న్యూఢిల్లీ : నిందితుల చేతిలో సజీవ దహనానికి గురైన ఉన్నావో బాధితురాలు ప్రస్తుతం ఢిల్లీలోని సప్ధర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావోలో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలిని గురువారం ఇద్దరు నిందితులతో సహా మరో ముగ్గురు అపహరించి పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలసిందే. గురువారం ఉదయం కోర్టు విచారణ కోసం రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న యువతిని నిందితులు అపహరించి పెట్రోల్ పోసి నిప్పటించి పరారయ్యారు. తమపై కేసు పెట్టిందన్న అక్కసుతోనే నిందితులు ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది.
అయితే ప్రమాదానికి గురైన బాధితురాలు కాలిన గాయాలతోనే దాదాపు కిలోమీటరు వరకు నడుచుకుంటూ స్థానికులను రక్షించాలంటూ వేడుకుంది. అనంతరం గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం బాధితురాలిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో అదే రోజు సాయంత్రం కాలిన గాయాలతో ఉన్న యువతిని మెరుగైన వైద్య సేవల నిమిత్తం లక్నో నుంచి విమానంలో ఢిల్లీలోని ఆసుపత్రికి తరలించారు. అయితే యువతి శరీరం 90శాతం కాలిపోయిందని వైద్యులు పేర్కొన్నారు. బాధితురాలి కోసం ప్రత్యేక ఐసీయుని ఏర్పాటు చేశామని, ప్రస్తుతం వైద్యుల బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అయితే బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని, ప్రాణాలతో బయటపడే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఏడాది మార్చిలో తన తల్లిదండ్రుల గ్రామానికి వెళ్లి వస్తున్న24 ఏళ్ల యువతిపై అదే గ్రామానికి చెందిన అయిదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ విషయం విదితమే. అయితే నిందితులపై మహిళ కేసు పెట్టడంతో.. నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇటీవలే బెయిల్‌పై విడుదలైన నిందితుడు.. తమపై కేసు ఉపసంహరించుకోవాలని కోరగా దానికి ఆమె నిరాకరించడంతో తలపై కొట్టి, కత్తితో దాడి చేశారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఘటన అనంతరం అయిదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఇక దిశ కేసులో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసినట్టుగానే ఉన్నావో అత్యాచారం కేసు నిందితులను కూడా ఎన్ కౌంటర్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment