సాక్షి, కొండగట్టు : జగిత్యాల జిల్లాలో పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. జగిత్యాల జిల్లా శనివారంపేట నుంచి బయలు దేరిన ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు కొండగట్టు ఘాట్ రోడ్డు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కొండగట్టుకు వచ్చిన హనుమాన్ భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం కావడంతో కొండగట్టుకు హనుమాన్ భక్తుల తాకిడి ఎక్కుగా ఉంది.
దర్శనం చేసుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో అధిక సంఖ్యలో బస్సెక్కారు. దీంతో ఓవర్‌లోడైన బస్సు అదుపు తప్పి లోయలో పడ్డట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కొండగట్టులో బస్సెక్కిన భక్తులకు కొద్ది క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో మూడు కిలోమీటర్లు దూరం వెళ్తే బస్సు జగిత్యాల హైవే ఎక్కేది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 88 మంది ప్రయాణీకులున్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తమ ఇష్టదైవం దగ్గరకు వచ్చిన భక్తులు ఊహించని ప్రమాదంలో మరణించారు. నిమిష నిమిషానికి మృతుల సంఖ్య పెరుగుతోంది. మృతుల్లో అధిక సంఖ్యలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఉన్నారు. ఊపిరాడకనే ఎక్కువ మంది చనిపోయినట్లు తెలుస్తోంది. అప్పటివరకు తమతో కలిసి ప్రయాణం చేసిన వారిలో చాలా మంది నిర్జీవులుగా మారడంతో బాధితుల దుఃఖానికి అంతేలేకుండా పోయింది. జగిత్యాల ఆసుపత్రి ప్రాంగణం బాధితుల ఆర్తనాదాలతో దద్దరిల్లుతోంది.