సాక్షి, హైదరాబాద్: హీరా గ్రూపు కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. హీరా గ్రూపు యాజమాన్యం ఈ కంపెనీల ద్వారా రూ.50వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హీరా గ్రూపు బాధితుల సంఘం అధ్యక్షుడు షహబాజ్ అహ్మద్ ఖాన్ ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం దాఖలు చేశారు.
ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సీసీఎస్ డిప్యూటీ కమిషనర్, కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, హీరా గ్రూపు కంపెనీల ఎండీ, సీఈవో నౌహీరా షేక్‌లతో పాటు హీరా గ్రూపు కంపెనీలను ప్రతివాదులుగా చేర్చారు. హీరా గ్రూపు కంపెనీల ద్వారా నౌహీరా షేక్ ఇటు భారతీయులతో పాటు ప్రవాసుల వద్ద నుంచీ భారీ మొత్తాలను సేకరించారని పిటిషనర్ తెలిపారు.అత్యధికంగా సాధారణ ప్రజానీకం ఈ గ్రూపు కంపెనీల్లో చేరారని తెలిపారు. ఈ కంపెనీల యాజమాన్యం 36 శాతం వార్షిక వడ్డీ చెల్లిస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఖాతాదారులను ఆకర్షించేందుకు ఇస్లామ్‌ను వాడుకున్నారని పిటిషనర్ ఆరోపించారు. మొదట్లో కొన్ని నెలలు చెల్లింపులు చేసి ఆ తరువాత మానేసిందన్నారు.
ఆమెకు ఐసిస్‌తో సంబంధాలున్నాయి...
హీరా గ్రూపునకు దేశవ్యాప్తంగా 74 బ్రాంచీలు ఉన్నాయని, 430 మంది మార్కెటింగ్ ప్రతినిధులు ఉన్నారని తెలిపారు. వీరి ద్వారా డబ్బు వసూలు చేశారన్నారు. ఈ ఏజెంట్లకు భారీగా కమిషన్లను ముట్టజెప్పారని వివరించారు. దేశవ్యాప్తంగా రూ.50వేల కోట్లను 1.75 లక్షల మందికి చెల్లించకుండా హీరా గ్రూపు యాజమాన్యం ఎగవేసిందని, ఇందుకు గాను ఈ కంపెనీ ఎండీ, సీఈవో నౌహీరా షేక్ అరెస్టయ్యారని తెలిపారు. ఈమెకు ఐసిస్‌తో సంబంధాలున్నాయన్నారు. పాకిస్థాన్‌కు చెందిన ప్రబోధకుడు తౌసీఫర్ రహ్మాన్‌ను నౌహీరా తరచూ కీర్తించే వారని, అతనికి ఐసిస్‌తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని వివరించారు. అతన్ని ఇటీవల సౌదీ ప్రభుత్వం అరెస్ట్ చేసిందన్నారు. 3 లక్షల మంది విదేశీయులు కూడా హీరా గ్రూపుల్లో పెట్టుబడులు పెట్టారని పిటిషనర్ వివరించారు.
సీసీఎస్ సమర్థవంతంగా దర్యాప్తు చేయలేకపోతోంది...
ఈ వ్యవహారంపై హైదరాబాద్ సీసీఎస్ సమర్థవంతంగా దర్యాప్తు చేయలేకపోతోందన్నారు. ఈ కేసులో పెట్టుబడిదారులకు న్యాయం జరగాలంటే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడమే మార్గమన్నారు. ఈ కేసులో ఆర్థిక అంశాలతో పాటు, మనీలాండరింగ్ కూడా ఉందని తెలిపారు. వాస్తవాలను వెలుగులోకి రావాలంటే పలు అంశాల్లో ప్రత్యేక నైపుణ్యం ఉన్న అధికారులు అవసరమని, అందువల్ల సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తే తగిన ఫలితాలు ఉంటాయన్నారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు.
Comments
Please login to add a commentAdd a comment