సాక్షి, హైదరాబాద్: ఒక కంపెనీ లేదు.. ఉత్పత్తి కేంద్రం లేదు.. కనీసం క్రయ విక్రయాల దుకాణాలు సైతం లేవు. అయినా హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గడిచిన ఆరేళ్లలో సాగించిన టర్నోవర్ ఎంతో తెలుసా? అక్షరాల రూ.5 వేల కోట్లు. వివిధ ఏజెన్సీల ద్వారా హైదరాబాద్ నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు ఈ వివరాలు సేకరించారు. తిరిగి చెల్లించాల్సిన ప్రజల డిపాజిట్లను కూడా తమ ఆదాయంగా చూపిన ఈ గ్రూప్ ఆ డిపాజిటర్ల జాబితాను బయటపెట్టట్లేదు. హీరా గ్రూప్‌లో మొత్తం 15 కంపెనీలు ఉన్నాయి. హీరా గోల్డ్, హీరా టెక్స్‌టైల్స్, హీరా రిటైల్స్.. ఇలా పలు సంస్థలు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో (ఆర్వోసీ) నమోదైనా వాస్తవంలో మాత్రం లేవు. ప్రజలకు ఎరవేసి, అధిక వడ్డీ ఆశచూపి డిపాజిట్లు సేకరించడం మినహా మరో దందా లేదు. ఈ గ్రూప్ సంస్థలు విదేశాల్లో భారత్‌తో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదు. అయినా గడిచిన ఆరేళ్లలో రూ.5 వేల కోట్లు టర్నోవర్ చేసినట్లు రిటర్న్స్ దాఖలు చేసింది. ఐటీ, ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐఓ), రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) వీటిలో ఒక్కో విభాగానికి ఒక్కో రిటర్న్స్ ఫైల్ చేసింది. వీటి మధ్య ఎక్కడా పొంతన లేదని సీసీఎస్ పోలీసులు గుర్తించారు.
అన్ని విభాగాలతో సీసీఎస్ సమావేశం..
ఇప్పటికే హీరా గ్రూప్‌పై అన్ని ఏజెన్సీల్లో కేసులు నమోదయ్యాయి. ఈడీ సహా మరికొన్ని ఏజెన్సీలు కొంతవరకు ఆస్తులు గుర్తించి సీజ్ చేశాయి. ఈ స్కామ్‌ను దర్యాప్తు చేస్తున్న సీసీఎస్ పోలీసులు అవసరమైన అదనపు ఆధారాల సేకరణపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా మంగళవారం ఐటీ, ఈడీ తదితర విభాగాలతో సమావేశమయ్యారు. వీటి వద్ద ఉన్న, స్వాధీనం చేసుకున్న ఆస్తుల జాబితాలు సేకరిస్తున్నారు. ఈ సమావేశంలోనూ హీరా ఫ్రాడ్‌పై ఏ ఒక్కరూ స్పష్టత ఇవ్వలేకపోయారు. రాష్ట్రంలో ఉన్న ఆస్తుల వివరాలు తెలపాలంటూ రిజిస్ట్రేషన్ శాఖకు లేఖ రాసిన పోలీసులు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాటి వివరాల కోసం ప్రత్యేక బృందాలను పంపారు. హీరా గ్రూప్ కార్యకలాపాల వెనుక జాతీయ భద్రతకు సంబంధించిన కోణం కూడా ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
నౌహీరా షేక్‌కు ఊరట
నౌహీరా షేక్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. నౌహీరాను కస్టడీలోకి తీసుకునేందుకు సీసీఎస్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టేసింది. ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.5 లక్షలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది.
రూ.100కు రూ.90 లాభం అంటూ..
ప్రజలు తమ వద్ద పెట్టిన డిపాజిట్లను గోల్డ్, టెక్స్‌టైల్ రంగాల్లో పెట్టుబడులు పెడతామంటూ హీరా గ్రూప్ నమ్మబలికింది. వాటిలో రూ.100 పెట్టుబడి పెడితే రూ.90 లాభం వస్తుందని, దీని నుంచి తాము 54 శాతం తీసుకుంటూ మిగిలిన 36 శాతం పెట్టుబడి పెట్టిన వారికి పంచుతామని చెబుతూ వచ్చింది. అయితే వాస్తవంగా ఎలాంటి వ్యాపారాలు చేయట్లేదనే విషయం బహిర్గతమైంది. ఈ లావాదేవీలకు సంబంధించి రికార్డులు సైతం సమర్పించలేదు. కాగా, నౌహీరా షేక్‌పై 2012లోనూ ఓ కేసు నమోదైంది. ఈ కేసులో ఆమె పొందిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయించేందుకు గతంలో సీసీఎస్ పోలీసులు ప్రయత్నించారు. నౌహీరా షేక్.. దర్యాప్తు అధికారినే బంజారాహిల్స్‌లోని తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. సంస్థ ఆదాయ మార్గాల వివరాలు అడిగితే ‘తనకు ఈ డబ్బును భగవంతుడు ఇస్తున్నాడు. దానికి మనం లెక్కలు ఎలా చెప్పగలం’అంటూ నౌహీరా చెప్పినట్లు సమాచారం.
బౌన్సర్ల దౌర్జన్యం..
నౌహీరా షేక్ తరఫున ముంబైకి చెందిన వినీత్ టాండ వాదిస్తున్నారు. ఆయన వెంటవచ్చిన ముంబై బౌన్సర్లు బుధవారం నాంపల్లి కోర్టు వద్ద వీరంగం సృష్టించారు. బాధితుల సంఘం అధ్యక్షుడు షాబాజ్ అహ్మద్‌ఖాన్ నేతృత్వంలో కొందరు బాధితురాళ్లు బుధవారం కోర్టు వద్దకు వచ్చారు. తిరిగి వెళ్తున్న టాండను బాధితులు ఘెరావ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన బౌన్సర్లు మహిళలపై దాడులు చేసి అసభ్యకరంగా ప్రవర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు బౌన్సర్లపై కేసులు నమోదు చేయడంతో పాటు ముగ్గురిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment