధారపడ్డ కుటుంబాలను ఛిద్రం చేసింది. పిల్లలపై తల్లిదండ్రులు.. తల్లిదండ్రులపై ఒకరికొకరు పెట్టుకున్న ఆశలను అడియాశలు చేసింది. గణేష్ విగ్రహాలను కూడా ఏర్పాటు చేసుకోలేక గణేష్ ఉత్సవాలకు దూరంగా ఉంటూ.. వాళ్ల బాధను ఎవరికీ చెప్పుకోలేక, ఏం చేయాలో అర్థం కాక విషాదవదనంతో ఉన్నారు. మండపాలు ఎక్కని గణేష్ విగ్రహాలు.. పండుగకు దూరంగా పల్లెలు హిమ్మత్‌రావుపేటలో ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ముందుగానే యూత్ సంఘాలు, కుల సంఘాలు గ్రామాలకు చెందినవారు మండపాలను ఏర్పాటు చేసుకున్నారు. నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు డబ్బులు చెల్లించి విగ్రహాలను కూడా తెచ్చుకున్నారు. కానీ ఇంతలోనే కొండగట్టు ప్రమాదం రూపేణా ఆ ఊరికి చెందిన 10 మందిని కబళించింది. మొత్తం మృతుల్లో 60 మంది ఉంటే ఈ ఒక్క గ్రామానికి చెందిన వారే 10 మంది. దీంతో ఆ విగ్రహాలను గ్రామపంచాయతీ కార్యాలయాలు, పెద్ద మనుషుల ఇళ్లలో పెట్టి ఆ తర్వాత మండపాలకు పరిస్థితి లేకపోయింది. ఎందుకంటే ఈ ఊరిలో ప్రాణాలు కోల్పోయిన 10 మంది కూడా నిత్యం గ్రామస్తులతో ఐక్యంగా కలిసిమెలిసి ఉండేవాళ్లే. నిన్నమొన్నటి వరకు తమతో కలిసి తిరిగిన వాళ్లు నిత్యం మాట్లాడిన వాళ్లు లేకపోవడం ఆ బాధను తట్టుకోలేక ఆ బాధను ఎవరికీ చెప్పుకోలేక చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ పండగ జరుపులేక గ్రామాలు కళ తప్పాయి. ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రోత్సవాలు వచ్చాయంటే కన్నుల పండువగా జరుపుకునే ఈ పండుగను ఈసారి జరుపుకోలేని పరిస్థితి. అలాగే శనివారంపేట, డబ్బు తిమ్మాయిపల్లె, రాంసాగర్లలోను ఈసారి గణేష్ నవరాత్రులను నిర్వహించడం లేదు. -
డ్రైవర్‌పై ఆర్టీసీ కుట్ర..!
సాక్షి, హైదరాబాద్: కొండగట్టు ఘోర రోడ్డు ప్రమాదం విచారణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. విచారణ మొదలుకాక ముందే.. మరణించిన డ్రైవర్ శ్రీనివాస్‌ను బలిపశువును చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. డ్రైవర్ తప్పుచేశాడంటూ స్థానిక ఆర్టీసీ అధికారులు ప్రాథమిక నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపారు. ఈ విషయాన్ని ఓ దినపత్రికకు లీక్ చేయడంపై శ్రీనివాస్ కుటుంబీకులు, ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఆర్టీసీ అధికారులు నిందను డ్రైవర్‌పై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 62 మందిని బలిగొన్న కొండగట్టు బస్సు ప్రమాదంపై ఆర్టీసీ ఉన్నతాధికారులు బుధవారం రాత్రి సమావేశమయ్యారు. దుర్ఘటనపై ఆర్టీసీ, పోలీసు, ఆర్టీఏ అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వారెవరన్నది మాత్రం ప్రకటించలేదు. ఈలోగా మరునాడు ఉదయం డ్రైవర్ నిర్లక్ష్యమంటూ ఓ దినపత్రికలో కథనం రావడం కలకలం రేపింది. ఆర్టీసీ తన ప్రాథమిక నివేదికలో డ్రైవర్ అప్రమత్తం గా లేడని, బస్సును న్యూట్రల్లో నడిపాడని, బ్రేకుకు బదులు యాక్సిలేటర్ తొక్కాడని ప్రచారం ఎలా చేస్తారని శ్రీనివాస్ కుటుంబీకులు ప్రశ్నిస్తున్నారు. రెండు నాల్కల ధోరణి నా భర్త చనిపోయిన మరునాడు స్థానిక ఆర్ఎం మా ఇంటికి వచ్చారు. నీ భర్త శ్రీనివాస్ మంచోడు అన్నడు, కుటుంబానికి అండగా ఉంటామన్నరు. కానీ, నా భర్తే ప్రమాదం చేసిండని అధికారులు పేపర్లలో రాయించారు. ఇదేం న్యాయం. 30 ఏళ్లలో ఎన్నడూ చిన్న యాక్సిడెంట్ కూడా చేయలేదు. – బూస నాగమణి, శ్రీనివాస్ భార్య డ్రైవర్ తప్పేం లేదు బస్సు ప్రమాదం జరిగినప్పుడు నేను వెనుక బస్సులో వస్తున్నా. ప్రయాణికులు దిగిపోవాలని డ్రైవర్ అరిచాడు. ఎదురుగా వస్తున్న రెండు వాహనాలను తప్పించాడు. తాను నిజంగా యాక్సిలేటర్ తొక్కితే ఈ రెండు వాహనాలను ఢీకొట్టేవాడే కదా! ఆయన తప్పు చేశాడనడం సమంజసం కాదు. – శేఖర్ (కొడిమ్యాల), ప్రత్యక్ష సాక్షి బలి చేస్తున్నారు దీనిపై ఆర్టీసీ యూనియన్ సంఘాలు కూడా స్పందించాయి. దేశంలోనే అతిపెద్ద ప్రమాదం ఇది. చివరికి ఎవరి మెడకు చుట్టుకుంటోందోనన్న భయంతో చనిపోయినవాడు బతికిరాడన్న ధీమాతో నేరాన్ని డ్రైవర్‌పై మోపుతున్నారు. – నాగేశ్వరరావు (ఎన్ఎంయూ), రాజిరెడ్డి (ఈయూ) హనుమంత్ (టీజేఎంయూ) -
పోదుపుపై ఉన్న శ్రద్ధ ప్రయాణికుల భద్రతపై లేదు
-
‘కొండగట్టు బాధితులను తక్షణమే ఆదుకోవాలి’
సాక్షి, కరీంనగర్ : కొండగట్టు బస్సు ప్రమాద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రోఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. గురువారం కొండగట్టు బస్సు ప్రమాదంలో గాయపడి కరీంనగర్లో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్సు ప్రమాదానికి ఆర్టీసీ అధికారుల పని ఒత్తిడి, ఓవర్ డ్యూటీనే కారణమని ఆరోపించారు. అంత పెద్ద సంస్థకు ఎండీ లేకపోవటం విచారకరమన్నారు. తక్షణమే ఐఏఎస్ లేదా ఐపీఎస్‌ను ఎండీగా నియమించాలని డిమాండ్ చేశారు. -
కొండగట్టు ప్రమాదం; బస్సు కండక్టర్ స్పందన
సాక్షి, కరీంనగర్: జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో డ్రైవర్ శ్రీనివాస్‌తో పాటు 60 మందికి పైగా ప్రాణాలు కొల్పోయారు. మరికొందరు ప్రాణాలతో పోరాడుతున్నారు. అయితే ఈ ప్రమాదం పూర్తిగా ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదం నుంచి గాయాలతో బయటపడ్డ కండక్టర్ పరమేశ్వర్ మాట్లాడుతూ.. బస్సు ఫిట్నెస్ సరిగా లేకపోవడంతో.. ఘాట్ రోడ్లో బ్రేక్ ఫెయిల్ అయి ఉంటుందని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో తాను బస్సు చివరలో ఉన్నానని అన్నారు. ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్ గట్టిగా అరిచాడని వెల్లడించారు. బస్సు కండీషన్‌పై, ప్రయాణికుల రద్దీపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఎవరు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా తమపై ఒత్తిడి పెంచినట్టు తెలిపారు. ఘాట్ రోడ్డులో శ్రావణమాసం నుంచే బస్సులు నడుపుతున్నట్టు ఆయన తెలిపారు. బస్సులో మొత్తం 114 మంది ఉన్నారని.. అందులో 96 మందికి టికెట్ ఇచ్చానని పేర్కొన్నారు. నలుగురు చిన్నపిల్లలు కాగా, ఏడు ఎనిమిది మందికి పాసులు ఉన్నాయని.. జెఎన్టీయూ వద్ద బస్సు ఎక్కిన ఆరుగురికి ఇంకా టికెట్లు ఇవ్వలేదని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇంధనం పొదుపులో శ్రీనివాస్ ఉత్తమ డ్రైవర్ అందుకున్న సంగతి తెలిసిందే. కాగా ఇంధనం పొదుపు కోసం డ్రైవర్ ఘూట్ రోడ్లో న్యూట్రల్లో వచ్చాడనే ఆరోపణలను పరమేశ్వర్ ఖండించలేదు. ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆయన తెలిపారు. -
కొండగట్టు ప్రమాదం వెలికితీసిన బస్సు
-
కొండగట్టు బస్సు ప్రమాదం.. కారణాలు ఇవే!
సాక్షి, జగిత్యాల : కొండగట్టు ఘాట్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 62కు చేరింది. ఈ ఘటనలో మరో 38 మంది కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. కారణాలు ఇవే.. కొండగట్టు ఘాట్‌రోడ్డు లోయలో పడిన ఆర్టీసీ బస్సును అధికారులు గురువారం వెలికితీశారు. ఈ ఘటనపై విచారణను వేగవంతం చేసిన అధికారులు.. ప్రమాదానికి గురైన బస్సును పరిశీలించారు. ఆర్టీసీ బస్సు కండిషన్లో లేకపోవడం, బ్రేక్ ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. 2007 మోడల్‌కు చెందిన ఆర్టీసీ బస్సు జీవితకాలంలో 12 లక్షల కిలోమీటర్లు తిరగాల్సి ఉండగా.. ప్రమాదానికి గురైన బస్సు మాత్రం 14 లక్షల 95 వేల 116 కిలో మీటర్లు తిరిగిందని గుర్తించారు. 12 లక్షల కిలోమీటర్లు తిరిగిన తర్వాత బస్సును స్క్రాప్ (తుక్కు) కింద భావించి పక్కకు పడేయాలని, కానీ, స్క్రాప్‌గా భావించే బస్సును జగిత్యాల- శనివారంపేట రూటులో ఆర్టీసీ అధికారులు నడపడంతో ఈ ఘోర ప్రమాదం జరిగిందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. రెగ్యులర్ బస్సు, రెగ్యులర్ డ్రైవర్ అయినప్పటికీ కాలం చెల్లిన వాహనం కావడం.. ఘాట్‌రోడ్డులో సరిగ్గా బ్రేక్ వేయడానికి వీలుపడకపోవడంతో ప్రమాదం జరిగిందని విచారణ అధికారులు భావిస్తున్నారు. విచారణకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. బస్సు ఫిట్నెస్ సరిగా లేకపోవడం, బ్రేక్ రాకపోవడం, పరిమితికి మించి ప్రయాణికులు బస్సులో ఉండడం ఈ మహా విషాదానికి కారణమని వారు ప్రాథమికంగా తేల్చినట్టు తెలుస్తోంది. పార్టీ పరంగానూ సహాయం అందజేస్తాం కరీంనగర్లో చికిత్స పొందుతున్న 36మందిని మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ గురువారం పరామర్శించారు. ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వపరంగా రూ. ఐదు లక్షలు, ఆర్టీసీ పరంగా రూ. 3 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని మంత్రి ఈటల తెలిపారు. గాయపడ్డవారికి రెండున్నర లక్షల చొప్పున సహాయం అందిస్తామన్నారు. వారు పూర్తిగా కోలుకునే వరకూ ప్రభుత్వపరంగా వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో తొమ్మిది మందికి రైతు బంధు జీవిత భీమా వర్తిస్తుందని, ఇక, పార్టీ సభ్యత్వం ఉన్న వారికి రెండు లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. రైతుబంధు, పార్టీ సభ్యత్వం వర్తించని వారికి టీఆర్ఎస్ పార్టీపరంగా ఆర్థిక సహాయం అందజేస్తామని మంత్రి ఈటల హామీ ఇచ్చారు. -
కొండగట్టు బస్సు ప్రమాదం పెరిగిన మృతుల సంఖ్య
-
కొండగట్టు ప్రమాదంపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు
కరీంనగర్ జిల్లా: కొండగట్టు బస్సు ప్రమాద ఘటనపై మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)కి కరీంనగర్ లోక్‌సత్తా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ప్రమాదంలో మృతిచెందిన 60 మందికి రూ.20 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాలం చెల్లిన బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడంతోనే ప్రమాద తీవ్రత పెరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్టీసీ ఎండీకి నోటీసులు జారీ చేసి తక్షణ చర్యలు చేపట్టాలని హక్కుల కమిషన్‌ను కోరారు. -
నాన్న దుబాయ్‌లో.. అమ్మ ఆసుపత్రిలో..
సాక్షి, జగిత్యాల (కరీంనగర్): రెండేళ్ల వయసు. తండ్రి దుబాయిలో ఉంటున్నాడు. కొడుక్కి ఆరోగ్యం బాగోలేదని, ఆస్పత్రిలో చూపించాలని బస్సులో బయల్దేరింది ఆ తల్లి. దురదృష్టం వెంటాడి కొడుకు ప్రాణాలు బలితీసుకుంది. కనిపెంచిన తల్లిదండ్రులు కడచూపునకు కూడా నోచుకోలేదు. చివరికి బంధువులే అంత్యక్రియలు జరిపించారు. ఈ హృదయవిదారక సంఘటన అందరినీ కలచివేసింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం శనివారంపేటకు చెందిన గాజుల అశోక్, లత దంపతులు. వీరికి కూతురు శ్రీవాణి, కొడుకు హర్షవర్ధన్ (2) ఉన్నారు. అశోక్ ఏడాది క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. హర్షవర్ధన్ ఆరోగ్యం బాగలేకపోవగడంతో లత చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బస్సు ఎక్కింది. కొండగట్టు ఘాట్ వద్ద జరిగిన ప్రమాదంలో లత కాలు, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. హర్షవర్ధన్ అక్కడికక్కడే చనిపోయాడు. తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. తండ్రి దుబాయ్‌లో ఉండిపోయాడు. బుధవారం బంధువులే అంత్యక్రియలు జరిపించారు. పది రోజుల క్రితమే రాఖీ కడితే అమ్మ దగ్గర డబ్బులు తీసుకుని తనకు ఇచ్చాడని హర్షవర్ధన్ అక్క శ్రీవాణి గుర్తు చేసుకుంటూ గుండెలవిసేలా రోదించిన తీరు పలువురిని కన్నీరు పెట్టించింది. -
ఇక సెలవు...
సాక్షిప్రతినిధి, కరీంనగర్/సాక్షి, జగిత్యాల: ఓ ప్రమాదం 60 నిండు ప్రాణాలను బలిగొంది. తల్లీబిడ్డలను వేరు చేసింది. సురక్షితం అనుకున్న ఆర్టీసీ బస్సు వారి ప్రాణాలను అనం త వాయువులో కలిపేసింది. ఎప్పుడు వెళ్లే దారే అయినా.. అదే చివరి ప్రయాణమని ఎవరూ ఊహించలేదు. పనులు చేసుకుని తిరిగొద్దామనుకున్నారు. కానీ కానరాని లోకాలకు వెళ్లిపోయారు. అంజన్న సాక్షిగా జరిగిన పెను ప్రమాదం అంతులేని విషాదాన్ని నింపింది. ఎన్నో కుటుంబాలను వీధిన పడేసింది. 60 కుటుంబాలను చీకట్లోకి నెట్టేసింది. మృతుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కోదీనగాధ.. ఆ ఏడు గ్రామాలలో మృతుల కుటుంబసభ్యులు, బంధువుల రోదనలే.. ఏఊళ్లో చూసినా కన్నీటి ధారలే.. ఎక్కడ చూసినా వెక్కివెక్కి ఏడ్చేవాళ్లే. శనివారంపేటలో వీధులన్నీ విషాదంలో నిండిపోయాయి. ఒక్కో సంఘటన హృదయ విదారకం... విషాదంలో కుటుంబాలు శనివారం పేటకు చెందిన వరలక్ష్మి బంధువులను కలిసేందుకు కుమారుడితో కలిసి జగిత్యాలకు వెళ్లుతుంది. కొండగట్టు దాటాక కుటుంబ సభ్యులతో మాట్లాడింది. ఈలోపే బస్సు లోయలో పడటంతో అక్కడికక్కడే మరణించింది. కుమారుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భార్యను కోల్పోయి భర్త, తల్లి కోల్పోయి కూతురు విలపిస్తున్నారు. డబ్బు తిమ్మాయిపల్లెకు చెందిన వొడ్నాల కాశీ రాం, లక్ష్మి వృద్ధ దంపతులు జ్వరంతో బాధపడుతున్న కాశీరాం దంపతులు వైద్యం కోసం జగిత్యాలకు వెళ్లుతుండగా ప్రమాదానికి గురై తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయా రు. దీంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. డబ్బుతిమ్మయ్యపల్లెలో ఒక వీధి లో నలుగురు మృతితో విషాదం అలముకుంది. తిర్మలాపూర్‌కు చెందిన తైదల పుష్ప, దుర్గమ్మ కూతురు అర్చన, భవానీలు, పుష్ప బీడీలు చుడుతూ పిల్లల్ని చదివించుకుంటుంది. ఆరోగ్యం బాగోలేని చిన్న కుమార్తె అర్చనను వెంట పెట్టుకోని జగిత్యాలకు బయలుదేరింది. ప్రమాదంలో తల్లి మృత్యువాత పడగా అర్చన తీవ్రంగా గాయపడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తిర్మలాపూర్‌కు చెందిన పడిగెల స్నేహలత డిగ్రీ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. అన్ని ఉద్యోగాలకు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా భావించి కంప్యూటర్ శిక్షణ కోసం కరీంనగర్ వస్తుండగా బస్సు ప్రమాదం కబళించింది. మృతురాలు తండ్రి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ ఇద్దరు కుమార్తెలు, కుమారున్ని చదివిస్తున్నాడు. పెళ్లీడుకు వచ్చిన కూతురు మరణించడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొడిమ్యాల మండలం రాంసాగర్‌కు చెందిన గడ్డం రామస్వామిది వ్యవసాయ కుటుంబం. ఆయన 6 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం భార్య అనితతో కలిసి ఆసుపత్రికి వెళ్తూ ప్రమాదంలో కన్ను మూశాడు. అనిత కాళ్లు, చేతులు విరిగి చికిత్స పొందుతుంది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. రాంసాగర్‌కు చెందిన మేడి చెలిమెల సత్తయ్య భార్య గౌరు బీడీలు చుడుతూ ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారున్ని పోషిస్తుంది. మల్యాలలోని సోదరున్ని చూసేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. తల్లి మృతితో ఆ ఇద్దరు కుమార్తెలు, కుమారుడు గుండెలవిసేలా రోదించారు. కొడిమ్యాల మండలం కోనాపూర్‌కు చెందిన లత జ్వరంతో బాధపడుతున్న కుమార్తె నందనకు చికిత్స కోసం జగిత్యాలకు బయలుదేరింది. బస్సు ప్రమాదంలో తల్లి తీవ్రంగా గాయపడగా, కూతురు నందన అక్కడికక్కడే మృతి చెందింది. జగిత్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి పక్కనే స్ట్రెచర్‌పై విగతజీవిగా ఉన్న కుమార్తె మృతదేహన్ని పోల్చుకోలేక నా బిడ్డ ఎక్కడుంది అంటూ ఆరా తీయడం అందరినీ కలచివేసింది. విషాదం నింపిన ప్రమాదం.. కొండగట్టు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నిలిపింది. శనివారంపేట, హిమ్మత్‌రావుపేట, డబ్బుతిమ్మాయిపల్లి, రాంసాగర్, తిర్మలాపూర్, సంద్రాలపల్లి, రాంపల్లి, కోనాపూర్ ఏడు గ్రామాలు మరుభూములుగా మారాయి. ముక్కు పచ్చలారని చిన్నారులు, చదువుకునే విద్యార్థులు, గర్భిణులు, వృద్ధుద్దులు, వివిధ పనుల కోసం జగిత్యాలకు వెళ్లుతున్న యువతీ యువకులు మహిళలు ఇలా ఎందరో ప్రాణాలు విడిచారు. కొడుకును కోల్పోయిన తండ్రి, కూతురిని కోల్పోయిన తల్లి, భర్తను కోల్పోయిన భార్య, భార్యను కోల్పోయిన భర్త, తండ్రిని కోల్పోయిన పిల్లలు ఎటు చూసినా విషాదమే.. ఎవరిని కదిపినా కన్నీళ్లే నిన్నటి వరకు సంతోషంగా ఉన్న ఆ పల్లెలు ఇప్పుడు తమ వారిని తలుచుకుంటూ దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్నాయి. మృతుల్లో 40 మంది నాలుగు ఊళ్లకు చెందిన వారే. ఒక్క శనివారంపేటలోనే 15 మంది అసువులు బాశారు. ఆ గ్రామంలో ఇప్పుడు ఎక్కడ చూసినారోదనలే. హిమ్మత్‌రావుపేట, డబ్బుతిమ్మాయిపల్లి, రాంసాగర్లోను అదే పరిస్థితి. ఏ ఊళ్లో చూసినా కన్నీటి ప్రవాహమో.. ఏ పల్లెను కదిలించినా ఎవరితో మాట్లాడినా వెక్కివెక్కి ఏడ్చేవారే. -
కన్నీటిపేట
-
రూ. 800.. 60 ప్రాణాలు!
సాక్షి, హైదరాబాద్/జగిత్యాల జోన్: ప్రకృతి ప్రకోపించలేదు.. బాంబులు పేలలేదు.. తూటాలు విరు చుకుపడలేదు.. కేవలం అధికారుల నిర్లక్ష్యమే 60 నిండు ప్రాణాలను బలిగొంది. రూ.800లకు ఆర్టీసీ అధికారులు కక్కుర్తి పడటం వల్లే ఇంతటి ఘోర ప్రమాదం జరిగింది. ఉద్యోగులపై అధికారుల వేధింపులే కొండగట్టు బస్సు ప్రమాదానికి కారణంగా నిలిచాయి. మృతుల సంఖ్య పెరిగేందుకు స్థానిక అధికారుల తీరు కారణమైంది. వారి వేధింపులు, టార్గెట్ల కారణంగా ఎంతో సీనియారిటీ ఉన్న ఉద్యోగులు కూడా రక్షణ చర్యలు పక్కనబెట్టి, ఓవర్‌లోడ్ ఎక్కించుకోవాల్సిన దుస్థితి. ప్రభుత్వం ఆర్టీసీ డిపో మేనేజర్‌ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంది. మెమోలు, వేధింపులు :గ్రామీణ ప్రాంతాల్లో నడిచే పల్లె వెలుగు బస్సుల్లో పెద్దగా ఆక్యుపెన్సీ రేషియో ఉండటం లేదని మొదటి నుంచి ఆర్టీసీ మొత్తుకుంటోంది. దీన్ని అధిగమించేందుకు ఆయా డ్రైవర్లు, కండక్టర్లకు ఎక్కువ మందిని ఎక్కించుకోవాలని టార్గెట్లు పెడుతున్నారు. బస్సు నిండా మంది ఉన్నారని స్టాపులో బస్సు ఆపలేదని తెలిస్తే తెల్లారి ఆ కండక్టర్, డ్రైవర్లకు చుక్కలు చూపిస్తారు. దీంతో అధికారులు చెప్పినట్లు వారు చేయాల్సి వస్తోంది. అదనపు ఆదాయం రూ. 828! కొండగట్టు నుంచి ఘాట్ రోడ్డు ద్వారా జగిత్యాల ప్రధాన రహదారి 3 కి.మీ. దూరం. ఇందుకు బస్సు ఎక్కితే కేవలం రూ.6 చార్జీ. అదే జీపు ఎక్కితే రూ.20కిపైగా వసూలు చేస్తారు. కండక్టర్ కూడా బస్సు సామర్థ్యం కన్నా అదనంగా 10 మందిని ఎక్కించుకున్నా పెద్దగా ప్రమాదం ఉండేది కాదు. దీనికి అదనంగా మరో 36 మందిని ఎక్కించుకోవడం వల్ల బస్సుపై ఓవర్‌లోడ్ పడింది. ఇంతచేస్తే ఈ 36 మంది ద్వారా టికెట్‌కు రూ.23 చొప్పున ఆర్టీసీకి వచ్చే అదనపు ఆదాయం కేవలం రూ.828. మహిళల మరణానికి కారణం ఇదే..! ప్రమాదానికి గురైన బస్సు వాస్తవ సామర్థ్యం 55 సీట్లు. ఈ బస్సు కొండగట్టుకు వచ్చే సరికి అప్పటికే బస్సు నిండా జనం ఉన్నారు. మంగళవారం కావడంతో అక్కడ భారీగా ఉన్న భక్తులంతా బస్సు ఎక్కా రు. మహిళా సీట్లు కాస్త విశాలంగా ఉండటంతో ఐదుగురికిపైగా సీట్లల్లో సర్దుకున్నారు. ఘటనాస్థలి వద్ద ఉన్న స్పీడు బ్రేకర్ల వద్దే బస్సు అదుపు తప్పింది. కుడివైపు ఉన్న ప్రయాణికులుఅంతా డ్రైవరుపై పడిపోవడంతో అతను బస్సును అదుపు చేయలేకపోయాడని స్థానికులు తెలిపారు. దీంతో నేరుగా వెళ్లి పక్కనే ఉన్న కందకంలో పడిపోయింది. బస్సు కుడివైపు భాగం నేలను బలంగా ఢీకొంది. ఈ తీవ్రతకు సీట్ల న్నీ విరిగిపోయాయి. ఆ ధాటికి శరీరాలు నలిగిపోయాయి. ‘ఘాట్’మీదుగా 44 ట్రిప్పులు.. కొండగట్టు ఘాట్ రోడ్డు మీదుగా ఆర్టీసీ వేములవాడ డిపోకు చెందిన 11 బస్సులు రోజూ 44 ట్రిప్పులు కొన్నేళ్లుగా నడుస్తున్నాయి. జగిత్యాల డిపో బస్సును కొడిమ్యాల మండలంలోని రాంసాగర్, హిమ్మత్‌రావుపేట, శనివారంపేట, డబ్బు తిమ్మయ్యపల్లె గ్రామాల కోసం కొంత కాలంగా దొంగలమర్రి మీదుగా నడిపిస్తున్నారు. తిరిగి అదే మార్గంలో వెళ్తుండటంతో ఆర్టీసీకి అనుకున్నంత ఆదాయం రావట్లేదు. దీంతో కొండగట్టు పుణ్యక్షేత్రం మీదుగా వెళ్తే భక్తుల రాకపోకలతో ఆదాయం పెరుగుతుందని జూలై 12 నుంచి దొంగలమర్రి నుంచి రావడం, కొండగట్టు నుంచి కిందకు దిగేలా రూటు మార్చారు. దీంతో కి.మీ.కు ఆదాయం రూ.12 నుంచి రూ.15కు పెరిగింది. దీంతో కొండగట్టు ఘాట్‌రోడ్డు మీద నుంచే బస్సు నడిపిస్తున్నారు. ‘సన్‌షైన్’లో నలుగురికి చికిత్స హైదరాబాద్: కొండగట్టు ప్రమాద ఘటనలో గాయపడిన నలుగురు బాధితులు సికింద్రాబాద్ సన్‌షైన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నలుగురిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. జగిత్యాలకు చెందిన రాజవ్వ (52), సత్తవ్వ (39), శనివారంపేట్కు చెందిన రాజయ్య (50), తిమ్మాయిపల్లికి చెందిన విజయ (45)లను బుధవారం రాత్రి జగిత్యాల నుంచి సన్‌షైన్ ఆస్పత్రికి తీసుకుని వచ్చారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉందని మరో 48 గంటలు గడిస్తే కానీ ఏది చెప్పలేమని డాక్టర్లు వెల్లడించారు. వీరి చికిత్సకు అయ్యే ఖర్చును ఆర్టీసీ భరిస్తుందని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ వినోద్ కుమార్ ఆస్పత్రికి లేఖ రాసి ఇచ్చారు. దీంతో వీరికి ఆస్పత్రి వైద్యులు చికిత్స మొదలుపెట్టారు.