సాక్షి, హైదరాబాద్: చిన్న మొత్తాలకు భారీ పెద్ద మొత్తాలను తిరిగిస్తామని చెప్పి రూ.50 వేల కోట్ల మేరకు కాజేసిన హీరా గ్రూప్‌పై 2012లోనే కేసు నమోదైనా ఇప్పటివరకూ ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారని తెలంగాణ పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. అప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తే గతేడాది వరకూ ఆ కంపెనీ ఎండీ నౌహీరా షేక్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదని అడిగింది. ఎఫ్‌ఐఆర్ నమోదైన ఏడేళ్లకు ఎండీని అరెస్ట్ చేసేంత జాప్యం ఎందుకు జరిగిందని, పోలీసుల దర్యాప్తు తీరు నత్తనడకగా ఉంటే సీబీఐ దర్యాప్తు ఒక్కటే మిగిలిన మార్గమని బాధితులు భావిస్తున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది. హీరా గ్రూప్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల దర్యాప్తుల ప్రగతిని సమగ్రంగా అందజేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
16కుపైగా బోగస్ కంపెనీలతో హీరా గ్రూప్ జనాన్ని మోసం చేసిందని హీరా గ్రూప్ బాధితుల సంఘం అధ్యక్షుడు సహబాజ్ అహ్మద్ ఖాన్ దాఖలు చేసిన పిల్‌ను సోమవారం హైకోర్టు మరోసారి విచారించింది. జనం నుంచి మోసపూరితంగా వసూలు చేసిన సొమ్ము రూ.50 వేల కోట్లని, అయితే ఆ కంపెనీలకు చెందిన 240 బ్యాంకు ఖాతాల్లో కేవలం రూ.25 కోట్ల పైచిలుకు మాత్రమే సొమ్ములున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment