ఎదలో విషపుగడ్డ! | Breast cancer - Concerns | Sakshi
Sakshi News home page

ఎదలో విషపుగడ్డ!

Published Mon, May 11 2015 12:04 AM | Last Updated on Sun, Sep 3 2017 1:48 AM

ఎదలో విషపుగడ్డ!

ఎదలో విషపుగడ్డ!

బ్రెస్ట్ క్యాన్సర్ - జాగ్రత్తలు
ప్రతి మహిళా జీవితంలో యుక్తవయసులోకి ప్రవేశించాక ఏదో ఒక దశలో రొమ్ముక్యాన్సర్ గురించి ఆందోళన పడుతుంది. రొమ్ముక్యాన్సర్ కుటుంబాన్ని తీవ్రమైన ఉద్వేగభరితమైన ఒత్తిడికి గురిచేసే అంశం. కానీ అతి త్వరగా కనుక్కుంటే నేడది పూర్తిగా తగ్గే క్యాన్సర్. పైగా రొమ్ము కోల్పోకుండానే ఇంతకు మునుపులాగే ఉండేలా చూడగలరు డాక్టర్లు. వ్యాధి ఆనవాళ్లు కూడా లేకుండా తగ్గించగల క్యాన్సర్ ఇది. అయినా ఆ వ్యాధిపై అనేక అపోహలు. వాటిని దూరం చేసుకొని, రొమ్ము క్యాన్సరపై స్పష్టమైన అవగాహన పెంచుకోవడం కోసమే ఈ కథనం.
 
లక్షణాలు
రొమ్ముకు సంబంధించినవి :  రొమ్ములో ఒక గడ్డలా కదులుతూ రొమ్ముపైనున్న చర్మం నుంచి అది స్పర్శకు అందడం  రొమ్ము ఆకృతిలో మార్పులు  బాగా ముదిరిన దశలో రొమ్ముపై అల్సర్స్ రావడం.  నిపుల్‌లో : రొమ్ముపై ర్యాష్ లేదా వ్రణాలు రావడం  రొమ్ము నిపుల్ లోపలికి ముడుచుకుపోయినట్లుగా ఉండటం  రక్తం వంటి స్రావాలు రావడం. బాహుమూలాల్లో : చివరిదశలో గడ్డ బాగా పెరిగి చంకలోనూ దాని స్పర్శ తెలియడం  భుజం వాపు కనిపించడం.
 
నిర్ధారణ పరీక్షలు :   ఎఫ్‌ఎన్‌ఏసీ అనే పరీక్ష  మామోగ్రఫీతో పాటు ఫ్రోజెన్ సెక్షన్ ఎగ్జామినేషన్  ఛాతీ ఎక్స్‌రే  కడుపు స్కానింగ్  ఎముకల స్కానింగ్ (ఈ చివరి పరీక్ష వ్యాధి ఏ మేరకు వ్యాపించిందో తెలుసుకోవడం కోసం చేస్తారు).

నివారణ :  ఒక మహిళకు రొమ్ము క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎంత ఉందో తెలుసుకోవడం నివారణలో కీలకం అవుతుంది. ఇందుకోసం ఒక మహిళ జీవనశైలి, ఆమె కుటుంబ ఆరోగ్య చరిత్ర, వృత్తి లాంటి అంశాలు ఇందుకోసం ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులో మార్చలేని

అంశాలు : వయసు, జెండర్, రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డ బంధువులతో బాంధవ్యంలో దగ్గరితనం, రుతుస్రావ చరిత్ర, ఏ వయసులో రుతుస్రావం ఆగిపోతుంది వంటి అంశాలను మార్చలేం. కానీ... మార్చుకోగల అంశాలు: ఎక్కువ బరువు ఉండటం, మొదటి సంతానం ఏ వయసులో కలిగింది, ఎంత మంది పిల్లలు, బిడ్డలకు ఎంతకాలం పాటు రొమ్ముపాలు పట్టారు, పోషకాహారం, అబార్షన్ల సంఖ్య. పై అంశాల ఆధారంగా ఒకరికి రొమ్ముక్యాన్సర్ వచ్చే అవకాశం ఎంత ఉందో చెప్పడానికి కొన్ని  ‘పద్ధతులు’ (మోడల్స్) అందుబాటులో ఉన్నాయి. ఇందులోని ప్రాచుర్యం పొందిన  పద్ధతే... ‘గేల్స్ మోడల్’. దీని సహాయంతో ప్రస్తుత వయసు, ఏ ప్రాంతానికి చెందినవారు, ఏ సమయంలో రుతుక్రమం మొదలైంది, మొదటి సంతానం ఏ వయసులో కలిగింది, దగ్గరి బంధువుల్లో ఎంత మందికి రొమ్ముక్యాన్సర్ ఉంది లాంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ అంచనా వేస్తారు. ఒక  మహిళకు క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఉందని తేలితే... దాన్నిబట్టి నివారణ చర్యలు తీసుకోవచ్చు. అవి...
 
పౌష్టికాహారం : ముదురు ఆకుపచ్చరంగులో ఉన్న ఆకుకూరలు, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ క్యాన్సర్ గుణాలున్న అన్ని రకాల కూరగాయలు ఆహారంలో పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి.
 
వ్యాయామం : మహిళలంతా మరీ తీవ్రమైనవీ, మరీ తక్కువవీ కాకుండా ఒక మోస్తరు వ్యాయామాలను రోజూ కనీసం 30 నిమిషాల పాటు చేయాలి. ఇలా వారంలో కనీసం ఐదురోజులైనా వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామాల వ్యవధిని 45 నిమిషాలకు పెంచుకుంటే రొమ్ముక్యాన్సర్ రిస్క్ మరింత తగ్గుతుంది. అదే కాస్త చిన్న వయసు పిల్లలైతే ఈ వ్యాయామ వ్యవధిని 60 నిమిషాలకు పెంచుకుని, అలా వారంలో కనీసం ఐదు రోజులైనా చేయాలి. ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే దాన్ని పూర్తిగా మానేయాలి.
 
మందులతో నివారణ : కుటుంబ చరిత్రలో ఎవరికైనా రొమ్ముక్యాన్సర్ ఉన్నా లేదా బీఆర్‌సీఏ అనే జన్యువులో మార్పు ఉన్నా టామోక్సిఫెన్, ర్యాలోక్సిఫీన్ వంటి మందులతో నివారించవచ్చు  శస్త్రచికిత్సతో నివారణ : బీఆర్‌సీఏ అనే జన్యువులో మార్పులు ఉన్నట్లయితే ‘ప్రొఫిలాక్టిక్ మాసెక్టమీ’ అనే ముందస్తు శస్త్రచికిత్సతో రొమ్ము క్యాన్సర్‌ను నివారించవచ్చు.
 
స్వయం పరీక్ష : రొమ్ముక్యాన్సర్‌ను ఎవరికి వారే స్వయంగా కూడా తెలుసుకునే అవకాశం ఉంది. మహిళలు తమ రొమ్ములను స్వయంగా పరీక్ష చేసుకుంటూ రొమ్ములో ఏవైనా గడ్డలు చేతికి తగులుతున్నాయా, రొమ్ము ఆకృతిలో తేడా ఉందా, రొమ్ము నిపుల్ నుంచి ఏవైనా స్రావాలు వెలువడుతున్నాయా, నిపుల్ లోపలికి ముడుచుకుపోయి ఉందా, నిపుల్ మీద ర్యాష్ లేదా వ్రణాలు ఏవైనా ఉన్నాయా అని ఎవరికి వారే పరీక్ష చేసుకోవచ్చు. కాబట్టి ముందే కనుగొంటే ప్రాణాలనూ, దాంతో పాటే రొమ్మును పూర్తిగా కాపాడుకునేందుకు అవకాశం ఉన్న వ్యాధి ఇది.
 
చికిత్స :  రొమ్ముక్యాన్సర్‌కు ఈ రోజుల్లో శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ, హార్మోనల్ థెరపీ, కీమోథెరపీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. తొలిదశలో ఉంటే రొమ్మును రక్షిస్తూ, క్యాన్సర్ ఇతర అవయవాలకు వ్యాపించకుండా ఆపవచ్చు. ఇందుకోసం సర్జరీని మొదటి చికిత్సగా చేస్తారు. ఇక ఆ తర్వాత వ్యాప్తిని నివారించేందుకు హార్మోన్ థెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీలను చేస్తారు. రొమ్ము క్యాన్సర్ వచ్చిన వారిలో ఇప్పుడు మొదటే దీన్ని కనుగొంటే ఆంకోప్లాస్టీ అనే శస్త్రచికిత్స సహాయంతో రొమ్మును పూర్తిగా రక్షిస్తారు. సర్జరీతో క్యాన్సర్ గడ్డను తొలగించడంతో పాటు అక్కడ పడిన సొట్టను పూడ్చుతూ ప్లాస్టిక్ సర్జరీని కలగలిపి ఈ శస్త్రచికిత్స చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ వ్యాధి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
 
స్క్రీనింగ్
సాధారణం కంటే ఎక్కువ రిస్క్ ఉన్నవారు తరచూ పరీక్షలు చేయించుకోవాలి. జాతీయ హెల్త్ సర్వే (ఎన్‌హెచ్‌ఎస్) బ్రెస్ట్ స్క్రీనింగ్ కార్యక్రమం సిఫార్సుల మేరకు 50 - 70 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు ప్రతి మూడేళ్ల కోసారి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్న మహిళలైతే మరింత తరచుగా ఈ స్క్రీనింగ్ పరీక్షలను చేయించుకోవాలి. కుటుంబ చరిత్రలో రొమ్ముక్యాన్సర్ వచ్చిన దగ్గరి బంధువులు (అంటే అమ్మ, చెల్లెళ్లు, కూతుళ్లు) ఉంటే రిస్క్ రెండు నుంచి మూడు రెట్లు పెరుగుతుంది.

ఇక మహిళల్లోని జన్యువులైన బీఆర్‌సీఏ1, బీఆర్‌సీఏ2 అనే రెండింటిలో తేడాలు ఉంటే క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. రొమ్ము క్యాన్సర్ వచ్చిన మహిళల్లోని 5 శాతం మందిలో ఈ రెండు జన్యువుల్లో మ్యూటేషన్స్ (ఉత్పరివర్తన మార్పులు) చోటు చేసుకున్నట్లు పరిశోధనలు తెలుపుతున్నాయి.
- డాక్టర్ శ్రీకాంత్,సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్,యశోదా హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement