
సాక్షి, హైదరాబాద్: హీరా గ్రూపు కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే విషయంలో వైఖరి ఏమిటో తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంది. ఆ గ్రూపు వ్యవస్థాపకురాలు నౌహీరా షేక్ అరెస్టు, దర్యాప్తునకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హీరా గ్రూపు యాజమాన్యం తన కంపెనీల ద్వారా రూ.50వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిందని, ఈ కేసును సీబీఐకి అప్పగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హీరా గ్రూపు బాధితుల సంఘం అధ్యక్షుడు షహబాజ్ అహ్మద్ ఖాన్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment