Unnao district
-
ఉన్నావ్ కేసు.. నిందితుడికి రెండు వారాల మద్యంతర బెయిల్
లక్నో : ఉన్నావ్ అత్యాచార కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2017 ఉన్నావ్ అత్యాచార కేసులో ఢిల్లీ హైకోర్టు బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్‌కు రెండు వారాల మెడికల్ మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. -
ఎస్ఐ ఇంట్లో గుట్టలుగా కరెన్సీ నోట్ల కట్టలు.. సెల్ఫీలు దిగుతూ..
లక్నో: తన భార్య తీసిన సెల్ఫీ ఫొటో ఓ పోలీసు అధికారిని ఇబ్బందుల్లోకి నెట్టింది. దీంతో, సదరు పోలీసు అధికారి బదిలీ కావాల్సి వచ్చింది. ఇంతకీ ఆ సెల్ఫీ ఫొటోలో ఏం ఉందనుకుంటున్నారా?. అక్షరాల 14 లక్షల రూపాయల నోట్ల కట్టలు. కాగా, కరెన్సీ నోట్లతో దిగిన సెల్ఫీ వైరల్ కావడంతో పోలీసులు సదరు అధికారిపై చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఉన్నావ్ జిల్లా బెహతా ముజావర్ పోలీస్ స్టేషన్లో రమేష్ చంద్ర సహాని ఎస్ఐగా పని చేస్తున్నారు. అయితే, ఇటీవల సహాని భార్య, అతని పిల్లలు వారి ఇంట్లో ఉన్న రూ.500 నోట్ల కరెన్సీ కట్టలతో సెల్ఫీ తీసుకున్నారు. ఆ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇక, సెల్ఫీ ఫొటో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. దీంతో, రంగంలోకి దిగిన అధికారులు.. సహానిపై విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో సహానిని వెంటనే మరో ప్రాంతానికి బదిలీ చేశారు. అయితే, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిని ఫొటోలో 14 లక్షల రూపాయల విలువైన నగదును ఒక బెడ్‌పై పెట్టి.. ఆ నోట్ల కట్టల పక్కన సహానీ భార్య , ఇద్దరు పిల్లలు కూర్చోని ఫొటోకు స్టిల్ ఇచ్చారు. ఇక, ఈ ఫొటోపై ఎస్ఐ సహాని క్లారిటీ ఇచ్చారు. ఆ ఫోటో నవంబర్ 14, 2021న తాను కుటుంబ ఆస్తిని విక్రయించినప్పుడు తీసుకున్నదని చెప్పుకొచ్చాడు. మరోవైపు.. ఈ ఘటనపై పోలీసు అధికారులు మాట్లాడుతూ.. రమేష్ చంద్ర సహానికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసు భార్య, పిల్లలు సెల్ఫీలో చూపించిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై విచారణ జరుపుతున్నాము. ఆ ఫోటోలో ఆ పోలీసు అధికారి భార్య , అతని పిల్లలు ఉన్నారు. వారు నోట్ల కట్టలను చూపిస్తూ.. ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం పోలీసు అధికారి బదిలీ చేయబడ్డారు. అతనిపై దర్యాప్తు కొనసాగుతోంది అని తెలిపారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలను మీడియాకు తెలియజేస్తామని తెలిపారు. ఇది కూడా చదవండి: గేదెను గుద్దిచంపిన కేసు.. 28 ఏళ్ల తర్వాత ఆ పెద్దాయనకి షాక్ -
Savitri Devi: నిందలు పడి కూతుర్ని విజేతను చేసింది
‘కూతుర్ని ఎవరికో అమ్మేసింది. ఏ తప్పుడు పనుల్లోనో పెట్టింది’... భర్త చనిపోయిన సావిత్రి తన కూతుర్ని పొరుగూరి స్కూల్లో చేర్చాక ఊరి ఆడవాళ్ల నుంచి ఎదుర్కొన్న నింద అది. ‘ఏమైనా సరే నా కూతురు క్రికెట్ ఆడాలి’ అనుకుంది సావిత్రి. అందుకే ఘోరమైన పేదరికంలో కూడా కూతురి కలలకు అండగా నిలబడింది. ఇవాళ ఆ కూతురు– అర్చనా దేవి ప్రపంచ విజేతగా నిలిచింది. ‘అండర్– 19’ క్రికెట్ జట్టులో బౌలర్‌గా, ఫీల్డర్‌గా రాణించి ఫైనల్స్ గెలవడంలో కీలకంగా మారింది. ఆడపిల్లల ఆకాంక్షలకు ఎన్ని అవరోధాలు ఉన్నా తల్లి గట్టిగా నిలబడితే కొండంత బలం అని తల్లులకు ఈ స్ఫూర్తిగాథ సందేశం ఇస్తోంది. సౌత్ ఆఫ్రికాలో అండర్ 19 టి 20 మహిళా ప్రపంచకప్. 16 దేశాలు తలపడ్డాయి. మన అమ్మాయిలు కప్ సాధించారు. మొత్తం 16 మంది టీమ్. ఒక్కొక్కరు శివంగిలా మారి అన్ని జట్లతో తలపడ్డారు. ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ను అతి తక్కువ స్కోర్ (68) వద్ద కట్టడి చేసి 14 ఓవర్లకే మూడు వికెట్ల నష్టానికి విజయం సాధించారు. ఇంగ్లాండ్ జట్టును బౌలర్లు హడలగొట్టారు. వారిలో టిటాస్ సాధు, పార్శవి కాకుండా మూడో బౌలర్ ఉంది. అర్చనా దేవి. కీలకమైన రెండు వికెట్లు పడగొట్టడమే కాకుండా ఒక అద్భుతమైన క్యాచ్ పట్టి మూడవ వికెట్ పడేందుకు కారణమైంది. వరల్డ్ కప్‌లో ప్రతి ఒక్కరిదీ ఒక విజయగాథే అయినా అర్చనా దేవిది భిన్నమైనది. కష్టాలను తట్టుకుని అర్చనా దేవి (18) సొంత ఊరు ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ జిల్లాలోని రతై పూర్వ. గంగానది ఒడ్డునే వీరి పొలం. ఊరు. వరదలతో ఆ పొలం సంవత్సరంలో సగం రోజులు మునకలో ఉండేది. మిగిలిన సగం రోజుల్లో తండ్రి శివరామ్ వ్యవసాయం సాగించేవాడు. కాని ఆయనను 2008లో కేన్సర్ కబళించింది. దాంతో ఊళ్లో ఆడవాళ్లందరూ అర్చనా తల్లి సావిత్రిదేవిని నష్ట జాతకురాలిగా పరిగణించసాగారు. సావిత్రి వెరవలేదు. ఇద్దరు కొడుకులను, కూతురైన అర్చనను రెక్కల కింద పెట్టుకుని సాకసాగింది. దురదృష్టం... ఆఖరు కొడుకు బుద్ధిమాన్ కూడా మరణించాడు. దాంతో సావిత్రిని చూస్తే చాలు ఊరు దడుచుకునేది. ‘ఇదో మంత్రగత్తె. మొదట భర్తను మింగింది. తర్వాత కొడుకును’ అని... ఎదురుపడితే పక్కకు తప్పుకునేవారు. సావిత్రి దేవి ఇంకా రాటు దేలింది. పిల్లల కోసం ఎలాగైనా బతకాలనుకుంది. కూతురి క్రికెట్ అర్చనకు క్రికెట్ పై ఆసక్తి, పట్టు కూడా సోదరుడు బుద్ధిమాన్ వల్ల వచ్చినవే. అతను అర్చనను వెంటబెట్టుకుని పొలాల్లో క్రికెట్ ఆడేవాడు. తోడుగా అర్చన బ్యాటు ఝళిపించేది. అర్చన టాలెంట్‌ను బుద్ధిమాన్ వెంటనే గమనించాడు. ‘నువ్వు క్రికెటర్‌వి కావాలి’ అనేవాడు. అర్చన ఆశలు పెట్టుకుంది కాని తల్లి పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు బుద్ధిమాన్ బాల్ని కొడితే అది దూరంగా చెత్తలో పడింది. వెళ్లి చేతులతో చెత్తను కదిలిస్తూ ఉంటే పాము కరిచింది. తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి ఆటోలో ఆస్పత్రికి తీసుకెళుతుంటే కొన ఊపిరితో ఉన్న బుద్ధిమాన్ ‘అర్చనను క్రికెట్ మాన్పించవద్దు’ అని చెప్పి మరణించాడు. ఆ రోజు సావిత్రి సంకల్పించుకుంది ఎలాగైనా అర్చనను క్రికెటర్ చేయాలని. స్కూల్లో చేర్చి అర్చన క్రికెట్ కొనసాగాలంటే చదువును, ఆటలను నేర్పించే స్కూల్లో చేర్పించాలని సావిత్రి నిశ్చయించుకుంది. తమ పల్లెకు 20 కిలోమీటర్ల దూరంలో ఉండే గంజ్ మొరాదాబాద్‌లోని గర్ల్స్ బోర్డింగ్ స్కూల్లో చేర్పించింది. వాళ్లుండే పల్లె నుంచి అలా మరో ఊరి బోర్డింగ్ స్కూల్లో ఏ ఆడపిల్లా చేరలేదు. అందుకని ఊరి ఆడవాళ్లు సావిత్రిని అనుమానించారు. కూతుర్ని ఎవరికో మంచి బేరానికి అమ్మేసి ఉంటుందని అనేవారు. చెడ్డ పనుల కోసం ఊరు దాటించింది అనేవారు. అవన్నీ సావిత్రీదేవి నిశ్శబ్దంగా భరించింది. కొడుకును ఢిల్లీలో బట్టల ఫ్యాక్టరీలో పనికి పెట్టి తమకున్న ఒక ఆవు, ఒక బర్రె పాల మీద ఆధారపడి కూతురి ఖర్చులను అతి కష్టం మీద చూసేది. ‘నేను ఉన్నాను’ అని అర్చనకు ధైర్యం చెప్పేది. దశ తిరిగింది బోర్డింగ్ స్కూల్లోని ఒక టీచరు అర్చన ప్రతిభను గమనించి కాన్పూరులో ఉండే కోచ్ కపిల్ పాండే దృష్టికి తీసుకెళ్లింది. ఆ టీచరు తీసిన అర్చన బౌలింగ్ వీడియోలు చూసిన కపిల్ పాండే వెంటనే కాన్పూరుకు పిలిపించి అక్కడి క్రికెట్ అసోసియేషన్‌లో జాయిన్ చేసి తన శిష్యురాలిగా తీసుకున్నాడు. కపిల్ పాండే క్రికెటర్ కుల్దీప్ యాదవ్‌కు కూడా కోచ్ కావడంతో కుల్దీప్ యాదవ్ అర్చనను ప్రోత్సహించాడు. ఆమె శిక్షణకు సాయం అందించాడు. అతిథులయ్యారు ‘ఒకప్పుడు మా ఇంట నీళ్లు కూడా ఎవరూ తాగలేదు. ఇవాళ అందరూ అతిథులుగా వచ్చి మీ దశ తిరిగింది అని భోజనం చేస్తున్నారు’ అంది అర్చన తల్లి సావిత్రి. వాళ్ల ఊరిలో ఆ కుటుంబం ఇప్పుడు సగర్వంగా నిలబడింది. తల్లి తన కూతురి ద్వారా అలా నిలబెట్టుకుంది. ఆ తల్లీకూతుళ్లను చూసి ఊరు మురిసిపోతోందిగాని అది ఎన్నో ఎదురీతల ఫలితం. ఎవరో అన్నట్టు... అపజయాల ఆవల విజయ తీరం ఉంటుంది. అర్చన విజయానికి తెడ్డు వేసిన నావ– ఆ తల్లి సావిత్రీ దేవి. అందుకే అర్చన విజయంలో సగం ఆ తల్లిదే. ఇంగ్లాండ్‌తో ఫైనల్స్‌లో అర్చన క్యాచ్ ప్రపంచ విజేత మన జట్టు -
ట్రెండ్ మారింది.. అర్ధరాత్రి మద్యం కోసం ఆమె ఏం చేసిందంటే?
ఇప్పటి వరకు పలు సందర్భాల్లో పురుషులే రాత్రి సమయాల్లో లిక్కర్ షాపులను షటర్లను ధ్వంసం చేసి దొంగతనానికి పాల్పడిన ఘటనలు చాలానే చూశాము. కానీ, ఇక్కడి ఓ మహిళ లిక్కర్ షాప్‌లో వైన్‌ను దొంగలించే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో రాత్రివేళ ఓ మహిళ దొంగతనానికి పాల్పడింది. లిక్కర్ కోసం ఏకంగా వైన్ షాపునే టార్గెట్ చేసిన మహిళ తాళం వేసి ఉన్న షటర్‌ను పగులగొట్టేందుకు తీవ్ర ప్రయత్నం చేసింది. పెద్ద రాడుతో లిక్కర్ షాపు వద్దకు వచ్చిన సదరు మహిళ.. తాళం పగులగొట్టేందుకు శ్రమించింది. షాపు తాళం ఎంతకు రాకపోవడంతో తీవ్ర నిరాశకు లోనైంది. ఈ క్రమంలో అటుగా వస్తున్న పోలీసు పెట్రోలింగ్ వాహనం సౌండ్ విని అక్కడి నుంచి పారిపోయింది. ఇదంతా షాపు బయట ఉన్న సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. उन्नाव में लड़कियों के हौसले बुलंद : CCTV कैमरे में कैद हुई घटना, लड़कियों ने ज्वेलरी शॉप का ताला तोड़ा वीडिओ हुआ वायरल....#viralvideo #SocialMedia #Unnao #ViralVideos #Viral #UPPolice @unnaopolice pic.twitter.com/vsEUDPEh0E — Nedrick News (@nedricknews) December 3, 2022 -
స్కూల్ ఫీజు కట్టలేదని.. విద్యార్థులను రోజంతా ఎండలో..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ఉన్నావ్ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. స్కూల్ ఫీజు కట్టలేదని విద్యార్థులను రోజంతా ఎండలో కూర్చోబెట్టింది యాజమాన్యం. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బాల్ విద్యా మందిర్ అనే ప్రైవేటు పాఠశాలలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఫీజు కట్టనందుకు టీచర్లు తమను రోజంతా ఎండలోనే కూర్చోబెట్టారని ఓ విద్యార్థిని కన్నీటిపర్యంతమైంది. పరీక్షలు కూడా రాయనివ్వలేదని వాపోయింది. ఫీజు విషయంపై తల్లిదండ్రులకు చెప్పానని, వారు ఒక్కరోజులో చెల్లిస్తామన్నారని పేర్కొంది. ఈ విషయం టీచర్లకు చెప్పినా వినిపించుకోకుండా తమకు ఈ శిక్ష విధించారని రోదించింది. यूपी : उन्नाव के एक प्राइवेट स्कूल में बच्चों की फीस नहीं पहुंची तो पूरा दिन धूप में खड़ा रखा गया एग्जाम नहीं देने दिया, कब हम फ्री स्कूल-अस्पताल पर बात करेंगे? pic.twitter.com/KrBDnL6ity — Nigar Parveen (@NigarNawab) October 17, 2022 పిల్లలని కూడా చూడకుండా విద్యార్థులను రోజంతా ఎండలో కూర్చొబెట్టిన పాఠశాల యాజమాన్యంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. మరి ప్రభుత్వం ఏమేరకు చర్యలు తీసుకుంటుందో చూడాలి. చదవండి: క్షమాపణలు చెప్పు.. లేదా 'లై డిటెక్టర్' పరీక్షకు రా.. -
మానం తీశారు...ఎదిరిస్తే ప్రాణం కూడా!
ఈ ఘోరాన్ని వర్ణించడానికి అక్షరాలు సరిపోవేమో!!. అత్యాచారానికి గురైనా... చట్టం మీద నమ్మకం కోల్పోలేక న్యాయపోరాటానికి దిగిన ఓ అబల... అందుకు భారీ మూల్యమే చెల్లించింది. మొదట మానాన్ని... చివరకు మంటల్లో ప్రాణాన్ని కూడా కోల్పోయింది. ఏడాది కిందట 2018లో ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో అత్యాచారానికి గురైన ఓ అమ్మాయి ఈ గురువారం ముష్కరుల చేతుల్లో కాలిపోయింది. ఒళ్లంతా కాలి... చికిత్స పొందుతూ... 24 గంటలు తిరక్క ముందే కన్నుమూసింది. ఈ ఘటన మన న్యాయ వ్యవస్థలోని ఎన్నెన్నో లొసుగులను కళ్లకు కట్టింది. ఇలాంటి కేసుల్లోని నిందితులకు బెయిల్ వస్తే... ఎలాంటి దారుణాలకు తెగిస్తారో తెలియజెప్పే చర్చకూ తావిచ్చింది. లక్నొ: గురువారం తెల్లవారుఝామున ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ అత్యాచార బాధితురాలిని ఐదుగురు వ్యక్తులు పెట్రోల్ పోసి తగలబెట్టారంటూ వచ్చిన వార్తలు యావద్భారతాన్నీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఏడాది కిందట లైంగిక దాడి చేసిన వ్యక్తులు... ఎదురు తిరిగి న్యాయపోరాటం చేస్తోందన్న కక్షతో పెట్రోల్ పోసి తగలబెట్టడానికి తెగబడ్డారంటే మనం ఏ యుగంలో ఉన్నామన్న ప్రశ్నలు తలెత్తక మానవు. 2018 నాటి అత్యాచారానికి... భారీ ఆందోళనల అనంతరం మార్చిలో ఎఫ్ఐఆర్ నమోదు చేయగా... 10 రోజుల కిందటే ప్రధాన నిందితుడు సుభామ్ బెయిలుపై బయటకు వచ్చాడు. గురువారం తన కేసు విషయమై స్వగ్రామం నుంచి రాయ్‌బరేలీ వెళుతున్న బాధితురాలిని... కాపుకాసి ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు కొందరు వ్యక్తులు. మంటల్లో చిక్కుకుని 112కి ఫోన్ చేసి రక్షించమంటూ ఆర్తనాదాలు చేశారామె. కాలిన గాయాలతో లక్నో ఆసుపత్రికి... అక్కడి నుంచి ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. శుక్రవారం రాత్రి కన్నుమూశారామె. తనపై పెట్రోలు పోసి నిప్పంటించిన వారిలో... అత్యాచార నిందితులు ఇద్దరు ఉన్నారని మరణశయ్యపై వాంగ్మూలం కూడా ఇచ్చారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. సంఘటనపై దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని (సిట్) ప్రభుత్వం నియమించింది. మిన్నంటిన ఆందోళనలు... నిర్భయ తరువాత ఉన్నావ్ ఘటనపై ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ దద్దరిల్లింది. రాజకీయాలకతీతంగా మహిళలు, యువతులు, రాజకీయనాయకులు గొంతు విప్పారు. పార్లమెంటులోనూ, వెలుపలా ఉన్నావ్ ఘటనపై ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ ఘటన పార్లమెంటు ఉభయ సభలనూ కుదిపేసింది. ఉన్నావ్ బాధితురాలికి న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్న ప్రతిపక్షాల ఆందోళనతో పార్లమెంటు అట్టుడికిపోయింది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘటనకి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విధాన్ భవన్ వెలుపల ధర్నా చేశారు. ఓ యువతికి రక్షణ కల్పించలేని రోజుని బ్లాక్‌డేగా వర్ణించారు. ఘటనపై మాయావతి తీవ్రంగా స్పందించారు. సత్వర న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. పాతిక లక్షల సాయం... ఉన్నావ్ అత్యాచార బాధితురాలి మృతికి నష్టపరిహారంగా ప్రభుత్వం పాతిక లక్షలు ప్రకటించింది. ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద ఇల్లు ఇస్తామని కూడా పేర్కొంది. రాజకీయాలతో సంబంధం లేకుండా దోషులెవ్వరైనా కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో పాటు మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా సత్వర చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. తక్షణ పరిష్కారం కోసం కేసుని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి అప్పగించారు. ఆమె మరణం తీవ్ర విషాదకరమని ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ‘దిశ’కి జరిగిన న్యాయం నా కూతురికీ కావాలి.. హైదరాబాద్‌లో ‘దిశ’ కేసులో నిందితులను ఎన్కౌంటర్లో చంపేసిన విధంగానే... తన కూతురిపై అత్యాచారం చేసి, సజీవ దహనం చేసిన వారినీ శిక్షించాలని ఉన్నావ్ మృతురాలి తండ్రి డిమాండ్ చేశారు. తనకి ఏ సాయమూ అక్కర్లేదనీ, తనకి ఏ ఆర్థిక తోడ్పాటూ అక్కర్లేదని అత ను స్పష్టం చేశాడు. రెండు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలి... మైనర్లకు సంబంధించిన అత్యాచార కేసుల్లో రెండు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలంటూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకూ లేఖలు రాయాలని నిర్ణయించాం. దేశ వ్యాప్తంగా 1023 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 704 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో కేసులు విచారణలో ఉన్నాయి. – రవిశంకర్ ప్రసాద్, న్యాయశాఖ మంత్రి మరో ఆడబిడ్డ బలైంది ‘న్యాయం కోసం పోరాడే క్రమంలో దేశంలో మరో కూతురు బలైంది. హృదయం ద్రవించుకుపోయే ఘటన ఇది’ అని రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు. కాగా, ఉన్నావ్ ఉదంతం నేపథ్యంలో ప్రియాంకా గాంధీ బాధితురాలి కుటుంబాన్ని కలిసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధితురాలికి రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కాగా రేపిస్ట్‌లకు ఉరిశిక్ష కన్నా పెద్ద శిక్ష లేదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. యోగి ఆదిత్యనాథ్ బాధ్యత వహించాలి... ఉన్నావ్ అత్యాచార బాధితురాలి మృతికి యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ బాధ్యత వహించాలి. అత్యాచార బాధితురాలు ఎఫ్ఐఆర్ నమోదు చేయమని కోరినప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులు ఏమయ్యారు? ఏం చేస్తున్నారు? అత్యాచార నిందితులు ధనికులు కనుకనే పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ విషయాన్ని బాధితురాలి సోదరి నాతో తెలిపారు. – సీపీఎం సీనియర్ నాయకురాలు బృందాకారత్ -
90 శాతం కాలిన గాయాలతో కిలోమీటర్ నడిచి..
న్యూఢిల్లీ : నిందితుల చేతిలో సజీవ దహనానికి గురైన ఉన్నావో బాధితురాలు ప్రస్తుతం ఢిల్లీలోని సప్ధర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావోలో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలిని గురువారం ఇద్దరు నిందితులతో సహా మరో ముగ్గురు అపహరించి పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలసిందే. గురువారం ఉదయం కోర్టు విచారణ కోసం రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న యువతిని నిందితులు అపహరించి పెట్రోల్ పోసి నిప్పటించి పరారయ్యారు. తమపై కేసు పెట్టిందన్న అక్కసుతోనే నిందితులు ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. అయితే ప్రమాదానికి గురైన బాధితురాలు కాలిన గాయాలతోనే దాదాపు కిలోమీటరు వరకు నడుచుకుంటూ స్థానికులను రక్షించాలంటూ వేడుకుంది. అనంతరం గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం బాధితురాలిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో అదే రోజు సాయంత్రం కాలిన గాయాలతో ఉన్న యువతిని మెరుగైన వైద్య సేవల నిమిత్తం లక్నో నుంచి విమానంలో ఢిల్లీలోని ఆసుపత్రికి తరలించారు. అయితే యువతి శరీరం 90శాతం కాలిపోయిందని వైద్యులు పేర్కొన్నారు. బాధితురాలి కోసం ప్రత్యేక ఐసీయుని ఏర్పాటు చేశామని, ప్రస్తుతం వైద్యుల బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అయితే బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని, ప్రాణాలతో బయటపడే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఏడాది మార్చిలో తన తల్లిదండ్రుల గ్రామానికి వెళ్లి వస్తున్న24 ఏళ్ల యువతిపై అదే గ్రామానికి చెందిన అయిదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ విషయం విదితమే. అయితే నిందితులపై మహిళ కేసు పెట్టడంతో.. నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇటీవలే బెయిల్‌పై విడుదలైన నిందితుడు.. తమపై కేసు ఉపసంహరించుకోవాలని కోరగా దానికి ఆమె నిరాకరించడంతో తలపై కొట్టి, కత్తితో దాడి చేశారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఘటన అనంతరం అయిదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఇక దిశ కేసులో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసినట్టుగానే ఉన్నావో అత్యాచారం కేసు నిందితులను కూడా ఎన్ కౌంటర్ చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
వైరల్: ఇంగ్లిష్ రెండు లైన్లు చదవలేని టీచర్
లక్నో: కొన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్య ఎంత నాణ్యంగా ఉంటుందో కళ్లకు కట్టే ఉదంతం ఇది. ప్రతిభతో ఉద్యోగం సంపాదించుకుందో, లేకపోతే వేరే దారుల్లో కొలువు కొట్టేసిందో తెలియదు గానీ.. ఆ ఇంగ్లిష్ టీచర్ ఇంగ్లిష్ పాఠ్య పుస్తకంలోని కనీసం రెండు లైన్లు కూడా సరిగా చదవలేక అడ్డంగా దొరికిపోయింది. తనిఖీకి వచ్చిన జిల్లా మెజిస్ట్రేట్ ఆమెను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా సికందర్పూర్ సరౌసిలోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం రోజున ఈ సంఘటన చోటు చేసుకుంది. జిల్లా కలెక్టర్ దేవేంద్ర కుమార్ పాండే ఓ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ ఓ తరగతి గదిలో ఇంగ్లిష్ బోధిస్తున్న ఉపాధ్యాయురాలి బోధన తేడాగా ఉండడంతో ఆమెకు ఇంగ్లిష్ పుస్తకం ఇచ్చి చదవమన్నాడు. ఆమె పిల్లలకంటే దారుణంగా చదవడం మొదలెట్టింది. దీంతో వెంటనే జిల్లా మెజిస్ట్రేట్ ఆమెను విధుల నుంచి తొలగించారు. దీంతో ఉపాధ్యాయురాలితో ఉన్న ప్రధానోపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయులు మెజిస్ట్రేట్‌కు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పిల్లల భవిష్యత్తు ఇలాంటి వారి చేతుల్లో పెడితే వారి భవిష్యత్తు ఏంటి అని జిల్లా కలెక్టర్ ప్రశ్నించడంతో వారు కూడా చేసేదేమీ లేక మిన్నుకుండిపోయారు. -
‘డిసెంబర్ 6లోపే రామ మందిర నిర్మాణం’
ఉన్నావ్(యూపీ): అయోధ్యలోని రామజన్మ భూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా డిసెంబర్ 6లోపే రామ మందిర నిర్మాణం ప్రారంభం కానున్నట్లు శనివారం వివాదస్పద బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టులో రామ మందిర నిర్మాణంపై జరుగుతున్న విచారణ పూర్తికావచ్చిందని తీర్పు వెల్లడించడమే మిగిలి ఉందన్నారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు రామ మందిరానికి అనుకూలంగానే వస్తుందని నొక్కిచెప్పారు. నిరవధికంగా నలభై రోజులపాటు ఇరుపక్షాల వాదనలు విని, విచారించిన సుప్రీంకోర్టు జడ్జీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయోధ్యలో పురావస్తు శాఖ వాస్తవాలను వెలికితీసి సుప్రీంకోర్టుకు సమర్పించిందని, ఇప్పటికే రామ మందిర నిర్మాణానికి షియా వక్ఫ్ బోర్డు అంగీకారం తెలిపిందన్నారు. ఒకవేళ అయోధ్య కేసులో సుప్రీం కోర్టు రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తే అని ప్రశ్నించగా.. ‘నేను సాక్షిని. సుప్రీం కోర్టు ఏ తీర్పు ఇవ్వబోతుందనే అంశంపై నాకు స్పష్టత ఉంది. డిసెంబర్ 6లోపే రామ మందిర నిర్మాణం ప్రారంభమవుతుంద’ని వక్కాణించారు. అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇస్తే, ఆ భూమిని తాము ఎవరికీ ఇవ్వబోమని ఇటీవల లక్నోలో జరిగిన సమావేశంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు తీర్మానించింది. -
2018 : కన్నీటిని మిగిల్చిన కొండగట్టు ప్రమాదం
కొండగట్టు ప్రమాదం ఎంతో మంది జీవితాల్లో కన్నీటిని మిగిల్చింది.. కథువా ఘటన మనిషిలో కనుమరుగైన మానవత్వాన్ని చూపింది.. ఉన్నావ్ దుర్ఘటన రాజకీయ ఒత్తుడులను చవిచూసింది.. సమాజానికి సిగ్గుచేటుగా దాచేపల్లి ఘటన.. ప్రేమికుడి కోసం భర్తను హత్య చేయించడం మానవ సంబంధాల ఉనికిని చూపెడుతోంది.. ఈ ఏడాది సంచలనం రేపిన ఘటనలను ఓ సారి చూద్దాం.. సంచలనం రేపిన కథువా దుర్ఘటన (జనవరి 10-17) జమ్మూకశ్మీర్‌లోని కథువాలో 8 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలిక కనిపించకుండా పోయిన వారం రోజుల తర్వాత ఆమె మృతదేహాన్ని కథువా గ్రామానికి కిలోమీటరు దూరంలో గుర్తించారు. ఈ కేసులో ఏప్రిల్ 16వ తేదీన విచారణ ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ కేసులో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. విషాదం మిగిల్చిన విమానం ఆఫ్రికాలోని అల్జీరియాలో ఏప్రిల్ 11న జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 257 మంది దుర్మరణం చెందారు. రాజధాని అల్జీర్స్ నుంచి టేకాఫ్ అయిన విమానం కొద్ది సేపటికే సమీపంలోని పొలాల్లో కుప్పకూలింది. మృతుల్లో ఎక్కువ మంది ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులే ఉన్నారు. ఉలిక్కిపడేలా చేసిన ఉన్నావ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లోని ఓ యువతిపై బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో బాధితురాలి తండ్రిని ఏప్రిల్ 5వ తేదీన అక్రమ ఆయుధాల చట్టం కింద అరెస్ట్ చేశారు. ఆయన అదే రాత్రి మృతి చెందడం కలకలం రేపింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమం జరగడంతో.. ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. మానవత్వానికి సిగ్గుచేటు.. దాచేపల్లి ఘటన (మే 3-5) గుంటూరు జిల్లా దాచేపల్లిలో 9 ఏళ్ల బాలికపై 55 ఏళ్ల వృద్దుడు అన్నం సుబ్బయ్య అత్యాచారానికి పాల్పడటం కలకలం సృష్టించింది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు 17 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. చివరకు నిందితుడు గురజాల మండలంలోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమికుడు కోసం భర్త హత్య (మే 7)విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి మండలంలో సరస్వతి అనే వివాహిత పెళ్లైనా వారం రోజులకే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించడం స్థానికంగా కలకలం రేపింది. ఫేస్బుక్లో పరిచయమైన యువకుడిని ప్రేమించిన సరస్వతి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఈ హత్య దుండగులు చేసినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరిపిన పోలీసులు సరస్వతిని నిందితురాలిగా తేల్చారు. పడవ బోల్తా.. 26మంది మృతి (మే 15) పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి సమీపంలో గోదావరిలో లాంచీ మునిగిపోయిన ఘటన ఉభయ గోదావరి జిల్లాలను వణికించింది. ఈ దుర్ఘటనలో దాదాపు 26 మంది మృతి చెందారు. మే 15 సాయంత్రం దేవిపట్నం నుంచి కొండమొదలు బయలుదేరిన లాంచీ సుడిగాలుల తీవ్రతకు బోల్తాపడింది. మేనమామే.. మృగంలా మారి! (జూన్ 15) మానసిక వికలాంగులైన చిన్నారులను సొంత మేనమామే దారుణంగా హత్య చేశాడు. మిర్యాలగూడలోని తన అక్క వద్ద నుంచి పిల్లల్ని తన రూమ్‌కు తీసుకువచ్చిన మల్లికార్జునరెడ్డి ఈ అమానవీయ చర్యకు పాల్పడ్డాడు. చివరకు నిందితుడు మృతదేహాలను అర్ధరాత్రి కారులో తరలిస్తూ పోలీసులకు చిక్కాడు. ఎనిమిదేళ్ల బాలికపై.. (జూన్ 26) మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో ఎనిమిదేళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అతి కిరాతకంగా అత్యాచారనికి పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు వ్యతిరేకంగా మహిళలు మధ్యప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది.. (జూలై 1) దేశ రాజధాని ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద రీతిలో చనిపోవడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. మూఢ నమ్మకాలపై విశ్వాసంతో.. మోక్షం పొందడం కోసమే వారంతా సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి. వారి ఇంట్లో లభించిన ఆధారాలు కూడా ఈ వాదనకు బలం చేకూర్చేలా ఉన్నాయి. ఆరుగురు విద్యార్థులు, ఒక వివాహిత గల్లంతు.. (జూలై 14) తూర్పుగోదావరి జిల్లా పశువుల్లంకలో నాటుపడవ గోదావరి నది పాయలో బోల్తా కొట్టిన దుర్ఘటనలో ఆరుగురు విద్యార్థులు, ఒక వివాహిత గల్లంతయ్యారు. చిన్నారులు ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అనాథ శరణాలయంలో దారుణం! (జూలై) బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఓ అనాథ శరణాలయంలో 34 మంది మైనర్ బాలికలపై నిర్వాహకుడు బ్రజేష్ లైంగిక దాడికి పాల్పడిన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ముంబైకి చెందిన ‘టిస్’ చేపట్టిన సోషల్ ఆడిట్‌తో ఈ దారుణం బయటపడింది. ఈ ఘటనలో బాధిత బాలికలు ఇచ్చిన వాంగ్మూలాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. కరక్కాయతో కాటువేశాడు! (జూలై) హైదరాబాద్ కేపీహెచ్బీలో కరక్కాయ పొడి పేరుతో జరిగిన ఘరానా మోసం వెలుగుచూసింది. బాధితులకు వేల రూపాయలు ఎరగా చూపిన నిందితులు కోట్లాది రూపాయలతో ఉడాయించారు. ధర్మపురి సంజయ్‌పై ఆరోపణలు (ఆగస్టు) ప్రముఖ రాజకీయ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ కుమారుడు సంజయ్ నర్సింగ్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు రావడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసులో సంజయ్ 20 రోజలు పాటు సారంగపూర్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కన్నీటిని మిగిల్చిన కొండగట్టు ప్రమాదం (సెప్టెంబర్ 11) జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో 60 మంది దుర్మరణం పాలయ్యారు. ఆర్టీసీ చరిత్రలోనే అతి పెద్ద బస్సు ప్రమాదంగా ఇది నిలిచింది. ఆర్టీసీ అధికారుల తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విమర్శలు తీవ్ర స్థాయిలో వెలువెత్తాయి. మిర్యాలగూడ పరువు హత్య! (సెప్టెంబర్ 14) మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య తెలుగు రాష్ట్రాలో సంచలనం రేపింది. మిర్యాలగూడకు చెందిన అమృత, ప్రణయ్‌లు ఈ ఏడాది జనవరిలో ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కూతురి ప్రేమ వివాహన్ని తట్టుకోలేకపోయిన మారుతి రావు ప్రణయ్‌ను అంతమొందించాడు. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరిగింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. మావోయిస్టుల చేతిలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హతం! (సెప్టెంబర్ 23) మన్యంలో మాటు వేసిన మావోయిస్టులు విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే కిడారి సోములను దారుణంగా కాల్చి చంపారు. దాదాపు 65 మందితో కూడిన మావోయిస్టు దళం ఈ దాడికి పాల్పడినట్టుగా తెలిసింది. నిఘా వ్యవస్థ వైఫల్యం వల్లనే ఈ దాడి జరిగిందనే విమర్శలు ఉన్నాయి. మిస్టరీగా ఖషోగ్గి హత్య (అక్టోబర్ 2) ఇస్తాంబుల్‌లోని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయానికి వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ జమాల్ ఖషోగ్గీ హత్యకు గురికావడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. కనీసం ఆయన మృతదేహాం కూడా లభించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఖషోగ్గీ హత్య వెనుక ఉంది సౌదీ అరేబియా ఉందనడానికి తమ దగ్గర ఆధారాలున్నాయంటూ టర్కీ ప్రభుత్వం పేర్కొంది. తనపై విమర్శనాత్మక కథనాలు రాసినందున ఖషోగ్గీని సౌదీ యువరాజు సల్మాన్ చంపించారనే ఆరోపణలు వచ్చాయి. రావణాసురుడి దహణం.. 59మంది దుర్మరణం (అక్టోబర్ 19) పంజాబ్ అమృత్‌సర్‌లో దసరా వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. జోడా ఫాటక్ ప్రాంతంలో రావణ దహనాన్ని వీక్షిస్తున్న వారిపైకి రైలు మృత్యువులా దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 59 మంది చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. అండమాన్‌లో అమెరికన్ టూరిస్ట్ హత్య (నవంబర్) అండమాన్, నికోబార్ దీవుల్లో నివసించే సెంటినెలీస్ తెగ చేతిలో జాన్ అలెన్ చౌ అనే అమెరికన్ టూరిస్ట్ దారుణ హత్యకు గురయ్యారు. బయటివారి ఉనికిని ఏమాత్రం ఇష్టపడని ‘సెంటినెలీస్’ తెగ వారు ఈ చర్యకు పాల్పడ్డారు. కాగా, అలెన్ క్రైస్తవ మత ప్రచారం కోసం అక్కడికి వెళ్లారు. ఆలయంలో విష ప్రసాదం.. 15మంది మృతి (డిసెంబర్ 14) కర్ణాటక చామరాజనగర జిల్లా సుళ్వాడిలోని చిక్క మారమ్మ ఆలయంలో విష ప్రసాదం తిని 15 మంది మృతి చెందటం సంచలనంగా మారింది. ఆధిపత్య పోరు ముసుగులో పగతో ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు ఇమ్మడి మహదేవస్వామి తన మనుషులతో ప్రసాదంలో మోనోక్రోటోఫాస్ అనే పురుగుల మందు కలిపి ఈ ఘోరానికి పాల్పడినట్టు తెలింది. -
ట్రక్కు, పికప్ వాహనం ఢీ..ముగ్గురి మృతి
ఉత్తర్ ప్రదేశ్ : ఉన్నావో జిల్లాలో చకాలవాన్షి ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ పికప్ వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా..మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమత్తం ఉన్నావో జిల్లా ఆసుపత్రికి తరలించారు. మరో 11 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో కాన్పూర్‌కు తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. -
ఒక్క తప్పు.. 40 మందికి హెచ్ఐవీ
లక్నో: ఓ వ్యక్తి చేసిన తప్పిదానికి 40 మంది జీవితాలు బలయ్యాయి. ఎయిడ్స్ రోగికి ఇచ్చిన సిరంజీతో ఇంజక్షన్ చేయడం వల్ల 40 మందికి హెచ్ఐవీ వైరస్ సోకింది. ఈ విషయం ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వానికి తెలియడంతో హుటాహుటిన విచారణకు ఆదేశించింది. హెచ్ఐవీ సోకడానికి కారణమైన సదరు వ్యక్తిని అరెస్ట్ చేయాలని రాష్ట్ర హోంమంత్రి ఆదేశించారు. హెచ్ఐవీ సోకిన వ్యక్తులను కాన్పూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ కౌన్సెలింగ్ నిర్వహించి చికిత్స కూడా అందిస్తున్నారు. అలాగే ఘటన జరిగిన ఉన్నావో జిల్లాలోని బంగార్మౌ ప్రాంతంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎయిడ్స్ పేషంట్‌కు ఇచ్చిన సూదితోనే ప్రతి రోగికి ఇంజెక్షన్ చేయడం వల్లే అందరికీ హెచ్ఐవీ సోకిందని స్థానికులు చెబుతున్నారు. సంఘటన జరిగిన ప్రాంతంలో విచ్చలవిడి శృంగారం జరుగుతోందని, చాలా మంది డ్రైవర్లకు అవగాహన లేకపోవడం వల్ల తమ లారీలను అక్కడే ఆపి సుఖవ్యాధులు అంటించుకుంటున్నారని చెప్పారు. ఎయిడ్స్‌ను అరికట్టేందుకు ఆ ప్రాంతంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ వారికి హెచ్ఐవీ సోకడంతో బాధితుల కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. -
జిల్లా మొత్తం... మహిళా రాజ్యం!
ఉత్తరప్రదేశ్ అనగానే అక్కడి మహిళల పట్ల వివక్ష, పదే పదే వినిపించే అత్యాచార ఘటనలు, పురుషాధిక్యం ఇవే మనకు తెలుసు. కానీ, ఆ రాష్ట్రంలో ఒక జిల్లా ఉన్నతాధికారులు అందరూ మహిళలే ఉన్నారంటే నమ్మగలరా? అవును.. యూపీలోని ఉన్నావ్ జిల్లాలో ఉన్నతాధికారులు అందరూ మహిళలే. ఇంతకుముందు ఒక్క జిల్లా ఎస్పీ పదవిలో మాత్రం మగ అధికారి ఉండేవారు. కానీ ఇటీవలే 2008 బ్యాచ్ కి చెందిన నేహాపాండే అనే ఐపీఎస్ అధికారిణి ఆ పదవిలోకి రావడంతో మహిళాధిపత్యం సంపూర్ణం అయ్యింది. ఈ విషయాన్ని ఆ జిల్లా కలెక్టర్ సౌమ్యా అగర్వాల్ చాలా ఆనందంగా చెప్పారు. అందరం మహిళలే అయినంత మాత్రాన పని విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండబోదని, తామంతా బాగా పనిచేయడం మీదే దష్టి సారిస్తామని ఆమె అన్నారు. కలెక్టర్ సౌమ్య, ఎస్పీ నేహాలతో పాటు.. జిల్లా పంచాయతీ ఉన్నతాధికారిణి సంగీతా సెంగర్, చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ సందీప్ కౌర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ గ్రేటా యాదవ్, రవాణాశాఖ ఉన్నతాధికారిణి మాలా బాజ్‌పాయ్... ఇలా చెప్పుకుంటూ పోతే అక్కడి మహిళాశక్తి జాబితాకు అంతు ఉండదు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్లుగా జస్జీత్ కౌర్, అర్చనా ద్వివేది పనిచేస్తుండగా.. జిల్లా ప్రొబేషన్ అధికారిణిగా శ్రుతి శుక్లా, శిశు అభివద్ధి ప్రాజెక్టు అధికారిణిగా షెర్రీ మసూద్ ఉన్నారు. ఎన్నికలంటేనే యూపీలో విపరీతంగా కుల,మత ఘర్షణలు చోటుచేసుకుంటాయి. కానీ, ఇటీవల ఉన్నవ్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలను మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా మహిళలే నిర్వహించారు. యూపీ, బిహార్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో లింగవివక్ష చాలా ఎక్కువగా ఉంటోందని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే గత సంవత్సరం ఇచ్చిన నివేదికలో పేర్కొంది. అసలు మొత్తం మహిళలే ఇలాంటి క్లిష్టమైన రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడాన్ని తాను దేశంలో ఎక్కడా చూడలేదని మొన్నటివరకు పోలీసు ఐజీగా పనిచేసి పదవీ విరమణ చేసిన శ్రీధర్ పాఠక్ ప్రశంసించారు. భవిష్యత్తులో వీరు మరిన్ని విజయాలు సాధించాలని ఆశించారు. -
దొరకని బంగారం ఆనవాళ్లు.. కొనసాగుతున్న తవ్వకాలు
ఉత్తరప్రదేశ్ : బంగారం నిధి కోసం శుక్రవారం మధ్యాహ్నం కూడా తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా దౌండియా ఖేరా గ్రామంలో భారీ స్థాయిలో బంగారం నిధి ఉన్నట్లు ముమ్మరంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం తవ్వకాలు ప్రారంభించారు. 12 మంది సభ్యుల బృందం తవ్వాకాల్లో నిమగ్నమైంది. 1,000 టన్నుల బంగార నిధి ఉందని వార్తలు రావడంతో పురావస్తు శాఖ వెలికి తీసేందుకు శతవిధాలా యత్నిస్తోంది. కాగా, ఇంకా బంగారు నిధికి సంబంధించి ఎటువంటి ఆనావాల్లు లభించలేదు. దౌండియా ఖేరా గ్రామంలో 180 ఏళ్ల క్రితం రాజా రామ్‌భక్ష్ సింగ్ శివాలయం నిర్మించారు. ఆ ఆలయం అడుగున వెయ్యి టన్నుల బంగారం నిధి ఉందని ఆ ప్రాంతానికి చెందిన స్వామి శోభన్ సర్కారు చెప్పారు. ఆలయంలో బంగారం నిక్షిప్తమై ఉన్నట్టు తనకు కల వచ్చిందని శోభన్ సర్కారు తెలపడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అంతే కాకుండా ఇక్కడ నిధిని వెలికితీయాలని ఆయన ప్రధానిమంత్రికి, రిజర్వ్ బ్యాంకుకు లేఖలు కూడా రాయడం విశేషం. ఉన్నావ్ ప్రాంతంలో స్వామి శోభన్ కు ఆ ప్రాంతంలో మంచి పేరు ఉండటంతో సర్కారు కూడా అతని మాటల్ని నమ్మింది. ఆయన సత్యమే మాట్లాడాతారని ప్రతీతి. దీంతో పురావస్తు శాఖ కూడా ఆయన మాటలు నమ్మి ఈ ఊళ్లో తవ్వకాలు చేపట్టింది. 60 ఎకరాల సువిశాల ప్రాంతంలో నిధి ఎక్కడు ఉందో కనిపెట్టే పనిలో ప్రస్తుతం ఆ శాఖ నిమగ్నమైంది. ఒక చోట తవ్వితే శబ్దం వేరువిధంగా ఉన్నట్లు గుర్తించటంతో పురావస్తు శాఖ అధికారులు పూర్తిస్థాయిలో తవ్వకాలను శుక్రవారం నుంచి మొదలు పెట్టారు. కాగా, ఇప్పటి వరకూ ఎటువంటి బంగారు నిధి లభించలేదని పురావస్తు శాఖ తెలిపింది. సర్కారు మాత్రం ఆ నిధిపై ఆశలు భారీగానే పెట్టుకున్నట్లు కనబడుతోంది. పలుచోట్ల తవ్వకాలు జరపాలని ప్రభుత్వం వారికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు తవ్వకాలను ముమ్మరం చేశారు. -
'బంగారు' కొండ కోసం తవ్వకాలు ప్రారంభం
లక్నో : బంగారం నిధి కోసం శుక్రవారం తవ్వకాలు మొదలయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా దౌండియా ఖేరా గ్రామంలో భారీ స్థాయిలో బంగారం నిధి ఉన్నట్లు ముమ్మరంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం తవ్వకాలు ప్రారంభించారు. దౌండియా ఖేరా గ్రామంలో 180 ఏళ్ల క్రితం రాజా రామ్‌భక్ష్ సింగ్ శివాలయం నిర్మించారు. ఆ ఆలయం అడుగున వెయ్యి టన్నుల బంగారం నిధి ఉందని ఆ ప్రాంతానికి చెందిన స్వామి శోభన్ సర్కారు చెప్పారు. ఆలయంలో బంగారం నిక్షిప్తమై ఉన్నట్టు తనకు కల వచ్చిందని శోభన్ సర్కారు వెల్లడించాడు. అంతే కాకుండా ఇక్కడ నిధిని వెలికితీయాలని ఆయన ప్రధానిమంత్రికి, రిజర్వ్ బ్యాంకుకు లేఖలు కూడా రాశారు. ఉన్నావ్ ప్రాంతంలో స్వామి శోభన్ సర్కారుకు మంచి పేరుంది. ఆయన సత్యమే మాట్లాడాతారని ప్రతీతి. అందుకే అక్కడివారు ఆయన మాటలు నమ్ముతున్నారు. పురావస్తు శాఖ కూడా ఆయన మాటలు నమ్మి ఈ ఊళ్లో తవ్వకాలు చేపట్టింది. 60 ఎకరాల సువిశాల ప్రాంతంలో నిధి ఎక్కడు ఉందో కనిపెట్టే పనిలో ప్రస్తుతం ఆ శాఖ నిమగ్నమైంది. ఒక చోట తవ్వితే శబ్దం వేరువిధంగా ఉన్నట్లు గుర్తించటంతో పురావస్తు శాఖ అధికారులు పూర్తిస్థాయిలో తవ్వకాలను శుక్రవారం నుంచి మొదలు పెట్టారు. మరోవైపు బంగారం నిధి ఉందని తెలియడంతో ఎక్కడెక్కడో ఉంటున్న దౌండియా ఖేరా గ్రామస్తులు ఇప్పుడు ఊరికి చేరుకున్నారు. మరోవైపు బంగారం నిధి తవ్వకాలు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలన్న పిటిషన్‌ను విచారించేందుకు న్యాయస్థానం అంగీకరించింది. కాగా బంగారం నిధి విలువ సుమారు 3లక్షల కోట్లు ఉంటుందని అంచనా.