
సాక్షి, నల్గొండ : ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న భయానక ఘటనలపై కేసీఆర్ స్పందించిన తీరు సరికాదన్నారు. ప్రేమ వివాహం కారణంగా మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ కుంటుంబ సభ్యులను శుక్రవారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడతూ.. ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్ ప్రాణాలు తీయడం అత్యంత బాధకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎప్పుడూ ఫామ్‌హౌక్‌కే పరిమితమయ్యే కేసీఆర్.. సచివాలయానికి రాకున్నా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు తక్షణమే స్పందించాలని హితవు పలికారు. కొండగట్టు బస్పు ప్రమాదంలో 60 మంది చనిపోయినప్పుడు కూడా కేసీఆర్ రాకపోవడం విస్మయం కలిగిచిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పరువు హత్యలపై కఠిన చట్టాలు తెస్తామని వెల్లడించారు.