‘వైఎస్సార్ చేయూత’ ద్వారా విజయవాడలో ఓ మహిళ ఏర్పాటు చేసుకున్న కిరాణా షాపు
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లో 45–60 ఏళ్లలోపు ఉన్న మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్ చేయూత’ వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఈ పథకం కింద ఒక్కో మహిళకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేల ఆర్థికసాయం అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా తొలిదశలో 24 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.4,500 కోట్లను గత ఏడాది అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ప్రభుత్వం ఇచ్చిన సొమ్ముకు జతగా బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల ద్వారా మరింత సొమ్మును ఇప్పించి ఆ మహిళలు వివిధ రంగాల్లో వ్యాపారాలు చేసేలా తోడ్పాటునందించింది.
ఇలా తొలిదశలో బ్యాంకులు, వివిధ ఆర్థిక సంస్థలు ఆ మహిళలకు రూ.1,507.24 కోట్ల మేర ఆర్థిక సాయం అందించాయి. కేవలం రిటైల్ షాపులు, గేదెలు, ఆవుల, గొర్రెలు, మేకలు పెంపకం కార్యకలాపాలకే ఈ మొత్తం అందించాయి. ఇలా ప్రభుత్వం ఇచ్చిన సహాయానికి తోడు బ్యాంకుల నుంచి తోడ్పాటు అందడంతో వారు విజయవంతంగా వ్యాపారాలు ప్రారంభించారు. మరోవైపు.. వీరు చేసే వ్యాపారాలకు మార్కెటింగ్ కల్పించేందుకు.. నాలుగేళ్లలో అందే రూ.75 వేలను సమర్థవంతంగా వినియోగించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం అమూల్, ఐటీసీ, పీ అండ్ జీ, అలానా, హిందుస్థాన్ లీవర్ వంటి కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. లబ్ధిదారులందరినీ బ్యాంకులతోనూ, కార్పొరేట్ కంపెనీలతో అనుసంధాం చేసేందుకు వైఎస్సార్ చేయూత కాల్‌సెంటర్లను ఏర్పాటుచేసింది. వీటికి 0866–2468899, 9392917899 నెంబర్లను ప్రభుత్వం కేటాయించింది.
రెండో విడత చేయూతలో ఇలా..
ఇక రెండో విడత చేయూత కింద ఈ ఏడాది జూన్ 22న 23.44 లక్షల మంది మహిళలకు రూ.4,400 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించింది. ఇందులో 23.41 లక్షల మంది జీవనోపాధి రంగాలను ఎంపిక చేసుకున్నారు. అత్యధికంగా 7.66 లక్షల మంది వ్యవసాయ రంగాన్ని ఎంచుకోగా, 5.72 లక్షల మంది పాడి పరిశ్రమను ఎంచుకున్నారు. వీరందరినీ వివిధ కార్పొరేట్ కంపెనీలతో అనుసంధానం చేసేందుకు, బ్యాంకుల ద్వారా అవసరమైన సహాయాన్ని అందించేందుకు అధికారుల కసరత్తు చేస్తున్నారు.
► ఈమె పేరు లక్ష్మమ్మ. అనంతపురం జిల్లా మడకశిర మండలం జీవీ పాళ్యం గ్రామం. ‘వైఎస్సార్ చేయూత’ పథకం ఈమెకు కొండంత భరోసా కల్పించింది. అప్పటివరకు ఆమె కుటుంబానికి అంతంతమాత్రపు ఆదాయం వచ్చేది. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ‘చేయూత’ ఇచ్చి నీలకంఠాపురం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ద్వారా మరింత సహకారం ఇప్పించిందో లక్ష్మమ్మ దశ తిరిగింది. ఆ డబ్బులతో ఉన్న ఊర్లోనే చిల్లర దుకాణం ప్రారంభించింది. రోజూ రూ.3వేలకు తగ్గకుండా వ్యాపారం సాగుతోంది. సీఎం వైఎస్ జగన్ పుణ్యమా అని మా కుటుంబం ఇప్పుడు ఎవరిపై ఆధారపడకుండా సంతోషంతో జీవిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నామంటూ ఆమె ఉబ్బితబ్బిబవుతోంది.
► ఈమె చిత్రాడ ముత్యాలమ్మ. స్వస్థలం విశాఖ జిల్లా రావికమతం మండలం కొత్తకోట గ్రామం. భర్త సంపాదన పైన ఈమె కుటుంబమంతా ఆధారపడేది. పోయిన ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ చేయూత’ కింద రూ.18,750లు ఆర్థిక సాయం అందించింది. బ్యాంకు కూడా తోడుగా నిలిచి రూ.50వేల రుణ సాయం చేసింది. ఈ డబ్బుతో ముత్యాలమ్మ ఇంటివద్దే కిరాణా దుకాణం ప్రారంభించింది. ఆమె రోజువారీ వ్యాపారం బాగుండడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయి. ఇప్పుడు రోజురోజుకూ మా వ్యాపారం పెరుగుతోందంటూ ఆమె ఆనందపడుతోంది.
రాజమండ్రికి చెందిన యర్రా సాయికుమారి భర్తది సైకిళ్లకు పంక్చర్లు వేసే వృత్తి. దీంతో కుటుంబం గడవడం భారంగా ఉండేది. ప్రభుత్వం గత ఏడాది మొదటి విడత కింద వైఎస్సార్ చేయూత ఇవ్వడం.. వేరే ఇతర ఆర్థిక సంస్థతో మరింత తోడ్పాటు ఇప్పించడంతో ఈమె టైలరింగ్ షాపు ప్రారంభించింది. అందులోనే దుస్తులనూ విక్రయిస్తోంది. అప్పటివరకు నెలకు రూ.4వేలు ఉన్న ఆ కుటుంబ ఆదాయం ఇప్పుడు రెట్టింపయ్యింది. చేయూత పథకం గొప్ప వరమంటూ ఆమె సంతోషం వ్యక్తంచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment