రహదారుల రక్తదాహం | 17 people dies across Telangana an average of 55 road accidents per day | Sakshi
Sakshi News home page

రహదారుల రక్తదాహం

Published Tue, May 21 2019 1:51 AM | Last Updated on Tue, May 21 2019 1:51 AM

17 people dies across Telangana an average of 55 road accidents per day - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రహదారులు రక్తమోడుతున్నాయి.. రోడ్డుమీద రయ్యిమని దూసుకుపోతున్న వాహనాలు క్షణాల్లో ప్రమాదాల తలుపు తడుతున్నాయి. ఇష్టానుసారంగా వెళ్తున్న వాహనాలు ప్రమాదాలకు కారణమవుతూ నేరుగా ప్రయాణికులను యమపురికి చేరుస్తున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం ప్రమాదాలకు ప్రధాన కారణంగా చెబుతున్నారు రోడ్డు భద్రతా అధికారులు. రోడ్డు రవాణా, రహదారుల శాఖ నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా ఏటా నాలుగు లక్షలకుపైగా ప్రమాదాలు జరుగుతుండగా, 1.6 లక్షల మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షలాది మంది గాయాల పాలవుతున్నారు. వేలాదిమంది వికలాంగులుగా మిగులుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణలో సాలీనా దాదాపు ఆరువేల మంది ప్రజలు మరణిస్తున్నారు. జనవరి 1 నుంచి మే 16 వరకు జరిగిన రోడ్డు ప్రమాదాలు పరిస్థితి తీవ్రతను చెబుతున్నాయి. తెలంగాణవ్యాప్తంగా రోజుకు సగటున 55 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటుండగా అందులో దాదాపు 17 మంది మరణిస్తున్నారు, 64 మంది గాయపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది రోజుకు మరణించిన వారి సంఖ్య సగటున 18 ఉండటం గమనార్హం.

వేగం తొలికారణం
గత పదేళ్లుగా వాహనరంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. దీనికితోడు చక్కటి రోడ్లు, జాతీయ రహదారులు అందుబాటులోకి వచ్చాయి. గతంలో రోడ్డు మీద వ్యక్తిగత వాహనాలు కూడా తక్కువగా ఉండేవి. నేడు హైదరాబాద్‌లోనే కాక జిల్లా ల్లోనూ వ్యక్తిగత వాహనాల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుంది. పెరిగిన వాహన సామర్థ్యం కూడా ప్రమాదాలకు హేతువుగా మారుతోంది. 2000 నుంచి 5000 సీసీల వరకు సామర్థ్యమున్న కార్లు రోడ్ల మీదకు వస్తునాయి. ఇక బస్సుల్లోనూ అంతే. వాహనాల వేగం కనీసం 100 నుంచి 120 కి.మీ.ల స్పీడుకు తగ్గకుండా వెళ్తున్నారు. ఇలాంటి వాహనాలు ప్రమాదాలకు గురైతే.. ప్రాణనష్టం అధికంగా ఉంటుంది. దీనికితోడు ఫిట్‌నెస్‌లేని రవాణా వాహనాలు రోడ్ల మీద తిరగడం కూడా ప్రమాదాలకు మరో ప్రధాన కారణం.

కొండగట్టు ప్రమాదంలో ఏకంగా 64 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. అప్పటికే ఆ బస్సు 13 లక్షల కిలోమీటర్లు తిరిగి ఫిట్‌నెస్‌ లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇక ప్రైవేటు ట్రావెల్స్‌ స్పీడ్‌కు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. వీళ్లు త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్న ఆత్రుతతో 120 నుంచి 150 కి.మీ.ల స్పీడుతో బస్సులను నడుపుతున్నారు. 2013లో డ్రైవర్‌ అతివేగానికి పాలమూరులో బస్సు కల్వర్టును ఢీకొట్టినప్పుడు కూడా 40 మందికిపైగా ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. ఏటేటా రోడ్డు ప్రమాద మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. గతేడాది మొత్తం 6,603 మంది వివిధ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోగా 2019లో మే 17వ తేదీవరకు 2,403 మంది విగతజీవులుగా మారారు. ఈ ఏడాది ముగిసేందుకు మరో ఏడునెలల సమయం ఉంది. ఈ లెక్కన గతేడాది కంటే అధిక ప్రమాదాలు నమోదయ్యే అవకాశం ఉందని రోడ్‌ సేఫ్టీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాల వారీగా.. ప్రమాదాలు..
తాజాగా తెలంగాణవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాలపై రోడ్‌సేఫ్టీ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. ఇందులో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతోపాటు, కరీంనగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట కమిషనరేట్లు కూడా ఉన్నాయి. వీటితోపాటు ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీమ్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి– కొత్తగూడెం, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌ కర్నూల్, జోగులాంబ, నల్లగొండ, సూర్యాపేట, వికారాబాద్‌ జిల్లాల్లో జనవరి 1 నుంచి మే 17 వరకు చోటు చేసుకున్న వివిధ రోడ్డు ప్రమాదాలు జాబితా సిద్ధమైంది.  మరణించినవారి, క్షతగాత్రుల వివరాలు కూడా పొందుపరిచారు. 263 ప్రమాదాలు, 274 మంది మరణాలతో సైబరాబాద్‌ రాష్ట్రంలోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతంగా నమోదవ్వగా, అతి తక్కువగా 28 ప్రమాదాలు, 28 మంది మరణాలు కుమ్రంభీం జిల్లాలో నమోదయ్యాయి. ఈ నివేదిక ప్రకారం.. మే 16వ తేదీనే తెలంగాణలో 72 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా, 16 మంది మరణించారు. 59 మంది గాయపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement