మలుపుల్లో 'మృత్యువు' | Tragedy at Kodimial with Huge Bus Accident | Sakshi
Sakshi News home page

మలుపుల్లో 'మృత్యువు'

Published Wed, Sep 12 2018 2:52 AM | Last Updated on Wed, Sep 12 2018 2:52 AM

Tragedy at Kodimial with Huge Bus Accident - Sakshi

ప్రమాదానికి గురైన బస్సు వద్ద సహాయక చర్యలు చేపడుతున్న పోలీసులు

ఘాట్‌ రోడ్లు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా గత మూడేళ్లుగా బస్సులు లోయల్లో పడిన ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేవలం గతేడాది బస్సు ప్రమాదాల్లో సగటున రోజుకు 29 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. బస్సు ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళలు ముందున్నాయి. హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌లో రోజూ ఏదో ఒక చోట బస్సు లోయలో పడిన ప్రమాదాల గురించే వింటున్నాం. 2017లో బస్సు ప్రమాదాల్లో 9,069 మంది మరణించారు. ఇందులో తమిళనాడులోనే 1,856 మంది మరణించారు. ఉత్తరప్రదేశ్‌లో గతేడాది 1,406 మంది ప్రాణాలు కోల్పోయారు.ఇక కర్ణాటకలో బస్సులు లోయలో పడిన ప్రమాదాల్లో 800 మంది మరణించారు. 

జగిత్యాల క్రైం/టౌన్‌: కొండగట్టు రోడ్డు ప్రమాదంలో కొడిమ్యాల మండలానికి చెందిన వారే 50 మంది మృతిచెందారు. శనివారంపేటకు చెందిన 15 మంది, హిమ్మత్‌రావుపేటకు చెందిన 10 మంది, డబ్బుతిమ్మయ్యపల్లికి చెందిన 10 మంది, రాంసాగర్‌కు చెందిన 9 మంది, తిర్మలాపూర్‌కు చెందిన ఆరుగురు మృతిచెందారు. దీంతో మండలమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. శనివారంపేటకు చెందిన గర్భిణులు సుమలత (తొమ్మిది నెలలు), నామాల మౌనిక (5 నెలలు) ప్రమాదంలో చనిపోయారు.

కారణాలు శాస్త్రీయంగా అన్వేషించాలి
ఘాట్‌రోడ్లపై భద్రతాపరమైన ఏర్పాట్లు ఎక్కడా కనిపించడం లేదు. ఘాట్‌రోడ్లలో రహదారికి ఇరువైపులా బారియర్లు నిర్మించాలని రోడ్డు భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఫైబర్‌ మిర్రర్స్‌ ఏర్పాటు చేసినా కొంతవరకు ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. తమిళనాడు వంటి రాష్ట్రాలు ఘాట్‌రోడ్లపై ఎక్కడికక్కడ హెచ్చరిక బోర్డులు పెడుతు న్నాయి. ఆ ఘాట్‌ల గురించి క్షుణ్ణంగా తెలిసిన డ్రైవర్లనే నియమిస్తున్నాయి. ఘాట్‌రోడ్లపై కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రోడ్డు భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. ‘ఏదైనా ప్రమాదం జరగ్గానే అందరూ డ్రైవర్‌ వైపే వేలెత్తి చూపిస్తున్నారు. కానీ అది సరైనది కాదు. ప్రమాదానికి గల అసలు కారణాలేంటో కనుక్కోవాలి. రోడ్డు తీరుతెన్నులు, ప్రతికూల పరిస్థితులు, సామర్థ్యానికి మించి ఎక్కించుకోవడం, నిబంధనల్ని పాటించకపోవడం వంటివి ప్రమాదాలకు కారణమవుతున్నాయి’ అని ట్రాన్స్‌పోర్ట్‌ ప్లానర్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.రంగనాథన్‌ అభిప్రాయపడ్డారు.

ప్రమాదాలకు కారణాలు
ఘాట్‌ రోడ్లపై ప్రమాదాలకు చాలా కారణాలున్నాయి. కొండల్లో ఇరుకు దారులు, ప్రమాదకర మలుపులు, చెత్త రోడ్లు, వెలుతురు సరిగా లేకపోవడం, వాహనాల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికుల్ని ఎక్కించుకోవడం, వేరే వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేయడానికి డ్రైౖవర్లు ప్రయత్నించడం, మద్యం సేవించడం వంటివి ఘాట్‌ రోడ్లపై ప్రమాదాలకు కారణాలుగా చెప్పొచ్చు. ప్రమాదాల్లో 50% ప్రమాదకరమైన మలుపుల కారణంగా, డ్రైవర్‌ నిర్లక్ష్యంతో 25% ప్రమాదాలు జరుగుతున్నాయి. 

గుంతల కారణంగా ప్రమాదాలు..
రోడ్లపై గుంతల కారణంగా కూడా మరణాలు సంభవిస్తున్నాయి. గత మూడేళ్లలో రహదారులపై గోతుల కారణంగా జరిగిన ప్రమాదాల్లో 9,300 మందికి పైగా మరణించారు. 25 వేల మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని రహదారుల శాఖ మంత్రి మన్సుక్‌ ఎల్‌.మాండవీయ పార్లమెంటులో చెప్పారు. అంటే రోడ్లపై గుంతల కారణంగా దాదాపు రోజుకు 10 మంది మృతి చెందుతున్నారన్నమాట. 2015లో 3,416 మంది, 2016లో 2,324 మంది రోడ్లపై గోతుల కారణంగా మరణించారు. 2017లో పై తరహా ప్రమాదాల్లో 3,597 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవి గత సంవత్సరం తీవ్రవాద దాడుల కారణంగా సంభవించిన మరణాల (803) కంటే ఎక్కువ. 2016లో నిర్మాణంలో ఉన్న రోడ్ల దగ్గర జరిగిన ప్రమాదాల్లో 3,878 మంది మరణించారు. 2017 నాటికి ఈ సంఖ్య 4,250కి పెరిగింది. 

బస్సులు137 డ్రైవర్లు 62
జగిత్యాల డిపోలో పని ఒత్తిడి ఎలా ఉందో తెలుసుకునేందుకు ఈ అంకెలే సాక్ష్యం. మొత్తం 137 బస్సులు ఉన్న జగిత్యాల డిపోలో 62 మంది డ్రైవర్లే అందుబాటులో ఉన్నారు. ఈ లెక్కన ప్రతి రెండు బస్సులకు ఒక్క డ్రైవరు మాత్రమే అందుబాటులో ఉన్నాడు. అందుకే ప్రతి డ్రైవర్‌కు పని ఒత్తిడి తప్పట్లేదు. చాలాసార్లు తమకు విధులు వద్దని చెప్పినా వినకుండా.. విధులు చేయాల్సిందేనని బలవంతం చేయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఘాట్‌ రోడ్‌ కోసం శిక్షణేదీ?
కొండగట్టు ప్రమాదం ఇప్పుడు అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఆదాయం కోసం చూపిన ఉత్సాహం ప్రయాణికులకు రక్షణ కల్పించడంలో చూపట్లేదని తేటతెల్లమైంది. వాస్తవానికి తిరుమలలో ప్రత్యేకమైన బస్సును డిజైన్‌ చేసి నడుపుతున్నారు. అక్కడ ప్రత్యేక కంట్రోలర్‌ ఉంటారు. ఎవరినీ నిలబడనీయరు. అసలు ఎవరు నిలుచుని ఉన్నా.. బస్సు ముందుకు కదలదు. అంతా కూర్చున్నాకే బస్సు స్టార్టవుతుంది. అక్కడి డ్రైవర్లకు ఈ విషయంలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ప్రయాణికుల రక్షణకు పెద్దపీట వేస్తారు. 

రద్దీ వల్లే..
వేములవాడ నుంచి కొండగట్టు మీదుగా జగిత్యాలకు ఒకే ఆర్టీసీ బస్సు నడుపుతున్న ఆర్టీసీ.. భక్తుల రద్దీ నేపథ్యంలో 10 రోజుల క్రితం కొడిమ్యాల మండలం శనివారంపేట నుంచి కొండగట్టు మీదుగా మరో బస్సును (ప్రమాదానికి గురైంది) ప్రారంభించింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దేవాలయం నుంచి 30 మందికి పైగా ప్రయాణికులు బస్సులో ఎక్కినట్లు తెలుస్తోంది. 

కాపాడాలని వేడుకున్నరు
కొండగట్టు ఘాట్‌ రోడ్డు కింద ఓ రైతు భూమిని జేసీబీతో చదును చేస్తున్నం. గుట్ట పైనుంచి వస్తున్న బస్సులో నుంచి కాపాడండంటూ అరుపులు వినిపించాయి. మేము అటు చూస్తుండగానే బస్సు లోయలో పడిపోయింది. మేం వెంటనే లోయ వద్దకు వచ్చినం. అప్పటికే అందరూ చెల్లాచెదురుగా పడ్డరు. బస్సులో ఉన్న కొందరిని మొదట మేమే బయటకు తీసినం. ఒక్కొక్కరినీ బయటకు తీస్తుంటే కళ్లలో నీళ్లు తిరిగినయ్‌. బస్సులో వెనుక ఉన్న వాళ్లందరూ ముందుకొచ్చి పడ్డరు.
– ప్రత్యక్ష సాక్షులు చంద్రశేఖర్,రవిప్రతాప్, జేసీబీ డ్రైవర్లు

మా ఆటోకు తాకింది.. 
కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి టాటా ఏస్‌ ఆటోలో వెళ్లినం. ఆటోలో ఆరుగురు పెద్దవాళ్లం. నలుగురు చిన్నపిల్లలు ఉన్నారు. కొండగట్టు గుట్టమీదికి వెళ్తుండగా కిందకు పడుతున్న బస్సు నుంచి అరుపులు వినబడ్డయ్‌. పక్కకు జరగమని అరిచారు. మా ఆటో డ్రైవర్‌ వెంటనే స్పీడ్‌ పెంచిండు. క్షణాల్లో బస్సు మా దగ్గరికి వచ్చి ఆటోకు తాకి రోడ్డు కిందకు దూసుకుపోయింది. ఏమైందో తెల్వలేదు. బస్సు ఆటోను తాకడంతో అద్దాలు పగిలినయ్‌. అదృష్టం కొద్ది ఆటోలో ఉన్నవారెవరికీ దెబ్బలు తగల్లేదు.
మెడబోయిన కొమురయ్య,చిగురుమామిడి

వేగానికి భయపడి మధ్యలోనే బస్సు దిగిన.. 
మా ఊరు కొడిమ్యాల. జగిత్యాలకు వెళ్లేందుకు తిర్మలాపూర్‌ వద్ద బస్సు ఎక్కిన. డ్రైవర్‌ బస్సును వేగంగా పోనిస్తూ ముందు వెళ్లే వాహనాలను వేగంగా ఓవర్‌ టేక్‌ చేశాడు. మెల్లగా వెళ్లాలని చెప్పినా వినలేదు. దీంతో జేఎన్టీయూ కాలేజీ బస్‌స్టాప్‌ వద్ద దిగిన. కొద్దిసేపటికే బస్సు కొండగట్టు ఘాట్‌రోడ్డు లోయలో పడిందని తెలిసింది. నా అదృష్టం బాగుంది. నేను ఎప్పుడు కూడా దారి మధ్యలో బస్సు దిగిపోలేదు. మొదటిసారిగా బస్సు వేగంగా వెళ్తుంటే భయపడి దిగిన..ప్రాణాలు దక్కినయ్‌.
– ప్రకాశ్, కొడిమ్యాల

స్వచ్ఛందంగా యువకుల సాయం
మల్యాల: కొండగట్టు ఘాట్‌రోడ్డు సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో క్షత గాత్రులను తరలించేందుకు యువకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అయిల్నేని సాగర్‌రావు క్షతగాత్రులను ఎత్తుకుని తీసుకొచ్చి తన వాహనంలో జగిత్యాలకు తరలించారు. నేళ్ల రాజేశ్వర్‌రెడ్డి, కొక్కుల రఘు, కృష్ణారావు, దూస వెంకన్న తదితరులు క్షతగాత్రులను లోయలో నుంచి పైకి తీసుకొచ్చారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటంతో ప్రాణాలతో ఉన్నవారిని గుర్తించి, అంబులెన్స్‌లతో పాటు ప్రైవేటు వాహనాల్లో ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను తరలించేందుకు అంబులెన్సులు సరిపోకపోవడంతో అధికారులు సైతం తమ వాహనాల్లో తరలించారు. కొండ కింద ట్యాక్సీ జీపులు నడిపే డ్రైవర్లు కూడా సంఘటనా స్థలా నికి చేరుకుని తమ వాహనాల్లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఆస్పత్రిలోనూ స్థానిక ముస్లిం యువకులు, ఎన్‌సీసీ కేడెట్లు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మృత దేహాలను పోస్టుమార్టం గదికి తరలించడం.. క్షతగాత్రులను వాహనాల నుంచి ఆస్పత్రి లోపలికి తీసుకెళ్లడంలో జిల్లా యంత్రాంగానికి సాయం అందించారు. 

కడవరకూ కలసే..
కొడిమ్యాల (చొప్పదండి): ధర్మేచ, అర్థేచ, కామేచ నాతిచరామి అని పెళ్లినాడు చేసిన ప్రమాణాలను ఆ మూడు జంటలు నిలబెట్టుకున్నాయి. కడవరకూ కలసే సాగాయి. కొడిమ్యాల మండలంలోని డబ్బుతిమ్మయ్యపల్లికి చెందిన గొల్కొండ దేవయ్య (60) –గోల్కొండ లక్ష్మి (55), వొడ్నాల కాశీరాం (60)–వొడ్నాల లక్ష్మి (55), శనివారంపేట గ్రామానికి చెందిన గోలి రాయమల్లు (55)–గోలి అమ్మాయి (50) దంపతులు ప్రమాదంలో మృతిచెందారు. దేవయ్యకు జ్వరం రావడంతో చికిత్స నిమిత్తం దంపతులు జగిత్యాల ఆసుపత్రికి.. వొడ్నాల కాశీరాం చికిత్స నిమిత్తం జగిత్యాలకు, వొడ్నాల లక్ష్మి కూతురు వద్దకు.. గోలి రాయమల్లు, గోలి అమ్మాయిలు బంధువుల ఇంటికి వెళ్తుండగా.. ప్రమాదంలో మృతి చెందారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement