2018 సంవత్సరం.. తెలంగాణకు మాయని గాయాలను మిగిల్చింది. ప్రమాదాలు, పరువు హత్యలు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేశాయి. కొండగట్టు బస్సు ప్రమాదం కలవరపరిచింది. టపాసులు పేలి డజను మంది మృత్యువాత పడ్డారు. కులం కోసం ప్రేమించుకున్న వారిని, కన్న వారిని కూడా చూడకుండా కడతేర్చారు. చలికి రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న కుంపటి జీవితాలను బుగ్గిపాలు చేసింది. డబ్బుకు లోకం దాసోహం అన్నట్లుగా మారిన తీరును కొందరు అక్షరాల సత్యం చేశారు. నౌహీరా షేక్ డిపాజిట్ల కుంభకోణం వేల కుటుంబాలను ఆగం చేసింది.
– సాక్షి, హైదరాబాద్
ప్రమాదపు చావులు..
దేశ చరిత్రలోనే భారీ ప్రాణనష్టం కొండగట్టు బస్సు ప్రమాదంలో జరిగింది. సెప్టెంబర్ 12న జరిగిన కొండగట్టు ఘాట్‌రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా పడి 62 మంది ప్రయాణికులను పొట్టన పెట్టుకుంది. ఈ ఘటనతో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. హైదరాబాద్ నుంచి రామగుండం వెళ్లే రాజీవ్ రహదారిపై వరుస రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగించాయి. ఈ ఏడాది మేలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం 11 మందిని బలిగొంది. ప్రముఖ సినీ నటుడు, నందమూరి హరికృష్ణ నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి చెరువుగట్టు వద్ద కారు ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు.
అర్థంలేని పరువు హత్యలు..
ప్రేమించి పెళ్లి చేసుకోవడం నచ్చకపోతే వాళ్ల బతుకు వాళ్లను బతకనివ్వాల్సింది. కానీ అర్థం లేని ఆవేశాలకు పోయి కులాంతర వివాహం చేసుకున్నందుకు కన్న కూతుర్ల జీవితాలనే కాలారాశారు. మిర్యాల గూడలో ప్రణయ్ పరువు హత్య రాష్ట్రంలో సంచలనం రేపింది. తన కూతురిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడని, ప్రణయ్‌ను సుపారీ ఇచ్చి మరీ చంపించాడు అమృత తండ్రి మారుతీరావు. ఇలాంటి ఉదంతమే మంచిర్యాలలో కూడా చోటుచేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్న కన్న కూతురినే తల్లిదండ్రులు, సోదరుడు కలసి గొంతు నులిమి చంపేశారు. కులాంతర వివాహం చేసుకున్నారనే కోపంతో కూతురు, అల్లుడిపై ఎర్రగడ్డలో నడిరోడ్డుపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచాడు ఓ తండ్రి. అదృష్టవశాత్తు వారిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు.
హవాలా హవా..
పైకి పార్శిళ్లలాగే ఉన్నా వాటిలో మాత్రం హవాలా డబ్బు సరఫరా అవుతోంది. హైదరాబాద్ నుంచి ముంబైకి హవాలా డబ్బును ఆంధ్రా పార్శిళ్ల సంస్థ రవాణా చేస్తుండగా రైల్వే పోలీసులు పట్టుకున్నారు. రూ.66 లక్షల హవాలా సొమ్మును సీజ్ చేశారు. ఏకంగా రైళ్లలోనే హవాలా డబ్బు రవాణా జరగడం ఈ ఏడాది చర్చనీయాంశమైంది.
వెయ్యి కోట్లు మింగేసింది..
హీరా గోల్డ్ పేరుతో 8 రాష్ట్రాల్లో డిపాజిట్లు వసూలు చేసినా ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. రూ.వెయ్యి కోట్లకు పైగా పలు రకాల స్కీముల పేరుతో డిపాజిట్ల రూపంలో సేకరించింది ఆ సంస్థ యజమాని నౌహీరా షేక్.
రాజకీయ వేడి..
ఏడాది చివర జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హవాలా డబ్బు ఏరులై పారింది. రూ.125 కోట్లకు పైగా నగదును పోలీస్ శాఖ స్వాధీనం చేసుకోగా, అందులో హవాలా డబ్బే దాదాపు 40 కోట్లకు పైగా ఉంది. వరంగల్ పెంబర్తిలో పట్టుబడ్డ కేసులో మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, కాంగ్రెస్ నేత మద్దిరాజు రవిచంద్ర పేర్లు బయటపడటం కలవరం రేపాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు, విచారణ రాజకీయంగా వేడిని రగిలించాయి. ఎన్నికల ప్రచారం ముగియడానికి ముందు రోజు రేవంత్‌రెడ్డి ముందస్తు అరెస్ట్ పోలీసు శాఖకు, ఉన్నతాధికారులకు మాయని మచ్చగా మిగిలింది. ఈ అరెస్ట్ వ్యవహారంపై హైకోర్టు చేసిన ఘాటు వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
సంచలన తీర్పులు..
2007లో జరిగిన హైదరాబాద్ గోకుల్ చాట్, లుంబినీ పార్క్ జంట పేలుళ్ల కేసులో న్యాయస్థానం ఈ ఏడాది సంచలన తీర్పు వెలువరించింది. నిందితుల్లో ఇద్దరికి ఉరిశిక్ష విధించగా, మరొకరికి జీవిత ఖైదు విధించింది. మద్దెల చెరువు సూరి అలియాస్ గంగుల సూర్యనారాయణరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న భానుకిరణ్‌కు జీవితఖైదు విధిస్తూ సీఐడీ కోర్టు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం శిక్ష ఖరారు చేసింది.
నర్సింగ్ విద్యార్థులకు వేధింపులు..
నర్సింగ్ కాలేజీలను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ మాజీ మంత్రి, రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ కుమారుడు సంజయ్‌ను నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శాంకరీ నర్సింగ్ కాలేజీలోని 11 మంది నర్సింగ్ విద్యార్థినులు దీనిపై నేరుగా హోంమంత్రికి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, పాతబస్తీలోని నిజాం మ్యూజియం నుంచి రూ.300 కోట్ల విలువైన వస్తువులను కొట్టేశారు దుండగులు.
ప్రాణాలు బలితీసుకున్న కుంపటి..
చలి వేస్తుండటంతో వెచ్చదనం కోసం ఇంటిలో పెట్టుకున్న బొగ్గుల కుంపటి ఆరుగురి ప్రాణాలను బలిగొంది. జూబ్లీహిల్స్‌కు చెందిన బుచ్చివేణి, ఆమె కుమారుడు పద్మరాజు పొగకు ఊపిరాడక మృతిచెందగా, ఆ మరుసటిరోజే శామీర్‌పేట బొమ్మరాసిపేట గ్రామంలో కోళ్లఫారంలో పనిచేస్తున్న మహబూబ్‌నగర్‌కు చెందిన నలుగురు వలస కూలీలు ఇదే రీతిలో మరణించడం సంచలనం రేపింది.
కాల్చేసిన బాణసంచా..
రోజువారీ కూలీలుగా పనిచేసుకునే కుటుంబాల్లో అగ్నిప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. వరంగల్ శివారులో బాణసంచా తయారీ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది కూలీలు దుర్మరణం చెందడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కాగా, హైదరాబాద్‌లోని పాతబస్తీ చాంద్రాయణగుట్టలో బాసిత్‌తో పాటు నలుగురిని ఐసిస్ మాడ్యూల్ కోసం పనిచేస్తున్నట్లు గుర్తించి ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment