Hira Group
-
నౌహీరా కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: హీరా గ్రూప్స్ అధినేత నౌహీరా కేసును తెలంగాణ హైకోర్టు బుధవారం సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్‌కి బదిలీ చేసింది. దేశ వ్యాప్తంగా అక్రమ డిపాజిట్లు వసూలు చేసి నౌహిరా షేక్ మోసం చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం నౌహిరా షేక్ చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. హైదరాబాద్‌లో సెప్టెంబర్ 2018న సీసీఎస్ పోలీసులు నౌ హీరా పై కేసు నమోదు చేశారు. అక్టోబర్ 2018లో హీరా షేక్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో 28 మందిని నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. నౌహీరా బ్యాంక్ ఖాతాల్లో జరిగిన లావాదేవీల్లో డిపాజిటర్ల నుండి తీసుకున్న డబ్బుతో పాటు, డిపాజిటర్లకు తిరిగి చెల్లించిన వివరాలు, నిధులు మళ్లించిన వివరాలను సీసీఎస్ పోలీసులు ఛార్జ్ షీట్లో పేర్కొన్న విషయం తెలిసిందే. -
నౌహీరా కేసులో.. పోలీసుల దూకుడు
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా అక్రమ డిపాజిట్లు వసూలు చేసి మోసం చేసిన హీరా గ్రూప్స్ అధినేత నౌహీరా కేసులో సీసీఎస్ పోలీసులు దూకుడుపెంచారు. నౌహీరా షేక్ పై నాంపల్లి కోర్టులో సీసీఎస్ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మొత్తం వెయ్యి పేజీలతో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఛార్జ్ షీట్ లో ఏ1గా నౌహీరా షేక్ పేరును చేర్చారు. ఇప్పటికే నౌహీరా షేక్ చంచల్ గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. నౌ హీరా బ్యాంక్ ఖాతాల్లో జరిగిన లావాదేవీల్లో డిపాజిటర్ల నుండి తీసుకున్న డబ్బుతో పాటు, డిపాజిటర్లకు తిరిగి చెల్లించిన వివరాలు, నిధులు మళ్లించిన వివరాలను సీసీఎస్ పోలీసులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 1.5 లక్షల మంది నౌహీరా బారిన పడ్డారు. ఆరేళ్ల క్రితం హీరా గ్రూప్ కంపెనీని నౌ హీరా ప్రారంభించారు. డిపాజిట్లకి అధిక వడ్డీతో తిరిగి చెల్లిస్తానని, చైన్ పద్ధతిలో స్కీం కు నౌహీరా కంపెనీ తెర లేపింది. ప్రారంభంలో 200 కోట్ల రూపాయాలతో డిపాజిట్లు చేయించుకుంటే, ఇప్పుడు కంపెనీ ఖాతాల్లో 23 కోట్లు రూపాయలు మాత్రమే ఉన్నాయి. గతేడాది మే నుండి డిపాజిట్ దారులకు నౌ హీరా చెల్లింపులు ఆపేసింది. ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సహా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నౌహీరాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లో సెప్టెంబర్ 2018 లో సీసీఎస్ పోలీసులు నౌ హీరా పై కేసు నమోదు చేశారు. అక్టోబర్ 2018 లో హీరా షేక్ ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో 28 మందిని నిందితులుగా చేర్చారు. ఇప్పటి వరకు కేవలం ముగ్గురిని మాత్రమే అరెస్ట్ చేయగా.. మిగతా వారి కోసం గాలింపుచేపట్టారు. -
నౌహీరా షేక్ కార్యాలయాలపై జీఎస్టీ దాడులు
సాక్షి, హైదరాబాద్: నౌహీరా షేక్ వ్యవహారంలో జీఎస్టీ కూడా రంగంలోకి దిగింది. జీఎస్టీలో కోట్లాది రూపాయలు ఎగవేసిన కేసులో జీఎస్టీ అధికారులు శుక్రవారం ఆమె కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) హైదరాబాద్‌లో నౌహీరాకు చెందిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి చెందిన సంస్థ కార్యాలయాలను సీజ్ చేసింది. ఈ దాడుల్లో టోలీచౌకిలోని నదీమ్‌కాలనీలో 20 ఫ్లాట్లు, మాసబ్ ట్యాంక్‌లో 10 ఫ్లాట్లు, కూకట్‌పల్లిలోని ఓ వాణిజ్య సముదాయాన్ని అధికారులు సీజ్‌చేశారు. ఉదయం 10గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా మొత్తం ఏడు బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. ఇందులో భాగంగా బంజారాహిల్స్‌లోని హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రధాన కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించారు. ఈ విషయంలో డీజీజీఐ ఇప్పటికే హీరా గ్రూప్‌నకు నోటీసులు జారీ చేసిందని హైదరాబాద్ జోనల్ ఆఫీసర్ ఎ.శ్రీధర్ తెలిపారు. దాడుల్లో భాగంగా ఎన్‌ఎండీసీలోని ఆసిఫ్ ఫ్లాజాలో ఉన్న హీరా రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్‌లోనూ సోదాలు జరిగాయి. ఇదే సమయంలో నౌహీరాషేక్‌తోపాటు ఆమె అనుచరులు బిజు థామస్, మాలీ థామస్‌లను పీటీవారెంట్ కింద తమకు అప్పగించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరే (ఈడీ) నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ ముగ్గురు నిందితులు ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు. -
‘హీరా’ కేసులో ఆడిటర్ సాయం!
సాక్షి, హైదరాబాద్: ఏదైనా నేరానికి సంబంధించి కేసు నమోదైతే అభియోగపత్రాలను పోలీసులే దాఖలు చేస్తారు.. అయితే స్కీముల పేరుతో వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డ హీరా గ్రూప్ వ్యవహారంలో పోలీసులకు ఆడిటర్ అవసరం వచ్చింది. ఈ సంస్థ ఏం గోల్మాల్ చేసిందనేది ప్రాథమికంగా హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు తేల్చినా.. పూర్తిస్థాయిలో ఓ రూపు తీసుకొచ్చేందుకు ఆడిటర్ అవసరమని భావిస్తున్నారు. అందుకు అనుమతి కోరుతూ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. అనుమతి వస్తే.. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ చరిత్రలోనే హీరా కేసు అరుదైనదిగా కానుంది. ఆరేళ్లలో వేల కోట్ల టర్నోవర్ సాగించి, బ్యాంకు ఖాతాల్లో కనీసం వంద కోట్లు కూడా లేని హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవహారాన్ని సీసీఎస్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. 2010–11లో హీరా ఇస్లామిక్ బిజినెస్ గ్రూప్ పేరుతో నౌహీరా సంస్థ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో ఉన్న 15 సంస్థలకూ ఆమే నేతృత్వం వహిస్తోంది. తన సంస్థల వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఏ విభాగానికీ సరైన రికార్డులు సమర్పించలేదు. ఈమెపై నమోదైన కేసు దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు అనేక మార్గాల్లో కీలక సమాచారం సేకరించారు. దీని ప్రకారం హీరా గ్రూప్ వార్షిక టర్నోవర్ ఆరేళ్లలో కొన్ని వందల రెట్లు పెరిగిందని గుర్తించారు. 2010–11లో రూ.27 లక్షలుగా ఉన్న గ్రూప్ టర్నోవర్.. 2016–17 నాటికి రూ.800 కోట్లు దాటింది. ఇప్పటివరకు దాదాపు రూ.6 వేల కోట్ల వ్యాపారం చేసినట్లు నివేదికలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి రికార్డులు ఎక్కడా అందుబాటులో లేవు. నౌహీరా అరెస్టు సందర్భంలో పోలీసులు ఆమెతో పాటు గ్రూప్‌నకు సంబంధించిన 160 బ్యాంకు ఖాతాలను గుర్తించారు. వీటిలో 130 ఖాతాల వివరాలు సేకరించగా... వాటిలో రూ.25 కోట్లు మాత్రమే ఉన్నాయి. ప్రాథమికంగా 1.7 లక్షలు మంది పెట్టుబడిదారుల జాబితాను పొందగలిగారు. వీటిపై నౌహీరా షేక్ నోరు మెదపకపోవడంతో సాంకేతికంగా ముందుకు వెళ్లాలని భావించారు. ఈ పెట్టుబడులకు సంబంధించి 160 బ్యాంకు ఖాతాల ద్వారా లావాదేవీలు జరిగాయి. హీరా గ్రూప్ భారీ స్థాయిలో డిపాజిట్లు సేకరించి మోసం చేసినట్లు, ఆ నిధుల్ని సొంత అవసరాలకు వినియోగించుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. సర్వర్ ఆధారంగా ముందుకు.. సర్వర్‌లోని వివరాల ప్రకారం డిపాజిట్‌దారులుగా పేర్కొంటున్న 1.7 లక్షల మంది నిజంగా ఉన్నారా.. లేదా బోగస్ వ్యక్తులా.. వారి పెట్టుబడులు ఎటు వెళ్లాయి.. తదితర అంశాలను గుర్తించేందుకు ఆడిటర్ సాయం అవసరమని సీసీఎస్ అధికారులు నిర్ణయించారు. మరోపక్క నౌహీరా షేక్‌తో పాటు ఆమె బినామీల పేర్లతో ఉన్న దాదాపు రూ.వెయ్యి కోట్ల విలువైన స్థిరాస్తుల్ని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆడిటర్ల సాయంతో మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. నౌహీరాపై నేర నిరూపణలో ఇవే కీలకం కానున్న నేపథ్యంలో ఆడిటింగ్ పూర్తయ్యాకే అభియోగాలు దాఖ లు చేయాలని అధికారులు భావిస్తున్నారు. -
హీరా గ్రూప్‌కు వ్యాపారమే లేదు
సాక్షి, హైదరాబాద్: వివిధ రకాల స్కీముల పేరుతో భారీగా డిపాజిట్లు వసూలు చేసి స్కామ్‌కు పాల్పడ్డ హీరా గ్రూప్‌నకు ఎలాంటి వ్యాపారం లేదని గుర్తించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తేల్చి చెప్పింది. కేవలం మనీలాండరింగ్ కోసమే డబ్బు వసూలు చేసినట్లు అనుమానిస్తున్నామని పేర్కొంది. దీనికి సంబంధించి తాము నమోదు చేసిన కేసులో గ్రూప్ సీఈవో నౌహీరా షేక్‌తోపాటు ఆమెకు ప్రధాన అనుచరులుగా భావిస్తున్న మోల్లీ థామస్, బిజూ థామస్‌లను అరెస్టు చేసినట్లు బుధవారం ప్రకటించింది. న్యాయస్థానం అనుమతితో తదుపరి విచారణ నిమిత్తం వారం రోజుల కస్టడీకి తీసుకున్నట్లు తెలిపింది. హీరా గ్రూప్ డిపాజిట్‌దారులకు సాలీనా 36 శాతం వడ్డీతోపాటు బంగారం వ్యాపారంలో పెట్టుబడులంటూ ఎర వేసింది. ఓ దశలో డబ్బు తిరిగి చెల్లించడంలో గ్రూప్ విఫలం కావడంతో అనేక మంది బాధితులుగా మారారు. ఇప్పటివరకు ఈడీ సేకరించిన సమాచారం ప్రకారం 1,72,114 మంది డిపాజిట్‌దారుల నుంచి రూ.3 వేల కోట్లు వసూలు చేసినట్లు స్పష్టమైంది. ఈ డబ్బులో అత్యధిక శాతం తమ సొంత ఖాతాల్లోకి మళ్ళించిన నిందితులు, వాటితో వివిధ ప్రాంతాల్లో స్థిర, చరాస్తులు ఖరీదు చేశారు. హీరా గ్రూప్ బాధితులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ తదితర రాష్ట్రాలతో పాటు యూఏఈ, సౌదీ అరేబియా, మధ్య ఆసియా దేశాల్లోనూ ఉన్నట్లు ఈడీ పేర్కొంది. హీరా గ్రూప్ ముసుగులో నౌహీరా 24 సంస్థల్ని స్థాపించినట్లు, వీటి ఆధారంగా 182 బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు వెలుగులోకి వచ్చింది. వీటికితోడు యూఏఈ, సౌదీ అరేబియాల్లో మరో 10 ఖాతాలు ఉన్నట్లు తేలింది. హీరా గ్రూప్‌తోపాటు దాని ఖాతాదారుల వివరాలు నిర్వహించడానికి బిజు థామస్ తానే ఎండీగా శ్రవణ్ టెక్నాలజీస్ సొల్యూషన్స్ పేరుతో కేరళలో సంస్థను ఏర్పాటు చేసినట్లు ఈడీ తెలిపింది. మొల్లీ థామస్ ఆది నుంచీ నౌహీరా వెంట ఉండి మోసాలకు సహకరించినట్లు ఆరోపించింది. హీరా గ్రూప్ కంపెనీలు, బ్యాంక్ ఖాతాల లావాదేవీలతోపాటు అక్రమ ఆస్తుల విషయాన్నీ కస్టడీలో ఉన్న నిందితుల నుంచి ఈడీ సేకరించనుంది. ఈడీ కస్టడీకి: నౌహీరా షేక్ చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలి సిందే. ఈ కేసులో ఆమెను విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు బుధవారం కోర్టు ఉత్తర్వులతో కస్టడీలోకి తీసుకున్నారు. ఆమెను ఈడీ ఏడు రోజులపాటు విచారించనుంది. ఇదే కేసు లో చంచల్‌గూడ జైల్లోనే రిమాండ్ ఖైదీ లుగా ఉన్న బిజూ థామస్, మౌళి థామస్‌లను కూడా కస్టలోకి తీసుకున్నారు. -
పీఎంఎల్ యాక్ట్ కింద నౌహీరాను విచారిస్తున్న ఈడీ
-
నౌహీరా షేక్‌ను కస్టడీలోకి తీసుకున్న ఈడీ
సాక్షి, హైదరాబాద్ : స్కీముల పేరుతో రూ.వేల కోట్ల స్కామ్‌కు పాల్పడిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యజమాని నౌహీరా షేక్‌ను వారం రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ఈ క్రమంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నౌహీరాను బుధవారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నెల 21 వరకు ఆమెను ప్రశ్నించనున్నారు. ఈ విషయం గురించి ఓ అధికారి మాట్లాడుతూ.. నౌహీరాతో పాటు.. ఆమె సహాయకురాలు మౌలి థామస్, మరో సహాయకుడు విజీని కూడా అరెస్ట్ చేశామన్నారు. పీఎంఎల్ యాక్ట్ కింద నౌహీరాను విచారిస్తున్నామని తెలిపారు. హీరా గ్రూపు దేశ వ్యాప్తంగా 1.72 లక్షల మంది నుంచి రూ.3 వేల కోట్లు వసూలు చేసినట్లు గుర్తించామన్నారు. హీరా గ్రూపు విదేశీయుల నుంచి సైతం డిపాజిట్లు వసూలు చేసి.. ఆ సొమ్మును తమ సొంత ఖాతాల్లోకి మళ్లించినట్లు తెలిసిందన్నారు. హీరా గ్రూప్ దేశ విదేశాల్లో 24 వ్యాపార సంస్థలు నెలకొల్పి.. 18 బ్యాంక్ ఖాతాల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తోందన్నారు. సౌదీ, యూఏఈ దేశాలతో పాటు హీరా గ్రూపుకు మరో 10 బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : పీఎంఎల్ యాక్ట్ కింద నౌహీరాను విచారిస్తున్న ఈడీ ఈడీ అధికారులు నౌహీరా షేక్‌ను తీసుకెళ్లే సమయంలో జైలు నుంచి బయటకు రాగానే ఆమె కింద పడిపోయింది. వెంటనే అధికారులు వచ్చి ఆమెను పైకి లేపారు. నౌహీరా షేక్ ప్రస్తుతం రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్నట్లు జైలువర్గాలు తెలిపాయి. ఆమె బీపీ, షుగర్ లెవల్స్ పడిపోవడంతో ఇలా జరిగిందన్నారు. -
ఈడీ కస్టడీకి నౌహీరా
సాక్షి, హైదరాబాద్: స్కీముల పేరుతో రూ.వేల కోట్ల స్కామ్‌కు పాల్పడిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టిసారించింది. ఈ సంస్థపై నమోదైన కేసును దర్యాప్తు చేసిన పోలీసులు వెలుగులోకి తెచ్చిన అంశాల ఆధారంగా చర్యలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే నౌహీరాను తమ కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయించిం ది. ఆమె కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయగా, 7 రోజుల కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసిం ది. ఈడీ బుధవారం ఉదయం నుంచి 7 రోజు ల పాటు తమ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. నిందితురాలు నౌహీరా షేక్ ఇప్పటి వరకు ఏ దర్యాప్తు సంస్థకీ పూర్తిస్థాయిలో సహకరిచలేదు. హీరా సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారిలో కొందరు బినామీలు ఉన్నారని, మనీలాండరింగ్‌లో భాగంగానే ఈ పెట్టుబడులు పెట్టారని ఈడీ అనుమానిస్తోంది. కీలక వివరాలు సేకరించిన ఈడీ నౌహీరాతో పాటు ఆమె సంస్థలపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్న ఈడీ ఇప్పటికే సీసీఎస్ అధికారులతో భేటీ అయి కీలక వివరాలు సేకరించింది. హీరా గ్రూప్ ఆరేళ్లలో రూ.6 వేల కోట్లు టర్నోవర్ చేసినట్లు గతంలో రిటర్న్స్ దాఖలు చేసింది. 2010–11లో రూ.27 లక్షలుగా ఉన్న గ్రూప్ టర్నోవర్.. 2016–17 నాటికి రూ.800 కోట్లు దాటేసింది. అయితే దీనికి సంబంధించి పూర్తి రికార్డులు అందుబాటులో లేవు. ఆదాయపు పన్ను (ఐటీ), ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ), రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) వీటిలో ఒక్కో విభాగానికి ఒక్కో తరహాలో రిటర్న్స్ ఫైల్ చేసింది. కనీసం డిపాజిట్‌దారుల జాబితా సైతం ఇప్పటి వరకు తనంతట తానుగా బయటపెట్టలేదు. దీంతో అనేక ప్రయత్నాలు చేసిన సీసీఎస్ పోలీసులు హీరా గ్రూప్‌నకు చెందిన సర్వర్‌ను బంజారాహిల్స్‌లోని ఓ ఇంట్లో గుర్తించారు. వీటి ద్వారా ప్రాథమికంగా 1.7 లక్షల మంది ఇన్వెస్టర్ల జాబితాను వెలికితీశారు. విదేశీ కరెన్సీతో పెట్టుబడుల సేకరణ నిబంధనల ప్రకారం విదేశీ పెట్టుబడుల్ని అవసరమైన అనుమతులు తీసుకున్న తర్వాత కేవలం భారత కరెన్సీలోనే స్వీకరించాలి. అయితే ఇప్పటి వరకు సేకరించిన వివరాల ప్రకారం హీరా గ్రూప్ రూ.5,647 కోట్లు భారత కరెన్సీలో భారతీయుల నుంచి డిపాజిట్లు సేకరించింది. దీనికి తోడు 6 లక్షల డాలర్లు, 132 కోట్ల దిరమ్స్, 45 కోట్ల సౌదీ రియాల్స్, 10 కోట్ల కువైట్ దినార్స్ పెట్టుబడులుగా వచ్చాయి. ఇలా విదేశీ కరెన్సీలో పెట్టుబడులు సేకరించడం ఫెమా చట్టానికి వ్యతిరేకం. మరోపక్క ఇప్పటి వరకు హీరా గ్రూప్ భారత్ కరెన్సీలో రూ.2500 కోట్లు, 2 లక్షల డాలర్లు, 120 కోట్ల దిరమ్స్, 1.36 లక్షలు రియాల్స్ డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించినట్లు తేలింది. వీటితో పాటు విదేశీ బ్యాంకుల్లో ఈ సంస్థకు చెందినవిగా అనుమానిస్తున్న 8 బ్యాంకు ఖాతాలను సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఈ వివరాలన్నీ క్రోడీకరిస్తూ తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈడీ, ఐటీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్‌లకు లేఖలు రాశారు. దీంతో స్పందించిన ఈడీ ప్రాథమిక విచారణ నేపథ్యంలో ఈ స్కామ్ వెనుక మనీలాండరింగ్ సైతం ఉన్నట్లు తేల్చింది. పోలీసులు హీరా గ్రూప్ ఖాతాలు ఫ్రీజ్ చేసే నాటికి ఈ సంస్థకు ఉన్న వివిధ బ్యాంకు ఖాతాల్లో కేవలం రూ.25 కోట్లు మాత్రమే నగదు నిల్వ ఉంది. 12 వేల మంది ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించాల్సిన మొత్తమే రూ.300 కోట్లుగా బయటపడింది. ఇప్పటివరకు మరో 10 వేల మంది తమకు రూ.350 కోట్లు రావాల్సి ఉందంటూ పోలీసులకు నివేదించారు. ఈ మిస్టరీని ఛేదించడంపై ఈడీ అధికారులు దృష్టిపెట్టారు. -
ఇక ఈడీ వంతు!
సాక్షి, హైదరాబాద్: స్కీముల పేరుతో రూ.వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఉచ్చు బిగిస్తోంది. ఈ సంస్థపై నమోదైన కేసును దర్యాప్తు చేసిన నగర నేర పరిశోధన విభాగం(సీసీఎస్) పోలీసులు వెలుగులోకి తెచ్చిన అంశాల ఆధారంగా చర్యలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం కర్ణాటక జైల్లో ఉన్న నౌహీరా షేక్‌ను అదుపులోకి తీసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. హీరా సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారిలో కొందరు బినామీలు ఉన్నారని, మనీల్యాండరింగ్‌లో భాగంగానే ఈ పెట్టుబడులు జరిగాయని ఈడీ అనుమానిస్తోంది. నౌహీరాతో పాటు ఆమె సంస్థలపై చర్యలు తీసుకునేందుకు ఈడీ ఇప్పటికే సీసీఎస్ అధికారులతో భేటీ అయి కీలక వివరాలు సేకరించింది. ఫెమా చట్టానికి విరుద్ధంగా హీరా గ్రూప్ రూ.5,647 కోట్లు భారత కరెన్సీలో భారతీయుల నుంచి డిపాజిట్లు సేకరించినట్లు దర్యాప్తులో తేలింది. దీనికి తోడు ఆరు లక్షల అమెరికా డాలర్లు, 132 కోట్ల యూఏఈ దిరమ్స్, 45 కోట్ల సౌదీ రియాల్స్, 10 కోట్ల కువైట్ దీనార్స్ పెట్టుబడులుగా వచ్చాయి. ఇలా విదేశీ కరెన్సీలో పెట్టుబడులు సేకరించడం ఫెమా చట్టానికి వ్యతిరేకం. మరోపక్క ఇప్పటి వరకు హీరా గ్రూప్ భారత్ కరెన్సీలో రూ.2,500 కోట్లు, 2 లక్షల అమెరికా డాలర్లు, 120 కోట్ల యూఏఈ దిరమ్స్, 1.36 లక్షల సౌదీ రియాల్స్ డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించినట్లు తేలింది. వీటితో పాటు విదేశీ బ్యాంకుల్లో ఈ సంస్థకు చెందినవిగా అనుమానిస్తున్న ఎనిమిది బ్యాంకు ఖాతాలను సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఈ వివరాలన్నీ క్రోడీకరిస్తూ తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈడీ, ఆదాయపుపన్ను శాఖ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయాలకు లేఖలు రాశారు. దీంతో ఈడీ ప్రాథమిక విచారణ చేపట్టి ఈ కుంభకోణం వెనుక మనీల్యాండరింగ్ సైతం ఉన్నట్లు గుర్తించింది. సీసీఎస్ తమ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన, సేకరించిన వివరాలను ఈడీ దృష్టికి తీసుకువెళ్లారు. కొన్ని కీలక డాక్యుమెంట్లను అప్పగించారు. ఇప్పటి వరకు లభించిన ఆధారాలను బట్టి హీరా గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టిన వారి సంఖ్య దాదాపు 2 లక్షల వరకు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పోలీసులు ఖాతాలు ఫ్రీజ్ చేసే నాటికి ఈ సంస్థకు ఉన్న వివిధ బ్యాంకు ఖాతాల్లో కేవలం రూ.25 కోట్లు మాత్రమే నగదు నిల్వ ఉంది. కేవలం 12 వేల మంది ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించాల్సిన మొత్తమే రూ.300 కోట్లుగా బయటపడింది. దీనికి తోడు ఇప్పటి వరకు మరో 10 వేల మంది తమకు రూ.350 కోట్లు రావాల్సి ఉందంటూ పోలీసులకు నివేదించారు. ఈ మిస్టరీని ఛేదించడంపై ఈడీ అధికారులు దృష్టిపెట్టారు. ఆరేళ్లలో రూ.6 వేల కోట్లు టర్నోవర్ హీరా గ్రూప్ ఆరేళ్లల్లో రూ.6 వేల కోట్ల టర్నోవర్ చేసినట్లు గతంలో రిటర్న్స్ దాఖలు చేసింది. 2010–11లో కేవలం రూ.27 లక్షలుగా ఉన్న గ్రూప్ టర్నోవర్... 2016–17 నాటికి రూ.800 కోట్లు దాటింది. దీనికి సంబంధించి పూర్తి రికార్డులు అందుబాటులో లేవు. ఆదాయపు పన్ను(ఐటీ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీస్(ఎస్ఎఫ్ఐఓ), రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్(ఆర్వోసీ) వీటిలో ఒక్కో విభాగానికి ఒక్కో రిటర్న్స్ ఫైల్ చేసింది. కనీసం డిపాజిట్‌దారుల జాబితా సైతం బయటపెట్టకపోవడంతో అనేక ప్రయత్నాలు చేసిన సీసీఎస్ పోలీసులు హీరా గ్రూప్‌నకు చెందిన సర్వర్‌ను బంజారాహిల్స్‌లోని ఓ ఇంట్లో గతేడాది గుర్తించారు. దీంతో పా టు స్వాధీనం చేసుకున్న కొన్ని హార్డ్‌డిస్క్‌ల్ని విశ్లేషించి కీలక విషయాలు గుర్తించారు. 1.7 లక్షల మంది ఇన్వెస్టర్ల జాబితా వెలికి తీయగలిగారు. వీరిలో కొందరు విదేశీయులున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అనుమతులు తీసుకు న్న తర్వాత విదేశీ పెట్టుబడుల్ని భారత కరెన్సీలోనే స్వీకరించాలి. -
హీరా గ్రూపుపై ప్రభుత్వ చర్యలేవి?
సాక్షి, హైదరాబాద్: హీరా గ్రూపు కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. హీరా గ్రూపు యాజమాన్యం ఈ కంపెనీల ద్వారా రూ.50వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హీరా గ్రూపు బాధితుల సంఘం అధ్యక్షుడు షహబాజ్ అహ్మద్ ఖాన్ ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సీసీఎస్ డిప్యూటీ కమిషనర్, కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, హీరా గ్రూపు కంపెనీల ఎండీ, సీఈవో నౌహీరా షేక్‌లతో పాటు హీరా గ్రూపు కంపెనీలను ప్రతివాదులుగా చేర్చారు. హీరా గ్రూపు కంపెనీల ద్వారా నౌహీరా షేక్ ఇటు భారతీయులతో పాటు ప్రవాసుల వద్ద నుంచీ భారీ మొత్తాలను సేకరించారని పిటిషనర్ తెలిపారు.అత్యధికంగా సాధారణ ప్రజానీకం ఈ గ్రూపు కంపెనీల్లో చేరారని తెలిపారు. ఈ కంపెనీల యాజమాన్యం 36 శాతం వార్షిక వడ్డీ చెల్లిస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఖాతాదారులను ఆకర్షించేందుకు ఇస్లామ్‌ను వాడుకున్నారని పిటిషనర్ ఆరోపించారు. మొదట్లో కొన్ని నెలలు చెల్లింపులు చేసి ఆ తరువాత మానేసిందన్నారు. ఆమెకు ఐసిస్‌తో సంబంధాలున్నాయి... హీరా గ్రూపునకు దేశవ్యాప్తంగా 74 బ్రాంచీలు ఉన్నాయని, 430 మంది మార్కెటింగ్ ప్రతినిధులు ఉన్నారని తెలిపారు. వీరి ద్వారా డబ్బు వసూలు చేశారన్నారు. ఈ ఏజెంట్లకు భారీగా కమిషన్లను ముట్టజెప్పారని వివరించారు. దేశవ్యాప్తంగా రూ.50వేల కోట్లను 1.75 లక్షల మందికి చెల్లించకుండా హీరా గ్రూపు యాజమాన్యం ఎగవేసిందని, ఇందుకు గాను ఈ కంపెనీ ఎండీ, సీఈవో నౌహీరా షేక్ అరెస్టయ్యారని తెలిపారు. ఈమెకు ఐసిస్‌తో సంబంధాలున్నాయన్నారు. పాకిస్థాన్‌కు చెందిన ప్రబోధకుడు తౌసీఫర్ రహ్మాన్‌ను నౌహీరా తరచూ కీర్తించే వారని, అతనికి ఐసిస్‌తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని వివరించారు. అతన్ని ఇటీవల సౌదీ ప్రభుత్వం అరెస్ట్ చేసిందన్నారు. 3 లక్షల మంది విదేశీయులు కూడా హీరా గ్రూపుల్లో పెట్టుబడులు పెట్టారని పిటిషనర్ వివరించారు. సీసీఎస్ సమర్థవంతంగా దర్యాప్తు చేయలేకపోతోంది... ఈ వ్యవహారంపై హైదరాబాద్ సీసీఎస్ సమర్థవంతంగా దర్యాప్తు చేయలేకపోతోందన్నారు. ఈ కేసులో పెట్టుబడిదారులకు న్యాయం జరగాలంటే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడమే మార్గమన్నారు. ఈ కేసులో ఆర్థిక అంశాలతో పాటు, మనీలాండరింగ్ కూడా ఉందని తెలిపారు. వాస్తవాలను వెలుగులోకి రావాలంటే పలు అంశాల్లో ప్రత్యేక నైపుణ్యం ఉన్న అధికారులు అవసరమని, అందువల్ల సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తే తగిన ఫలితాలు ఉంటాయన్నారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. -
హీరా గ్రూప్ ఆస్తుల స్వాధీనానికి చర్యలు
సాక్షి, హైదరాబాద్: స్కీముల పేరుతో స్కాములకు పాల్పడిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కేసులో బాధితులకు ఊరట కలిగించే అంశాలపై నగర నేర పరిశోధనా విభాగం(సీసీఎస్) పోలీసులు దృష్టి సారించారు. అందులో భాగంగా ఆ సంస్థతోపాటు నిందితుల పేర్లతో ఉన్న ఆస్తుల్ని అటాచ్ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే గుర్తించిన దాదాపు రూ.1,000 కోట్ల విలువైన స్థిరాస్తుల్ని స్వాధీనం చేసుకోవడానికిగాను అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మరోపక్క మహారాష్ట్ర జైల్లో ఉన్న ఆ గ్రూప్ సీఈవో నౌహీరా షేక్‌ను సిటీకి తీసుకురావడానికి మరికొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటకల్లో నౌహీరాతోపాటు ఆ సంస్థ పేరిట ఉన్న ఆస్తుల్ని సీసీఎస్ పోలీసులు గుర్తించి వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. వివిధ రకాలైన వ్యాపారాలు చేస్తున్నానని, ఆయా వ్యాపారాల్లో 90 శాతం లాభాలు వస్తున్నాయని, అందులో పెట్టుబడి పెట్టిన వారికి నెలకు 36 శాతం చొప్పున లాభాలు ఇస్తానని నమ్మించిన నౌహీరా షేక్ కొన్నేళ్లుగా భారీ డిపాజిట్లు సేకరించింది. దీనిపై కేసులు నమోదు కావడంతో హీరా గ్రూప్ ఆర్థిక వ్యవహారాలు, ఆదాయ వనరులపై సీసీఎస్ పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే వీరికి అసలు వ్యాపారాలే లేవని, డిపాజిట్లనే రొటేషన్ చేస్తూ, గొలుసుకట్టు విధానంలో వ్యాపారం చేస్తున్నారని పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి. ఎంతమంది డిపాజిట్దారులున్నారు, ఎంత మేర డిపాజిట్లు సేకరించారనే వివరాలను కూడా నిర్వాహకులు ఇవ్వకపోడంతో హైదరాబాద్ పోలీసులు అతికష్టమ్మీద వాటిని సేకరించారు. హీరా గ్రూపునకు సంబంధించిన ఆర్థిక అక్రమాల్లో బాధితులు తీవ్రస్థాయిలో నష్టపోయారు. క్రయవిక్రయాలపై సబ్రిజిస్ట్రార్లకు లేఖలు హీరా గ్రూపు కేసులో సీసీఎస్ పోలీసులు డిపాజిట్‌దారుల పరిరక్షణ చట్టంలోని సెక్షన్లను జోడించారు. దీంతో ఆస్తుల స్వాధీనానికి ఆస్కా రం ఏర్పడింది. ఇప్పటికే పోలీసులు ఆ సంస్థకు చెందిన ఆస్తుల్ని గుర్తించి, సీజ్ చేస్తూ క్రమవిక్రయాలు నిషేధించాల్సిందిగా సబ్–రిజిస్ట్రార్లకు లేఖలు రాశారు. ఇలా నమోదైన కేసుల్లో నిందితు ల నుంచి పోలీసులు సీజ్ చేసిన ఆస్తుల జాబితాను ప్రభుత్వానికి నివేదిస్తారు. ఈ స్వాధీనాన్ని ధ్రువీకరించాల్సిందిగా కోరతారు. ఈ మేరకు ధ్రువీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. వీటి ఆధారంగా ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జోడిస్తూ పోలీసులు కోర్టుల్లో పిటిషన్ దాఖలు చేస్తారు. నిందితుల ఆస్తుల స్వాధీనం సమంజసమేనంటూ ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తారు. ఈ పిటిషన్ పూర్వాపరాలను పరిశీలించి కోర్టు తగిన ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా సీసీఎస్ పోలీసులు నౌహీరా షేక్‌తోపాటు ఆ సంస్థలకు చెందిన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, టోలిచౌక్, ఏపీలోని చిత్తూరు జిల్లా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణేలోని పలు ప్లాట్లు, ఇళ్ల వివరాలను సేకరించారు. వీటిని అటాచ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. -
ప్రణయ్‌ను సుపారీ ఇచ్చి మరీ చంపించాడు!
2018 సంవత్సరం.. తెలంగాణకు మాయని గాయాలను మిగిల్చింది. ప్రమాదాలు, పరువు హత్యలు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేశాయి. కొండగట్టు బస్సు ప్రమాదం కలవరపరిచింది. టపాసులు పేలి డజను మంది మృత్యువాత పడ్డారు. కులం కోసం ప్రేమించుకున్న వారిని, కన్న వారిని కూడా చూడకుండా కడతేర్చారు. చలికి రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న కుంపటి జీవితాలను బుగ్గిపాలు చేసింది. డబ్బుకు లోకం దాసోహం అన్నట్లుగా మారిన తీరును కొందరు అక్షరాల సత్యం చేశారు. నౌహీరా షేక్ డిపాజిట్ల కుంభకోణం వేల కుటుంబాలను ఆగం చేసింది. – సాక్షి, హైదరాబాద్ ప్రమాదపు చావులు.. దేశ చరిత్రలోనే భారీ ప్రాణనష్టం కొండగట్టు బస్సు ప్రమాదంలో జరిగింది. సెప్టెంబర్ 12న జరిగిన కొండగట్టు ఘాట్‌రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా పడి 62 మంది ప్రయాణికులను పొట్టన పెట్టుకుంది. ఈ ఘటనతో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. హైదరాబాద్ నుంచి రామగుండం వెళ్లే రాజీవ్ రహదారిపై వరుస రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగించాయి. ఈ ఏడాది మేలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం 11 మందిని బలిగొంది. ప్రముఖ సినీ నటుడు, నందమూరి హరికృష్ణ నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి చెరువుగట్టు వద్ద కారు ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు. అర్థంలేని పరువు హత్యలు.. ప్రేమించి పెళ్లి చేసుకోవడం నచ్చకపోతే వాళ్ల బతుకు వాళ్లను బతకనివ్వాల్సింది. కానీ అర్థం లేని ఆవేశాలకు పోయి కులాంతర వివాహం చేసుకున్నందుకు కన్న కూతుర్ల జీవితాలనే కాలారాశారు. మిర్యాల గూడలో ప్రణయ్ పరువు హత్య రాష్ట్రంలో సంచలనం రేపింది. తన కూతురిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడని, ప్రణయ్‌ను సుపారీ ఇచ్చి మరీ చంపించాడు అమృత తండ్రి మారుతీరావు. ఇలాంటి ఉదంతమే మంచిర్యాలలో కూడా చోటుచేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్న కన్న కూతురినే తల్లిదండ్రులు, సోదరుడు కలసి గొంతు నులిమి చంపేశారు. కులాంతర వివాహం చేసుకున్నారనే కోపంతో కూతురు, అల్లుడిపై ఎర్రగడ్డలో నడిరోడ్డుపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచాడు ఓ తండ్రి. అదృష్టవశాత్తు వారిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. హవాలా హవా.. పైకి పార్శిళ్లలాగే ఉన్నా వాటిలో మాత్రం హవాలా డబ్బు సరఫరా అవుతోంది. హైదరాబాద్ నుంచి ముంబైకి హవాలా డబ్బును ఆంధ్రా పార్శిళ్ల సంస్థ రవాణా చేస్తుండగా రైల్వే పోలీసులు పట్టుకున్నారు. రూ.66 లక్షల హవాలా సొమ్మును సీజ్ చేశారు. ఏకంగా రైళ్లలోనే హవాలా డబ్బు రవాణా జరగడం ఈ ఏడాది చర్చనీయాంశమైంది. వెయ్యి కోట్లు మింగేసింది.. హీరా గోల్డ్ పేరుతో 8 రాష్ట్రాల్లో డిపాజిట్లు వసూలు చేసినా ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. రూ.వెయ్యి కోట్లకు పైగా పలు రకాల స్కీముల పేరుతో డిపాజిట్ల రూపంలో సేకరించింది ఆ సంస్థ యజమాని నౌహీరా షేక్. రాజకీయ వేడి.. ఏడాది చివర జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హవాలా డబ్బు ఏరులై పారింది. రూ.125 కోట్లకు పైగా నగదును పోలీస్ శాఖ స్వాధీనం చేసుకోగా, అందులో హవాలా డబ్బే దాదాపు 40 కోట్లకు పైగా ఉంది. వరంగల్ పెంబర్తిలో పట్టుబడ్డ కేసులో మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, కాంగ్రెస్ నేత మద్దిరాజు రవిచంద్ర పేర్లు బయటపడటం కలవరం రేపాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు, విచారణ రాజకీయంగా వేడిని రగిలించాయి. ఎన్నికల ప్రచారం ముగియడానికి ముందు రోజు రేవంత్‌రెడ్డి ముందస్తు అరెస్ట్ పోలీసు శాఖకు, ఉన్నతాధికారులకు మాయని మచ్చగా మిగిలింది. ఈ అరెస్ట్ వ్యవహారంపై హైకోర్టు చేసిన ఘాటు వ్యాఖ్యలు సంచలనం రేపాయి. సంచలన తీర్పులు.. 2007లో జరిగిన హైదరాబాద్ గోకుల్ చాట్, లుంబినీ పార్క్ జంట పేలుళ్ల కేసులో న్యాయస్థానం ఈ ఏడాది సంచలన తీర్పు వెలువరించింది. నిందితుల్లో ఇద్దరికి ఉరిశిక్ష విధించగా, మరొకరికి జీవిత ఖైదు విధించింది. మద్దెల చెరువు సూరి అలియాస్ గంగుల సూర్యనారాయణరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న భానుకిరణ్‌కు జీవితఖైదు విధిస్తూ సీఐడీ కోర్టు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం శిక్ష ఖరారు చేసింది. నర్సింగ్ విద్యార్థులకు వేధింపులు.. నర్సింగ్ కాలేజీలను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ మాజీ మంత్రి, రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ కుమారుడు సంజయ్‌ను నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శాంకరీ నర్సింగ్ కాలేజీలోని 11 మంది నర్సింగ్ విద్యార్థినులు దీనిపై నేరుగా హోంమంత్రికి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, పాతబస్తీలోని నిజాం మ్యూజియం నుంచి రూ.300 కోట్ల విలువైన వస్తువులను కొట్టేశారు దుండగులు. ప్రాణాలు బలితీసుకున్న కుంపటి.. చలి వేస్తుండటంతో వెచ్చదనం కోసం ఇంటిలో పెట్టుకున్న బొగ్గుల కుంపటి ఆరుగురి ప్రాణాలను బలిగొంది. జూబ్లీహిల్స్‌కు చెందిన బుచ్చివేణి, ఆమె కుమారుడు పద్మరాజు పొగకు ఊపిరాడక మృతిచెందగా, ఆ మరుసటిరోజే శామీర్‌పేట బొమ్మరాసిపేట గ్రామంలో కోళ్లఫారంలో పనిచేస్తున్న మహబూబ్‌నగర్‌కు చెందిన నలుగురు వలస కూలీలు ఇదే రీతిలో మరణించడం సంచలనం రేపింది. కాల్చేసిన బాణసంచా.. రోజువారీ కూలీలుగా పనిచేసుకునే కుటుంబాల్లో అగ్నిప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. వరంగల్ శివారులో బాణసంచా తయారీ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది కూలీలు దుర్మరణం చెందడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కాగా, హైదరాబాద్‌లోని పాతబస్తీ చాంద్రాయణగుట్టలో బాసిత్‌తో పాటు నలుగురిని ఐసిస్ మాడ్యూల్ కోసం పనిచేస్తున్నట్లు గుర్తించి ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
మోసం చెయ్యం... మొత్తం ఇచ్చేస్తాం!
సాక్షి, హైదరాబాద్ : వివిధ స్కీముల పేరుతో భారీ స్కామ్‌కు పాల్పడిన ‘హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‘ఎండీ నౌహీరా షేక్ కొత్త పల్లవి అందుకున్నారు. తాము ఎవరినీ మోసం చేయలేదని, డిపాజిటర్లు కావాలంటే పెట్టుబడి మొత్తం తిరిగి ఇచ్చేస్తామంటున్నారు. ఆ మొత్తాలను 16 నెలల వ్యవధిలో 4 విడతల్లో చెల్లిస్తామని నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. నౌహీరాపై నమోదైన కేసును దర్యాప్తు చేస్తున్న నగర నేర పరి«శోధన విభాగం (సీసీఎస్) పోలీసులు మాత్రం డిపాజిట్లు తిరిగి చెల్లించేందుకు ఉన్న ఆర్థిక వనరుల వివరాలు తెలపాలని కోరుతున్నారు. మరోపక్క ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసు కస్టడీలో ఉన్న నౌహీరాను ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారంట్‌పై తీసుకురావడానికి సీసీఎస్ అధికారులు యత్నిస్తున్నారు. ఆమె కోసం అనేక రాష్ట్రాలు, నగరాలకు చెందిన పోలీసులు వేచి ఉన్నారని, వారి కస్టడీలు పూర్తయిన తర్వాతే హైదరాబాద్‌కు తీసుకువెళ్లాలని ముంబై కోర్టు పోలీసులకు సూచించింది. ఆర్థిక మూలాల కోసం పోలీసుల వెతుకులాట హీరా గ్రూప్‌లో మొత్తం 15 కంపెనీలు ఉన్నాయి. వీటిలో ఒక్కో కంపెనీకి చెందిన ఒక్కో తరహా స్కీమ్ తయారు చేసిన నౌహీరా తదితరులు అధిక వడ్డీలు ఆశ చూపి భారీగా డిపాజిట్లు సేకరించారు. సాలీనా గరిష్టంగా 36 శాతం వడ్డీ ఆశ చూపడంతో అనేక మంది పెట్టుబడులు పెట్టారు. కొందరు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు నౌహీరాను అరెస్టు చేశారు. ఈ కంపెనీకి చెందిన ఆర్థిక మూలాలు కనుక్కోవడంపై సీసీఎస్ పోలీసులు దృష్టి పెట్టారు. నౌహీరాతో పాటు అరెస్టయిన బిజూ థామస్, మోలీ థామస్‌లను విచారించినా వాటి ఆధారాలు లభించలేదు. ఈ నేపథ్యంలోనే నౌహీరా షేక్ తన లాయర్ ద్వారా నాంపల్లిలోని ఎంఎస్‌జే కోర్టులో ఓ పిటిషన్ వేయించారు. అందులో తమకు డిపాజిటర్లను మోసం చేసే ఉద్దే«శం లేదన్నారు. తమ వద్ద డబ్బు డిపాజిట్ చేసిన వారిలో ఎవరైనా తిరిగి చెల్లించాలని కోరితే... విత్‌డ్రా ఫామ్ ఇస్తే అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. వారి మొత్తాన్ని నాలుగు విడతల్లో చెల్లిస్తామని, 25 శాతం తొలి విడతలో 4 నెలల పాటు... రెండో విడతలోనూ మరో 25 శాతం ఇంకో 4 నెలల పాటు... ఇలా మొత్తం 16 నెలల్లో ఆ మొత్తం ఇచ్చేస్తామన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే తమపై కేసు నమోదైందని కోర్టుకు విన్నవించారు. ఎలా చెల్లిస్తారో చెప్పండి.. పిటిషన్ వివరాలు తెలుసుకున్న సీసీఎస్ పోలీసులు ఆర్థిక మూలాలు చెప్పాలంటూ హీరా గ్రూప్‌ను కోరుతున్నారు. డిపాజిటర్లకు సొమ్ము ఏ మార్గంలో తిరిగి చెల్లిస్తారని ప్రశ్నిస్తున్నారు. తమకు విదేశీ ఖాతాల్లో నిధులు ఉన్నాయని హీరా గ్రూప్ చెప్తున్న నేపథ్యంలో వాటి వివరాలు కోరుతున్నారు. ఇప్పటికే దాదాపు రూ.220 కోట్లకు గాను 10 వేల విత్‌డ్రా ఫామ్స్ హీరా గ్రూప్ కార్యాలయం లో పడి ఉన్నాయని,అవి తమ సోదాల్లో లభించాయని సీసీఎస్ పోలీసులు చెప్తున్నారు. వాటిపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. నౌహీరాకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి విది తమే.అనంతరం ముంబై పోలీసులు ఆమెను అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ఇప్పుడు నౌహీరాకు ఇచ్చిన బెయిల్‌ను హైకోర్టు కొట్టేసింది. దీంతో ఆమెను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాలని సీసీఎస్ పోలీసులు నిర్ణయించారు. దీనికోసం నాంపల్లి కోర్టు నుంచి పీటీ వారంట్ కూడా పొందారు. దీన్ని తీసుకువెళ్లిన ఓ ప్రత్యేక బృందం ముంబై కోర్టులో దాఖలు చేసి నౌహీరాను తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది.నౌహీరా అరెస్టు తర్వాత ఆమెపై ముంబై, పుణేలతో పాటు అనేక చోట్ల కేసులు నమోదయ్యాయి. వారంతా తమ కస్టడీల్లోకి తీసుకోవడానికి పీటీ వారంట్లతో ముంబై చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కీలక కేసుల్లో ఆయా పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం పూర్తయిన తర్వాతే హైదరాబాద్ తీసుకువెళ్లాలంటూ ప్రత్యేక బృందానికి ముంబై కోర్టు న్యాయమూర్తి సూచించారు. దీంతో సిటీ నుంచి వెళ్లిన టీమ్ తిరిగి వచ్చింది. -
నౌహీరా షేక్ బెయిల్ రద్దు చేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: లక్షలాది మంది నుంచి కోట్లాది రూపాయల డిపాజిట్లు సేకరించి మోసం చేశారనే అభియోగాల కేసులో హీరా గ్రూప్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నౌహీరా షేక్‌కు కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను హైకోర్టు రద్దుచేసింది. వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ బెయిల్‌ను రద్దు చేస్తూ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. సీసీఎస్ పోలీసులు ఆమెపై నమోదు చేసిన కేసులో హైదరాబాద్‌లోని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి షరతులతో బెయిల్ ఇచ్చారు. బెయిల్‌ను రద్దు చేయా లని సీసీఎస్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. కేసు దర్యాప్తులో ఉండగానే బెయిల్ మంజూరైందని, ఆమె బయటకు వస్తే కోట్లాది రూపాయల అక్రమాల అభియోగాల్లో సాక్ష్యాలను మార్చే అవకాశం ఉందని తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్‌రెడ్డి వాదనల్ని న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకుని బెయిల్‌ను రద్దు చేస్తూ ఆదేశాలిచ్చారు. -
నౌహీరా అరెస్టు.. అనేక నాటకీయ పరిణామాలు!
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా రూ.వందల కోట్ల స్కామ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నౌహీరా షేక్ ఇలా బయటకు వచ్చి... అలా వెంటనే అరెస్టయ్యారు. నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు అరెస్టు చేసిన కేసులో గత వారం జైలుకు వెళ్లిన నౌహీరా బెయిల్‌పై శుక్రవారం ఉదయం విడుదలయ్యారు. జైలు వద్దే కాపుకాసిన మహారాష్ట్ర థానే జిల్లా నిజాంపుర పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని అక్కడికి తరలించారు. శనివారం కోర్టులో హాజరుపరచడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క నౌహీరాకు కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సీసీఎస్ పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నౌహీరా అరెస్టు నుంచి ఆసక్తికరమైన నాటకీయ పరిణామాలు అనేకం చోటు చేసుకున్నాయి. జైలు వద్దే నిజాంపుర పోలీసులు.. నౌహీరా షేక్‌ను అరెస్టు చేసిన పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన న్యాయస్థానం అనుమతి నిరాకరిస్తూ, ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.5 లక్షలతో రెండు పూచీకత్తులు ఇవ్వాలని, ఈ నెల 29 లోపు న్యాయస్థానంలో రూ.5 కోట్లు డిపాజిట్ చేయాలని, పాస్‌పోర్ట్ అప్పగించడంతో పాటు అనుమతి లేకుండా దేశం దాటవద్దంటూ కోర్టు షరతులు విధించింది. పూచీకత్తుల దాఖలు, విడుదల ఉత్తర్వులు తీసుకోవడం గురువారం పూర్తయినప్పటికీ జైలు సమయం మించిపోవడంతో నౌహీరా విడుదల కాలేదు. అయితే హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, నౌహీరా షేక్‌పై దేశవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. ఆమెకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలుసుకున్న «నిజాంపుర పోలీసులు గురువారమే పీటీ వారెంట్లతో చంచల్‌గూడ జైలు వద్దకు వచ్చారు. ఆమె విడుదల కాకపోవడంతో శుక్రవారం తెల్లవారుజాము వరకు జైలు వద్ద మాటు వేశారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో జైలు నుంచి బయటకు వస్తున్న నౌహీరాను అదుపులోకి తీసుకుని రోడ్డు మార్గంలో నిజాంపురకు తరలించారు. అక్కడి కోర్టులో శనివారం హాజరుపరచడానికి సన్నాహాలు చేస్తున్నారు. చంచల్‌గూడ జైలు వద్ద నౌహీరాను అదుపులోకి తీసుకునే సందర్భంలో ఆమె న్యాయవాదులకు, నిజాంపుర పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. కేరళకు ప్రత్యేక బృందం... నౌహీరాకు కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని, తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీసీఎస్ పోలీసులు శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఓ ప్రత్యేక పోలీసు బృందం కేరళకు బయలుదేరి వెళ్లింది. సాధారణంగా కార్పొరేట్, బడా వ్యాపార సంస్థలు తమ బ్యాంకు ఖాతాలను మార్చడానికి ఇష్టపడవు. అయితే హీరా గ్రూప్ వ్యవహారం మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు హీరా గ్రూప్‌తో పాటు నౌహీరా నుంచి వారి బ్యాంకు ఖాతాల వివరాలు తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అధికారులు కేంద్రం అధీనంలోని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) ద్వారా 160 బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించారు. వీటిని పరిశీలించగా... దాదాపు సగం క్లోజ్ అయినట్లు తేలింది. ఒక్క ఐసీఐసీఐ బ్యాంక్‌లోనే 56 ఖాతాలు ఉండగా, 53 ఖాతాలను మూసేశారు. ఇలా మరికొన్ని బ్యాంకుల్లోనూ జరిగిందని, ముందు నుంచీ ఇలానే జరుగుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో ఈ ఖాతాల క్లోజింగ్ వెనుక ఉన్న మతలబు ఏమిటనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. -
ఆరేళ్ల ఆర్జన రూ.5 వేల కోట్లు!
సాక్షి, హైదరాబాద్: ఒక కంపెనీ లేదు.. ఉత్పత్తి కేంద్రం లేదు.. కనీసం క్రయ విక్రయాల దుకాణాలు సైతం లేవు. అయినా హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గడిచిన ఆరేళ్లలో సాగించిన టర్నోవర్ ఎంతో తెలుసా? అక్షరాల రూ.5 వేల కోట్లు. వివిధ ఏజెన్సీల ద్వారా హైదరాబాద్ నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు ఈ వివరాలు సేకరించారు. తిరిగి చెల్లించాల్సిన ప్రజల డిపాజిట్లను కూడా తమ ఆదాయంగా చూపిన ఈ గ్రూప్ ఆ డిపాజిటర్ల జాబితాను బయటపెట్టట్లేదు. హీరా గ్రూప్‌లో మొత్తం 15 కంపెనీలు ఉన్నాయి. హీరా గోల్డ్, హీరా టెక్స్టైల్స్, హీరా రిటైల్స్.. ఇలా పలు సంస్థలు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో (ఆర్వోసీ) నమోదైనా వాస్తవంలో మాత్రం లేవు. ప్రజలకు ఎరవేసి, అధిక వడ్డీ ఆశచూపి డిపాజిట్లు సేకరించడం మినహా మరో దందా లేదు. ఈ గ్రూప్ సంస్థలు విదేశాల్లో భారత్‌తో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదు. అయినా గడిచిన ఆరేళ్లలో రూ.5 వేల కోట్లు టర్నోవర్ చేసినట్లు రిటర్న్స్ దాఖలు చేసింది. ఐటీ, ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ), రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) వీటిలో ఒక్కో విభాగానికి ఒక్కో రిటర్న్స్ ఫైల్ చేసింది. వీటి మధ్య ఎక్కడా పొంతన లేదని సీసీఎస్ పోలీసులు గుర్తించారు. అన్ని విభాగాలతో సీసీఎస్ సమావేశం.. ఇప్పటికే హీరా గ్రూప్‌పై అన్ని ఏజెన్సీల్లో కేసులు నమోదయ్యాయి. ఈడీ సహా మరికొన్ని ఏజెన్సీలు కొంతవరకు ఆస్తులు గుర్తించి సీజ్ చేశాయి. ఈ స్కామ్‌ను దర్యాప్తు చేస్తున్న సీసీఎస్ పోలీసులు అవసరమైన అదనపు ఆధారాల సేకరణపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా మంగళవారం ఐటీ, ఈడీ తదితర విభాగాలతో సమావేశమయ్యారు. వీటి వద్ద ఉన్న, స్వాధీనం చేసుకున్న ఆస్తుల జాబితాలు సేకరిస్తున్నారు. ఈ సమావేశంలోనూ హీరా ఫ్రాడ్‌పై ఏ ఒక్కరూ స్పష్టత ఇవ్వలేకపోయారు. రాష్ట్రంలో ఉన్న ఆస్తుల వివరాలు తెలపాలంటూ రిజిస్ట్రేషన్ శాఖకు లేఖ రాసిన పోలీసులు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాటి వివరాల కోసం ప్రత్యేక బృందాలను పంపారు. హీరా గ్రూప్ కార్యకలాపాల వెనుక జాతీయ భద్రతకు సంబంధించిన కోణం కూడా ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నౌహీరా షేక్‌కు ఊరట నౌహీరా షేక్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. నౌహీరాను కస్టడీలోకి తీసుకునేందుకు సీసీఎస్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టేసింది. ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.5 లక్షలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. రూ.100కు రూ.90 లాభం అంటూ.. ప్రజలు తమ వద్ద పెట్టిన డిపాజిట్లను గోల్డ్, టెక్స్టైల్ రంగాల్లో పెట్టుబడులు పెడతామంటూ హీరా గ్రూప్ నమ్మబలికింది. వాటిలో రూ.100 పెట్టుబడి పెడితే రూ.90 లాభం వస్తుందని, దీని నుంచి తాము 54 శాతం తీసుకుంటూ మిగిలిన 36 శాతం పెట్టుబడి పెట్టిన వారికి పంచుతామని చెబుతూ వచ్చింది. అయితే వాస్తవంగా ఎలాంటి వ్యాపారాలు చేయట్లేదనే విషయం బహిర్గతమైంది. ఈ లావాదేవీలకు సంబంధించి రికార్డులు సైతం సమర్పించలేదు. కాగా, నౌహీరా షేక్‌పై 2012లోనూ ఓ కేసు నమోదైంది. ఈ కేసులో ఆమె పొందిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయించేందుకు గతంలో సీసీఎస్ పోలీసులు ప్రయత్నించారు. నౌహీరా షేక్.. దర్యాప్తు అధికారినే బంజారాహిల్స్‌లోని తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. సంస్థ ఆదాయ మార్గాల వివరాలు అడిగితే ‘తనకు ఈ డబ్బును భగవంతుడు ఇస్తున్నాడు. దానికి మనం లెక్కలు ఎలా చెప్పగలం’అంటూ నౌహీరా చెప్పినట్లు సమాచారం. బౌన్సర్ల దౌర్జన్యం.. నౌహీరా షేక్ తరఫున ముంబైకి చెందిన వినీత్ టాండ వాదిస్తున్నారు. ఆయన వెంటవచ్చిన ముంబై బౌన్సర్లు బుధవారం నాంపల్లి కోర్టు వద్ద వీరంగం సృష్టించారు. బాధితుల సంఘం అధ్యక్షుడు షాబాజ్ అహ్మద్‌ఖాన్ నేతృత్వంలో కొందరు బాధితురాళ్లు బుధవారం కోర్టు వద్దకు వచ్చారు. తిరిగి వెళ్తున్న టాండను బాధితులు ఘెరావ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన బౌన్సర్లు మహిళలపై దాడులు చేసి అసభ్యకరంగా ప్రవర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు బౌన్సర్లపై కేసులు నమోదు చేయడంతో పాటు ముగ్గురిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. -
‘స్కీమ్స్’ స్కామ్‌లో డాక్టర్ నౌహీరా షేక్ అరెస్టు
సాక్షి, హైదరాబాద్ : ఆలిండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ (ఎంఈపీ) వ్యవస్థాపక అధ్యక్షురాలు, హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్ పర్సన్ డాక్టర్ నౌహీరా షేక్‌ను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు అరెస్టు చేశారు. వివిధ స్కీముల పేరుతో వేల మంది నుంచి డిపాజిట్లు సేకరించి మోసం చేశారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. నౌహీరాపై ఆరేళ్ల క్రితం నమోదైన కేసు దర్యాప్తులో ఉండగా.. తాజాగా రిజిస్టరైన మరో కేసులో ఆమెను కటకటాల్లోకి పంపినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ మంగళవారం వెల్లడించారు. నౌహీరా వద్ద డిపాజిట్ చేసిన వారిలో తెలంగాణతో సహా మొత్తం ఎనిమిది రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని, ఈమెపై మూడు రాష్ట్రాల్లో కేసులు నమోదైనట్లు ఇప్పటి వరకు గుర్తించామని ఆయన తెలిపారు.అదనపు సీపీ షికా గోయల్, డీసీపీ అవినాశ్ మహంతి, అదనపు డీసీపీ జోగయ్యలతో కలసి తన కార్యాలయంలో విలేకరులకు ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన నౌహీరా షేక్ కొన్నేళ్ల కిందట హైదరాబాద్‌కు వలసవచ్చి బంజారాహిల్స్‌లో స్థిరపడ్డారు. గతేడాది నవంబర్‌లో ఆమె ఎంఈపీని స్థాపించారు. కొన్నేళ్లుగా హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నిర్వహిస్తున్న నౌహీరా అదీనంలో ప్రస్తుతం 15 కంపెనీలు ఉన్నాయి. వీటిలో అనేక కంపెనీలు ప్రస్తుతం డిపాజిట్లు సేకరించే వ్యాపారం చేస్తున్నాయి. 2010–11 ఆర్థిక సంవత్సరంలో తమ వార్షిక టర్నోవర్ కేవలం రూ.17 కోట్లుగా పేర్కొన్న ఈ కంపెనీ గతేడాది ఏకంగా రూ.800 కోట్లుగా పేర్కొంది. వివిధ పథకాల్లో పెట్టుబడులు, చైన్ సిస్టమ్‌లో బంగారం కొనుగోలు, ఏడాదికి 36 శాతం వడ్డీ అందించేలా పెట్టుబడులు... తదితర స్కీములు ప్రవేశపెట్టిన హీరా గ్రూప్ అనేక మంది నుంచి వాటిని సేకరించింది. కనీస డిపాజిట్ మొత్తాన్ని రూ.50 వేలుగా నిర్ధారించి వసూలు చేసింది. తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చి మ బెంగాల్, ఢిల్లీ, రాజస్తాన్ రాష్రా ్టలు, దుబాయ్, మధ్య ఆసియా దేశాల్లోనూ బ్రాంచ్‌లు ఏర్పాటు చేసింది. ఇలా దాదాపు రూ.300 కోట్ల వరకు డిపాజిట్లు వసూలు చేసి తిరిగి చెల్లించకుండా మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నా యి. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు దాదాపు 40 రోజుల క్రితం బంజారాహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. దీంతో పాటు మరో పది మంది బాధితులు సైతం పోలీసుల వద్దకు వచ్చి వాం గ్మూలం ఇచ్చారు. ప్రాథమిక దర్యాప్తులోనే ఈ స్కామ్ రూ.5 కోట్లదిగా తేలడంతో పాటు మరికొన్ని స్కీమ్స్ వెలుగులోకి రావడంతో కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. దర్యాప్తు చేసిన ఏసీపీ కె.రామ్‌కుమార్ లోతుగా ఆరా తీశారు. ఫలితంగా డిపాజిటర్ల నుంచి సేకరించిన డబ్బు ను మళ్లించిన నౌహీరా షేక్ దాంతో స్థిరాస్తులు ఖరీదు చేసినట్లు గుర్తించారు. వీటిని తనతో పాటు మరికొందరు బినామీలు, సంస్థల పేరుతో కొన్నట్లు తేల్చారు. ఈ ఆధారాలను బట్టి నౌహీరా నేరం చేసినట్లు నిర్ధారించిన పోలీసులు ఆమె కోసం ముమ్మరంగా గాలించారు. ఎట్టకేల కు సోమవారం ఢిల్లీలో ఆమె కదలికల్ని గుర్తిం చి ఓ ప్రత్యేక బృందాన్ని అక్కడకు పంపారు. ఈ టీమ్ నౌహీరాను అరెస్టు చేసి అక్కడి సాకేత్ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్నారు. మంగళవారం నౌహీరాను హైదరాబాద్‌కు తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచారు. ప్రాథమికంగా ఆమెతో పాటు కంపెనీల పేరుతో ఉన్న 160 బ్యాంకు ఖాతాలను గుర్తించిన పోలీసులు వాటిని ఫ్రీజ్ చేసి అధ్యయనానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క డిపాజిటర్ల సొ మ్ముతో నౌహీరా ఖరీదు చేసిన 43 స్థిరాస్తుల్ని గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకోవడంపై దృష్టి పెట్టారు.నౌహీరాపై విశాఖపట్నంలో 2, బెంగళూరులో ఏడు కేసులు ఉన్నట్లు ఇప్పటి వరకు తెలిసిందని, మరిన్ని వివరాలు దర్యాప్తు చేస్తున్నామని అంజనీకుమార్ తెలిపారు. -
హీరా గ్రూప్ విస్తరణ బాట
ఈ నెల 9న హైదరాబాద్‌లో తొలి మార్ట్ ప్రారంభం హైదరాబాద్: హీరా గ్రూప్ తన విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. వచ్చే ఏడాది నాటికి దేశంలోని ఆరు ప్రముఖ పట్టణాల్లో ‘హీరా మార్ట్’ పేరుతో ఆరు షాపింగ్ మాల్స్‌ను ఏర్పాటు చేస్తామని సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ నౌహిరా షేక్ తెలిపారు. ఈమె ఆదివారం నవీ ముంబైలోని బెల్లాపూర్ సెక్టార్ 15లోని కార్పొరేట్ ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ విషయాలను వెల్లడించారు. వచ్చే ఏడాది నాటికి ఏర్పాటు చేయనున్న మొత్తం ఆరు షాపింగ్ మాల్స్‌లో తొలి మార్ట్‌ను హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఈ నెల 9న ప్రారంభిస్తామని పేర్కొన్నారు.