Department of roads
-
జాతీయ రహదారులకు రూ.6,212 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు సంబంధించి కేంద్రం భారీ కేటాయింపులు చేసింది. రూ.6,212.9 కోట్లు మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల విస్తరణకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వార్షిక ప్రణాళికను ఖరారు చేసిన కేంద్రం ఇందులో అత్యధికంగా నిధులు ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,869 కోట్లు, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌కు రూ.7,530 కోట్లు కేటాయించింది. మూడో స్థానంలో తెలంగాణ నిలి చింది. రాష్ట్రం ఆవిర్భవించాక ఓ ఆర్థిక సంవత్సరం లో రోడ్లకు ఇంత భారీగా నిధులు కేటాయించటం ఇదే తొలిసారి. నిధుల కేటాయింపునకు సంబంధించి సెంట్రల్ ఫైనాన్స్ కమిటీ, ఆర్థిక వ్యవహారాల విభాగాలు ఆమోదముద్ర వేశాయి. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో జాతీయ రహదా రులకు సంబంధించి 16 రోడ్ల పనులకు మోక్షం లభించింది. రాష్ట్ర రహదారులుగా ఉన్న వీటిని జాతీయ రహదారులుగా గుర్తిస్తూ కేంద్ర జాతీయ రహదారుల శాఖ అనుమతిచ్చింది. ఆ మేరకు జాతీయ రహదారుల విభాగం డీపీఆర్‌లను సిద్ధం చేసింది. ఆ డీపీఆర్‌లను సెంట్రల్ ఫైనాన్స్ కమిటీకి సమర్పించగా వాటిని పరిశీలించి నిధుల విడుదలకు తాజాగా ఆమోద ముద్ర వేసింది. దీంతో టెండర్లు పిలిచేందుకు మార్గం సుగమమైంది. వచ్చే రెండేళ్లలో పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో మూడో తీగల వంతెన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల వరకు 167కె జాతీయ రహదారిని విస్తరించనున్నారు. రెండు వరుసలుగా రోడ్డును విస్తరించే క్రమంలో సోమశిల వద్ద కృష్ణా నదిపై దాదాపు 2 కిలోమీటర్ల నిడివిగల వంతెనను నిర్మించాల్సి ఉంది. ఇది పర్యాటక ప్రాంతం కావడంతో పర్యాటకులను ఆకట్టుకునేలా తీగల (సస్పెన్షన్ బ్రిడ్జి) వంతెనను నిర్మించాలని నిర్ణయించారు. ఆ ప్రాంతం శ్రీశైలం రిజర్వాయర్ పరిధిలోకి వస్తున్నందున అక్కడ కృష్ణా నది లోతు చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్రాంతంలో నదీగర్భంలో పునాదులు తీసి వంతెన కట్టడం కంటే తీగల నమూనా మంచిదన్న అభిప్రాయాన్ని కూడా ఇంజనీర్లు ఇచ్చారు. ఖర్చు పెరిగినా సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణమే ఉత్తమమని తేల్చారు. ఇందుకు దాదాపు రూ.750 కోట్లు ఖర్చవుతుందని డీపీఆర్‌లో పేర్కొ న్నారు. బ్రిడ్జి నమూనా సిద్ధం చేయాల్సి ఉంది. వెరసి వంతెనతో కలుపుకుంటే నిర్మాణ వ్యయం రూ.1,600 కోట్లు అవుతుంది. దీంతో వంతెన భాగానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిధులు కేటాయించాలని కేంద్రం నిర్ణ యించింది. సెంట్రల్ ఫైనాన్స్ కమిటీ రోడ్డుకు సంబంధించిన నిధులకే పచ్చజెండా ఊపింది. వంతెన నిధులను వచ్చే ఆర్థిక సంవత్సరం రోడ్ ప్లాన్‌లో చేర్చనున్నారు. త్వరలో టెండర్లు 2 వరుసలు, 4 వరుసలకు రోడ్ల విస్తరణతో పాటు 3 రోడ్లను పటిష్టపరిచేందుకు కూడా నిధుల విడుదలకు కమిటీ అనుమతిచ్చింది. ఇందులో హైదరాబాద్–భూపాలపట్నం రోడ్డుకు సంబంధిం చి 39.7 కిలోమీటర్లకు రూ.48.2 కోట్లు, సిరోంచ–ఆత్మకూరు రోడ్డుకు 8 కిలోమీటర్లకు రూ.79.42 కోట్లు, కల్యాణ్–నిర్మల్ రోడ్డుకు 7 కిలోమీటర్లకు 39.96 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. ఆదిలాబాద్–బేలా రోడ్డు డీపీఆర్‌కు రూ.1.26 కోట్లను కూడా మంజూరు చేసింది. త్వరలో టెండర్లు పిలవనున్నారు. -
రోడ్ల నిర్మాణంలో వేగం పెంచాలి
సాక్షి, హైదరాబాద్: రహదారుల నిర్మాణాలకు సంబంధించి అధికార యంత్రాంగం సమన్వయం తో పనిచేయాలని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి అన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 181 రహదారుల నిర్మాణం.. వాటి అనుమతుల వేగవంతంపై అటవీ, రోడ్లు, భవనాల శాఖల అధికారుల సమన్వయ సమావేశం శనివారం అరణ్యభవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆమె అధికారులకు వివిధ అంశాలపై స్పష్టమైన సూచనలు చేశారు. రాష్ట్ర పరిధిలో పూర్తి స్థాయి రోడ్ నెట్ వర్క్, కొత్త జాతీయ రహదారులు, వ్యూహాత్మక ఎలివేటెడ్ రోడ్ కారిడార్ల నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని స్పష్టంచేశారు. అన్ని రకాల అనుమతుల సాధన కోసం డెడ్ లైన్లు పెట్టుకుని పనిచేయాలని, ప్రత్యామ్నాయ అడవుల పెంపకం కోసం జిల్లా స్థాయి అధికార యంత్రాంగంతో భూ సేకరణ విషయమై సమన్వయం చేసుకోవాలని రెండు శాఖల అధికారులను ఆదేశించారు. అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్ ) ఆర్.శోభ మాట్లాడుతూ ఆయా రహదారులకు అనుమతుల విషయంలో జాప్యాన్ని నివారించేందుకు సంబంధిత పనులు చేస్తున్న ఏజెన్సీలు కూడా సహకరించాలని కోరారు. అటవీ, పర్యావరణ అనుమతులకు సంబంధించి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కఠిన నిబంధనలను అర్థం చేసుకుని, అం దుకు అనుగుణంగా అనుమతుల పత్రాలను ఆన్లైన్లో పొందు పర్చాలని అన్నారు. రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి కె.ఎస్.శ్రీనివాస రాజు మాట్లా డుతూ హైవేల నిర్మాణానికి వీలైనన్ని నిధు లు రాబట్టుకొనే ప్రయత్నం చేయాలని చెప్పారు. సమావేశంలో పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్త్రీ) ఆర్.ఎం. దోబ్రి యల్, అటవీశాఖ సంయుక్త కార్యదర్శి ప్రశాంతి, ఆర్.అండ్.బీ ప్రత్యేకకార్యదర్శి బి.విజయేంద్ర, సల హాదారు గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మలుపుల్లో 'మృత్యువు'
ఘాట్ రోడ్లు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా గత మూడేళ్లుగా బస్సులు లోయల్లో పడిన ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేవలం గతేడాది బస్సు ప్రమాదాల్లో సగటున రోజుకు 29 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. బస్సు ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళలు ముందున్నాయి. హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌లో రోజూ ఏదో ఒక చోట బస్సు లోయలో పడిన ప్రమాదాల గురించే వింటున్నాం. 2017లో బస్సు ప్రమాదాల్లో 9,069 మంది మరణించారు. ఇందులో తమిళనాడులోనే 1,856 మంది మరణించారు. ఉత్తరప్రదేశ్‌లో గతేడాది 1,406 మంది ప్రాణాలు కోల్పోయారు.ఇక కర్ణాటకలో బస్సులు లోయలో పడిన ప్రమాదాల్లో 800 మంది మరణించారు. జగిత్యాల క్రైం/టౌన్: కొండగట్టు రోడ్డు ప్రమాదంలో కొడిమ్యాల మండలానికి చెందిన వారే 50 మంది మృతిచెందారు. శనివారంపేటకు చెందిన 15 మంది, హిమ్మత్‌రావుపేటకు చెందిన 10 మంది, డబ్బుతిమ్మయ్యపల్లికి చెందిన 10 మంది, రాంసాగర్‌కు చెందిన 9 మంది, తిర్మలాపూర్‌కు చెందిన ఆరుగురు మృతిచెందారు. దీంతో మండలమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. శనివారంపేటకు చెందిన గర్భిణులు సుమలత (తొమ్మిది నెలలు), నామాల మౌనిక (5 నెలలు) ప్రమాదంలో చనిపోయారు. కారణాలు శాస్త్రీయంగా అన్వేషించాలి ఘాట్‌రోడ్లపై భద్రతాపరమైన ఏర్పాట్లు ఎక్కడా కనిపించడం లేదు. ఘాట్‌రోడ్లలో రహదారికి ఇరువైపులా బారియర్లు నిర్మించాలని రోడ్డు భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఫైబర్ మిర్రర్స్ ఏర్పాటు చేసినా కొంతవరకు ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. తమిళనాడు వంటి రాష్ట్రాలు ఘాట్‌రోడ్లపై ఎక్కడికక్కడ హెచ్చరిక బోర్డులు పెడుతు న్నాయి. ఆ ఘాట్ల గురించి క్షుణ్ణంగా తెలిసిన డ్రైవర్లనే నియమిస్తున్నాయి. ఘాట్‌రోడ్లపై కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రోడ్డు భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. ‘ఏదైనా ప్రమాదం జరగ్గానే అందరూ డ్రైవర్ వైపే వేలెత్తి చూపిస్తున్నారు. కానీ అది సరైనది కాదు. ప్రమాదానికి గల అసలు కారణాలేంటో కనుక్కోవాలి. రోడ్డు తీరుతెన్నులు, ప్రతికూల పరిస్థితులు, సామర్థ్యానికి మించి ఎక్కించుకోవడం, నిబంధనల్ని పాటించకపోవడం వంటివి ప్రమాదాలకు కారణమవుతున్నాయి’ అని ట్రాన్స్పోర్ట్ ప్లానర్ ప్రొఫెసర్ ఎన్.రంగనాథన్ అభిప్రాయపడ్డారు. ప్రమాదాలకు కారణాలు ఘాట్ రోడ్లపై ప్రమాదాలకు చాలా కారణాలున్నాయి. కొండల్లో ఇరుకు దారులు, ప్రమాదకర మలుపులు, చెత్త రోడ్లు, వెలుతురు సరిగా లేకపోవడం, వాహనాల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికుల్ని ఎక్కించుకోవడం, వేరే వాహనాన్ని ఓవర్టేక్ చేయడానికి డ్రైౖవర్లు ప్రయత్నించడం, మద్యం సేవించడం వంటివి ఘాట్ రోడ్లపై ప్రమాదాలకు కారణాలుగా చెప్పొచ్చు. ప్రమాదాల్లో 50% ప్రమాదకరమైన మలుపుల కారణంగా, డ్రైవర్ నిర్లక్ష్యంతో 25% ప్రమాదాలు జరుగుతున్నాయి. గుంతల కారణంగా ప్రమాదాలు.. రోడ్లపై గుంతల కారణంగా కూడా మరణాలు సంభవిస్తున్నాయి. గత మూడేళ్లలో రహదారులపై గోతుల కారణంగా జరిగిన ప్రమాదాల్లో 9,300 మందికి పైగా మరణించారు. 25 వేల మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని రహదారుల శాఖ మంత్రి మన్సుక్ ఎల్.మాండవీయ పార్లమెంటులో చెప్పారు. అంటే రోడ్లపై గుంతల కారణంగా దాదాపు రోజుకు 10 మంది మృతి చెందుతున్నారన్నమాట. 2015లో 3,416 మంది, 2016లో 2,324 మంది రోడ్లపై గోతుల కారణంగా మరణించారు. 2017లో పై తరహా ప్రమాదాల్లో 3,597 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవి గత సంవత్సరం తీవ్రవాద దాడుల కారణంగా సంభవించిన మరణాల (803) కంటే ఎక్కువ. 2016లో నిర్మాణంలో ఉన్న రోడ్ల దగ్గర జరిగిన ప్రమాదాల్లో 3,878 మంది మరణించారు. 2017 నాటికి ఈ సంఖ్య 4,250కి పెరిగింది. బస్సులు137 డ్రైవర్లు 62 జగిత్యాల డిపోలో పని ఒత్తిడి ఎలా ఉందో తెలుసుకునేందుకు ఈ అంకెలే సాక్ష్యం. మొత్తం 137 బస్సులు ఉన్న జగిత్యాల డిపోలో 62 మంది డ్రైవర్లే అందుబాటులో ఉన్నారు. ఈ లెక్కన ప్రతి రెండు బస్సులకు ఒక్క డ్రైవరు మాత్రమే అందుబాటులో ఉన్నాడు. అందుకే ప్రతి డ్రైవర్‌కు పని ఒత్తిడి తప్పట్లేదు. చాలాసార్లు తమకు విధులు వద్దని చెప్పినా వినకుండా.. విధులు చేయాల్సిందేనని బలవంతం చేయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఘాట్ రోడ్ కోసం శిక్షణేదీ? కొండగట్టు ప్రమాదం ఇప్పుడు అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఆదాయం కోసం చూపిన ఉత్సాహం ప్రయాణికులకు రక్షణ కల్పించడంలో చూపట్లేదని తేటతెల్లమైంది. వాస్తవానికి తిరుమలలో ప్రత్యేకమైన బస్సును డిజైన్ చేసి నడుపుతున్నారు. అక్కడ ప్రత్యేక కంట్రోలర్ ఉంటారు. ఎవరినీ నిలబడనీయరు. అసలు ఎవరు నిలుచుని ఉన్నా.. బస్సు ముందుకు కదలదు. అంతా కూర్చున్నాకే బస్సు స్టార్టవుతుంది. అక్కడి డ్రైవర్లకు ఈ విషయంలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ప్రయాణికుల రక్షణకు పెద్దపీట వేస్తారు. రద్దీ వల్లే.. వేములవాడ నుంచి కొండగట్టు మీదుగా జగిత్యాలకు ఒకే ఆర్టీసీ బస్సు నడుపుతున్న ఆర్టీసీ.. భక్తుల రద్దీ నేపథ్యంలో 10 రోజుల క్రితం కొడిమ్యాల మండలం శనివారంపేట నుంచి కొండగట్టు మీదుగా మరో బస్సును (ప్రమాదానికి గురైంది) ప్రారంభించింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దేవాలయం నుంచి 30 మందికి పైగా ప్రయాణికులు బస్సులో ఎక్కినట్లు తెలుస్తోంది. కాపాడాలని వేడుకున్నరు కొండగట్టు ఘాట్ రోడ్డు కింద ఓ రైతు భూమిని జేసీబీతో చదును చేస్తున్నం. గుట్ట పైనుంచి వస్తున్న బస్సులో నుంచి కాపాడండంటూ అరుపులు వినిపించాయి. మేము అటు చూస్తుండగానే బస్సు లోయలో పడిపోయింది. మేం వెంటనే లోయ వద్దకు వచ్చినం. అప్పటికే అందరూ చెల్లాచెదురుగా పడ్డరు. బస్సులో ఉన్న కొందరిని మొదట మేమే బయటకు తీసినం. ఒక్కొక్కరినీ బయటకు తీస్తుంటే కళ్లలో నీళ్లు తిరిగినయ్. బస్సులో వెనుక ఉన్న వాళ్లందరూ ముందుకొచ్చి పడ్డరు. – ప్రత్యక్ష సాక్షులు చంద్రశేఖర్,రవిప్రతాప్, జేసీబీ డ్రైవర్లు మా ఆటోకు తాకింది.. కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి టాటా ఏస్ ఆటోలో వెళ్లినం. ఆటోలో ఆరుగురు పెద్దవాళ్లం. నలుగురు చిన్నపిల్లలు ఉన్నారు. కొండగట్టు గుట్టమీదికి వెళ్తుండగా కిందకు పడుతున్న బస్సు నుంచి అరుపులు వినబడ్డయ్. పక్కకు జరగమని అరిచారు. మా ఆటో డ్రైవర్ వెంటనే స్పీడ్ పెంచిండు. క్షణాల్లో బస్సు మా దగ్గరికి వచ్చి ఆటోకు తాకి రోడ్డు కిందకు దూసుకుపోయింది. ఏమైందో తెల్వలేదు. బస్సు ఆటోను తాకడంతో అద్దాలు పగిలినయ్. అదృష్టం కొద్ది ఆటోలో ఉన్నవారెవరికీ దెబ్బలు తగల్లేదు. మెడబోయిన కొమురయ్య,చిగురుమామిడి వేగానికి భయపడి మధ్యలోనే బస్సు దిగిన.. మా ఊరు కొడిమ్యాల. జగిత్యాలకు వెళ్లేందుకు తిర్మలాపూర్ వద్ద బస్సు ఎక్కిన. డ్రైవర్ బస్సును వేగంగా పోనిస్తూ ముందు వెళ్లే వాహనాలను వేగంగా ఓవర్ టేక్ చేశాడు. మెల్లగా వెళ్లాలని చెప్పినా వినలేదు. దీంతో జేఎన్టీయూ కాలేజీ బస్‌స్టాప్ వద్ద దిగిన. కొద్దిసేపటికే బస్సు కొండగట్టు ఘాట్‌రోడ్డు లోయలో పడిందని తెలిసింది. నా అదృష్టం బాగుంది. నేను ఎప్పుడు కూడా దారి మధ్యలో బస్సు దిగిపోలేదు. మొదటిసారిగా బస్సు వేగంగా వెళ్తుంటే భయపడి దిగిన..ప్రాణాలు దక్కినయ్. – ప్రకాశ్, కొడిమ్యాల స్వచ్ఛందంగా యువకుల సాయం మల్యాల: కొండగట్టు ఘాట్‌రోడ్డు సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో క్షత గాత్రులను తరలించేందుకు యువకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అయిల్నేని సాగర్‌రావు క్షతగాత్రులను ఎత్తుకుని తీసుకొచ్చి తన వాహనంలో జగిత్యాలకు తరలించారు. నేళ్ల రాజేశ్వర్‌రెడ్డి, కొక్కుల రఘు, కృష్ణారావు, దూస వెంకన్న తదితరులు క్షతగాత్రులను లోయలో నుంచి పైకి తీసుకొచ్చారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటంతో ప్రాణాలతో ఉన్నవారిని గుర్తించి, అంబులెన్స్‌లతో పాటు ప్రైవేటు వాహనాల్లో ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను తరలించేందుకు అంబులెన్సులు సరిపోకపోవడంతో అధికారులు సైతం తమ వాహనాల్లో తరలించారు. కొండ కింద ట్యాక్సీ జీపులు నడిపే డ్రైవర్లు కూడా సంఘటనా స్థలా నికి చేరుకుని తమ వాహనాల్లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఆస్పత్రిలోనూ స్థానిక ముస్లిం యువకులు, ఎన్సీసీ కేడెట్లు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మృత దేహాలను పోస్టుమార్టం గదికి తరలించడం.. క్షతగాత్రులను వాహనాల నుంచి ఆస్పత్రి లోపలికి తీసుకెళ్లడంలో జిల్లా యంత్రాంగానికి సాయం అందించారు. కడవరకూ కలసే.. కొడిమ్యాల (చొప్పదండి): ధర్మేచ, అర్థేచ, కామేచ నాతిచరామి అని పెళ్లినాడు చేసిన ప్రమాణాలను ఆ మూడు జంటలు నిలబెట్టుకున్నాయి. కడవరకూ కలసే సాగాయి. కొడిమ్యాల మండలంలోని డబ్బుతిమ్మయ్యపల్లికి చెందిన గొల్కొండ దేవయ్య (60) –గోల్కొండ లక్ష్మి (55), వొడ్నాల కాశీరాం (60)–వొడ్నాల లక్ష్మి (55), శనివారంపేట గ్రామానికి చెందిన గోలి రాయమల్లు (55)–గోలి అమ్మాయి (50) దంపతులు ప్రమాదంలో మృతిచెందారు. దేవయ్యకు జ్వరం రావడంతో చికిత్స నిమిత్తం దంపతులు జగిత్యాల ఆసుపత్రికి.. వొడ్నాల కాశీరాం చికిత్స నిమిత్తం జగిత్యాలకు, వొడ్నాల లక్ష్మి కూతురు వద్దకు.. గోలి రాయమల్లు, గోలి అమ్మాయిలు బంధువుల ఇంటికి వెళ్తుండగా.. ప్రమాదంలో మృతి చెందారు. -
కృష్ణా పుష్కరాలకు ఫ్లైఓవర్ సిద్ధం
ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యాంబాబు విజయవాడ : దుర్గగుడి వద్ద రూ.350 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని నిర్ణీత వ్యవధిలో పూర్తిచేయడానికి సమన్వయ శాఖల అధికారులు కృషి చేయాలని రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి. శ్యాంబాబు ఆదేశించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన ఫ్లై ఓవర్ నిర్మాణంపై సంబంధిత శాఖల అధికారులు సమీక్ష సమావేశం ఏర్పాటుచేశారు. ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది ఆగస్టులో జరిగే కృష్ణా పుష్కరాలనాటికి ఫ్లై ఓవర్ పనులు పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. మూడు దశల్లో ఫ్లై ఓవర్ పూర్తి చేసే విధంగా అధికారులు సమాయత్తం కావాలన్నారు. పోలీసు, రోడ్లు, భవనాలు, మున్సిపల్, విద్యుత్, ఇరిగేషన్, సంబంధిత శాఖల అధికారులు పూర్తిస్థాయిలో సరళీకృత విధానంలో చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్ బాబు.ఏ మాట్లాడుతూ ఇప్పటికే క్షేత్ర స్థాయి సర్వే పరిశీలన పూర్తి చేశామన్నారు. 2,350 మీటర్ల ప్లైఓవర్ నిర్మాణం వస్తుందని ఇందుకు సంబంధించి కన్సల్టెంట్ నివేదికను సమర్పించామన్నారు. కృష్ణాపుష్కరాల నాటికి ప్లైఓవర్‌ను ప్రజలకు అందుబాటులోకితీసుకురావాల్సి ఉందన్నారు. ఫ్లై ఓవర్ పనులు జరిగే సమయంలో నగరానికి వచ్చే ట్రాఫిక్‌ను పూర్తి స్థాయిలో నియంత్రించాల్సి ఉందన్నారు. దీనిపై పోలీసు అధికారులు హైదరాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, మైలవరం, హనుమాన్‌జంక్షన్ మీదుగా విశాఖపట్నం తరలించాల్సి ఉందన్నారు. హైదరాబాద్ నుంచి నగరానికి వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర సర్వీసులు విద్యాధరపురం వద్ద తాత్కాలిక బస్సు స్టేషన్ ఏర్పాటు చేయాలని, అక్కడి నుంచి మినీ బస్సుద్వారా రవాణా సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు. చెన్నై-హైదరాబాద్ ట్రాఫిక్‌ను అద్దంకి-నార్కట్ పల్లి రోడ్డుకు మళ్లించాలని కలెక్టర్ సూచించారు. జేసీ గంధం చంద్రుడు, సబ్ కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, ట్రైనీ కలెక్టర్ సలోని, ఎన్‌హెచ్. ఇంజినీర్, ఆర్.గోపాలకృష్ణ, ఆర్.అండ్.బి. ఇ.ఎన్.సి. గంగాధర్, ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ సుధాకర్ పాల్గొన్నారు. -
మంత్రుల క్వార్టర్స్ మరమ్మతు నిధులకు ‘టెండర్’
ముందు టెండర్... ఆ తర్వాత నామినేషన్‌కు బదలాయింపు లెస్‌కు టెండర్లు దాఖలైనావింత ధోరణి అన్ని క్వార్టర్లకూ ఒకే మొత్తానికి ప్రతిపాదనలు రోడ్లు, భవనాల శాఖలో ఇష్టారాజ్యం హైదరాబాద్: రోడ్లు భవనాల శాఖ అంటేనే ఇష్టారాజ్యానికి చిరునామా. నిబంధనలు, పొదుపు చర్యలు, నాణ్యతకు అక్కడ అంత ప్రాధాన్యం ఉండదు. సొంత కార్యాలయం కోసం నిర్మిస్తున్న భారీ భవనం విషయంలో అడ్డగోలుగా అంచనాలు పెంచేసి రూ.20 కోట్ల పనిని రూ.67 కోట్లకు చేర్చిన అధికారులు.. తాజాగా మంత్రుల నివాసాల్లో మరమ్మతుల విషయంలో వింతగా వ్యవహరించారు. అడ్డగోలు విధానాల్లో తమకు హద్దే లేదని నిరూపించారు. ఇదీ సంగతి... మంత్రులకు కేటాయించిన కొన్ని క్వార్టర్లలో మరమ్మతులు జరపాలని రోడ్లు భవనాల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు జూన్ 16, 17 తేదీల్లో రోడ్లు, భవనాల శాఖ సెంట్రల్ బిల్డింగ్ డివిజన్ ఈ ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో ఆన్లైన్ టెండర్లు పిలిచింది. మంత్రులు హరీశ్‌రావు, జోగు రామన్న, నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, జగదీశ్వర్ రెడ్డి, నాటి డిప్యూటీ సీఎం రాజయ్య, శాసనసభ ఉప సభాపతి పద్మా దేవేందర్, సీఎల్పీ నేత జానారెడ్డిల క్వార్టర్లకు మరమ్మతు జరుపుతున్నట్టు టెండర్లో పేర్కొం ది. సాధారణంగా ఆయా క్వార్టర్లలో ఉండే సమస్యల ఆధారంగా పనులు జరుపుతారు. వెరసి పనులు వేరువేరుగా ఉంటాయి. కానీ విచిత్రమేంటంటే... ఈ అన్ని పనులకు రూ.7,10,720 చొప్పున ప్రతిపాదించారు. అన్నింటికి పైసల్లో కూడా తేడా లేకుండా ఒకేమొత్తం ఎలా అవసరమవుతుందో అధికారులకే తెలియాలి. వీటిల్లో దాదాపు అన్ని పనులకు కొందరు కాంట్రాక్టర్లు లెస్‌కు కొటేషన్లు దాఖలు చేశారు. ఆ ప్రకారం తక్కువ మొత్తం కోట్ చేసిన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. ఆ తర్వాత పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. విచిత్రమేంటంటే... ఇందులో కొన్ని క్వార్టర్ల టెండర్లను ‘అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్’ పేరు చెబుతూ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ పనులను తోచిన వ్యక్తులకు నామినేషన్‌పై ఇచ్చేసుకున్నారు. అత్యవసర పనులైనందున, నామినేషన్ కింద కేటాయిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ అయ్యాయి. విచిత్రమేంటంటే కొన్ని పనుల నామినేషన్ ఉత్తర్వు గత ఫిబ్రవరి 2న వెలువడితే, కొన్నిం టిది నిరుడు నవ ంబరులో విడుదలైంది. వీటన్నిటికీ టెండర్లు ఒకేసారి పిలిచారు అయినా.. కొన్ని అత్యవసరమెలా అవుతాయి, వాటికి గడువు లేని పరిస్థితి ఎలా ఉత్పన్నమవుతుందో అధికారులే చెప్పాలి. టెండర్ల సమయంలోనే ఆరోపణలు ఎక్కువ మొత్తం లెస్‌కు కోట్ చేసి కాంట్రాక్టర్లు రింగుగా మారి టెండర్లు దక్కించుకున్నారని ఆదిలోనే ఆరోపణలు వచ్చాయి. వాటిని రద్దు చేసి మళ్లీ పిలవాలంటూ కొందరు కాంట్రాక్టర్లు చీఫ్ఇంజనీర్కు ఫిర్యాదు చేశారు. విచిత్రమేంటంటే 30 శాతం, 28 శాతం లెస్‌కు టెండర్లు దాఖలైన వాటిని కొనసాగిస్తూ 16 శాతం లెస్‌కు దాఖలైన వాటిని రద్దు చేసి నామినేషన్ పేర అప్పగించారు. అయితే ఈ పనుల్లో కొన్ని పూర్తయిన తర్వాత నామినేషన్ డ్రామాకు తెర తీశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
‘పర్యవేక్షణ’ కోసం ప్రయత్నాలు
* ఆరు నెలలుగా ఖాళీగా ఉన్న ఆర్అండ్బీ ఎస్ఈ పోస్టు * త్వరలో భర్తీ అయ్యే అవకాశాలు.. సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రోడ్లు భవనాల శాఖలో ఖాళీగా ఉన్న ఆర్అండ్బీ ఎస్ఈ (పర్యవేక్షక ఇంజినీర్) పోస్టు కోసం ఆ శాఖలోని కొందరు అధికారులు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. రాష్ట్రంలో రహదారుల అభివ ృద్ధిపై ప్రభుత్వం ద ృష్టి సారించి.. జిల్లాకు రూ.వెయ్యి కోట్లు కేటాయించి రోడ్లను అద్దంలా నిర్మిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో కీలకమైన ఈ పోస్టు కోసం అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇంజినీరింగ్ ఉన్నతాధికారి జిల్లాకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే వరంగల్ జిల్లాలో పనిచేస్తున్న ఓ అధికారి ఈ పోస్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో అధికారి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక్కడ గతంలో ఎస్ఈగా పనిచేసిన జి.హంసారెడ్డి ఆరు నెలల క్రితం ఏసీబీకి చిక్కారు. పనుల అనుభవం (ఎక్సిపీరియెన్స్ సర్టిఫికేట్) మంజూరు కోసం ఓ కాంట్రాక్టరు వద్ద రూ.10 వేల లంచం తీసుకుంటూ ఏప్రిల్ 4న అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఆదాయానికి మించి రూ.కోట్లలో ఆస్తులు కూడగట్టారనే కోణంలో కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేశారు. ఈ కేసులో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. అప్పటి నుంచి ఈ పోస్టులో ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు. కరీంనగర్ జిల్లా ఎస్ఈగా పనిచేస్తున్న చందూలాల్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. తాజాగా ప్రభుత్వం రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో కీలకమైన ఈ పోస్టును భర్తీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇన్‌చార్జీగా ఉన్న చందూలాల్‌కే ఇక్కడికి బదిలీ చేసే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. కరీంనగర్ జిల్లాలో తీవ్ర రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఇక్కడ పనిచేసేందుకు చందూలాల్ ఆసక్తి చూపుతున్నారని ఆ శాఖలో చర్చ జరుగుతోంది. రహదారుల అభివృద్ధిలో భాగంగా జిల్లాకు భారీగా నిధులు వచ్చే అవకాశాలున్నాయి. దీంతో జిల్లాలోని పలు రోడ్ల నిర్మాణం, మరమ్మతుకు మోక్షం కలగనుంది. ఇప్పటికే ఆర్అండ్బీ అధికారులు జిల్లాలోని పలు రహదారుల అభివ ృద్ధి పనులకు అంచనాలు రూపొందించి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ లైన్ రోడ్ల నిర్మాణం వంటి ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. అలాగే మన ఊరు.. మన ప్రణాళికలో భాగంగా జిల్లా ప్రణాళికలో పలు రోడ్ల అభివ ృద్ధికి నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి నివేదించారు.