దొరకని బంగారం ఆనవాళ్లు.. కొనసాగుతున్న తవ్వకాలు
ఉత్తరప్రదేశ్ : బంగారం నిధి కోసం శుక్రవారం మధ్యాహ్నం కూడా తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా దౌండియా ఖేరా గ్రామంలో భారీ స్థాయిలో బంగారం నిధి ఉన్నట్లు ముమ్మరంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం తవ్వకాలు ప్రారంభించారు. 12 మంది సభ్యుల బృందం తవ్వాకాల్లో నిమగ్నమైంది. 1,000 టన్నుల బంగార నిధి ఉందని వార్తలు రావడంతో పురావస్తు శాఖ వెలికి తీసేందుకు శతవిధాలా యత్నిస్తోంది. కాగా, ఇంకా బంగారు నిధికి సంబంధించి ఎటువంటి ఆనావాల్లు లభించలేదు.
దౌండియా ఖేరా గ్రామంలో 180 ఏళ్ల క్రితం రాజా రామ్‌భక్ష్ సింగ్ శివాలయం నిర్మించారు. ఆ ఆలయం అడుగున వెయ్యి టన్నుల బంగారం నిధి ఉందని ఆ ప్రాంతానికి చెందిన స్వామి శోభన్ సర్కారు చెప్పారు. ఆలయంలో బంగారం నిక్షిప్తమై ఉన్నట్టు తనకు కల వచ్చిందని శోభన్ సర్కారు తెలపడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అంతే కాకుండా ఇక్కడ నిధిని వెలికితీయాలని ఆయన ప్రధానిమంత్రికి, రిజర్వ్ బ్యాంకుకు లేఖలు కూడా రాయడం విశేషం.
ఉన్నావ్ ప్రాంతంలో స్వామి శోభన్ కు ఆ ప్రాంతంలో మంచి పేరు ఉండటంతో సర్కారు కూడా అతని మాటల్ని నమ్మింది. ఆయన సత్యమే మాట్లాడాతారని ప్రతీతి. దీంతో పురావస్తు శాఖ కూడా ఆయన మాటలు నమ్మి ఈ ఊళ్లో తవ్వకాలు చేపట్టింది. 60 ఎకరాల సువిశాల ప్రాంతంలో నిధి ఎక్కడు ఉందో కనిపెట్టే పనిలో ప్రస్తుతం ఆ శాఖ నిమగ్నమైంది. ఒక చోట తవ్వితే శబ్దం వేరువిధంగా ఉన్నట్లు గుర్తించటంతో పురావస్తు శాఖ అధికారులు పూర్తిస్థాయిలో తవ్వకాలను శుక్రవారం నుంచి మొదలు పెట్టారు. కాగా, ఇప్పటి వరకూ ఎటువంటి బంగారు నిధి లభించలేదని పురావస్తు శాఖ తెలిపింది. సర్కారు మాత్రం ఆ నిధిపై ఆశలు భారీగానే పెట్టుకున్నట్లు కనబడుతోంది. పలుచోట్ల తవ్వకాలు జరపాలని ప్రభుత్వం వారికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు తవ్వకాలను ముమ్మరం చేశారు.