జిల్లా మొత్తం... మహిళా రాజ్యం! | an entire district is administered by women in uttar pradesh | Sakshi
Sakshi News home page

జిల్లా మొత్తం... మహిళా రాజ్యం!

Published Tue, Apr 5 2016 12:40 PM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM

జిల్లా మొత్తం... మహిళా రాజ్యం!

జిల్లా మొత్తం... మహిళా రాజ్యం!

ఉత్తరప్రదేశ్‌ అనగానే అక్కడి మహిళల పట్ల వివక్ష, పదే పదే వినిపించే అత్యాచార ఘటనలు, పురుషాధిక్యం ఇవే మనకు తెలుసు. కానీ, ఆ రాష్ట్రంలో ఒక జిల్లా ఉన్నతాధికారులు అందరూ మహిళలే ఉన్నారంటే నమ్మగలరా? అవును.. యూపీలోని ఉన్నావ్‌ జిల్లాలో ఉన్నతాధికారులు అందరూ మహిళలే. ఇంతకుముందు ఒక్క జిల్లా ఎస్పీ పదవిలో మాత్రం మగ అధికారి ఉండేవారు. కానీ ఇటీవలే 2008 బ్యాచ్ కి చెందిన నేహాపాండే అనే ఐపీఎస్‌ అధికారిణి ఆ పదవిలోకి రావడంతో మహిళాధిపత్యం సంపూర్ణం అయ్యింది. ఈ విషయాన్ని ఆ జిల్లా కలెక్టర్‌ సౌమ్యా అగర్వాల్‌ చాలా ఆనందంగా చెప్పారు. అందరం మహిళలే అయినంత మాత్రాన పని విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండబోదని, తామంతా బాగా పనిచేయడం మీదే దష్టి సారిస్తామని ఆమె అన్నారు.

కలెక్టర్‌ సౌమ్య, ఎస్పీ నేహాలతో పాటు.. జిల్లా పంచాయతీ ఉన్నతాధికారిణి సంగీతా సెంగర్, చీఫ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ సందీప్‌ కౌర్, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ గ్రేటా యాదవ్, రవాణాశాఖ ఉన్నతాధికారిణి మాలా బాజ్‌పాయ్‌... ఇలా చెప్పుకుంటూ పోతే అక్కడి మహిళాశక్తి జాబితాకు అంతు ఉండదు. సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్లుగా జస్జీత్‌ కౌర్, అర్చనా ద్వివేది పనిచేస్తుండగా.. జిల్లా ప్రొబేషన్‌ అధికారిణిగా శ్రుతి శుక్లా, శిశు అభివద్ధి ప్రాజెక్టు అధికారిణిగా షెర్రీ మసూద్‌ ఉన్నారు.

ఎన్నికలంటేనే యూపీలో విపరీతంగా కుల,మత ఘర్షణలు చోటుచేసుకుంటాయి. కానీ, ఇటీవల ఉన్నవ్‌ జిల్లాలో పంచాయతీ ఎన్నికలను మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా మహిళలే నిర్వహించారు. యూపీ, బిహార్, మధ్యప్రదేశ్‌ లాంటి రాష్ట్రాలలో లింగవివక్ష చాలా ఎక్కువగా ఉంటోందని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే గత సంవత్సరం ఇచ్చిన నివేదికలో పేర్కొంది.
 
అసలు మొత్తం మహిళలే ఇలాంటి క్లిష్టమైన రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడాన్ని తాను దేశంలో ఎక్కడా చూడలేదని మొన్నటివరకు పోలీసు ఐజీగా పనిచేసి పదవీ విరమణ చేసిన శ్రీధర్‌ పాఠక్‌ ప్రశంసించారు. భవిష్యత్తులో వీరు మరిన్ని విజయాలు సాధించాలని ఆశించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement