ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్న పనులు ఇవే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు సంబంధించి కేంద్రం భారీ కేటాయింపులు చేసింది. రూ.6,212.9 కోట్లు మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల విస్తరణకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వార్షిక ప్రణాళికను ఖరారు చేసిన కేంద్రం ఇందులో అత్యధికంగా నిధులు ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,869 కోట్లు, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌కు రూ.7,530 కోట్లు కేటాయించింది.
మూడో స్థానంలో తెలంగాణ నిలి చింది. రాష్ట్రం ఆవిర్భవించాక ఓ ఆర్థిక సంవత్సరం లో రోడ్లకు ఇంత భారీగా నిధులు కేటాయించటం ఇదే తొలిసారి. నిధుల కేటాయింపునకు సంబంధించి సెంట్రల్ ఫైనాన్స్ కమిటీ, ఆర్థిక వ్యవహారాల విభాగాలు ఆమోదముద్ర వేశాయి. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో జాతీయ రహదా రులకు సంబంధించి 16 రోడ్ల పనులకు మోక్షం లభించింది.
రాష్ట్ర రహదారులుగా ఉన్న వీటిని జాతీయ రహదారులుగా గుర్తిస్తూ కేంద్ర జాతీయ రహదారుల శాఖ అనుమతిచ్చింది. ఆ మేరకు జాతీయ రహదారుల విభాగం డీపీఆర్‌లను సిద్ధం చేసింది. ఆ డీపీఆర్‌లను సెంట్రల్ ఫైనాన్స్ కమిటీకి సమర్పించగా వాటిని పరిశీలించి నిధుల విడుదలకు తాజాగా ఆమోద ముద్ర వేసింది. దీంతో టెండర్లు పిలిచేందుకు మార్గం సుగమమైంది. వచ్చే రెండేళ్లలో పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.
రాష్ట్రంలో మూడో తీగల వంతెన
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల వరకు 167కె జాతీయ రహదారిని విస్తరించనున్నారు. రెండు వరుసలుగా రోడ్డును విస్తరించే క్రమంలో సోమశిల వద్ద కృష్ణా నదిపై దాదాపు 2 కిలోమీటర్ల నిడివిగల వంతెనను నిర్మించాల్సి ఉంది. ఇది పర్యాటక ప్రాంతం కావడంతో పర్యాటకులను ఆకట్టుకునేలా తీగల (సస్పెన్షన్ బ్రిడ్జి) వంతెనను నిర్మించాలని నిర్ణయించారు.
ఆ ప్రాంతం శ్రీశైలం రిజర్వాయర్ పరిధిలోకి వస్తున్నందున అక్కడ కృష్ణా నది లోతు చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్రాంతంలో నదీగర్భంలో పునాదులు తీసి వంతెన కట్టడం కంటే తీగల నమూనా మంచిదన్న అభిప్రాయాన్ని కూడా ఇంజనీర్లు ఇచ్చారు. ఖర్చు పెరిగినా సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణమే ఉత్తమమని తేల్చారు. ఇందుకు దాదాపు రూ.750 కోట్లు ఖర్చవుతుందని డీపీఆర్‌లో పేర్కొ న్నారు.
బ్రిడ్జి నమూనా సిద్ధం చేయాల్సి ఉంది. వెరసి వంతెనతో కలుపుకుంటే నిర్మాణ వ్యయం రూ.1,600 కోట్లు అవుతుంది. దీంతో వంతెన భాగానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిధులు కేటాయించాలని కేంద్రం నిర్ణ యించింది. సెంట్రల్ ఫైనాన్స్ కమిటీ రోడ్డుకు సంబంధించిన నిధులకే పచ్చజెండా ఊపింది. వంతెన నిధులను వచ్చే ఆర్థిక సంవత్సరం రోడ్ ప్లాన్‌లో చేర్చనున్నారు.
త్వరలో టెండర్లు
2 వరుసలు, 4 వరుసలకు రోడ్ల విస్తరణతో పాటు 3 రోడ్లను పటిష్టపరిచేందుకు కూడా నిధుల విడుదలకు కమిటీ అనుమతిచ్చింది. ఇందులో హైదరాబాద్–భూపాలపట్నం రోడ్డుకు సంబంధిం చి 39.7 కిలోమీటర్లకు రూ.48.2 కోట్లు, సిరోంచ–ఆత్మకూరు రోడ్డుకు 8 కిలోమీటర్లకు రూ.79.42 కోట్లు, కల్యాణ్–నిర్మల్ రోడ్డుకు 7 కిలోమీటర్లకు 39.96 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. ఆదిలాబాద్–బేలా రోడ్డు డీపీఆర్‌కు రూ.1.26 కోట్లను కూడా మంజూరు చేసింది. త్వరలో టెండర్లు పిలవనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment