నాకూ  రెక్కలున్నాయ్‌  నాన్నా | Role of Women in the Freedom | Sakshi
Sakshi News home page

నాకూ  రెక్కలున్నాయ్‌  నాన్నా

Published Thu, Mar 7 2019 12:31 AM | Last Updated on Thu, Mar 7 2019 12:31 AM

Role of Women in the Freedom - Sakshi

పిల్లలు పుట్టడమే రెక్కలతో పుడతారుకానీ తలిదండ్రులు అబ్బాయిలకి రెక్కలుంచి అమ్మాయిలకు కత్తిరిస్తుంటారు ఆడపిల్లల పట్ల ఎక్కువ రక్షణ ఉంచాలనుకోవడం మంచిదే కానీ...కంచె కూడా మొక్కను మింగేసేంత ఉంటే ఎలా? స్వేచ్ఛలోనే జ్ఞానం ఉంది. చైతన్యం ఉంది. వివేచన ఉంది. వికాసం ఉంది.  నాన్నలూ... మాట వినండి. 

ఆడపిల్ల అణకువగా ఉండాలని చెప్పేవారు. ఆడపిల్ల ఒద్దికగా ఉండాలని చెప్పేవారు. ఆడపిల్ల అసలు అల్లరే చేయకూడదని చెప్పేవారు. ఆ పిల్లకు విసుగ్గా ఉండేది. ఇంట్లో తమ్ముడో చెల్లెలో ఉంటే బాగుండు అనిపించేది. వాళ్లు లేరు. తల్లిదండ్రులు ఎప్పటికీ తన ఫ్రెండ్స్‌ కారు. 

ఆటంబాంబు పడితే ఎలా ఉండేదో కాని ఆ ఇంటి మీద ఆడపిల్లైతే పడింది.సిద్దిపేటలో అతనో ఉద్యోగి. ఆమె ఆ ఉద్యోగి భార్య. పెళ్లయిన మూణ్ణెల్లకు భార్య గర్భం దాల్చింది. అతని కుటుంబంలో చాలామందికి తొలి కాన్పు మగపిల్లాడే పుట్టాడు. కనుక తనకు కూడా మగపిల్లాడేపుడతాడని అతడు అన్నాడు. ఆమె నమ్మింది. ఇద్దరూ మగపిల్లాడి కోసం ఎదురు చూస్తుంటే ఆడపిల్ల పుట్టింది.ఆడపిల్లా! ఆడపిల్లే!అతను హతాశుడయ్యాడు. ఆమె నిరాశ పడింది. భవిష్యత్తు చిత్రపటం వారి కళ్ల ముందు గిర్రునో రయ్యినో తిరిగింది.ఆడపిల్లను జాగ్రత్తగా చూసుకోవాలి. రెక్కల కింద కాపాడుకోవాలి. కట్నం కోసం డబ్బు కూడబెట్టాలి.ఆ తర్వాత మంచి కుర్రాణ్ణి చూసి పెళ్లి చేయాలి. అప్పటికే ఎంత ఖర్చవుతుందో ఏమో. ఏమేమి అవసరమవుతాయో ఏమో.ఇంకొకరిని కందాం అనుకున్నారు మగపిల్లాడు పుడితే.ఆడపిల్ల పుట్టింది కనుక ఆగిపోయారు.ఆడపిల్లకు మాటలొచ్చాయి. తల్లిదండ్రులతో మాత్రమే మాట్లాడింది. స్కూల్లో పక్క బెంచి వాళ్లతోనే మాట్లాడింది. ఆ తర్వాత మాట్లాడటానికి వీల్లేదు. ఆ తల్లిదండ్రులు ఎక్కడికీ పంపరు.బాబోయ్‌... ఆడపిల్ల.ఏమైనా జరిగితే.ఆడపిల్ల అణకువగా ఉండాలని చెప్పేవారు. ఆడపిల్ల ఒద్దికగా ఉండాలని చెప్పేవారు. ఆడపిల్ల అసలు అల్లరే చేయకూడదని చెప్పేవారు.ఆ పిల్లకు విసుగ్గా ఉండేది. ఇంట్లో తమ్ముడో చెల్లెలో ఉంటే బాగుండు అనిపించేది. వాళ్లు లేరు. తల్లిదండ్రులు ఎప్పటికీ తన ఫ్రెండ్స్‌ కారు. పోనీలే వాళ్లనే ఫ్రెండ్స్‌ను చేసుకుందామనుకుంటే హైస్కూల్‌ చదువు మంచిగా ఉండాలని హైదరాబాద్‌కు తీసుకొచ్చి బావమరిది ఇంట్లో పెట్టారు. వాళ్లు బాగ చూసుకున్నారు నిజమే. కాని వాళ్ల పిల్లలు అదో టైప్‌. మేచ్‌ కాలేదు. ఆ పిల్లకు సిద్దిపేటకు వచ్చేయాలనుండేది. కనీసం తల్లిదండ్రులతో ఉండాలనిపించేది. తల్లిదండ్రులు అది వినలేదు. అర్థం చేసుకోలేదు. 

