సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా రూ.వందల కోట్ల స్కామ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నౌహీరా షేక్ ఇలా బయటకు వచ్చి... అలా వెంటనే అరెస్టయ్యారు. నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు అరెస్టు చేసిన కేసులో గత వారం జైలుకు వెళ్లిన నౌహీరా బెయిల్‌పై శుక్రవారం ఉదయం విడుదలయ్యారు. జైలు వద్దే కాపుకాసిన మహారాష్ట్ర థానే జిల్లా నిజాంపుర పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని అక్కడికి తరలించారు. శనివారం కోర్టులో హాజరుపరచడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క నౌహీరాకు కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సీసీఎస్ పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నౌహీరా అరెస్టు నుంచి ఆసక్తికరమైన నాటకీయ పరిణామాలు అనేకం చోటు చేసుకున్నాయి.
జైలు వద్దే నిజాంపుర పోలీసులు..
నౌహీరా షేక్‌ను అరెస్టు చేసిన పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన న్యాయస్థానం అనుమతి నిరాకరిస్తూ, ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.5 లక్షలతో రెండు పూచీకత్తులు ఇవ్వాలని, ఈ నెల 29 లోపు న్యాయస్థానంలో రూ.5 కోట్లు డిపాజిట్ చేయాలని, పాస్‌పోర్ట్ అప్పగించడంతో పాటు అనుమతి లేకుండా దేశం దాటవద్దంటూ కోర్టు షరతులు విధించింది. పూచీకత్తుల దాఖలు, విడుదల ఉత్తర్వులు తీసుకోవడం గురువారం పూర్తయినప్పటికీ జైలు సమయం మించిపోవడంతో నౌహీరా విడుదల కాలేదు. అయితే హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, నౌహీరా షేక్‌పై దేశవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. ఆమెకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలుసుకున్న «నిజాంపుర పోలీసులు గురువారమే పీటీ వారెంట్లతో చంచల్‌గూడ జైలు వద్దకు వచ్చారు. ఆమె విడుదల కాకపోవడంతో శుక్రవారం తెల్లవారుజాము వరకు జైలు వద్ద మాటు వేశారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో జైలు నుంచి బయటకు వస్తున్న నౌహీరాను అదుపులోకి తీసుకుని రోడ్డు మార్గంలో నిజాంపురకు తరలించారు. అక్కడి కోర్టులో శనివారం హాజరుపరచడానికి సన్నాహాలు చేస్తున్నారు. చంచల్‌గూడ జైలు వద్ద నౌహీరాను అదుపులోకి తీసుకునే సందర్భంలో ఆమె న్యాయవాదులకు, నిజాంపుర పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలిసింది.
కేరళకు ప్రత్యేక బృందం...
నౌహీరాకు కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని, తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీసీఎస్ పోలీసులు శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఓ ప్రత్యేక పోలీసు బృందం కేరళకు బయలుదేరి వెళ్లింది. సాధారణంగా కార్పొరేట్, బడా వ్యాపార సంస్థలు తమ బ్యాంకు ఖాతాలను మార్చడానికి ఇష్టపడవు. అయితే హీరా గ్రూప్ వ్యవహారం మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు హీరా గ్రూప్‌తో పాటు నౌహీరా నుంచి వారి బ్యాంకు ఖాతాల వివరాలు తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అధికారులు కేంద్రం అధీనంలోని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్‌ఐయూ) ద్వారా 160 బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించారు. వీటిని పరిశీలించగా... దాదాపు సగం క్లోజ్ అయినట్లు తేలింది. ఒక్క ఐసీఐసీఐ బ్యాంక్‌లోనే 56 ఖాతాలు ఉండగా, 53 ఖాతాలను మూసేశారు. ఇలా మరికొన్ని బ్యాంకుల్లోనూ జరిగిందని, ముందు నుంచీ ఇలానే జరుగుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో ఈ ఖాతాల క్లోజింగ్ వెనుక ఉన్న మతలబు ఏమిటనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment