ఆరోగ్యాన్ని నీళ్లలో ముంచేయకండి..!
ఈ భూమ్మీద జీవం ఆవిర్భవించడానికి కారణం నీళ్లు. ఈ నేల మీద జీవం మనుగడ సాగించడానికి కారణం నీళ్లు. ఇలాంటి నీళ్ల గురించి ప్రజల్లో ఎన్నో అపోహలున్నాయి. అన్నానికి ముందు అస్సలు నీళ్లు తాగవద్దని అంటారొకరు. అన్నం తిన్నాక కూడా ఎంతో సేపటివరకు నీళ్లు ముట్టుకోవద్దని అంటారు ఇంకొకరు. ఆరోగ్యం చక్కగా ఉండాలంటే సాధ్యమైనంత ఎక్కువ నీళ్లు తాగాలంటారు వేరొకరు. అసలు ఆరోగ్యం కోసం నీళ్లను ఎలా ఉపయోగించుకోవాలి, రోజుకు ఎన్ని నీళ్లు తాగాలి, ఎందుకలా తాగాలి అనే అనేక విషయాలను తెలుసుకుందాం.
దాంతోపాటు మన ఆరోగ్యాన్ని నీళ్లలో ముంచేసి దాన్ని ఊపిరాడకుండా చేసే బదులు, ఆ నీటినే జీవజలంగా మార్చుకోవడం ఎలాగో తెసుకోవడం కోసమే ఈ ప్రత్యేక కథనం.
ప్రతిరోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లకు తగ్గకుండా తాగితేనే ఆరోగ్యం అంటూ రాస్తూ ఉంటాయి కొన్ని పత్రికలు. నీళ్లు తాగండి... బరువు తగ్గండి అంటూ చెబుతాయి మరికొన్ని సంచికలు. అసలు ఒక వ్యక్తి తన మంచి ఆరోగ్యం కోసం ఎన్ని నీళ్లు తాగాలి? రోజువారీ జీవక్రియలకు నీటి అవసరం ఎంత అన్న విషయాలు చూద్దాం.
ప్రతిరోజూ ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాల్సిందేనా?
ముందు మనం ఎన్ని నీళ్లు తాగాలన్నది పక్కన పెట్టి... అసలు మన శరీరం ఎన్ని నీళ్లను కోల్పోతుందో చూద్దాం. ప్రతిరోజూ మన శరీరం ఒకటి నుంచి ఒకటిన్నర లీటర్ల నీటిని విసర్జిస్తుంటుంది. మూత్రం ద్వారా, చెమట ద్వారా మన శరీరం నుంచి నీళ్లు బయటికి పోతాయని మన అభిప్రాయం. కానీ మలం ద్వారా, మనం వదిలే ఊపిరి ద్వారా కూడా నీళ్లు బయటకు వెళ్లిపోతుంటాయి. ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఎనిమిది గ్లాసులనో, రెండు లీటర్లనో... ఇలా నిర్ణీతంగా ఇంత ప్రమాణంలో నీరు తాగాలనే నియమం అవసరం లేదు. గుర్తుంచుకోవాల్సిందల్లా మన శరీరానికి ఎంత నీరు అవసరమో, అంత నీరు తాగాలనే. అంటే దాహమైనప్పుడల్లా అది తీరేలా నీళ్లు తాగాలి.
మనకు అవసరమైన నీళ్లు... కేవలం నీళ్లతోనేనా?
కాదు... మనం తినే అన్నంలోనూ నీళ్లుంటాయి. మనం వండే కూరగాయల్లో నీరుంటుంది. ఇక మనం తీనే పండ్లు, పాలు, పండ్లరసాలు... వీటన్నింటిలోనూ ఉండేది నీళ్లే. ఇలా ఆహారంతో పాటూ మనం మరెన్నో నీళ్లను అదనంగా తీసుకుంటుంటాం. కేవలం తాగే నీళ్లేగాక... ఇలా అన్నింటినుంచి మన శరీరం తీసుకునే నీళ్లనన్నింటినీ కలుపుకుంటూ వచ్చే పరిమాణాన్ని ‘రిఫరెన్స్ డెయిలీ ఇన్‌టేక్’ (ఆర్‌డీఐ) ఆఫ్ వాటర్ అని వ్యవహరిస్తాం.
మరి మనం ఎన్ని నీళ్లు తాగాలి?
తాగే నీళ్లేగాక అన్ని రకాల ఆహారాల పదార్థాల నుంచి 18 ఏళ్లు దాటిన ఒక పురుషుడు తీసుకునే రిఫరెన్స్ డెయిలీ ఇన్‌టేక్ (ఆర్‌డీఐ) దాదాపు 3.7 లీ/పర్ డే. ఇక 18 ఏళ్లు దాటిన మహిళ ఆర్‌డీఐ 2.7 లీ/పర్ డే. అయితే ఈ సంఖ్యలను సగటుగా భావించవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి వ్యాయామం చేసేవాడైతే అతడి ఆర్‌డీఐ మారుతుంది. అలాగే ఒక వ్యక్తి ఒక చలివాతావరణం నుంచి వేడిమి ఎక్కువగా ఉండే వాతావరణానికి వెళ్లగానే అతడి ఆర్‌డీఐ మారిపోతుంది. అలాంటప్పుడు ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవడానికి ఎంత నీరు తాగాలన్నదానికి ‘ఫ్లూయిడ్ బ్యాలెన్స్’ అనే అంశమే కీలకం. అంటే మనం విసర్జించే నీరు, మనం తీసుకునే నీటి మధ్య సమతౌల్యం ఉండేలా చూసుకోవడం అన్నమాట.
ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అన్నదే ఒక ఆరోగ్య సూచిక...
ఒక వ్యక్తి బరువు 70 కిలోలు అనుకుందాం. అతడి జీవక్రియల అవసరాలకు ప్రతిరోజూ 1.750 లీటర్ల నీళ్లు కావాలనుకుందాం. ఈ నీళ్లలో 650 ఎంఎల్. నేరుగా మంచినీళ్లు తాగడం వల్ల అతడికి దొరుకుతాయి. అతడు తినే ఆహారం ద్వారా మరో 750 ఎం.ఎల్. లభ్యమవుతాయి. ఇక మిగతా 350 ఎం.ఎల్. మన శరీరంలోని జీవక్రియల్లో జరిగే ఆక్సిడేషన్ ప్రక్రియ ద్వారా లభిస్తాయి. అంటే... అతడి జీవక్రియలకు 1.750 (ఒకటీ ముప్పావు లీటర్) నీళ్లు అవసరమైనా... అతడు తాగేది మాత్రం 650 ఎం.ఎల్. మాత్రమే.
ఇంతకంటే ఎక్కువ నీళ్లు తాగారే అనుకుందాం. అప్పుడు ఆరోగ్యవంతుడిలో ఆ నీళ్లను మూత్రపిండాలు బయటకు పంపిస్తాయి. ఒకవేళ అతడికి ఏ గుండెజబ్బులో, హైబీపీనో, కాలేయ వ్యాధులో, మరే మూత్రపిండాల వ్యాధో ఉంటే? అప్పుడు ఆ అదనపు నీటిని మూత్రపిండాలు బయటకు పంపలేవు.
నీళ్లుతో బరువు తగ్గుతారా / చర్మం మెరుస్తుందా?
ఒక వ్యక్తి ఫ్లూయిడ్ బ్యాలెన్స్‌కు తగినట్లుగా నీళ్లు తాగితేనే ఆ వ్యక్తి సరైన బరువును కలిగి ఉంటాడు. మనం తీసుకునే ఆహారాన్ని శక్తిగా మారే క్రమంలో ప్రతి 100 క్యాలరీలను ఖర్చు చేయడానికి కనీసం అరకప్పు నీళ్లు కావాలి. దీనికి తగినట్లుగా నీళ్లు తీసుకుంటూ... ఆహారం కంటే ఒకిన్ని నీళ్లు ఎక్కువగా తీసుకుంటే ఆ మొత్తం పొట్టలోకి చేరి ఆహారం తీసుకోడానికి అవకాశం లేకుండా చూసి బరువు తగ్గడానికి కొంతవరకు ఉపకరిస్తుంది. అలాగే చర్మం బిగుతుగా ఉండేందుకు తగినంతగా నీరు ఉన్నంత వరకే అది బాగుటుంది. అంతేగానీ... ఎక్కువ నీళ్లు తీసుకోవడం వల్ల చర్మం మరింత బిగువుగా ఉంటుందనేదీ, ఆ బిగువును కోల్పోకుండా ఉండటానికి నీళ్లు ఉపకరిస్తాయనే అంశం కేవలం అపోహలు మాత్రమే.
ఆరోగ్యసమస్యలుంటే డాక్టర్ సలహా మేరకే నీళ్లు తాగాల్సిందే...
ఒక వ్యక్తికి గుండెజబ్బులు, రక్తపోటు, మూత్రపిండాల వ్యాధి ఉంటే అతడు తీసుకునే అదనపు నీటిని మూత్రపిండాలు బయటకు పంపలేవు. దాంతో ఆ నీళ్లు అతడి కాళ్లలో చేరి, కాళ్లవాపు వస్తుంది. కొందరిలో ముఖంలోకి చేరి ముఖం వాచినట్లుగా కనిపిస్తుంది. అందుకే ఆరోగ్యం కోసం ఎన్ని ఎక్కువ నీళ్లు తాగితే అంత మంచిది అన్న సూత్రం అన్ని వేళలా పనిచేయదు.
డాక్టర్ టి.జి. కిరణ్‌బాబు
సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్
సన్‌షైన్ హాస్పిటల్స్, హైదరాబాద్