
సాక్షి, హైదరాబాద్: నౌహీరా షేక్ వ్యవహారంలో జీఎస్టీ కూడా రంగంలోకి దిగింది. జీఎస్టీలో కోట్లాది రూపాయలు ఎగవేసిన కేసులో జీఎస్టీ అధికారులు శుక్రవారం ఆమె కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) హైదరాబాద్‌లో నౌహీరాకు చెందిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి చెందిన సంస్థ కార్యాలయాలను సీజ్ చేసింది. ఈ దాడుల్లో టోలీచౌకిలోని నదీమ్‌కాలనీలో 20 ఫ్లాట్లు, మాసబ్ ట్యాంక్‌లో 10 ఫ్లాట్లు, కూకట్‌పల్లిలోని ఓ వాణిజ్య సముదాయాన్ని అధికారులు సీజ్‌చేశారు. ఉదయం 10గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా మొత్తం ఏడు బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి.
ఇందులో భాగంగా బంజారాహిల్స్‌లోని హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రధాన కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించారు. ఈ విషయంలో డీజీజీఐ ఇప్పటికే హీరా గ్రూప్‌నకు నోటీసులు జారీ చేసిందని హైదరాబాద్ జోనల్ ఆఫీసర్ ఎ.శ్రీధర్ తెలిపారు. దాడుల్లో భాగంగా ఎన్‌ఎండీసీలోని ఆసిఫ్ ఫ్లాజాలో ఉన్న హీరా రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్‌లోనూ సోదాలు జరిగాయి. ఇదే సమయంలో నౌహీరాషేక్‌తోపాటు ఆమె అనుచరులు బిజు థామస్, మాలీ థామస్‌లను పీటీవారెంట్ కింద తమకు అప్పగించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరే (ఈడీ) నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ ముగ్గురు నిందితులు ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment