ఇక ఈడీ వంతు! | Enforcement Directorate Eye on Heera Group Company | Sakshi
Sakshi News home page

ఇక ఈడీ వంతు!

Published Wed, Apr 3 2019 2:55 AM | Last Updated on Wed, Apr 3 2019 2:55 AM

Enforcement Directorate Eye on Heera Group Company - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్కీముల పేరుతో రూ.వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఉచ్చు బిగిస్తోంది. ఈ సంస్థపై నమోదైన కేసును దర్యాప్తు చేసిన నగర నేర పరిశోధన విభాగం(సీసీఎస్‌) పోలీసులు వెలుగులోకి తెచ్చిన అంశాల ఆధారంగా చర్యలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం కర్ణాటక జైల్లో ఉన్న నౌహీరా షేక్‌ను అదుపులోకి తీసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. హీరా సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారిలో కొందరు బినామీలు ఉన్నారని, మనీల్యాండరింగ్‌లో భాగంగానే ఈ పెట్టుబడులు జరిగాయని ఈడీ అనుమానిస్తోంది. నౌహీరాతో పాటు ఆమె సంస్థలపై చర్యలు తీసుకునేందుకు ఈడీ ఇప్పటికే సీసీఎస్‌ అధికారులతో భేటీ అయి కీలక వివరాలు సేకరించింది.  

ఫెమా చట్టానికి విరుద్ధంగా  
హీరా గ్రూప్‌ రూ.5,647 కోట్లు భారత కరెన్సీలో భారతీయుల నుంచి డిపాజిట్లు సేకరించినట్లు దర్యాప్తులో తేలింది. దీనికి తోడు ఆరు లక్షల అమెరికా డాలర్లు, 132 కోట్ల యూఏఈ దిరమ్స్, 45 కోట్ల సౌదీ రియాల్స్, 10 కోట్ల కువైట్‌ దీనార్స్‌ పెట్టుబడులుగా వచ్చాయి. ఇలా విదేశీ కరెన్సీలో పెట్టుబడులు సేకరించడం ఫెమా చట్టానికి వ్యతిరేకం. మరోపక్క ఇప్పటి వరకు హీరా గ్రూప్‌ భారత్‌ కరెన్సీలో రూ.2,500 కోట్లు, 2 లక్షల అమెరికా డాలర్లు, 120 కోట్ల యూఏఈ దిరమ్స్, 1.36 లక్షల సౌదీ రియాల్స్‌ డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించినట్లు తేలింది. వీటితో పాటు విదేశీ బ్యాంకుల్లో ఈ సంస్థకు చెందినవిగా అనుమానిస్తున్న ఎనిమిది బ్యాంకు ఖాతాలను సీసీఎస్‌ పోలీసులు గుర్తించారు.

ఈ వివరాలన్నీ క్రోడీకరిస్తూ తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈడీ, ఆదాయపుపన్ను శాఖ, సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ కార్యాలయాలకు లేఖలు రాశారు. దీంతో ఈడీ ప్రాథమిక విచారణ చేపట్టి ఈ కుంభకోణం వెనుక మనీల్యాండరింగ్‌ సైతం ఉన్నట్లు గుర్తించింది. సీసీఎస్‌ తమ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన, సేకరించిన వివరాలను ఈడీ దృష్టికి తీసుకువెళ్లారు. కొన్ని కీలక డాక్యుమెంట్లను అప్పగించారు. ఇప్పటి వరకు లభించిన ఆధారాలను బట్టి హీరా గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టిన వారి సంఖ్య దాదాపు 2 లక్షల వరకు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పోలీసులు ఖాతాలు ఫ్రీజ్‌ చేసే నాటికి ఈ సంస్థకు ఉన్న వివిధ బ్యాంకు ఖాతాల్లో కేవలం రూ.25 కోట్లు మాత్రమే నగదు నిల్వ ఉంది. కేవలం 12 వేల మంది ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించాల్సిన మొత్తమే రూ.300 కోట్లుగా బయటపడింది. దీనికి తోడు ఇప్పటి వరకు మరో 10 వేల మంది తమకు రూ.350 కోట్లు రావాల్సి ఉందంటూ పోలీసులకు నివేదించారు. ఈ మిస్టరీని ఛేదించడంపై ఈడీ అధికారులు దృష్టిపెట్టారు.  

ఆరేళ్లలో రూ.6 వేల కోట్లు టర్నోవర్‌
హీరా గ్రూప్‌ ఆరేళ్లల్లో రూ.6 వేల కోట్ల టర్నోవర్‌ చేసినట్లు గతంలో రిటర్న్స్‌ దాఖలు చేసింది. 2010–11లో కేవలం రూ.27 లక్షలుగా ఉన్న గ్రూప్‌ టర్నోవర్‌... 2016–17 నాటికి రూ.800 కోట్లు దాటింది. దీనికి సంబంధించి పూర్తి రికార్డులు అందుబాటులో లేవు. ఆదాయపు పన్ను(ఐటీ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ), సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేటింగ్‌ ఆఫీస్‌(ఎస్‌ఎఫ్‌ఐఓ), రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌(ఆర్వోసీ) వీటిలో ఒక్కో విభాగానికి ఒక్కో రిటర్న్స్‌ ఫైల్‌ చేసింది. కనీసం డిపాజిట్‌దారుల జాబితా సైతం బయటపెట్టకపోవడంతో అనేక ప్రయత్నాలు చేసిన సీసీఎస్‌ పోలీసులు హీరా గ్రూప్‌నకు చెందిన సర్వర్‌ను బంజారాహిల్స్‌లోని ఓ ఇంట్లో గతేడాది గుర్తించారు. దీంతో పా టు స్వాధీనం చేసుకున్న కొన్ని హార్డ్‌డిస్క్‌ల్ని విశ్లేషించి కీలక విషయాలు గుర్తించారు.   1.7 లక్షల మంది ఇన్వెస్టర్ల జాబితా వెలికి తీయగలిగారు. వీరిలో కొందరు విదేశీయులున్నట్లు రికార్డులు చెబుతున్నాయి.  అనుమతులు తీసుకు న్న తర్వాత  విదేశీ పెట్టుబడుల్ని భారత కరెన్సీలోనే స్వీకరించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement