మానం తీశారు...ఎదిరిస్తే ప్రాణం కూడా! | Unnao Women Incident People Demanding For Justice | Sakshi
Sakshi News home page

మానం తీశారు...ఎదిరిస్తే ప్రాణం కూడా!

Published Sun, Dec 8 2019 8:33 AM | Last Updated on Sun, Dec 8 2019 8:34 AM

Unnao Women Incident People Demanding For Justice - Sakshi

ఈ ఘోరాన్ని వర్ణించడానికి అక్షరాలు సరిపోవేమో!!. అత్యాచారానికి గురైనా... చట్టం మీద నమ్మకం కోల్పోలేక న్యాయపోరాటానికి దిగిన ఓ అబల... అందుకు భారీ మూల్యమే చెల్లించింది. మొదట మానాన్ని... చివరకు మంటల్లో ప్రాణాన్ని కూడా కోల్పోయింది. ఏడాది కిందట 2018లో ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో అత్యాచారానికి గురైన ఓ అమ్మాయి ఈ గురువారం ముష్కరుల చేతుల్లో కాలిపోయింది. ఒళ్లంతా కాలి... చికిత్స పొందుతూ... 24 గంటలు తిరక్క ముందే కన్నుమూసింది. ఈ ఘటన మన న్యాయ వ్యవస్థలోని ఎన్నెన్నో లొసుగులను కళ్లకు కట్టింది. ఇలాంటి కేసుల్లోని నిందితులకు బెయిల్‌ వస్తే... ఎలాంటి దారుణాలకు తెగిస్తారో తెలియజెప్పే చర్చకూ తావిచ్చింది.

లక్నొ: గురువారం తెల్లవారుఝామున ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలిని ఐదుగురు వ్యక్తులు పెట్రోల్‌ పోసి తగలబెట్టారంటూ వచ్చిన వార్తలు యావద్భారతాన్నీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఏడాది కిందట లైంగిక దాడి చేసిన వ్యక్తులు... ఎదురు తిరిగి న్యాయపోరాటం చేస్తోందన్న కక్షతో పెట్రోల్‌ పోసి తగలబెట్టడానికి తెగబడ్డారంటే మనం ఏ యుగంలో ఉన్నామన్న ప్రశ్నలు తలెత్తక మానవు. 2018 నాటి అత్యాచారానికి... భారీ ఆందోళనల అనంతరం మార్చిలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయగా... 10 రోజుల కిందటే ప్రధాన నిందితుడు సుభామ్‌ బెయిలుపై బయటకు వచ్చాడు. గురువారం తన కేసు విషయమై స్వగ్రామం నుంచి రాయ్‌బరేలీ వెళుతున్న బాధితురాలిని... కాపుకాసి ఆమె ఒంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు కొందరు వ్యక్తులు. మంటల్లో చిక్కుకుని 112కి ఫోన్‌ చేసి రక్షించమంటూ ఆర్తనాదాలు చేశారామె. కాలిన గాయాలతో లక్నో ఆసుపత్రికి... అక్కడి నుంచి ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. శుక్రవారం రాత్రి కన్నుమూశారామె. తనపై పెట్రోలు పోసి నిప్పంటించిన వారిలో... అత్యాచార నిందితులు ఇద్దరు ఉన్నారని మరణశయ్యపై వాంగ్మూలం కూడా ఇచ్చారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. సంఘటనపై దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని (సిట్‌) ప్రభుత్వం నియమించింది.

మిన్నంటిన ఆందోళనలు...
నిర్భయ తరువాత ఉన్నావ్‌ ఘటనపై ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ దద్దరిల్లింది. రాజకీయాలకతీతంగా మహిళలు, యువతులు, రాజకీయనాయకులు గొంతు విప్పారు. పార్లమెంటులోనూ, వెలుపలా ఉన్నావ్‌ ఘటనపై ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ ఘటన పార్లమెంటు ఉభయ సభలనూ కుదిపేసింది. ఉన్నావ్‌ బాధితురాలికి న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్న ప్రతిపక్షాల ఆందోళనతో పార్లమెంటు అట్టుడికిపోయింది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఘటనకి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ విధాన్‌ భవన్‌ వెలుపల ధర్నా చేశారు. ఓ యువతికి రక్షణ కల్పించలేని రోజుని బ్లాక్‌డేగా వర్ణించారు.  ఘటనపై మాయావతి తీవ్రంగా స్పందించారు. సత్వర న్యాయం జరగాలని డిమాండ్‌ చేశారు. 

పాతిక లక్షల సాయం...
ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి మృతికి నష్టపరిహారంగా ప్రభుత్వం పాతిక లక్షలు ప్రకటించింది. ప్రధానమంత్రి ఆవాజ్‌ యోజన కింద ఇల్లు ఇస్తామని కూడా పేర్కొంది. రాజకీయాలతో సంబంధం లేకుండా దోషులెవ్వరైనా కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో పాటు మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా సత్వర చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రకటించారు. తక్షణ పరిష్కారం కోసం కేసుని ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుకి అప్పగించారు. ఆమె మరణం తీవ్ర విషాదకరమని ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యానించారు. 

‘దిశ’కి జరిగిన న్యాయం నా కూతురికీ కావాలి..
హైదరాబాద్‌లో ‘దిశ’ కేసులో నిందితులను ఎన్‌కౌంటర్లో చంపేసిన విధంగానే... తన కూతురిపై అత్యాచారం చేసి, సజీవ దహనం చేసిన వారినీ శిక్షించాలని ఉన్నావ్‌ మృతురాలి తండ్రి డిమాండ్‌ చేశారు. తనకి ఏ సాయమూ అక్కర్లేదనీ, తనకి ఏ ఆర్థిక తోడ్పాటూ అక్కర్లేదని అత ను స్పష్టం చేశాడు.

రెండు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలి... 
మైనర్లకు సంబంధించిన అత్యాచార కేసుల్లో రెండు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలంటూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకూ లేఖలు రాయాలని నిర్ణయించాం. దేశ వ్యాప్తంగా 1023 ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 704 ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల్లో కేసులు విచారణలో ఉన్నాయి.     
– రవిశంకర్‌ ప్రసాద్,  న్యాయశాఖ మంత్రి

మరో ఆడబిడ్డ బలైంది
‘న్యాయం కోసం పోరాడే క్రమంలో దేశంలో మరో కూతురు బలైంది. హృదయం ద్రవించుకుపోయే ఘటన ఇది’ అని రాహుల్‌గాంధీ ట్వీట్‌ చేశారు. కాగా, ఉన్నావ్‌ ఉదంతం నేపథ్యంలో ప్రియాంకా గాంధీ బాధితురాలి కుటుంబాన్ని కలిసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధితురాలికి రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కాగా రేపిస్ట్‌లకు ఉరిశిక్ష కన్నా పెద్ద శిక్ష లేదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు.

యోగి ఆదిత్యనాథ్‌ బాధ్యత వహించాలి... 
ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి మృతికి యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ బాధ్యత వహించాలి. అత్యాచార బాధితురాలు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయమని కోరినప్పుడు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం, పోలీసులు ఏమయ్యారు? ఏం చేస్తున్నారు? అత్యాచార నిందితులు ధనికులు కనుకనే పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ విషయాన్ని బాధితురాలి సోదరి నాతో తెలిపారు.
– సీపీఎం సీనియర్‌ నాయకురాలు బృందాకారత్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement