2018 : కన్నీటిని మిగిల్చిన కొండగట్టు ప్రమాదం | Flashback 2018 On Crime Incidents | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 28 2018 4:22 PM | Last Updated on Mon, Dec 31 2018 7:51 PM

Flashback 2018 On Crime Incidents - Sakshi

కొండగట్టు ప్రమాదం ఎంతో మంది జీవితాల్లో కన్నీటిని మిగిల్చింది.. కథువా ఘటన మనిషిలో కనుమరుగైన మానవత్వాన్ని చూపింది.. ఉన్నావ్‌ దుర్ఘటన రాజకీయ ఒత్తుడులను చవిచూసింది.. సమాజానికి సిగ్గుచేటుగా దాచేపల్లి ఘటన.. ప్రేమికుడి కోసం భర్తను హత్య చేయించడం మానవ సంబంధాల ఉనికిని చూపెడుతోంది.. ఈ ఏడాది సంచలనం రేపిన ఘటనలను ఓ సారి చూద్దాం..

సంచలనం రేపిన కథువా దుర్ఘటన
(జనవరి 10-17) జమ్మూకశ్మీర్‌లోని కథువాలో 8 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలిక కనిపించకుండా పోయిన వారం రోజుల తర్వాత ఆమె మృతదేహాన్ని కథువా గ్రామానికి కిలోమీటరు దూరంలో గుర్తించారు. ఈ కేసులో ఏప్రిల్‌ 16వ తేదీన విచారణ ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ కేసులో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

విషాదం మిగిల్చిన విమానం
ఆఫ్రికాలోని అల్జీరియాలో ఏప్రిల్‌ 11న జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 257 మంది దుర్మరణం చెందారు. రాజధాని అల్జీర్స్‌ నుంచి టేకాఫ్‌ అయిన విమానం కొద్ది సేపటికే సమీపంలోని పొలాల్లో కుప్పకూలింది. మృతుల్లో ఎక్కువ మంది ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులే ఉన్నారు. 

ఉలిక్కిపడేలా చేసిన ఉన్నావ్‌ ఘటన
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లోని ఓ యువతిపై బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌సింగ్‌ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో బాధితురాలి తండ్రిని ఏప్రిల్‌ 5వ తేదీన అక్రమ ఆయుధాల చట్టం కింద అరెస్ట్‌ చేశారు. ఆయన అదే రాత్రి మృతి చెందడం కలకలం రేపింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమం జరగడంతో.. ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది.

మానవత్వానికి సిగ్గుచేటు.. దాచేపల్లి ఘటన
(మే 3-5) గుంటూరు జిల్లా దాచేపల్లిలో 9 ఏళ్ల బాలికపై 55 ఏళ్ల వృద్దుడు అన్నం సుబ్బయ్య అత్యాచారానికి పాల్పడటం కలకలం సృష్టించింది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు 17 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. చివరకు నిందితుడు గురజాల మండలంలోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ప్రేమికుడు కోసం భర్త హత్య
(మే 7)విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి మండలంలో సరస్వతి అనే వివాహిత పెళ్లైనా వారం రోజులకే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించడం స్థానికంగా కలకలం రేపింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుడిని ప్రేమించిన సరస్వతి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఈ హత్య దుండగులు చేసినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరిపిన పోలీసులు సరస్వతిని నిందితురాలిగా తేల్చారు.

పడవ బోల్తా.. 26మంది మృతి
(మే 15) పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి సమీపంలో గోదావరిలో లాంచీ మునిగిపోయిన ఘటన ఉభయ గోదావరి జిల్లాలను వణికించింది. ఈ దుర్ఘటనలో దాదాపు 26 మంది మృతి చెందారు. మే 15 సాయంత్రం దేవిపట్నం నుంచి కొండమొదలు బయలుదేరిన లాంచీ సుడిగాలుల తీవ్రతకు బోల్తాపడింది.

మేనమామే.. మృగంలా మారి!
(జూన్‌ 15) మానసిక వికలాంగులైన చిన్నారులను సొంత మేనమామే దారుణంగా హత్య చేశాడు. మిర్యాలగూడలోని తన అక్క వద్ద నుంచి పిల్లల్ని తన రూమ్‌కు తీసుకువచ్చిన మల్లికార్జునరెడ్డి ఈ అమానవీయ చర్యకు పాల్పడ్డాడు. చివరకు నిందితుడు మృతదేహాలను అర్ధరాత్రి కారులో తరలిస్తూ పోలీసులకు చిక్కాడు.

ఎనిమిదేళ్ల బాలికపై..
(జూన్‌ 26) మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో ఎనిమిదేళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అతి కిరాతకంగా అత్యాచారనికి పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు వ్యతిరేకంగా మహిళలు మధ్యప్రదేశ్‌ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చేపట్టారు.

ఒకే కుటుంబానికి చెందిన 11 మంది..
(జూలై 1) దేశ రాజధాని ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద రీతిలో చనిపోవడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది.  మూఢ నమ్మకాలపై విశ్వాసంతో.. మోక్షం పొందడం కోసమే వారంతా సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి. వారి ఇంట్లో లభించిన ఆధారాలు కూడా ఈ వాదనకు బలం చేకూర్చేలా ఉన్నాయి.

ఆరుగురు విద్యార్థులు, ఒక వివాహిత గల్లంతు..
(జూలై 14) తూర్పుగోదావరి జిల్లా పశువుల్లంకలో నాటుపడవ గోదావరి నది పాయలో బోల్తా కొట్టిన దుర్ఘటనలో ఆరుగురు విద్యార్థులు, ఒక వివాహిత గల్లంతయ్యారు. చిన్నారులు ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని​ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

అనాథ శరణాలయంలో దారుణం!
(జూలై) బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఓ అనాథ శరణాలయంలో 34 మంది మైనర్‌ బాలికలపై నిర్వాహకుడు బ్రజేష్‌ లైంగిక దాడికి పాల్పడిన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ముంబైకి చెందిన ‘టిస్‌’ చేపట్టిన సోషల్‌ ఆడిట్‌తో ఈ దారుణం బయటపడింది. ఈ ఘటనలో బాధిత బాలికలు ఇచ్చిన వాంగ్మూలాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. 

కరక్కాయతో కాటువేశాడు!
(జూలై) హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలో కరక్కాయ పొడి పేరుతో జరిగిన ఘరానా మోసం వెలుగుచూసింది. బాధితులకు వేల రూపాయలు ఎరగా చూపిన నిందితులు కోట్లాది రూపాయలతో ఉడాయించారు.

ధర్మపురి సంజయ్‌పై ఆరోపణలు
(ఆగస్టు)  ప్రముఖ రాజకీయ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్‌ కుమారుడు సంజయ్‌ నర్సింగ్‌ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు రావడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసులో సంజయ్‌ 20 రోజలు పాటు సారంగపూర్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.

కన్నీటిని మిగిల్చిన కొండగట్టు ప్రమాదం
(సెప్టెంబర్‌ 11) జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో 60 మంది దుర్మరణం పాలయ్యారు. ఆర్టీసీ చరిత్రలోనే అతి పెద్ద బస్సు ప్రమాదంగా ఇది నిలిచింది. ఆర్టీసీ అధికారుల తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విమర్శలు తీవ్ర స్థాయిలో వెలువెత్తాయి.
 
మిర్యాలగూడ పరువు హత్య!
(సెప్టెంబర్‌ 14) మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య తెలుగు రాష్ట్రాలో సంచలనం రేపింది. మిర్యాలగూడకు చెందిన అమృత, ప్రణయ్‌లు ఈ ఏడాది జనవరిలో ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కూతురి ప్రేమ వివాహన్ని తట్టుకోలేకపోయిన మారుతి రావు ప్రణయ్‌ను అంతమొందించాడు. ఈ ఘటనపై సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరిగింది.  పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు.

మావోయిస్టుల చేతిలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హతం!
(సెప్టెంబర్‌ 23) మన్యంలో మాటు వేసిన మావోయిస్టులు విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే కిడారి సోములను దారుణంగా కాల్చి చంపారు. దాదాపు 65 మందితో కూడిన మావోయిస్టు దళం ఈ దాడికి పాల్పడినట్టుగా తెలిసింది. నిఘా వ్యవస్థ వైఫల్యం వల్లనే ఈ దాడి జరిగిందనే విమర్శలు ఉన్నాయి. 

మిస్టరీగా ఖషోగ్గి హత్య
(అక్టోబర్‌ 2) ఇస్తాంబుల్‌లోని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయానికి వాషింగ్టన్‌ పోస్ట్‌ కాలమిస్ట్‌ జమాల్‌ ఖషోగ్గీ హత్యకు గురికావడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. కనీసం ఆయన మృతదేహాం కూడా లభించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఖషోగ్గీ హత్య వెనుక ఉంది సౌదీ అరేబియా ఉందనడానికి తమ దగ్గర ఆధారాలున్నాయంటూ టర్కీ ప్రభుత్వం పేర్కొంది. తనపై విమర్శనాత్మక కథనాలు రాసినందున ఖషోగ్గీని సౌదీ యువరాజు సల్మాన్‌ చంపించారనే ఆరోపణలు వచ్చాయి.

రావణాసురుడి దహణం.. 59మంది దుర్మరణం
(అక్టోబర్‌ 19) పంజాబ్‌ అమృత్‌సర్‌లో దసరా వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. జోడా ఫాటక్‌​ ప్రాంతంలో రావణ దహనాన్ని వీక్షిస్తున్న వారిపైకి రైలు మృత్యువులా దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 59 మంది చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు.

అండమాన్‌లో అమెరికన్‌ టూరిస్ట్‌ హత్య
(నవంబర్) అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో నివసించే సెంటినెలీస్‌ తెగ చేతిలో జాన్‌ అలెన్‌ చౌ అనే అమెరికన్‌ టూరిస్ట్‌ దారుణ హత్యకు గురయ్యారు.  బయటివారి ఉనికిని ఏమాత్రం ఇష్టపడని ‘సెంటినెలీస్‌’ తెగ వారు ఈ చర్యకు పాల్పడ్డారు. కాగా, అలెన్‌  క్రైస్తవ మత ప్రచారం కోసం అక్కడికి వెళ్లారు.

ఆలయంలో విష ప్రసాదం.. 15మంది మృతి
(డిసెంబర్‌ 14) కర్ణాటక చామరాజనగర జిల్లా సుళ్వాడిలోని చిక్క మారమ్మ ఆలయంలో విష ప్రసాదం తిని 15 మంది మృతి చెందటం సంచలనంగా మారింది. ఆధిపత్య పోరు ముసుగులో పగతో ఆలయ ట్రస్ట్‌ అధ్యక్షుడు ఇమ్మడి మహదేవస్వామి తన మనుషులతో ప్రసాదంలో మోనోక్రోటోఫాస్‌ అనే పురుగుల మందు కలిపి ఈ ఘోరానికి పాల్పడినట్టు తెలింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement