ఒక్క ఫ్రెండు... వేణుమాధవ్ లాంటి ఒక్క ఫ్రెండు...
ఉంటే చాలు.
ఎంత పెద్ద స్టార్ యాక్టర్‌కైనా పక్కన పెద్ద సపోర్ట్!
అల్లు రామలింగయ్య, చిరంజీవి, రామ్‌చరణ్ నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య ఫర్ ఎవ్రీ జనరేషన్... మిత్ర ‘పాత్రుడు’ వేణుమాధవ్!
ఇక ఆయన రుబాబ్ కామెడి... అదొక కొత్త ఒరవడి!
చేతులు తలపెకైత్తి, సైడుకి ఒక్క లుక్ ఇచ్చాడంటే...
ఆడియన్స్ తుకడాల్, తుకడాల్!!
ప్రదీప్ రావత్, తెలంగాణ శకుంతల... ఎవరైనా... లెక్క చేసేదే లేదు. ‘నల్లబాలు’ లెక్క!
సినిమా ఛాన్స్ వస్తే... ‘‘వద్దొద్దు, ప్రోగ్రామ్స్ ఇప్పించండి చాలు’’ అని తప్పుకుని తప్పుకుని తిరిగిన ఈ ‘జూనియర్ నేరెళ్ల’...
చివరికి ఈ ఫీల్డులో ఎలా సెటిలయ్యారు?
ఇప్పుడెందుకు మళ్లీ దూరమైనట్లు కనిపిస్తున్నారు?!
చదవండి... ఈవారం ‘తారాంతరంగం’.
మీ చిన్ననాటి తీపి గుర్తులు?
వేణుమాధవ్: నాకేం తీపి గుర్తులు లేవు. నాది ఉగాది పచ్చడిలాంటి జీవితం. మాది నల్గొండజిల్లాలోని కోదాడ. పుట్టింది, పెరిగింది, చదివింది అక్కడే. కాలేజీ చదువు మాత్రం బాలాజీనగర్ తండాలో. ప్రతి రోజూ అప్ అండ్ డౌన్ ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్లేవాణ్ణి.
మీ నాన్నగారు ఏం చేసేవారు?
వేణుమాధవ్: టెలిఫోన్ డిపార్ట్‌మెంట్‌లో లైన్ ఇన్‌స్పెక్టర్. అమ్మ ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్‌గా చేసేవారు. మేం ఐదుగురం. అక్క, ఇద్దరన్నయ్యలు, తర్వాత నేను. నా తర్వాత చెల్లి. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ.
చిన్నప్పుడు మీరు బాగా అల్లరి చేసేవారా?
వేణుమాధవ్: అమ్మానాన్న తట్టుకోలేనేంత చేసేవాణ్ణి. స్కూల్‌కి సరిగ్గా వెళ్లేవాణ్ణి కాదు. సరిగ్గా చదువుకునేవాణ్ణి కాదు. అప్పట్లో ఓ సినిమా విడుదలవుతోందంటే, రిక్షాలో ఎనౌన్స్‌మెంట్ చేసేవాళ్లు. రిక్షా కనబడగానే నేనే ఎక్కి, అనౌన్స్ చేసేసేవాణ్ణి. డప్పులోళ్లు కనిపిస్తే.. వాళ్ల వెంటపడి డప్పులు కొట్టడం, పిల్లలతో గోలీలాడటం.. ఇలా నా అల్లరికి అంతుండేది కాదు. మా పిల్లలందరిలోనూ ఎక్కువగా తన్నులు తిన్నది నేనే. మా కుటుంబంలో నా మీద ఎలాంటి నమ్మకం ఉండేది కాదు. ఎందుకూ పనికి రానివాడని అనుకునేవారు.
చదువులో వీక్. మరి, పరీక్షల సంగతేంటి?
వేణుమాధవ్: టెన్త్ క్లాస్ రెండుసార్లు చదివా. అసలీ చదువుని ఎవరు కనిపెట్టారా? అని నానా రకాలుగా తిట్టుకునేవాణ్ణి. చదవకపోతే ఇంట్లో, స్కూల్లో కొడతారు. ఎందుకొచ్చిన గొడవ అనుకునేవాణ్ణి.
సరే.. ఇంతకూ మిమిక్రీలోకి ఎలా ఎంటరయ్యారు?
వేణుమాధవ్: నేను చిన్నప్పట్నుంచీ స్కూల్లో టీచర్లనీ స్నేహితుల్నీ, మా అమ్మ దగ్గరకు వైద్యానికి వచ్చే పేషెంట్లనీ అనుకరించేవాణ్ణి. అయితే దాన్ని మిమిక్రీ అంటారన్న సంగతి నాకు తెలియదు. నేను సెవెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు ఫేమస్ మిమిక్రీ ఆర్టిస్ట్ నేరెళ్ల వేణుమాధవ్‌గారు మా కోదాడలో ఓ మ్యారేజ్ ఫంక్షన్‌లో ప్రోగ్రామ్ చేశారు. అప్పుడు నేను చేసేది మిమిక్రీ అనే సంగతి నాకర్థమైంది. అప్పట్నుంచీ ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ఎక్కువగా మిమిక్రీ చేసేవాణ్ణి.
మిమిక్రీ మీ జీవితానికి మలుపవుతుందనుకున్నారా?
వేణుమాధవ్: అస్సలు లేదు. అయితే మిమిక్రీని ఓ ప్రొఫెషన్‌గా తీసుకున్నది మాత్రం ఇంటర్‌లోనే. అప్పుడు ప్రతి ఏడాది హైదరాబాద్‌లో జరిగే గణేష్ ఉత్సవాల్లో మిమిక్రీ చేయడానికి ఇక్కడికి వచ్చేవాణ్ణి. డిగ్రీ అయిన తర్వాత ముంబయ్ వెళ్లి ‘టాకింగ్ డాల్’ తెచ్చుకుని, ప్రోగ్రామ్ చేయడం మొదలుపెట్టాను.
టాకింగ్ డాల్ తెచ్చుకోవాలని ఎందుకనిపించింది?
వేణుమాధవ్: శ్రీనివాస్ అనే మిమిక్రీ ఆర్టిస్ట్ దగ్గర చూసి, తెచ్చుకున్నాను. నాకు నేనుగా వెంట్రిలాక్విజమ్ నేర్చుకుని ప్రోగ్రామ్స్ చేయడం మొదలుపెట్టాను.
టాకింగ్ డాల్ అంటే చాలా ఖరీదు కదా?
వేణుమాధవ్: నిజమే. అప్పట్లో దాని విలువ ఐదువేల ఎనిమిదివందల రూపాయలు. అది కొనడానికి నేను మామూలు ఇబ్బందులు పడలేదు. ఇంట్లోవాళ్లు, నా ఫ్రెండ్స్ సహాయంతో కొనుక్కున్నాను.
మిమిక్రీలో జూనియర్ వేణుమాధవ్ అనిపించుకున్నారు.. ఎలా అనిపిస్తోంది?
వేణుమాధవ్: నేరెళ్ల వేణుమాధవ్‌గారి ఏకలవ్య శిష్యుణ్ణి. కొన్ని వందల సార్లు ఆయన్ను కలిశాను. ‘అరేయ్.. నువ్వు స్ప్రింగులు మింగావురా..’ అని మెచ్చుకునేవారు. ‘నువ్వు కచ్చితంగా సినిమా యాక్టర్ అవుతావు’ అని కూడా అనేవారు. అంతటి మహానుభావుడితో పోల్చి, జూనియర్ వేణుమాధవ్ అనే పేరు తెచ్చుకుంటానని కలలో కూడా ఊహించలేదు.
ఆ టాకింగ్ డాలే మిమ్మల్ని ఎన్టీఆర్ వరకూ తీసుకెళ్లింది కదూ?
వేణుమాధవ్: అవును. నేను చదువుకున్న గవర్నమెంట్ స్కూల్‌లో అప్పటి కోదాడ ఎమ్మెల్యే చందర్‌రావుగారు, కలక్టర్‌గారు, ఇంకా పలువురు ప్రముఖుల సమక్షంలో టాకింగ్ డాల్‌ని ఇంట్రడ్యూస్ చేశాను. ఆ ప్రోగ్రామ్ చందర్‌రావుగారికి నచ్చి, భువనగిరిలో తెలుగుదేశం పార్టీ మీటింగ్‌కి తీసుకెళ్లారు. అక్కడ మాధవరెడ్డిగారు, చంద్రబాబునాయుడుగారు నా టాకింగ్ డాల్ ప్రదర్శన చూసి, ‘మహానాడులో నువ్వు ప్రోగ్రామ్ చేయాలి’ అన్నారు. ఎన్టీ రామారావుగారి సమక్షంలో ఆరు లక్షల మంది ముందు పోగ్రామ్ చేశా. నా జీవితంలో ఊహించని మలుపు అది. ఆ రోజు సాయంత్రం ప్రోగ్రామ్ అంటే.. మధ్యాహ్నమే నన్ను స్టేజి మీద కూర్చోబెట్టారు. అందరూ మాట్లాడిన తర్వాత, ఎన్టీఆర్‌గారు మాట్లాడే ముందు, నాతో ప్రోగ్రామ్ చేయించారు. అప్పుడు ఎన్టీఆర్‌గారు నా భుజం మీద చెయ్యేసి, ‘మీ సేవలు మాకెంతో అవసరం బ్రదర్’ అంటూ హిమాయత్‌నగర్ తెలుగు దేశం పార్టీ ఆఫీసులో చేర్చుకున్నారు. అక్కణ్ణుంచీ అసెంబ్లీలోని టీడీపీ లెజిస్లేటివ్ కార్యాలయంలో చేర్చారు. నాకంతా అయోమయంగా ఉండేది. సరే.. డబ్బులు బాగానే ఇస్తారనే ఊహతో చేరాను.
ఆ ఊహ నిజమైందా?
వేణుమాధవ్: నెలకు ఆరువందలు ఇచ్చేవారు. ఆ తర్వాత ఎనిమిది వందలు. 1994 నుంచి 96 వరకు అక్కడే చేశాను.
సినిమాల్లోకి ఎలా వచ్చారు?
వేణుమాధవ్: అప్పుడు నేను, మిమిక్రీ శ్రీనివాస్‌గారు, జనార్ధన్, కోలా... అని మేమందరం ఆకృతి సంస్థ నిర్వహించే ప్రోగ్రామ్స్ చేసేవాళ్లం. నాకు సెకండ్ హ్యాండ్ బజాజ్ 150 ఉండేది. పెట్రోలు ఖర్చులు కలిసొస్తాయని నలుగురూ ఒకే వాహనం మీద వెళ్లేవాళ్లం. ఓసారి రచయిత దివాకర్‌బాబుగారికి రవీంద్రభారతిలో సన్మానం జరిగితే, ఎస్వీ కృష్ణారెడ్డిగారు, అచ్చిరెడ్డిగారు వచ్చారు. మేం చేసిన ప్రోగ్రామ్ చూసి, ఫోన్‌నంబర్ ఇచ్చి, మర్నాడు ఆఫీసుకు వచ్చి కలవమన్నారు. సినిమాలు చూడ్డమే తప్ప నాకు సినిమా మీద కొంచెం కూడా జ్ఞానం లేదు. సినిమాల్లో నటించాలనే ఇంట్రస్ట్ లేదు. సరే.. రమ్మన్నారు కదా అని వెళ్లాలనుకున్నాను.
ఫిల్మ్‌నగర్‌లో అడుగుపెట్టింది అప్పుడేనా?
వేణుమాధవ్: అవును. ఆఫీసు వెతుక్కుంటూ వెళ్లి, కలిశాను. ‘నువ్వు స్టేజ్ మీద ఏదైతే చేశావో.. సినిమాలో అదే చెయ్యాలి’ అన్నారు. ‘నాకు సినిమా అంటే తెల్వదు సార్.. మనకు ఎరక లేదు. ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే చెప్పండి. ఒక్కో ప్రోగ్రామ్‌కి ఇంత అని తీసుకుంటా’ అని ఇదే స్లాంగ్‌లో చెప్పా. ‘కాదు.. కాదు.. ఆలోచించుకో’ అన్నారు. ఇంటికొచ్చి అమ్మకి చెబితే.. ‘పిచ్చోడా.. సినిమా అంటే చిన్న విషయం కాదు. చేస్తానని చెప్పు’ అని చెప్పింది. ఆ తర్వాత అమ్మ మా ఊరు వెళ్లిపోయింది. దాంతో నేను కృష్ణారెడ్డిగార్ని కలవాలనే ఆలోచనను వదిలేశా. కానీ ఊరెళ్లిన తర్వాత కూడా అమ్మ వదల్లేదు. అప్పట్లో నా రూమ్‌లో ల్యాండ్‌లైన్ కూడా లేదు. పక్కింటికి ఫోన్ చేసి మరీ, ‘వెళ్లకుండా ఉండొద్దు’ అని అమ్మ పదే పదే చెప్పడంతో, బాధ భరించలేక వెళ్లాను. నేను మళ్లీ అదే పాట.. ‘పబ్లిక్ మీటింగ్ అయితే చేస్త కానీ.. ఇట్టాంటివి నడ్వదు సార్. సినిమా అంటే నాకు తెల్వదు’ అన్నాను. జనరల్‌గా వేరే దర్శక, నిర్మాతలెవరైనా వద్దంటారు. కానీ, కృష్ణారెడ్డిగారు, అచ్చిరెడ్డిగారు ‘మేం చూసుకుంటాం..’ అని హామీ ఇచ్చారు. ఎలాగూ బతిమాలుతున్నారు కదా అని, క్యాష్ చేసుకుందామని, అయితే ‘ఆర్ నైతో పార్’.. వస్తే డబ్బులొస్తాయ్ లేకపోతే సినిమా చేయకుండా తప్పించుకోవచ్చని, లెవల్‌గా ‘ఎన్ని రోజులు కావాల’ అనడిగాను. అరవై, డెబ్భైరోజులు కావాలంటే, 70వేలు అడిగాను. ఆ సినిమాకి నిర్మాత అన్నారావుగారు. ఆయనతో మాట్లాడతామని చెప్పారు. ‘వాళ్లతో వీళ్లతో నాకు సంబంధం లేదు.. నాకు పైసల్ కావాల్సిందే’ అంటే, ఓకే అన్నారు. ఆ విధంగా ‘సంప్రదాయం’ సినిమాకి మొదటిసారి మేకప్ వేసుకున్నా.
సరే... షూటింగ్ వాతావరణం ఎలా అనిపించింది?
వేణుమాధవ్: కృష్ణగారు, ఇంకొంతమంది ఆర్టిస్టులు, నా కాంబినేషన్‌లో మొదటిరోజు షూటింగ్ స్టార్ట్ చేశారు. లొకేషన్‌కి వెళ్లగానే, టిఫిన్ తినమన్నారు. కానీ, నేను బయటికెళ్లి, హోటల్‌లో తినొచ్చాను. ఆ తర్వాత ఒంటి గంటకి బ్రేక్ అన్నారు. అంటే ఏంటో తెలియదు. అందరికీ భోజనం పెడుతుంటే, లంచ్ టైమ్ అనుకుని బయటికెళ్లి భోజనం చేసొచ్చాను. నన్నూ తినమన్నారు. అక్కడ భోంచేస్తే, ఇచ్చే డబ్బుల్లో కట్ చేస్తారని భయం. ఇలా రెండు రోజులు గడిచాయి. మూడో రోజు ‘ఏవయ్యా.. ఎటు వెళుతున్నావ్’ అని ప్రొడక్షన్‌వాళ్లు అడిగితే, తినడానికని చెప్పా. ‘ఎందుకు? ఇక్కడ పెడుతున్నాంగా.. ఫ్రీయే’ అన్నాడు. అంతే.. నా ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి, రమ్మన్నాను. నాలుగు రకాల పచ్చళ్లు, కూరలు.. బ్రహ్మాండమైన భోజనం. ఓ పట్టు పట్టేవాళ్లం. లైఫ్ చాలా హాయిగా అనిపించింది.
పర్టిక్యులర్‌గా 70వేలు పారితోషికం అడగాలని ఎందుకనిపించింది?
వేణుమాధవ్: లక్ష రూపాయలు సాధించాలన్నది నా జీవితాశయం. అందుకే 70 వేలడిగాను. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. సినిమా మొత్తం పూర్తయ్యాక, డబ్బింగ్ చెప్పాలి రమ్మంటూ ఓ రోజు కారు పంపించారు. డబ్బింగ్ అంటే ఏంటో నాకస్సలు తెలియదు. సరే.. థియేటర్‌కి వెళ్లాను. స్క్రీన్ మీద నా బొమ్మ చూసుకుంటూ.. డబ్బింగ్ చెప్పాలి. ఫస్ట్ టైమ్ స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవడంతో ఎగ్జయిట్ అయిపోయాను. అలా చూస్తూ నిలబడిపోయాను. అలా పదిసార్లు జరిగింది. నోరెళ్లబెట్టి చూడటం తప్ప మాటలు మాట్లాడటంలేదు. రామ్‌గోపాల్‌రెడ్డిగారని ఎడిటర్‌గారు... ఇలా అయితే లాభం లేదని, రేపు డబ్బింగ్ చెబుదువుగాని అన్నారు. మర్నాడు కూడా అదే తంతు. మూడు, నాలుగో రోజు కూడా అంతే. నా బొమ్మ చూసుకోగానే.. భలే ఉన్నామే అనుకోవడం తప్ప డబ్బింగ్ చెప్పడంలేదు. రామ్‌గోపాల్‌గారికి నేను చెప్పనని అర్థమైంది. దాంతో కాదంబరి కిరణ్‌గారితో చెప్పించారు.
లక్ష రూపాయల జీవితాశయం ఏంటి?
వేణుమాధవ్: బీకామ్ చేసిన తర్వాత సీఏ చదవాలని విపరీతమైన కోరిక. కోదాడలో సీఏ లేదు. అప్పుడు హైదరాబాద్‌లో కూడా లేదు. సీఏ చేయాలంటే చెన్నయ్ వెళ్లాలి. ఫీజు మాత్రమే లక్ష రూపాయలు కట్టాలి. ఎలాగైనా సీఏ చేయాలన్నది ఆశయం. మా అమ్మానాన్నలకు ఐదుగురు సంతానం. ఐదుగుర్నీ చదివించడం, పెంచడం చిన్న విషయం కాదు. ఇక, లక్ష రూపాయలు ఎక్కడ కడతాం? లక్ష లేకపోవడంతో సీఏ చేయలేకపోయాం కదా.. అందుకే ఎప్పటికైనా లక్ష రూపాయలు సంపాదించాలనుకున్నా.
అదేంటి.. చదువంటే అసహ్యం అన్నారు.. సీఏ చేయాలనుకోవడం ఆశ్చర్యంగా ఉందే?
వేణుమాధవ్: టెన్త్ ఎప్పుడైతే రెండుసార్లు రాశానో అప్పుడే నాకే ఏదోలా అనిపించింది. ఇంటర్‌లోకొచ్చాక చదువంటే ఇంట్రస్ట్ ఏర్పడింది. సెకండ్ క్లాస్ తెచ్చుకున్నా. బీకామ్ వచ్చేటప్పటికి ఇంకా ఇంట్రస్ట్ ఏర్పడింది. అప్పుడే సీఏ యాంబిషన్ కలిగింది.
సరే... మళ్లీ సినిమాల్లోకొద్దాం. ‘సంప్రదాయం’ విడుదలైన తర్వాత వెంటనే అవకాశాలు వచ్చాయా?
వేణుమాధవ్: ఆ సినిమా జనవరి 14న విడుదలయ్యింది. 10, 11న చెన్నయ్‌లో ప్రివ్యూ వేశారు. ఆ ప్రివ్యూ చూసిన కొంతమంది నిర్మాతలు అవకాశం ఇచ్చారు. మొదటి సినిమా రిలీజ్ అవకముందే పాపులర్ అయ్యాను. శ్రీకారం, మెరుపు.. ఇలా బోల్డన్ని సినిమాలకు అవకాశం వచ్చింది. ఒక్క సినిమా కూడా విడుదలవ్వక ముందే బిజీ అవడం అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.
వెంటనే పారితోషికం పెంచేశారా?
వేణుమాధవ్: ‘శ్రీకారం’ సినిమాలో నాది హాఫ్ డే కేరక్టర్. మనిషి ఆశాజీవి. అది కూడా తెలియనితనం ఉన్న మనిషైతే మితిమీరి ప్రవర్తిసాడు. అప్పట్లో నా తెలియనితనంతో ఒక్క రోజుకి 70వేలు పారితోషికం అడిగా. నిర్మాతగారు సరే... నేను మాట్లాడతాలే అన్నారు. సినిమా పూర్తయ్యింది. ఆ తర్వాత రెండోరోజుకి అనుకుంటా.. ఆఫీసుకి వెళితే, 10వేలు చేతిలో పెట్టారు. అయినా పట్టుబట్టి నేను ఆఫీసు చుట్టూ తిరిగేవాణ్ణి. నిజం చెప్పండి.. సిగ్గుపడాల్సిన విషయం కాదా ఇది.
మరి.. పాత్రకు తగ్గ పారితోషికం అడగాలని ఎప్పుడు తెలిసింది?
వేణుమాధవ్: ‘మెరుపు’ సినిమా చేస్తున్నప్పుడు డెరైక్టర్స్, ప్రొడ్యూసర్స్ దగ్గర మిగతా ఆర్టిస్టులు ఎలా నడుచుకుంటున్నారో చూసి, మనం చేస్తున్నది కరెక్ట్ కాదని గ్రహించి, నా బాడీ లాంగ్వేజ్‌ని మార్చుకున్నాను. అంతకు ముందు వరకు నా బాడీ లాంగ్వేజ్ చాలా పొగరుగా ఉండేది. లక్కీగా అప్పుడు ఇంత మీడియా లేదు. ఉండి ఉంటే... నా తీరు స్క్రోలింగ్‌లో వచ్చి ఉండేది. బ్రహ్మానందంగారి లాంటి సీనియర్స్‌ను చూసి, ఎలా ప్రవర్తించాలో నేర్చుకున్నాను. ఎంత పారితోషికం అడగాలో తెలుసుకున్నాను.
వందల నుంచి వేలకి.. అక్కణ్ణుంచి లక్షలకు మీ పారితోషికం పెరిగింది కాబట్టి ‘మనీ మేనేజ్‌మెంట్’ విషయంలో మీ అన్నయ్యల సహకారం తీసుకునేవారా?
వేణుమాధవ్: హండ్రెడ్ పర్సంట్ తీసుకునేవాణ్ణి. నేను కూడా బాధ్యతగానే వ్యవహరించేవాణ్ణి. అందుకే హైదరాబాద్‌లో పది ఇళ్లు కొనగలిగాను. పదెకరాల ఆస్తి ఉంది. ఆర్టిస్ట్‌గా నా వైభవాన్ని చూసి మా నాన్నగారు, ఇతర కుటుంబసభ్యులు ఆనందపడ్డారు. నాన్నగారు చనిపోయి ఇప్పటికి పదకొండేళ్లవుతోంది. నేనెందుకూ పనికిరానని అనుకునేవారు కాబట్టి.. నేను మంచి స్థాయికి వచ్చినందుకు బయటికి చెప్పకపోయినా అమ్మ దగ్గర చెప్పి సంతోషపడేవారు.
కమెడియన్‌గా ఓ రేంజ్‌కొచ్చిన తర్వాత ఇంకాఎత్తు ఉండి ఉంటే, అందంగా ఉండి ఉంటే ఏ హీరోనో అయ్యుండేవాణ్ణి అని ఎప్పుడైనా అనిపించిందా?
వేణుమాధవ్: మీరడిగినది నాకు బాగా నచ్చింది. హైట్ తక్కువ ఉన్నాను కాబట్టే.. ఇంత సంపాదించగలిగాను. హైటు ఉన్న హీరోలని తీసుకుందాం. వాళ్లు కామెడీ చేస్తే చూస్తారా? హీరోగానే చేయాలి. సంవత్సరానికి మాగ్జిమమ్ మూడు, నాలుగు చిత్రాలు చేస్తారేమో. కానీ, నేను ఏడాదికి 40, 50 సినిమాలు చేసిన రోజులున్నాయి. రోజుకి లెక్కలేనన్ని లొకేషన్స్‌లో వేరే వేరే సినిమాలు చేసేవాణ్ణి. కారులోనే టిఫిను, భోజనం చేసేవాణ్ణి. ఓ పది, పదిహేనేళ్లు అలా చేశాను. కొంచెం అలసట అనిపించేది...కానీ మళ్లీ ఇలాంటిది రాదేమో అని ఎంత కష్టమైనా చేశాను.
సో... పొట్టివాడు గట్టివాడు అనొచ్చన్నమాట...
వేణుమాధవ్: అవును. ఒక విషయం చెబితే మీకు గమ్మత్తుగా ఉంటుంది. అల్లు రామలింగయ్యగారి నుంచి మొదలుపెడదాం. ఆయనకు, చిరంజీవిగారికి, రామ్‌చరణ్, చిరంజీవిగారి మేనల్లుడు సాయిధరమ్‌లకు ఫ్రెండ్‌గా చేశాను. ఇక, అక్కినేని నాగేశ్వరరావుగారికి, నాగార్జునగారికి, సుమంత్, నాగచైతన్య రాబోయే అఖిల్‌కీ నేనే ఫ్రెండ్‌ని అవుతా. తరాలు మారుతున్నా ఫ్రెండ్ మారడంలేదు. తాత, కొడుకు, మనవడికి ఫ్రెండ్‌గా చేయడం అంటే చిన్న విషయం కాదు. నా హైట్ వల్ల లాభం ఇదే. ఇంతకన్నా ఏం లాభం కావాలి?
నిర్మాతగా మారి, ‘ప్రేమాభిషేకం’ తీశారు. బాగా నష్టపోయినట్లున్నారు?
వేణుమాధవ్: అలా అనే అందరూ అనుకుంటున్నారు. ఆ సినిమాకి మహా అయితే కోటి రూపాయలు అయ్యుంటుంది. శాటిలైట్ రైట్సే 70 లక్షలు వచ్చింది. తక్కువలో తక్కువ అన్ని ఏరియాల్లో కలిపి నా సినిమా 30 లక్షలకు అమ్ముడుపోదా? నష్టం ఎందుకు వస్తుంది? ఒకవేళ కొంతమంది అనుకుంటున్నట్లు నష్టం వచ్చిందే అనుకున్నాం. నేనెక్కణ్ణుంచి వచ్చాను? ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేనేం తీసుకొచ్చాను? మా ఊళ్లో ఉన్న ఎకరాలు ఎకరాలు అమ్మి ఇక్కడకు రాలేదు కదా. నా గురించి కొంతమంది ఎక్కువ ఆలోచించి, ఏదేదో అనుకుంటారు. ఎవరి గురించి వాళ్లు ఆలోచించుకుంటే బెటర్.
మరి.. ఆ తర్వాత హీరోగా, నిర్మాతగా ఎందుకు సినిమా చెయ్యలేదు?
వేణుమాధవ్: మళ్లీ బ్రహ్మాండమైన కథ దొరికితే తప్పకుండా చేస్తా. అశ్లీలత లేకుండా నీట్‌గా ఉన్న స్టోరీ అయితే చేయడానికి రెడీ.
హడావిడిగా కారులోనే భోంచేసి, రకరకాల లొకేషన్స్ తిరిగి షూటింగ్‌లు చేసిన మీకు ఇప్పుడు మూడు, నాలుగు సినిమాలు మినహా లేకపోవడానికి కారణం ఏంటి?
వేణుమాధవ్: కారణం ఏం లేదు. ప్రస్తుతం రాష్ర్టంలో జరుగుతున్న తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాలే.
కానీ, మీ ఓవర్‌యాక్షన్ వల్లే సినిమాలు తగ్గాయనే టాక్ ఉంది...?
వేణుమాధవ్: ఎప్పుడైతే ఎదుటివాడు ఎక్కువ సినిమాలు చేసి, ఎక్కువ సంపాదిస్తున్నాడో అప్పుడు కొంతమంది దృష్టి వాడి మీద ఉంటుంది. నాకు తీరిగ్గా తినడానికి ఖాళీ లేక కార్లో భోంచేస్తూ వెళుతున్న సమయంలో, ఎవరైనా పలకరించారనుకోండి.. నేను మామూలుగా స్పందించి ఉండొచ్చు. అలాగే, కంటినిండా నిద్రపోయే టైమ్ దొరక్కపోవడంతో కారులోనే కునికి పాట్లు పడేవాణ్ణి. అప్పుడు ఎవరైనా పలకరిస్తే.. మామూలుగా మాట్లాడి ఉండొచ్చు. అది బలుపు అనుకుంటే నేనేం చేయగలను? అనుకున్నారు కదా అని నేను వాళ్లని ఏమీ అనడంలేదు. నేనేంటో నాకు తెలుసు.
‘నీ గురించి ఇలా అనుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండు’ అని చెప్పేంత స్నేహితులెవరూ మీకు ఇండస్ట్రీలో లేరా?
వేణుమాధవ్: హలో అంటే హలో అనే స్థాయి ఫ్రెండ్స్ ఉన్నారు. నా దుకాణం నాది. పొద్దున్నే వెళ్లడం, షాప్ ఓపెన్ చేసి, బిజినెస్ చేసుకోవడం. అయిపోగానే దుకాణాన్ని కట్టేయడం అంతే! నాకున్నది ముగ్గురే స్నేహితులు. మా ఆవిడ, నా ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుక్కి మా నాన్న పేరే పెట్టాలనుకుని, ‘ప్రభాకర్’ అని పెట్టా. మా అమ్మ పేరు సావిత్రి. అందుకని, రెండోవాడికి ‘సావికర్’ అని పెట్టాను.
మీ భార్య పట్ల అమానుషంగా ప్రవరిస్తారని, ‘శాడిస్ట్’ అనే టాక్ ప్రచారంలో ఉంది...?
వేణుమాధవ్: మీ ఎదురుగానే మా ఆవిడ ఉంది కదా.. తననే అడగండి.
మీకు ఇద్దరు భార్యలనే టాక్ ఉంది..?
వేణుమాధవ్: ఇద్దరుంటే ఇద్దరూ కనిపించేవారు కదా. నాకున్నది ఒక్క భార్యే.
మీ పెళ్లయ్యి ఎన్నేళ్లయ్యింది.. లవ్వా.. ఎరేంజ్డ్ మ్యారేజా?
వేణుమాధవ్: పన్నెండేళ్లు. మా మేనత్త కూతుర్ని పెళ్లి చేసుకున్నా. ఎరేంజ్డ్ మ్యారేజే.
పెళ్లయిన తర్వాత కట్నం కోసం వేధించారని టాక్?
వేణుమాధవ్: అవన్నీ నిజమైన మాటలు కావండీ. ఎదుగుతున్నవాడి మీద బురద జల్లడం అన్నమాట. అలాంటివి ఏవైనా జరిగి ఉంటే.. ఇక్కడ ఉండేవాణ్ణి కాదు కదా.. లోపల ఉండేవాణ్ణి.
మీకు సినిమాలు తగ్గడానికి కారణం రాష్ర్టంలో జరుగుతున్న ఉద్యమాలని చెప్పారు. అది నిజమైన కారణమేనా?
వేణుమాధవ్: నిజమైనదే. ‘ఆటోనగర్ సూర్య’ చేశాను. అది విడుదల కావాల్సి ఉంది. వెంకటేష్, రామ్ కాంబినేషన్‌లో చేసిన ‘మసాలా’ విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం ‘రుద్రమదేవి’ చేస్తున్నాను. ఇంకొన్ని ఉన్నాయి.
మీరు షూటింగ్స్‌కి సరిగ్గా రారనే విమర్శ ఉండటంవల్ల సినిమాలు తగ్గాయని కొంతమంది అంటుంటారు..?
వేణుమాధవ్: నేను ఉంటున్నది మౌలాలీలో. ఇక్కణ్ణుంచి ఫిల్మ్‌నగర్‌కి రావడానికి కొంత సమయం పడుతుంది. ఒక్కోసారి ట్రాఫిక్‌లో ఇరుక్కున్నప్పుడు పావుగంట, అర్ధగంట లేట్ అయ్యుండొచ్చు. అంతే.. అయినా నా వల్ల ఇబ్బంది కలిగిందని ఒక్క నిర్మాతని అయినా చెప్పమనండి.
మీరు అంతులేని వ్యాధితో బాధపడుతున్నారని.. అందుకే సినిమాలు తగ్గాయన్నది కూడా కొంతమంది ఊహ...
వేణుమాధవ్: అది పచ్చి అబద్ధం. మీరు ఏ డాక్టర్‌ని అయినా తీసుకొచ్చి, పరిక్షలు చేయించవచ్చు. నేను రెడీగా ఉన్నాను.
మరి.. ఎందుకు వీక్ అయ్యారు?
వేణుమాధవ్: డైటింగ్ చేయడంతో బరువు తగ్గాను. హీరోలు తగ్గితే సిక్స్‌ప్యాక్ అంటారు. నేను తగ్గితే అంతులేని వ్యాధా? ప్రపంచంలో లేని జబ్బులు కూడా అంటగడతారు. ఇదెక్కడి న్యాయం?
డైటింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది?
వేణుమాధవ్: చిరంజీవిగారు, పవన్‌కళ్యాణ్‌గారు, నాగబాబుగారితో చేస్తున్నప్పుడు ఒకేలా ఉన్నాను. కానీ, రామ్‌చరణ్‌తో చేసేటప్పుడూ ఒకేలా ఉంటే ఏం బాగుంటుంది? నాగేశ్వరరావుగారు, నాగార్జునగారి పక్కన ఒకేలా కనిపిస్తే ఓకే. కానీ, నాగచైతన్యకీ ఫ్రెండ్ అంటే నమ్మేలా ఉండాలి కదా. తరాలు మారినా ఫ్రెండ్ కేరక్టర్స్ చేయాలంటే మౌల్డ్ అవ్వక తప్పదు. అందుకే ఈ డైటింగ్. ఆరోగ్యం గురించి ఎక్కువ జాగ్రత్త తీసుకోవడంవల్ల ఇదిగో ఇలా బక్కగా అయ్యాను.
సేవా కార్యక్రమాలు కూడా బాగా చేస్తారట?
వేణుమాధవ్: మా ఇంట్లో ఎవరి బర్త్‌డేకి కేక్స్ కట్ చేసుకునే అలవాటు లేదు. అనాథశరణాలయాల్లో, వృద్ధాశ్రమాల్లో చేసుకుంటాం. ఎవరైనా ఆపదలో ఉంటే ఆర్థిక సహాయం చేస్తుంటాను. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నాన్నగారి సంస్మరణార్ధం అమ్మ పేరు పెట్టి కళ్యాణ మండపం, కళా వేదిక కట్టించాను. గాంధీగారి విగ్రహాలు పెట్టించాను. వేణుమాధవ్ చారిటబుల్ ట్రస్ట్, వేణుమాధవ్ ఫ్రెండ్స్ సర్కిల్ పేర్లతో సేవాకార్యక్రమాలు చేస్తుంటాం.
ప్రస్తుతం మీ ఆశయం ఏంటి?
వేణుమాధవ్: సినిమాలపరంగా ఏ ఆశయం లేదు. వ్యక్తిగతంగా మాత్రం వీలైనంతవరకు చాలా మందికి సహాయపడాలన్నదే నా ఆశయం. నేను లక్ష అడిగితే ఆ భగవంతుడు ఎన్నో లక్షలిచ్చాడు. ఇక ఇంతకు మించి ఏదైనా ఆశిస్తే.. ఆ భగవంతుడు కూడా క్షమించడు. ఇంకా కోరికలు కోరి, ఆ భగవంతుడి ఆగ్రహానికి గురి కాదల్చుకోలేదు. ఆయనకు ప్రియభక్తుడిగానే ఉండిపోతా. నేను తినడానికి నాకు దేవుడు ఎంతో ఇచ్చాడు. నాతో పాటు నలుగురికీ పెట్టగలిగే శక్తి ఇచ్చాడు. జీవితానికి ఇంతకు మించి ఇంకేం కావాలి?
- డి.జి. భవాని
సంవత్సరానికి 40, 50 సినిమాలు చేసి, బంజారా హిల్స్, జూబ్లి హిల్స్‌లాంటి రిచ్ ఏరియాల్లో ఉండే స్థాయికి చేరుకున్నారు. కానీ, సిటీగా దూరంగా ఉండే మౌలాలిలో ఉండటానికి కారణం ఏంటి?
వేణుమాధవ్: నాకున్న పది ఇళ్లూ మౌలాలీ హౌసింగ్‌బోర్డ్‌లోనే ఉన్నాయి. మా అన్నయ్యలు, అక్క, చెల్లి, నేను... అంతా ఇదే ఏరియాలో ఉంటాం. ఇంకా మా బంధువులు చాలామంది ఉన్నారు. ప్రతిరోజూ మా ఇళ్లల్లోని ఆడవాళ్లు ఫోన్లు చేసుకుని, ‘ఏం కూర చేస్తున్నావ్.. నేను ఫలానాది వండుతున్నా. నువ్వు వేరే చెయ్యి’ అని చెప్పుకుంటారు. ఎవరింట్లో అయినా మహా అయితే రెండు, మూడు కూరలు ఉంటాయేమో.. కానీ మా ఇంట్లో మాత్రం రోజుకి ఎనిమిది రకాల కూరలు ఉంటాయి. నా పిల్లలు బయటికెళితే తప్పిపోతారనే భయం లేదు. ఈ ఏరియాలో ఉన్న మా బంధువులే కాదు.. వేరేవాళ్లు కూడా ‘వేణుమాధవ్ పిల్లలు’ అంటూ.. ఇంటికి తీసుకొచ్చి మరీ వదిలిపెడతారు. ఈ సెక్యూరిటీ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఇంకో విషయం చెబుతాను. జూబిలీహిల్స్‌లో ఎవరున్నారు? చిరంజీవిగారు. ఆ ఏరియాకు ఆయన మెగాస్టార్. నేను మౌలాలీ మెగాస్టార్‌ని. నేను ఫిల్మ్‌నగర్‌లో ఉంటే.. నా ఇల్లెక్కడో ఎవరికీ తెలియకపోవచ్చు. ఒకవేళ తెలిసినా, వేణుమాధవ్ ఇల్లు అంటారు. కానీ, మౌలాలీలో ‘వేణన్నా..’ అంటూ ఆప్యాయంగా పిలవడానికి బోల్డంత మంది ఉన్నారు. ఈ ఏరియాలోకి ఎంటరవ్వగానే, వేణుమాధవ్ ఇల్లెక్కడ? అని ఎవర్ని అడిగినా.. చెప్పేస్తారు.
***************
కొన్ని సందర్భాల్లో ఆడియన్స్‌ని నవ్వించడానికి కమెడియన్స్ జోకర్స్‌గా మారాల్సి ఉంటుంది. డబుల్ మీనింగ్ డైలాగులూ చెప్పాల్సి ఉంటుంది. అప్పుడెలా ఫీలయ్యారు?
వేణుమాధవ్: దేవుడి దయ వల్ల జోకర్‌గా మారే పరిస్థితి రాలేదు. అలాగే స్త్రీలను అవమానరపరిచేలా ఉండే డైలాగులు కూడా చెప్పిన దాఖలాలు ఉండవు. చెప్పాల్సి వచ్చినప్పుడు లొకేషన్ నుంచి బయటికెళ్లిన సందర్భాలున్నాయి. అందుకని వేణుమాధవ్‌కి బలుపు అన్నవాళ్లు ఉన్నారు. నాలోనూ మంచి రచయిత ఉన్నాడు. అవసరమైతే నేనే మంచి డైలాగులు రాసిస్తానని కూడా కొంతమందితో చెప్పా. వాళ్లిచ్చిన డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పడానికి నిరాకరించా. ఒకవేళ నన్ను ఒత్తిడి చేస్తే, ‘ఇది మీ ఫ్యామిలీకి చూపించండి. మీ ఇంట్లో ఆడవాళ్లు ఒప్పుకుంటే చేస్తా’ అని చెబుతుంటా. ఒక్క డైలాగే కదా అని చెప్పేయొచ్చు. కానీ, ఆ తర్వాత టీవీలో ఆ సినిమా వచ్చినప్పుడల్లా మా అమ్మ, నా అక్కచెల్లెళ్లు, నా భార్య, వదినలు.. అందరూ చూస్తారు. ఇబ్బందిపడతారు. అందుకని లేడీస్‌ని అవమానపరిచే సీన్స్ చెయ్యనని చెప్పేస్తాను.
పెద్ద హీరోల సినిమాల విషయంలోనూ అలా చేసిన సందర్భాలున్నాయా?
వేణుమాధవ్: కొన్ని ఉన్నాయి.
అలా చేస్తే అవకాశాలు కోల్పోతానని అనుకోలేదా?
వేణుమాధవ్: పోతే పోనివ్వండి. పెద్ద హీరో ఏడాదికి ఎన్ని సినిమాలు చేస్తాడు? మహా అయితే నాలుగైదు. అవి పోయినంత మాత్రాన నాకేం ఇబ్బంది లేదు. ఆ రెండు సినిమాలకు కేటాయించే సమయాన్ని నా ఫ్యామిలీకి కేటాయిస్తాను.
మీ పిల్లలను సినిమాల్లోకి తీసుకొచ్చే ఆలోచన ఉందా?
వేణుమాధవ్: అస్సలు లేదు! నేను పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదని. షూటింగ్స్‌తో బిజీగా ఉండటంవల్ల ప్రతి రోజూ రాత్రి ఒంటి గంటకు ఇంటికి రావడం, ఉదయం షూటింగ్‌కి వెళ్లడం.. దాదాపు నా జీవితం ఇలానే సాగింది. నా పిల్లలు అలా కాకుండా టెన్ టూ ఫైవ్ జాబ్ చేసుకుని, హాయిగా ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే, నేను లేట్‌గా ఇంటికి రావడం, ఉదయమే వెళ్లిపోవడం చూసి, నాన్నగారు చాలా బాధపడేవారు.
****************
నటుడిగా అవకాశం ఇచ్చింది కృష్ణారెడ్డిగారు, అచ్చిరెడ్డిగారు. ‘హంగామా’ ద్వారా హీరోని చేసిందీ ఆ ఇద్దరే! అందుకే నా ఇంటికి ‘అచ్చి వచ్చిన కృష్ణ నిలయం’ అని పేరు పెట్టుకున్నాను. నా పదిళ్లకూ అదే పేరు. మౌలాలీలో ఈ పేరుతో ఉన్న ఇల్లు ఎవరిది? అని ఎవర్ని అడిగినా, ‘వేణుమాధవ్’ది అని చెబుతారు. వాళ్లు ఇంకా నాకెలాంటి రోల్స్ ఇస్తానన్నా నేను రెడీ. ఒకవేళ ఇప్పటికప్పుడు పిలిచి ‘సినిమాలు మానేయ్’ అన్నా, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మానేస్తా! వాళ్లంటే నాకంత అభిమానం, గురి!