ఇంటర్‌ చదువు ఇంకా ముఖ్యమైనదని తీసుకెళ్లి రెసిడెన్షియల్‌ కాలేజీలో పడేశారు. ఆ కాలేజొక బందెలదొడ్డి. తోటి విద్యార్థులకు బ్రష్‌ చేసుకోవడానికే టైమ్‌ ఉండేది కాదు... ఇక స్నేహం ఏం చేస్తారు?డిగ్రీ వచ్చేసరికి తల్లిదండ్రులే హైదరాబాద్‌ షిఫ్ట్‌ అయ్యారు.అమ్మాయి డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ అయ్యాక సెకండ్‌ ఇయర్‌కు వచ్చింది.ఒకరోజు తండ్రికి కాలేజ్‌ నుంచి మెసేజ్‌ చేసింది.‘నాన్నా.. పెళ్లి చేసుకుంటున్నా’ అని.తండ్రి అదిరిపడ్డాడు. తల్లి ఏడుపు అందుకుంది.కుర్రాడు ఎవడు అని వాకబు చేశారు. పిజ్జా డెలివరీ బాయ్‌ అట.సరే. డిగ్నిటీ ఆఫ్‌ లేబర్‌ అనుకుందాం అనుకున్నారు. కాని మనిషిని చూస్తే నిరాశ కలిగేలాఉన్నాడు.ఎక్కడ తప్పు జరిగింది?బాగా పెంచామనుకున్నామే.కన్న కూతురు ఇంత ద్రోహం చేస్తుందా?తల్లి డిప్రెషన్‌. తండ్రికి నిస్పృహ. అమ్మాయి మీద పెళ్లి వద్దని ఒత్తిడి. ముందైతే వాయిదా వేయించి ఆలోచిద్దామని చెప్పి ముగ్గురూ కౌన్సెలింగ్‌కు వచ్చారు.‘చూడండి డాక్టర్‌. నా కూతురు చక్కని పిల్ల. బాగా పెంచాం. పోయి పోయి వాణ్ణి ప్రేమించానని చెబుతోంది. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటోంది.ఏంటిది?’ అన్నాడు తండ్రి.సైకియాట్రిస్ట్‌ మొత్తం విన్నాడు.‘తప్పు మీదేనండీ’ అన్నాడు తండ్రితో.‘ఎలా?’‘ఆడపిల్ల ఆడపిల్ల అంటూ ఆ అమ్మాయిని ఏ గాలీ వెలుతురూ లేకుండా పెంచారు.స్నేహితులను ఇవ్వలేదు. పోనీ సొంత తమ్ముణ్ణో చెల్లెలినో ఇవ్వలేదు. చిన్నప్పటి నుంచి ఒంటరితనంతో బాధ పడింది. ఎక్కడైనా ఎవరైనా తనను పట్టించుకుంటే బాగుండు అని అనుకుంది. కాని అలాంటివీలే లేనట్టు మీరు పెంచారు. కాలేజీకొచ్చాక మీరు ఫోన్‌కొనిచ్చారు. కాలేజీ బుక్‌పోయి ఫేస్‌బుక్‌ వచ్చింది. మీ అమ్మాయి ఫేస్‌బుక్‌కు అడిక్ట్‌ అయ్యింది. అక్కడ ఎవరెవరో ముక్కుముహం తెలియనివారు మీ అమ్మాయి డిస్‌ప్లే పిక్చర్‌ చూసి ఫ్రెండ్‌ రిక్వెస్ట్స్‌ పంపడం మొదలెట్టారు. చాటింగ్‌ మొదలెట్టారు. బుట్టలో వేసుకోవడానికి ‘చిన్నా కన్నా... భోం చేశావా... ఎండలో తిరక్కు... ప్రభాస్‌ సినిమా ఫస్ట్‌ మార్నింగ్‌ షోకు రక్తం అమ్మయినా నీ కోసం రెండు టికెట్స్‌ తెస్తా’... ఇలాంటి మెసేజ్‌లు చూసే సరికి తనకు ప్రాముఖ్యం ఉన్నట్టు, తనను గుర్తించే మనుషులు కూడా ఉన్నట్టు మీ అమ్మాయి అనుకుంది. సంతోషపడింది. అవతలి మనిషి ఎవరనేది కూడా చూడకుండా కేవలం అతడి మాటలు, స్నేహం అని అనుకుంటున్న స్నేహం, ప్రేమ అని అనుకుంటున్న ప్రేమకు కేరీ అయిపోయింది. అది ఆమెకు ఇష్టమైన కొత్తలోకం. అందుకని మిమ్మల్ని కూడా వద్దనుకుని అతణ్ణి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది’ అన్నాడు సైకియాట్రిస్ట్‌.

తల్లిదండ్రులు తల దించుకున్నారు.‘చూడండి. ఆడపిల్ల అంటే భౌతికంగా ఒక నిర్మాణం. కాని అది అథమ నిర్మాణం కాదు. అణిచి పెట్టాల్సిన నిర్మాణం కాదు. మగవాడితో సమానమైన నిర్మాణం. ఆమెకు కూడా అన్ని రకాల చైతన్యం, జ్ఞానం, ఎక్స్‌పోజర్‌ ఉండాలి. తీగ కదా అని ఎక్కువ కంగారుతో చుట్టూ కర్రలు పాతితే అది ఎదగదు. చచ్చిపోతుంది. మీ అమ్మాయి విషయంలో జరిగింది అదే. దారిలో మోగే ఐస్‌బండి గంటైనా తన కోసం మోగితే చాలనుకునే స్థితికి వచ్చింది’ అన్నాడు మళ్లీ.ఆ అమ్మాయి వైపు చూశాడు.‘చూడమ్మా... నీది ప్రేమ కాదు... పెళ్లి చేసుకునేంత బంధం, పరిణితి మీ ఇద్దరి మధ్యా లేదు. ఇది కొద్దిపాటి ఆకర్షణ. ఈ వయసులో మనసుకు ఊపు తెచ్చే ఒక మాదకద్రవ్యం. దానిని చూసుకొని తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకు. నీకిప్పుడు కావలిసింది బాయ్‌ఫ్రెండ్‌ కాదు. ఒక స్నేహబృందం. అందులో అబ్బాయిలూ అమ్మాయిలూ కూడా ఉండొచ్చు. నీ అభిరుచి ఏమిటో తెలుసుకొని, నీకు ఏదైనా కళా సాంస్కృతిక రంగాల్లో ఇష్టం ఉంటే అందులో మనసు పెట్టు. నీకు ఇష్టమైన స్నేహబృందం దొరుకుతుంది.బ్లూ క్రాస్, రెడ్‌క్రాస్‌ వంటి సంస్థల్లో పని చేయాలనుకుంటే అదీ చేయవచ్చు. లేదంటే నువ్వే ఒక ఆర్ఫన్‌ ఏజ్‌లో పార్ట్‌టైమ్‌ వాలంటీర్‌గా పని చేయి. లోకం తెలుస్తుంది. నీకు నువ్వు తెలుస్తావు. నీ లోటు తీర్చే స్నేహాలు ఏర్పడతాయి. వయసు కూడా కొంచెం పెరగనీ. ఆ తర్వాత కూడా నువ్వు ప్రేమించదగ్గ వ్యక్తులు కనిపిస్తారు. అప్పుడు నీకు నిజంగానే ప్రేమించాలనిపిస్తే ప్రేమించు. నీ తల్లిదండ్రులను నేను ఒప్పించిపెళ్లి చేస్తా. సరేనా?’ఆ అమ్మాయి ఏమనుకుందో తల ఊపింది.సైకియాట్రిస్ట్‌ నిట్టూర్చాడు.అప్పటికి రాత్రి ఏడైంది.‘ఆకలేస్తోంది. ఏమైనా తెప్పించుకుందామా’ అన్నాడు సైకియాట్రిస్ట్‌.‘పిజ్జా మాత్రం వద్దు సార్‌’... ఫీజు డబ్బులు బయటకు తీస్తూ కొంచెం భయంగా నవ్వాడు అమ్మాయి తండ్రి.అందరూ కూడా హాయిగానే నవ్వుకున్నారు ఆ తర్వాత.
– కథనం: సాక్షి ఫ్యామిలీ
ఇన్‌పుట్స్‌: డాక్టర్‌ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement