Womens life
-
మహిళల జీవితాల్లో ‘వైఎస్సార్ చేయూత’ వెలుగులు
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లో 45–60 ఏళ్లలోపు ఉన్న మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్ చేయూత’ వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఈ పథకం కింద ఒక్కో మహిళకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేల ఆర్థికసాయం అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా తొలిదశలో 24 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.4,500 కోట్లను గత ఏడాది అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ప్రభుత్వం ఇచ్చిన సొమ్ముకు జతగా బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల ద్వారా మరింత సొమ్మును ఇప్పించి ఆ మహిళలు వివిధ రంగాల్లో వ్యాపారాలు చేసేలా తోడ్పాటునందించింది. ఇలా తొలిదశలో బ్యాంకులు, వివిధ ఆర్థిక సంస్థలు ఆ మహిళలకు రూ.1,507.24 కోట్ల మేర ఆర్థిక సాయం అందించాయి. కేవలం రిటైల్ షాపులు, గేదెలు, ఆవుల, గొర్రెలు, మేకలు పెంపకం కార్యకలాపాలకే ఈ మొత్తం అందించాయి. ఇలా ప్రభుత్వం ఇచ్చిన సహాయానికి తోడు బ్యాంకుల నుంచి తోడ్పాటు అందడంతో వారు విజయవంతంగా వ్యాపారాలు ప్రారంభించారు. మరోవైపు.. వీరు చేసే వ్యాపారాలకు మార్కెటింగ్ కల్పించేందుకు.. నాలుగేళ్లలో అందే రూ.75 వేలను సమర్థవంతంగా వినియోగించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం అమూల్, ఐటీసీ, పీ అండ్ జీ, అలానా, హిందుస్థాన్ లీవర్ వంటి కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. లబ్ధిదారులందరినీ బ్యాంకులతోనూ, కార్పొరేట్ కంపెనీలతో అనుసంధాం చేసేందుకు వైఎస్సార్ చేయూత కాల్సెంటర్లను ఏర్పాటుచేసింది. వీటికి 0866–2468899, 9392917899 నెంబర్లను ప్రభుత్వం కేటాయించింది. రెండో విడత చేయూతలో ఇలా.. ఇక రెండో విడత చేయూత కింద ఈ ఏడాది జూన్ 22న 23.44 లక్షల మంది మహిళలకు రూ.4,400 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించింది. ఇందులో 23.41 లక్షల మంది జీవనోపాధి రంగాలను ఎంపిక చేసుకున్నారు. అత్యధికంగా 7.66 లక్షల మంది వ్యవసాయ రంగాన్ని ఎంచుకోగా, 5.72 లక్షల మంది పాడి పరిశ్రమను ఎంచుకున్నారు. వీరందరినీ వివిధ కార్పొరేట్ కంపెనీలతో అనుసంధానం చేసేందుకు, బ్యాంకుల ద్వారా అవసరమైన సహాయాన్ని అందించేందుకు అధికారుల కసరత్తు చేస్తున్నారు. ► ఈమె పేరు లక్ష్మమ్మ. అనంతపురం జిల్లా మడకశిర మండలం జీవీ పాళ్యం గ్రామం. ‘వైఎస్సార్ చేయూత’ పథకం ఈమెకు కొండంత భరోసా కల్పించింది. అప్పటివరకు ఆమె కుటుంబానికి అంతంతమాత్రపు ఆదాయం వచ్చేది. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ‘చేయూత’ ఇచ్చి నీలకంఠాపురం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ద్వారా మరింత సహకారం ఇప్పించిందో లక్ష్మమ్మ దశ తిరిగింది. ఆ డబ్బులతో ఉన్న ఊర్లోనే చిల్లర దుకాణం ప్రారంభించింది. రోజూ రూ.3వేలకు తగ్గకుండా వ్యాపారం సాగుతోంది. సీఎం వైఎస్ జగన్ పుణ్యమా అని మా కుటుంబం ఇప్పుడు ఎవరిపై ఆధారపడకుండా సంతోషంతో జీవిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నామంటూ ఆమె ఉబ్బితబ్బిబవుతోంది. ► ఈమె చిత్రాడ ముత్యాలమ్మ. స్వస్థలం విశాఖ జిల్లా రావికమతం మండలం కొత్తకోట గ్రామం. భర్త సంపాదన పైన ఈమె కుటుంబమంతా ఆధారపడేది. పోయిన ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ చేయూత’ కింద రూ.18,750లు ఆర్థిక సాయం అందించింది. బ్యాంకు కూడా తోడుగా నిలిచి రూ.50వేల రుణ సాయం చేసింది. ఈ డబ్బుతో ముత్యాలమ్మ ఇంటివద్దే కిరాణా దుకాణం ప్రారంభించింది. ఆమె రోజువారీ వ్యాపారం బాగుండడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయి. ఇప్పుడు రోజురోజుకూ మా వ్యాపారం పెరుగుతోందంటూ ఆమె ఆనందపడుతోంది. రాజమండ్రికి చెందిన యర్రా సాయికుమారి భర్తది సైకిళ్లకు పంక్చర్లు వేసే వృత్తి. దీంతో కుటుంబం గడవడం భారంగా ఉండేది. ప్రభుత్వం గత ఏడాది మొదటి విడత కింద వైఎస్సార్ చేయూత ఇవ్వడం.. వేరే ఇతర ఆర్థిక సంస్థతో మరింత తోడ్పాటు ఇప్పించడంతో ఈమె టైలరింగ్ షాపు ప్రారంభించింది. అందులోనే దుస్తులనూ విక్రయిస్తోంది. అప్పటివరకు నెలకు రూ.4వేలు ఉన్న ఆ కుటుంబ ఆదాయం ఇప్పుడు రెట్టింపయ్యింది. చేయూత పథకం గొప్ప వరమంటూ ఆమె సంతోషం వ్యక్తంచేస్తోంది. -
నాకూ రెక్కలున్నాయ్ నాన్నా
పిల్లలు పుట్టడమే రెక్కలతో పుడతారుకానీ తలిదండ్రులు అబ్బాయిలకి రెక్కలుంచి అమ్మాయిలకు కత్తిరిస్తుంటారు ఆడపిల్లల పట్ల ఎక్కువ రక్షణ ఉంచాలనుకోవడం మంచిదే కానీ...కంచె కూడా మొక్కను మింగేసేంత ఉంటే ఎలా? స్వేచ్ఛలోనే జ్ఞానం ఉంది. చైతన్యం ఉంది. వివేచన ఉంది. వికాసం ఉంది. నాన్నలూ... మాట వినండి. ఆడపిల్ల అణకువగా ఉండాలని చెప్పేవారు. ఆడపిల్ల ఒద్దికగా ఉండాలని చెప్పేవారు. ఆడపిల్ల అసలు అల్లరే చేయకూడదని చెప్పేవారు. ఆ పిల్లకు విసుగ్గా ఉండేది. ఇంట్లో తమ్ముడో చెల్లెలో ఉంటే బాగుండు అనిపించేది. వాళ్లు లేరు. తల్లిదండ్రులు ఎప్పటికీ తన ఫ్రెండ్స్ కారు. ఆటంబాంబు పడితే ఎలా ఉండేదో కాని ఆ ఇంటి మీద ఆడపిల్లైతే పడింది.సిద్దిపేటలో అతనో ఉద్యోగి. ఆమె ఆ ఉద్యోగి భార్య. పెళ్లయిన మూణ్ణెల్లకు భార్య గర్భం దాల్చింది. అతని కుటుంబంలో చాలామందికి తొలి కాన్పు మగపిల్లాడే పుట్టాడు. కనుక తనకు కూడా మగపిల్లాడేపుడతాడని అతడు అన్నాడు. ఆమె నమ్మింది. ఇద్దరూ మగపిల్లాడి కోసం ఎదురు చూస్తుంటే ఆడపిల్ల పుట్టింది.ఆడపిల్లా! ఆడపిల్లే!అతను హతాశుడయ్యాడు. ఆమె నిరాశ పడింది. భవిష్యత్తు చిత్రపటం వారి కళ్ల ముందు గిర్రునో రయ్యినో తిరిగింది.ఆడపిల్లను జాగ్రత్తగా చూసుకోవాలి. రెక్కల కింద కాపాడుకోవాలి. కట్నం కోసం డబ్బు కూడబెట్టాలి.ఆ తర్వాత మంచి కుర్రాణ్ణి చూసి పెళ్లి చేయాలి. అప్పటికే ఎంత ఖర్చవుతుందో ఏమో. ఏమేమి అవసరమవుతాయో ఏమో.ఇంకొకరిని కందాం అనుకున్నారు మగపిల్లాడు పుడితే.ఆడపిల్ల పుట్టింది కనుక ఆగిపోయారు.ఆడపిల్లకు మాటలొచ్చాయి. తల్లిదండ్రులతో మాత్రమే మాట్లాడింది. స్కూల్లో పక్క బెంచి వాళ్లతోనే మాట్లాడింది. ఆ తర్వాత మాట్లాడటానికి వీల్లేదు. ఆ తల్లిదండ్రులు ఎక్కడికీ పంపరు.బాబోయ్... ఆడపిల్ల.ఏమైనా జరిగితే.ఆడపిల్ల అణకువగా ఉండాలని చెప్పేవారు. ఆడపిల్ల ఒద్దికగా ఉండాలని చెప్పేవారు. ఆడపిల్ల అసలు అల్లరే చేయకూడదని చెప్పేవారు.ఆ పిల్లకు విసుగ్గా ఉండేది. ఇంట్లో తమ్ముడో చెల్లెలో ఉంటే బాగుండు అనిపించేది. వాళ్లు లేరు. తల్లిదండ్రులు ఎప్పటికీ తన ఫ్రెండ్స్ కారు. పోనీలే వాళ్లనే ఫ్రెండ్స్‌ను చేసుకుందామనుకుంటే హైస్కూల్ చదువు మంచిగా ఉండాలని హైదరాబాద్‌కు తీసుకొచ్చి బావమరిది ఇంట్లో పెట్టారు. వాళ్లు బాగ చూసుకున్నారు నిజమే. కాని వాళ్ల పిల్లలు అదో టైప్. మేచ్ కాలేదు. ఆ పిల్లకు సిద్దిపేటకు వచ్చేయాలనుండేది. కనీసం తల్లిదండ్రులతో ఉండాలనిపించేది. తల్లిదండ్రులు అది వినలేదు. అర్థం చేసుకోలేదు. ఇంటర్ చదువు ఇంకా ముఖ్యమైనదని తీసుకెళ్లి రెసిడెన్షియల్ కాలేజీలో పడేశారు. ఆ కాలేజొక బందెలదొడ్డి. తోటి విద్యార్థులకు బ్రష్ చేసుకోవడానికే టైమ్ ఉండేది కాదు... ఇక స్నేహం ఏం చేస్తారు?డిగ్రీ వచ్చేసరికి తల్లిదండ్రులే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు.అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయ్యాక సెకండ్ ఇయర్‌కు వచ్చింది.ఒకరోజు తండ్రికి కాలేజ్ నుంచి మెసేజ్ చేసింది.‘నాన్నా.. పెళ్లి చేసుకుంటున్నా’ అని.తండ్రి అదిరిపడ్డాడు. తల్లి ఏడుపు అందుకుంది.కుర్రాడు ఎవడు అని వాకబు చేశారు. పిజ్జా డెలివరీ బాయ్ అట.సరే. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనుకుందాం అనుకున్నారు. కాని మనిషిని చూస్తే నిరాశ కలిగేలాఉన్నాడు.ఎక్కడ తప్పు జరిగింది?బాగా పెంచామనుకున్నామే.కన్న కూతురు ఇంత ద్రోహం చేస్తుందా?తల్లి డిప్రెషన్. తండ్రికి నిస్పృహ. అమ్మాయి మీద పెళ్లి వద్దని ఒత్తిడి. ముందైతే వాయిదా వేయించి ఆలోచిద్దామని చెప్పి ముగ్గురూ కౌన్సెలింగ్‌కు వచ్చారు.‘చూడండి డాక్టర్. నా కూతురు చక్కని పిల్ల. బాగా పెంచాం. పోయి పోయి వాణ్ణి ప్రేమించానని చెబుతోంది. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటోంది.ఏంటిది?’ అన్నాడు తండ్రి.సైకియాట్రిస్ట్ మొత్తం విన్నాడు.‘తప్పు మీదేనండీ’ అన్నాడు తండ్రితో.‘ఎలా?’‘ఆడపిల్ల ఆడపిల్ల అంటూ ఆ అమ్మాయిని ఏ గాలీ వెలుతురూ లేకుండా పెంచారు.స్నేహితులను ఇవ్వలేదు. పోనీ సొంత తమ్ముణ్ణో చెల్లెలినో ఇవ్వలేదు. చిన్నప్పటి నుంచి ఒంటరితనంతో బాధ పడింది. ఎక్కడైనా ఎవరైనా తనను పట్టించుకుంటే బాగుండు అని అనుకుంది. కాని అలాంటివీలే లేనట్టు మీరు పెంచారు. కాలేజీకొచ్చాక మీరు ఫోన్కొనిచ్చారు. కాలేజీ బుక్పోయి ఫేస్బుక్ వచ్చింది. మీ అమ్మాయి ఫేస్‌బుక్‌కు అడిక్ట్ అయ్యింది. అక్కడ ఎవరెవరో ముక్కుముహం తెలియనివారు మీ అమ్మాయి డిస్ప్లే పిక్చర్ చూసి ఫ్రెండ్ రిక్వెస్ట్స్ పంపడం మొదలెట్టారు. చాటింగ్ మొదలెట్టారు. బుట్టలో వేసుకోవడానికి ‘చిన్నా కన్నా... భోం చేశావా... ఎండలో తిరక్కు... ప్రభాస్ సినిమా ఫస్ట్ మార్నింగ్ షోకు రక్తం అమ్మయినా నీ కోసం రెండు టికెట్స్ తెస్తా’... ఇలాంటి మెసేజ్‌లు చూసే సరికి తనకు ప్రాముఖ్యం ఉన్నట్టు, తనను గుర్తించే మనుషులు కూడా ఉన్నట్టు మీ అమ్మాయి అనుకుంది. సంతోషపడింది. అవతలి మనిషి ఎవరనేది కూడా చూడకుండా కేవలం అతడి మాటలు, స్నేహం అని అనుకుంటున్న స్నేహం, ప్రేమ అని అనుకుంటున్న ప్రేమకు కేరీ అయిపోయింది. అది ఆమెకు ఇష్టమైన కొత్తలోకం. అందుకని మిమ్మల్ని కూడా వద్దనుకుని అతణ్ణి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది’ అన్నాడు సైకియాట్రిస్ట్. తల్లిదండ్రులు తల దించుకున్నారు.‘చూడండి. ఆడపిల్ల అంటే భౌతికంగా ఒక నిర్మాణం. కాని అది అథమ నిర్మాణం కాదు. అణిచి పెట్టాల్సిన నిర్మాణం కాదు. మగవాడితో సమానమైన నిర్మాణం. ఆమెకు కూడా అన్ని రకాల చైతన్యం, జ్ఞానం, ఎక్స్పోజర్ ఉండాలి. తీగ కదా అని ఎక్కువ కంగారుతో చుట్టూ కర్రలు పాతితే అది ఎదగదు. చచ్చిపోతుంది. మీ అమ్మాయి విషయంలో జరిగింది అదే. దారిలో మోగే ఐస్బండి గంటైనా తన కోసం మోగితే చాలనుకునే స్థితికి వచ్చింది’ అన్నాడు మళ్లీ.ఆ అమ్మాయి వైపు చూశాడు.‘చూడమ్మా... నీది ప్రేమ కాదు... పెళ్లి చేసుకునేంత బంధం, పరిణితి మీ ఇద్దరి మధ్యా లేదు. ఇది కొద్దిపాటి ఆకర్షణ. ఈ వయసులో మనసుకు ఊపు తెచ్చే ఒక మాదకద్రవ్యం. దానిని చూసుకొని తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకు. నీకిప్పుడు కావలిసింది బాయ్‌ఫ్రెండ్ కాదు. ఒక స్నేహబృందం. అందులో అబ్బాయిలూ అమ్మాయిలూ కూడా ఉండొచ్చు. నీ అభిరుచి ఏమిటో తెలుసుకొని, నీకు ఏదైనా కళా సాంస్కృతిక రంగాల్లో ఇష్టం ఉంటే అందులో మనసు పెట్టు. నీకు ఇష్టమైన స్నేహబృందం దొరుకుతుంది.బ్లూ క్రాస్, రెడ్‌క్రాస్ వంటి సంస్థల్లో పని చేయాలనుకుంటే అదీ చేయవచ్చు. లేదంటే నువ్వే ఒక ఆర్ఫన్ ఏజ్‌లో పార్ట్‌టైమ్ వాలంటీర్‌గా పని చేయి. లోకం తెలుస్తుంది. నీకు నువ్వు తెలుస్తావు. నీ లోటు తీర్చే స్నేహాలు ఏర్పడతాయి. వయసు కూడా కొంచెం పెరగనీ. ఆ తర్వాత కూడా నువ్వు ప్రేమించదగ్గ వ్యక్తులు కనిపిస్తారు. అప్పుడు నీకు నిజంగానే ప్రేమించాలనిపిస్తే ప్రేమించు. నీ తల్లిదండ్రులను నేను ఒప్పించిపెళ్లి చేస్తా. సరేనా?’ఆ అమ్మాయి ఏమనుకుందో తల ఊపింది.సైకియాట్రిస్ట్ నిట్టూర్చాడు.అప్పటికి రాత్రి ఏడైంది.‘ఆకలేస్తోంది. ఏమైనా తెప్పించుకుందామా’ అన్నాడు సైకియాట్రిస్ట్.‘పిజ్జా మాత్రం వద్దు సార్’... ఫీజు డబ్బులు బయటకు తీస్తూ కొంచెం భయంగా నవ్వాడు అమ్మాయి తండ్రి.అందరూ కూడా హాయిగానే నవ్వుకున్నారు ఆ తర్వాత. – కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
ఎదలో విషపుగడ్డ!
బ్రెస్ట్ క్యాన్సర్ - జాగ్రత్తలు ప్రతి మహిళా జీవితంలో యుక్తవయసులోకి ప్రవేశించాక ఏదో ఒక దశలో రొమ్ముక్యాన్సర్ గురించి ఆందోళన పడుతుంది. రొమ్ముక్యాన్సర్ కుటుంబాన్ని తీవ్రమైన ఉద్వేగభరితమైన ఒత్తిడికి గురిచేసే అంశం. కానీ అతి త్వరగా కనుక్కుంటే నేడది పూర్తిగా తగ్గే క్యాన్సర్. పైగా రొమ్ము కోల్పోకుండానే ఇంతకు మునుపులాగే ఉండేలా చూడగలరు డాక్టర్లు. వ్యాధి ఆనవాళ్లు కూడా లేకుండా తగ్గించగల క్యాన్సర్ ఇది. అయినా ఆ వ్యాధిపై అనేక అపోహలు. వాటిని దూరం చేసుకొని, రొమ్ము క్యాన్సరపై స్పష్టమైన అవగాహన పెంచుకోవడం కోసమే ఈ కథనం. లక్షణాలు రొమ్ముకు సంబంధించినవి : రొమ్ములో ఒక గడ్డలా కదులుతూ రొమ్ముపైనున్న చర్మం నుంచి అది స్పర్శకు అందడం రొమ్ము ఆకృతిలో మార్పులు బాగా ముదిరిన దశలో రొమ్ముపై అల్సర్స్ రావడం. నిపుల్లో : రొమ్ముపై ర్యాష్ లేదా వ్రణాలు రావడం రొమ్ము నిపుల్ లోపలికి ముడుచుకుపోయినట్లుగా ఉండటం రక్తం వంటి స్రావాలు రావడం. బాహుమూలాల్లో : చివరిదశలో గడ్డ బాగా పెరిగి చంకలోనూ దాని స్పర్శ తెలియడం భుజం వాపు కనిపించడం. నిర్ధారణ పరీక్షలు : ఎఫ్ఎన్ఏసీ అనే పరీక్ష మామోగ్రఫీతో పాటు ఫ్రోజెన్ సెక్షన్ ఎగ్జామినేషన్ ఛాతీ ఎక్స్‌రే కడుపు స్కానింగ్ ఎముకల స్కానింగ్ (ఈ చివరి పరీక్ష వ్యాధి ఏ మేరకు వ్యాపించిందో తెలుసుకోవడం కోసం చేస్తారు). నివారణ : ఒక మహిళకు రొమ్ము క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎంత ఉందో తెలుసుకోవడం నివారణలో కీలకం అవుతుంది. ఇందుకోసం ఒక మహిళ జీవనశైలి, ఆమె కుటుంబ ఆరోగ్య చరిత్ర, వృత్తి లాంటి అంశాలు ఇందుకోసం ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులో మార్చలేని అంశాలు : వయసు, జెండర్, రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డ బంధువులతో బాంధవ్యంలో దగ్గరితనం, రుతుస్రావ చరిత్ర, ఏ వయసులో రుతుస్రావం ఆగిపోతుంది వంటి అంశాలను మార్చలేం. కానీ... మార్చుకోగల అంశాలు: ఎక్కువ బరువు ఉండటం, మొదటి సంతానం ఏ వయసులో కలిగింది, ఎంత మంది పిల్లలు, బిడ్డలకు ఎంతకాలం పాటు రొమ్ముపాలు పట్టారు, పోషకాహారం, అబార్షన్ల సంఖ్య. పై అంశాల ఆధారంగా ఒకరికి రొమ్ముక్యాన్సర్ వచ్చే అవకాశం ఎంత ఉందో చెప్పడానికి కొన్ని ‘పద్ధతులు’ (మోడల్స్) అందుబాటులో ఉన్నాయి. ఇందులోని ప్రాచుర్యం పొందిన పద్ధతే... ‘గేల్స్ మోడల్’. దీని సహాయంతో ప్రస్తుత వయసు, ఏ ప్రాంతానికి చెందినవారు, ఏ సమయంలో రుతుక్రమం మొదలైంది, మొదటి సంతానం ఏ వయసులో కలిగింది, దగ్గరి బంధువుల్లో ఎంత మందికి రొమ్ముక్యాన్సర్ ఉంది లాంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ అంచనా వేస్తారు. ఒక మహిళకు క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఉందని తేలితే... దాన్నిబట్టి నివారణ చర్యలు తీసుకోవచ్చు. అవి... పౌష్టికాహారం : ముదురు ఆకుపచ్చరంగులో ఉన్న ఆకుకూరలు, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ క్యాన్సర్ గుణాలున్న అన్ని రకాల కూరగాయలు ఆహారంలో పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. వ్యాయామం : మహిళలంతా మరీ తీవ్రమైనవీ, మరీ తక్కువవీ కాకుండా ఒక మోస్తరు వ్యాయామాలను రోజూ కనీసం 30 నిమిషాల పాటు చేయాలి. ఇలా వారంలో కనీసం ఐదురోజులైనా వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామాల వ్యవధిని 45 నిమిషాలకు పెంచుకుంటే రొమ్ముక్యాన్సర్ రిస్క్ మరింత తగ్గుతుంది. అదే కాస్త చిన్న వయసు పిల్లలైతే ఈ వ్యాయామ వ్యవధిని 60 నిమిషాలకు పెంచుకుని, అలా వారంలో కనీసం ఐదు రోజులైనా చేయాలి. ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే దాన్ని పూర్తిగా మానేయాలి. మందులతో నివారణ : కుటుంబ చరిత్రలో ఎవరికైనా రొమ్ముక్యాన్సర్ ఉన్నా లేదా బీఆర్సీఏ అనే జన్యువులో మార్పు ఉన్నా టామోక్సిఫెన్, ర్యాలోక్సిఫీన్ వంటి మందులతో నివారించవచ్చు శస్త్రచికిత్సతో నివారణ : బీఆర్సీఏ అనే జన్యువులో మార్పులు ఉన్నట్లయితే ‘ప్రొఫిలాక్టిక్ మాసెక్టమీ’ అనే ముందస్తు శస్త్రచికిత్సతో రొమ్ము క్యాన్సర్‌ను నివారించవచ్చు. స్వయం పరీక్ష : రొమ్ముక్యాన్సర్‌ను ఎవరికి వారే స్వయంగా కూడా తెలుసుకునే అవకాశం ఉంది. మహిళలు తమ రొమ్ములను స్వయంగా పరీక్ష చేసుకుంటూ రొమ్ములో ఏవైనా గడ్డలు చేతికి తగులుతున్నాయా, రొమ్ము ఆకృతిలో తేడా ఉందా, రొమ్ము నిపుల్ నుంచి ఏవైనా స్రావాలు వెలువడుతున్నాయా, నిపుల్ లోపలికి ముడుచుకుపోయి ఉందా, నిపుల్ మీద ర్యాష్ లేదా వ్రణాలు ఏవైనా ఉన్నాయా అని ఎవరికి వారే పరీక్ష చేసుకోవచ్చు. కాబట్టి ముందే కనుగొంటే ప్రాణాలనూ, దాంతో పాటే రొమ్మును పూర్తిగా కాపాడుకునేందుకు అవకాశం ఉన్న వ్యాధి ఇది. చికిత్స : రొమ్ముక్యాన్సర్‌కు ఈ రోజుల్లో శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ, హార్మోనల్ థెరపీ, కీమోథెరపీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. తొలిదశలో ఉంటే రొమ్మును రక్షిస్తూ, క్యాన్సర్ ఇతర అవయవాలకు వ్యాపించకుండా ఆపవచ్చు. ఇందుకోసం సర్జరీని మొదటి చికిత్సగా చేస్తారు. ఇక ఆ తర్వాత వ్యాప్తిని నివారించేందుకు హార్మోన్ థెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీలను చేస్తారు. రొమ్ము క్యాన్సర్ వచ్చిన వారిలో ఇప్పుడు మొదటే దీన్ని కనుగొంటే ఆంకోప్లాస్టీ అనే శస్త్రచికిత్స సహాయంతో రొమ్మును పూర్తిగా రక్షిస్తారు. సర్జరీతో క్యాన్సర్ గడ్డను తొలగించడంతో పాటు అక్కడ పడిన సొట్టను పూడ్చుతూ ప్లాస్టిక్ సర్జరీని కలగలిపి ఈ శస్త్రచికిత్స చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ వ్యాధి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్క్రీనింగ్ సాధారణం కంటే ఎక్కువ రిస్క్ ఉన్నవారు తరచూ పరీక్షలు చేయించుకోవాలి. జాతీయ హెల్త్ సర్వే (ఎన్హెచ్ఎస్) బ్రెస్ట్ స్క్రీనింగ్ కార్యక్రమం సిఫార్సుల మేరకు 50 - 70 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు ప్రతి మూడేళ్ల కోసారి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్న మహిళలైతే మరింత తరచుగా ఈ స్క్రీనింగ్ పరీక్షలను చేయించుకోవాలి. కుటుంబ చరిత్రలో రొమ్ముక్యాన్సర్ వచ్చిన దగ్గరి బంధువులు (అంటే అమ్మ, చెల్లెళ్లు, కూతుళ్లు) ఉంటే రిస్క్ రెండు నుంచి మూడు రెట్లు పెరుగుతుంది. ఇక మహిళల్లోని జన్యువులైన బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 అనే రెండింటిలో తేడాలు ఉంటే క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. రొమ్ము క్యాన్సర్ వచ్చిన మహిళల్లోని 5 శాతం మందిలో ఈ రెండు జన్యువుల్లో మ్యూటేషన్స్ (ఉత్పరివర్తన మార్పులు) చోటు చేసుకున్నట్లు పరిశోధనలు తెలుపుతున్నాయి. - డాక్టర్ శ్రీకాంత్,సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్,యశోదా హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్