ఈడీ కస్టడీకి నౌహీరా   | Enforcement Directorate focused on Hira Group Companies | Sakshi
Sakshi News home page

ఈడీ కస్టడీకి నౌహీరా  

Published Wed, May 15 2019 2:55 AM | Last Updated on Wed, May 15 2019 6:50 AM

Enforcement Directorate focused on Hira Group Companies - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్కీముల పేరుతో రూ.వేల కోట్ల స్కామ్‌కు పాల్పడిన హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దృష్టిసారించింది. ఈ సంస్థపై నమోదైన కేసును దర్యాప్తు చేసిన పోలీసులు వెలుగులోకి తెచ్చిన అంశాల ఆధారంగా చర్యలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే నౌహీరాను తమ కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయించిం ది. ఆమె కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్‌ వేయగా, 7 రోజుల కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసిం ది. ఈడీ బుధవారం ఉదయం నుంచి 7 రోజు ల పాటు తమ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. నిందితురాలు నౌహీరా షేక్‌ ఇప్పటి వరకు ఏ దర్యాప్తు సంస్థకీ పూర్తిస్థాయిలో సహకరిచలేదు. హీరా సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారిలో కొందరు బినామీలు ఉన్నారని, మనీలాండరింగ్‌లో భాగంగానే ఈ పెట్టుబడులు పెట్టారని ఈడీ అనుమానిస్తోంది. 

కీలక వివరాలు సేకరించిన ఈడీ
నౌహీరాతో పాటు ఆమె సంస్థలపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్న ఈడీ ఇప్పటికే సీసీఎస్‌ అధికారులతో భేటీ అయి కీలక వివరాలు సేకరించింది. హీరా గ్రూప్‌ ఆరేళ్లలో రూ.6 వేల కోట్లు టర్నోవర్‌ చేసినట్లు గతంలో రిటర్న్స్‌ దాఖలు చేసింది. 2010–11లో రూ.27 లక్షలుగా ఉన్న గ్రూప్‌ టర్నోవర్‌.. 2016–17 నాటికి రూ.800 కోట్లు దాటేసింది. అయితే దీనికి సంబంధించి పూర్తి రికార్డులు అందుబాటులో లేవు. ఆదాయపు పన్ను (ఐటీ), ఈడీ, సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేటింగ్‌ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఐఓ), రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్వోసీ) వీటిలో ఒక్కో విభాగానికి ఒక్కో తరహాలో రిటర్న్స్‌ ఫైల్‌ చేసింది. కనీసం డిపాజిట్‌దారుల జాబితా సైతం ఇప్పటి వరకు తనంతట తానుగా బయటపెట్టలేదు. దీంతో అనేక ప్రయత్నాలు చేసిన సీసీఎస్‌ పోలీసులు హీరా గ్రూప్‌నకు చెందిన సర్వర్‌ను బంజారాహిల్స్‌లోని ఓ ఇంట్లో గుర్తించారు. వీటి ద్వారా ప్రాథమికంగా 1.7 లక్షల మంది ఇన్వెస్టర్ల జాబితాను వెలికితీశారు. 

విదేశీ కరెన్సీతో పెట్టుబడుల సేకరణ
నిబంధనల ప్రకారం విదేశీ పెట్టుబడుల్ని అవసరమైన అనుమతులు తీసుకున్న తర్వాత కేవలం భారత కరెన్సీలోనే స్వీకరించాలి. అయితే ఇప్పటి వరకు సేకరించిన వివరాల ప్రకారం హీరా గ్రూప్‌ రూ.5,647 కోట్లు భారత కరెన్సీలో భారతీయుల నుంచి డిపాజిట్లు సేకరించింది. దీనికి తోడు 6 లక్షల డాలర్లు, 132 కోట్ల దిరమ్స్, 45 కోట్ల సౌదీ రియాల్స్, 10 కోట్ల కువైట్‌ దినార్స్‌ పెట్టుబడులుగా వచ్చాయి. ఇలా విదేశీ కరెన్సీలో పెట్టుబడులు సేకరించడం ఫెమా చట్టానికి వ్యతిరేకం. మరోపక్క ఇప్పటి వరకు హీరా గ్రూప్‌ భారత్‌ కరెన్సీలో రూ.2500 కోట్లు, 2 లక్షల డాలర్లు, 120 కోట్ల దిరమ్స్, 1.36 లక్షలు రియాల్స్‌ డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించినట్లు తేలింది. వీటితో పాటు విదేశీ బ్యాంకుల్లో ఈ సంస్థకు చెందినవిగా అనుమానిస్తున్న 8 బ్యాంకు ఖాతాలను సీసీఎస్‌ పోలీసులు గుర్తించారు.

ఈ వివరాలన్నీ క్రోడీకరిస్తూ తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈడీ, ఐటీ, సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌లకు లేఖలు రాశారు. దీంతో స్పందించిన ఈడీ ప్రాథమిక విచారణ నేపథ్యంలో ఈ స్కామ్‌ వెనుక మనీలాండరింగ్‌ సైతం ఉన్నట్లు తేల్చింది. పోలీసులు హీరా గ్రూప్‌ ఖాతాలు ఫ్రీజ్‌ చేసే నాటికి ఈ సంస్థకు ఉన్న వివిధ బ్యాంకు ఖాతాల్లో కేవలం రూ.25 కోట్లు మాత్రమే నగదు నిల్వ ఉంది. 12 వేల మంది ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించాల్సిన మొత్తమే రూ.300 కోట్లుగా బయటపడింది. ఇప్పటివరకు మరో 10 వేల మంది తమకు రూ.350 కోట్లు రావాల్సి ఉందంటూ పోలీసులకు నివేదించారు. ఈ మిస్టరీని ఛేదించడంపై ఈడీ అధికారులు దృష్టిపెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement