‘హీరా’ కేసులో ఆడిటర్‌ సాయం! | Hira Group case is going to be rare case in Hyderabad Police Commissionerate history | Sakshi
Sakshi News home page

‘హీరా’ కేసులో ఆడిటర్‌ సాయం!

Published Sat, May 25 2019 2:50 AM | Last Updated on Sat, May 25 2019 2:50 AM

Hira Group case is going to be rare case in Hyderabad Police Commissionerate history - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏదైనా నేరానికి సంబంధించి కేసు నమోదైతే అభియోగపత్రాలను పోలీసులే దాఖలు చేస్తారు.. అయితే స్కీముల పేరుతో వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డ హీరా గ్రూప్‌ వ్యవహారంలో పోలీసులకు ఆడిటర్‌ అవసరం వచ్చింది. ఈ సంస్థ ఏం గోల్‌మాల్‌ చేసిందనేది ప్రాథమికంగా హైదరాబాద్‌ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) అధికారులు తేల్చినా.. పూర్తిస్థాయిలో ఓ రూపు తీసుకొచ్చేందుకు ఆడిటర్‌ అవసరమని భావిస్తున్నారు. అందుకు అనుమతి కోరుతూ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. అనుమతి వస్తే.. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ చరిత్రలోనే హీరా కేసు అరుదైనదిగా కానుంది. ఆరేళ్లలో వేల కోట్ల టర్నోవర్‌ సాగించి, బ్యాంకు ఖాతాల్లో కనీసం వంద కోట్లు కూడా లేని హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ వ్యవహారాన్ని సీసీఎస్‌ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.

2010–11లో హీరా ఇస్లామిక్‌ బిజినెస్‌ గ్రూప్‌ పేరుతో నౌహీరా సంస్థ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో ఉన్న 15 సంస్థలకూ ఆమే నేతృత్వం వహిస్తోంది. తన సంస్థల వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఏ విభాగానికీ సరైన రికార్డులు సమర్పించలేదు. ఈమెపై నమోదైన కేసు దర్యాప్తు చేపట్టిన సీసీఎస్‌ పోలీసులు అనేక మార్గాల్లో కీలక సమాచారం సేకరించారు. దీని ప్రకారం హీరా గ్రూప్‌ వార్షిక టర్నోవర్‌ ఆరేళ్లలో కొన్ని వందల రెట్లు పెరిగిందని గుర్తించారు. 2010–11లో రూ.27 లక్షలుగా ఉన్న గ్రూప్‌ టర్నోవర్‌.. 2016–17 నాటికి రూ.800 కోట్లు దాటింది. ఇప్పటివరకు దాదాపు రూ.6 వేల కోట్ల వ్యాపారం చేసినట్లు నివేదికలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి రికార్డులు ఎక్కడా అందుబాటులో లేవు.

నౌహీరా అరెస్టు సందర్భంలో పోలీసులు ఆమెతో పాటు గ్రూప్‌నకు సంబంధించిన 160 బ్యాంకు ఖాతాలను గుర్తించారు. వీటిలో 130 ఖాతాల వివరాలు సేకరించగా... వాటిలో రూ.25 కోట్లు మాత్రమే ఉన్నాయి. ప్రాథమికంగా 1.7 లక్షలు మంది పెట్టుబడిదారుల జాబితాను పొందగలిగారు. వీటిపై నౌహీరా షేక్‌ నోరు మెదపకపోవడంతో సాంకేతికంగా ముందుకు వెళ్లాలని భావించారు. ఈ పెట్టుబడులకు సంబంధించి 160 బ్యాంకు ఖాతాల ద్వారా లావాదేవీలు జరిగాయి. హీరా గ్రూప్‌ భారీ స్థాయిలో డిపాజిట్లు సేకరించి మోసం చేసినట్లు, ఆ నిధుల్ని సొంత అవసరాలకు వినియోగించుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.

సర్వర్‌ ఆధారంగా ముందుకు..
సర్వర్‌లోని వివరాల ప్రకారం డిపాజిట్‌దారులుగా పేర్కొంటున్న 1.7 లక్షల మంది నిజంగా ఉన్నారా.. లేదా బోగస్‌ వ్యక్తులా.. వారి పెట్టుబడులు ఎటు వెళ్లాయి.. తదితర అంశాలను గుర్తించేందుకు ఆడిటర్‌ సాయం అవసరమని సీసీఎస్‌ అధికారులు నిర్ణయించారు. మరోపక్క నౌహీరా షేక్‌తో పాటు ఆమె బినామీల పేర్లతో ఉన్న దాదాపు రూ.వెయ్యి కోట్ల విలువైన స్థిరాస్తుల్ని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆడిటర్ల సాయంతో మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. నౌహీరాపై నేర నిరూపణలో ఇవే కీలకం కానున్న నేపథ్యంలో ఆడిటింగ్‌ పూర్తయ్యాకే అభియోగాలు దాఖ లు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement