kumbhankonam
-
హీరా గ్రూపుపై ప్రభుత్వ చర్యలేవి?
సాక్షి, హైదరాబాద్: హీరా గ్రూపు కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. హీరా గ్రూపు యాజమాన్యం ఈ కంపెనీల ద్వారా రూ.50వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హీరా గ్రూపు బాధితుల సంఘం అధ్యక్షుడు షహబాజ్ అహ్మద్ ఖాన్ ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సీసీఎస్ డిప్యూటీ కమిషనర్, కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, హీరా గ్రూపు కంపెనీల ఎండీ, సీఈవో నౌహీరా షేక్‌లతో పాటు హీరా గ్రూపు కంపెనీలను ప్రతివాదులుగా చేర్చారు. హీరా గ్రూపు కంపెనీల ద్వారా నౌహీరా షేక్ ఇటు భారతీయులతో పాటు ప్రవాసుల వద్ద నుంచీ భారీ మొత్తాలను సేకరించారని పిటిషనర్ తెలిపారు.అత్యధికంగా సాధారణ ప్రజానీకం ఈ గ్రూపు కంపెనీల్లో చేరారని తెలిపారు. ఈ కంపెనీల యాజమాన్యం 36 శాతం వార్షిక వడ్డీ చెల్లిస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఖాతాదారులను ఆకర్షించేందుకు ఇస్లామ్‌ను వాడుకున్నారని పిటిషనర్ ఆరోపించారు. మొదట్లో కొన్ని నెలలు చెల్లింపులు చేసి ఆ తరువాత మానేసిందన్నారు. ఆమెకు ఐసిస్‌తో సంబంధాలున్నాయి... హీరా గ్రూపునకు దేశవ్యాప్తంగా 74 బ్రాంచీలు ఉన్నాయని, 430 మంది మార్కెటింగ్ ప్రతినిధులు ఉన్నారని తెలిపారు. వీరి ద్వారా డబ్బు వసూలు చేశారన్నారు. ఈ ఏజెంట్లకు భారీగా కమిషన్లను ముట్టజెప్పారని వివరించారు. దేశవ్యాప్తంగా రూ.50వేల కోట్లను 1.75 లక్షల మందికి చెల్లించకుండా హీరా గ్రూపు యాజమాన్యం ఎగవేసిందని, ఇందుకు గాను ఈ కంపెనీ ఎండీ, సీఈవో నౌహీరా షేక్ అరెస్టయ్యారని తెలిపారు. ఈమెకు ఐసిస్‌తో సంబంధాలున్నాయన్నారు. పాకిస్థాన్‌కు చెందిన ప్రబోధకుడు తౌసీఫర్ రహ్మాన్‌ను నౌహీరా తరచూ కీర్తించే వారని, అతనికి ఐసిస్‌తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని వివరించారు. అతన్ని ఇటీవల సౌదీ ప్రభుత్వం అరెస్ట్ చేసిందన్నారు. 3 లక్షల మంది విదేశీయులు కూడా హీరా గ్రూపుల్లో పెట్టుబడులు పెట్టారని పిటిషనర్ వివరించారు. సీసీఎస్ సమర్థవంతంగా దర్యాప్తు చేయలేకపోతోంది... ఈ వ్యవహారంపై హైదరాబాద్ సీసీఎస్ సమర్థవంతంగా దర్యాప్తు చేయలేకపోతోందన్నారు. ఈ కేసులో పెట్టుబడిదారులకు న్యాయం జరగాలంటే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడమే మార్గమన్నారు. ఈ కేసులో ఆర్థిక అంశాలతో పాటు, మనీలాండరింగ్ కూడా ఉందని తెలిపారు. వాస్తవాలను వెలుగులోకి రావాలంటే పలు అంశాల్లో ప్రత్యేక నైపుణ్యం ఉన్న అధికారులు అవసరమని, అందువల్ల సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తే తగిన ఫలితాలు ఉంటాయన్నారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. -
రూ.కోటి కుంభకోణంపై విచారణ
విచారణాధికారిగా ఏసీ అజయ్‌కిషోర్ 10 రోజుల్లో ఆర్డీకి పూర్తి స్థాయి నివేదిక అధికారుల గుండెల్లో దడ చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: చిత్తూరు కార్పొరేషన్‌లోని ప్రజారోగ్య విభాగంలో కోటి రూపాయల కుంభకోణాన్ని వెలికితీసేందుకు రాష్ట్ర మున్సిపల్ శాఖ ముందుకు వచ్చింది. దీనిపై విచారణ అధికారిగా అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) అజయ్కిషోర్ను నియమిస్తూ మున్సిపల్ రీజనల్ డెరైక్టర్ మురళికృష్ణ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను కమిషనర్ రాజేంద్రప్రసాద్ బుధవారం ఏసీకి అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజారోగ్య విభాగంలో అక్రమాలు తన దృష్టికి వచ్చాయన్నారు. ఆ వివరాల ఆధారంగా ప్రాథమిక నివేదిక తయారు చేసి ఆర్డీకి అందజేశానన్నారు. దాదాపు కోటి రూపాయలకుపైగా కుంభంకోణం జరిగిన నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణ అధికారిగా ఏసీని నియమించాలని ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చాయని చెప్పారు. దీనిపై నివేదిక తయారు చేసి 10 రోజుల్లో ఆర్డీకి సమర్పించాలని కమిషనర్ ఏసీని ఆదేశించారు. ఏ అంశాలపై విచారణ...? ప్రజారోగ్య విభాగంలో కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల నుంచి చొప్పులు కొనుగోలు వరకూ అన్ని అంశాలపై విచారణ చేపట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుతం 168 మంది పారిశుద్ధ్య కార్మికులు కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్నారు. అయితే రికార్డుల్లో మాత్రం 206 మంది పనిచేస్తున్నట్టు చూపుతున్నారు. 38 మందిని ఎందుకు అదనంగా చూపుతున్నారు. వీరి జీతాలు ఎవరికి చేరుతున్నాయి. 206 మంది పీఎఫ్ నిధులు ఏమయ్యాయి. కాంట్రాక్టు పద్ధతిపై తీసుకునే పారిశుద్ధ్య కార్మికుల నుంచి ఎంత మొత్తం వసూలు చేశారు. ఇలా అన్ని కోణాలపై విచారణ చేపట్టనున్నారు. అదే విధంగా పారిశుద్ధ్య కార్మికులకు నెల నెలా ఇచ్చే నూనె, సబ్బులు, యూనిఫారం, చెప్పులు, గ్లౌసులు ఎక్కడ నుంచి కొనుగోలు చేస్తున్నారు. వాటిలో నాణ్యత ఎంత, ఎంతకు కొనుగోలు చేశారు. ఎంత మొత్తానికి బిల్లులు సమర్పించారు. అసలు కొనుగోలు చేశారా లేదా? ఎన్ని సార్లు నూనె, సబ్బులు ఇచ్చారు. వీటిలో ఎంత కోత పెట్టారు. పారలు, చీపుర్లు, కంపోస్టు యార్డులో నిర్వహణ నిధులు దుర్వినియోగం, చెత్త విక్రయాల్లో చేతివాటం, ఇలా ఒకటి కాదు.. రెండు కాదు విచారణలో పలు అంశాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి. అధికారుల గుండెల్లో దడ ప్రజారోగ్య విభాగంలో అక్రమాలపై విచారణకు ఆదేశించడంతో ఈ విభాగంలో పనిచేసిన, పనిచేస్తున్న అధికారుల గుండెల్లో దడ మొదలైంది. విచారణలో నిజానిజాలు తేలితే ఎవరపై వేటు పడుదుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. కొనేళ్లుగా ఈ విభాగంలో పనిచేసి (రెగ్యులర్/ఇన్చార్జి) అధికారుల నుంచి ప్రస్తుతం ప్రజారోగ్య అధికారి శ్రీనివాసరావు హయాంలో చేపట్టిన పనులపై విచారణ చేపట్టాలని ఉత్తర్వులో పేర్కొనడంతో బదిలీ అయిన అధికారులను సైతం విచారించే అవకాళం ఉంది.