nowhira
-
‘నేను అరెస్టులకు, బెదిరింపులకు భయపడను’
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ప్రజాకర్షక పథకాల పేరుతో వేల కోట్ల రూపాయలు అక్రమంగా సేకరించిన కేసులో హీరా గోల్డ్ గ్రూప్ అధినేత నౌహీరా షేక్‌పై చేపట్టిన ఈడీ విచారణ ముగిసింది. ఈడీ విచారణ అనంతరం నౌహీరా షేక్ మాట్లాడుతూ.. ‘హీరా గ్రూపులో పెట్టిన పెట్టుబడిదారులను ఎవ్వరిని మోసం చేయలేదు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు నేను పూర్తిగా సహకరిస్తున్నాను.డిపాజిట్ దారులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి ఇన్వెస్ట్‌మెంట్‌కు రెండింతలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇన్వెస్టర్ల డబ్బులను న్యాయస్థానల్లో డీడీ రూపంలో ఇప్పటికే డిపాజిట్ చేశాను. సుప్రీంకోర్టు లో ఆస్తులను అమ్ముకునేందుకు తీర్పు అనుకూలంగా వచ్చాయి. ఇప్పటి వరకు డిపాజిటర్ల తిరిగి చెల్లించిన వివరాలు ఈడీకి సమర్పించాను. ఇకపై నా ఇన్వెస్టర్లతో కలిసి వ్యాపారం కొనసాగిస్తాను. నేను పొలిటికల్ పార్టీ ప్రకటించాగానే మూడు రోజుల్లో నన్ను అరెస్ట్ చేశారు. రాజకీయ ఒత్తిడ్ల తోనే నాపై అక్రమ కేసులు పెట్టారు. నేను అరెస్టులకు, బెదిరింపులకు భయపడను’ అని నౌహీరా షేక్ పేర్కొన్నారు. -
హీరా గోల్డ్ కేసులో ఈడీ విచారణకు నౌహీరా షేక్
-
నౌహీరా షేక్‌కు బెయిల్ మంజూరు
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ప్రజాకర్షక పథకాల పేరుతో వేల కోట్ల రూపాయలు అక్రమంగా సేకరించిన కేసులో హీరా గోల్డ్ గ్రూప్ అధినేత నౌహీరా షేక్‌కు బెయిల్ మంజూరైంది. డిపాజిటర్లకు సొమ్ము తిరిగి చెల్లించడానికి ఆరువారాల గడువుతోపాటు వ్యక్తిగత బాండుపై షరతులు విధిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. బెయిల్ పిటిషన్‌ను మంగళవారం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ హృషికేశ్ రాయ్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. ‘‘ఇరుపక్షాల వాదనలూ విన్నాం. డిపాజిటర్ల డబ్బు కోల్పోకుండా కోర్టు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే మధ్యంతర బెయిలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. పెట్టుబడిదారులకు డిపాజిట్లు చిత్తశుద్ధితో తిరిగి చెల్లిస్తానని చెప్పడంతో ఓ అవకాశం ఇస్తున్నాం. వ్యక్తిగత బాండుపై షరతులతో కూడిన ఆరువారాల మధ్యంతర బెయిలు మంజూరు చేస్తున్నాం. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ దర్యాప్తు అధికారి వద్ద సొమ్ము జమ చేయాలి’’ అని కోర్టు సూచించింది. ‘‘నౌహీరా షేక్ తన స్నేహితుడి ద్వారా ఇచ్చిన ఒప్పందానికి కట్టుబడి ఉంటారని, ఫిర్యాదుదారుల క్లెయిమ్‌లు గడువు తేదీ నాటికి పరిష్కరిస్తారని ఈ బెయిలు ఇస్తున్నాం. చెల్లింపులు సులభంగా చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అటాచ్‌చేసిన రూ.21 కోట్లు, ఈడీ అటాచ్ చేసిన రూ.22 కోట్లతోపాటు నౌహీరా జమ చేసిన రూ.6 కోట్లు మొత్తం సుమారు రూ.50 కోట్లు వినియోగించుకోవచ్చు. వాటిని వినియోగించడానికి అటాచ్ చేసిన బ్యాంకు ఖాతాలు సంబంధిత దర్యాప్తు అధికారి సంతకం ద్వారా ఆపరేషన్లోకి వస్తాయి. ప్రతి సోమవారం పది గంటలకు కూకట్పల్లి పోలీసు స్టేషన్లో రిపోర్టు చేయాలి. ఎఫ్ఐఆర్ నమోదైన పోలీసు స్టేషన్ లేదా ఫిర్యాదు పెండింగ్‌లో ఉన్న కోర్టు/పోలీసు స్టేషన్ ద్వారా ఈ మొత్తాలు చెల్లించాలి’’అని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. -
నౌహీరా కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: హీరా గ్రూప్స్ అధినేత నౌహీరా కేసును తెలంగాణ హైకోర్టు బుధవారం సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్‌కి బదిలీ చేసింది. దేశ వ్యాప్తంగా అక్రమ డిపాజిట్లు వసూలు చేసి నౌహిరా షేక్ మోసం చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం నౌహిరా షేక్ చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. హైదరాబాద్‌లో సెప్టెంబర్ 2018న సీసీఎస్ పోలీసులు నౌ హీరా పై కేసు నమోదు చేశారు. అక్టోబర్ 2018లో హీరా షేక్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో 28 మందిని నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. నౌహీరా బ్యాంక్ ఖాతాల్లో జరిగిన లావాదేవీల్లో డిపాజిటర్ల నుండి తీసుకున్న డబ్బుతో పాటు, డిపాజిటర్లకు తిరిగి చెల్లించిన వివరాలు, నిధులు మళ్లించిన వివరాలను సీసీఎస్ పోలీసులు ఛార్జ్ షీట్లో పేర్కొన్న విషయం తెలిసిందే. -
హీరా కుంభకోణంపై దర్యాప్తు ఇలాగేనా?
సాక్షి, హైదరాబాద్: చిన్న మొత్తాలకు భారీ పెద్ద మొత్తాలను తిరిగిస్తామని చెప్పి రూ.50 వేల కోట్ల మేరకు కాజేసిన హీరా గ్రూప్‌పై 2012లోనే కేసు నమోదైనా ఇప్పటివరకూ ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారని తెలంగాణ పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే గతేడాది వరకూ ఆ కంపెనీ ఎండీ నౌహీరా షేక్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదని అడిగింది. ఎఫ్ఐఆర్ నమోదైన ఏడేళ్లకు ఎండీని అరెస్ట్ చేసేంత జాప్యం ఎందుకు జరిగిందని, పోలీసుల దర్యాప్తు తీరు నత్తనడకగా ఉంటే సీబీఐ దర్యాప్తు ఒక్కటే మిగిలిన మార్గమని బాధితులు భావిస్తున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది. హీరా గ్రూప్‌పై నమోదైన ఎఫ్ఐఆర్ల దర్యాప్తుల ప్రగతిని సమగ్రంగా అందజేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 16కుపైగా బోగస్ కంపెనీలతో హీరా గ్రూప్ జనాన్ని మోసం చేసిందని హీరా గ్రూప్ బాధితుల సంఘం అధ్యక్షుడు సహబాజ్ అహ్మద్ ఖాన్ దాఖలు చేసిన పిల్‌ను సోమవారం హైకోర్టు మరోసారి విచారించింది. జనం నుంచి మోసపూరితంగా వసూలు చేసిన సొమ్ము రూ.50 వేల కోట్లని, అయితే ఆ కంపెనీలకు చెందిన 240 బ్యాంకు ఖాతాల్లో కేవలం రూ.25 కోట్ల పైచిలుకు మాత్రమే సొమ్ములున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు. -
నౌహీరా కేసులో.. పోలీసుల దూకుడు
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా అక్రమ డిపాజిట్లు వసూలు చేసి మోసం చేసిన హీరా గ్రూప్స్ అధినేత నౌహీరా కేసులో సీసీఎస్ పోలీసులు దూకుడుపెంచారు. నౌహీరా షేక్ పై నాంపల్లి కోర్టులో సీసీఎస్ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మొత్తం వెయ్యి పేజీలతో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఛార్జ్ షీట్ లో ఏ1గా నౌహీరా షేక్ పేరును చేర్చారు. ఇప్పటికే నౌహీరా షేక్ చంచల్ గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. నౌ హీరా బ్యాంక్ ఖాతాల్లో జరిగిన లావాదేవీల్లో డిపాజిటర్ల నుండి తీసుకున్న డబ్బుతో పాటు, డిపాజిటర్లకు తిరిగి చెల్లించిన వివరాలు, నిధులు మళ్లించిన వివరాలను సీసీఎస్ పోలీసులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 1.5 లక్షల మంది నౌహీరా బారిన పడ్డారు. ఆరేళ్ల క్రితం హీరా గ్రూప్ కంపెనీని నౌ హీరా ప్రారంభించారు. డిపాజిట్లకి అధిక వడ్డీతో తిరిగి చెల్లిస్తానని, చైన్ పద్ధతిలో స్కీం కు నౌహీరా కంపెనీ తెర లేపింది. ప్రారంభంలో 200 కోట్ల రూపాయాలతో డిపాజిట్లు చేయించుకుంటే, ఇప్పుడు కంపెనీ ఖాతాల్లో 23 కోట్లు రూపాయలు మాత్రమే ఉన్నాయి. గతేడాది మే నుండి డిపాజిట్ దారులకు నౌ హీరా చెల్లింపులు ఆపేసింది. ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సహా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నౌహీరాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లో సెప్టెంబర్ 2018 లో సీసీఎస్ పోలీసులు నౌ హీరా పై కేసు నమోదు చేశారు. అక్టోబర్ 2018 లో హీరా షేక్ ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో 28 మందిని నిందితులుగా చేర్చారు. ఇప్పటి వరకు కేవలం ముగ్గురిని మాత్రమే అరెస్ట్ చేయగా.. మిగతా వారి కోసం గాలింపుచేపట్టారు. -
నౌహీరా షేక్ కార్యాలయాలపై జీఎస్టీ దాడులు
సాక్షి, హైదరాబాద్: నౌహీరా షేక్ వ్యవహారంలో జీఎస్టీ కూడా రంగంలోకి దిగింది. జీఎస్టీలో కోట్లాది రూపాయలు ఎగవేసిన కేసులో జీఎస్టీ అధికారులు శుక్రవారం ఆమె కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) హైదరాబాద్‌లో నౌహీరాకు చెందిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి చెందిన సంస్థ కార్యాలయాలను సీజ్ చేసింది. ఈ దాడుల్లో టోలీచౌకిలోని నదీమ్‌కాలనీలో 20 ఫ్లాట్లు, మాసబ్ ట్యాంక్‌లో 10 ఫ్లాట్లు, కూకట్‌పల్లిలోని ఓ వాణిజ్య సముదాయాన్ని అధికారులు సీజ్‌చేశారు. ఉదయం 10గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా మొత్తం ఏడు బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. ఇందులో భాగంగా బంజారాహిల్స్‌లోని హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రధాన కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించారు. ఈ విషయంలో డీజీజీఐ ఇప్పటికే హీరా గ్రూప్‌నకు నోటీసులు జారీ చేసిందని హైదరాబాద్ జోనల్ ఆఫీసర్ ఎ.శ్రీధర్ తెలిపారు. దాడుల్లో భాగంగా ఎన్‌ఎండీసీలోని ఆసిఫ్ ఫ్లాజాలో ఉన్న హీరా రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్‌లోనూ సోదాలు జరిగాయి. ఇదే సమయంలో నౌహీరాషేక్‌తోపాటు ఆమె అనుచరులు బిజు థామస్, మాలీ థామస్‌లను పీటీవారెంట్ కింద తమకు అప్పగించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరే (ఈడీ) నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ ముగ్గురు నిందితులు ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు. -
‘హీరా’ కేసులో ఆడిటర్ సాయం!
సాక్షి, హైదరాబాద్: ఏదైనా నేరానికి సంబంధించి కేసు నమోదైతే అభియోగపత్రాలను పోలీసులే దాఖలు చేస్తారు.. అయితే స్కీముల పేరుతో వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డ హీరా గ్రూప్ వ్యవహారంలో పోలీసులకు ఆడిటర్ అవసరం వచ్చింది. ఈ సంస్థ ఏం గోల్మాల్ చేసిందనేది ప్రాథమికంగా హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు తేల్చినా.. పూర్తిస్థాయిలో ఓ రూపు తీసుకొచ్చేందుకు ఆడిటర్ అవసరమని భావిస్తున్నారు. అందుకు అనుమతి కోరుతూ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. అనుమతి వస్తే.. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ చరిత్రలోనే హీరా కేసు అరుదైనదిగా కానుంది. ఆరేళ్లలో వేల కోట్ల టర్నోవర్ సాగించి, బ్యాంకు ఖాతాల్లో కనీసం వంద కోట్లు కూడా లేని హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవహారాన్ని సీసీఎస్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. 2010–11లో హీరా ఇస్లామిక్ బిజినెస్ గ్రూప్ పేరుతో నౌహీరా సంస్థ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో ఉన్న 15 సంస్థలకూ ఆమే నేతృత్వం వహిస్తోంది. తన సంస్థల వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఏ విభాగానికీ సరైన రికార్డులు సమర్పించలేదు. ఈమెపై నమోదైన కేసు దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు అనేక మార్గాల్లో కీలక సమాచారం సేకరించారు. దీని ప్రకారం హీరా గ్రూప్ వార్షిక టర్నోవర్ ఆరేళ్లలో కొన్ని వందల రెట్లు పెరిగిందని గుర్తించారు. 2010–11లో రూ.27 లక్షలుగా ఉన్న గ్రూప్ టర్నోవర్.. 2016–17 నాటికి రూ.800 కోట్లు దాటింది. ఇప్పటివరకు దాదాపు రూ.6 వేల కోట్ల వ్యాపారం చేసినట్లు నివేదికలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి రికార్డులు ఎక్కడా అందుబాటులో లేవు. నౌహీరా అరెస్టు సందర్భంలో పోలీసులు ఆమెతో పాటు గ్రూప్‌నకు సంబంధించిన 160 బ్యాంకు ఖాతాలను గుర్తించారు. వీటిలో 130 ఖాతాల వివరాలు సేకరించగా... వాటిలో రూ.25 కోట్లు మాత్రమే ఉన్నాయి. ప్రాథమికంగా 1.7 లక్షలు మంది పెట్టుబడిదారుల జాబితాను పొందగలిగారు. వీటిపై నౌహీరా షేక్ నోరు మెదపకపోవడంతో సాంకేతికంగా ముందుకు వెళ్లాలని భావించారు. ఈ పెట్టుబడులకు సంబంధించి 160 బ్యాంకు ఖాతాల ద్వారా లావాదేవీలు జరిగాయి. హీరా గ్రూప్ భారీ స్థాయిలో డిపాజిట్లు సేకరించి మోసం చేసినట్లు, ఆ నిధుల్ని సొంత అవసరాలకు వినియోగించుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. సర్వర్ ఆధారంగా ముందుకు.. సర్వర్‌లోని వివరాల ప్రకారం డిపాజిట్‌దారులుగా పేర్కొంటున్న 1.7 లక్షల మంది నిజంగా ఉన్నారా.. లేదా బోగస్ వ్యక్తులా.. వారి పెట్టుబడులు ఎటు వెళ్లాయి.. తదితర అంశాలను గుర్తించేందుకు ఆడిటర్ సాయం అవసరమని సీసీఎస్ అధికారులు నిర్ణయించారు. మరోపక్క నౌహీరా షేక్‌తో పాటు ఆమె బినామీల పేర్లతో ఉన్న దాదాపు రూ.వెయ్యి కోట్ల విలువైన స్థిరాస్తుల్ని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆడిటర్ల సాయంతో మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. నౌహీరాపై నేర నిరూపణలో ఇవే కీలకం కానున్న నేపథ్యంలో ఆడిటింగ్ పూర్తయ్యాకే అభియోగాలు దాఖ లు చేయాలని అధికారులు భావిస్తున్నారు. -
హీరా గ్రూప్‌కు వ్యాపారమే లేదు
సాక్షి, హైదరాబాద్: వివిధ రకాల స్కీముల పేరుతో భారీగా డిపాజిట్లు వసూలు చేసి స్కామ్‌కు పాల్పడ్డ హీరా గ్రూప్‌నకు ఎలాంటి వ్యాపారం లేదని గుర్తించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తేల్చి చెప్పింది. కేవలం మనీలాండరింగ్ కోసమే డబ్బు వసూలు చేసినట్లు అనుమానిస్తున్నామని పేర్కొంది. దీనికి సంబంధించి తాము నమోదు చేసిన కేసులో గ్రూప్ సీఈవో నౌహీరా షేక్‌తోపాటు ఆమెకు ప్రధాన అనుచరులుగా భావిస్తున్న మోల్లీ థామస్, బిజూ థామస్‌లను అరెస్టు చేసినట్లు బుధవారం ప్రకటించింది. న్యాయస్థానం అనుమతితో తదుపరి విచారణ నిమిత్తం వారం రోజుల కస్టడీకి తీసుకున్నట్లు తెలిపింది. హీరా గ్రూప్ డిపాజిట్‌దారులకు సాలీనా 36 శాతం వడ్డీతోపాటు బంగారం వ్యాపారంలో పెట్టుబడులంటూ ఎర వేసింది. ఓ దశలో డబ్బు తిరిగి చెల్లించడంలో గ్రూప్ విఫలం కావడంతో అనేక మంది బాధితులుగా మారారు. ఇప్పటివరకు ఈడీ సేకరించిన సమాచారం ప్రకారం 1,72,114 మంది డిపాజిట్‌దారుల నుంచి రూ.3 వేల కోట్లు వసూలు చేసినట్లు స్పష్టమైంది. ఈ డబ్బులో అత్యధిక శాతం తమ సొంత ఖాతాల్లోకి మళ్ళించిన నిందితులు, వాటితో వివిధ ప్రాంతాల్లో స్థిర, చరాస్తులు ఖరీదు చేశారు. హీరా గ్రూప్ బాధితులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ తదితర రాష్ట్రాలతో పాటు యూఏఈ, సౌదీ అరేబియా, మధ్య ఆసియా దేశాల్లోనూ ఉన్నట్లు ఈడీ పేర్కొంది. హీరా గ్రూప్ ముసుగులో నౌహీరా 24 సంస్థల్ని స్థాపించినట్లు, వీటి ఆధారంగా 182 బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు వెలుగులోకి వచ్చింది. వీటికితోడు యూఏఈ, సౌదీ అరేబియాల్లో మరో 10 ఖాతాలు ఉన్నట్లు తేలింది. హీరా గ్రూప్‌తోపాటు దాని ఖాతాదారుల వివరాలు నిర్వహించడానికి బిజు థామస్ తానే ఎండీగా శ్రవణ్ టెక్నాలజీస్ సొల్యూషన్స్ పేరుతో కేరళలో సంస్థను ఏర్పాటు చేసినట్లు ఈడీ తెలిపింది. మొల్లీ థామస్ ఆది నుంచీ నౌహీరా వెంట ఉండి మోసాలకు సహకరించినట్లు ఆరోపించింది. హీరా గ్రూప్ కంపెనీలు, బ్యాంక్ ఖాతాల లావాదేవీలతోపాటు అక్రమ ఆస్తుల విషయాన్నీ కస్టడీలో ఉన్న నిందితుల నుంచి ఈడీ సేకరించనుంది. ఈడీ కస్టడీకి: నౌహీరా షేక్ చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలి సిందే. ఈ కేసులో ఆమెను విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు బుధవారం కోర్టు ఉత్తర్వులతో కస్టడీలోకి తీసుకున్నారు. ఆమెను ఈడీ ఏడు రోజులపాటు విచారించనుంది. ఇదే కేసు లో చంచల్‌గూడ జైల్లోనే రిమాండ్ ఖైదీ లుగా ఉన్న బిజూ థామస్, మౌళి థామస్‌లను కూడా కస్టలోకి తీసుకున్నారు. -
పీఎంఎల్ యాక్ట్ కింద నౌహీరాను విచారిస్తున్న ఈడీ
-
నౌహీరా షేక్‌ను కస్టడీలోకి తీసుకున్న ఈడీ
సాక్షి, హైదరాబాద్ : స్కీముల పేరుతో రూ.వేల కోట్ల స్కామ్‌కు పాల్పడిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యజమాని నౌహీరా షేక్‌ను వారం రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ఈ క్రమంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నౌహీరాను బుధవారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నెల 21 వరకు ఆమెను ప్రశ్నించనున్నారు. ఈ విషయం గురించి ఓ అధికారి మాట్లాడుతూ.. నౌహీరాతో పాటు.. ఆమె సహాయకురాలు మౌలి థామస్, మరో సహాయకుడు విజీని కూడా అరెస్ట్ చేశామన్నారు. పీఎంఎల్ యాక్ట్ కింద నౌహీరాను విచారిస్తున్నామని తెలిపారు. హీరా గ్రూపు దేశ వ్యాప్తంగా 1.72 లక్షల మంది నుంచి రూ.3 వేల కోట్లు వసూలు చేసినట్లు గుర్తించామన్నారు. హీరా గ్రూపు విదేశీయుల నుంచి సైతం డిపాజిట్లు వసూలు చేసి.. ఆ సొమ్మును తమ సొంత ఖాతాల్లోకి మళ్లించినట్లు తెలిసిందన్నారు. హీరా గ్రూప్ దేశ విదేశాల్లో 24 వ్యాపార సంస్థలు నెలకొల్పి.. 18 బ్యాంక్ ఖాతాల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తోందన్నారు. సౌదీ, యూఏఈ దేశాలతో పాటు హీరా గ్రూపుకు మరో 10 బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : పీఎంఎల్ యాక్ట్ కింద నౌహీరాను విచారిస్తున్న ఈడీ ఈడీ అధికారులు నౌహీరా షేక్‌ను తీసుకెళ్లే సమయంలో జైలు నుంచి బయటకు రాగానే ఆమె కింద పడిపోయింది. వెంటనే అధికారులు వచ్చి ఆమెను పైకి లేపారు. నౌహీరా షేక్ ప్రస్తుతం రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్నట్లు జైలువర్గాలు తెలిపాయి. ఆమె బీపీ, షుగర్ లెవల్స్ పడిపోవడంతో ఇలా జరిగిందన్నారు. -
ఈడీ కస్టడీకి నౌహీరా
సాక్షి, హైదరాబాద్: స్కీముల పేరుతో రూ.వేల కోట్ల స్కామ్‌కు పాల్పడిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టిసారించింది. ఈ సంస్థపై నమోదైన కేసును దర్యాప్తు చేసిన పోలీసులు వెలుగులోకి తెచ్చిన అంశాల ఆధారంగా చర్యలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే నౌహీరాను తమ కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయించిం ది. ఆమె కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయగా, 7 రోజుల కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసిం ది. ఈడీ బుధవారం ఉదయం నుంచి 7 రోజు ల పాటు తమ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. నిందితురాలు నౌహీరా షేక్ ఇప్పటి వరకు ఏ దర్యాప్తు సంస్థకీ పూర్తిస్థాయిలో సహకరిచలేదు. హీరా సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారిలో కొందరు బినామీలు ఉన్నారని, మనీలాండరింగ్‌లో భాగంగానే ఈ పెట్టుబడులు పెట్టారని ఈడీ అనుమానిస్తోంది. కీలక వివరాలు సేకరించిన ఈడీ నౌహీరాతో పాటు ఆమె సంస్థలపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్న ఈడీ ఇప్పటికే సీసీఎస్ అధికారులతో భేటీ అయి కీలక వివరాలు సేకరించింది. హీరా గ్రూప్ ఆరేళ్లలో రూ.6 వేల కోట్లు టర్నోవర్ చేసినట్లు గతంలో రిటర్న్స్ దాఖలు చేసింది. 2010–11లో రూ.27 లక్షలుగా ఉన్న గ్రూప్ టర్నోవర్.. 2016–17 నాటికి రూ.800 కోట్లు దాటేసింది. అయితే దీనికి సంబంధించి పూర్తి రికార్డులు అందుబాటులో లేవు. ఆదాయపు పన్ను (ఐటీ), ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ), రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) వీటిలో ఒక్కో విభాగానికి ఒక్కో తరహాలో రిటర్న్స్ ఫైల్ చేసింది. కనీసం డిపాజిట్‌దారుల జాబితా సైతం ఇప్పటి వరకు తనంతట తానుగా బయటపెట్టలేదు. దీంతో అనేక ప్రయత్నాలు చేసిన సీసీఎస్ పోలీసులు హీరా గ్రూప్‌నకు చెందిన సర్వర్‌ను బంజారాహిల్స్‌లోని ఓ ఇంట్లో గుర్తించారు. వీటి ద్వారా ప్రాథమికంగా 1.7 లక్షల మంది ఇన్వెస్టర్ల జాబితాను వెలికితీశారు. విదేశీ కరెన్సీతో పెట్టుబడుల సేకరణ నిబంధనల ప్రకారం విదేశీ పెట్టుబడుల్ని అవసరమైన అనుమతులు తీసుకున్న తర్వాత కేవలం భారత కరెన్సీలోనే స్వీకరించాలి. అయితే ఇప్పటి వరకు సేకరించిన వివరాల ప్రకారం హీరా గ్రూప్ రూ.5,647 కోట్లు భారత కరెన్సీలో భారతీయుల నుంచి డిపాజిట్లు సేకరించింది. దీనికి తోడు 6 లక్షల డాలర్లు, 132 కోట్ల దిరమ్స్, 45 కోట్ల సౌదీ రియాల్స్, 10 కోట్ల కువైట్ దినార్స్ పెట్టుబడులుగా వచ్చాయి. ఇలా విదేశీ కరెన్సీలో పెట్టుబడులు సేకరించడం ఫెమా చట్టానికి వ్యతిరేకం. మరోపక్క ఇప్పటి వరకు హీరా గ్రూప్ భారత్ కరెన్సీలో రూ.2500 కోట్లు, 2 లక్షల డాలర్లు, 120 కోట్ల దిరమ్స్, 1.36 లక్షలు రియాల్స్ డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించినట్లు తేలింది. వీటితో పాటు విదేశీ బ్యాంకుల్లో ఈ సంస్థకు చెందినవిగా అనుమానిస్తున్న 8 బ్యాంకు ఖాతాలను సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఈ వివరాలన్నీ క్రోడీకరిస్తూ తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈడీ, ఐటీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్‌లకు లేఖలు రాశారు. దీంతో స్పందించిన ఈడీ ప్రాథమిక విచారణ నేపథ్యంలో ఈ స్కామ్ వెనుక మనీలాండరింగ్ సైతం ఉన్నట్లు తేల్చింది. పోలీసులు హీరా గ్రూప్ ఖాతాలు ఫ్రీజ్ చేసే నాటికి ఈ సంస్థకు ఉన్న వివిధ బ్యాంకు ఖాతాల్లో కేవలం రూ.25 కోట్లు మాత్రమే నగదు నిల్వ ఉంది. 12 వేల మంది ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించాల్సిన మొత్తమే రూ.300 కోట్లుగా బయటపడింది. ఇప్పటివరకు మరో 10 వేల మంది తమకు రూ.350 కోట్లు రావాల్సి ఉందంటూ పోలీసులకు నివేదించారు. ఈ మిస్టరీని ఛేదించడంపై ఈడీ అధికారులు దృష్టిపెట్టారు. -
ఇక ఈడీ వంతు!
సాక్షి, హైదరాబాద్: స్కీముల పేరుతో రూ.వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఉచ్చు బిగిస్తోంది. ఈ సంస్థపై నమోదైన కేసును దర్యాప్తు చేసిన నగర నేర పరిశోధన విభాగం(సీసీఎస్) పోలీసులు వెలుగులోకి తెచ్చిన అంశాల ఆధారంగా చర్యలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం కర్ణాటక జైల్లో ఉన్న నౌహీరా షేక్‌ను అదుపులోకి తీసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. హీరా సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారిలో కొందరు బినామీలు ఉన్నారని, మనీల్యాండరింగ్‌లో భాగంగానే ఈ పెట్టుబడులు జరిగాయని ఈడీ అనుమానిస్తోంది. నౌహీరాతో పాటు ఆమె సంస్థలపై చర్యలు తీసుకునేందుకు ఈడీ ఇప్పటికే సీసీఎస్ అధికారులతో భేటీ అయి కీలక వివరాలు సేకరించింది. ఫెమా చట్టానికి విరుద్ధంగా హీరా గ్రూప్ రూ.5,647 కోట్లు భారత కరెన్సీలో భారతీయుల నుంచి డిపాజిట్లు సేకరించినట్లు దర్యాప్తులో తేలింది. దీనికి తోడు ఆరు లక్షల అమెరికా డాలర్లు, 132 కోట్ల యూఏఈ దిరమ్స్, 45 కోట్ల సౌదీ రియాల్స్, 10 కోట్ల కువైట్ దీనార్స్ పెట్టుబడులుగా వచ్చాయి. ఇలా విదేశీ కరెన్సీలో పెట్టుబడులు సేకరించడం ఫెమా చట్టానికి వ్యతిరేకం. మరోపక్క ఇప్పటి వరకు హీరా గ్రూప్ భారత్ కరెన్సీలో రూ.2,500 కోట్లు, 2 లక్షల అమెరికా డాలర్లు, 120 కోట్ల యూఏఈ దిరమ్స్, 1.36 లక్షల సౌదీ రియాల్స్ డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించినట్లు తేలింది. వీటితో పాటు విదేశీ బ్యాంకుల్లో ఈ సంస్థకు చెందినవిగా అనుమానిస్తున్న ఎనిమిది బ్యాంకు ఖాతాలను సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఈ వివరాలన్నీ క్రోడీకరిస్తూ తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈడీ, ఆదాయపుపన్ను శాఖ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయాలకు లేఖలు రాశారు. దీంతో ఈడీ ప్రాథమిక విచారణ చేపట్టి ఈ కుంభకోణం వెనుక మనీల్యాండరింగ్ సైతం ఉన్నట్లు గుర్తించింది. సీసీఎస్ తమ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన, సేకరించిన వివరాలను ఈడీ దృష్టికి తీసుకువెళ్లారు. కొన్ని కీలక డాక్యుమెంట్లను అప్పగించారు. ఇప్పటి వరకు లభించిన ఆధారాలను బట్టి హీరా గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టిన వారి సంఖ్య దాదాపు 2 లక్షల వరకు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పోలీసులు ఖాతాలు ఫ్రీజ్ చేసే నాటికి ఈ సంస్థకు ఉన్న వివిధ బ్యాంకు ఖాతాల్లో కేవలం రూ.25 కోట్లు మాత్రమే నగదు నిల్వ ఉంది. కేవలం 12 వేల మంది ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించాల్సిన మొత్తమే రూ.300 కోట్లుగా బయటపడింది. దీనికి తోడు ఇప్పటి వరకు మరో 10 వేల మంది తమకు రూ.350 కోట్లు రావాల్సి ఉందంటూ పోలీసులకు నివేదించారు. ఈ మిస్టరీని ఛేదించడంపై ఈడీ అధికారులు దృష్టిపెట్టారు. ఆరేళ్లలో రూ.6 వేల కోట్లు టర్నోవర్ హీరా గ్రూప్ ఆరేళ్లల్లో రూ.6 వేల కోట్ల టర్నోవర్ చేసినట్లు గతంలో రిటర్న్స్ దాఖలు చేసింది. 2010–11లో కేవలం రూ.27 లక్షలుగా ఉన్న గ్రూప్ టర్నోవర్... 2016–17 నాటికి రూ.800 కోట్లు దాటింది. దీనికి సంబంధించి పూర్తి రికార్డులు అందుబాటులో లేవు. ఆదాయపు పన్ను(ఐటీ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీస్(ఎస్ఎఫ్ఐఓ), రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్(ఆర్వోసీ) వీటిలో ఒక్కో విభాగానికి ఒక్కో రిటర్న్స్ ఫైల్ చేసింది. కనీసం డిపాజిట్‌దారుల జాబితా సైతం బయటపెట్టకపోవడంతో అనేక ప్రయత్నాలు చేసిన సీసీఎస్ పోలీసులు హీరా గ్రూప్‌నకు చెందిన సర్వర్‌ను బంజారాహిల్స్‌లోని ఓ ఇంట్లో గతేడాది గుర్తించారు. దీంతో పా టు స్వాధీనం చేసుకున్న కొన్ని హార్డ్‌డిస్క్‌ల్ని విశ్లేషించి కీలక విషయాలు గుర్తించారు. 1.7 లక్షల మంది ఇన్వెస్టర్ల జాబితా వెలికి తీయగలిగారు. వీరిలో కొందరు విదేశీయులున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అనుమతులు తీసుకు న్న తర్వాత విదేశీ పెట్టుబడుల్ని భారత కరెన్సీలోనే స్వీకరించాలి. -
హీరా కుంభకోణంపై స్పందించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: హీరా గ్రూపు కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే విషయంలో వైఖరి ఏమిటో తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంది. ఆ గ్రూపు వ్యవస్థాపకురాలు నౌహీరా షేక్ అరెస్టు, దర్యాప్తునకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హీరా గ్రూపు యాజమాన్యం తన కంపెనీల ద్వారా రూ.50వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిందని, ఈ కేసును సీబీఐకి అప్పగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హీరా గ్రూపు బాధితుల సంఘం అధ్యక్షుడు షహబాజ్ అహ్మద్ ఖాన్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
నౌహీరా షేక్ విడుదలకు హైకోర్టు నో..
సాక్షి, హైదరాబాద్: ప్రజల నుంచి పెద్దమొత్తంలో డిపాజిట్లు వసూలు చేసి, వాటిని తిరిగి చెల్లించకుండా ఎగవేసిన హీరా గ్రూపు అధినేత్రి నౌహీరా షేక్‌ను జైలు నుం చి విడుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. చంచల్‌గూడ జైలులో 6 నెలలుగా రిమాండ్ ఖైదీగా ఉన్న తనను విడుదల చేయాలని చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ పోలీసులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే నౌహీ రాపై నమోదైన కేసుల రికార్డులను తమ ముందుంచాలని న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు. -
ముంచేస్తున్న ‘మల్టీ’ మోసం
సాక్షి, హైదరాబాద్: మల్టీలెవల్ మార్కెటింగ్ దందా అమాయకులను అప్పులపాలు చేస్తోంది. గడిచిన మూడు నెలల్లో రాష్ట్ర పోలీసులు పట్టుకున్న కేసుల్లో రూ.20 వేల కోట్ల మేర మల్టీలెవల్ మార్కెటింగ్‌లో వేలాదిమంది మోసపోవడం సంచలనం రేపుతోంది. దేశవ్యాప్తంగా మల్టీలెవల్ మార్కెటింగ్‌పై నిషేధం విధిస్తూ కేంద్రం 1978లోనే చట్టాన్ని తీసుకువచ్చింది. మనీ సర్క్యులేషన్ స్కీం నిషేధిత యాక్ట్ కింద గిఫ్ట్‌ల పేరిట డబ్బులు వసూలు చేసి చెయిన్ లింక్ ద్వారా మార్కెటింగ్ చేయడం పూర్తిగా అక్రమమేనని ఈ చట్టం ద్వారా స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఐదేళ్ల క్రితం రాష్ట్రంలో ఆమ్వే ప్రాడక్ట్‌పై ఇదే తరహా మల్టీలెవల్ మార్కెటింగ్ కేసును సీఐడీ నమోదు చేసింది. ఇటీవల బయటపడుతున్న మల్టీలెవల్ కంపెనీ మోసాలు వేలకోట్లకు చేరడంతో రాష్ట్రంలో మళ్లీ మల్టీలెవల్ మార్కెటింగ్ మాఫియా చాపకింద నీరులా దందా సాగిస్తున్నట్టు స్పష్టమవుతోంది. - హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని గోల్డ్‌స్కీం పేరుతో దేశవ్యాప్తంగా డిపాజిట్లు వసూలు చేసిన హీరా గ్రూప్ మోసాన్ని నగర సీసీఎస్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆ గ్రూపు ఎండీ నౌహీరా షేక్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా, వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసుల్లో ఆమెను పోలీసులు విచారిస్తున్నారు. దేశవ్యాప్తంగా రూ.8 వేల కోట్లకుపైగా నౌహీరా షేక్ బంగారం స్కీం పేరుతో డిపాజిట్లు వసూలు చేసినట్టు బయటపడింది. - ఎఫ్ఎమ్ఎల్ సీ(ఫ్యూచర్ మేకర్ లైఫ్ కేర్) ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దేశవ్యాప్తంగా రూ.1,200 కోట్ల వసూలు చేసింది. ఈ కంపెనీలో సభ్యులుగా చేరి, వారి వద్ద ఉన్న హెల్త్ ప్రొడక్టు కొనుగోలు చేయాలి. తర్వాత మరో ఇద్దరిని చేర్చి ప్రొడక్టు కొనుగోలు చేయించాలి. ఇలా చేయడం వల్ల నెలవారీగా ఇంత మొత్తం వస్తుందని డిపాజిట్ చేయిస్తారు. ఇలా రాష్ట్రంలో 650 మందిని మోసం చేసినట్టు గుర్తించారు. - కరక్కాయల పౌడర్ పేరుతో మల్టీలెవల్ మార్కెటింగ్ చేస్తూ రూ.13 కోట్లు మోసం చేసిన వ్యవహారాన్ని ఛేదించారు. రూ.1,000 పెట్టి కిలో కరక్కాయలు కొని పౌడర్ చేసి ఇస్తే 1,300 రూపాయలకు కొనుగోలు చేస్తామని డిపాజిట్ల రూపంలో రూ.20 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. - హెల్త్ బిజ్ ప్రొడక్ట్స్ కంపెనీ పేరుతో మెంబర్షిప్ చేయించి ప్రొడక్టు కొనుగోలు చేసి, మరో ఇద్దరితో డిపాజిట్ చేయిస్తే పెట్టిన డబ్బులు రెట్టింపు ఇస్తామంటూ రూ.30 కోట్ల మేర కొల్లగొట్టారు. - సన్ పవర్ కంపెనీ పేరుతో రూ.200 కోట్ల మేర మోసం చేశారు. సభ్యులుగా చేరి, మరో ఇద్దరిని చేర్పిస్తే ప్రతి ఏడాదికి పెట్టిన డబ్బులతోపాటు వడ్డీ రెట్టింపు ఇస్తామంటూ మోసం చేశారు. స్టాక్ మార్కెట్లో సులభంగా డబ్బులు సంపాదించాలంటే తమ కంపెనీలో సభ్యులుగా నమోదవ్వాలంటూ డిపాజిట్ల పేరుతో బురిడీ కొట్టించారు. ఇలా 2 వేలమంది నుంచి రూ.2 వేల కోట్ల మేర వసూలు చేశారు. - క్యూనెట్ కంపెనీ పేరుతో వేల కోట్లు కొల్లగొట్టిన వ్యవహారం మరోసారి సంచలనంగా మారింది. గతంలో ఇదే కంపెనీ నిర్వాహకులు గోల్డ్‌క్వెస్ట్ పేరుతో రాష్ట్రంలో మల్టీలెవల్ మార్కెటింగ్ నిర్వహించి రూ.800 కోట్లకుపైగా అమాయకులకు ఎగనామం పెట్టారు. - ఇప్పుడిదే నిర్వాహకులు పేరు మార్చి క్యూ–నెట్ పేరుతో దందా ప్రారంభించారు. సుమారు రూ.5 వేల కోట్లకుపైగా ప్రొడక్ట్ కొనుగోలు చేసి సభ్యత్వం పేరుతో వసూలు చేసినట్టు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. దీనిపై విచారణ జరుపు తామని పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ వద్దా? మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో ప్రచారం చేసినా, టీవీల్లో ప్రకటనలిచ్చినా, సంక్షిప్త సందేశాలతో ప్రలోభపెట్టినా దర్యాప్తు విభాగాలు నేరుగా సుమోటోగా కేసు నమోదు చేయవచ్చు. కానీ, బాధితులు ఫిర్యాదు చేస్తే తప్పా ఇలాంటి మోసపూరిత కంపెనీలపై చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి మల్టీలెవల్ మార్కెటింగ్ వ్యవహారాలను గుర్తించడం, కట్టడి చేయడంతోపాటు రూ.వేల కోట్లు కొల్లగొట్టకుండా అడ్డుకునేందుకు రాష్ట్రంలో ‘ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్’ఏర్పాటు తప్పనిసరి అని సీనియర్ ఐపీఎస్ అధికారులు అభిప్రాయపడ్డారు. మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు రాష్ట్ర పోలీసులు లేఖలు రాసినా ఇంతవరకు దృష్టి సారించలేదని, ఇప్పటికైనా దృష్టి పెట్టాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
హీరా గ్రూప్ ఆస్తుల స్వాధీనానికి చర్యలు
సాక్షి, హైదరాబాద్: స్కీముల పేరుతో స్కాములకు పాల్పడిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కేసులో బాధితులకు ఊరట కలిగించే అంశాలపై నగర నేర పరిశోధనా విభాగం(సీసీఎస్) పోలీసులు దృష్టి సారించారు. అందులో భాగంగా ఆ సంస్థతోపాటు నిందితుల పేర్లతో ఉన్న ఆస్తుల్ని అటాచ్ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే గుర్తించిన దాదాపు రూ.1,000 కోట్ల విలువైన స్థిరాస్తుల్ని స్వాధీనం చేసుకోవడానికిగాను అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మరోపక్క మహారాష్ట్ర జైల్లో ఉన్న ఆ గ్రూప్ సీఈవో నౌహీరా షేక్‌ను సిటీకి తీసుకురావడానికి మరికొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటకల్లో నౌహీరాతోపాటు ఆ సంస్థ పేరిట ఉన్న ఆస్తుల్ని సీసీఎస్ పోలీసులు గుర్తించి వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. వివిధ రకాలైన వ్యాపారాలు చేస్తున్నానని, ఆయా వ్యాపారాల్లో 90 శాతం లాభాలు వస్తున్నాయని, అందులో పెట్టుబడి పెట్టిన వారికి నెలకు 36 శాతం చొప్పున లాభాలు ఇస్తానని నమ్మించిన నౌహీరా షేక్ కొన్నేళ్లుగా భారీ డిపాజిట్లు సేకరించింది. దీనిపై కేసులు నమోదు కావడంతో హీరా గ్రూప్ ఆర్థిక వ్యవహారాలు, ఆదాయ వనరులపై సీసీఎస్ పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే వీరికి అసలు వ్యాపారాలే లేవని, డిపాజిట్లనే రొటేషన్ చేస్తూ, గొలుసుకట్టు విధానంలో వ్యాపారం చేస్తున్నారని పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి. ఎంతమంది డిపాజిట్దారులున్నారు, ఎంత మేర డిపాజిట్లు సేకరించారనే వివరాలను కూడా నిర్వాహకులు ఇవ్వకపోడంతో హైదరాబాద్ పోలీసులు అతికష్టమ్మీద వాటిని సేకరించారు. హీరా గ్రూపునకు సంబంధించిన ఆర్థిక అక్రమాల్లో బాధితులు తీవ్రస్థాయిలో నష్టపోయారు. క్రయవిక్రయాలపై సబ్రిజిస్ట్రార్లకు లేఖలు హీరా గ్రూపు కేసులో సీసీఎస్ పోలీసులు డిపాజిట్‌దారుల పరిరక్షణ చట్టంలోని సెక్షన్లను జోడించారు. దీంతో ఆస్తుల స్వాధీనానికి ఆస్కా రం ఏర్పడింది. ఇప్పటికే పోలీసులు ఆ సంస్థకు చెందిన ఆస్తుల్ని గుర్తించి, సీజ్ చేస్తూ క్రమవిక్రయాలు నిషేధించాల్సిందిగా సబ్–రిజిస్ట్రార్లకు లేఖలు రాశారు. ఇలా నమోదైన కేసుల్లో నిందితు ల నుంచి పోలీసులు సీజ్ చేసిన ఆస్తుల జాబితాను ప్రభుత్వానికి నివేదిస్తారు. ఈ స్వాధీనాన్ని ధ్రువీకరించాల్సిందిగా కోరతారు. ఈ మేరకు ధ్రువీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. వీటి ఆధారంగా ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జోడిస్తూ పోలీసులు కోర్టుల్లో పిటిషన్ దాఖలు చేస్తారు. నిందితుల ఆస్తుల స్వాధీనం సమంజసమేనంటూ ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తారు. ఈ పిటిషన్ పూర్వాపరాలను పరిశీలించి కోర్టు తగిన ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా సీసీఎస్ పోలీసులు నౌహీరా షేక్‌తోపాటు ఆ సంస్థలకు చెందిన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, టోలిచౌక్, ఏపీలోని చిత్తూరు జిల్లా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణేలోని పలు ప్లాట్లు, ఇళ్ల వివరాలను సేకరించారు. వీటిని అటాచ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. -
మోసం చెయ్యం... మొత్తం ఇచ్చేస్తాం!
సాక్షి, హైదరాబాద్ : వివిధ స్కీముల పేరుతో భారీ స్కామ్‌కు పాల్పడిన ‘హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‘ఎండీ నౌహీరా షేక్ కొత్త పల్లవి అందుకున్నారు. తాము ఎవరినీ మోసం చేయలేదని, డిపాజిటర్లు కావాలంటే పెట్టుబడి మొత్తం తిరిగి ఇచ్చేస్తామంటున్నారు. ఆ మొత్తాలను 16 నెలల వ్యవధిలో 4 విడతల్లో చెల్లిస్తామని నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. నౌహీరాపై నమోదైన కేసును దర్యాప్తు చేస్తున్న నగర నేర పరి«శోధన విభాగం (సీసీఎస్) పోలీసులు మాత్రం డిపాజిట్లు తిరిగి చెల్లించేందుకు ఉన్న ఆర్థిక వనరుల వివరాలు తెలపాలని కోరుతున్నారు. మరోపక్క ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసు కస్టడీలో ఉన్న నౌహీరాను ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారంట్‌పై తీసుకురావడానికి సీసీఎస్ అధికారులు యత్నిస్తున్నారు. ఆమె కోసం అనేక రాష్ట్రాలు, నగరాలకు చెందిన పోలీసులు వేచి ఉన్నారని, వారి కస్టడీలు పూర్తయిన తర్వాతే హైదరాబాద్‌కు తీసుకువెళ్లాలని ముంబై కోర్టు పోలీసులకు సూచించింది. ఆర్థిక మూలాల కోసం పోలీసుల వెతుకులాట హీరా గ్రూప్‌లో మొత్తం 15 కంపెనీలు ఉన్నాయి. వీటిలో ఒక్కో కంపెనీకి చెందిన ఒక్కో తరహా స్కీమ్ తయారు చేసిన నౌహీరా తదితరులు అధిక వడ్డీలు ఆశ చూపి భారీగా డిపాజిట్లు సేకరించారు. సాలీనా గరిష్టంగా 36 శాతం వడ్డీ ఆశ చూపడంతో అనేక మంది పెట్టుబడులు పెట్టారు. కొందరు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు నౌహీరాను అరెస్టు చేశారు. ఈ కంపెనీకి చెందిన ఆర్థిక మూలాలు కనుక్కోవడంపై సీసీఎస్ పోలీసులు దృష్టి పెట్టారు. నౌహీరాతో పాటు అరెస్టయిన బిజూ థామస్, మోలీ థామస్‌లను విచారించినా వాటి ఆధారాలు లభించలేదు. ఈ నేపథ్యంలోనే నౌహీరా షేక్ తన లాయర్ ద్వారా నాంపల్లిలోని ఎంఎస్‌జే కోర్టులో ఓ పిటిషన్ వేయించారు. అందులో తమకు డిపాజిటర్లను మోసం చేసే ఉద్దే«శం లేదన్నారు. తమ వద్ద డబ్బు డిపాజిట్ చేసిన వారిలో ఎవరైనా తిరిగి చెల్లించాలని కోరితే... విత్‌డ్రా ఫామ్ ఇస్తే అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. వారి మొత్తాన్ని నాలుగు విడతల్లో చెల్లిస్తామని, 25 శాతం తొలి విడతలో 4 నెలల పాటు... రెండో విడతలోనూ మరో 25 శాతం ఇంకో 4 నెలల పాటు... ఇలా మొత్తం 16 నెలల్లో ఆ మొత్తం ఇచ్చేస్తామన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే తమపై కేసు నమోదైందని కోర్టుకు విన్నవించారు. ఎలా చెల్లిస్తారో చెప్పండి.. పిటిషన్ వివరాలు తెలుసుకున్న సీసీఎస్ పోలీసులు ఆర్థిక మూలాలు చెప్పాలంటూ హీరా గ్రూప్‌ను కోరుతున్నారు. డిపాజిటర్లకు సొమ్ము ఏ మార్గంలో తిరిగి చెల్లిస్తారని ప్రశ్నిస్తున్నారు. తమకు విదేశీ ఖాతాల్లో నిధులు ఉన్నాయని హీరా గ్రూప్ చెప్తున్న నేపథ్యంలో వాటి వివరాలు కోరుతున్నారు. ఇప్పటికే దాదాపు రూ.220 కోట్లకు గాను 10 వేల విత్‌డ్రా ఫామ్స్ హీరా గ్రూప్ కార్యాలయం లో పడి ఉన్నాయని,అవి తమ సోదాల్లో లభించాయని సీసీఎస్ పోలీసులు చెప్తున్నారు. వాటిపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. నౌహీరాకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి విది తమే.అనంతరం ముంబై పోలీసులు ఆమెను అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ఇప్పుడు నౌహీరాకు ఇచ్చిన బెయిల్‌ను హైకోర్టు కొట్టేసింది. దీంతో ఆమెను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాలని సీసీఎస్ పోలీసులు నిర్ణయించారు. దీనికోసం నాంపల్లి కోర్టు నుంచి పీటీ వారంట్ కూడా పొందారు. దీన్ని తీసుకువెళ్లిన ఓ ప్రత్యేక బృందం ముంబై కోర్టులో దాఖలు చేసి నౌహీరాను తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది.నౌహీరా అరెస్టు తర్వాత ఆమెపై ముంబై, పుణేలతో పాటు అనేక చోట్ల కేసులు నమోదయ్యాయి. వారంతా తమ కస్టడీల్లోకి తీసుకోవడానికి పీటీ వారంట్లతో ముంబై చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కీలక కేసుల్లో ఆయా పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం పూర్తయిన తర్వాతే హైదరాబాద్ తీసుకువెళ్లాలంటూ ప్రత్యేక బృందానికి ముంబై కోర్టు న్యాయమూర్తి సూచించారు. దీంతో సిటీ నుంచి వెళ్లిన టీమ్ తిరిగి వచ్చింది. -
ఏడాదికో అకౌంటెంట్ మార్పు..!
సాక్షి, హైదరాబాద్: ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉండే వ్యాపార రంగంలో ఉన్న కంపెనీలు... ప్రధానంగా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సాధారణంగా వారి లెక్కలు చూసే చార్టర్డ్ అకౌంటెంట్లను (సీఏ) మార్చవు. ఏదైనా తీవ్రమైన ఇబ్బంది వస్తే తప్ప కనీసం ఐదేళ్ల వరకు ఒకరినే కొనసాగిస్తుంటారు. అయితే హీరా గ్రూప్ వ్యవహారశైలి మాత్రం దీనికి భిన్నం. తమ గ్రూప్‌లో దాదాపు 15 కంపెనీలు ఉన్నప్పటికీ ప్రతి ఆర్థిక సంవత్సరం సీఏలను మారుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ గ్రూప్ సీఈఓ నౌహీరా షేక్ ఆలోచనల మేరకు ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు. ఏటా రూ.800 కోట్ల టర్నోవర్ ఉందంటూ చూపించి, వివిధ స్కీముల కింద సాలీనా 36 నుంచి 46 శాతం వడ్డీ పేరుతో నౌహీరా షేక్ దేశ వ్యాప్తంగా అనేక మంది నుంచి డిపాజిట్లు సేకరించింది. నౌహీరా షేక్ 2010–11లో హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో ఉన్న 15 సంస్థలకూ నౌహీరానే నేతృత్వం వహిస్తున్నారు. తన వ్యాపార లావాదేవీలకు సంబంధించి నౌహీరా షేక్ ఏ విభాగానికీ సరైన రికార్డులు సమర్పించలేదు. అయినప్పటికీ ఈమెపై నమోదైన కేసు దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు అనేక మార్గాల్లో కీలక సమాచారం సేకరించారు. దీని ప్రకారం హీరా గ్రూప్ వార్షిక టర్నోవర్ ఆరేళ్ళల్లో కొన్ని వందల రెట్లు పెరిగిందని గుర్తించారు. 2010–11లో కేవలం రూ.27 లక్షలుగా ఉన్న గ్రూప్ టర్నోవర్... 2016–17 నాటికి రూ.800 కోట్లు దాటేసింది. అయితే వీటికి ఆమె లెక్కలు చూపించలేదని అధికారులు చెప్తున్నారు. ఆయా కంపెనీల లావాదేవీలు, వాటికి చెందిన డాక్యుమెంట్లను హీరా కనీసం ఐటీ విభాగానికీ, ఆర్వోసీకి సమర్పించలేదని పోలీసులు గుర్తించారు. అయినప్పటికీ ఏళ్ళుగా నౌహీరా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూనే ఉన్నారు. ఈ వ్యవహారాల్లో సీఏలది కీలక పాత్రగా ఉంటుందని, వారిని ప్రశ్నిస్తే కొన్ని చిక్కుముడులు వీడతాయని భావించిన సీసీఎస్ పోలీసులు వివిధ రికార్డుల నుంచి వారి వివరాలు సేకరించారు. ఇప్పటి వరకు ముగ్గురిని ప్రశ్నించినా ఆశించిన ఫలితం కాలేదు. ఓ వ్యక్తిని సీఏగా నియమించుకోవడం, సంస్థ లావాదేవీలపై అతడికి పూర్తి అవగాహన వచ్చేలోగానే తీసేస్తున్నట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ గ్రూప్‌లో పని చేసిన సీఏల వివరాలను ఆరా తీయడంపై దృష్టి పెట్టారు. గతేడాది షార్జాలో ‘టీ–10’ లీగ్ క్రీడా రంగంలో కొన్నేళ్ల క్రితం వచ్చిన ‘క్రికెట్ టీ–20’ మ్యాచ్‌లు బాగా ప్రాచుర్యం పొందాయి. వీటి నేపథ్యంలో కొన్ని ఫ్రాంచైజీలు కూడా పుట్టుకు వచ్చి భారీ ఆర్థిక లావావేలకు కేంద్రంగా మారి నిర్వహణ సంస్థలకు కాసులు కురిపించాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న హీరా గ్రూప్ మరో అడుగు ముందుకు వేసింది. ‘టీ–10’లీగ్ మ్యాచ్ పేరుతో కొత్త ఒరవడికి నాంది పలికింది. దీని ప్రకటన, లాంచింగ్ గతేడాది డిసెంబర్ తొలి వారంలో హైదరాబాద్‌లోనే జరిగింది. ప్రధానంగా హీరా గ్రూప్‌తోపాటు మరికొన్ని సంస్థలూ స్పాన్సర్ చేసిన ఈ మ్యాచ్‌లు దుబాయ్‌లో ఉన్న షార్జా స్టేడియంలో గతేడాది డిసెంబర్ 14 నుంచి 17 వరకు జరిగింది. పంజాబీ లెజెండ్స్, ఫక్తూన్స్, మరాఠా అరేబియన్స్, బెంగాల్ టైగర్స్, టీమ్ శ్రీలంక క్రికెట్, కేరళ కింగ్స్ అనే ఫ్రాంచైజీలు పాల్గొన్నాయి. అనేక మంది బాలీవుడ్ తారలు సైతం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ మ్యాచ్‌ల నిర్వహణ, స్పాన్సర్ షిప్ తదితరాల్లో భారీ ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీటిపై ఆరా తీయాలని నిర్ణయించుకున్నారు. నౌహీరా షేక్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశాక ఇక్కడ బెయిల్ మంజూరైంది. బయటకొచ్చిన ఆమెను ముంబై పోలీసులు అరెస్టు చేసి అక్కడకు తరలిం చారు. కొన్ని రోజుల క్రితమే ఇక్కడ మంజూరైన బెయిల్‌ను హైకోర్టు రద్దు చేసింది. నౌహీరాను ముంబై నుంచి పీటీ వారెంట్‌పై తీసుకురావాలని సీసీఎస్ పోలీసులు భావిస్తున్నారు. దీనికి అవసరమైన న్యాయపరమైన సన్నాహాలు చేస్తున్నారు. -
నౌహీరా అరెస్టు.. అనేక నాటకీయ పరిణామాలు!
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా రూ.వందల కోట్ల స్కామ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నౌహీరా షేక్ ఇలా బయటకు వచ్చి... అలా వెంటనే అరెస్టయ్యారు. నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు అరెస్టు చేసిన కేసులో గత వారం జైలుకు వెళ్లిన నౌహీరా బెయిల్‌పై శుక్రవారం ఉదయం విడుదలయ్యారు. జైలు వద్దే కాపుకాసిన మహారాష్ట్ర థానే జిల్లా నిజాంపుర పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని అక్కడికి తరలించారు. శనివారం కోర్టులో హాజరుపరచడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క నౌహీరాకు కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సీసీఎస్ పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నౌహీరా అరెస్టు నుంచి ఆసక్తికరమైన నాటకీయ పరిణామాలు అనేకం చోటు చేసుకున్నాయి. జైలు వద్దే నిజాంపుర పోలీసులు.. నౌహీరా షేక్‌ను అరెస్టు చేసిన పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన న్యాయస్థానం అనుమతి నిరాకరిస్తూ, ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.5 లక్షలతో రెండు పూచీకత్తులు ఇవ్వాలని, ఈ నెల 29 లోపు న్యాయస్థానంలో రూ.5 కోట్లు డిపాజిట్ చేయాలని, పాస్‌పోర్ట్ అప్పగించడంతో పాటు అనుమతి లేకుండా దేశం దాటవద్దంటూ కోర్టు షరతులు విధించింది. పూచీకత్తుల దాఖలు, విడుదల ఉత్తర్వులు తీసుకోవడం గురువారం పూర్తయినప్పటికీ జైలు సమయం మించిపోవడంతో నౌహీరా విడుదల కాలేదు. అయితే హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, నౌహీరా షేక్‌పై దేశవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. ఆమెకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలుసుకున్న «నిజాంపుర పోలీసులు గురువారమే పీటీ వారెంట్లతో చంచల్‌గూడ జైలు వద్దకు వచ్చారు. ఆమె విడుదల కాకపోవడంతో శుక్రవారం తెల్లవారుజాము వరకు జైలు వద్ద మాటు వేశారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో జైలు నుంచి బయటకు వస్తున్న నౌహీరాను అదుపులోకి తీసుకుని రోడ్డు మార్గంలో నిజాంపురకు తరలించారు. అక్కడి కోర్టులో శనివారం హాజరుపరచడానికి సన్నాహాలు చేస్తున్నారు. చంచల్‌గూడ జైలు వద్ద నౌహీరాను అదుపులోకి తీసుకునే సందర్భంలో ఆమె న్యాయవాదులకు, నిజాంపుర పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. కేరళకు ప్రత్యేక బృందం... నౌహీరాకు కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని, తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీసీఎస్ పోలీసులు శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఓ ప్రత్యేక పోలీసు బృందం కేరళకు బయలుదేరి వెళ్లింది. సాధారణంగా కార్పొరేట్, బడా వ్యాపార సంస్థలు తమ బ్యాంకు ఖాతాలను మార్చడానికి ఇష్టపడవు. అయితే హీరా గ్రూప్ వ్యవహారం మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు హీరా గ్రూప్‌తో పాటు నౌహీరా నుంచి వారి బ్యాంకు ఖాతాల వివరాలు తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అధికారులు కేంద్రం అధీనంలోని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) ద్వారా 160 బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించారు. వీటిని పరిశీలించగా... దాదాపు సగం క్లోజ్ అయినట్లు తేలింది. ఒక్క ఐసీఐసీఐ బ్యాంక్‌లోనే 56 ఖాతాలు ఉండగా, 53 ఖాతాలను మూసేశారు. ఇలా మరికొన్ని బ్యాంకుల్లోనూ జరిగిందని, ముందు నుంచీ ఇలానే జరుగుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో ఈ ఖాతాల క్లోజింగ్ వెనుక ఉన్న మతలబు ఏమిటనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. -
6 సంవత్సరాలు..800 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ టర్నోవర్ పెరుగుదల లెక్కలు తెలుసుకున్న సీసీఎస్ పోలీసులు ముక్కున వేలేసుకుంటున్నారు. మల్టీ నేషనల్ కంపెనీలకు సైతం లేని పెరుగుదల ఈ గ్రూప్‌లో కనిపించడంతో అవాక్కవుతున్నారు. దీనికి ఆ సంస్థ వద్ద, సీఈఓ నౌహీరా షేక్ వద్ద ఎలాంటి రికార్డులు లేకపోవడం గమనార్హం. సోమవారం ఢిల్లీలో అరెస్టు చేసి మంగళవారం నగరానికి తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే. తదుపరి దర్యాప్తు నిమిత్తం 14 రోజులు తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమాంతం పెరిగిన టర్నోవర్... నౌహీరాపై నమోదైన కేసు దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు అనేక మార్గాల్లో కీలక సమాచారం సేకరించారు. దీని ప్రకారం హీరా గ్రూప్ వార్షిక టర్నోవర్ ఆరేళ్లలో వందల రెట్లు పెరిగిం దని గుర్తించారు. 2010–11లో కేవలం రూ.27 లక్షలుగా ఉన్న గ్రూప్ టర్నోవర్... 2016–17 నాటికి రూ.800 కోట్లు దాటేసింది. ఆయా కంపెనీల లావాదేవీలు, వాటి డాక్యుమెంట్లను హీరా కనీసం ఐటీ విభాగానికీ, ఆర్వోసీకి సమర్పించలేదని పోలీసులు గుర్తించారు. అయినా నౌహీరా వ్యాపార సామ్రా జ్యాన్ని విస్తరిస్తూనే ఉన్నారు. తన మూడో భర్త తనను మోసం చేశారంటూ నౌహీరా చెప్పడం కలకలం సృష్టించింది. ఆయా విభాగాలకు సమాచారం... నౌహీరా అరెస్టుపై సీసీఎస్ పోలీసులు ఆదాయపుపన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీస్ తదితర విభాగాలకు సమాచారం ఇస్తున్నారు. విదేశాల్లోనూ శాఖలున్న హీరా గ్రూప్‌పై మనీ ల్యాండరింగ్‌కు పాల్పడిన ఆరోపణలపై ఇప్పటికే ఓ కేసు నమోదు చేసింది. దిగువ మధ్యతరగతి నేపథ్యం... ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన నౌహీరా షేక్ తండ్రి సాధారణ కూరగాయల వ్యాపారి. ఈమె మాజీ భర్త సైతం ఇదే వ్యాపారం చేసే వారని తెలిసింది. కేవలం పదో తరగతి మాత్రమే చదివిన నౌహీరా ప్రస్తుతం తన పేరుకు ముందు ‘డాక్టర్’ను తగిలించుకున్నారు. ఈ డాక్టరేట్ ఈమెకు దుబాయ్‌కు చెందిన ఓ వర్శిటీ ఇచ్చిందంటూ అనుచరులు ప్రచారం చేస్తున్నా.. పోలీసులు మాత్రం విశ్వసించడం లేదు. సదరు డాక్టరేట్‌కు సంబంధించి తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని, నౌహీరా నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదని చెప్తున్నారు. భర్తతో వేరుపడిన తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన నౌహీరా బంజారాహిల్స్ ప్రాంతంలో నివసిస్తున్నారు. గతంలో కొన్ని చిన్న చిన్న వ్యాపారాలు చేసిన ఈమె 2010–11లో హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో ఉన్న 15 సంస్థలకూ నౌహీరానే నేతృత్వం వహిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అహ్మదాబాద్‌లోని బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పుడు నౌహీరా కొన్ని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. వీటిలో తన హోదాను హీరా గ్రూప్ సీఈఓగా మాత్రమే కాకుండా ఇండియా ఉమెన్ హెల్ప్‌లైన్ సెక్రటరీగా పేర్కొన్నారు. దీనిపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. బంగారం వ్యాపారమని చెప్తున్నా... నౌహీరాను అరెస్టు చేసిన పోలీసులు ప్రాథమిక విచారణలో భాగంగా హీరా గ్రూప్ లావాదేవీలను కోరారు. ఎంత మంది నుంచి డిపాజిట్లు సేకరించారు? వారు ఎక్కడెక్కడి వారు? ఎందరికి తిరిగి చెల్లించారు? ఇంకా ఎంత మందికి డబ్బు ఇవ్వాలి? లాంటి సమాచారంతో కూడిన రికార్డులు సమర్పించాల్సిందిగా కోరారు. అయితే ఆ వివరాలు తమ వద్ద లేవని కొన్ని ఆదాయపు పన్ను శాఖ, మరికొన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వద్ద ఉన్నాయంటూ సమాధానమిచ్చారు. కేవలం డిపాజిట్లు సేకరించడమే కాకుండా తన గ్రూప్ బంగారం వ్యాపారం సైతం చేస్తుందంటూ చెప్పిన నౌహీరా అందులోనే భారీ టర్నోవర్ పొందామని చెప్తున్నారు. సరాసరిన కేజీ బంగారం రూ.30 లక్షలకు ఖరీదు చేసి రూ.60 లక్షలకు విక్రయించిందని భావించినా... పెరిగిన టర్నోవర్ ప్రకారం చూస్తే ఏడాదికి కొన్ని టన్నుల వ్యాపారం చేయాలని, అది అసాధ్యమని పోలీసులు చెప్తున్నారు. మరోపక్క ఈ బిజినెస్‌కు సంబంధించి రికార్డులు సైతం ఈమె వద్ద లేవు. -
మదనపల్లెలోమహిళా దొంగ అరెస్ట్
మదనపల్లె : చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికుల బ్యాగులు చోరీ చేస్తున్న మహిళను పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి రూ.5 లక్షల రూపాయల విలువైన 250 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. బి. కొత్త కోటకు చెందిన పఠాన్ రహంతుల్లా భార్య నౌహిరా(40) బస్టాండులో ప్రయాణికులనే లక్ష్యంగా చేసుకుని చోరీలను పాల్పడుతోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం కాపు కాసిన పోలీసులు ఆమెను పట్టుకున్నారు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.