విదేశీ లింకులున్న కేసుల పరిష్కారానికి మార్గం సుగమం
ప్రత్యేకంగా పోర్టల్ రూపొందించిన సీబీఐ
ఇంటర్‌పోల్‌తో సంప్రదింపులు ఇక ఈజీ
పోర్టల్ వినియోగంపై త్వరలో అధికారులకు మార్గనిర్దేశం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) కేంద్రంగా చోటు చేసుకున్న అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆ విభాగం మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు కీలకపాత్ర పోషించారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అమెరికాలో ఉన్న ఆయన్ను రప్పించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇంటర్‌పోల్ సాయంతో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించడానికి 8 నెలలుగా ప్రయత్నాలు చేస్తోంది.
కేవలం ఈ ఒక్క కేసులోనే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు, పోలీసు విభాగాలు అనునిత్యం ఏదో ఒక కేసులో నిందితుల ఆచూకీ కనుగొనడం, వారిని రప్పించే క్రమంలో ఇంటర్‌పోల్ సాయం కోరుతుంటాయి. ఇంటర్ పోల్‌గా పిలిచే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ ప్రపంచ వ్యాప్తంగా పోలీసు వ్యవస్థల మధ్య సహకారానికి, నేరాల నియంత్రణకు కృషి చేస్తుంది.
అయితే ఏదైనా పోలీసు విభాగం దీన్ని ఆశ్రయించడం అనేది ప్రస్తుతం ఓ సుదీర్ఘ, క్లిష్టతరమైన ప్రక్రియగా ఉంది. దీన్ని సులభతరం చేయడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టి గేషన్ (సీబీఐ) అధీనంలోని నేషనల్ సెంట్రల్ బ్యూరో (ఎన్‌సీబీ) ఫర్ ఇంటర్‌పోల్ ఓ పోర్టల్‌ను రూపొందించింది. అదే భారత్‌పోల్. ఈ పోర్టల్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెండురోజుల క్రితం ఢిల్లీలో ఆవిష్కరించారు.
అనేక కేసుల్లో విదేశీ లింకులు
ఒకప్పుడు దేశ వ్యాప్తంగా నమోదయ్యే కేసుల్లో విదేశాలతో లింకు ఉన్నవి అత్యంత అరుదుగా తెరపైకి వచ్చేవి. కానీ ప్రస్తుతం సైబర్ నేరాలు, భారీ ఆర్థిక నేరాలు, ఉగ్రవాదం, మాదకద్రవ్యాలు, మనుషుల అక్రమ రవాణా తదితర
కేసులతో పాటు వ్యవస్థీకృత నేరాల్లో ‘విదేశీ లింకులు’ సర్వసాధార ణం అయ్యా యి.
సూత్ర ధారులు విదేశాల్లో ఉండి ఇక్కడ నేరాలు చేయించడమో, ఇక్కడ నేరం చేసిన వారు విదేశాలకు పారిపోవడమో జరుగుతోంది. దీంతో పోలీసులు, దర్యాప్తు ఏజెన్సీలు ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించడం అనివార్యంగా మారుతోంది. 195 దేశాల సభ్యత్వం కలిగిన ఇంటర్‌పోల్ ద్వారానే రెడ్ కార్నర్ సహా వివిధ రకాలైన నోటీసుల జారీ సాధ్యమవుతుంది.
అంత ఈజీ కాదు..
అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి హైదరాబాద్ పంజగుట్ట పోలీసుల వ్యయప్రయాసలు ఇంటర్‌పోల్ వ్యవహారానికి ఓ తాజా ఉదాహరణ. ఫోన్ ట్యాపింగ్ కేసు వినతి తొలుత వెస్ట్‌జోన్ డీసీపీ ద్వారా నగర పోలీసు కమిషనర్‌కు వెళ్లింది. పోలీసు కమిషనర్ రాష్ట్ర నోడల్ ఏజెన్సీ సీఐడీకి సిఫారసు చేశారు.
అక్కడి నుంచి దేశంలో ఇంటర్‌పోల్‌కు నోడల్ ఏజెన్సీగా ఉన్న సీబీఐకి చేరింది. అక్కడి నుంచి ఇంటర్‌పోల్‌కు సదరు విజ్ఞప్తి చేరాల్సి ఉండగా.. అనేక వివరణలు, సందేహాలు, సమస్యలు ప్రక్రియ ముందుకు సాగేందుకు ఆటంకంగా మారాయి.
ఈ కారణంగానే కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసినా, 8 నెలలుగా హైదరాబాద్ పోలీసులు రకరకాలుగా ప్రయ త్నాలు చేస్తున్నా ఇప్పటికీ ప్రభాకర్‌రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించే ప్రయత్నం సఫలం కాలేదు. దేశంలోని అనేక ఏజెన్సీలు, పోలీసు విభాగాలు ఈ సమస్య ఎదుర్కొంటున్నాయి. దీనికి పరిష్కారంలో భాగంగానే భారత్‌పోల్ తెరపైకి వచ్చింది.
ఇకపై సులభంగా..
ఈ పోర్టల్ ద్వారా దేశంలోని అన్ని పోలీసు విభాగాలు, ఏజెన్సీలకు ఇంటర్‌పోల్‌తో సంప్రదింపులు సులువు అయ్యేందుకు అవకాశం ఏర్పడింది. వివిధ రకాలైన కార్నర్ నోటీసుల జారీ ప్రక్రియ, అందుకు అవసరమైన పత్రాలు, నమూనాలను ఈ పోర్టల్‌లో పొందుపరిచారు.
అధికారులకు వచ్చే సందేహాలు, వాటికి సమాధానాలను ఆన్‌లైన్‌లో పొందేలా డిజైన్ చేశారు. ఈ పోర్టల్ వినియోగంపై త్వరలో సీబీఐ దేశ వ్యాప్తంగా పోలీసులు, ఏజెన్సీలకు సమగ్ర శిక్షణ ఇవ్వనుంది.
భారత్‌పోల్.. 5 ఉపయోగాలు
1 దేశంలోని అన్ని ఏజెన్సీలు, పోలీసు విభాగాలతో పాటు కొన్ని విదేశీ ఏజెన్సీలు సైతం ఈ పోర్టల్ ద్వారాసంప్రదింపులు జరిపే అవకాశం ఉంది.
2 వివిధ వ్యవస్థీకృత నేరాలు,నేరగాళ్లకు సంబంధించిన వివరాల్ని ఇందులో పొందుపరిచారు.
3 బ్రాడ్ కాస్ట్ విధానంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వాంటెడ్ నేరగాళ్ల వివరాలను తేలిగ్గా ఇచ్చిపుచ్చుకునే ఆస్కారం ఏర్పడింది.
4 వ్యవస్థీకృత నేరాలు, నేరగాళ్ల సమా చారం, నేరం చేసే విధానం, ప్రభావం ఉన్న ప్రాంతాలు తదితరాలను తేలిగ్గా గుర్తించేలా ఈ పోర్టల్ రూపొందింది.
5 క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టం కంటే సమర్థంగా నేరగాళ్ల కదలికలు, వివరాలు తెలుసుకునేందుకు భారత్‌పోల్ ఉపయోగపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment