tarantarangam
-
నేను మౌలాలి మెగాస్టార్‌ని!
ఒక్క ఫ్రెండు... వేణుమాధవ్ లాంటి ఒక్క ఫ్రెండు... ఉంటే చాలు. ఎంత పెద్ద స్టార్ యాక్టర్‌కైనా పక్కన పెద్ద సపోర్ట్! అల్లు రామలింగయ్య, చిరంజీవి, రామ్‌చరణ్ నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య ఫర్ ఎవ్రీ జనరేషన్... మిత్ర ‘పాత్రుడు’ వేణుమాధవ్! ఇక ఆయన రుబాబ్ కామెడి... అదొక కొత్త ఒరవడి! చేతులు తలపెకైత్తి, సైడుకి ఒక్క లుక్ ఇచ్చాడంటే... ఆడియన్స్ తుకడాల్, తుకడాల్!! ప్రదీప్ రావత్, తెలంగాణ శకుంతల... ఎవరైనా... లెక్క చేసేదే లేదు. ‘నల్లబాలు’ లెక్క! సినిమా ఛాన్స్ వస్తే... ‘‘వద్దొద్దు, ప్రోగ్రామ్స్ ఇప్పించండి చాలు’’ అని తప్పుకుని తప్పుకుని తిరిగిన ఈ ‘జూనియర్ నేరెళ్ల’... చివరికి ఈ ఫీల్డులో ఎలా సెటిలయ్యారు? ఇప్పుడెందుకు మళ్లీ దూరమైనట్లు కనిపిస్తున్నారు?! చదవండి... ఈవారం ‘తారాంతరంగం’. మీ చిన్ననాటి తీపి గుర్తులు? వేణుమాధవ్: నాకేం తీపి గుర్తులు లేవు. నాది ఉగాది పచ్చడిలాంటి జీవితం. మాది నల్గొండజిల్లాలోని కోదాడ. పుట్టింది, పెరిగింది, చదివింది అక్కడే. కాలేజీ చదువు మాత్రం బాలాజీనగర్ తండాలో. ప్రతి రోజూ అప్ అండ్ డౌన్ ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్లేవాణ్ణి. మీ నాన్నగారు ఏం చేసేవారు? వేణుమాధవ్: టెలిఫోన్ డిపార్ట్మెంట్లో లైన్ ఇన్స్పెక్టర్. అమ్మ ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్‌గా చేసేవారు. మేం ఐదుగురం. అక్క, ఇద్దరన్నయ్యలు, తర్వాత నేను. నా తర్వాత చెల్లి. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చిన్నప్పుడు మీరు బాగా అల్లరి చేసేవారా? వేణుమాధవ్: అమ్మానాన్న తట్టుకోలేనేంత చేసేవాణ్ణి. స్కూల్‌కి సరిగ్గా వెళ్లేవాణ్ణి కాదు. సరిగ్గా చదువుకునేవాణ్ణి కాదు. అప్పట్లో ఓ సినిమా విడుదలవుతోందంటే, రిక్షాలో ఎనౌన్స్మెంట్ చేసేవాళ్లు. రిక్షా కనబడగానే నేనే ఎక్కి, అనౌన్స్ చేసేసేవాణ్ణి. డప్పులోళ్లు కనిపిస్తే.. వాళ్ల వెంటపడి డప్పులు కొట్టడం, పిల్లలతో గోలీలాడటం.. ఇలా నా అల్లరికి అంతుండేది కాదు. మా పిల్లలందరిలోనూ ఎక్కువగా తన్నులు తిన్నది నేనే. మా కుటుంబంలో నా మీద ఎలాంటి నమ్మకం ఉండేది కాదు. ఎందుకూ పనికి రానివాడని అనుకునేవారు. చదువులో వీక్. మరి, పరీక్షల సంగతేంటి? వేణుమాధవ్: టెన్త్ క్లాస్ రెండుసార్లు చదివా. అసలీ చదువుని ఎవరు కనిపెట్టారా? అని నానా రకాలుగా తిట్టుకునేవాణ్ణి. చదవకపోతే ఇంట్లో, స్కూల్లో కొడతారు. ఎందుకొచ్చిన గొడవ అనుకునేవాణ్ణి. సరే.. ఇంతకూ మిమిక్రీలోకి ఎలా ఎంటరయ్యారు? వేణుమాధవ్: నేను చిన్నప్పట్నుంచీ స్కూల్లో టీచర్లనీ స్నేహితుల్నీ, మా అమ్మ దగ్గరకు వైద్యానికి వచ్చే పేషెంట్లనీ అనుకరించేవాణ్ణి. అయితే దాన్ని మిమిక్రీ అంటారన్న సంగతి నాకు తెలియదు. నేను సెవెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు ఫేమస్ మిమిక్రీ ఆర్టిస్ట్ నేరెళ్ల వేణుమాధవ్‌గారు మా కోదాడలో ఓ మ్యారేజ్ ఫంక్షన్లో ప్రోగ్రామ్ చేశారు. అప్పుడు నేను చేసేది మిమిక్రీ అనే సంగతి నాకర్థమైంది. అప్పట్నుంచీ ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ఎక్కువగా మిమిక్రీ చేసేవాణ్ణి. మిమిక్రీ మీ జీవితానికి మలుపవుతుందనుకున్నారా? వేణుమాధవ్: అస్సలు లేదు. అయితే మిమిక్రీని ఓ ప్రొఫెషన్‌గా తీసుకున్నది మాత్రం ఇంటర్‌లోనే. అప్పుడు ప్రతి ఏడాది హైదరాబాద్‌లో జరిగే గణేష్ ఉత్సవాల్లో మిమిక్రీ చేయడానికి ఇక్కడికి వచ్చేవాణ్ణి. డిగ్రీ అయిన తర్వాత ముంబయ్ వెళ్లి ‘టాకింగ్ డాల్’ తెచ్చుకుని, ప్రోగ్రామ్ చేయడం మొదలుపెట్టాను. టాకింగ్ డాల్ తెచ్చుకోవాలని ఎందుకనిపించింది? వేణుమాధవ్: శ్రీనివాస్ అనే మిమిక్రీ ఆర్టిస్ట్ దగ్గర చూసి, తెచ్చుకున్నాను. నాకు నేనుగా వెంట్రిలాక్విజమ్ నేర్చుకుని ప్రోగ్రామ్స్ చేయడం మొదలుపెట్టాను. టాకింగ్ డాల్ అంటే చాలా ఖరీదు కదా? వేణుమాధవ్: నిజమే. అప్పట్లో దాని విలువ ఐదువేల ఎనిమిదివందల రూపాయలు. అది కొనడానికి నేను మామూలు ఇబ్బందులు పడలేదు. ఇంట్లోవాళ్లు, నా ఫ్రెండ్స్ సహాయంతో కొనుక్కున్నాను. మిమిక్రీలో జూనియర్ వేణుమాధవ్ అనిపించుకున్నారు.. ఎలా అనిపిస్తోంది? వేణుమాధవ్: నేరెళ్ల వేణుమాధవ్‌గారి ఏకలవ్య శిష్యుణ్ణి. కొన్ని వందల సార్లు ఆయన్ను కలిశాను. ‘అరేయ్.. నువ్వు స్ప్రింగులు మింగావురా..’ అని మెచ్చుకునేవారు. ‘నువ్వు కచ్చితంగా సినిమా యాక్టర్ అవుతావు’ అని కూడా అనేవారు. అంతటి మహానుభావుడితో పోల్చి, జూనియర్ వేణుమాధవ్ అనే పేరు తెచ్చుకుంటానని కలలో కూడా ఊహించలేదు. ఆ టాకింగ్ డాలే మిమ్మల్ని ఎన్టీఆర్ వరకూ తీసుకెళ్లింది కదూ? వేణుమాధవ్: అవును. నేను చదువుకున్న గవర్నమెంట్ స్కూల్లో అప్పటి కోదాడ ఎమ్మెల్యే చందర్రావుగారు, కలక్టర్‌గారు, ఇంకా పలువురు ప్రముఖుల సమక్షంలో టాకింగ్ డాల్ని ఇంట్రడ్యూస్ చేశాను. ఆ ప్రోగ్రామ్ చందర్రావుగారికి నచ్చి, భువనగిరిలో తెలుగుదేశం పార్టీ మీటింగ్‌కి తీసుకెళ్లారు. అక్కడ మాధవరెడ్డిగారు, చంద్రబాబునాయుడుగారు నా టాకింగ్ డాల్ ప్రదర్శన చూసి, ‘మహానాడులో నువ్వు ప్రోగ్రామ్ చేయాలి’ అన్నారు. ఎన్టీ రామారావుగారి సమక్షంలో ఆరు లక్షల మంది ముందు పోగ్రామ్ చేశా. నా జీవితంలో ఊహించని మలుపు అది. ఆ రోజు సాయంత్రం ప్రోగ్రామ్ అంటే.. మధ్యాహ్నమే నన్ను స్టేజి మీద కూర్చోబెట్టారు. అందరూ మాట్లాడిన తర్వాత, ఎన్టీఆర్‌గారు మాట్లాడే ముందు, నాతో ప్రోగ్రామ్ చేయించారు. అప్పుడు ఎన్టీఆర్‌గారు నా భుజం మీద చెయ్యేసి, ‘మీ సేవలు మాకెంతో అవసరం బ్రదర్’ అంటూ హిమాయత్‌నగర్ తెలుగు దేశం పార్టీ ఆఫీసులో చేర్చుకున్నారు. అక్కణ్ణుంచీ అసెంబ్లీలోని టీడీపీ లెజిస్లేటివ్ కార్యాలయంలో చేర్చారు. నాకంతా అయోమయంగా ఉండేది. సరే.. డబ్బులు బాగానే ఇస్తారనే ఊహతో చేరాను. ఆ ఊహ నిజమైందా? వేణుమాధవ్: నెలకు ఆరువందలు ఇచ్చేవారు. ఆ తర్వాత ఎనిమిది వందలు. 1994 నుంచి 96 వరకు అక్కడే చేశాను. సినిమాల్లోకి ఎలా వచ్చారు? వేణుమాధవ్: అప్పుడు నేను, మిమిక్రీ శ్రీనివాస్‌గారు, జనార్ధన్, కోలా... అని మేమందరం ఆకృతి సంస్థ నిర్వహించే ప్రోగ్రామ్స్ చేసేవాళ్లం. నాకు సెకండ్ హ్యాండ్ బజాజ్ 150 ఉండేది. పెట్రోలు ఖర్చులు కలిసొస్తాయని నలుగురూ ఒకే వాహనం మీద వెళ్లేవాళ్లం. ఓసారి రచయిత దివాకర్బాబుగారికి రవీంద్రభారతిలో సన్మానం జరిగితే, ఎస్వీ కృష్ణారెడ్డిగారు, అచ్చిరెడ్డిగారు వచ్చారు. మేం చేసిన ప్రోగ్రామ్ చూసి, ఫోన్‌నంబర్ ఇచ్చి, మర్నాడు ఆఫీసుకు వచ్చి కలవమన్నారు. సినిమాలు చూడ్డమే తప్ప నాకు సినిమా మీద కొంచెం కూడా జ్ఞానం లేదు. సినిమాల్లో నటించాలనే ఇంట్రస్ట్ లేదు. సరే.. రమ్మన్నారు కదా అని వెళ్లాలనుకున్నాను. ఫిల్మ్‌నగర్‌లో అడుగుపెట్టింది అప్పుడేనా? వేణుమాధవ్: అవును. ఆఫీసు వెతుక్కుంటూ వెళ్లి, కలిశాను. ‘నువ్వు స్టేజ్ మీద ఏదైతే చేశావో.. సినిమాలో అదే చెయ్యాలి’ అన్నారు. ‘నాకు సినిమా అంటే తెల్వదు సార్.. మనకు ఎరక లేదు. ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే చెప్పండి. ఒక్కో ప్రోగ్రామ్‌కి ఇంత అని తీసుకుంటా’ అని ఇదే స్లాంగ్‌లో చెప్పా. ‘కాదు.. కాదు.. ఆలోచించుకో’ అన్నారు. ఇంటికొచ్చి అమ్మకి చెబితే.. ‘పిచ్చోడా.. సినిమా అంటే చిన్న విషయం కాదు. చేస్తానని చెప్పు’ అని చెప్పింది. ఆ తర్వాత అమ్మ మా ఊరు వెళ్లిపోయింది. దాంతో నేను కృష్ణారెడ్డిగార్ని కలవాలనే ఆలోచనను వదిలేశా. కానీ ఊరెళ్లిన తర్వాత కూడా అమ్మ వదల్లేదు. అప్పట్లో నా రూమ్‌లో ల్యాండ్‌లైన్ కూడా లేదు. పక్కింటికి ఫోన్ చేసి మరీ, ‘వెళ్లకుండా ఉండొద్దు’ అని అమ్మ పదే పదే చెప్పడంతో, బాధ భరించలేక వెళ్లాను. నేను మళ్లీ అదే పాట.. ‘పబ్లిక్ మీటింగ్ అయితే చేస్త కానీ.. ఇట్టాంటివి నడ్వదు సార్. సినిమా అంటే నాకు తెల్వదు’ అన్నాను. జనరల్‌గా వేరే దర్శక, నిర్మాతలెవరైనా వద్దంటారు. కానీ, కృష్ణారెడ్డిగారు, అచ్చిరెడ్డిగారు ‘మేం చూసుకుంటాం..’ అని హామీ ఇచ్చారు. ఎలాగూ బతిమాలుతున్నారు కదా అని, క్యాష్ చేసుకుందామని, అయితే ‘ఆర్ నైతో పార్’.. వస్తే డబ్బులొస్తాయ్ లేకపోతే సినిమా చేయకుండా తప్పించుకోవచ్చని, లెవల్‌గా ‘ఎన్ని రోజులు కావాల’ అనడిగాను. అరవై, డెబ్భైరోజులు కావాలంటే, 70వేలు అడిగాను. ఆ సినిమాకి నిర్మాత అన్నారావుగారు. ఆయనతో మాట్లాడతామని చెప్పారు. ‘వాళ్లతో వీళ్లతో నాకు సంబంధం లేదు.. నాకు పైసల్ కావాల్సిందే’ అంటే, ఓకే అన్నారు. ఆ విధంగా ‘సంప్రదాయం’ సినిమాకి మొదటిసారి మేకప్ వేసుకున్నా. సరే... షూటింగ్ వాతావరణం ఎలా అనిపించింది? వేణుమాధవ్: కృష్ణగారు, ఇంకొంతమంది ఆర్టిస్టులు, నా కాంబినేషన్లో మొదటిరోజు షూటింగ్ స్టార్ట్ చేశారు. లొకేషన్‌కి వెళ్లగానే, టిఫిన్ తినమన్నారు. కానీ, నేను బయటికెళ్లి, హోటల్లో తినొచ్చాను. ఆ తర్వాత ఒంటి గంటకి బ్రేక్ అన్నారు. అంటే ఏంటో తెలియదు. అందరికీ భోజనం పెడుతుంటే, లంచ్ టైమ్ అనుకుని బయటికెళ్లి భోజనం చేసొచ్చాను. నన్నూ తినమన్నారు. అక్కడ భోంచేస్తే, ఇచ్చే డబ్బుల్లో కట్ చేస్తారని భయం. ఇలా రెండు రోజులు గడిచాయి. మూడో రోజు ‘ఏవయ్యా.. ఎటు వెళుతున్నావ్’ అని ప్రొడక్షన్‌వాళ్లు అడిగితే, తినడానికని చెప్పా. ‘ఎందుకు? ఇక్కడ పెడుతున్నాంగా.. ఫ్రీయే’ అన్నాడు. అంతే.. నా ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి, రమ్మన్నాను. నాలుగు రకాల పచ్చళ్లు, కూరలు.. బ్రహ్మాండమైన భోజనం. ఓ పట్టు పట్టేవాళ్లం. లైఫ్ చాలా హాయిగా అనిపించింది. పర్టిక్యులర్‌గా 70వేలు పారితోషికం అడగాలని ఎందుకనిపించింది? వేణుమాధవ్: లక్ష రూపాయలు సాధించాలన్నది నా జీవితాశయం. అందుకే 70 వేలడిగాను. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. సినిమా మొత్తం పూర్తయ్యాక, డబ్బింగ్ చెప్పాలి రమ్మంటూ ఓ రోజు కారు పంపించారు. డబ్బింగ్ అంటే ఏంటో నాకస్సలు తెలియదు. సరే.. థియేటర్‌కి వెళ్లాను. స్క్రీన్ మీద నా బొమ్మ చూసుకుంటూ.. డబ్బింగ్ చెప్పాలి. ఫస్ట్ టైమ్ స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవడంతో ఎగ్జయిట్ అయిపోయాను. అలా చూస్తూ నిలబడిపోయాను. అలా పదిసార్లు జరిగింది. నోరెళ్లబెట్టి చూడటం తప్ప మాటలు మాట్లాడటంలేదు. రామ్గోపాల్రెడ్డిగారని ఎడిటర్‌గారు... ఇలా అయితే లాభం లేదని, రేపు డబ్బింగ్ చెబుదువుగాని అన్నారు. మర్నాడు కూడా అదే తంతు. మూడు, నాలుగో రోజు కూడా అంతే. నా బొమ్మ చూసుకోగానే.. భలే ఉన్నామే అనుకోవడం తప్ప డబ్బింగ్ చెప్పడంలేదు. రామ్‌గోపాల్‌గారికి నేను చెప్పనని అర్థమైంది. దాంతో కాదంబరి కిరణ్‌గారితో చెప్పించారు. లక్ష రూపాయల జీవితాశయం ఏంటి? వేణుమాధవ్: బీకామ్ చేసిన తర్వాత సీఏ చదవాలని విపరీతమైన కోరిక. కోదాడలో సీఏ లేదు. అప్పుడు హైదరాబాద్‌లో కూడా లేదు. సీఏ చేయాలంటే చెన్నయ్ వెళ్లాలి. ఫీజు మాత్రమే లక్ష రూపాయలు కట్టాలి. ఎలాగైనా సీఏ చేయాలన్నది ఆశయం. మా అమ్మానాన్నలకు ఐదుగురు సంతానం. ఐదుగుర్నీ చదివించడం, పెంచడం చిన్న విషయం కాదు. ఇక, లక్ష రూపాయలు ఎక్కడ కడతాం? లక్ష లేకపోవడంతో సీఏ చేయలేకపోయాం కదా.. అందుకే ఎప్పటికైనా లక్ష రూపాయలు సంపాదించాలనుకున్నా. అదేంటి.. చదువంటే అసహ్యం అన్నారు.. సీఏ చేయాలనుకోవడం ఆశ్చర్యంగా ఉందే? వేణుమాధవ్: టెన్త్ ఎప్పుడైతే రెండుసార్లు రాశానో అప్పుడే నాకే ఏదోలా అనిపించింది. ఇంటర్లోకొచ్చాక చదువంటే ఇంట్రస్ట్ ఏర్పడింది. సెకండ్ క్లాస్ తెచ్చుకున్నా. బీకామ్ వచ్చేటప్పటికి ఇంకా ఇంట్రస్ట్ ఏర్పడింది. అప్పుడే సీఏ యాంబిషన్ కలిగింది. సరే... మళ్లీ సినిమాల్లోకొద్దాం. ‘సంప్రదాయం’ విడుదలైన తర్వాత వెంటనే అవకాశాలు వచ్చాయా? వేణుమాధవ్: ఆ సినిమా జనవరి 14న విడుదలయ్యింది. 10, 11న చెన్నయ్‌లో ప్రివ్యూ వేశారు. ఆ ప్రివ్యూ చూసిన కొంతమంది నిర్మాతలు అవకాశం ఇచ్చారు. మొదటి సినిమా రిలీజ్ అవకముందే పాపులర్ అయ్యాను. శ్రీకారం, మెరుపు.. ఇలా బోల్డన్ని సినిమాలకు అవకాశం వచ్చింది. ఒక్క సినిమా కూడా విడుదలవ్వక ముందే బిజీ అవడం అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. వెంటనే పారితోషికం పెంచేశారా? వేణుమాధవ్: ‘శ్రీకారం’ సినిమాలో నాది హాఫ్ డే కేరక్టర్. మనిషి ఆశాజీవి. అది కూడా తెలియనితనం ఉన్న మనిషైతే మితిమీరి ప్రవర్తిసాడు. అప్పట్లో నా తెలియనితనంతో ఒక్క రోజుకి 70వేలు పారితోషికం అడిగా. నిర్మాతగారు సరే... నేను మాట్లాడతాలే అన్నారు. సినిమా పూర్తయ్యింది. ఆ తర్వాత రెండోరోజుకి అనుకుంటా.. ఆఫీసుకి వెళితే, 10వేలు చేతిలో పెట్టారు. అయినా పట్టుబట్టి నేను ఆఫీసు చుట్టూ తిరిగేవాణ్ణి. నిజం చెప్పండి.. సిగ్గుపడాల్సిన విషయం కాదా ఇది. మరి.. పాత్రకు తగ్గ పారితోషికం అడగాలని ఎప్పుడు తెలిసింది? వేణుమాధవ్: ‘మెరుపు’ సినిమా చేస్తున్నప్పుడు డెరైక్టర్స్, ప్రొడ్యూసర్స్ దగ్గర మిగతా ఆర్టిస్టులు ఎలా నడుచుకుంటున్నారో చూసి, మనం చేస్తున్నది కరెక్ట్ కాదని గ్రహించి, నా బాడీ లాంగ్వేజ్‌ని మార్చుకున్నాను. అంతకు ముందు వరకు నా బాడీ లాంగ్వేజ్ చాలా పొగరుగా ఉండేది. లక్కీగా అప్పుడు ఇంత మీడియా లేదు. ఉండి ఉంటే... నా తీరు స్క్రోలింగ్‌లో వచ్చి ఉండేది. బ్రహ్మానందంగారి లాంటి సీనియర్స్‌ను చూసి, ఎలా ప్రవర్తించాలో నేర్చుకున్నాను. ఎంత పారితోషికం అడగాలో తెలుసుకున్నాను. వందల నుంచి వేలకి.. అక్కణ్ణుంచి లక్షలకు మీ పారితోషికం పెరిగింది కాబట్టి ‘మనీ మేనేజ్మెంట్’ విషయంలో మీ అన్నయ్యల సహకారం తీసుకునేవారా? వేణుమాధవ్: హండ్రెడ్ పర్సంట్ తీసుకునేవాణ్ణి. నేను కూడా బాధ్యతగానే వ్యవహరించేవాణ్ణి. అందుకే హైదరాబాద్‌లో పది ఇళ్లు కొనగలిగాను. పదెకరాల ఆస్తి ఉంది. ఆర్టిస్ట్‌గా నా వైభవాన్ని చూసి మా నాన్నగారు, ఇతర కుటుంబసభ్యులు ఆనందపడ్డారు. నాన్నగారు చనిపోయి ఇప్పటికి పదకొండేళ్లవుతోంది. నేనెందుకూ పనికిరానని అనుకునేవారు కాబట్టి.. నేను మంచి స్థాయికి వచ్చినందుకు బయటికి చెప్పకపోయినా అమ్మ దగ్గర చెప్పి సంతోషపడేవారు. కమెడియన్‌గా ఓ రేంజ్కొచ్చిన తర్వాత ఇంకాఎత్తు ఉండి ఉంటే, అందంగా ఉండి ఉంటే ఏ హీరోనో అయ్యుండేవాణ్ణి అని ఎప్పుడైనా అనిపించిందా? వేణుమాధవ్: మీరడిగినది నాకు బాగా నచ్చింది. హైట్ తక్కువ ఉన్నాను కాబట్టే.. ఇంత సంపాదించగలిగాను. హైటు ఉన్న హీరోలని తీసుకుందాం. వాళ్లు కామెడీ చేస్తే చూస్తారా? హీరోగానే చేయాలి. సంవత్సరానికి మాగ్జిమమ్ మూడు, నాలుగు చిత్రాలు చేస్తారేమో. కానీ, నేను ఏడాదికి 40, 50 సినిమాలు చేసిన రోజులున్నాయి. రోజుకి లెక్కలేనన్ని లొకేషన్స్‌లో వేరే వేరే సినిమాలు చేసేవాణ్ణి. కారులోనే టిఫిను, భోజనం చేసేవాణ్ణి. ఓ పది, పదిహేనేళ్లు అలా చేశాను. కొంచెం అలసట అనిపించేది...కానీ మళ్లీ ఇలాంటిది రాదేమో అని ఎంత కష్టమైనా చేశాను. సో... పొట్టివాడు గట్టివాడు అనొచ్చన్నమాట... వేణుమాధవ్: అవును. ఒక విషయం చెబితే మీకు గమ్మత్తుగా ఉంటుంది. అల్లు రామలింగయ్యగారి నుంచి మొదలుపెడదాం. ఆయనకు, చిరంజీవిగారికి, రామ్‌చరణ్, చిరంజీవిగారి మేనల్లుడు సాయిధరమ్‌లకు ఫ్రెండ్‌గా చేశాను. ఇక, అక్కినేని నాగేశ్వరరావుగారికి, నాగార్జునగారికి, సుమంత్, నాగచైతన్య రాబోయే అఖిల్‌కీ నేనే ఫ్రెండ్‌ని అవుతా. తరాలు మారుతున్నా ఫ్రెండ్ మారడంలేదు. తాత, కొడుకు, మనవడికి ఫ్రెండ్‌గా చేయడం అంటే చిన్న విషయం కాదు. నా హైట్ వల్ల లాభం ఇదే. ఇంతకన్నా ఏం లాభం కావాలి? నిర్మాతగా మారి, ‘ప్రేమాభిషేకం’ తీశారు. బాగా నష్టపోయినట్లున్నారు? వేణుమాధవ్: అలా అనే అందరూ అనుకుంటున్నారు. ఆ సినిమాకి మహా అయితే కోటి రూపాయలు అయ్యుంటుంది. శాటిలైట్ రైట్సే 70 లక్షలు వచ్చింది. తక్కువలో తక్కువ అన్ని ఏరియాల్లో కలిపి నా సినిమా 30 లక్షలకు అమ్ముడుపోదా? నష్టం ఎందుకు వస్తుంది? ఒకవేళ కొంతమంది అనుకుంటున్నట్లు నష్టం వచ్చిందే అనుకున్నాం. నేనెక్కణ్ణుంచి వచ్చాను? ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేనేం తీసుకొచ్చాను? మా ఊళ్లో ఉన్న ఎకరాలు ఎకరాలు అమ్మి ఇక్కడకు రాలేదు కదా. నా గురించి కొంతమంది ఎక్కువ ఆలోచించి, ఏదేదో అనుకుంటారు. ఎవరి గురించి వాళ్లు ఆలోచించుకుంటే బెటర్. మరి.. ఆ తర్వాత హీరోగా, నిర్మాతగా ఎందుకు సినిమా చెయ్యలేదు? వేణుమాధవ్: మళ్లీ బ్రహ్మాండమైన కథ దొరికితే తప్పకుండా చేస్తా. అశ్లీలత లేకుండా నీట్‌గా ఉన్న స్టోరీ అయితే చేయడానికి రెడీ. హడావిడిగా కారులోనే భోంచేసి, రకరకాల లొకేషన్స్ తిరిగి షూటింగ్‌లు చేసిన మీకు ఇప్పుడు మూడు, నాలుగు సినిమాలు మినహా లేకపోవడానికి కారణం ఏంటి? వేణుమాధవ్: కారణం ఏం లేదు. ప్రస్తుతం రాష్ర్టంలో జరుగుతున్న తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాలే. కానీ, మీ ఓవర్‌యాక్షన్ వల్లే సినిమాలు తగ్గాయనే టాక్ ఉంది...? వేణుమాధవ్: ఎప్పుడైతే ఎదుటివాడు ఎక్కువ సినిమాలు చేసి, ఎక్కువ సంపాదిస్తున్నాడో అప్పుడు కొంతమంది దృష్టి వాడి మీద ఉంటుంది. నాకు తీరిగ్గా తినడానికి ఖాళీ లేక కార్లో భోంచేస్తూ వెళుతున్న సమయంలో, ఎవరైనా పలకరించారనుకోండి.. నేను మామూలుగా స్పందించి ఉండొచ్చు. అలాగే, కంటినిండా నిద్రపోయే టైమ్ దొరక్కపోవడంతో కారులోనే కునికి పాట్లు పడేవాణ్ణి. అప్పుడు ఎవరైనా పలకరిస్తే.. మామూలుగా మాట్లాడి ఉండొచ్చు. అది బలుపు అనుకుంటే నేనేం చేయగలను? అనుకున్నారు కదా అని నేను వాళ్లని ఏమీ అనడంలేదు. నేనేంటో నాకు తెలుసు. ‘నీ గురించి ఇలా అనుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండు’ అని చెప్పేంత స్నేహితులెవరూ మీకు ఇండస్ట్రీలో లేరా? వేణుమాధవ్: హలో అంటే హలో అనే స్థాయి ఫ్రెండ్స్ ఉన్నారు. నా దుకాణం నాది. పొద్దున్నే వెళ్లడం, షాప్ ఓపెన్ చేసి, బిజినెస్ చేసుకోవడం. అయిపోగానే దుకాణాన్ని కట్టేయడం అంతే! నాకున్నది ముగ్గురే స్నేహితులు. మా ఆవిడ, నా ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుక్కి మా నాన్న పేరే పెట్టాలనుకుని, ‘ప్రభాకర్’ అని పెట్టా. మా అమ్మ పేరు సావిత్రి. అందుకని, రెండోవాడికి ‘సావికర్’ అని పెట్టాను. మీ భార్య పట్ల అమానుషంగా ప్రవరిస్తారని, ‘శాడిస్ట్’ అనే టాక్ ప్రచారంలో ఉంది...? వేణుమాధవ్: మీ ఎదురుగానే మా ఆవిడ ఉంది కదా.. తననే అడగండి. మీకు ఇద్దరు భార్యలనే టాక్ ఉంది..? వేణుమాధవ్: ఇద్దరుంటే ఇద్దరూ కనిపించేవారు కదా. నాకున్నది ఒక్క భార్యే. మీ పెళ్లయ్యి ఎన్నేళ్లయ్యింది.. లవ్వా.. ఎరేంజ్డ్ మ్యారేజా? వేణుమాధవ్: పన్నెండేళ్లు. మా మేనత్త కూతుర్ని పెళ్లి చేసుకున్నా. ఎరేంజ్డ్ మ్యారేజే. పెళ్లయిన తర్వాత కట్నం కోసం వేధించారని టాక్? వేణుమాధవ్: అవన్నీ నిజమైన మాటలు కావండీ. ఎదుగుతున్నవాడి మీద బురద జల్లడం అన్నమాట. అలాంటివి ఏవైనా జరిగి ఉంటే.. ఇక్కడ ఉండేవాణ్ణి కాదు కదా.. లోపల ఉండేవాణ్ణి. మీకు సినిమాలు తగ్గడానికి కారణం రాష్ర్టంలో జరుగుతున్న ఉద్యమాలని చెప్పారు. అది నిజమైన కారణమేనా? వేణుమాధవ్: నిజమైనదే. ‘ఆటోనగర్ సూర్య’ చేశాను. అది విడుదల కావాల్సి ఉంది. వెంకటేష్, రామ్ కాంబినేషన్లో చేసిన ‘మసాలా’ విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం ‘రుద్రమదేవి’ చేస్తున్నాను. ఇంకొన్ని ఉన్నాయి. మీరు షూటింగ్స్‌కి సరిగ్గా రారనే విమర్శ ఉండటంవల్ల సినిమాలు తగ్గాయని కొంతమంది అంటుంటారు..? వేణుమాధవ్: నేను ఉంటున్నది మౌలాలీలో. ఇక్కణ్ణుంచి ఫిల్మ్‌నగర్‌కి రావడానికి కొంత సమయం పడుతుంది. ఒక్కోసారి ట్రాఫిక్‌లో ఇరుక్కున్నప్పుడు పావుగంట, అర్ధగంట లేట్ అయ్యుండొచ్చు. అంతే.. అయినా నా వల్ల ఇబ్బంది కలిగిందని ఒక్క నిర్మాతని అయినా చెప్పమనండి. మీరు అంతులేని వ్యాధితో బాధపడుతున్నారని.. అందుకే సినిమాలు తగ్గాయన్నది కూడా కొంతమంది ఊహ... వేణుమాధవ్: అది పచ్చి అబద్ధం. మీరు ఏ డాక్టర్ని అయినా తీసుకొచ్చి, పరిక్షలు చేయించవచ్చు. నేను రెడీగా ఉన్నాను. మరి.. ఎందుకు వీక్ అయ్యారు? వేణుమాధవ్: డైటింగ్ చేయడంతో బరువు తగ్గాను. హీరోలు తగ్గితే సిక్స్‌ప్యాక్ అంటారు. నేను తగ్గితే అంతులేని వ్యాధా? ప్రపంచంలో లేని జబ్బులు కూడా అంటగడతారు. ఇదెక్కడి న్యాయం? డైటింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? వేణుమాధవ్: చిరంజీవిగారు, పవన్‌కళ్యాణ్‌గారు, నాగబాబుగారితో చేస్తున్నప్పుడు ఒకేలా ఉన్నాను. కానీ, రామ్‌చరణ్‌తో చేసేటప్పుడూ ఒకేలా ఉంటే ఏం బాగుంటుంది? నాగేశ్వరరావుగారు, నాగార్జునగారి పక్కన ఒకేలా కనిపిస్తే ఓకే. కానీ, నాగచైతన్యకీ ఫ్రెండ్ అంటే నమ్మేలా ఉండాలి కదా. తరాలు మారినా ఫ్రెండ్ కేరక్టర్స్ చేయాలంటే మౌల్డ్ అవ్వక తప్పదు. అందుకే ఈ డైటింగ్. ఆరోగ్యం గురించి ఎక్కువ జాగ్రత్త తీసుకోవడంవల్ల ఇదిగో ఇలా బక్కగా అయ్యాను. సేవా కార్యక్రమాలు కూడా బాగా చేస్తారట? వేణుమాధవ్: మా ఇంట్లో ఎవరి బర్త్‌డేకి కేక్స్ కట్ చేసుకునే అలవాటు లేదు. అనాథశరణాలయాల్లో, వృద్ధాశ్రమాల్లో చేసుకుంటాం. ఎవరైనా ఆపదలో ఉంటే ఆర్థిక సహాయం చేస్తుంటాను. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నాన్నగారి సంస్మరణార్ధం అమ్మ పేరు పెట్టి కళ్యాణ మండపం, కళా వేదిక కట్టించాను. గాంధీగారి విగ్రహాలు పెట్టించాను. వేణుమాధవ్ చారిటబుల్ ట్రస్ట్, వేణుమాధవ్ ఫ్రెండ్స్ సర్కిల్ పేర్లతో సేవాకార్యక్రమాలు చేస్తుంటాం. ప్రస్తుతం మీ ఆశయం ఏంటి? వేణుమాధవ్: సినిమాలపరంగా ఏ ఆశయం లేదు. వ్యక్తిగతంగా మాత్రం వీలైనంతవరకు చాలా మందికి సహాయపడాలన్నదే నా ఆశయం. నేను లక్ష అడిగితే ఆ భగవంతుడు ఎన్నో లక్షలిచ్చాడు. ఇక ఇంతకు మించి ఏదైనా ఆశిస్తే.. ఆ భగవంతుడు కూడా క్షమించడు. ఇంకా కోరికలు కోరి, ఆ భగవంతుడి ఆగ్రహానికి గురి కాదల్చుకోలేదు. ఆయనకు ప్రియభక్తుడిగానే ఉండిపోతా. నేను తినడానికి నాకు దేవుడు ఎంతో ఇచ్చాడు. నాతో పాటు నలుగురికీ పెట్టగలిగే శక్తి ఇచ్చాడు. జీవితానికి ఇంతకు మించి ఇంకేం కావాలి? - డి.జి. భవాని సంవత్సరానికి 40, 50 సినిమాలు చేసి, బంజారా హిల్స్, జూబ్లి హిల్స్‌లాంటి రిచ్ ఏరియాల్లో ఉండే స్థాయికి చేరుకున్నారు. కానీ, సిటీగా దూరంగా ఉండే మౌలాలిలో ఉండటానికి కారణం ఏంటి? వేణుమాధవ్: నాకున్న పది ఇళ్లూ మౌలాలీ హౌసింగ్బోర్డ్లోనే ఉన్నాయి. మా అన్నయ్యలు, అక్క, చెల్లి, నేను... అంతా ఇదే ఏరియాలో ఉంటాం. ఇంకా మా బంధువులు చాలామంది ఉన్నారు. ప్రతిరోజూ మా ఇళ్లల్లోని ఆడవాళ్లు ఫోన్లు చేసుకుని, ‘ఏం కూర చేస్తున్నావ్.. నేను ఫలానాది వండుతున్నా. నువ్వు వేరే చెయ్యి’ అని చెప్పుకుంటారు. ఎవరింట్లో అయినా మహా అయితే రెండు, మూడు కూరలు ఉంటాయేమో.. కానీ మా ఇంట్లో మాత్రం రోజుకి ఎనిమిది రకాల కూరలు ఉంటాయి. నా పిల్లలు బయటికెళితే తప్పిపోతారనే భయం లేదు. ఈ ఏరియాలో ఉన్న మా బంధువులే కాదు.. వేరేవాళ్లు కూడా ‘వేణుమాధవ్ పిల్లలు’ అంటూ.. ఇంటికి తీసుకొచ్చి మరీ వదిలిపెడతారు. ఈ సెక్యూరిటీ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఇంకో విషయం చెబుతాను. జూబిలీహిల్స్‌లో ఎవరున్నారు? చిరంజీవిగారు. ఆ ఏరియాకు ఆయన మెగాస్టార్. నేను మౌలాలీ మెగాస్టార్‌ని. నేను ఫిల్మ్‌నగర్‌లో ఉంటే.. నా ఇల్లెక్కడో ఎవరికీ తెలియకపోవచ్చు. ఒకవేళ తెలిసినా, వేణుమాధవ్ ఇల్లు అంటారు. కానీ, మౌలాలీలో ‘వేణన్నా..’ అంటూ ఆప్యాయంగా పిలవడానికి బోల్డంత మంది ఉన్నారు. ఈ ఏరియాలోకి ఎంటరవ్వగానే, వేణుమాధవ్ ఇల్లెక్కడ? అని ఎవర్ని అడిగినా.. చెప్పేస్తారు. *************** కొన్ని సందర్భాల్లో ఆడియన్స్‌ని నవ్వించడానికి కమెడియన్స్ జోకర్స్‌గా మారాల్సి ఉంటుంది. డబుల్ మీనింగ్ డైలాగులూ చెప్పాల్సి ఉంటుంది. అప్పుడెలా ఫీలయ్యారు? వేణుమాధవ్: దేవుడి దయ వల్ల జోకర్‌గా మారే పరిస్థితి రాలేదు. అలాగే స్త్రీలను అవమానరపరిచేలా ఉండే డైలాగులు కూడా చెప్పిన దాఖలాలు ఉండవు. చెప్పాల్సి వచ్చినప్పుడు లొకేషన్ నుంచి బయటికెళ్లిన సందర్భాలున్నాయి. అందుకని వేణుమాధవ్‌కి బలుపు అన్నవాళ్లు ఉన్నారు. నాలోనూ మంచి రచయిత ఉన్నాడు. అవసరమైతే నేనే మంచి డైలాగులు రాసిస్తానని కూడా కొంతమందితో చెప్పా. వాళ్లిచ్చిన డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పడానికి నిరాకరించా. ఒకవేళ నన్ను ఒత్తిడి చేస్తే, ‘ఇది మీ ఫ్యామిలీకి చూపించండి. మీ ఇంట్లో ఆడవాళ్లు ఒప్పుకుంటే చేస్తా’ అని చెబుతుంటా. ఒక్క డైలాగే కదా అని చెప్పేయొచ్చు. కానీ, ఆ తర్వాత టీవీలో ఆ సినిమా వచ్చినప్పుడల్లా మా అమ్మ, నా అక్కచెల్లెళ్లు, నా భార్య, వదినలు.. అందరూ చూస్తారు. ఇబ్బందిపడతారు. అందుకని లేడీస్‌ని అవమానపరిచే సీన్స్ చెయ్యనని చెప్పేస్తాను. పెద్ద హీరోల సినిమాల విషయంలోనూ అలా చేసిన సందర్భాలున్నాయా? వేణుమాధవ్: కొన్ని ఉన్నాయి. అలా చేస్తే అవకాశాలు కోల్పోతానని అనుకోలేదా? వేణుమాధవ్: పోతే పోనివ్వండి. పెద్ద హీరో ఏడాదికి ఎన్ని సినిమాలు చేస్తాడు? మహా అయితే నాలుగైదు. అవి పోయినంత మాత్రాన నాకేం ఇబ్బంది లేదు. ఆ రెండు సినిమాలకు కేటాయించే సమయాన్ని నా ఫ్యామిలీకి కేటాయిస్తాను. మీ పిల్లలను సినిమాల్లోకి తీసుకొచ్చే ఆలోచన ఉందా? వేణుమాధవ్: అస్సలు లేదు! నేను పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదని. షూటింగ్స్‌తో బిజీగా ఉండటంవల్ల ప్రతి రోజూ రాత్రి ఒంటి గంటకు ఇంటికి రావడం, ఉదయం షూటింగ్‌కి వెళ్లడం.. దాదాపు నా జీవితం ఇలానే సాగింది. నా పిల్లలు అలా కాకుండా టెన్ టూ ఫైవ్ జాబ్ చేసుకుని, హాయిగా ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే, నేను లేట్‌గా ఇంటికి రావడం, ఉదయమే వెళ్లిపోవడం చూసి, నాన్నగారు చాలా బాధపడేవారు. **************** నటుడిగా అవకాశం ఇచ్చింది కృష్ణారెడ్డిగారు, అచ్చిరెడ్డిగారు. ‘హంగామా’ ద్వారా హీరోని చేసిందీ ఆ ఇద్దరే! అందుకే నా ఇంటికి ‘అచ్చి వచ్చిన కృష్ణ నిలయం’ అని పేరు పెట్టుకున్నాను. నా పదిళ్లకూ అదే పేరు. మౌలాలీలో ఈ పేరుతో ఉన్న ఇల్లు ఎవరిది? అని ఎవర్ని అడిగినా, ‘వేణుమాధవ్’ది అని చెబుతారు. వాళ్లు ఇంకా నాకెలాంటి రోల్స్ ఇస్తానన్నా నేను రెడీ. ఒకవేళ ఇప్పటికప్పుడు పిలిచి ‘సినిమాలు మానేయ్’ అన్నా, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మానేస్తా! వాళ్లంటే నాకంత అభిమానం, గురి! -
గతాన్ని ఇష్టపడినవాడే..భవిష్యత్తుని మలుచుకోగలడు!
అరుంధతి, అంజి, అమ్మోరు... ఎలాంటి మనిషి ఈయన? అంటే?! దేవి, దేవుళ్లు, దేవీపుత్రుడు... ఏమీ స్పెషల్‌గా అనిపించడం లేదా? అన్నీ స్పెషలే కదా! అవన్నీ స్పెషలే. కోడి రామకృష్ణలో స్పెషలేమిటని? సెంటిమెంట్లు ఎక్కువలా ఉంది. పూర్వజన్మలపై మక్కువలా ఉంది. రెండూ కరెక్టే. మొదటిది ఇంకా కరెక్టు! రామకృష్ణ జననం పెద్ద సెంటిమెంటు. దాసరిగారి కారెక్కడం సెంటిమెంటు. చిరంజీవి పెట్టిన పరీక్ష సెంటిమెంటు. తలకు చుట్టుకున్న తుండుగుడ్డ సెంటిమెంటు. దేవతలపైనే కాదు, మనుషుల మీదా సినిమాలు తీశారు రామకృష్ణ. ఈ ఏడాది మరో రెండుమూడు రాబోతున్నాయి. మనుషులవా? దేవతలవా? ఏవైనా కావచ్చు. ఏడాదికొక్కటైనా సినిమా తియ్యాలన్న సెంటిమెంట్ అయనకుందో లేదో కానీ... ఆయన చిత్రం ఏడాదికొక్కటైనా రిలీజ్ అయితే బాగుంటుందనుకునే ప్రేక్షకులు చాలామందే ఉన్నారు. ఈవారం ‘తారాంతరంగం’ చదవండి. కోడి లైఫ్‌లో కొత్త సినిమా కనిపిస్తుంది. మీ జీవితాన్ని ఓ పుస్తకం అనుకుంటే.. దానిలో పేజీలన్నీ దాదాపు అందరూ చదివినవే. మీకు తెలిసి చదవని పేజీలు ఏమైనా ఉన్నాయా? కోడి రామకృష్ణ: ఎందుకుండవ్.. ఉంటాయి. నాన్న జ్ఞాపకాలు, అమ్మ ఉత్తరాలు, స్కూల్‌డేస్‌లో తోటి విద్యార్థుల ఫిర్యాదులు, ఊళ్లో వేసిన నాటకాలు.. చెప్పుకుంటూ పోతే.. ఎన్నో. అలా అయితే... కొన్ని చెప్పండి? ముందు మీ బాల్యం. కోడి రామకృష్ణ: మాది పాలకొల్లు. నాన్న పేరు కోడి నరసింహమూర్తి, అమ్మపేరు చిట్టెమ్మ. మా అమ్మానాన్నలకు నేనంటే చాలా ఇష్టం. మా వీధిలో అందరూ నన్ను అమితంగా ఇష్టపడేవారు. ఎందుకంటే... నేను పుట్టాకే మా వీధిలో అందరికీ పిల్లలు పుట్టారట. దాంతో నేనంటే అందరికీ పెద్ద సెంటిమెంట్. ఎంత సెంటిమెంట్ అంటే.. నెల పొడుపు రోజున సాయంత్రం చంద్రుడు కనిపించగానే.. చూసినవారందరూ ఒక్కసారిగా కళ్లు మూసుకొని.. ‘పెద్దబాబూ.. రాముడూ..’ అని పెద్దగా అరిచేవారు. నేనెళ్లి.. ఒక్కొక్కర్నీ తాకేవాణ్ణి. అప్పుడు కళ్లు తెరిచి నా వైపు చూసేవారు. అంత సెంటిమెంట్! మా వీధిలో సెంటిమెంట్లు ఏ రేంజ్లో ఉండేవో చెప్పడానికి ఓ సరదా ఇన్సిడెంట్ చెబుతా. మా వీధిలో ఓ బ్రాహ్మలావిడ ఉండేది. వారి ఎదురింట్లో శిరోమణి అనే ఆవిడ ఉండేది. వీళ్లిద్దరికీ అస్సలు పడదు. ఈవిడ శిరోమణిని తెగ తిడుతుండేది. ఓరోజు అనుకోకుండా శిరోమణి చనిపోయింది. ఆమె చావు తర్వాత కూడా ఈవిడ గొడవ మానలేదు. శిరోమణి పిల్లల్ని కూడా చీటికిమాటికీ తిట్టేది. ఓ రోజు ఉన్నట్లుండి బ్రాహ్మలావిడ వింతగా ప్రవర్తించడం మొదలెట్టింది. కోడిమాంసం కావాలని గోల గోల. బ్రాహ్మణస్త్రీ చికెన్ అడగడమేంటని వీధంతా వింతగా చెప్పుకోవడం మొదలెట్టింది. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, శిరోమణి దెయ్యమై.. ఆ బ్రాహ్మలావిడను పట్టిందట. ఆ శిరోమణి అమ్మకు బాగా పరిచయం. దాంతో అమ్మ వెళ్లి.. ‘శిరోమణి.. ఏంటే ఇదంతా..’ అంది. ‘ఇది నా పిల్లల్ని తిట్టిందక్కా.. దీంతో కోడిమాంసం తినిపించేదాకా వదల్ను’ అని బ్రాహ్మలామె. నాకేమో అంతా వింతగా ఉంది. చుట్టుపక్కల వాళ్లు కూడా ఎంతో చెప్పి చూశారు. కానీ శిరోమణి ఆత్మ మాత్రం శాంతించడంలా. ‘మాంసం తేవాల్సిందే. దీంతో తినిపించాల్సిందే.. లేకపోతే నా పిల్లల్ని తిడుతుందా’ అని ఊగిపోతోంది. అప్పుడొచ్చాడు నాన్న. ‘ఏంటి?’ అనడిగితే.. విషయం చెప్పారు. సరాసరి ఆమె ముందుకెళ్లాడు. నాన్నను చూడగానే.. ఆమె కర్టెన్ చాటున దాక్కుంది. ‘ఏంటే ఇదంతా.. బ్రాహ్మలు కదా.. అలా చేయొచ్చా?’ అన్నాడు నాన్న. ‘ఏంటి బావగారూ మీరూ అలా మాట్లాడతారు. ఇది నన్ను తిట్టిందండీ... ఇప్పుడు నా పిల్లలమీద పడింది. అందుకే.. చికెన్ తినిపించేదాకా వదల్ను’ అంది ఏడుస్తూ... ‘తప్పే.. అలా చేయడం పాపమే. వెళ్లిపో.. నీ పిల్లల్ని నేను చూసుకుంటా. నాపై నమ్మకం ఉంటే వెళ్లిపో’ అని నాన్నా... ‘ఇది నా పిల్లల్ని తిట్టింది బావగారూ..’ అని ఆమె... ‘తిడితే చావగొడదాం సరేనా..’ అని నాన్న. ఎట్టకేలకు శాంతించిందామె. ‘ఓ అరటిపండు పెట్టండి వెళతా’ అంది. అమృతపాణీ తెప్పించి నాన్నే స్వయంగా వలిచి పెట్టారు. ఆ క్షణంలో నాన్న కళ్లలో నీళ్లు చూశా. ఆ పండు తినగానే.. ఆమెకు స్పృహ తప్పింది. చూస్తున్న నాకు ఇదంతా వింతగా అనిపించింది. చనిపోయాక కూడా నాన్నపై గౌరవం తగ్గకపోవడం గ్రేట్ అనిపించింది. దెయ్యాలు, భూతాలు నిజమని చెప్పను కానీ, మా వీధి సెంటిమెంట్లు అలా ఉండేవి. అమ్మానాన్నలతో మీ అనుబంధం? కోడి రామకృష్ణ: మా అమ్మానాన్నలకు నేను తొలిసంతానం. నా లైఫ్‌లో నేను చూసిన తొలి హీరో నాన్న. ఆయన రిటైర్డ్ మేజర్. మా నాన్న ఎంత చండశాసనుడో అంత అమాయకుడు కూడా. అప్పట్లోనే సినిమాల్లో వేషాలిప్పిస్తాం, సినిమాలు తీస్తాం అంటూ కొన్ని ఫ్రాడ్ బ్యాచ్‌లు మా ఊళ్లో తిరుగుతుండేవి. వాళ్లను ఇంటికి తీసుకొచ్చి, వాళ్లందరితో కూల్డ్రింకులు తాగించి, నా ఫొటోలు చూపిస్తుండేవారు నాన్న. నేను స్కూల్నుంచి వచ్చేసరికి వారందరూ వరండాలో కూర్చొని ఉండేవారు. వాళ్లను చూసి సెలైంట్‌గా ఇంట్లోకెళ్లేవాణ్ణి. నా వెనకే నాన్న వచ్చేవాడు. ‘వాళ్లు సినిమా తీస్తారంటరా. నీ గురించి చెప్పాను. నీ ఫొటోలు కూడా చూపించాను’ అని గుసగుసగా చెప్పేవారు. ‘అయ్యో నాన్నా, వాళ్లు దొంగలు. వృథాగా డబ్బులు ఖర్చు చేస్తున్నావ్. వాళ్లను పంపించేయ్’ అని మందలింపుగా చెప్పేవాణ్ణి. నిజం తెలుసుకొని వాళ్లను తరిమేసేవారు. ‘మనింట్లో డిగ్రీ చదివిన వాళ్లు లేరు. నువ్వు చదవాలి’ అని ఒకరోజు నాన్న నాతో అన్నారు. ‘మీ కోసం డిగ్రీ చదువుతాను. అయితే.. మధ్యలో ఎక్కడైనా తప్పితే మాత్రం అక్కడే ఆపేస్తా’ అని ఫిటింగ్ పెట్టాను. ‘నువ్వు తప్పవ్. నీపై నాకు నమ్మకం ఉంది’ అన్నారు నాన్న. మేం నాటకం రిహార్సల్స్‌లో ఉండగా పీయూసీ రిజల్ట్స్ వచ్చాయి. నా నంబర్ పేపర్లో లేదు. తప్పాను. ఇక చదవనవసరం లేదు. నిర్ణయం తీసేసుకొని, ఇంటికెళ్లాను. అక్కడి పరిస్థితి చూడగానే షాక్. ఇరుగుపొరుగు వాళ్లకు నాన్న స్వీట్స్ పంచుతున్నారు. ‘ఓరి నాయనో.. ఈయన పేపర్ చూడలేదులా ఉంది..’ అనుకుంటూ ఆయన ముందుకెళ్లాను. నన్ను చూడగానే, ‘ఏయ్.. డిగ్రీ కూడా ఇలాగే పాసవ్వాలి. లేకపోతే చంపేస్తా’ అన్నారు ప్రౌడ్‌గా. నాకేమో అయోమయం! ఇంతలో మా తమ్ముడొచ్చి ‘నువ్వు సెకండ్‌క్లాస్‌లో పాసయ్యావ్రా’ అన్నాడు. అప్పుడు కానీ అర్థం కాలేదు. నేను థర్డ్ క్లాస్‌లో మాత్రమే చూశానని, సెకండ్ క్లాస్‌లో చూడలేదని. కాలేజ్ టైమ్‌లో ప్రేమకథ ఏమైనా నడిపారా? కోడి రామకృష్ణ: అప్పట్లో మాకు ఆత్మీయత తెలుసు, అందం తెలుసు. మా ఆలోచనలు అంతవరకే. పరిధులు దాటేవి కావు. మీరు అడిగారు కాబట్టి గుర్తున్న ఓ సంఘటన చెబుతాను. కాలేజ్ టైమ్‌లో నాకు ఓ స్టడీరూమ్ ఉండేది. నేను బొమ్మలు బాగా వేసేవాణ్ణి. అందుకే... సైన్స్ రికార్డ్స్‌లో బొమ్మలు గీయించుకోవడానికి అమ్మాయిలు నా రూమ్కొచ్చేవారు. అందరూ లవ్లీగా ఉండేవారు. ఆ అమ్మాయిల్లో ‘5 నంబర్ గోల్డ్’ అనే ఓ అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి ఆ పేరు ఎలా వచ్చిందంటే.. తన రోల్ నంబర్ 5. ఇంటిపేరేమో ‘బంగారు’. అందుకే ‘5 నంబర్ గోల్డ్’ అని పిలిచేవాళ్లం. అసలు పేరు గుర్తులేదు. నాతో బొమ్మలు గీయించుకోవడానికి తానూ వచ్చేది. ఇంతమంది ఆడపిల్లలు నా దగ్గరకొస్తుంటే.. జెలసీగా ఫీలయ్యేవారు కూడా ఉంటారు కదా. ఎవడో వెళ్లి ‘5 నంబర్ గోల్డ్’ వాళ్ల అన్నయ్యకు చెప్పాడు ‘మీ చెల్లెలు రామకృష్ణతో క్లోజ్‌గా ఉంటోంది’ అని. నేను కాలేజ్‌కి వెళ్లే దారిలో వాళ్లన్నయ్య కాపు కాశాడు. నన్ను ఆపాడు. ‘జాగ్రత్త ఏమనుకున్నావో! ఏంటి? మా చెల్లితో మాట్లాడుతున్నావంట’ అన్నాడు సీరియస్‌గా. ‘మాట్లాడితే ఏమైంది’ అన్నాను. ‘మీ ఇద్దరూ దగ్గరగా ఉంటున్నారట’ అని సణిగాడు. ‘దగ్గరగా ఉంటే ఏమైందిరా?’ అని నేను దీటుగా ప్రశ్నించా. ‘సరేలే... నీ నాటకంలో నాకూ వేషం ఇస్తావా?’ అని అడిగాడు నింపాదిగా. ‘ఇస్తాలే’ అని మాటిచ్చాను. నా కాలేజ్ రోజుల్లో ఇలాంటి అనుభవాలు ఎన్నో. సినిమాపై మీ తొలి అడుగులు ఎలా పడ్డాయి? కోడి రామకృష్ణ: చిన్నప్పట్నుంచీ పెయింటింగ్ అంటే ఇష్టం. అజంతా ఆర్ట్స్ పేరుతో మా ఊళ్లో పెయింటింగ్ షాప్ కూడా పెట్టాను. గోడల మీద వాటర్ పెయింటింగ్ బోర్డ్స్ రాసేవాణ్ణి. అలాగే.. ఆయిల్ పెయింటింగ్ బోర్డ్స్ కూడా. సినిమా హాళ్లకు ‘పొగత్రాగరాదు’, ‘నిశ్శబ్దం’, ‘ముందు సీట్లపై కాళ్లు పెట్టరాదు’.. ఇలా రకరకాల స్లయిడ్స్ ఫ్రీగా చేసిచ్చేవాణ్ణి. ఆ స్లయిడ్స్కి ఓ మూల ‘కోడి రామకృష్ణ’ అని నా పేరు రాసుకునేవాణ్ణి. తెరపై నా పేరు చూసుకోడానికే థియేటర్‌కి వెళ్లేవాణ్ణి. ప్రొజెక్టర్ దగ్గర నిలబడి, నా స్లయిడ్ పడేదాకా ఉండి, తెరపై నా పేరును చూసుకొని అప్పుడు షాప్‌కి వెళ్లేవాణ్ణి. సినిమాపై అభిమానానికి బీజం పడింది అక్కడే. అలాగే.. చిన్నప్పట్నుంచీ నాటకాల పిచ్చి. పసుపు, కుంకుమ, బొగ్గు, పౌడర్లతో మేకప్ చేసుకొని... వీధి మధ్యలో ఓ నులక మంచాన్ని నిలబెట్టి, దానికో తెరకట్టి పిల్లలందరం నాటకాలు వేసేవాళ్లం. రైటర్ని, డెరైక్టర్ని, హీరోని నేనే. మా వీధిలో కొన్ని కుటుంబాల్లో జరిగిన సంఘటనల్నే స్ఫూర్తిగా తీసుకొని కథల్ని, పాత్రల్ని సృష్టించేసేవాణ్ణి. లైవ్‌లో డైలాగులు చెప్పించేసేవాణ్ణి. తర్వాత ట్రూప్ నాటకాల స్థాయికి చేరా. పరిషత్తులకు కూడా వెళ్లేవాళ్లం. దాదాపు వందకు పైగానే నాటకాలు రాసి, ప్రదర్శించాను. నా ఫ్రెండ్ లైఫ్‌ని ప్రేరణగా తీసుకొని రాసిన ‘రేపు సెలవు’ నాటిక నాకు మంచి పేరు తెచ్చింది. అల్లు రామలింగయ్యగార్కి అప్పట్లో నాటకం ట్రూప్ ఉండేది. ‘ఆడది’ అనే కమర్షియల్ నాటకం ఆడుతూ ఉండేవారు. ఆ నాటకంలో నేనే హీరో. లింగయ్యగారు దర్శకుడు. ఇదిలావుంటే.. టి.నాగేశ్వరరావుగారనీ... పెయింటింగ్‌లో నా గురువు. ఆయన దగ్గర నేను లితోలకు వర్క్ చేసేవాణ్ణి. ఆయనకు ఓ ఫొటో స్టూడియో కూడా ఉంది. అక్కడ నా ఫొటోలు తీసి... ‘కొత్త హీరో కావాలి’ అనే ప్రకటన పేపర్లలో కనిపిస్తే పంపించేరు. నాకూ ఫస్ట్‌లో ఆర్టిస్ట్ అవ్వాలనే ఉండేది. అలాంటి టైమ్‌లోనే మా ఊళ్లో ఓ సినిమా రిలీజైంది. ఆ సినిమా దర్శకుడికి అదే తొలి సినిమా. ఏ వీధిలో చూసినా ఆ సినిమా డిస్కషనే. ఆ సినిమా సంచలనం చూశాక అనిపించింది... ‘యాక్టర్ అయితే... ఒక్క పాత్రనే చెప్పచ్చు. అదే డెరైక్టరయితే.. ఎన్నో పాత్రల్ని చెప్పొచ్చు’ అని. నాలో డెరైక్టర్ అవ్వాలనే కాంక్షను పెంచిన ఆ సినిమానే ‘తాతా మనవడు’. ఆ డెరైక్టరే మా గురువుగారు దాసరి నారాయణరావు. ఎలాగైనా ఆయన్ను కలవాలి. ఇదే నా ఆలోచన. మరి ఎలా కలిశారు? కోడి రామకృష్ణ: గురువుగార్ని నా చిన్నప్పట్నుంచీ చూస్తూనే ఉన్నాను. ఆయన చదివిన స్కూల్లోనే నేను చదువుకున్నా. నేను ఫస్ట్ ఫారం.. ఆయనేమో ఇంటర్ సెకండియర్. ‘నేను నా స్కూల్’ అనే నాటికను గురువుగారు స్వయంగా రాసి మా స్కూల్లో ప్రదర్శించారు. గ్రీన్ రూమ్‌లో వాళ్లు మేకప్‌లు చేసుకుంటుంటే... మేమందరం కిటికీల్లోంచి చూసేవాళ్లం. ఆ రోజుల్లో సుబ్బరాయశాస్త్రిగారని మా స్కౌట్ మాస్టారు ‘పంచవర్ష ప్రణాళికలు’ అనే నాటికను రాశారు. దాన్ని గురువుగారు డెరైక్ట్ చేసి నటించారు. ఢిల్లీలో ఆ నాటికను ప్రదర్శిస్తే.. నేషనల్ అవార్డు వచ్చింది. ఆ సందర్భంగా గురువుగారినీ ఆయన ట్రూప్‌ని పాలకొల్లులో లారీపై ఊరేగించారు. ఆర్టిస్ట్ అయితే క్రేజ్ ఎలా ఉంటుందో అప్పుడే తెలిసింది. ‘తాతా మనవడు’ సూపర్‌హిట్ అయినప్పుడు... అదంతా నా అదృష్టమే అనుకున్నా. ఆ సినిమా యాభై రోజుల పండుగ సందర్భంగా గురువుగారు నేరుగా పాలకొల్లే వస్తున్నారనే సంగతి తెలిసింది. సరిగ్గా ఆ టైమ్‌లోనే ‘జై ఆంధ్ర’ ఉద్యమం నడుస్తోంది. పైగా ‘తాతామనవడు’ రిలీజైన థియేటర్ వాళ్లకు, మా స్టూడెంట్లకు పడదు. అలాంటి వేడి వాతావరణంలో ఫంక్షన్. ఎలాగైనా ఫంక్షన్ పాడుచేయాలని స్టూడెంట్లందరూ కంకణం కట్టుకున్నారు. పైగా అప్పట్లో స్టూడెంట్ లీడర్ని నేనే.నాకేమో.. ఎలాగైనా గురువుగారిని కలిసి అవకాశం అడగాలనుంది. తోటి విద్యార్థులేమో.. ఫంక్షన్ పాడు చేయాలంటున్నారు. ఇక నేను అందర్నీ రిక్వెస్ట్ చేసుకున్నా. ‘గురువుగారు వస్తున్నారు. ఎలాగైనా ఆయన్ను కలవాలి. అవకాశం అడగాలి. మళ్లీ ఇలాంటి అవకాశం రాదు.. ప్లీజ్’ అని బతిమాలుకున్నాను. దాంతో ఓ షరతుపై వాళ్లు ఒప్పుకున్నారు. అదేంటంటే... ‘మేం థియేటర్‌కి వస్తాం. నేల టికెట్లో కూర్చుంటాం. ఆ థియేటర్ ఓనర్గాడు.. ఎక్కువ తక్కువగా మాట్లాడితే మాత్రం కొట్టేస్తాం. అందుకు నువ్వు ‘ఓకే’ అయితే.. మేమూ ‘ఓకే’ అని. నాకేమో టెన్షన్. గురువుగారు, కె.రాఘవగారు, ఎస్వీ రంగారావుగారు ఇలా... అందరూ వచ్చారు. నేనెళ్లి ధైర్యంగా గురువుగార్ని కలిశాను. ‘మీ దగ్గర సహాయకునిగా చేరాలనుకుంటున్నాను. అవకాశం ఇవ్వండి సార్’ అని ప్రాధేయపడ్డాను. ‘ఏం చదివావ్’ అనడిగారు. ‘బీకాం చదువుతున్నాను సార్’ అని చెప్పాను. అయితే.. ‘పూర్తి చేసి రా’ అన్నారు. సన్మానపత్రం రాసి స్వయంగా చదివాను. అంతా ప్రశాంతంగా జరిగిపోతోంది అనుకుంటుండగా... ఆ థియేటర్ ఓనర్ మైక్‌లో మాట్లాడ్డం మొదలెట్టాడు. ‘పాలకొల్లుకే పేరు తెచ్చిపెట్టారు దాసరి. యువతరం దాసరిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆయనలా ఎదగాలి. అంతే కానీ... మీలా కుక్కల్లా, పందుల్లా వీధుల్లో తిరగడం కాదు కుర్రాళ్లు చేయాల్సింది’ అనేశాడు. ఇంకేముంది? వాతావరణం రణరంగాన్నే తలపించింది. ఏదిఏమైనా గురువుగారి మాట ప్రకారం బీకాం పూర్తి చేసి చెన్నయ్ రెలైక్కాను. వెళ్లగానే దాసరిగారు ఎలా రిసీవ్ చేసుకున్నారు? కోడి రామకృష్ణ: ఆయన రిసీవింగ్ గమ్మత్తుగా జరిగింది. నేను పాలకొల్లులో ఉన్నప్పుడే.. కాకినాడలో ‘రాధమ్మపెళ్లి’ షూటింగ్ జరిగింది. గురువుగారు వచ్చారని తెలిసి... కాకినాడ వెళ్లాను. నన్ను చూడగానే.. ఓ కేరక్టర్ ఇచ్చేశారు గురువుగారు. శారదగారికి అందులో ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. ఆ ఇద్దరిలో నేనొకణ్ణి. మా కాంబినేషన్ సీన్స్ తీసేసి, మద్రాస్ వెళ్లిపోయారు. ఆ సన్నివేశాలకు సంబంధించిన ప్యాచ్‌వర్క్ మాత్రం మిగిలి ఉంది. దాన్ని మద్రాస్‌లోని శివాజీ గార్డెన్స్‌లో తీస్తున్నారు. నేను చేసిన పాత్రకు ఓ డూప్‌ని ఏర్పాటు చేశారు. కానీ అతగాడు సెట్ కావడం లేదు. దాంతో కంగారు పడిపోతున్నారు. అలాంటి టైమ్‌లో నేను మద్రాసు వచ్చి, గురువుగారిని వెతుక్కుంటూ శివాజీ గార్డెన్స్‌లో అడుగుపెట్టాను. నన్ను చూడగానే.. ఆ యూనిట్‌కి ఆనందం ఆగలేదు. భలే వచ్చావయ్యా... అంటూ గబగబా.. కాస్ట్యూమ్స్ తొడిగేశారు. మేకప్ వేసేశారు. నాపై క్లాప్ కొడుతుండగా గురువుగారొచ్చారు. ‘అరే... ఎప్పుడొచ్చావ్. నీక్యారెక్టర్ పెద్దటెన్షనే పెట్టింది. భలే వచ్చావే. ఇక్కడకు రాగానే.. మొహానికి రంగేయించుకున్నావ్. క్లాప్ కొట్టించుకున్నావ్. అదృష్టవంతుడవయ్యా. ఇకనుంచి నువ్వు నాతోనే ఉంటావ్’ అని మాటిచ్చేశారు. ఆ రోజే ఆయన కారెక్కాను. అప్పట్నుంచి కారుల్లో తిరుగుతూనే ఉన్నాను. మీ తొలిచిత్రం ఇంట్లో ‘రామయ్య-వీధిలో కృష్ణయ్య’ విషయంలో ఏమైనా టెన్షన్ పడ్డారా? కోడి రామకృష్ణ: ఆ కథను నిర్మాత కె.రాఘవగారికి, చిరంజీవిగారికి చెప్పి, ఒప్పించే విషయంలో కాస్త టెన్షన్ పడ్డాను. అయితే... విపరీతంగా టెన్షన్ పడ్డ సంఘటన ఒకటుంది. ఆ సినిమా షూటింగ్‌ని గోదావరి ఒడ్డున ప్లాన్ చేశాం. చిరంజీవి.. బోట్లో కూర్చొని కమలాపండు తింటున్నారు. నేనేమో నది ఒడ్డున ఇసుకలో కూర్చున్నాను. చిరంజీవిగారు కమలా పండు తొనలు వొలుస్తూ... ‘రామకృష్ణా.. ఈ తొన నీపై విసురుతున్నా.. నువ్వు దాన్ని నోటితో క్యాచ్ చేయాలి. పట్టుకుంటే... సినిమా హిట్. మిస్ చేశావా.. సినిమా ఫ్లాప్’ అన్నారు. తొలి సినిమా. పైగా నాకు సెంటిమెంట్లు ఎక్కువ. ‘సార్... ఇది అన్యాయం’ అని మొత్తుకుంటున్నా ఆయన వినలేదు. తొనను విసిరారు. ఆ తొనను ప్రాణాలను సైతం పణంగా పెట్టి నోటితో క్యాచ్ పట్టుకున్నాను. ఆ తొనను నేను పట్టుకున్న తీరు గుర్తొస్తే ఇప్పటికీ ఆశ్చర్యమేస్తుంది. చిరంజీవిగారు ఇప్పటికీ అంటుంటారు. ‘భలే పట్టుకున్నావ్ రామకృష్ణా.. అప్పుడు ఏదో అనేశాను కానీ.. ఇప్పుడు తలుచుకుంటే అనిపిస్తుంది.. నువ్వెంత టెన్షన్ పడ్డావో’ అని. ‘మంగమ్మగారి మనవడు’లో భానుమతిని మంగమ్మగా తీసుకోవడం మీ ఆలోచనేనా? కోడి రామకృష్ణ: అవును. ఆ ఆలోచన నాదే. అప్పటికి భార్గవ్ ఆర్ట్స్ బేనర్లో ‘ముక్కుపుడక’ సినిమా చేశాను. అది పెద్ద హిట్. రెండోసినిమా బాలకృష్ణతో చేద్దాం అన్నారు గోపాలరెడ్డి. కొంతమంది భయపెట్టారు. ‘ఎందుకు హీరోలతో తీయడం. ‘ముక్కుపుడక’లా మంచి కథల్తో వెళ్లొచ్చు కదా..’ అని. కానీ మొండిధైర్యంతో బాలయ్యతో వెళ్లాం. మంగమ్మ పాత్ర కథకు కీలకం. అందుకే భానుమతిగారైతే... కరెక్ట్ అని చెప్పాను. ఆమెతో తలనొప్పి అని, నచ్చకపోతే మధ్యలో వెళ్లిపోతుందని, పైగా మర్యాద లేకుండా మాట్లాడుతుందని ఏవేవో చెప్పారు. అవేమీ లెక్క చేయకుండా గోపాలరెడ్డిగారు, నేను భానుమతిగారిని కలిశాం. ‘మన్వాసనే’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నామని, అందులో కాంతిమతి చేసిన పాత్రను తమరు చేయాలని చెప్పాను. భానుమతిగారితో కంపేర్ చేస్తే.. కాంతిమతి చాలా చిన్ననటి. ఆమె పాత్రకు భానుమతిగార్ని అడిగేసరికి ఆమె మొహంలో రంగులు మారాయి. ‘కాంతిమతి పాత్ర నేను చేయాలా?’ అన్నారు సీరియస్‌గా. ‘అమ్మా... పాత్రను మీకు తగ్గట్టుగా డెవలప్ చేశాం. మీరు చేస్తే తప్ప ఈ ప్రాజెక్ట్‌కి నిండుదనం రాదు’ అని బతిమాలాను. ఎలాగో ఒప్పుకున్నారు. ‘అది సరేకానీ... నిన్ను ఏమని పిలవాలయ్యా... మా వారిపేరు నీ పేరు ఒకటే. నిన్ను పేరు పెట్టి పిలవలేను. అందుకే ‘డెరైక్టర్’ అని పిలుస్తా సరేనా’ అన్నారు. అలాగేనమ్మా అన్నాను. ఆ విధంగా ‘మంగమ్మగారి మనవడు’ షూటింగ్ మొదలైంది. ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ అందులో హీరో అంటే భానుమతి ఎలా రియాక్టయ్యారు? కోడి రామకృష్ణ: ఎనీఆర్గారంటే భానుమతిగారికీ అభిమానమే. ‘భానుమతిగారు కారు దిగగానే.. ముందు నువ్వే వెళ్లి డోర్ తీయ్’ అని ఎన్టీఆర్‌గారే బాలయ్యకు చెప్పారట. తండ్రి మాట ప్రకారం భానుమతిగారి కారు ఆగగానే.. స్వయంగా బాలయ్యే వెళ్లి డోర్ తీశారు. ఆ క్షణం భానుమతిగారిలో కనిపించిన ఆనందం అంతా ఇంతా కాదు. ‘మీ నాన్నలోని సంస్కారం మొత్తం నీలో ఉందిరా అబ్బాయ్’ అని పొంగిపోయారు. ఆమె ఎంత బోళామనిషో చెప్పడానికి ఇంకో ఇన్సిడెంట్ చెబుతాను. ‘మంగమ్మగారి మనవడు’లో కొన్ని డైలాగుల్ని కాస్త ఘాటుగానే రాశారు గణేశ్‌పాత్రో. భానుమతిగారిపై తొలి షాట్. ‘బావగారొచ్చారని బట్టలేసుకోకుండా నిలబడిందంట.. నీ లాంటి భయంగల బల్లి’ అనేది డైలాగ్. అది చదివి.. మరీ డైలాగు ఇంత ఘాటుగా ఉంటే ఎలాగురా.. నేను చెప్పను’ అనేశారు. ‘అమ్మా.. ప్లీజ్’ అని బతిమాలినా వినలేదు. ‘కొంచెం సరళంగా మార్చుకొని చెబుతా’ అన్నారు. సరే... అని ‘యాక్షన్’ చెప్పా... అంతకు ముందు చదివి ఉన్న డైలాగునే ఠకీమని చెప్పేశారు. ఆ సినిమా తీసింది ఓ పల్లెటూరిలో. దాంతో భానుమతిగారిని చూడటానికి తండోపతండాలుగా జనాలొచ్చేశారు. భానుమతిగారు ఈ డైలాగ్ చెప్పగానే... విజిల్సూ, కేకలు. ‘చూశారా.. మీరు మచ్చుకు ఒక్క డైలాగు చెబితేనే రెస్పాన్స్ ఎలా ఉందో. అదే ఇందులోని డైలాగులన్నీ ఇదే మూడ్‌తో చెప్పారంటే, స్పందన ఎలా ఉంటుందో అర్థంచేసుకోండి’ అన్నాను. ‘అంతేనంటావా.. సరే చెప్పేద్దాం’ అన్నారు. ఇక అప్పట్నుంచి ఎలాంటి ఇబ్బందీ పెట్టలేదు. స్క్రిప్ట్‌లో ఉన్న డైలాగుల్నే చెప్పారు. అంతటి బోళా మనిషి ఆమె. భానుమతిగారితో చేయగలగడం నేను చేసుకున్న అదృష్టం. మంగమ్మగారి మనవడు, ముద్దులకృష్ణయ్య, మువ్వగోపాలుడు, ముద్దులమామయ్య.. ఈ చిత్రాల్ని పక్కనపెట్టి బాలకృష్ణ కెరీర్‌ని ఊహించలేం. ఉన్నట్టుండి ఇద్దరూ ఎందుకు బ్రేకయ్యారు? కోడి రామకృష్ణ: మేం బ్రేక్ అవలేదండీ... అన్నీ కుదిరితే మా కాంబినేషన్లో సినిమా ఉంటుంది. ‘భార్గవ్ ఆర్ట్స్’లో బాలయ్యతో నిజంగా గొప్ప సినిమాలే తీశాను. ఎస్.గోపాల్రెడ్డిగారిక్కూడా బాలయ్య అంటే అమితమైన అభిమానం. ‘మంగమ్మగారి మనవడు’ తర్వాత ఆయన టాప్‌స్టార్ అయిపోయాడు. అందుకు తగ్గట్టే.. బాలయ్యతో ఏ సినిమా తీసినా.. అడక్కుండానే పారితోషికం పెంచేసేవారు గోపాల్‌రెడ్డి. ‘ముద్దులమావయ్య’ తర్వాత బాలయ్య దాదాపు నంబర్‌వన్ అయ్యారు. ఆయన పారితోషికం కూడా చాలా పెరిగిపోయింది. ‘ఇప్పుడు బాలయ్యతో మనం సినిమా తీస్తే... మనకోసం ఆయన పారితోషికం తగ్గించుకోవాలి. అలాంటి పరిస్థితి నా బాలయ్యకు రాకూడదు. ఆ స్థాయి పారితోషికం ఇచ్చే స్థాయికి మనం చేరుకున్నాకే సినిమా తీద్దాం’ అన్నారు గోపాల్‌రెడ్డి. అందుకే మళ్లీ భార్గవ్ ఆర్ట్స్‌లో మా ముగ్గురి కాంబినేషన్లో సినిమాలు రాలేదు. మీ కాంబినేషన్లో ఓ జానపదం మొదలై, మధ్యలో ఆగిపోయింది. దానివిషయంలో గొడవలు జరిగాయని టాక్? కోడి రామకృష్ణ: అలాంటిదేం లేదు.. మేం ముగ్గురం పరస్పరం అభిమానించుకునేవాళ్లమే. కొందరు మధ్యవర్తుల కారణంగా ఆ సినిమా ఆగిపోయింది. ఇందులో అంతకుమించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. నిజానికి సినిమా 60 శాతం పూర్తయింది. రెడ్డిగారు బతికుంటే..పూర్తి చేసేవాళ్లం. మీ నిర్మాతలు.. మరొకరితో సినిమాలు చేయడానికి ఇష్టపడరు. కారణం? కోడి రామకృష్ణ: ప్రొడ్యూసర్‌కు తెలియకుండా నేను ఏదీ చేయను. నిర్మాత అభిరుచికి తగ్గట్టే కథల్ని ఎంచుకుంటాను. అభిరుచి లేని వ్యక్తులతో పనిచేయను. నా సినిమాల్లో కచ్చితంగా నిర్మాత ఇన్వాల్వ్మెంట్ ఉండాలని కోరుకుంటాను. ‘మీరు చూసిన పాత సినిమాల్లో మీకు బాగా నచ్చిన కథ ఏంటి? వాటిల్లో ఒక కథను ఎంచుకొని సినిమా తీయాల్సి వస్తే... ఏ కథను ఎంచుకుంటారు? అని మురారి గారిని అడిగాను. ‘ఆత్మీయులు సినిమా కథంటే ఇష్టం. దాన్ని మళ్లీ తీయాలని ఉంది’ అని చెప్పారు. వెంటనే ఆ రాత్రి ఆత్మీయులు సినిమా చూసి, ‘శ్రీనివాసకల్యాణం’ కథ చేశాను. ఇలా తొలినుంచి నిర్మాతను బట్టే నడుచుకుంటున్నా. అమ్మోరు, అరుంధతి సినిమాలను కూడా శ్యామ్ అభిరుచికి తగ్గట్టే తీసిపెట్టాను. ‘దేవి’ చేసినా, ‘దేవుళ్లు’ చేసినా అన్నీ నిర్మాతల అభిరుచికి తగ్గట్టే ఉంటాయి. సినిమా రషెస్ చూసి.. ‘మనం అనుకున్నదానికంటే సినిమా బాగా తీశారండీ..’ అని నిర్మాత అన్నప్పుడే నేను దర్శకునిగా సక్సెస్ సాధించినట్లు. నా సినిమా నిర్మాతకు నచ్చాలి. తర్వాతే జనాలకి. తలకు గుడ్డ కట్టుకుంటారు. చేతికి దారాలు. ఎందుకని? కోడి రామకృష్ణ: ‘మా పల్లెలో గోపాలుడు’ షూటింగ్‌ని మద్రాస్ కొవలం బీచ్‌లో చేస్తున్నాం. నాకు గుర్తు అది మే నెల. విపరీతమైన ఎండలు. ఆ టైమ్‌లో మోకా రామారావుగారని ఎన్టీఆర్‌గారి కాస్ట్యూమర్. ‘మా పల్లెలో గోపాలుడు’కి కూడా కాస్ట్యూమర్ ఆయనే. ఓ మధ్యాహ్నం ఆయన నా దగ్గరకొచ్చి ‘మీ ఫోర్ హెడ్ చాలా పెద్దది. ఎండలో అది బాగా ఎక్స్పోజ్ అయిపోతోంది’ అని తన బాక్స్‌లోంచి ఓ జేబు రుమాల తీసి నా నుదుటికి కట్టాడు. ఆ రోజు మొత్తం ఆ రుమాల అలాగే ఉంది. రెండోరోజు ఆయనే వచ్చి, ‘సార్ మీకు కట్టాక అనిపిస్తోంది. ఇది ఇప్పటిది కాదు.. ప్రీవియస్ బర్త్ది. నాకు తెలిసి చాలామంది ఇలా కట్టుకున్నారు కానీ... మీకు మ్యాచ్ అయినట్లు ఎవరికీ కాలేదు’ అని చెప్పి, ఓ టర్కీటవల్‌తో ప్రత్యేకంగా నా నుదురు కొలత ప్రకారం ఓ బ్యాండ్‌లా చేయించి, నాకిస్తే... కట్టుకున్నాను. అది చూసిన ప్రతివారూ బాగుంది అన్నారు. చివరకు బాలచందర్‌గారు కూడా. ఓ సారి ఆయన మా సెట్‌కి వచ్చారు. నన్ను చూసి ‘ఓసారి అద్దంలో చూసుకో’ అన్నారు. చూసుకుంటే.. నా బ్యాండ్‌పై ఓ సీతాకోక చిలుక వాలి ఉంది. దాని కారణంగా అందంగా కనిపిస్తున్నాను. అప్పుడన్నాడాయన.. ‘ఇది ఈ జన్మది కాదయ్యా... కచ్చితంగా పూర్వజన్మదే. అందుకే నీకు అంతబాగా అతికింది’ అని. అప్పట్నుంచి ఈ కట్టు నాకు సెంటిమెంట్ అయిపోయింది. నా ఫ్రెండ్సందరూ ఆస్ట్రాలజర్స్. వారందరూ ప్రతినెలా కొన్ని తాళ్లు, ఉంగరాలు పంపిస్తుంటారు. అవి కట్టుకోకపోయినా, ఉంగరాలు తొడుక్కోకపోయినా వాళ్లూరుకోరు. అందుకే వారికోసం అవన్నీ కట్టుకుంటా. ఒకవేళ అవన్నీ తీసేసినా... యాదృచ్ఛికంగా ఎవరో ఒకరు వచ్చి కట్టి వెళుతుంటారు. నిజంగా ఇది విచిత్రమే. సెంటిమెంట్లను నేను బాగా నమ్ముతాను. ఇప్పటికి ఎన్ని సినిమాలు తీసుంటారు? కోడి రామకృష్ణ: అంకె ఎవరికీ చెప్పలేదు. మీకే చెబుతున్నా. ప్రస్తుతం అర్జున్‌తో చేస్తున్న సినిమా, అవతారం, పుట్టపర్తి సాయిబాబా చిత్రాలను మినహాయిస్తే... ఇప్పటికి 138 అయ్యాయి. ‘వందవ సినిమా ఫలానా’ అని చెప్పుకోవడం నాకిష్టంలేదు. అందుకే ఎవరికీ చెప్పలేదు. ‘అంకుల్ ఆంజనేయస్వామి’ అని ఓ సినిమా చేయబోతున్నాను. వెరైటీ కాన్సెప్ట్. ఆంజనేయుడు, నలుగురు పిల్లలు కథ ఇది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌కి వెళ్లబోతోంది. త్వరలోనే గురువుగార్ని క్రాస్ చేయబోతున్నారన్నమాట? కోడి రామకృష్ణ: ఆ మాటనకండి. ఆయనెక్కడ... నేనెక్కడ! - బుర్రా నరసింహ మీతో మాట్లాడుతుంటే అర్థమవుతోంది... మీరు గతాన్ని బాగా ఇష్టపడతారని..! కోడి రామకృష్ణ: గతాన్ని ఇష్టపడినవాడు మాత్రమే భవిష్యత్తుని అందంగా మలచుకోగలడు. నా సినిమా కథలన్నీ నా జీవితంలో ఎదురైన అనుభవాలు, అనుభూతులే. మీకో విషయం తెలుసా? నా కెరీర్ ప్రారంభంలో మా అమ్మరాసిన ఉత్తరాలు ఇప్పటికే నేను చదువుతుంటాను. ‘పెద్దోడా... నిన్ను ఓసారి నానమ్మ చూడాలంటోంది రా, అమ్మమ్మావాళ్లు మొన్న ఇంటికొచ్చి వెళ్లారు. నిన్ను పదే పదే అడిగారు. మామయ్య వాళ్లు నిన్ను చూడ్డానికి వస్తాం అంటున్నారు’ అంటూ మా ఇంటి విషయాలన్నీ ఉత్తరాల్లో రాసేది. ఆ ఉత్తరాలు తీసి అప్పుడప్పుడు చదువుతుంటాను. అవి చదివినప్పుడల్లా... ఆ కేరక్టర్లన్నీ మళ్లీ నా దగ్గరకు వచ్చి వెళుతుంటాయి. నన్ను పలకరిస్తుంటాయి. మీకోవిషయం తెలుసా? వాళ్లల్లో ఎవరూ బతికిలేరు. చివరకు మా అమ్మతో సహా. 150 సినిమాలు తీసిన దాసరి నుంచి 138 సినిమాలు తీసిన కోడి రామకృష్ణ లాంటి గ్రేట్ డెరైక్టర్ బయటకొచ్చారు. మరి మీ నుంచి గొప్ప దర్శకులు రాకపోవడానికి కారణం? కోడి రామకృష్ణ: గ్రేట్ డెరైక్టర్ అనిపించుకోవాలంటే... పట్టుదల అవసరం. పరిశీలనాత్మక దృష్టి అవసరం. నేను ఇరవైనాలుగ్గంటలూ గురువుగార్నే అబ్జర్వ్ చేస్తుండేవాణ్ణి. అదే నన్ను ఈ స్థాయికి తెచ్చింది. గురువుగారిలా నేను కూడా నాటకరంగం నుంచే వచ్చినవాణ్ణి. అది కూడా నాకు హెల్ప్ అయ్యింది. పైగా మా భావాలను ధైర్యంగా మా గురువుగారికి చెప్పేవాళ్లం. అప్పట్లో గురువుగారి షూటింగ్‌లు రోజుకు నాలుగైదు జరుగుతుండేవి. ఓసారి స్క్రిప్ట్‌లో ఓ సన్నివేశం తృప్తిగా రాకపోవడంతో దాన్ని షూట్ చేయకుండా పక్కన పెట్టేశారు గురువుగారు. నేను ఆ సన్నివేశం గురించి అర్ధరాత్రి దాకా ఆలోచించి, అందులో ఓ చిన్న ఛేంజ్ చేసి, ఆ అర్ధరాత్రే గురువుగారి రూమ్ తలుపు తట్టాను. పద్మగారు తలుపు తీశారు. ‘ఏంటి రామకృష్ణ?’ అనడిగారు. ‘రేపు తీయబోయే సీన్ గురించి గురువుగారితో మాట్లాడాలి’ అన్నాను. ‘ఆయనతో పని చేసి ఆ పిచ్చి మీకూ తగులుకుంది. అర్ధరాత్రుళ్లు కూడా సినిమాల గోలేంట్రా’అని మందలించి, లోపలికి పంపించారు. ఆ టైమ్‌లో నేను రావడం చూసి ఎవరికైనా ఏమైనా జరిగిందేమోనని గురువుగారు కంగారు పడిపోయారు. ‘ఏంటి రామకృష్ణా..’ అన్నారు కంగారుగా. సీన్ గురించి చెప్పాను. ‘చాలా బాగుంది’ అని అభినందించారు. అయితే.. తెల్లారితే ఆ సీన్ తీయాలి. దానికి ఓ ముసలి మాస్టారు, 40 మంది పిల్లలు అవసరం. మాస్టారి పాత్రకు మా డెరైక్షన్ డిపార్ట్మెంట్లో ఉండే దుర్గా నాగేశ్వరరావుగారిని తీసుకున్నాం. 40 మంది పిల్లల కోసం ఆ రాత్రి మొత్తం ఊరంతా తిరిగి, తెల్లారేసరికి 40 మంది పిల్లల్ని పోగు చేశాను. ఒక సహాయ దర్శకుణ్ణి అయ్యుండి, సినిమా కోసం అంత కష్టపడేవాణ్ణి. అంతగా ఆలోచించేవాణ్ణి. సినిమాను అంతగా ప్రేమించేవాణ్ణి. పైగా ‘ఇగో’ అంటే తెలీని గొప్ప గురువు మాకు దొరికారు. ‘స్వర్గం-నరకం’ ఎడిటింగ్ టైమ్‌లో అనుకుంటా... గురువుగారు ఓ డైలాగ్ చెప్పారు. మేం పగలపడి నవ్వాం. ‘ఏమయ్యా.. మీ గురువు... దర్శకుడిగా ఫెయిలైపోయాడనుకో.. డైలాగులు రాస్కునైనా బతకొచ్చు కదా’ అన్నారు. అంతగా కలిసిపోయేవారాయన. నా శిష్యులతో కూడా నేనూ అలాగే ఉండటానికి ప్రయత్నిస్తా. ఒక మనిషి పైకి రావాలంటే.. ప్రతిభ, అదృష్టంతో పాటు పదిమంది సహకారం కూడా అవసరం. -
నాలుగు బూతులు రాసేసిడబ్బులు సంపాదించే నేచర్ కాదు నాది!
ఈ రోజుల్లో... హిట్! బస్ స్టాఫ్... హిట్!! ప్రేమకథాచిత్రమ్... హిట్!! కొత్త జంట... హిట్!!! హిట్టా!! ఇదింకా రిలీజ్ కాందే?! తీసింది మూడు. మూడూ హిట్. నాల్గోది మాత్రం ఎందుక్కాదు? ఎందుకౌతుంది? ఎందుకా?! డెరైక్టర్ ఎవరనుకున్నారు? డైలాగులు ఎవరివనుకున్నారు? మారుతికి బాగా డబ్బులొచ్చినట్లే కొంత చెడ్డపేరు కూడా వచ్చింది... ...యూత్‌ని పాడుచేసేస్తున్నాడని! మారుతి కోపగించుకోడు. ‘కథలో ఆత్మను పట్టుకోలేకపోతే ఎలా?’ అంటాడు. డబ్బుకోసం, పేరుకోసం చూసుకోని కుర్రాడే... ఇలా అనగలడు. ఇలా తీయగలడు. ఇలా మాట పడగలడు. ఈవారం ‘తారాంతరంగం’ చదవండి. అతడి సినిమాలను మళ్లొకసారి దగ్గరగా చూడాలనిపిస్తుంది. మీ ఫ్లాష్‌బ్యాక్ సినిమా స్టోరీని తలపిస్తుందట నిజమేనా? అసలు మీ బాల్యం ఎలా సాగింది? మారుతి: మాది కృష్ణాజిల్లా మచిలీపట్నం. అక్కడి రాధికా టాకీస్ ఎదురుగా మా నాన్న అరటిపళ్లు అమ్మేవారు. రోజుకి యాభై రూపాయలు సంపాదిస్తే.. గొప్పగా ఫీలయ్యేవారాయన. చిన్నప్పట్నుంచీ మా కుటుంబం మొత్తం కష్టంతోనే బతికింది. అమ్మ ఇంట్లోనే మిషన్ కుట్టేది. నాకు అక్క, తమ్ముడు ఉన్నారు. నేను స్కూల్కెళ్లి... మధ్యాహ్నం లంచ్ టైమ్‌లో నాన్న బండి దగ్గరకొచ్చి కూర్చునేవాణ్ణి. చెట్టుకింద ప్లీడర్, కాంచనసీత, ముద్దులమావయ్య.. ఈ సినిమాలన్నీ రాధికా థియేటర్లో రిలీజ్ అవుతూ ఉండేవి. నేను ఆ పోస్టర్లు చూస్తూ... వాటి బొమ్మలేస్తూ ఉండేవాణ్ణి. ఆ విధంగా డ్రాయింగ్ అలవాటైంది. తర్వాత ఓ మోటర్ ఏజన్సీ ఆఫీస్‌లో ఆఫీస్బోయ్లా చేరాను. అక్కడ వాళ్లకు టీలు సప్లయ్ చేయడం, జిరాక్స్‌లు తీయించుకురావడం చేసేవాణ్ణి. అదే ఆఫీస్‌లో నంబర్‌ప్లేట్లకు పెయిటింగ్ కూడా వేస్తుండేవాణ్ణి. అలాచేస్తే.. ప్లేట్‌కి పది రూపాయలు ఇచ్చేవారు. ఆ వచ్చిన ఆదాయంతోనే ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. ఆ తర్వాత స్టిక్కరింగ్ స్టార్ట్ చేశా. స్టిక్కరింగ్ చేయడంలో బందర్‌లోనే నంబర్‌వన్ అయ్యాను. నేను చేసిన నంబర్ ప్లేట్లకు అక్కడ అభిమానులున్నారు. బాపుగారి బొమ్మల్ని కూడా స్టిక్కరింగ్ చేసేవాణ్ణి. రోజుకు వెయ్యి లెటర్లు ఈజీగా కట్ చేసేవాణ్ణి. స్టిక్కరింగ్‌లో నేను చాలా ఫాస్ట్. ఓ వైపు స్టిక్కరింగ్ చేస్తూ... మరోవైపు కష్టపడి బీకాం పూర్తి చేశాను. చిన్నప్పట్నుంచీ కష్టపడతూనే ఉన్నందువల్ల బద్దకం అంటే ఏంటో ఇప్పటికీ నాకు తెలీదు. ఓ విధంగా అదే నన్ను ఈ స్థాయికి తెచ్చిందనుకుంటా. నా దృష్టిలో డబ్బులేని వాడు దరిద్రుడు కాడు. పనిలేనివాడు దరిద్రుడు. మీ నాన్న ఊహించనంత స్థాయికి ఎదిగారు కదా. ఇప్పుడాయన ఫీలింగ్ ఎలా ఉంది? మారుతి: నాన్న ఇప్పటికీ బందర్‌లోనే ఉన్నారు. ఆ ఊరు వదిలిపెట్టి రారాయన. ఆయన్ను కారుల్లో తిప్పాలని నాకుంటుంది. ఆయనేమో కారెక్కరు. సాధారణంగా బతకడానికే ఇష్టపడతారు. నాకు చేసిపెట్టడమంటే ఆయనకు ఆనందం. ‘సినిమా పోస్టర్‌పై మీ అబ్బాయ్ పేరు పడింది’ అని ఎవరైనా చెబితే... ఆ పోస్టర్ ముందు ఓ గంట గడిపి వెళతారాయన. సైకిలెక్కి నా పోస్టర్లన్నీ చూస్తూ ఊరంతా తిరుగుతారు. నేనంటే ఆయనకు అంత ఇష్టం. నాకు చిన్నప్పట్నుంచీ నాన్నతో అనుబంధం ఎక్కువ. అందుకే నా ‘బస్‌స్టాప్’ సినిమాలో ఇడ్లీబండి నడిపే వ్యక్తి పాత్రను అచ్చం మా నాన్న పాత్రలాగే డిజైన్ చేశా. ఆ పాత్ర గెటప్ కూడా మా నాన్నదే. అమ్మకు తెలీకుండా అప్పుడప్పుడు నాన్నకు వెయ్యిరూపాయలిస్తుంటా. దానికి ఆయన తెగ సంబరపడిపోతారు. ఆ వెయ్యిని ఆయన పుగాకు చుట్టల ఖర్చుకు వాడుతుంటారు. నాన్న లైఫ్‌లో గొప్ప ఎచీవ్మెంట్ ఏంటంటే... ఇదివరకు రాధికా థియేటర్ ఓనర్ వస్తున్నారంటే... నాన్న వెళ్లి గేట్ తీసేవారు. ఈ మధ్య ఆ థియేటర్ దగ్గరకు నాన్న వెళ్లారట. ఆయన్ను చూడగానే... థియేటర్ ఓనర్‌గారు గబగబా బయటకొచ్చి... నాన్నను థియేటర్లోకి తీసుకెళ్లి... ‘కుచేల్రావుగారొచ్చారు టీ తీసుకురండ్రా’ అని ఆయనతో టీ తాగించి, నాన్నతో ఓ ఫొటో కూడా దిగారట. ఆ క్షణంలో నాన్న కళ్లవెంట నీళ్లు తిరిగాయట. ఇంటికెళ్లి ఏడుస్తూ నాకు ఫోన్ చేశాడు. మా అమ్మ అయితే... ‘ఎంత ఆనందాన్ని ఇచ్చావురా.. ఇక మేం చచ్చిపోయినా ఫర్లేదు’ అని ఉద్వేగానికి లోనవుతూ మాట్లాడింది. నేను సాధించిందేంటో అప్పుడర్థమైంది నాకు. మా నాన్న అమాయకుడు, కుళ్లు, కుత్సితం తెలీని వాడు. అరటిపళ్ల బండిని నెట్టుకుంటూ... పొద్దున్నే వెళ్లి... మళ్లీ రాత్రి రెండిటికి ఇంటికొచ్చేవాడు. రోజుకు నలభై, యాభై రూపాయలు సంపాదించేవాడు. న్యాయంగా సంపాదించాలనుకునే దాంట్లోనే ఆయన జీవితం మొత్తం అయిపోయింది. అందుకే మా అమ్మానాన్నల్ని కంటికి రెప్పలా చూసుకోవాలనుంటుంది నాకు. బందరు నుంచి హైదరాబాద్ రావడానికి కారణమేంటి? డెరైక్టర్ అవ్వడానికేనా? మారుతి: కాదు.. ‘హార్ట్ యానిమేషన్ అకాడమీ’ పేరుతో అక్కినేని వెంకట్, తదితరులు ఓ ఇనిస్టిట్యూట్ స్థాపించారు. యానిమేషన్‌పై ఉత్సాహం ఉన్న ఆర్టిస్టులు అప్లయ్ చేయొచ్చనే యాడ్ చూసి... అప్లయ్ చేశాను. రమ్మని కబురొచ్చింది. ఓ పదిహేను వేల రూపాయలు తీసుకొని హైదరాబాద్‌లో అడుగుపెట్టా. ఫౌండేషన్ కోర్స్కే పదిహేను వేలు అన్నారు. టోటల్ కోర్స్ నేర్చుకోవాలంటే.. లక్షా 30 వేలు అవుతుందని తెలిసింది. ముందు ఫౌండేషన్ కోర్స్‌లో జాయినైపోయాను. నాతోపాటు ఓ రెండుమూడొందలు మంది ఆ కోర్స్‌లో చేరారు. ఓ వైపు కోర్స్ చేస్తూ... మరోవైపు పంజాగుట్టలో నంబర్ప్లేట్లు వేస్తూ ఉండేవాణ్ణి. అక్కడ నంబర్ప్లేట్లు వేస్తే... రోజుకు వంద రూపాయలిచ్చేవారు. అవి నా ఖర్చులకు సరిపోయేవి. ఫౌండేషన్ కోర్స్ అయ్యాక... మెయిన్ కోర్స్ జాయిన్ అవ్వాలి. ఆ కోర్స్ చేయాలంటే... లక్షా 30 వేల రూపాయలు కట్టాలి. నా దగ్గర అంత స్తోమత లేదు. ఏం చేయాలి? అనుకుంటున్న టైమ్‌లో... బాగా చేసిన ఓ పదిమందికి స్కాలర్షిప్ ఇస్తామని నోటీస్ బోర్డ్‌లో పెట్టారు. ఆ పదిమందిలో ఒకరిగా నిలవడానికి రెండొందల మందీ పోటీపడ్డారు. ఎలాగైనా బాగా చేసి ఆ పదిమందిలో నేనూ ఒకణ్ణి కావాలని కష్టపడ్డాను. అదృష్టవశాత్తూ అనుకున్నది సాధించాను. కష్టపడి యానిమేషన్ నేర్చుకున్నాను. కోర్స్ పూర్తయ్యాక శ్రీవెన్ మల్టీటెక్లో జాబ్ వచ్చింది. నెలకు నాలుగువేలు జీతం. అక్కడ కొన్నాళ్లు చేశాక డీక్యూలో జాబ్ వచ్చింది. అక్కడ చేసిన నాలుగైదేళ్లలో నెలకు లక్షా 30 వేలు డ్రా చేసే రేంజ్‌కి వచ్చాను. ఆ టైమ్‌లోనే బన్నీతో పరిచయం ఏర్పడింది. బన్నీతో మీ అనుబంధం గురించి చెప్పండి? మారుతి: తాను ఆర్టిస్టు కాకముందు.. యానిమేషన్ నేర్చుకోవాలనుకున్నాడు. మంచి ట్యూటర్ ఎవరని వాకబ్ చేసి, చివరకు నన్ను పిలిపించారు. బన్నీ వాళ్ల అమ్మగారు మాకు దూరపు బంధువు. దాంతో అనుకోకుండా బాగా కలిసిపోయాం. బన్నీకి నా కామెడీ టైమింగ్ అంటే చాలా ఇష్టం. నాతో మాట్లాడటానికి ఇష్టపడేవాడు. ఇప్పటికీ నా సినిమా రిలీజైతే... తప్పకుండా తొలిరోజే చూస్తాడు. త్వరలో మేమిద్దరం కలిసి ఓ సినిమా చేస్తాం. ‘నీతో సినిమా అంటూ చేస్తే... ఆ సినిమా నీ స్టయిల్లోనే ఉండాలి’ అంటాడు తను. అసలు డెరైక్టర్ అవాలని ఎందుకనిపించింది మీకు? మారుతి: నేను టెన్త్ చదువుతున్న టైమ్‌లో ‘శివ’ రిలీజైంది. నాచురాలిటీకి దగ్గరగా సన్నివేశాలుండటం, ఆర్టిస్టులందరూ సెటిల్డ్‌గా మాట్లాడటం... ఇవన్నీ కొత్తగా అనిపించాయి. ‘సినిమా’ అనే మాధ్యమంపై నాకు ఆసక్తిని పెంచిన సినిమా అది. ఓ విధంగా నేను రామ్గోపాల్వర్మగారికి భక్తుణ్నని చెప్పాలి. ‘శివ’ చూసి ఇంటికెళుతూ.. దారిలో నాలో నేనే మాట్లాడేసుకునేవాణ్ణి. ఒక్కణ్ణే యాక్షన్ చేసుకుంటూ వెళ్లేవాణ్ణి. అలాగే... చిరంజీవిగారి సినిమాల ప్రభావం కూడా నాపై ఉంది. నేను చిన్నప్పట్నుంచీ క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్నవాణ్ణి అవడం, బొమ్మలు బాగా వేయగలిగినవాణ్ణి కావడం వల్ల... కెమెరా బ్లాక్లంటే నాకు చాలా ఇష్టం. బాపుగారిలా స్పాట్లోనే బొమ్మలతో స్టోరీబోర్డ్ వేసుకునేవాణ్ణి. ఆ విధంగా నాకు తెలీకుండానే... డెరైక్షన్‌కి చేరువయ్యాను. ఇప్పటికీ స్టోరీబోర్డ్ గీసే... నా కెమెరామేన్‌కి సీన్ వివరిస్తాను. దర్శకత్వం చేయాలంటే... ఎవరిదగ్గరో పనిచేయనవసరం లేదు. సినిమా చూసి కూడా నేర్చుకోవచ్చు. గ్రామర్ అనేది సినిమాలోనే కనిపిస్తుంది. డెరైక్షన్ సరే... డైలాగులు ఎలా రాయగలుగుతున్నారు? మారుతి: నాలో రైటర్ ఉన్నాడని నాకే తెలీదు. పైగా బుక్స్ చదవడం అంటే నాకు పరమ ఎలర్జీ. రైటర్ అనేవాడికి కచ్చితంగా సాహిత్యంపై గ్రిప్ ఉండాలి. కానీ బుకిష్ నాలెడ్జ్ నాకస్సలు లేదు. అలాంటి నాకు రాయడం ఎలా సాధ్యమైంది? అంటే.. అది దైవదత్తమే అంటాను. చిన్నప్పట్నుంచీ ఫ్రెండ్స్‌ని జోకుల్తో నవ్విస్తుండేవాణ్ణి. వాటినే పేపర్‌పై ఎందుకు పెట్టకూడదు? అని రాయడం మొదలుపెట్టాను. నా గత చిత్రాల సంగతేమో కానీ.. ‘కొత్తజంట’లో నా డైలాగుల్ని మాత్రం కచ్చితంగా అందరూ మెచ్చుకుంటారు. సినిమా ప్రభావం సమాజంపై ఎక్కువగా ఉంటుంది. అది చాలా శక్తిమంతమైన మాధ్యమం. యువతరాన్ని తప్పుదోవ పట్టించే ద్వంద్వార్థ సంభాషణలు సినిమాల్లో చేర్చడం ఒక బాధ్యతగల దర్శకుడిగా కరెక్టేనంటారా? మారుతి: పైకి ఎలా కనిపించినా... అంతర్లీనంగా ప్రతి ఒక్కరిలో ఓ క్యారెక్టర్ ఉంటుంది. దాన్ని తెరపైకి తెస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనకు రూపమే ఈ రోజుల్లో, ‘బస్‌స్టాప్’ సినిమాలు. ‘ఒక ప్రాబ్లమ్‌ని డిస్కస్ చేద్దాం’ అనుకొని చేసిన సినిమాలవి. వాటి తర్వాత చాలామంది డబుల్మీనింగ్లతో సినిమాలు తీశారు. అవన్నీ ఎందుకు ఆడలేదు? బూతులే సినిమాలను ఆడిస్తే... షకీలా సినిమాలు సంవత్సరం ఆడాలి. ఎందుకు ఆడవు? ప్రతికథకు ఆత్మ అనేది ఒకటుంటుంది. కథలోని సోల్ గొప్పదై ఉండాలి. నేను ఏది చెప్పినా సూటిగానే చెబుతాను. అది కొందరికి నచ్చకపోవచ్చు. కానీ... ఎక్కువమందికి నచ్చింది. కాబట్టే నా సినిమాలు హిట్లయ్యాయి. నేను టాలెంట్‌ని నమ్ముకొని వచ్చినవాణ్ణి. ఏదో నాలుగు బూతు డైలాగులు రాసి హిట్లు కొట్టేసి డబ్బులు సంపాదిద్దాం అనుకునే నేచర్ కాదు నాది. ట్రెండ్ మారింది. మనం మాట్లాడుతున్న తీరు మారింది. ప్రతిదీ భూతద్దంలో చూడకూడదు. అందుకని మరీ ఎడ్యుకేట్ చేసేలా సినిమాలు ఉండకూడదు కదా! ముఖ్యంగా మీ ‘బస్‌స్టాప్’ సినిమాలో కొన్ని సన్నివేశాలైతే.. చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని కొందరి అభిప్రాయం. ఉదాహరణకు బాత్రూమ్లో ల్యాప్‌టాప్ సీన్. అలా చూపించొచ్చా? మారుతి: నేటియువత ఎలా ఉన్నారు అనేది మీకు తెలియందీ కాదు... నాకు తెలియందీ కాదు. నేను చూపించింది టెన్ పర్సెంట్ మాత్రమే. బయట పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇళ్లల్లో జరుగుతున్నా సరే... బయట చెప్పుకోలేని పరిస్థితిని ప్రస్తుతం సమాజం ఫేస్ చేస్తోంది. సర్దుకుపోవడం సొసైటీకి అలవాటైపోయింది. కూతురు ఓ కుర్రాడ్ని ప్రేమిస్తుందని తెలిస్తే.. ‘ఈ ఏజ్‌లో కామనేలే’ అని తండ్రులే సర్దుకుపోతున్నారు. టైమొచ్చినప్పుడు, కరెక్టోడు దొరికినప్పుడు ముడిపెట్టేద్దాం అనుకుంటున్నారు. కాస్త మధ్య తరగతి కుటుంబాల్లోనే ఇంకా కట్టుబాట్లు బతికున్నాయి. చదువు కారణంగా పిల్లలకు కూడా ఫ్రీడమ్ ఇవ్వక మధ్యతరగతి తల్లిదండ్రులకు తప్పడంలేదు. అలాంటి టైమ్‌లో వాళ్లకు కొన్ని నిజాలు తెలియాలి. అందుకే ‘బస్‌స్టాప్’ తీశాను. నేను ఒక జానర్‌ని ఎంచుకున్నా. ‘ఇది నా జానర్’ అని ట్రైలర్లోనే చెప్పేస్తున్నా. అది నచ్చినోళ్లే సినిమాకొస్తారు. నచ్చనివారు రారు. దట్సాల్. ఈ రోజుల్లో, బస్‌స్టాప్ చిత్రాలు మీకు సక్సెస్‌లు ఇచ్చాయి. అలాగే విమర్శలకు కూడా కారణమయ్యాయి. మీపై విమర్శలు వినిపించినప్పుడు మీకు బాధ అనిపించిందా? మారుతి: నేను బూతుడైలాగుల్నే నమ్ముకొని వచ్చినవాణ్నయితే.. మీరన్నట్లు భయం, బాధ కలుగుతాయి. కానీ... నన్ను ఇంకా పూర్తిగా ఎవరూ చూడలేదు. నా సామర్థ్యం తెలిసిన వారు ఇక్కడ చాలా తక్కువ. అలాంటప్పుడు నేను బాధ పడటం ఫూలిష్‌నెస్ అవుతుంది. అందుకని విమర్శలను నేను తేలిగ్గా మాత్రం తీసుకోను. నన్ను ఒకరు విమర్శించారంటే... కచ్చితంగా నాలో తప్పు ఉండే ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? రెండోసారి ఆ తప్పు రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఆ విషయంలో నేను చాలా పర్ఫెక్ట్గా ఉంటాను. నేను క్లీన్ మూవీలు కూడా తీయగలను అని నిరూపించుకోవడానికే ‘ప్రేమకథాచిత్రమ్’ తీశాను. ‘ప్రేమకథాచిత్రమ్’ మీపై వచ్చిన బ్యాడ్‌ని కొంతవరకు తుడిచేసిందనే చెప్పాలి. మారుతి: కచ్చితంగా... ఆ సినిమా నాకిచ్చిన ఎనర్జీ అంతా ఇంతా కాదు. కేవలం ఆ సినిమా వల్లే ఎన్నో కథలు నాలో పుట్టాయి. ‘ప్రేమకథాచిత్రమ్’ని ఎడిటింగ్ రూమ్‌లో చూసిన చాలామంది పెదవి విరిచారు. అది సినిమానే కాదన్నారు. ‘ఆ గిరిగాడు అసలు ఆర్టిస్టే కాదు. వాణ్ణి ఎందుకు నమ్మావ్... వాడి లెంగ్త్‌లు కట్ చేయ్’ అని సలహా ఇచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. కొందరైతే ఇంకో అడుగు ముందుకేసి, ‘ఇలాంటి క్లీన్ సినిమాలు నీ నుంచి చూడరు... నీ నుంచి డబుల్‌మీనింగ్ డైలాగుల్నే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇందులో అవేం వినబడటం లేదు. ఇది కచ్చితంగా ఆడదు. అందుకే.. ఈ సినిమాకు నీ పేరు వేసుకోకు’ అని చెప్పారు. నిజంగా భయపడిపోయా. ఓసారి తెల్లారుజాముదాకా ఎడిటింగ్ రూమ్‌లోనే కూర్చొని మళ్లీ మళ్లీ సినిమా చూశా. బాగానే ఉందే అనిపించింది. గుడ్డిగా సినిమాను విడుదల చేశాం. మేం ఖర్చుపెట్టిన దానికి ఏడురెట్లు వసూళ్లు చేసిందా సినిమా. ‘నువ్వు కొత్తగా వెళ్లు.. మేం ఆదరిస్తాం’ అని జనాలు నాకిచ్చిన భరోసా ‘ప్రేమకథాచిత్రమ్’. మీ వయసు మూడు సినిమాలు. ఓ విధంగా మీరే నిలదొక్కుకునే స్టేజ్‌లో ఉన్నారు. కానీ మీరేమో అందుకు భిన్నంగా... మీరు నిలబడుతూ... పదిమందిని నిలబెడుతూ ముందుకెళ్తున్నారు. నేటి దర్శకులకు భిన్నంగా పడుతున్నాయి మీ అడుగులు. ఇది అనుకోకుండా జరుగుతోందా? లేక ఓ ప్లాన్ ప్రకారం వెళుతున్నారా? మారుతి: నేను కష్టపడి పైకొచ్చినవాణ్ణి. అందుకే కష్టపడి పనిచేసేవారంటే నాకిష్టం. క్రియేటివ్ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి.. ప్రతిభను తేలిగ్గా పసిగట్టగలను. బహుశా ఈ లక్షణాల వల్లే పదిమందికి హెల్ప్ అవుతున్నానేమో. ఇండస్ట్రీతో నా అనుబంధం దశాబ్దంపైనే. తొలినాళ్లలో కొన్ని సినిమాలను పంపిణీ కూడా చేశాను. టాలెంట్ ఉండి కూడా వెనుకబడ్డవారిని ఇక్కడ చాలామందిని చూశాను. శక్తి లేనప్పుడు వారిని చూసి బాధపడేవాణ్ణి. ఇప్పుడు నాకు దేవుడు కావాల్సినంత శక్తినిచ్చాడు. అందుకే ప్రోత్సాహాన్నిస్తున్నా. ‘అదృష్టం’ అనే ఫ్లాప్ సినిమాను తీసేసరికి శేఖర్సూరిపై అందరూ ఫ్లాప్ డెరైక్టర్ అనే ముద్ర వేశారు. అతని టాలెంట్ నాకు పూర్తి తెలుసు. అందుకే... ‘ఏ ఫిలింబై అరవింద్’ కథ తాను తయారు చేసుకున్నప్పుడు... ఇండస్ట్రీలో చాలామందికి అతనితో కథ చెప్పించాను. చివరకు వర్కవుట్ అయ్యింది. తీశాడు. పెద్ద హిట్ కొట్టాడు. అందరూ మంచి డెరైక్టర్ అన్నారు. ఒక్క ప్రయత్నంతో ఎవరి ప్రతిభను అంచనా వేయకూడదని, మరొక కోణంలో అతనికి టాలెంట్ ఉండొచ్చని దాన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. అలాంటి వాళ్లను ప్రోత్సహించి, షైన్ చేస్తే... మరిన్ని మంచి సినిమాలొస్తాయి. అందుకే ప్రతిభ ఉన్నవాళ్లను ప్రోత్సహిస్తున్నా. నా గడప తొక్కిన ఎవరైనా సరే... నిరుత్సాహంతో వెనుదిరగడానికి నేనిష్టపడను. ‘దాసరి’ మారుతి.. సాధ్యమైనంతమేర ఇంటిపేరును సార్థకత చేసుకునే పనిలో ఉన్నట్టున్నారు మారుతి: అంతపెద్ద కోరికలేం లేవండీ.. ఒక ప్రణాళిక ప్రకారం నేనెప్పుడూ నడవలేదు. ఏది అనిపిస్తే అది చేసుకుంటూ పోయానంతే. నేను బతకాలి.. ఏం చేస్తే బతకగలను? అనేదే ఫస్ట్ ఆలోచించా. ఆ ఆలోచనే... స్టిక్కరింగ్ వేసుకొని బతికే నన్ను నెలకు లక్షా 30 వేల రూపాయలు డ్రా చేసేలా చేసింది. ‘నేనంటూ ఒకణ్ణి ఉన్నానని అందరికీ తెలియాలి. అందరి దృష్టీ నాపై పడాలి’ అని ఆశించాను. ఆ ఆశే ‘ఈ రోజుల్లో’ సినిమా తీసేలా చేసింది. నా రెండో సినిమా ‘బస్‌స్టాప్’కి నాపై ‘బూతు డెరైక్టర్’ అనే ముద్ర వేశారు. అప్పుడు దర్శకుడిగా నేనేంటో అటు ఇండస్ట్రీకి, ఇటు ప్రేక్షకులకూ తెలియాలి అని కసిగా అనుకున్నా. ఆ కసే ‘ప్రేమకథాచిత్రమ్’ తెరకెక్కించేలా చేసింది. వంద సినిమాలు డెరైక్ట్ చేశాక గానీ... దాసరి, రాఘవేంద్రరావు లాంటివాళ్లు ‘దర్శకత్వ పర్యవేక్షణ’ అనే టైటిల్‌కార్డ్ వేసుకోలేదు. మీరు మూడో సినిమాకే ఆ కార్డ్ వేసేసుకున్నారు. ఆ టైటిల్ కార్డ్ చూడగానే.. మారుతీకి అప్పుడే అంత దేనికి? అనుకున్నవారు లేకపోలేదు... మరి మీరేమంటారు? మారుతి: నాకు ఏ దారి కరెక్ట్ అనిపిస్తే.. ఆ దారిలో వెళతా. అంతేతప్ప వాళ్లు తిడుతున్నారని, వీళ్లు పొగుడుతున్నారని నా దారి మార్చుకోను. నేను రోడ్డు పక్కన ప్లాట్‌ఫాంపై స్టిక్కరింగులేసుకుని బతికినోణ్ణి. ఈ రోజు ఉన్నట్టుండి పేరుప్రఖ్యాతులు వచ్చాయి. వీటిని శాశ్వతం అని నేను అనుకోను. ఇవన్నీ ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు. పోయినా నేను పెద్దగా ఫీలవ్వను. ఎందుకంటే.. నా విద్య నాకుంది. మళ్లీ రోడ్డుమీదకెళ్లి స్టిక్కరింగులేసుకుంటా. మాటవరసకు చెబుతున్న మాట కాదిది. మళ్లీ చేసి చూపిస్తా. ఇడ్లీ బండి పెట్టుకొని కూడా బతికేయగలను. ‘మారుతీకి అప్పుడే అంత దేనికి?’ అనుకున్నవారికి నేనిచ్చే సమాధానమిది. దర్శకత్వ పర్యవేక్షణ అనే టైటిల్‌కార్డ్ ‘దర్శకత్వం’ అనే టైటిల్‌కార్డ్ కంటే గొప్పదేం కాదు. నాకు తెలిసి దానికి సీనియారిటీతో పనిలేదు. స్టార్‌డమ్‌ని పట్టించుకోనని మీరంటున్నారు. కానీ బయట మీపై వేరే అభియోగం ఉంది. స్టార్డమ్ ఉండగానే ఇంటికి చక్కదిద్దుకుంటున్నారనీ... కనిపించిన ప్రతి సినిమానూ సమర్పించేస్తున్నారనీ, సదరు నిర్మాతల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారని అనుకుంటున్నారు. మీరేం అంటారు? మారుతి: నా స్టార్‌డమ్‌ని నేను వాడుకోవడంలా, నా పేరును, నా ఇమేజ్‌ని వేరే వాళ్లు వాడుకుంటున్నారు. ‘మా సినిమాను ‘సమర్పణ’ అని మీ పేరు వేసుకుంటాం. దానికి ప్రతిగా 75 లక్షలిస్తాం’ అని గత ఏడాది నన్నడిగిన వాళ్లు కోకొల్లలు. అలా వచ్చిన ప్రతి ఆఫర్‌నీ నేను ‘ఓకే’ చేసుంటే... ఒక్క ఏడాదిలోనే కోట్లు సంపాదించేవాణ్ణి. కథ గురించి తెలుసుకోకుండా, దర్శకుని ప్రతిభను అంచనా వేయకుండా.. కేవలం డబ్బు తీసుకొని సినిమాలను సమర్పిస్తున్నాననడం అన్యాయం. నిజానికి అక్కడ జరుగుతోంది వేరే. ముందు కథ వినాలి. ఆ ప్రాజెక్ట్‌పై నమ్మకం కుదిరాక, వాళ్లకు మంచి టెక్నీషియన్లను సెట్ చేయాలి. ఇదంతా నా బాధ్యతే. సినిమా తీసినవారికీ, కొన్నవారికీ లాభాలు తెచ్చిపెట్టే విధంగానే బిజినెస్ చేసిపెట్టే బాధ్యత కూడా నాదే. సినిమాకయ్యే ఖర్చు మాత్రం సదరు నిర్మాతే భరిస్తాడు. ఆ సినిమాకు ప్రాఫిట్ వస్తే... నేను పడిన కష్టానికి ప్రతిఫలంగా ప్రాఫిట్లో సగం తీసుకుంటా. ప్రాఫిట్ రాకపోతే... ఆ సినిమా నుంచి ఏమీ ఆశించను. చిన్న సినిమాలకు ‘సమర్పణ’గా నా పేరు వేయడం వల్ల.. వాటికి కాస్తంత ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా నా పేరు కాస్త హెల్ప్ అవుతుంది. అలాగే.. నా కింద వందమంది ఎంప్లాయిస్ పనిచేస్తున్నారు. వాళ్లందరికీ పని దొరుకుతుంది. ‘మారుతి సమర్పించు’ అనే టైటిల్ కార్డ్ వెనుక ఇంత కథ ఉంది. సరే... వెంకటేష్‌తో ‘రాధా’ అంటున్నారు. హోంమినిస్టర్ ప్రేమకథ అంటున్నారు. ఏంటా కబుర్లు? మారుతి: మంచి లవ్‌స్టోరీ అది. వెంకటేష్‌గారి ఏజ్‌కి తగ్గట్టుగా ఉంటుంది. సెలబ్రిటీలు కూడా ప్రేమలో పడతారు. అయితే... దాన్ని వ్యక్తవరచడం మాత్రం వారికి కష్టతరమైన విషయం. ఓ సాధారణ స్త్రీని... ఓ హోంమినిస్టర్ ఇష్టపడితే.. దాన్ని తాను ఎలా వ్యక్తపరిచాడు? తద్వారా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అనేది ఈ సినిమా కథ. మారుతి ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్నాడని అందరూ అంటున్నారు కదా. అందుకే... ఆ పేరు చెడకుండా ఈ సినిమా ఉంటుంది. 27ఏళ్ల కెరీర్లో దాదాపు అన్ని రకాల పాత్రలూ చేశారు వెంకటేష్. అలాంటి హీరోని కొత్తగా చూపించడం ఎలా? అని ఆలోచించి ఇష్టంతో చేసుకున్న సబ్జెక్ట్ ఇది. నా స్టైల్లోకి ఆయన్ను తెచ్చుకొని ఈ కథ రాసుకున్నాను. సరదాగా అందరూ నవ్వుకునేలా సినిమా ఉంటుంది. మీరు సృష్టించిన ట్రెండ్‌లోనే ప్రస్తుతం చిన్న సినిమాలన్నీ నడుస్తున్నాయి. ఎటు చూసినా అవే కథాంశాలు. ఓ విధంగా జనాలు విసిగిపోయారనే చెప్పాలి. ఈ ట్రెండ్‌ని మీరే బ్రేక్ చేయొచ్చుగా? మారుతి: తప్పకుండా చేస్తా. ప్రేక్షకులకు కాదు, నాక్కూడా చికాకుగానే ఉంది. గోడలపై ఈ రోజు కనిపించిన పోస్టర్ రేపు కనిపించడం లేదు. బూతులు పెట్టేస్తే సినిమా ఆడేస్తుందనుకొని, విలువలకు తిలోదకాలిచ్చేసి సినిమాలు తీస్తున్నారు. చివరకు దెబ్బతింటున్నారు. ఈ తీరుగా సినిమాలు రాకపోతేనే మంచిది. సినిమా అనేది కాపీ జాబ్ కాదు. క్రియేటివ్ జాబ్. హిట్ సినిమాలను, కొరియన్ సినిమాలను, పరభాషా కథలను కాపీ కొట్టేసి తీసే సినిమాలు నా దృష్టిలో సినిమాలే కాదు. సినిమా అంటే... మనలోంచి పుట్టాలి. మస్తిష్కంలోంచి ఉద్భవించాలి. ప్రాబ్లమ్ సొసైటీలోంచి తీయాలి. అది అందరికీ కనెక్టయ్యేదిగా ఉండాలి. ‘బొమ్మరిల్లు’ ఎందుకు ఆడింది అంటే.. ప్రతి కుటుంబానికి ఆ కథ కనెక్ట్ అయ్యింది.. కొత్త సినిమాలొస్తే ప్రూవ్ అవుతాయ్ అనడానికి ఆ సినిమానే నిదర్శనం. - బుర్రా నరసింహ ‘ఈ రోజుల్లో’ సినిమా విడుదల ముందురోజు రాత్రి... మీరు పడిన అంతర్మథనం? మారుతి: అది నా జీవితంలో గొప్ప మిరాకిల్. సినిమా అంటేనే తెలీని నేను, 5డి కెమెరాతో సినిమా తీశాను. చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అప్పటికే సినిమాను అమ్మేశాం. వాళ్లిచ్చిన డబ్బులు ఖర్చుపెట్టేశాం. డీటీఎస్ ప్రింట్లు కూడా లేవు. సినిమా రిలీజ్ రోజున ఎవరూలేని ఓ వీధిలో ఓ పక్కగా కారును పార్క్‌చేసి, ‘సినిమా ఎందుకు తీశాన్రా దేవుడా...’ అంటూ కన్నీటి పర్యంతం అయ్యాను. ఆ క్షణాలు నాకింకా కళ్లముందు కదులుతూనే ఉన్నాయి. నాకు ఫస్ట్ నుంచి నెగిటివ్‌గా ఆలోచించడం అలవాటు. ‘రేపు సినిమా రిలీజ్ అవుతుంది. పెద్ద ఫ్లాప్ అవుతుంది. కొన్నవాళ్లందరూ మీద పడతారు. ఏం చేయాలి?’ ఇదే ఆలోచన. అందుకే నాకు రెండు ఫోన్లు ఉంటే... ఒక ఫోన్ స్విచాఫ్ చేసేశాను. ఇంతలో రెండోఫోన్ రింగ్ అయ్యింది. ‘గోకుల్ థియేటర్ దగ్గర జనాలున్నారు...రా’ అంటూ ఫ్రెండ్ ఫోన్. ‘హె... ఈ సినిమాకు జనాలుండటం ఏంటి... ఉట్టిమాట’ అనుకున్నా. మళ్లీ ఫోన్... ‘మన ట్రైలర్స్‌కి మంచి ఇంపాక్ట్ వచ్చినట్టుంది.. ఏలూరులో కూడా జనాలు ఫుల్‌గా ఉన్నారంట’ అని. ఏదో మిరాకిల్ జరుగుతున్నట్టు అనిపించి, గోకుల్ థియటేర్కి వెళ్లాను. తలుపు తీసి థియేటర్లోకి అడుగుపెట్టగానే.. హాల్లో నాన్‌స్టాప్ నవ్వులు. జనాలు విపరీతంగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు. వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. ఆ రోజునే తొలిసారిగా నాకు వందకు పైగా ఫోన్లొచ్చాయి. ఆ అంకె ఇప్పటికీ తగ్గలేదు. ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ‘ఈ రోజుల్లో’ విషయంలో... నా మిత్రులు నాన్‌స్టాప్ శ్రీను, ఎస్కెఎన్ నాకిచ్చిన మోరల్ సపోర్ట్‌ని మాటల్లో చెప్పలేను. నా ప్రాజెక్ట్‌ని వాళ్లిద్దరూ తీసుకెళ్లి జనాల్లోకి విసిరేశారు. వారిద్దరూ పబ్లిసిటీ చేసిన విధానమే ‘ఈ రోజుల్లో’ సినిమాను నిలబెట్టింది. ‘ఈ రోజుల్లో’ ముందు, ‘ఈ రోజుల్లో’ తర్వాత మీలో మీరు గమనించిన తేడా? మారుతి: ‘ఈ రోజుల్లో’ ముందు పేపర్ బయట ఉండేవాణ్ణి. ‘ఈ రోజుల్లో’ తర్వాత పేపర్లోకి వచ్చాను. అంతే తేడా! ఇంతకు మించి నాలో ఏ మార్పూ లేదు. నాలో మార్పు రాదు కూడా. అయితే... ఒకప్పుడు నన్ను తక్కువగా చూసిన వారూ, నన్ను శత్రువుగా భావించిన వారు.. ఇప్పుడు ‘మారుతి మా వాడు’ అన్నట్లు బిహేవ్ చేయడం, నాకు దగ్గర కావడానికి ప్రయత్నించడం... చూస్తుంటే... ఏదో తెలీని చిన్న సంతృప్తి. ‘ప్రేమకథాచిత్రమ్’ సినిమాకి దర్శకుడు ప్రభాకరరెడ్డి అయితే.. క్రెడిట్ మొత్తం మారుతీ కొట్టేశాడని అనుకునేవాళ్లు చాలామందే ఉన్నారు..? మారుతి: ఆ విషయం చెప్పేముందు.. ఈ సినిమాకు ముందు జరిగిన ఓ సంఘటన గురించి చెప్పాలి. ‘ప్రేమకథాచిత్రమ్’ నిర్మాత సుదర్శన్‌రెడ్డి.. ‘ఈ రోజుల్లో’ నుంచీ నాకు పరిచయం. ‘ఈ రోజుల్లో’ చిత్రాన్ని వైజాగ్‌లో రిలీజ్ చేయాలనుకున్నారాయన. అనుకోకుండా ఎడిటింగ్ రూమ్‌లో ఆ సినిమా చూశారు. ఇది ఆడే ప్రసక్తే లేదని, అట్టర్‌ఫ్లాప్ సినిమా అని తేల్చిపారేశారు. ఆయన అభిప్రాయం అదైనప్పుడు ఆయనకే వైజాగ్ అమ్మడం కరెక్ట్ కాదని, వేరే వాళ్లకు ఆ సినిమా ఇచ్చాం. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. కొన్నవాళ్లకు విపరీతమైన లాభాలు తెచ్చిపెట్టింది. సుదర్శన్‌రెడ్డి అప్పుడు నిజంగా షాక్ అయ్యారు. ‘ఇంత హిట్ సినిమాను ఏ దృష్టితో చూశాను’ అని బాధపడిపోయారు. అప్పుడే తనకు ఓ సినిమా చేసిపెట్టమని అడిగారు. ‘బస్‌స్టాప్’ షూటింగ్ టైమ్‌లో అయిదులక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చారు. నేనేమో అప్పటికే గీతా ఆర్ట్స్‌వారికి కమిటై ఉన్నాను. ఇచ్చిన మాట ప్రకారం మూడో సినిమా గీతా ఆర్ట్స్‌కే చేయాలి. అందుకే...‘ కథ, మాటలు ఇచ్చి.. నా కోై-డెరెక్టర్ రాజేష్‌తో సినిమా చేయిస్తాను’ అని చెప్పాను. ఆయన ‘ఓకే’ అన్నారు. హీరోగా సుధీర్‌బాబుని ఫైనల్ చేశారు. అయితే... సుధీర్‌బాబు మాత్రం నేను డెరైక్ట్ చేస్తేనే సినిమా చేస్తానన్నాడు. ‘నేనే డెరైక్ట్ చేస్తాను కానీ.. పేరు మాత్రం వేసుకోలేను’ అని సుధీర్‌కి నిర్మొహమాటంగా చెప్పేశాను. చివరకు ఎలాగో అంగీకరించాడు. అయితే... మా కో-డెరైక్టర్ రాజేష్ మాత్రం ఇబ్బందిగా ఫీలయ్యాడు. ‘మీరు డెరైక్ట్ చేస్తుంటే నేను పక్కన ఉండటం, పేరు మాత్రం నాది వేయడం ఇబ్బందిగా ఉంటుంది. నేను ఈ సినిమా చేయలేను’ అనేశాడు. అలాంటి టైమ్‌లో.. మా కెమెరామేన్ ప్రభాకరరెడ్డి.. ఆయనంతట ఆయనే వచ్చి.. ‘ఎవరి పేర్లో దేనికి? నా పేరు వేసుకో. నా కెలాంటి అభ్యంతరం లేదు’ అని చెప్పడంతో... ప్రభాకరరెడ్డిగారి పేరు మీద ‘ప్రేమకథాచిత్రమ్’ డెరైక్ట్ చేశాను. అయితే.. ఆ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ సినిమా డెరైక్టర్‌గా నా పేరు లేకపోవడం ఇంట్లోవాళ్లకు కూడా బాధ కలిగించింది. కష్టపడి సినిమా తీసినప్పుడు ప్రతిఫలాన్ని ఆశించడం తప్పుకాదని ఇంట్లోవాళ్లు నచ్చజెప్పడంతో... ఆ సినిమా దర్శకునిగా నేను బయటకు రాక తప్పలేదు. ఈ విషయంలో నాకు సహకరించిన ప్రభాకరరెడ్డిగారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. -
పిల్లలు లేకపోతే నేను కూడా బావతోపాటు...
ఆ రోజు సందర్భం వేరు. దాదాపు ఐదేళ్ల క్రితం... 2009 ఫిబ్రవరి 12.... వాలెంటైన్స్ డేకి రెండురోజుల ముందు నేను... రియల్‌హీరో శ్రీహరి ఇంటర్వ్యూ కోసం వెళ్లినప్పుడు.. ఆయనతో పాటు ఆయన భార్య శాంతి కూడా... రియల్ స్టార్లా అనిపించారు! ఈ రోజు సందర్భం వేరు. శ్రీహరి లేరు. కానీ ఆయన భార్య రియల్ లైఫ్ హీరోలా వాస్తవ జీవితంతో పోరాడుతూ కనిపించారు! ఆ రోజు సరదాగా శ్రీహరి... ‘‘నన్ను ఒక్క పూట వదలవే, కోటి రూపాయలిస్తా’’ అన్నారు. ఈ రోజు శాంతి... కోట్లు ఖర్చుపెట్టయినా బతికించుకుంటానని కన్నీళ్లతో ఎంత వేడుకున్నా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు శ్రీహరి! ఆ రోజు శాంతి... ‘శ్రీహరిని విడిచి ఒక్కపూటైనా ఉండలేను’ అన్నారు. ఈరోజు దేవుడు శాంతిని ఒంటరిని చేసి... జ్ఞాపకాలను మాత్రమే తోడుగా మిగిల్చాడు. ఆ రోజు శాంతి... ‘‘నాకు కారే అక్కర్లేదు బావా... సైకిల్ మీద తీసుకెళ్లినా నీతోపాటు వచ్చేస్తా’’ అన్నారు. ఈ రోజు... శ్రీహరితో కలిసి నడిచే భాగ్యాన్ని కూడా కోల్పోయారు. ఆ రోజు శ్రీహరి... ‘‘పెళ్లి కాకముందు పదమూడేళ్లలో... రెండు మూడు జీవితాలు చూసింది శాంతి’’ అన్నారు. ఈ రోజు శాంతి... భర్త పోయాక ఇంకెన్ని జీవితాలను చూడాల్సి వస్తుందో అనిపించింది. ఆ రోజు శాంతి... ‘‘బావ లేకుండా బతకలేను’’ అన్నారు. ఈ రోజు... బావ ఇంకా బతికే ఉన్నాడన్న భ్రాంతిలో బతుకుతున్నారు. ఎవరి జీవితంలోనైనా ఇంత వైరుధ్యం ఉంటుందా? శాంతి జీవితంలో ఉంది. చదవండి... ఈవారం ‘తారాంతరంగం’లో... - ఇందిర పరిమి, ఫీచర్స్ ఎడిటర్ ఇందిర: 9 అక్టోబర్... అసలు ఆరోజు ఏం జరిగింది? శాంతి: ప్రభుదేవా సినిమా షూటింగ్కోసమని ముంబై వెళ్లాం. ముందురోజు రాత్రి హైదరాబాద్ చేరుకోవాల్సిన వాళ్లం కానీ, ఏదో సాంగ్ సీక్వెన్స్ ఉందని ప్రభుదేవా రిక్వెస్ట్ చేయడంతో ముంబైలోనే ఉండిపోయాం. బావకి ముందురోజు కాస్త జ్వరం ఉన్నా, ఆరోజు బాగానే ఉన్నాడు. రోజూ పాలు, బ్రెడ్ తీసుకునేవాడు, ఆరోజు టీ తెప్పించమని చెప్పి, బెడ్ మీదే కూర్చుని తాగాడు. తర్వాత కాళ్లు లాగుతున్నాయని, నాతో కాళ్లు నొక్కించుకుని కాసేపు పడుకున్నాడు. ఉదయం 8.30 టైంలో అనుకుంటా... తనకిష్టమైన ఉడిపి హోటల్ నుంచి ఇష్టంగా తినే ఊతప్పం తెప్పించాను. కానీ, ‘నాకు తినాలని లేదు, నువ్వు తినెయ్’ అన్నాడు. తను తినందే ఏరోజూ ముందు తినే అలవాటు లేని నేను, ముందురోజు తినకపోవడంతో ఆకలిగా ఉందని, తిందామని కూర్చున్నాను. ఇంతలో బావ మళ్లీ పిలిచి, ఛాతీలో మంటగా ఉందన్నాడు. హోటల్ వాళ్లనడిగి, వెంటనే డాక్టర్ని పిలిపించాను. ‘పల్స్ తక్కువగా ఉంది, హాస్పిటల్‌కు తీసుకెళ్లడం మంచిది’ అన్నారు డాక్టర్. ‘బట్టలు మార్చుకుని వెళ్దాం’ అనే లోపలే బావ గబగబా బయటికెళ్లిపోయాడు. నేను కిందికి వచ్చేలోపలే తనతోపాటు ఉన్న మనుషులను తీసుకుని హాస్పిటల్‌కు వెళ్లిపోయాడు. ‘ఏంటి బావా అలా వెళ్లిపోయావు?’ అని ఫోన్ చేసి అడగ్గానే ‘కంగారేం లేదు... పక్కనే ఉన్న హాస్పిటల్‌కు వెళ్లి ఇంజక్షన్ తీసుకుని అరగంటలో వచ్చేస్తా’ అన్నాడు. కానీ నాకు కంగారు తగ్గక, ప్రతి 10 నిమిషాలకు కాల్ చేస్తూనే ఉన్నా. చివరికి బావ ‘నైట్ షూటింగ్... నిద్దర లేదు... లొల్లి చేయకుండా కాసేపు నన్ను రెస్ట్ తీసుకోనీవే’ అని విసుక్కుని ఫోన్ పెట్టేశాడు. కాసేపటి తర్వాత మళ్లీ కాల్ చేస్తే తెలిసింది... బావని హాస్పిటల్లో అడ్మిట్ చేశారని! అది తెలియగానే నా గుండె ఆగిపోయినట్టయింది! వెంటనే బండి పంపమని చెప్పి, 10.45 కల్లా హాస్పిటల్‌కు చేరుకున్నాను. ఎమర్జన్సీ వార్డ్... బావను చూడగానే ఏడవడం మొదలెట్టాను. ‘ఏమీ లేదు, పల్స్ తక్కువ ఉంది. గ్లూకోజ్‌తోపాటు ఏదో మందు ఎక్కిస్తానన్నారు. అది తీసుకోగానే వెళ్లిపోదాం... నాకేం కాదు, ఏడవకు’ అన్నాడు బావ. తర్వాత చీఫ్ డాక్టర్ వచ్చాడు. ‘మేజర్‌గా ఏమీ లేదు’ అంటూ ఏదో చెప్పి వెళ్లిపోయారు కానీ నాకు విషయం పెద్దగా అర్థం కాలేదు. సెలైన్ ఎక్కిస్తుండగా బావ, నేనూ ఎప్పటిలానే మాట్లాడుకున్నాం. అయితే ఉన్నట్టుండి బావ నాలుక మడత పడడం మొదలైంది. ‘ఏ మైంది బావా’ అంటుండగానే కళ్లు మూతలు పడడం మొదలైంది. డ్యూటీ డాక్టర్ని, నర్సుల్ని గట్టిగా పిలిచాను. వెంటనే ఏవో ఇంజక్షన్లు ఇస్తూ, కాసేపు నన్ను బయటికి పొమ్మన్నారు. నేనలా పోతుండగా బావ ‘వీళ్లిలా గుచ్చేస్తున్నారు... ఏం చేస్తున్నావ్... రావే’ అని గట్టిగా అరిచాడు. అయినా హాస్పిటల్ వాళ్లు నన్ను అక్కడ ఉండనీయకుండా బైటికి పంపించడంతో ఏమీ చేయలేక వెళ్లిపోయాను. బయటికొచ్చి ఫోన్లు చేయడం మొదలెట్టాను... ముందు హైదరాబాద్‌లో ఉన్న ఫ్యామిలీ డాక్టర్ సంజీవ్‌కి, శ్రీనివాస్ అన్నకి (బావ వాళ్ల అన్న)! ఇద్దర్నీ వెంటనే ముంబై బయల్దేరి రమ్మని చెప్పి, మళ్లీ బావ దగ్గరికి వచ్చాను. (బోరున ఏడుస్తూ..) మా ఇద్దరి ప్రేమా మా ఇద్దరికే తెలుసు... మనిషి నిస్తేజంగా అలా పడుకుని ఉన్నాడనే కానీ, తన చూపు మాత్రం నావైపే! ఏం జరుగుతోందో తెలియని అయోమయంలో పిచ్చిదానిలా ఏడుస్తూ కూర్చున్నాను... ఇంతలో బావ నోట్లోంచి ఉన్నట్టుండి రక్తం రావడం మొదలైంది. బావకు తలనొప్పి వస్తేనే తట్టుకోలేని నేను, అంతలా రక్తం రావడంతో గట్టిగా అరవడం మొదలెట్టాను. వెంటనే నన్ను వార్డు నుంచి బయటికి పంపించబోయారు హాస్పిటల్ స్టాఫ్! ‘నాకు ఇక్కడ ఏం జరుగుతోందో చెప్పండి’ అని అడగడంతో, ‘అది తర్వాత... మీరిక్కడుంటే ట్రీట్మెంట్ ఇవ్వలేం’ అంటూ నన్ను బయటికి పంపించేశారు. చేసేదేంలేక పిల్లలకు ఫోన్ చేసి, ‘అప్పకి బాలేదు. వెంటనే వచ్చేయండి’ అని చెప్పి మళ్లీ లోపలికి వచ్చేంతలో డాక్టర్ ‘హి ఈజ్ నో మోర్’ అని చెప్పారు! ‘ఇంతలో ఇంత ఘోరమా?’ అని ఒకవైపు... అస్సలు నమ్మకం కలగకపోవడం మరోవైపు! సాయంత్రం 7.30 టైంలో అనుకుంటా పిల్లలు వచ్చారు... 9.30 దాకా బావ చేయి పట్టుకుని అక్కడే కూర్చున్నా. మర్నాడు పొద్దున బావని తీసుకుని హైదరాబాద్‌కి వచ్చాం. ఇందిర: గత సంవత్సరంగా ఆయన సన్నగా, బలహీనంగా కనిపించారు... అసలు ప్రాబ్లమేంటి? శాంతి: కొన్నాళ్ల క్రితం ఆయనకు షుగర్ వచ్చింది. దానికితోడు లివర్ ప్రాబ్లమ్ కూడా రావడంతో మనిషి సన్నబడిపోయాడు. అయితే వాటన్నిటినీ తక్కువ కాలంలోనే కంట్రోల్‌కి తెచ్చుకున్నాడు. సంవత్సరంగా అయితే తాగడం పూర్తిగా మానేశాడు. మనిషి సన్నబడ్డాడనే గానీ, హెల్త్ పర్ఫెక్ట్గా ఉండింది. చివరి వరకు ఆరోగ్యంగానే ఉన్నాడు. ఇందిర: మీరు కూడా అంత ఆరోగ్యంగా కనిపించట్లేదు... చాలా సన్నబడిపోయారు! శాంతి: నిజమే... 18 కేజీలు తగ్గాను! ఏం చేయను? బావ లేకుండా... తిండి ఎక్కట్లేదు... మనుషుల్ని కలవాలనిపించట్లేదు... బయటికి పోవాలనిపించట్లేదు... ఏమీ చేయాలనిపించట్లేదు... ఏం చేయను? ఇందిర: ఇలాంటి పరిస్థితి ఆకస్మికంగా సంభవించినప్పుడు మనం నమ్మకపోవడం నుంచి అపనమ్మకంలో బతుకుతుంటాం... శాంతి: నాకైతే బావ చనిపోయినట్లేలేదు! షూటింగ్‌కి వెళ్లాడు... ఏడింటికల్లా తిరిగొస్తాడు, బావకోసం వంట చేయాలి... అనే ఆలోచనలతోనే బతుకుతున్నాను. మీకో విషయం తెలుసా.. పిల్లలకు ఇష్టమున్నా లేకున్నా, రోజూ నేను బావకు ఇష్టమైన వంటలే చేస్తుంటా. మూడుపూటలా బావకి (ఫోటో దగ్గర) పెడుతుంటా! ఇందిర: ఒక మనిషి గొప్పతనం పోయిన తర్వాత కానీ తెలీదంటారు. మీ బావ గురించి మీకు తెలీదని కాదు... శాంతి: యస్... యస్... యస్... బావ పోయిన రోజు నేను చూసిన అభిమానం అంతా ఇంతా కాదు. అభిమానులు, నచ్చినవాళ్లు, బంధువులు, స్నేహితులు... ఒకరుకాదు ఆరోజు వచ్చింది! బావ నిజంగా చాలా అదృష్టవంతుడు! అయితే ఇంత మంచి వ్యక్తిని 47 ఏళ్లకే దేవుడలా తీసుకెళ్లిపోవడం చాలా అన్యాయం! ఇందిర: మీరు ఆరోజు అంత నిబ్బరంగా వుండడం చాలా ఆశ్చర్యపరిచింది... శాంతి: ఎందుకంటే... ఆరోజు నాకసలు బావ చనిపోయిన ఫీలింగే లేదు! బతికున్నారని, లేస్తారనే అనిపించింది! పొలంలో పాప పక్కన పెట్టినప్పుడు కూడా బావ లేచి వస్తాడని, మట్టి వేయొద్దని అన్నాను. (ఏడుస్తూ) ఇద్దరు పిల్లలు లేకపోతే ఆరోజు నేను కూడా బావతోపాటు లోపల పడిపోయేదాన్ని! వాళ్లిద్దరికోసమే... బతకడం! ఇందిర: ఆయన మరణం ఆకస్మికంగా జరిగింది... మీకేదైనా జరిగితే పిల్లల సంగతేంటని ఎప్పుడైనా ఆలోచించారా? శాంతి: బావకు ప్లానింగ్ చేసే టైం లేకపోయింది. పైగా తను చావు గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ, ఇప్పుడు నా పరిస్థితి అలా కాదు... కచ్చితంగా ఆలోచిస్తున్నాను. వాళ్లు ఎదిగి వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేదాకా జాగ్రత్తగా ఉంటా! వాళ్లకోసం ప్లానింగ్ చేయాల్సింది చాలా ఉందని తెలుసు. అందుకే ఇప్పటినుంచే మొదలెట్టాను. నాకేదైనా అయినా నా పిల్లల జీవితాలే కాదు, మనవలు, మనవరాళ్ల జీవితాలు కూడా సాఫీగా గడిచిపోయేలా ప్లాన్ చేస్తున్నాను. ఇందిర: పిల్లలు ఉన్నట్టుండి మెచ్యూర్డ్గానో, బాధ్యతగానో అయినట్టు ఏమైనా అనిపించిందా? శాంతి: పెద్దోడు చాలా అండర్స్టాండింగ్! సందర్భాన్ని బట్టి... ఓదారుస్తాడు, నవ్విస్తాడు! చిన్నవాడికి ఇంకా అంత తెలీదు. కానీ వాడు కూడా ఇప్పుడిప్పుడు... తిన్నానా లేదా? నిద్రపోయానా లేదా? అని కనుక్కుంటుంటాడు. నేను తినకపోతే ఒక్కోసారి పిల్లలు కూడా తినరు. అలానే నిద్రపోతారు. అప్పుడు మాత్రం బాధనిపిస్తుంది. అందుకే మర్నాడు వాళ్లకోసమైనా తింటుంటాను. నేను పైకి బెడ్రూంలోకి వెళ్లకపోతే, రాత్రి ఒంటిగంటైనా, రెండయినా వాళ్లు కూడా నాతోపాటే కూర్చుంటారు. అప్పుడప్పుడు బెడ్రూం తలుపు తీసి చూసి, నేను పడుకున్నాను అనుకున్నాక పడుకుంటారు. నేను ఎప్పుడూ ఏడుస్తుంటాననో ఏమో కానీ, నా ముందు ఒక్కసారి కూడా వాళ్లు కంట నీరు పెట్టలేదు. దే కేర్ ఫర్ మి సోమచ్! అయామ్ వెరీ లక్కీ దట్ వే! ఇందిర: ఇప్పుడు పరిస్థితి ఇంతకుముందులా కాదుకదా! జీవితానికి సంబంధించి ఏమైనా నేర్పిస్తున్నారా? శాంతి: యాజ్ సచ్... పిల్లలు చాలా మెచ్యూర్డ్ అండ్ స్మార్ట్! దే కెన్ లుక్ ఆప్టర్ దెమ్సెల్వ్స్ వెల్! దానికితోడు ఇప్పుడిప్పుడు నేను ఇంటి ఖర్చులన్నీ పెద్దోడి చేతుల మీదుగా చేయిస్తున్నాను... డబ్బు విలువ తెలియాలని! ఉల్లిపాయ రేట్ల నుంచీ బియ్యం రేట్ల దాకా అన్నీ చెప్తున్నాను. ఒకవైపు బాధ్యత నేర్పుతూనే, బావ లేని లోటు లేకుండా వాళ్లను ‘శ్రీహరి పిల్లలు’గానే పెంచుతున్నాను! వాళ్లకోసం ఎంతయినా కష్టపడతాను! ఇందిర: పిల్లలు ఏం కావాలని ఆయనకుండేది? శాంతి: ఇద్దరూ ఆయనలా ఇండస్ట్రీలోకి రావాలని! నాకు మాత్రం వాళ్లు చదువుకోవాలని! ఇక పిల్లల విషయానికి వస్తే... పెద్దవాడికి డెరైక్టర్ అవ్వాలని (ఇప్పటికే షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నాడు), చిన్నోడికి యాక్టర్ అవ్వాలని (చైల్డ్ యాక్టర్‌గా చేశాడు అవార్డు కూడా వచ్చింది)! బావ కలగన్నదీ, పిల్లలకు నచ్చింది నెరవేర్చడం నా బాధ్యత... అయితే, ఇద్దరు పిల్లలూ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాకే! ఇందిర: అసలు ఆయనకి ఫ్యూచర్ ప్లాన్స్ ఏముండేవి? శాంతి: బావకు ఎప్పుడూ జనాలతో ఉండాలని, వాళ్లకు చేతనైనంత సాయం చేయాలని, అందుకోసం మినిస్టర్ అవ్వాలని కోరిక ఉండేది. 2009లో రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం వచ్చినా రెండు పడవల మీద కాళ్లు పెట్టొద్దని నేనే తనను వెనక్కి లాగా! ఫ్యామిలీ పరంగా చూస్తే పిల్లలు చిన్నవాళ్లు, నేనూ తనను చూడకుండా ఉండలేను... పైగా తన కెరీర్ కూడా అప్పుడు చాలా బాగుంది. ఇటు ఇండస్ట్రీపరంగా చూసినా, తను రాజకీయాల్లోకి వెళ్తే ప్రొడ్యూసర్లు ఇబ్బందులు పడతారని ససేమిరా అన్నాను. అందుకే తను 2014 కల్లా అన్ని కమిట్మెంట్లు పూర్తిచేసుకుని, పూర్తిగా రాజకీయాల్లోకి వస్తానన్నాడు. కానీ, ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయాడు. అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది... బావకోసమైనా నేను రాజకీయాల్లోకి రావాలని, తను ప్రజలకు చేయాలనుకున్న మంచి నేను చేయాలని! ఇందిర: ఈ రెండున్నర నెలల్లో ... ‘అసలు మనుషులు ఇలా ఉంటారా?’ అని అనిపించిన సందర్భాలున్నాయా? శాంతి: నాకు ముందే తెలుసు... మనుషులు ‘ఇలానే’ ఉంటారని! నాకేదీ షాకింగ్ కాదు. ఎందుకంటే, జీవితంలో ఢక్కామొక్కిలు తిని వచ్చినదాన్ని! అప్ప (నాన్న ఆనందన్ - తమిళ్లో పెద్ద యాక్టర్) బతికి ఉండగానే అప్స్ అండ్ డౌన్స్ చూసినదాన్ని! ఇక నాన్న పోయాక చెప్పనక్కర్లేదు! ఒక్క జీవితంలో ఎన్నో జీవితాల్ని చూసినదాన్ని కాబట్టి ఈరోజు ఎలాగైనా బతకగలుగుతున్నాను. అయితే, మనుషులం కదా... చిన్న ఆశ ఉంటుంది. ఇన్నాళ్లు నన్ను అక్క, చెల్లి, అమ్మ, వదిన అని పిలిచినవాళ్లు, బావకు అతిదగ్గరగా ఉన్న కొందరు ఈరోజు అసలు కనిపించకపోవడంతో, ఆ ఆప్యాయతను మిస్సవుతున్నాను. అదొక్కటే కొంచెం బాధనిపిస్తుంది. ఎందుకంటే, నేనే కాదు... నా పిల్లలకు కూడా వాళ్లు చాలా క్లోజ్. అయినా మేం కోరుకునేదేంటని? కాస్తంత ఓదార్పు... మాటసాయం! అది కూడా వాళ్లకు అంత కష్టంగా ఉంటే మనమేం చేయగలం! ఇందిర: ఎందుకంటారు? శాంతి: (నిర్వేదంగా నవ్వుతూ) నా దగ్గర డబ్బు లేదు... నేనేమైనా అడుగుతాననుకుంటున్నారేమో! వాళ్లకు తెలీదు... నేను చచ్చేంతవరకు నా చేయి పైన ఉండాల్సిందే కాని, కింద ఉండదని! చిన్నప్పుడు అంత కష్టంలో ఉన్నప్పుడే ఒకరి దగ్గర చేయి చాచలేదు... ఇప్పుడు చేస్తానా! అవసరమైతే తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి వస్తా... సినిమాలు పొడ్యూస్ చేస్తా... సీరియల్స్ తీస్తా... ఏదైనా చేస్తాను, ఎంతైనా కష్టపడతాను కానీ, ఒకరి నుంచి ఆశించను! ఇందిర: రివర్స్‌లో... మీ దగ్గరికి డబ్బుకోసం (సాయం) వచ్చినవాళ్లు, డబ్బు ఇవ్వాలని (అప్పులు) వచ్చినవాళ్లు ఉన్నారా? శాంతి: ఉన్నారు. సాయంకోసం వచ్చిన ఎవ్వరినీ బావ కాదనేవాడు కాదు. నమ్ముతారో లేదో ‘మన దగ్గర 10 వేలే ఉన్నాయి బావా’ అన్న రోజున కూడా ‘ఇచ్చెయ్వే... వాళ్లేదో కష్టంలో ఉన్నారు’ అని ఇచ్చేసేవాడు. అటువంటి మనిషి బావ! తనలా నేనెప్పటికీ చేయలేను... అయితే ఇప్పటికీ కుదిరినంత చేస్తున్నాను. ఇక డబ్బులు ఇవ్వాలని వచ్చినవాళ్ల గురించి అంటారా... సరైన డాక్యుమెంట్లు, ప్రూఫ్‌లు చూపిస్తే తప్ప ఇవ్వనని కరాఖండిగా చెప్పేస్తున్నాను. లేకపోతే ప్రతివాళ్లూ మోసం చేస్తారు. ఇందిర: ఆయన ఉండగా ఇల్లంతా సందడిగా, హడావిడిగా ఉండేదేమో కదా? ఇప్పుడు..? మీ సంగతి? శాంతి: బావను తలుచుకుంటూ, గతాన్ని గుర్తుచేసుకుంటూ ఇంట్లోనే కూర్చుంటా. రోజుకో గంటసేపు మాత్రం బావ సమాధి దగ్గర కూర్చుని వస్తా. సాయంత్రం పిల్లలు ఇంటికొచ్చాక, వాళ్లకి కావలసినవి చూసుకుని, ఓ గంటసేపు నిద్రపోతా... ఎందుకంటే, నాకు రాత్రిపూట నిద్రపట్టడం లేదు. బాగా దగ్గరివాళ్లను తప్ప ఎవ్వర్నీ పెద్దగా కలవాలని కూడా ఉండట్లేదు. ఓ వారం నుంచే కాస్తంత బయటికెళ్తున్నా. రికవర్ కావడానికి, దీన్నుంచి బైటికి రావడానికి ట్రై చేస్తున్నాను. ఇందిర: ‘మళ్లీ తెల్లారుతోందా?’ అని భయపడిన సందర్భాలున్నాయా? శాంతి: (నిర్లిప్తంగా) అసలు నిద్రపోతేగా! ఇందిర: బావ విషయంలో బాగా మిస్సయ్యే క్షణాలు..? శాంతి: భోజనం టైం! తను తిని లేచాక కబుర్లు చెబుతూ అదే ప్లేట్లో భోంచేయడం! అది అలవాటయ్యే ఇప్పుడు ఏమీ తినాలనిపించట్లేదు! ఇందిర: మీరు ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు... ఆయన మిమ్మల్ని కనుపాపలా చూసుకున్నారు. ఇద్దరిలో ఎవరు అదృష్టవంతులంటారు? శాంతి: (నవ్వుతూ) నేను ఆయన్ని అనేదాన్ని... ఆయన నన్ను అనేవారు! అది పక్కనపెడితే ఇప్పుడూ, ఎప్పుడూ నేను ఒక్కటే అంటాను... అలాంటి భర్త దొరకడం నా అదృష్టమని! ఎందుకంటే - ఆయన ఒక ట్రెడిషనల్‌గా ఉండే చదువుకున్న అమ్మాయిని చేసుకోలేదు... ఒక ఆర్టిస్ట్‌ని, అందులోనూ గ్లామర్ ఆర్టిస్ట్‌గా ఉన్న నన్ను పెళ్లి చేసుకుని, ఇంతగా నెత్తినపెట్టుకుని చూసుకున్నాడు. అందుకే ఏ జన్మయినా నాకు ఆయనే భర్తగా కావాలనుకుంటున్నాను! ఇందిర: గతంలో డిసెంబర్ 31 అంటే ఎలా ఉండేది? ఈ సంవత్సరం..? శాంతి: ప్రతి ఏడాది డిసెంబర్ 31న ఇంట్లో విపరీతమైన సందడి! ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేవారు. బయట ఈయన ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తుంటే, నేను వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్‌తో సరదాగా గడిపేదాన్ని! ఈ సంవత్సరం ముగ్గురం (నేను, పిల్లలు) బావ సమాధి దగ్గర గడుపుతాం! మొదట్లో బావ యాక్టింగ్ నాకు నచ్చేది కాదు మొదట్లో ఈయన యాక్టింగ్ నాకు అసలు నచ్చేది కాదు. ‘నీకసలు యాక్టింగ్ రాదు... ఎలా యాక్టర్‌వి అయ్యావు బావా’ అని ఎప్పుడూ ఏడిపించేదాన్ని! కాని ‘సాంబయ్య’, ‘అయోధ్య రాముడు’ చూశాక మాత్రం ‘చాలా బాగా యాక్ట్ చేశావు బావా’ అని మెచ్చుకున్నా! నా అభిప్రాయానికి చాలా విలువ ఇచ్చేవాడు బావ! ప్రివ్యూ అవగానే నా వంకే చూసేవాడు... ఏమంటానా అని! నిర్మొహమాటంగా అభిప్రాయం చెప్పేదాన్ని... తన యాక్టింగ్ గురించే కాదు, మొత్తం సినిమా గురించి! అందుకే మొదట్లో ప్రివ్యూకి తీసుకువెళ్ళేవాడు కాస్తా తరువాత తరువాత ఫస్ట్ కాపీకి తీసుకెళ్లడం మొదలు పెట్టాడు. ‘ఇక్కడ ఇక్కడ ఈ తప్పులు ఉన్నాయి.... ఈ షాట్స్ మార్చాలి’ అని చెబితే మార్పించేవాడు. బావ ఎప్పుడూ అనేవాడు - ‘నీ నాలుక మీద నల్లమచ్చలు ఉన్నాయి... నువ్వు ఏమి చెబితే అదే జరుగుతుంది’ అని! నిజంగానే అన్నట్టే జరిగేది... సినిమా రిజల్ట్! ఆయన భార్యగా నేనెప్పుడూ ఆయన్ని హీరోగా చూడడానికే ఇష్టపడేదాన్ని. అందుకే క్యారెక్టర్ రోల్స్‌కి షిఫ్ట్ అవుతానన్నప్పుడు వద్దని గొడవ చేశాను. కానీ వాటిలో తన యాక్టింగ్ చూశాక మాత్రం గర్వంగా ఫీలయ్యాను... ముఖ్యంగా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఢీ, మగధీర...’లలో... హీరోలకు సమానంగా తననీ గుర్తుంచుకునేలా యాక్ట్ చేశాడు! బావ - నేను 1991... నా కెరియర్ పీక్‌లో ఉంది... ఎంతోమంది ‘ఐ లవ్ యూ’ చెప్పారు కానీ, ఈయన ఒక్కరే నన్ను ‘పెళ్లి చేసుకుంటాను’ అన్నారు. అది నచ్చే, వెంటనే పెళ్లికి ఒప్పుకున్నాను. చెల్లెళ్లు, తమ్ముళ్ల పెళ్లిళ్లు అయితే కానీ పెళ్లి చేసుకోనని చెప్పినా, నాకోసం ఎన్నాళ్లయినా వెయిట్ చేస్తానన్నాడు. 1993లోగా పెళ్లి చేసుకోకపోతే తనకు పెళ్లి యోగం లేదని ఎవరో జాతకం చెప్పడంతో, మా తల్లిదండ్రులు, తోబుట్టువుల సమక్షంలో బయటెవ్వరికీ చెప్పకుండా, అదే సంవత్సరం నన్ను రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. నా తోబుట్టువులందరి పెళ్లిళ్లు అయిపోయాక 1996లో అందరి సమక్షంలో మళ్లీ చేసుకున్నాడు. పెళ్లి తర్వాత నా ఇంటి నుంచి నన్ను కట్టుబట్టలతో తీసుకెళ్లి, తనే అన్నీ (పెళ్లి నగలు, చీరలు, ఫ్లాట్, కారు..) సమకూర్చి, పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నాడు. నాకు కోరికలు చాలా తక్కువ. బావను ఎక్కువ ఏదీ అడిగేదాన్ని కాదు. కానీ నా నోటి నుంచి ‘బాగుంది’ అన్న పదం వచ్చినా సాయంత్రంకల్లా అది ఇంటికి రావలసిందే... కారైనా, నగైనా! అది కూడా సర్ప్రైజ్ చేస్తూ! ఇద్దరం చాలా పొసెసివ్! టీవీలో ఒక అమ్మాయి వైపు ఇంట్రస్ట్‌తో చూసినా నేను ఊరుకునేదాన్ని కాదు. ఎక్కడున్నా ప్రతి పది నిమిషాలకు కాల్ చేసేదాన్ని. బావ కూడా ఏం తక్కువ కాదు... తను లేకుండా నన్ను ఎక్కడికీ ఒంటరిగా వెళ్లనిచ్చేవాడు కాదు. బావకు ఎప్పుడైనా పిల్లలకన్నా నేనే ఎక్కువ. నేనెలా ఉన్నాను... తిన్నానా లేదా? అని ఎప్పుడూ కనుక్కుంటూనే ఉంటాడు... ఆఖరికి పోయే ముందు కూడా! హోటల్ నుంచి హాస్పిటల్‌కు వెళ్తూ రిసెప్షన్లో ఉన్న అబ్బాయితో ‘మేడమ్ గారు బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు... తినమని చెప్పండి’ అని చెప్పి మరీ వెళ్లాడు! ఎప్పుడూ ‘నేనున్నాను... నీకేంటే?’ అనే బావ ఈరోజు నన్ను ఇలా వదిలేసి వెళ్లినందుకు చాలా కోపంగా ఉంది! -
రాజీపడి బతకడం నా డిక్షనరీలోనే లేదు!
సంప్రదాయ కుటుంబం. పుటి ్టందీ, పెరిగిందీ... కల్చరల్ హబ్‌లో. వేదం చదివాడు. సంధ్యా వందనం ఆచరిస్తాడు. గాయత్రీ మంత్రం పఠిస్తాడు. ఇంట్లో... శ్రీశ్రీ, తిలక్, శ్రీపాద. బయట... నాటక పరిషత్తు. శుభ్రమైన వాక్కు, విద్వత్తు. మరేంటి?!! ఈ డాన్స్లేంటి? పంచ్ డైలాగులేంటి? బిల్డప్ షాట్లేంటి? అసలు హరీష్‌శంకర్ ... ఈ ఫీల్డులోకి రావడం ఏంటి? ఏం లేదు! హరీష్‌కు ఇండస్ట్రీ అంటే ప్రాణం. షాక్, మిరపకాయ్, గబ్బర్సింగ్రామయ్యా వస్తావయ్యా... అన్నీ ప్రాణం పెట్టి తీసినవే. అందుకే అవి హిట్టయినా, కాకున్నా... ప్రాణం మాత్రం మినిమం గ్యారెంటీ! నిన్నగాక మొన్న వచ్చి... పరిశ్రమను ఓ కుదుపు కుదిపాడు హరీష్. పరిశ్రమ కూడా అతడినేం తక్కువ కుదపలేదు! ఏమిటా కుదుపులు? చదవండి ఈ ‘తారాంతరంగం’. ఏంటి సార్... మీ కొత్త సినిమాల కబుర్లు? హరీష్‌శంకర్: మూడు కథలు రెడీగా ఉన్నాయి. అందులో రెండు మాస్ ఎంటర్టైనర్స్.. అవి ప్రేక్షకుల కోసం. మూడోది నా కోసం. ప్రయోగాత్మకం అన్నమాట. తెలిసో... తెలీకో మా దర్శకులందరం ఒకే తరహా సినిమాలు చేస్తున్నాం. అవే హీరో ఇంట్రడక్షన్సూ, అవే పంచ్ డైలాగులు, అవే డాన్సులు, ఆవే బిల్డప్ షాట్స్... హీరోలు మారుతున్నారంతే! ఈ ట్రెండ్‌ని బ్రేక్ చేయాలని ఉంది. బాలీవుడ్లో గొప్ప సినిమాలొస్తున్నాయి. రాజ్‌కుమార్ ఇరానీ ‘త్రీ ఇడియట్స్’ తీశారంటే.. ఆయన మేథాశక్తి అంత గొప్పది. ఆ స్థాయిలో ఆలోచించే శక్తిని ఆ దేవుడు నాకూ ఇవ్వాలని కోరుకుంటున్నాను. త్వరలో నా నుంచి అంత గొప్ప సినిమా కాకపోయినా.. ఓ మంచి సినిమా మాత్రం వస్తుంది. అది కూడా లో బడ్జెట్లోనే. ‘రామయ్యా వస్తావయ్యా’తో పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టుంది? హరీష్‌శంకర్: అది గొప్ప సినిమా అని నేను అనను. కచ్చితంగా ఫ్లాపే. అయితే.. ఆ సినిమాకు రావాల్సిన దానికంటే ఎక్కువగా బ్యాడ్ వచ్చింది. దానికీ నేను బాధపడటంలేదు. ఎందుకంటే.. ‘గబ్బర్‌సింగ్’కి నాకు రావాల్సిన దానికంటే.. ఎక్కువ పేరొచ్చింది. అంతటి సక్సెస్‌ని ఎంజాయ్ చేశాను కాబట్టి... ఈ ఫ్లాప్ బాధ్యతని కూడా తీసుకోవడానికి నేను బాధపడటంలేదు. ‘రామయ్యా...’ ముందు మీ చేతిలో మూడు సినిమాలున్నాయి. ‘రామయ్యా...’ ఫ్లాప్ తర్వాత ఇచ్చిన అడ్వాన్సులు వెనక్కు తీసుకున్నారని టాక్. నిజమేనా? హరీష్‌శంకర్: ‘నా సినిమా సరిగ్గా ఆడలేదు కాబట్టి అడ్వాన్సు కావాలంటే తిరిగి ఇచ్చేస్తానని’ నేనే అన్నాను. ఓ నిర్మాత ‘ఇచ్చేయ్ బాబూ’ అన్నాడు... ఇచ్చేశాను. అది తప్పేం కాదే..! ‘గబ్బర్‌సింగ్’ హిట్ చూసి అడ్వాన్సులిచ్చారు. ‘రామయ్యా..’ ఫ్లాప్ అయ్యింది. నా ఫెయిల్యూర్ని గుర్తించి అడ్వాన్స్ వెనక్కు తీసుకున్నారు. ‘రామయ్యా వస్తావయ్యా’కు ఫస్ట్ అనుకున్న కథ ఇది కాదని, దిల్‌రాజు కథను మార్చారని టాక్? హరీష్‌శంకర్: అవి ఉట్టి మాటలండీ. నా సక్సెస్‌లో నేను ఎవరికైనా భాగం ఇస్తా. ఫెయిల్యూర్లో మాత్రం పూర్తి బాధ్యత నాదే. ఎవరికీ భాగం ఇవ్వను. తొలి చిత్రం ఫ్లాపవ్వడం వల్ల వచ్చిన పరిపక్వతా ఇది? హరీష్‌శంకర్: అయ్యుండొచ్చు. ‘షాక్’ టైమ్‌లో నేను టూ యంగ్. 26 ఏళ్ల కుర్రాణ్ణి. అందుకే తేలిగ్గా తేరుకోగలిగా. అయితే.. దర్శకునిగా నాకు ఆ సినిమా చెడ్డ పేరు మాత్రం తేలేదు. ‘వీడితో సినిమా చేయొచ్చు..’ అని నిర్మాతలకు ఓ నమ్మకం కుదిరేట్లు చేసిందా సినిమా. కానీ కమర్షియల్ సక్సెస్ కాలేదు కాబట్టి.. ఎంత బాగా తీసినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే, పరిశ్రమ సక్సెస్ వెనకే ఉంటుంది. ఏది ఏమైనా.. ‘షాక్’ ఫ్లాప్‌కి పూర్తి బాధ్యుణ్ణి నేనే. వర్మ కథకు నేను సరైన న్యాయం చేయలేకపోయాననే చెబుతా. ఆ సినిమా తర్వాత మరో సినిమా చేయడానికి నాకు నాలుగేళ్లు పట్టింది. ఈ నాలుగేళ్లలో మిమ్మల్ని ఎవరూ పిలవలేదా? హరీష్‌శంకర్: మధ్యలో ఓ పెద్దాయన నుంచి పిలుపు వచ్చింది. ఆయన ఎవరో కాదు... ఫ్లాప్ డెరైక్టర్లకు పిలిచి మరీ అవకాశం ఇచ్చే పేషన్ ఉన్న నిర్మాత ఎమ్మెస్ రాజు. ఆయనకు ఓ కథ చెప్పాను. దానికి టైటిల్ ‘ఆట’ అని ఆయనే పెట్టారు. అయితే.. ఆ కథకు సంబంధించిన డిస్కషన్స్‌లో మా ఇద్దరికీ సెట్ అవ్వలేదు. తొలి సినిమాకు నేను కథకుణ్ణి ఎలాగూ కాదు. తర్వాత చేసే సినిమా అయినా.. సొంత కథతో అనుకున్నది అనుకున్నట్లు తీయాలని మనసులో గట్టిగా అనుకున్నాను. అందుకే అభిప్రాయాలు కలవక రాజుగారి సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. తర్వాత వేరే కథకు అదే టైటిల్‌ని పెట్టి వీఎన్ ఆదిత్యతో రాజుగారు సినిమా తీశారు. ఎమ్మెస్ రాజుగారితో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని తెలీగానే... నాకు వెంటనే వచ్చిన మరో పిలుపు పూరిజగన్నాథ్ నుంచి. ‘చిరంజీవిగారబ్బాయి చరణ్‌ని లాంచ్ చేస్తున్నాం. డిస్కషన్స్‌కి నువ్వూ ఉంటే బావుంటుంది’ అంటే.. వెళ్లి రైటర్‌గా జాయినయ్యా. ఒక సినిమాను డెరైక్ట్ చేసిన తర్వాత, మళ్లీ ఇంకో డెరైక్టర్ దగ్గర రైటర్స్ డిపార్ట్మెంట్లో పనిచేయడం అనేది నిజంగా నవ్వాలో ఏడ్వాలో తెలీని పరిస్థితి. ప్రారంభంలో నాకు ఇలాంటి ఫీలింగ్ కలిగినా.. సినిమా వర్క్ స్టార్ట్ అయ్యాక.. నాకు ఆ ఫీలింగే కలక్కుండా చూసుకున్నారు పూరి. షూటింగ్ జరుగుతున్నంతసేపూ నన్నూ ఒక దర్శకునిగానే ట్రీట్ చేశారు. పూరితో అసోసియేషన్ నచ్చి ‘బుజ్జిగాడు’ సినిమాక్కూడా కంటిన్యూ అయిపోయాను. ఆ టైమ్‌లో పూరి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. బేసిగ్గా పూరి మంచి రైటర్ కాబట్టి... మా లాంటివాళ్లకు ఆయన దగ్గర పెద్ద పని ఉండేది కాదు. పెయిడ్ హాలిడేలా ఉండేది. ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితం సజావుగా వెళ్లిపోతుండేది. ఓసారి ఉన్నట్టుండి ఎందుకో అనిపించింది.. ‘వచ్చిన పనిని మరిచిపోయి తిరుగుతున్నానా!’ అని. మళ్లీ సీరియస్‌గా ప్రయత్నాలు ప్రారంభించాను. ఎన్టీఆర్, పవన్‌కల్యాణ్.. ఇలా తిరగని హీరో లేడు, కలవని నిర్మాత లేడు..! కానీ ఎక్కడా వర్కవుట్ అవ్వలేదు. మరి ‘మిరపకాయ్’ ఎలా సెట్ అయ్యింది? హరీష్‌శంకర్: ఆ విషయం చెప్పేముందు రవితేజ గురించి చెప్పాలి. ఒక ఫ్లాప్ దర్శకుని ఫోన్ లిఫ్ట్ చేయడానికి కూడా ఇండస్ట్రీలో చాలామంది ఇష్టపడరు. కానీ రవితేజ.. ‘షాక్’ సినిమా ఫ్లాప్ అని తెలిసిన తొలిరోజే నన్ను పిలిచి.. ‘ఒక మంచి కథ చేసుకో.. ఇద్దరం కలిసి మళ్లీ చేద్దాం. ‘షాక్’ గురించి ఆలోచించొద్దు’ అని ధైర్యం చెప్పారు. ఆ క్షణాన నిజంగా ఉద్వేగానికి లోనయ్యాను. ఆయనైతే మంచితనంతో అంతటి ఫ్లాప్ తర్వాత కూడా ఆఫర్ ఇచ్చారు కానీ.. నాకైతే ఆయన్ను మళ్లీ కలవడానికి మొహం చెల్లలేదు. నాలుగేళ్లపాటు బయట హీరోలనే ట్రై చేశాను. కానీ ఆయన నన్ను వదల్లేదు. పిలిపించి మరీ ‘మిరపకాయ్’ అవకాశం ఇచ్చారు. రవితేజకి నేను తీర్చలేనంత రుణపడిపోయానండీ.. నాకు డెరైక్టర్‌గా జన్మనిచ్చింది రవితేజ, పునర్జన్మనిచ్చింది రవితేజ. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం రవితేజ. ఆయన లేకపోతే డెరైక్టర్‌గా నేను లేను. వ్యక్తిగతానికొద్దాం. మీకు పొగరు అంటారు నిజమా? హరీష్‌శంకర్: ఏదీ మనసులో దాచుకోలేను. మొహం మీదే అనేస్తుంటా. దానికి ‘పొగరు’ అని పేరు పెట్టారు. ‘షాక్’ టైమ్‌లోనే నాకీ బిరుదు వచ్చేసింది. అప్పట్లో మేం రిలీజ్ చేయకుండానే ‘షాక్’ స్టిల్స్ ఓ వెబ్సైట్లోకొచ్చేశాయి. మేం రిలీజ్ చేయకుండా మా స్టిల్స్‌ని బయటకు తేవడం ఏంటని వాళ్లమీద కేకలేసేశాను. సైట్లో ఉన్న మా స్టిల్స్‌ని డిలీట్ చేయించాను. మనం అంత చేస్తే.. వాళ్లెందుకు ఊరుకుంటారు! సినిమా ఎప్పుడు రిలీజవుతుందా.. అని కాచుక్కూర్చున్నారు. రిలీజైంది. సినిమా కు నెగిటివ్ టాక్ వచ్చింది. ఇక రివ్యూ రూపంలో రెచ్చిపోయారు. ‘టీవీలో వచ్చే ‘నేరాలూ-ఘోరాలు’ కార్యక్రమాన్ని టికెట్ కొని చూడాలంటే ‘షాక్’ చూడండి’ అంటూ ఇష్టం వచ్చినట్లు రాసేశారు. చాలా బాధ పడ్డాను. ఆ రివ్యూని కట్ చేసుకొని దాచుకున్నాను కూడా. ఎప్పటికైనా సక్సెస్ కొట్టాలనే కసిని ఆ రివ్యూ నాలో పెంచింది. అలాంటి అనుభవం ఎదురైన తర్వాత కూడా.. మీడియాపై సెటైర్లు వేస్తారెందుకు? హరీష్‌శంకర్: నా తరఫున మీ ద్వారా... క్లారిటీగా ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. బ్యాడ్ ప్రొఫెషన్ ఏదీ ఉండదండీ.. బ్యాడ్ పీపుల్ అన్ని ప్రొఫెషన్సులోనూ ఉంటారు. ఓ ఆటోడ్రైవర్ ప్యాసింజర్‌ను మోసం చేస్తే, ఆటోడ్రైవర్లందరూ మోసగాళ్లు కాదు. ఓ చెడ్డవాడు ఆటోడ్రైవర్ అయ్యాడన్నమాట. ఓ బస్ కండెక్టర్ లేడీస్ విషయంలో తప్పుగా బిహేవ్ చేస్తే... ఆ వృత్తిని మనం నిందించకూడదు. చెడ్డవాడు కండక్టర్ అయ్యాడన్న విషయం గుర్తుంచుకోవాలి. నేను మీడియాను ఎప్పుడూ తప్పుపట్టను. నా దృష్టిలో అది గౌరవనీయమైన, బాధ్యతాయుతమైన వృత్తి. ఐ రెస్పెక్ట్ మీడియా ఎలాట్. కేవలం కొన్ని కొన్ని వెబ్సైట్ల గురించి నేను మాట్లాడి న దాన్ని అందరికీ ఆపాదించడం కరెక్ట్ కాదు. కానీ మీరన్న మాట మీడియా మొత్తానికీ వర్తిస్తుందని కొందరి అభిప్రాయం... హరీష్‌శంకర్: యద్భావం తద్భవతి... మనం ఎదుటివారిని ఏ దృష్టితో చూస్తే... వాళ్లు మనకు అదే దృష్టిలో కనిపిస్తారు. మనం కావాలి అనుకున్నవారు, మనపై మంచి అభిప్రాయం ఉన్నవారు, మనలో ఎన్ని లోపాలున్నా పట్టించుకోరు. మనల్ని ఏకేయాలనుకున్నప్పుడు మన మంచిని కూడా తప్పుగానే చూపిస్తారు. హరీష్ అనేవాడు మీడియాపై విరుచుకుపడుతున్నాడు అనే దృష్టితో సైట్ ఓపెన్ చేస్తే.. కచ్చితంగా నేను వాళ్లకు తప్పుగానే కనిపిస్తా. మనుషుల జీవితాలు ఎఫెక్ట్ అయ్యే స్థాయిలో గాసిప్పులు రాయకూడదు. అవి చదివి ఇంట్లో వాళ్లు ఆందోళనకు గురైతే? ‘గబ్బర్‌సింగ్’లో ఓ డైలాగ్ ఉంది. ‘మనకున్న తిక్క అవ్వచ్చూ... కోపం అవ్వచ్చూ... మూర్ఖత్యం అవ్వచ్చూ... తెగింపు అవ్వచ్చు... ఏదైనా అది మనల్ని ముందుకు తీసుకెళుతుందా, లేక వెనక్కి లాగుతుందా అని ఆలోచించాలి’ అని. నాకున్న ఎగ్రెసివ్‌నెస్ వల్ల నాకు జరిగిన నష్టం ఏమీ లేదు. ఇన్‌ఫ్యాక్ట్ నేను చాలా త్వరగా డెరైక్టర్ అయ్యాను. నేను చాలా స్పీడ్‌గా సినిమాలు తీస్తాను. నా క్వాలిటీ నాకు మైనస్ అవుతుందంటే... డెఫినెట్‌గా మార్చుకుంటా. ట్విట్టర్లో కూడా మీకు వ్యతిరేకంగా ఎవరైనా ట్వీట్ చేస్తే... మీరు స్పందించే తీరు చాలా ఘాటుగా ఉంటుంది. ఒక స్టార్ డెరైక్టర్‌గా అలా స్పందించడం కరక్టే అంటారా? హరీష్‌శంకర్: నా ట్వీట్స్ చూడండి. సాధ్యమైనంతవరకూ ఆనెస్ట్గానే ఉంటాయి. ఒక డెరైక్టర్‌గా నా సినిమాకు సంబంధించిన కరెక్ట్ ఫీడ్‌బ్యాక్ తెలుసుకోవాలనే నేను ట్విట్టర్‌ని ఫాలో అవుతాను. కానీ కొంతమంది ట్వీట్స్ మన సహనాన్ని పరీక్షిస్తుంటాయి. విమర్శకు ఓ పద్ధతి ఉందండీ.. నా వర్క్‌ని ఎంత విమర్శించినా నేను బాధ పడను. కానీ వ్యక్తిగత విమర్శలకు దిగితే మాత్రం క్షమించను. ‘నీకంత లేదురా...’ అని ట్వీట్ చేయడాలు, వల్గర్ కామెంట్స్ పోస్ట్ చేయడాలు కరెక్ట్ కాదు. అలాంటివి చేస్తే.. అంతే తీవ్రంగా స్పందిస్తున్నాను. ఇకముందు కూడా అలాగే స్పందిస్తాను. ఈ మధ్య మీపై కొన్ని రూమర్లు కూడా వచ్చాయి కదా... హరీష్‌శంకర్: ముసుగులో గుద్దులాట అనవసరం. చార్మి గురించేగా మీరు మాట్లాడుతోంది. ఆ రూమర్ ఎలా పుట్టిందో నాకిప్పటికీ అర్థం కాని విషయం. దీని గురించి అడుగుదామని చార్మీకి ఫోన్ చేశాను. ఆ అమ్మాయి లోకల్లో లేకపోవటంతో ఫోన్ కలవలేదు. తర్వాత తానే.. అందులో నిజం లేదని ట్వీట్ చేసింది. నిజానికి తాను ట్వీట్ చేసేంత వరకూ ఈ విషయంపై చాలా బాధపడ్డాను. ఓ వారం రోజుల పాటు తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యాను. తర్వాత మేమిద్దరం కలుసుకొని మాట్లాడుకున్నాం కూడా. ఏదో పార్టీలో ఈ సంఘటన జరిగిందని వార్తలొచ్చాయి. అసలేం జరిగింది? హరీష్‌శంకర్: ఓ పార్టీకి అందరం వెళ్లాం. దాన్ని బేస్ చేసుకొని ఓ వెబ్సైట్లో కథ అల్లేశారు. ఈ గాసిప్... హల్చల్ చేస్తున్న టైమ్‌లోనే ఓ ఇంగ్లిష్ పత్రికావిలేఖరి ఫోన్‌చేసి వివరణ అడిగాడు. ‘ఇది ఎలా పుట్టిందో నాకూ అర్థం కావడం లేదండీ... నేను మిమ్మల్ని కలిసి పూర్తి వివరణ ఇస్తాను’ అని చెప్పాను. కానీ అతను ‘నిప్పు లేకుండా పొగ రాదు కదా’ అన్నాడు. నాకు మామూలుగానే టెంపర్ ఎక్కువ. ‘అది నిప్పు విషయంలోనే కానీ, మనిషి విషయంలో కాదు. అసలు నీకు చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు’ అని ఘాటుగా చెప్పా. పొద్దున్నే పేపర్ చూస్తే.. దీని గురించి ఇంతపెద్ద ఆర్టికల్ ఉంది. నేను షాక్. ప్రెస్‌మీట్ పెడదామనుకున్నా. ‘అది ఇంగ్లిష్ పేపర్. ఎంతమంది చదువుతారు? ప్రెస్‌మీట్ పెట్టి ప్రపంచం మొత్తం తెలియజేయడం దేనికి?’ అని ఓ పాత్రికేయ మిత్రుడు అనడంతో.. ఆ ఆలోచనను విరమించా. ఇన్ని చూశారు కదా.. ఇకనైనా లౌక్యంగా ఉండొచ్చుగా? హరీష్‌శంకర్: ‘ఆకలిరాజ్యం’లో కమల్‌హాసన్ అంటారు. ‘ఎలాగోలా బతకాలనుకుంటే ఎలాగైనా బతకొచ్చు. ఇలాగే బతకాలి అనుకున్నాను కాబట్టే ఇన్ని కష్టాలు’ అని. నా పద్ధతీ అంతే. ఎవరికోసమో నేను మారను. ‘షాక్’ తర్వాత గ్యాప్ రావడంతో స్టోరీ సిట్టింగ్స్‌కి వెళ్లేవాణ్ణి. ఓ సినిమా స్టోరీ సిట్టింగ్ గోవాలో పెట్టారు. నాకు ఫ్లైట్ టికెట్ తీశారు. నాతో పాటు సిట్టింగ్‌లో కూర్చునే ఇంకో రైటర్‌కి బస్ టికెట్ తీశారు. మేమిద్దరం కథ గురించి డిస్కస్ చేసుకుంటూ గోవా వెళదాం అనుకున్నాం. కానీ ఇద్దరిదీ తలోదారి అయ్యింది. దాంతో నిర్మాతతో గొడవ పెట్టుకున్నా. ‘నేను డెరైక్టర్‌గా వెళుతున్నప్పుడు నువ్వు నాకు ఫ్లైట్ టికెట్ తీయ్ కాదనను. కానీ ఇప్పుడు నేను ఓ రైటర్‌గా వెళుతున్నాను. తను, నేను ఇద్దరం ఈ సినిమాకు రైటర్లమే. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అనుకుంటే ఇద్దరికీ బస్ టికెట్టే తీయండి. అంతేకానీ.. నాకు ఫ్లైట్... ఆయనకు బస్ టికెట్ తీస్తే.. ఈ అసమానతల కారణంగా కలిసి ప్రశాంతంగా ఎలా పని చేయగలం’అని నిర్మొహమాటంగా చెప్పా. ఆ ప్రొడ్యూసర్ కూడా నా బాధ అర్థం చేసుకున్నాడు. ఇండస్ట్రీకి వచ్చాకే కాదు. చిన్నప్పట్నుంచీ నేనింతే. రాజీ పడి బతక్కపోతే ఇండస్ట్రీలో ఎదగలేం అంటారు. మీరేమో అందుకు భిన్నంగా ఉన్నారు? హరీష్‌శంకర్: చూడండీ... సినిమా ఇండస్ట్రీకి రావాలని చాలామందికి ఉంటుంది. కానీ లైఫ్‌తో రాజీపడిపోయి ఆ కోరికను చంపుకుంటారు. రకరకాల బరువుబాధ్యతలు వాళ్లను ధైర్యంగా ముందుకు వెళ్లనీయవు. అద్భుతమైన టాలెంట్ ఉండి కూడా తెరవెనుకే మిగిలిపోతారు. కానీ నేను అలాకాదు. లైఫ్‌తో కాంప్రమైజ్ అవ్వడం ఇష్టం లేక... ఇండస్ట్రీకి వచ్చాను. వచ్చిన తర్వాత మళ్లీ రాజీపడమంటే ఎలా చెప్పండి. దానికి నేను అస్సలు ఒప్పుకోను. చిన్నప్పట్నుంచీ మీరింతేనా? హరీష్‌శంకర్: ఇంతే... ఈ రాముడు మంచి బాలుడూ కాదు. అలాగని చెడ్డబాలుడూ కాదు. మీ కుటుంబ నేపథ్యం తెలుసుకోవాలనుంది..? హరీష్‌శంకర్: నేను పుట్టిందీ పెరిగిందీ అంతా హైదరాబాద్ బీహెచ్ఈఎల్లోనే. 10వ తరగతి మాత్రం జగిత్యాలలో చదివాను. మా నాన్నగారు తెలుగు మాస్టర్. అష్టావధాని కూడా. అమ్మ హౌస్‌వైఫ్. నేను ఇంటికి పెద్దకొడుకుని. తమ్ముడు ప్రస్తుతం జాబ్‌లో ఉన్నాడు. చెల్లికి పెళ్లయ్యింది. బావకు యూఎస్‌లో జాబ్. మా నాన్న నాకిచ్చిన ఆస్తి ఒక్కటే.. తెలుగుభాష. అందరూ నన్ను ఇంగ్లిష్ మీడియంలో జాయిన్ చేయమని చెబుతున్నా.. నాన్నమాత్రం తెలుగు మీడియంలోనే చేర్చారు. నేను అదృష్టవంతుణ్ణి అయ్యింది అక్కడే. నాన్నగారు నా అంత స్పీడ్కాదు. చాలా నెమ్మదస్థుడు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. హైదరాబాద్ బాగా డెవలప్ అవుతుంది కదా... ఓ స్థలం కొనేద్దాం అనే తెలివితేటలు కూడా ఆయనకు ఉండేవి కావు. అప్పుడప్పుడు నేను తెలీనితనంతో అంటుండేవాణ్ణి.. ‘ఏమిచ్చారు మీరు మాకు’ అని. ఇప్పుడు నేను డెరైక్టర్ అయ్యాక తెలిసింది ఆయన నాకు ఏమిచ్చారో. మీ నాన్న నుంచి మీరేం నేర్చుకున్నారు? హరీష్‌శంకర్: నాకు ఆయన తండ్రి మాత్రమే కాదు. గురువు కూడా. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఆయనే. స్కూల్లో నేను మంచి స్టూడెంట్‌ని. టెన్త్ వరకూ క్లాస్ ఫస్ట్ వచ్చేవాణ్ణి. ఇంటర్‌కి వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్నయ్యాను. నా చదువుపై మా నాన్నకు పూర్తి నమ్మకం. మా నాన్న తెలుగు టీచర్ అవడంతో... స్కూల్ అయ్యాక ఆయనకు పెద్ద పనుండేది కాదు. మ్యాథ్య్, సైన్స్ చెప్పే టీచర్లు మాత్రం సాయంత్రం పూట ట్యూషన్లు చెప్పుకుంటూ చేతినిండా సంపాదించేవారు. అందుకే మా నాన్నకు పెద్ద కోరిక ఉండేది. ఎలాగైనా నా కొడుకుని మ్యాథ్స్ టీచర్నో లేక సైన్స్ టీచర్నో చేయాలి అని. కాలేజ్ అయ్యాక అప్పుడు మేం కూడా ఇంట్లో ట్యూషన్లు చెప్పుకోవచ్చు అనేది ఆయన ఆశ. మేం ఆర్థిక బాధలు పడకూడదని, మాకు ఏ లోటు కలగకూడదని ఓ వైపు టీచర్‌గా చేస్తూ, మరోవైపు నాన్న పౌరోహిత్యం కూడా చేసేవారు. నాకు బాధ అనిపించేది. ‘దేనికి బాధ.. పౌరోహిత్యం అంటే పదిమంది హితం కోరడం’ అని నాన్న నాకు సర్ది చెప్పేవారు. నాకు గాయత్రీ మంత్రోపదేశం చేశారు కాబట్టి సంధ్యావందనం వచ్చు. ఇదిగాక వేదపఠనం నేర్పారు. మీరు సాహిత్యాభిలాషి, రచయిత అని విన్నాం. సాహిత్యాభిమానం ఎలా మొదలైంది మీకు? హరీష్‌శంకర్: నాకు సమ్మర్ ఎలర్జీ ఉండేది. ఎండలు ఎక్కువగా ఉంటే ముక్కులోంచి బ్లీడింగ్ అవుతుండేది. దాంతో సమ్మర్ వచ్చిందంటే చాలు ఇంట్లో అందరికీ టెన్షన్. పైగా నేను చిన్నప్పట్నుంచీ బాగా హైపర్. ఒకచోట ఉండేవాణ్ణికాదు. దాంతో నాన్న నన్ను బయటకు వెళ్లనీయకుండా... చిన్నప్పట్నుంచీ మధుబాబు డిటెక్టివ్ నవలలు తీసుకొచ్చి చదవమనేవారు. వాటిల్లో పడైనా బయటకు వెళ్లకుండా ఉంటాడని నాన్న ఆలోచన. అలా పుస్తకాలు చదవడం అలవాటైంది. నైన్త్క్లాస్కి వచ్చేసరికే యండమూరి, మల్లాది నవలలు ఆల్మోస్ట్ నమిలేశా. తర్వాత చలం, తిలక్, శ్రీశ్రీ, శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి, అడవిబాపిరాజు... ఇలా మహామహుల రచనలన్నింటినీ చదివేశా. ఓ విధంగా చెప్పాలంటే మా ఇల్లే ఓ లైబ్రరీ. ఈ రోజున నేను రాయగలిగున్నానంటే... కారణం ఆ పుస్తకాలే. సరే... డెరైక్టర్ అవాలనే ఆలోచన ఎలా మొదలైంది? హరీష్‌శంకర్: బీహెచ్ఈఎల్ అంటే... అదొక కల్చరల్ హబ్. పరిషత్తు నాటకాలకు పెట్టింది పేరు. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే పరిషత్ నాటకాల్లోకి ఎంటరయ్యా. నాయుడు గోపి, మిశ్రో మాకు హీరోలు. వారి నాటకం అంటే.. స్టేజ్ డెకరేషన్ నుంచి ‘పరబ్రహ్మ...’ పాడేంత వరకూ వారితోనే ఉండేవాణ్ణి. చాలా నాటకాల్లో బాలనటుడిగా నటించాను. తర్వాత మా గురువు మోహన్రావుగారు నాటకాన్ని డెరైక్ట్ చేస్తుంటే... ఆయనకు సహాయకునిగా ఉండేవాణ్ణి. అలా నాటకరంగంలో అసిస్టెంట్‌గా నా దర్శక ప్రస్థానం మొదలైంది. అయిదొందలు ఇస్తామంటే... వారం రోజులు కష్టపడి రిహార్సల్స్ చేసి దూరదర్శన్‌లో డ్రామాలు వేసేవాళ్లం. ఆ అనుభవమే నన్ను సినిమాలవైపు నడిపించింది. ఫస్ట్ ఎవర్ని కలిశారు? హరీష్‌శంకర్: ఈవీవీ గారిని. ఆయన రైటర్లను బాగా ఎంకరేజ్ చేస్తారు. ‘రచనా సహకారం’ అని ఓ పదిమంది రైటర్ల పేరు టైటిల్స్‌లో వేస్తారు. అందులో ఒకడిగా జాయిన్ అయితే చాలని తిరిగాను. అవకాశం రాలేదు. తొలిసారి ఎవరిదగ్గర పనిచేశారు? హరీష్‌శంకర్: పర్టిక్యులర్‌గా ఒకరి దగ్గర అని లేదు. చాలామంది దగ్గర ఘోస్ట్‌గా చేశా. అయితే.. కెరీర్ ప్రారంభంలో నన్ను ఎంకరైజ్ చేసిన వ్యక్తుల్లో ఇద్దరి పేర్లు మాత్రం కచ్చితంగా చెప్పాలి. వారే దుర్గా ఆర్ట్స్ ఎస్.గోపాల్‌రెడ్డి, కె.ఎల్.నారాయణ. వారి తర్వాత రవిరాజా పినిశెట్టి. ఆయన ‘వీడే’ సినిమాకు పనిచేశా. అప్పుడే ‘నేనూ ఓ సినిమాకు డెరైక్ట్ చేయొచ్చు’ అనే నమ్మకం ఏర్పడింది. మరి రామ్‌గోపాల్‌వర్మతో పరిచయం ఎలా? హరీష్‌శంకర్: దానికి కారణం రవితేజగారు. ‘నా ఆటోగ్రాఫ్’ టైమ్‌లో ఆయనకు ఓ కథ చెప్పాను. అది ఆయనకు నచ్చేసి డవలప్ చేయమన్నారు. ఈ లోపు వర్మగారు హిందీ, తెలుగు భాషల్లో ‘షాక్’ ప్రాజెక్ట్‌ని లైన్లో పెట్టారు. ‘ఢర్నా మనాహై’ఫేం ప్రవాల్రామన్ డెరైక్టర్. తెలుగు వెర్షన్‌కి తెలుగు తెలిసిన కో-డెరైక్టర్ కావాలి అనుకున్నప్పుడు రవితేజ నా పేరు సజెస్ట్ చేశారు. ‘షాక్’ సినిమా కో-డెరైక్టర్‌గా, కోన వెంకట్‌తో కలిసి ముంబయ్‌లో అడుగుపెట్టా. వర్మ మా ఇద్దరికీ ‘షాక్’ కథ చెప్పారు. ఒక మారియో ప్యూజో నవల చదువుతున్నట్లు కళ్ల ముందు సినిమా కనిపించింది. ఇలాక్కూడా కథ చెప్పొచ్చా అనిపించింది. ఎలా ఉంది అన్నారు. మనకు నోటి దూల ఎక్కువ కదా. ‘కథ అద్భుతంగా ఉందిసార్. అయితే... రవితేజ మీద వర్కవుట్ అవ్వదు’ అని టక్కున అనేశాను. కోన పక్కనుండి గిల్లుతున్నా పట్టించుకోలా. వర్మ నా వంక కోరగా చూశారు. ‘హైదరాబాద్ నుంచి వచ్చి నా కథ వర్కవుట్ అవ్వదంటావా... నీ డెసిషన్ తీసుకొని సినిమా తీయడం మానేస్తాననుకున్నావా?’ అన్నారు సూటిగా. ‘మీరేం మానొద్దండీ.. ఇది రవికి బాగోదు అన్నాను అంతే’ అన్నాను రెట్టిస్తూ.. ‘సరే ఏం చేస్తే బావుంటుందో చేయ్. ఈ సినిమాకు నువ్వే డెరైక్టర్‌వి’ అని సీరియస్‌గా నన్ను డెరైక్టర్ని చేసేసి అక్కడ్నుంచి వెళ్లిపోయారు. అందరూ షాక్. అప్పటికే రవితేజకు కథ చెప్పి ఉండటంతో ఆలోచనలో పడ్డాను. ‘వర్మతో పాటు నీ పేరు స్క్రీన్‌మీద వస్తుంది. ఇది మామూలు అవకాశం కాదు. డెరైక్ట్‌గా ప్లేట్ నీ ముందుకొస్తే తిననంటావేంటి?’ అని నచ్చజెప్పారు కోన. వర్మగారి లైన్ అలాగే ఉంచి, స్క్రీన్‌ప్లేలో కొన్ని మార్పులు చేశా. ఒకవేళ సినిమా అందుకే పోయిందేమో. ఆయన చెప్పినట్టు తీస్తే ఫలితం ఎలా ఉండేదో. వర్మ వద్ద పనిచేయకపోయినా... ఆయన లక్షణాలు మీలో కొన్ని కనిపిస్తుంటాయి? హరీష్‌శంకర్: ఒకళ్లను చూసి ఎడాప్ట్ అవ్వలేమండీ.. గాంధీమహాత్ముణ్ణి చూసి ప్రపంచం అంతా అడాప్ట్ అయిపోవచ్చుగా.. మనం అవ్వలేం. మనలో ఏది ఉంటుందో.. అదే మనకు నచ్చుతుంది. అది ఎదుటివారిలో కనిపిస్తే ఆటోమేటిగ్గా వాళ్లను మనం ఇష్టపడతాం. బహుశా.. నాలో నాకు నచ్చే అంశాలు ఆయనలో నాకు కనిపించి ఉండొచ్చు. చూడండీ.. మన సెల్లో సిమ్‌కార్డ్ ఉంటేనే సిగ్నల్స్ వస్తాయి. ఆ విషయాన్ని పక్కనపెడదాం... మీది ప్రేమ వివాహమట కదా. కాస్త మీ ప్రేమకథ చెబుతారా? హరీష్‌శంకర్: పెద్ద లవ్‌స్టోరీ ఏం లేదండీ... తను ఎన్ఆర్ఐ. కెనడాలో ఉండేది. పేరు స్నిగ్ద. క్లినికల్ సైకాలజిస్ట్. ఆటిజంతో ఇబ్బంది పడుతున్న పిల్లలకు కౌన్సెలింగ్ చేస్తుంది. స్నేహితుని బర్త్‌డే పార్టీలో తొలిసారి తనను చూశాను. అప్పుడే ఆమెతో పరిచయం అయ్యింది. తర్వాత తను కెనడా వెళ్లిపోయింది. అనుకోకుండా ఇంటర్నెట్లో కలిసింది. మా ఇద్దరి అభిప్రాయాలూ కలిశాయి. కానీ మా కులాలు వేరవడంతో మా ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. ఎలాగోలా ఒప్పించి చెల్లి పెళ్లి అయ్యాక... పెళ్లి చేసుకున్నా. సినిమాలపై తనకు లీస్ట్ నాలెడ్జ్. ఒక దర్శకునిగా కాక, వ్యక్తిగా నన్ను ఇష్టపడటం నాకు నచ్చింది. అందుకే పెళ్లి చేసుకున్నాను. పిల్లల సంగతేంటి? హరీష్‌శంకర్: పిల్లలపై ఇంట్రస్ట్ లేదండీ. నా మార్కుల గురించి, నా లైఫ్ గురించి టెన్షన్ పడుతున్న ఈ దశలో... పిల్లల మార్కుల గురించి, పిల్లల లైఫ్‌ల గురించి ఆలోచించలేను. - బుర్రా నరసింహ ‘గబ్బర్‌సింగ్’ విషయంలో పవన్‌కల్యాణ్ కంట్రిబ్యూషన్ ఎంత? హరీష్‌శంకర్: ఆ సినిమా విషయంలో కల్యాణ్‌గారి కంట్రిబ్యూషన్ చాలా ఉంది. ‘గబ్బర్‌సింగ్’ టైటిల్ పెట్టింది ఆయనే. క్యారెక్టరైజేషన్ విషయంలో కూడా ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమాలో ఓ మంచి మద్దెల ప్రోగ్రామ్ ఉంటే బాగుంటుందని ఆయన చెబితే.. ‘అంత్యాక్షరి ఎపిసోడ్’ని డిజైన్ చేసి దాన్ని పర్పస్‌ఫుల్‌గా వాడాను. సినిమా మొత్తానికి ఎంత కష్టపడ్డానో.. ఆ ఒక్క ఎపిసోడ్ విషయంలో అంత కష్టపడ్డాను. దాదాపు మూడొందల పాటల్ని విని, అందులోంచి కొన్ని పాటల్ని వడపోత కట్టి, ఆ ఎపిసోడ్ చేశాం. తర్వాత చాలా సినిమాల్లో దాన్ని ప్రేరణగా తీసుకొని సన్నివేశాలొచ్చాయి. ఆ సినిమా మాతృక ‘దబాంగ్’ను నేనెంత ఛేంజ్ చేయకపోతే.. ‘మాటలు, మార్పులు’ అనే టైటిల్ కార్డ్ వేసుకుంటానో అర్థంచేసుకోండి. కల్యాణ్‌గారి ‘తొలిప్రేమ’ షూటింగ్ బీహెచ్ఈఎల్లో జరిగినప్పట్నుంచీ, ‘గబ్బర్‌సింగ్’ తొలిషాట్ తీసేంతవరకూ.. ఈ మధ్యలో వచ్చిన వపన్ సినిమాలు, పవన్ డైలాగులు, పవన్ స్టైల్స్‌తో కలిసి నేను చేసిన ప్రయాణ ఫలితమే ‘గబ్బర్‌సింగ్’ సినిమా. పవన్‌పై నాకున్న ఇష్టానికి ప్రతీక ‘గబ్బర్‌సింగ్’. లైఫ్‌లో గుర్తుండిపోయిన సంఘటనలు? హరీష్‌శంకర్: మనసుకు బాధ పెట్టిన సంఘటనలే నన్ను ఎక్కువ హంట్ చేస్తుంటాయి. ఉదాహరణకు వడ్డే నవీన్‌గారి సినిమాకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా నేను ఓకే అయ్యాను. అన్నపూర్ణ స్టూడియోలో ఓపెనింగ్. ముహూర్తం అయిపోగానే... సదరు దర్శకుడు పక్కకు పిలిచి... ‘నేను ఫస్ట్ టైమ్ డెరైక్ట్ చేస్తున్నాను. నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్టాఫ్‌ని పెట్టుకోలేం’ అన్నారు. బాధతో బయటకెళ్లిపోయాను. తర్వాత అదే డెరైక్టర్ ఇంకో సినిమాకు నన్ను తీసుకొని రెండ్రోజుల తర్వాత పంపించేశారు. ఆ క్షణంలో ఎంత బాధ అనిపిస్తుందో అర్థం చేసుకోండి. అంలాంటి బాధల్ని ఎన్నోసార్లు ఫేస్ చేశా. బంజారాహిల్స్ నుంచి అమీర్‌పేట వరకు కన్నీటితో నడుచుకుంటూ వెళ్లిపోయిన సందర్భాలున్నాయి. ఓ ప్రైవేటు ఆల్బమ్ షూటింగ్ చేస్తున్నాం. ప్రముఖ కెమెరామేన్ ఆ ఆల్బమ్‌కి పనిచేస్తున్నారు. ఏదో పనిచేస్తూ... తెలీక కెమెరాకు అడ్డుగా నిలబడ్డాను. అప్పటికే ఆ కెమెరామేన్ చాలా ఇరిటేషన్లో ఉన్నట్టున్నారు. నేను లొకేషన్లో ఉండేసరికి... ఆయనకు కోపం ఆగలేదు. నా చొక్కా కాలర్ పట్టుకొని బయటకు లాక్కెళ్లారు. కచ్చితంగా అక్కడ తప్పు నాదే అయినా.. ఆ క్షణాన చాలా బాధ పడ్డాను. ఆ సంఘటన నాకు అలాగే ఎందుకు గుర్తుండిపోయిందంటే... ఆ రోజు నా పుట్టిన రోజు . అయితే.. నేను డెరైక్టర్ని అయ్యాక ఆయనతోనే కలిసి పనిచేశా. నేను ఎంత ఎగ్రెసివ్‌గా ఉంటానో, అంత సున్నితంగా ఉంటా. పిలిస్తే కన్నీళ్లు వస్తాయి నాకు. ఉదాహరణకు ఢిల్లీ గ్యాంగ్‌రేప్ ఇన్సిడెంట్ జరిగాక, వారం రోజులు మనిషిని కాలేకపోయాను. -
ప్రేమించా.. కానీ విడిపోయా!
అమ్మాయిలు ఎలా ఉండాలి? ఇది కరెక్టు ప్రశ్న కాదు. మరేది కరెక్టు ప్రశ్న? అబ్బాయిలు ఎలా ఉండకూడదు? అని అడగడం. ఇంతవరకూ ఎవరైనా ఈ ప్రశ్న అడిగారా? లేదు! అబ్బాయిలు ఎలా ఉండకూడదో చెప్పేవాళ్లు ఉండి ఉంటే... అమ్మాయిలు ఎలా ఉండాలన్న ప్రశ్న వచ్చి ఉండేదే కాదు. ‘సాక్షి’ ఫ్యామిలీ ఈ వారం... నిత్యా మీనన్ అనే అమ్మాయితో మాట్లాడినప్పుడు ఇలాంటి డిస్కషన్ ఏమీ రాలేదు కానీ... అమ్మాయిలు ఎలా ఉన్నా, ఎలా ఉండకున్నా నిత్యనైతే ఆదర్శంగా తీసుకోవాలనిపించింది! అదేమిటి? నిత్యామీనన్ హీరోయిన్ కదా... సింపుల్‌గా... ‘అమ్మాయి’ అనేయడమేనా?! నిత్య... హీరోయినే. కానీ... ఆమెను మించిన హీరోయిన్ ఆమెలోని అమ్మాయి! ఇవాళ్టి ఈ ‘తారాంతరంగం’ చదవండి. మీ అమ్మాయి చేత చదివించండి. పెప్పర్ స్ప్రేలు, గన్ల కన్నా అనువైనదేదో... మీకు ఈ ఇంటర్వ్యూలో దొరుకుతుంది. ఎక్కువమంది లేడీ డైరక్టర్స్‌తో సినిమాలు చేస్తున్నారు కదా.. మేల్, ఫీమేల్ డెరైక్టర్స్‌లో వర్కింగ్ పరంగా మీకు కనిపించిన వ్యత్యాసం ఏంటి? నిత్యామీనన్: ఓ విధంగా నేను లక్కీ. ఎందుకంటే, ఎక్కువమంది ఫీమేల్ డెరైక్టర్స్‌తో సినిమాలు చేసే అవకాశం నాకే దక్కిందనుకుంటున్నా. నందిని, అంజు, అంజలీమీనన్.... ఇప్పుడు శ్రీప్రియగారు. దర్శకులని ఆడ, మగ అని విభజించలేం. ఏ డెరైక్టర్ అయినా ‘కెప్టెన్ ఆఫ్ ది షిప్పే’. ఏ డెరైక్టర్‌తో అయినా వేవ్‌లెంగ్త్ కుదరడం అవసరం. లేడీ డెరైక్టర్స్‌తో చేసినపు్పుడు వెసులుబాటు ఏంటంటే, కాస్ట్యూమ్ గురించి ఓపెన్‌గా మాట్లాడొచ్చు. ఒకవేళ మీకు ఏ దర్శకులతో అయినా వేవ్ లెంగ్త్ కుదరకపోతే ఏం చేస్తారు? నిత్యామీనన్: అందుకే సినిమాలు సెలక్ట్ చేసుకునే విషయంలో జాగ్రత్త వహిస్తా. సినిమాలకన్నా ముందు వ్యక్తులను సెలక్ట్ చేసుకుంటాను. ‘వీళ్లతో సినిమా చేస్తే ఇబ్బందేమీ ఉండదు’ అనే నమ్మకం కుదిరితే ఒప్పుకుంటాను. ఒక సినిమాని ఎంజాయ్ చేస్తూ చేయాలి కానీ ఇబ్బందులుపడి కాదు. ‘వీళ్లతో ఇబ్బందులు రావు’ అని ఎలా జడ్జ్ చేస్తారు? నిత్యామీనన్: ఓ సినిమా స్టార్ట్ అయ్యే ముందు కథ, పాత్ర గురించి చెప్పడానికి దర్శక, నిర్మాతలు కనీసం రెండు, మూడుసార్లయినా కలుస్తారు. అప్పుడు వాళ్లేంటో కొంతవరకు అర్థమవుతుంది. అన్నిసార్లూ జడ్జ్ చేయడం కష్టమే. కానీ, ఇప్పటివరకు దాదాపు నా జడ్జిమెంట్ కరెక్ట్ అయ్యింది. మహా అయితే ఒకటి, రెండుసార్లు ఇబ్బందిపడ్డ సందర్భాలు ఉన్నాయేమో. వాటిని కూడా డీల్ చేయగలిగాను. సినిమాల ఎంపిక విషయంలో మీరు చాలా సెలక్టివ్‌గా ఉండటంవల్లనో, కొంచెం రిజర్వ్డ్గా ఉండటంవల్లనో మీరు ‘యారోగెంట్’ అని కొంతమంది అంటుంటారు.. నిత్యామీనన్: నేను యారోగెంట్ కాదు. స్ట్రిక్ట్‌గా ఉంటాను. నాతో పాటు షూటింగ్స్‌కి మా అమ్మానాన్న రారు. నా పక్కన నా మేనేజర్ ఉండరు. సో.. నా దగ్గర ఎవరైనా తప్పుగా బిహేవ్ చేస్తే.. నేనే డీల్ చేయాలి కదా. నాతో రాంగ్గా మాట్లాడినా, తేడాగా బిహేవ్ చేసినా నేను ఊరుకోను. అరిచి, గోల చేయను. ‘నాతో అలా ప్రవర్తించవద్దు’ అని ఖరాఖండిగా చెబుతాను. అలా అబ్బాయిలు చెబితే ఏమీ అనరు కానీ.. అమ్మాయిలు మాట్లాడితే మాత్రం యారోగెంట్ అంటారు. నా గురించి మంచివాళ్లను అడిగితే, మంచిగానే చెబుతారు. కానీ, చెడ్డవాళ్లని అడిగితే కచ్చితంగా చెడుగానే చెబుతారు. సో.. నా గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే, వాళ్లు రాంగ్ పర్సన్ అని మీరు ఫిక్స్ అవ్వొచ్చు. ఆడవాళ్లు నిర్భయంగా మాట్లాడితే తప్పు... మగవాళ్లయితే ఏమైనా చేయొచ్చనే ఈ పరిస్థితి మీకెలా అనిపిస్తుంది? నిత్యామీనన్: అది బాధాకరమే. సరైన విషయాల గురించి మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఆ హక్కుని సద్వినియోగం చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి.. ఏదైనా సరే నిర్భయంగా చెప్పేయాలి. లక్కీగా నేనిప్పటివరకు అంతా మంచివాళ్లతోనే యాక్ట్ చేశాను. మగాళ్లందరూ డామినేట్ చేస్తారనలేం. రైట్పర్సన్స్ కూడా ఉంటారు. అందుకే అంటున్నా.. రైట్ పీపుల్ని సెలక్ట్ చేసుకుంటే ఇబ్బందులు ఉండవని. జనరల్‌గా చాలామంది హీరోయిన్స్ అమ్మా నాన్నని తోడు తీసుకొచ్చుకుంటారు. మరి.. మీతో పాటు మీవాళ్లను ఎందుకు తీసుకురారు? నిత్యామీనన్: మా అమ్మా నాన్న జాబ్ చేస్తారు. నాకోసం వాళ్లిద్దరూ ఉద్యోగాలు వదులుకోవాల్సిన అవసరం లేదు కదా. మా అమ్మ కొంగు పట్టుకుని తిరగడానికి నేనేం చిన్నపిల్లనూ కాదు. నా లైఫ్‌ని డీల్ చేసుకునే సమర్థత, వయసు నాకున్నాయి. మా అమ్మానాన్నలకు నేను ఒకే కూతుర్ని. నన్ను గారాబంగా పెంచడంతో పాటు నా లైఫ్‌ని నేను డీల్ చేసుకునే విధంగా పెంచారు. చిన్న విషయాలక్కూడా పెద్దగా భయపడిపోవడం నా డిక్షనరీలో లేదు. నేను చాలా విషయాలకు అస్సలు భయపడను. ఊరు కాని ఊరు.. దేశం కాని దేశం వెళుతుంటారు కదా.. మీ అమ్మానాన్న జాగ్రత్తలు చెబుతుంటారా? నిత్యామీనన్: పిల్లలు బయటికెళ్లేటప్పుడు ఏ తల్లిదండ్రయినా జాగ్రత్తలు చెబుతారు. మావాళ్లూ అంతే. నా మీద మా అమ్మానాన్నలకు నమ్మకం ఎక్కువ. నా చిన్నప్పుడు కూడా నేను వాళ్లకి ఎలాంటి సమస్యలు తేలేదు. చిన్నప్పుడు అల్లరి చేసేదాన్ని కాదట. రెండేళ్ల వయసులో కూడా ఎక్కడ పుస్తకాలు అక్కడ పెట్టడం, కాళ్లు కడుక్కుని సోఫాలో కూర్చోవడం చేసేదాన్నట. అమ్మ అప్పుడప్పుడూ చెబుతుంటుంది. కొన్ని సమస్యలను మాకన్నా నువ్వే బాగా హ్యాండిల్ చేయగలుగుతావని నా పేరెంట్స్ అంటుంటారు. మీకు సినిమా పరిశ్రమలో స్నేహితులు ఉన్నారా? నిత్యామీనన్: లేరు. ఫ్రెండ్షిప్ చేసేంత మంచివాళ్లు దొరకలేదా? నిత్యామీనన్: విడిగానూ నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ. నా వేవ్‌లెంగ్త్‌కి మ్యాచ్ కానివాళ్లతో నేను ఫ్రెండ్షిప్ చేయలేను. పైగా, నేను ఫేస్బుక్, ట్విట్టర్ అంటూ సోషల్ నెట్వర్కింగ్లో కూడా లేను. అయితే నా కో-స్టార్స్‌తో మాత్రం ఫ్రెండ్లీగా ఉంటాను. కానీ, ‘వీళ్లు నా ప్రాణస్నేహితులు’ అని చెప్పేంత స్నేహితులు సినిమా పరిశ్రమలో లేరు. మీ పేరు మీద ట్విట్టర్ ఎకౌంట్ ఉందే? నిత్యామీనన్: అది నకిలీది. నా పేరు మీద నకిలీ ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది. ఆ ఎకౌంట్స్ నావే అని చాలామంది ఫాలో అయ్యి, మోసపోతున్నారు. అందుకే.. నేను సోషల్ నెట్వర్కింగ్లో లేనని మరోసారి స్పష్టం చేస్తున్నా. మరి.. మీరే ఓ ఎకౌంట్ ఓపెన్ చేయొచ్చుగా? నిత్యామీనన్: నాకంత టైమ్ లేదండి. ఆల్రెడీ కెరీర్‌తో బిజీగా ఉన్నాను. ఇక ఆన్లైన్ మేనేజ్మెంట్ అంటే కష్టం. టైమ్ దొరికితే నా ఫ్యామిలీతో గడపాలనుకుంటాను. అంతేకానీ.. ఏ టెన్షన్సూ పెట్టుకోదల్చుకోలేదు. ఎనిమిదేళ్ల వయసులోనే ఇంగ్లిష్ సినిమాలో యాక్ట్ చేశారట? నిత్యామీనన్: అవును. మా ఇంట్లో నా ఫొటో చూసి, ‘పాప బాగుంది..’ అని ఓ ఫొటోగ్రాఫర్ ఆ ఫొటో తీసుకున్నారు. మా ఇంటిపక్కనే ఆయన ఉండేవారు. ఆయన యాడ్ ఏజెన్సీలో వర్క్ చేసేవారు. అక్కడ నా ఫొటో పెట్టారు. అది చూసి, ఓ ఫ్రెంచ్ డెరైక్టర్ టబు చెల్లెలి పాత్రకు నన్నడిగారు. చిన్నప్పుడు నాలో టబు పోలికలు కనిపించేవి. ఆ డెరైక్టర్ మా ఇంటికి ఫోన్ చేసి ‘పాపని యాక్ట్ చేయిస్తారా’ అని అడిగితే, మేమందరం షాక్ అయ్యాం. ఎందుకంటే, మా ఇంట్లో సినిమా పరిశ్రమకు సంబంధించినవాళ్లెవరూ లేరు. మా కుటుంబంలో చదువుకి ప్రాధాన్యం ఇస్తారు. బాగా చదువుకోవడం, మంచి ఉద్యోగం చేయడం. అంతవరకే. అందుకే, మావాళ్లెవరూ ఒప్పుకోలేదు. కానీ, నేను చేస్తానన్నాను. అలా, ‘హనుమాన్’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా యాక్ట్ చేశాను. అప్పట్నుంచే సినిమాలంటే ఇంట్రస్ట్ ఏర్పడిందా? నిత్యామీనన్: అలా ఏం లేదు. జర్నలిస్ట్ అవ్వాలని ఉండేది. కానీ, చివరికి యాక్టింగే నా కెరీర్ అవుతుందని అనుకోలేదు. జర్నలిస్ట్‌గా చేశారా? నిత్యామీనన్: చేశాను.. కానీ, ఒకటి, రెండేళ్ల తర్వాత ఆ జాబ్ మనకు సరిపడదనిపించింది. అందుకే, వదిలేశా. సినిమాలే కెరీర్ అయినందుకు ఎలా అనిపిస్తోంది? నిత్యామీనన్: ఈ ఫీల్డ్‌లో మంచీ చెడూ రెండూ ఉన్నాయి. అవి పక్కనపెడితే, ఓ మంచి సీన్లో యాక్ట్ చేసిన రోజున చాలా ఆనందంగా ఉంటుంది. అయితే సెలబ్రిటీగా ఉండటం నచ్చదు. ఎక్కడికెళ్లినా దొంగచాటుగా ఫొటోలు తీయడానికి ప్రయత్నిస్తారు. అది ఇబ్బందిగా ఉంటుంది. అలాగే, నిజమా? కాదా అని తెలుసుకోకుండా మా గురించి ఏదేదో ప్రచారం చేస్తుంటారు. అప్పుడు బాధగా ఉంటుంది. కానీ, ఇప్పుడు అన్నింటినీ ఎదుర్కోవడం అలవాటయ్యింది. మీ మీద వదంతులు వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? నిత్యామీనన్: నా గురించి వదంతులేవీ రావు కదా. ఎఫైర్లకు సంబంధించినవి కాదు.. నిత్యా పొగరుగా బిహేవ్ చేయడంతో మలయాళ పరిశ్రమలో నిషేధించారట.. లాంటి వార్తలకు? నిత్యామీనన్: నేను చాలా సెన్సిటివ్. అందుకని, చాలా బాధపడతాను. వాస్తవానికి నన్ను చాలామంది అపార్థం చేసుకున్నారు. ‘వామ్మో.. నిత్యా’ అంటారు. కానీ, యాక్చువల్‌గా చెప్పాలంటే నేను చాలా ‘లవింగ్ పర్సన్’. రాంగ్గా బిహేవ్ చేసేవాళ్ల దగ్గరే స్ట్రిక్ట్‌గా ఉంటాను. నాతో బాగుంటే నేనూ బాగుంటాను. ఏదేమైనా, ఈ సంఘటనల వల్ల నాలో ఇంకా మానసిక పరిణతి పెరిగింది. ఫిలసాఫికల్‌గా ఆలోచించడం అలవాటయ్యింది. ఒక సమస్యను అధిగమించి ప్రశాంతంగా ఎలా ఉండాలి? అనే నేర్పు వచ్చింది. గ్లామరస్ రోల్స్ చేస్తేనే హీరోయిన్స్‌కు మనుగడ అంటారు.. కానీ, మీ రూటే సెపరేటు అన్నట్లుగా ఉంది? నిత్యామీనన్: కావాలనే ఆ రూట్లో వెళుతున్నా. నాకు సౌకర్యవంతంగా అనిపించే పాత్రలనే చేస్తాను. ఒకవేళ ఏదైనా సీన్ చాలా గ్లామరస్‌గా కనిపించాలని డిమాండ్ చేస్తే.. అప్పుడేం చేస్తారు? నిత్యామీనన్: లొకేషన్లో నాకా ప్రాబ్లమ్ రాదు. ఎందుకంటే, కథ వినేటప్పుడే సీన్స్ గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటాను. నన్నెవరూ గ్లామరస్‌గా కనిపించాలని డిమాండ్ చేయరు. ముఖ్యంగా తెలుగులో. ‘మీరు చేయరని మాకు తెలుసు..’ అని చెబుతుంటారు. ఒకవేళ గ్లామరస్ రోల్ అంటే నా దగ్గరకి ఎందుకొస్తారు? అందమైన హీరోయిన్లు చాలామంది ఉన్నారు కదా. మీరూ అందంగానే ఉంటారు.. కానీ, స్లిమ్‌గా ఉండటానికి ట్రై చేయరేమో? నిత్యామీనన్: (నవ్వుతూ). మీరన్నట్లు ఫిజిక్‌ని మెయిన్టైన్ చేయను. అందుకే లావుగా ఉన్నాను. ఎక్సర్సైజులు చేయను. నాకెందుకో యాక్టింగ్ కోసం తిండిని త్యాగం చేయడం చాలా క్రేజీ అనిపిస్తుంది. నాకు నచ్చినట్లుగా ఉంటాను. నాకు నచ్చినవి తింటాను. గ్లామరస్ రోల్స్ చేసే తారలకన్నా మీ పారితోషికం తక్కువ కదా. మరి.. ‘పర్ఫార్మెన్స్’ రోల్స్‌కి పరిమితమై ఆర్థికంగా నష్టపోతున్నారేమో? నిత్యామీనన్: కేవలం డబ్బు కోసమే నేను పని చేయను. ఈ సినిమా నాకు ఆత్మసంతృప్తినిస్తుంది... గౌరవం పెంచుతుందనిపిస్తే చేస్తాను. కానీ, డబ్బు కూడా ముఖ్యమే. మన దురదృష్టం కొద్దీ డబ్బు లేకుండా మనం బతకలేం. అందుకే కదా ఈ ఉద్యోగాలు చేస్తున్నాం. ఇక, ఇతర తారల పారితోషికం గురించి మాట్లాడాలంటే.. వాళ్లకంత మార్కెట్ ఉంది కాబట్టే ఎక్కువ ఇస్తున్నారన్నది నా ఫీలింగ్. సో.. తప్పేంటి? ఊరకనే ఎవరూ డబ్బు ఇచ్చేయరు కదా. తెలుగు ఇండస్ట్రీ బాగా బిజినెస్ ఓరియంటెడ్. ఎవరికైనా భారీ పారితోషికం ఇచ్చేటప్పుడు వాళ్ల మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుంటారు. నా స్థాయికి కరెక్ట్ అనిపించినది నేను ‘కోట్’ చేస్తున్నాను. మిగతావాళ్లు ఇంత తీసుకుంటున్నారు కాబట్టి మనమూ అంతే తీసుకోవాలనుకోను. నంబర్‌వన్ స్థానాన్ని టార్గెట్ చేయరా? నిత్యామీనన్: నా బాటలో నేను ‘నంబర్‌వన్’. నేను చేస్తున్న పాత్రలు మిగతావాళ్లు చెయ్యలేరు. వేరేవాళ్లు చేస్తున్నవి నేను చెయ్యలేను. నటనకు అవకాశం ఉన్న పాత్ర అనుకోండి.. ‘ఈ పాత్ర నిత్యామీనన్ మాత్రమే చేయగలదు’ అని ఎవరైనా అంటే.. నేను నంబర్‌వన్ కిందే లెక్క. మీ మనస్తత్వానికి సినిమా పరిశ్రమ సరిపడదేమో అనిపిస్తోంది? నిత్యామీనన్: అది కొంతవరకు కరెక్టే. నాకిది కరెక్ట్ ప్లేస్ కాదని చాలాసార్లు అనిపించింది. ఉదాహరణకు ఈ మధ్య జరిగిన ఓ సంఘటన చెబుతాను. నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లినప్పుడు, ‘డ్రంక్ అండ్ డ్రైవ్’కి చెక్ చేశారు. అక్కడ ఎందుకున్నారో కానీ చాలామంది ఫొటోగ్రాఫర్లు ఉన్నారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించకూడదు కాబట్టి, ఊదాను. ఈలోపు ముందుకు దూసుకొచ్చేసి, ఫొటోలు తీయడం మొదలుపెట్టారు. నాకెంత ఇబ్బందిగా ఉంటుందో అర్థం చేసుకోండి. నా కారు వెళ్లడానికి కనీసం దారి కూడా ఇవ్వలేదు. అది నాకు ‘హెరాస్మెంట్’లా అనిపించింది. ఇలాంటివి హెరాస్మెంట్స్ చాలా జరిగాయి. ఆ విషయాన్ని అలా ఉంచితే.. మేం కెమెరా ముందు మాత్రమే కాదు.. విడిగానూ యాక్ట్ చేయాలని కొంతమంది ఎదురు చూస్తారు. ‘హాయ్ హలో..’ అంటూ క్లోజ్‌గా మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. అలా చేయకపోతే ‘చెడ్డ అమ్మాయి’ అంటారు. అప్పుడనిపిస్తుంది... ఇక్కడకి ఎందుకు వచ్చామా? అని. క్రియేటివ్ జాబ్‌ని ఇష్టపడతాను కాబట్టి.. ఇలాంటివి తట్టుకోవాలని సర్దిచెప్పుకుంటాను. గౌతమబుద్ధుడిలా వివేకవంతంగా మారడానికి, ప్రశాంతంగా ఉండటానికే ఆ దేవుడు నాకిలాంటి కెరీర్‌ని ఇచ్చాడేమో అనిపిస్తుంటుంది (నవ్వుతూ). మీరు యాక్ట్ చేసే సినిమాలు మీరు చూడరట కదా? నిత్యామీనన్: సీన్ తీసేటప్పుడు డెరైక్టర్ చెప్పే ‘యాక్షన్... కట్’ మాత్రమే నాకు ముఖ్యం. ఆ సమయంలోనే వంద శాతం ఎఫర్ట్ పెట్టడానికి ట్రై చేస్తాను. అందుకని, సినిమా చూసుకుని లోపాలు వెతుక్కోవడానికి ట్రై చేయను. సినిమా ఎలా వచ్చింది? హిట్టా.. ఫ్లాపా అనే విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి కనబర్చను. అంటే... హిట్స్‌కి పొంగిపోవడం, ఫ్లాప్స్కి కుంగిపోవడం జరగదన్నమాట? నిత్యామీనన్: మలయాళంలో కెరీర్ స్టార్టింగ్‌లో నేను చేసినవన్నీ ఫ్లాప్సే. కానీ, ఆ సినిమాలు నాకు చాలా ముఖ్యం. ఎందుకంటే, కేరక్టర్ నచ్చడంవల్లే అవి చేశాను. సినిమా అనేది ఓ మంచి అనుభవం. 50, 60 రోజులు ఓ సినిమాకి పని చేస్తాం. ఆ సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన ఆ 60 రోజులను చేదు అనుభవాలుగా, జీవితంలో ఎందుకూ పనికిరాని వాటిగా నేను ఫీలవ్వను. ఎందుకంటే, ఆ సినిమా చేస్తున్నప్పుడు నాకెన్నో మంచి సంఘటనలు ఎదురై ఉంటాయి. కొంతమంది మంచి మనుషులతో పరిచయం అయ్యి ఉంటుంది. కాబట్టి, ఓ ఫ్లాప్ సినిమా కూడా నాకు మంచి అనుభవమే. మీరే సినిమా ఒప్పుకోవడానికైనా ఓ కారణం ఉంటుందట.. మరి ఇప్పుడు చేస్తున్న ‘మాలిని 22’కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కారణం ఏంటి? నిత్యామీనన్: ఇది ఓ మలయాళ చిత్రానికి రీమేక్. మలయాళ చిత్రం చూశాను. చాలా నచ్చింది. మంచి సందేశం ఉంది. ప్రస్తుతం సమాజంలో ఆడవాళ్లపై జరుగుతున్న సంఘటనలు చాలామందిని ఆవేదనకు గురి చేస్తున్నాయి. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నాం. ఈ విషయాల గురించే సినిమాలో చర్చించబోతున్నాం అని చిత్రదర్శకురాలు శ్రీప్రియగారు అన్నారు. సినిమా అనేది శక్తిమంతమైన మాధ్యమం కాబట్టి.. దీని ద్వారా ఒక మంచి విషయాన్ని చెప్పే అవకాశం రావడం ఆనందించదగ్గ విషయమే కదా. ఇది కమర్షియల్ ఫార్మాట్లో సాగే ప్రయోజనాత్మక సినిమా కాబట్టి ఒప్పుకున్నాను. ఒకవేళ సినిమాలు కాకుండా వేరే కెరీర్‌ని సెలక్ట్ చేసుకోవాలనుకుంటే ఏం చేస్తారు? నిత్యామీనన్: సినిమాలకు పూర్తి భిన్నంగా ఏదైనా చేయాలని ఉంది. కానీ, భవిష్యత్తు గురించి చెప్పడం కష్టం. ముఖ్యంగా నాలాంటివాళ్లకి. ఎందుకంటే, నా ఆలోచనలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. మరి.. అప్పుడెప్పుడో ఓ స్కూల్ పెట్టాలని ఉందన్నారు. ఆ ఆలోచన అలానే ఉందా.. మారిపోయిందా? నిత్యామీనన్: అది మాత్రం ఎప్పటికీ మారదు. ఎందుకంటే, నాకు పిల్లలంటే చాలా ఇష్టం. నేను నిజాయితీగా మాట్లాడితే, కొంతమంది పెద్దవాళ్లు నన్ను ‘యారోగెంట్’ అంటారు.. అదే పిల్లల దగ్గర అనుకోండి.. మనం మనలా ఉండొచ్చు. ప్రపంచంలో ఎక్కడా నిజాయితీ దొరకదు. కానీ, పిల్లల దగ్గర దొరుకుతుంది. అందుకే పెద్దవాళ్లతో ఉండటంకన్నా పిల్లలతో ఉండటమే నాకిష్టం. ఈ కారణంగానే ఓ స్కూల్ పెట్టాలని ఉంది. సినిమాలు కాకుండా మీకేమేం ఇష్టం? నిత్యామీనన్: నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. ఎప్పట్నుంచో ఓ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలని ఉంది. గిటార్ వచ్చు. వయొలిన్ నేర్చుకోవాలనుకుంటున్నాను. అయితే, ఇప్పుడు కాదు. సినిమాల నుంచి రిటైర్ అయిన తర్వాత. పాటలు కూడా పాడుతుంటారు... నేర్చుకున్నారా? నిత్యామీనన్: సంగీతమైతే నేర్చుకోలేదు. చిన్నప్పట్నుంచీ పాటలు పాడుతున్నాను కాబట్టి సింగింగ్ అలవాటయ్యింది. నేను సింగరవుతానని అందరూ అనుకున్నారు. ఇంకా ఎన్నేళ్లు సినిమాల్లో ఉండాలనుకుంటున్నారు? నిత్యామీనన్: లైఫ్‌లో అనుకున్నవన్నీ జరగవు. ఒకప్పుడు మలయాళంలో పెద్ద పెద్ద సినిమాలకు అవకాశాలొచ్చాయి. కానీ, నేను హీరోయిన్గా చేయాలనుకోవడంలేదని తిరస్కరించాను. అయితే.. ఆ తర్వాత ఏమైంది? సినిమాల్లోకొచ్చానుగా. అందుకే మన చేతుల్లో ఏమీ ఉండదంటున్నాను. ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? నిత్యామీనన్: అది కూడా చెప్పలేను. ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? నిత్యామీనన్: నా జీవితం ఇప్పటికన్నా ఇంకా బెటర్‌గా ఉంటుందనే నమ్మకం కలిగించే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అంతేకానీ పెళ్లి చేసుకోవాలి కాబట్టి చేసుకోను. జీవితాన్ని నరకం చేసే వ్యక్తిని పెళ్లాడి జీవితాంతం బాధపడే బదులు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోవడమే బెటర్ అనేది నా ఫీలింగ్. అంటే.. లవ్ మ్యారేజ్ చేసుకుంటారా..? నిత్యామీనన్: లవ్ మ్యారేజే చేసుకోవాలని ఉంది. ఎవరినో ఒకర్ని సెలక్ట్ చేసేసి, అతన్ని పెళ్లి చేసుకునే తీరాలని మా ఇంట్లో ఒత్తిడి చేయరు. ఇంకా హైట్ ఉండి ఉంటే బాగుండేదని ఎప్పుడైనా అనుకున్నారా? నిత్యామీనన్: నాకేదైనా వంక చెప్పాలంటే ‘హైట్’ గురించి మాట్లాడతారు. అంతకుమించి నన్ను ఏ విషయంలోనూ వంక పెట్టలేరు. సో.. అది ఆనందమే. అయినా హైట్ ఉంటే ఏంటి? లేకపోతే ఏంటి? ‘రుద్రమదేవి’లో నేనో కీలక పాత్ర చేస్తున్నాను. అప్పుడు అనుష్కతో మంచి స్నేహం ఏర్పడింది. అనుష్క నాతో ఏమన్నదంటే ‘మంచి హైట్ ఉంటేనూ విమర్శిస్తారు.. హైట్‌గా లేకపోతేనూ విమర్శిస్తారు. లావుగా ఉంటే లావంటారు.. సన్నగా ఉంటే సన్నం అంటారు. ఎలా ఉన్నా ఏదో ఒకటి అంటారు. పట్టించుకోకూడదు’ అని చెప్పింది. అది కరెక్టే కదా. హైట్ గురించి వదిలేయండి. నాలో ఇంకా చాలా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి కదా. వాటి గురించి ఎవరూ మాట్లాడరు. అయినా ఎత్తు, పొట్టి, అందం.. ఇవన్నీ ఇచ్చేది ఆ దేవుడు. దాని గురించి ఎవరూ మాట్లాడకూడదు. కానీ, ప్రవర్తన అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి, అది సరిగ్గా లేకపోతే విమర్శించాలి. అంతేకానీ, దేవుడు ఇచ్చినవాటిని విమర్శించకూడదు... పశ్చాత్తాపపడకూడదు. ఎవరూ మీకు ‘ఐ లవ్ యు’ చెప్పలేదా? నిత్యామీనన్: నాకు లవ్ లెటర్స్ మాత్రం రాలేదు. ఐ లవ్యూలు చెప్పిందీ తక్కువే. ఎందుకంటే, నేనెప్పుడూ సీరియస్‌గా ఉంటాను కాబట్టి భయపడతారు. మీరెవరితోనూ ప్రేమలో పడలేదా? నిత్యామీనన్: పడ్డాను. కానీ, అతనితో జీవితం గొప్పగా ఉండదనిపించింది. అందుకని విడిపోయాను. అది ఏ వయసులో జరిగింది? నిత్యామీనన్: 18 ఇయర్స్‌లో. అప్పుడు మినహా ఆ తర్వాత ఎప్పుడూ ప్రేమలో పడలేదు. తొలి ప్రేమ ఫెయిల్యూర్ని తట్టుకోవడం అంత ఈజీ కాదంటారు? నిత్యామీనన్: నిజమే. కానీ, ఆ సమయంలోనే నేను ‘అలా మొదలైంది’ ఒప్పుకున్నాను. ఆ సినిమాతో బిజీ అవ్వడంవల్ల ఆ బాధను అధిగమించగలిగాను. పబ్‌కి ఎప్పుడైనా వెళ్లారా? నిత్యామీనన్: నాకంత టైమ్ లేదు. నేను మందు తాగను. ఎప్పుడైనా టైమ్ దొరికితే ఇంట్లోనే ఉంటాను. మంచి పుస్తకాలు చదువుతాను. మళ్లీ జన్మంటూ ఉంటే నిత్యాలానే పుట్టాలనుకుంటారా? నిత్యామీనన్: లేదు. ఈ జన్మకి నిత్యా ఎలా ఉంటుందో తెలుసుకున్నాను కదా. అందుకని, వేరేవాళ్లలా పుట్టాలనుకుంటున్నాను. - డి.జి. భవాని అప్పట్లో ప్రభాస్ ఎవరో తెలియదని చెప్పారు. ఇప్పుడు తెలిసిందా? నిత్యామీనన్: తెలుగు పరిశ్రమకు వచ్చీ రావడంతోనే అందరూ తెలియరు కదా. అప్పట్లో ప్రభాస్ గురించి నా దగ్గర ప్రశ్న అడిగితే.. ‘ఆయనెవరు’ అన్నాను. దాంతో నాకు పొగరు అని కొంతమంది అన్నారు. ప్రభాస్ కూడా ఫీలవ్వలేదనుకుంటా. తెలుగు సినిమాలు బాగా చేయడం మొదలుపెట్టిన తర్వాత ప్రభాస్ ఎవరో తెలిసింది. తను యాక్ట్ చేసిన ‘మిర్చి’ సినిమా చూశాను. అలాగే, ‘గుండె జారి గల్లంతయ్యిందే’ ఫంక్షన్‌కి ఆయన వచ్చారు. అప్పుడు మాట్లాడాను. మీ కుటుంబంలో ఎడ్యుకేషన్‌కి ఇంపార్టెన్స్ ఇస్తారని అన్నారు కదా.. మరి.. మీరు హీరోయిన్ అయినందుకు ఏమంటున్నారు? నిత్యామీనన్: మా అమ్మమ్మ అయితే ‘ఈ సినిమాలు వదిలెయ్. చక్కగా ఏదైనా చిన్న జాబ్ చేసుకో’ అంటుంది. నాకెంత పాపులార్టీ ఉందో తనకు తెలియదు. మా కుటుంబంలో ఎవరూ నా పాపులార్టీని తెలుసుకోవాలని కూడా అనుకోవడంలేదు. అందుకే, ఇంట్లో ఉన్నప్పుడు నేను మామూలు అమ్మాయిలానే ఉంటాను. మీరు బెంగళూరులో ఉంటారా? నిత్యామీనన్: అవును. నేను పుట్టింది, పెరిగింది బెంగళూరులోనే. కేరళతో నాకు పెద్దగా ఎటాచ్మెంట్ లేదు. కానీ, నా మాతృభాష మలయాళమే. మూడు తరాల నుంచి మా కుటుంబానికి చెందినవాళ్లు బెంగళూరులోనే ఉంటున్నారు. మీ ఫేవరెట్ ప్లేస్? నాకు స్పెయిన్ చాలా ఇష్టం. ఇప్పటివరకు వెళ్లింది లేదు. నేను స్పానిష్ లాంగ్వేజ్‌ని ఇష్టపడుతున్నా. అది నేర్చుకుంటున్నాను. జనరల్‌గా నేను ఇతర దేశాల సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకుంటుంటాను. అలా తెలుసుకున్నప్పుడే స్పెయిన్ మీద ఇష్టం ఏర్పడింది. -
నేను రజనీకాంత్కన్నా బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తాననుకుంటాను...
పద్మశ్రీ డా. మోహన్‌బాబుకు చాలా మంచి బిరుదులున్నాయి. కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, నట ప్రపూర్ణ. డా. మోహన్‌బాబులో చాలా మంచి పాత్రలున్నాయి. విలన్, హీరో, ప్రొడ్యూసర్. డా. మోహన్‌బాబు చాలా మంచి పనులు చేశారు. రోడ్లు వేయించారు, బ్రిడ్జి నిర్మించారు, స్కూల్‌కి స్థలం ఇచ్చారు. వీటికి మించి -డా. మోహన్‌బాబు వేరే పేర్లనూ మూటగట్టుకున్నారు. కోపిష్టి! అహంకారి! నోటి దురుసు! ముక్కుసూటిగా ఉన్నందుకేనా ఇన్ని టైటిల్స్? అంటే... భయపడుతూ బతకడంకన్నా ఇలా ఉండడమే తనకిష్టం అంటున్నారు. వివరాలు ఈవారం ‘తారాంతరంగం’లో... 38ఏళ్ల సుదీర్ఘ నటజీవితం మీది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తోంది? మోహన్‌బాబు: 1975 నవంబర్ 22న నా మొదటి సినిమా ‘స్వర్గం-నరకం’ విడుదలైంది. ఓ సాదాసీదా కుటుంబం నుంచి పొట్ట చేత్తో పట్టుకుని సినిమా పరిశ్రమకు వచ్చినవాణ్ణి. మొదట్లో అసిస్టెంట్ డెరైక్టర్, అసోసియేట్ డెరైక్టర్‌గా చేశాను. ఆ తర్వాత ప్రతినాయకుడు, కథానాయకుడు, సహాయ నటుడు.. ఇలా ఇప్పటివరకు 550 చిత్రాలకు పైగా నటించాను. 58 చిత్రాలకు పైగా నిర్మించాను. ఇన్ని సినిమాలు నిర్మించిన నటుణ్ణి నేనే. ‘పద్మశ్రీ’ బిరుదు వచ్చింది. ఎంపీగా చేశాను. నా బిడ్డలు ప్రయోజకులయ్యారు. అడపా దడపా ఎదురయ్యే చేదు అనుభవాల తాలూకు బాధ మినహా నా జీవితం సంతృప్తికరంగా ఉంది. ఓసారి మీ చిన్ననాటి జీవితం గురించి చెబుతారా? మోహన్‌బాబు: తిరుపతికీ కాళహస్తికి మధ్యలో ఉండే ‘మోదుగులపాళెం’ మా ఊరు. మా నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ టీచర్. అమ్మానాన్నలకు మేం మొత్తం ఐదుగురు సంతానం. నలుగురు కొడుకులు, ఓ కూతురు. అప్పట్లో మా గ్రామానికి సరైన రోడ్లు, బస్సులు ఉండేవి కాదు. మోదుగులపాళెం చుట్టుపక్కన ఉన్న రెండు, మూడు గ్రామాలకు నాన్నగార్ని ట్రాన్స్ఫర్ చేస్తుండేవాళ్లు. ఆయన ఎక్కడకు మారితే అక్కడికి మేం మారేవాళ్లం. ఆయనతో పాటే స్కూల్‌కెళ్లడం, ఇంటికి రావడం. సాయంత్రం ఇంటికొచ్చేటప్పుడు, దారిలో లెక్కలు అడిగేవారు. ఒకవేళ కరెక్ట్‌గా చెప్పకపోతే, చేతిలో ఉన్న గొడుగుతో కొట్టేవారు. గొడుగు లేనప్పుడు పక్కనే ఉన్న చెట్టెక్కి, ఒక కానుగ కొమ్మ తీసి... కాళ్ల మీద కొట్టేవారు. అప్పుడు ‘నిక్కర్లు’ వేసుకునేవాణ్ణి. అందుకని దెబ్బ చురుక్మని తగిలేది. ఏర్పేడు, పాపానాయుడుపేట, తిరుపతి.. ఇలా చాలా స్కూల్స్‌లో చదివాను. పాపానాయుడుపేట మా ఊరి నుంచి అడ్డదారిలో వెళితే ఆరు కిలోమీటర్ల పైనే ఉండేది. కాలి నడకనే రాకపోకలు. అందుకే ఆ ఊళ్లో క్రిస్టియన్ మాస్టర్ ఇజ్రాయల్గారిని రిక్వెస్ట్ చేసి, ఆయన ఇంట్లో ఉండే ఏర్పాటు చేశారు మా నాన్నగారు. ఏడాదిపాటు ఆయన ఇంట్లో ఉండి చదువుకున్నాను. నాన్న చాలా స్ట్రిక్ట్. ఉదయం ఐదు గంటలకు పొలం దగ్గరికెళ్లి, పనులు చూసుకుని, ఇంటికొచ్చి స్కూల్‌కి రెడీ అయ్యి వెళ్లేవారు. మీకు ఎన్ని ఎకరాల పొలం ఉండేది? మోహన్‌బాబు: మూడున్నరో నాలుగన్నర ఎకరాలో ఉండేది. మాది దాదాపు దిగువ మధ్య తరగతి కుటుంబం. నేనూ టీచర్ అయితే, ఆ ఉద్యోగం, వ్యవసాయం చూసుకుంటే హాయిగా జీవితం గడిచిపోతుందన్నది నాన్నగారి ఆలోచన. మీరు పొలం పనులు చేసేవారా? మోహన్‌బాబు: నాగలి దున్నాను. మా చిత్తూరు సైడ్ నాగలిని మడక అంటాం. మాకు రెండు, మూడు ఆవులు, నాలుగు ఎద్దులు, రెండు, మూడు పొట్టేళ్లుండేవి. వాటిని మేపేవాణ్ణి. చిన్నప్పుడు ఎలా ఉండేవారు? మోహన్‌బాబు: పొగరుబోతుని, ఆవేశపరుణ్ణి. ధనవంతుల కుటుంబాలకు చెందిన పిల్లలు నాతో ప్రేమగా ఉంటే నేనూ ప్రేమగా ఉండేవాణ్ణి. అంతేకానీ, వాళ్ల డబ్బుకి దాసోహం అనలేదు. మంచి మనిషి అయితే పాదానికి నమస్కారం చేస్తాను. కానీ, అహంకారి అయితే నేను డోంట్ కేర్! చిన్నప్పడు బాగా చదివేవారా? మోహన్‌బాబు: బ్యాడ్ స్టూడెంట్‌ని కాదు. అలాగని వెరీ గుడ్ స్టూడెంట్‌నీ కాదు. అల్లరి చేసేవాణ్ణి కాదు. క్లాసులు ఎగ్గొట్టి, రోడ్ల మీద తిరగాలనే ఉద్దేశం ఉండేది కాదు. నాకు సిగరెట్ తాగడం, అమ్మాయిలకు సైట్ కొట్టడంలాంటి అలవాట్లేవీ ఉండేవి కావు. నటన మీద ఆసక్తి ఎప్పుడు మొదలైంది? మోహన్‌బాబు: నాన్నగారు వీధి నాటకాలు ఆడేవారు. ‘సత్యహరిశ్చంద్ర’లో నక్షత్రకుడి వేషానికి ఆయన పాపులర్. ‘అయ్యోరిని పిలవండి’ అని నాన్నను పిలిచి మరీ, నాటకాలు వేయించేవాళ్లు. ఆ విధంగా నాకు ‘నటన’ మీద చిన్నప్పుడే ఆసక్తి ఏర్పడింది. సినిమాల్లో యాక్ట్ చేయాలని ఎప్పుడు ప్రయత్నించారు? మోహన్‌బాబు: ఎస్ఎస్ఎల్సీ చదువుతున్నప్పుడు ‘సినిమా నటులు కావాలంటే ఫొటోలు, వంద రూపాయలు పంపవలెను’ అనే పేపర్ ప్రకటన చూసి, ఫొటోలు పంపించాను. అయితే డబ్బులు మాత్రం పంపలేదు. అందుకేనేమో సమాధానం రాలేదు. ఆ తర్వాత మళ్లీ అలాంటి యాడ్ వస్తే, మా నాన్నగారి ప్రోత్సాహంతో వంద రూపాయలు, ఫొటోలు పంపించాను. రెండూ పోయాయి. అంతా మోసం అని తర్వాత తెలిసింది. ఫిజికల్ ఎడ్యుకేషన్ వైపు అడుగులు ఎప్పుడు వేశారు? మోహన్‌బాబు: ఎస్ఎస్ఎల్సీ పాసయిన తర్వాత, నాన్నగారితో చెప్పి, మద్రాసు వైఎంసీ కాలేజ్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ట్రైనింగ్‌కి చేరాను. అక్కడ సీటు దొరకాలంటే చాలా కష్టం. పైగా, నాకు స్పోర్ట్స్‌లో పెద్దగా నాలెడ్జ్ లేదు. ఓ ముస్లిమ్ సోదరుడు, ఓ క్రిస్టియన్ మాస్టార్ యాషీర్ సిఫార్సు మీద సీటు వచ్చింది. నాన్నగారు డబ్బులు పంపడానికి చాలా ఇబ్బందులు పడేవారు. అసలు నేను మద్రాసు వెళ్లడానికి కారణం సినిమాల్లో నటించాలని. కాలేజ్‌లో ట్రైనింగ్ తీసుకుంటూ, సాయంత్రం టీనగర్‌లోని పానగల్ పార్క్‌కి వెళ్లి, అక్కడకొచ్చే సినిమా తారలను చూసేవాణ్ణి. సినిమా హీరోల్లో మీకెవరంటే ఇష్టం ఉండేది? మోహన్‌బాబు: నాకు మొదట్నుంచీ ఎన్టీ రామారావుగారంటే ప్రాణం. ఆ తర్వాత నాగేశ్వరరావుగారు. మద్రాసు వెళ్లిన తర్వాత రామారావుగార్ని ఎలాగైనా చూడాలనుకున్నాను. బజుల్లా రోడ్‌లోని ఇంట్లో రామారావుగారు ప్రతిరోజూ ఉదయం దర్శనమిస్తారని ఎవరో చెప్పగా విని, ఓ ఆదివారం పొద్దున్నే ఐదు గంటలకల్లా గేటు ముందు నిలబడ్డాను. ఆ తర్వాత టూరిస్ట్ బస్సులన్నీ వచ్చాయి. రామారావుగారు బయటికొచ్చి, అందర్నీ చూసి నమస్కారం చేశారు. అది నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. కాలేజీలో శిక్షణ పూర్తయ్యాక ఏం చేశారు? మోహన్‌బాబు: ఉద్యోగాల వేటలో పడ్డాను. మద్రాసులోని ఓ స్కూల్లో టీచర్ జాబ్‌కి వెళితే, ఒక కౌన్సిలర్ ఐదు వందలు లంచం అడిగాడు. నాన్నగారిని అడిగితే కష్టం అన్నారు. అయితే నా బాధ భరించలేక రూపాయిన్నర వడ్డీకి అప్పు చేసి, ఇచ్చారు. దురదృష్టం ఏంటంటే, ఆ డబ్బు తీసుకుని, ఆ కౌన్సిలర్ మోసం చేశాడు. ఆ మోసంతో బ్యాక్ టు మోదుగులపాళెం వెళ్లిపోయారా? మోహన్‌బాబు: లేదు. బీఆర్ రెడ్డిగారి రికమండేషన్‌తో యార్లగడ్డ వెంకన్న చౌదరి ద్వారా కేసరి హైస్కూల్లో ఉద్యోగం వచ్చింది. నెలకు 197 రూపాయలు జీతం. ఏడాది పాటు బాగానే సాగింది. అయితే నాకు ఉద్యోగం ఇప్పించిన చౌదరిగారు తప్పుకోవడంతో, కమిటీవాళ్లు నన్ను పిలిపించి, ‘నువ్వు మా కులంవాడివి కాదు’ అంటూ నన్ను తీసేశారు. ఆ సమయంలోనే సినీనటులు ప్రభాకర్‌రెడ్డిగారు, గిరిబాబు, త్యాగరాజుతో పరిచయం ఏర్పడింది. త్యాగరాజు ఇంట్లో ఆరు నెలలు ఉన్నాను. ఆయన బాగా ఆదరించారు. ఆ తర్వాత... మోహన్‌బాబు: ప్రభాకర్‌రెడ్డిగారి రికమండేషన్‌తో లక్ష్మీదీపక్గారు ‘కూతురు కోడలు’ సినిమాకి అప్రెంటిస్‌గా అవకాశం ఇచ్చారు. ఆ సినిమాకి దాసరి నారాయణరావుగారు కో-డెరైక్టర్. శోభన్‌బాబుగారు హీరో. ఆరు నెలలకు 50 రూపాయలు జీతం. ‘ఏవయ్యా.. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్లు.. మధ్యలో కాఫీ, టీలు. మీ ఇళ్లల్లో ఇలాంటివి అనుభవించారా? ఇదే గొప్ప. మళ్లీ డబ్బులా... ఎక్కడ దొరుకుతారయ్యా?’ అని చిత్రనిర్మాతల్లో ఒకరు అనేవారు. అవమానంగా ఉండేది. అప్పుడు నేనో రేకుల షెడ్లో ఉండేవాణ్ణి. నెల అద్దె 35 రూపాయలు. రెండు సత్తు పాత్రలు, ఓ చాప, దిండు.. ఇవే నా ఆస్తి. అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేసుకుంటూనే, వేషాల కోసం ట్రై చేసేవాణ్ణి. మొదట్నుంచీ నా యాంబిషన్ ‘నంబర్‌వన్ ప్రతినాయకుడు’ అవ్వాలన్నదే! మరి... అసిస్టెంట్ డెరైక్టర్‌గా ఎందుకు చేశారు? మోహన్‌బాబు: భోజనం గడుస్తుందనీ పదిమందితో పరిచయాలు అవుతాయని! మొదటి సినిమాకి ఆరు నెలలకు 50 రూపాయలిచ్చారు. రెండో సినిమాకి నెలకు 150, మూడో సినిమాకి 200, నాలుగో సినిమాకి 300 ఇచ్చారు. షూటింగ్ లేని రోజుల్లోనూ సినిమా ఆఫీసుకి ఉదయాన్నే వెళ్లిపోయేవాణ్ణి. టిఫిన్, భోజనం పెడతారని. అప్పుడే శివాజీరావ్ (రజనీకాంత్)తో పరిచయం ఏర్పడింది. బస్ కండక్టర్‌గా మానేసి, సినిమాల్లో ట్రై చేయడానికి వచ్చాడు. రజనీకాంత్, మీరు ప్రాణస్నేహితులవ్వడానికి ప్రత్యేకమైన కారణాలేమైనా ఉన్నాయా? మోహన్‌బాబు: కొన్ని కొన్ని విషయాలకు కారణాలు ఉండవు. నేను, వాడు ఫ్లాట్‌ఫామ్ నుంచే స్నేహితులం. కాలక్రమేణా విడదీయలేనంత స్నేహితులయ్యాం. నా చెల్లెలు లత (రజనీకాంత్ భార్య) ప్రతి సంవత్సరం నాకు రాఖీ కడుతుంది. నేను తనకు బట్టలు పెడుతుంటాను. అది మా ఆచారం. మీరు సినిమాల్లో ట్రై చేస్తున్నారని తెలుసుకుని, మీ ఊళ్లోవాళ్లు మీ గురించి ఏమనుకునేవారు? మోహన్‌బాబు: నేను అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేస్తున్నప్పుడు మా నాన్నగారు నన్ను పెళ్లి చేసుకోమన్నారు. కానీ, స్వయానా మా మేనమామ, ఇతర బంధువులు నాకు పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు. ఊళ్లోవాళ్లూ అంతే. ‘వీడు సినిమా పిచ్చోడు.. ఎలా పిల్లనిస్తాం’ అనేవాళ్లు. ‘లేదండి.. మావాడు గొప్ప యాక్టర్ అవుతాడు’ అని నాన్నగారు ఎంత చెప్పినా, వినిపించుకోలేదు. వ్యవసాయం చేస్తున్న నా తమ్ముడికి పిల్లనిస్తామన్నారు. దాంతో నాకన్నా ముందు నా తమ్ముడికే పెళ్లయ్యింది. తిరుపతిలో పెళ్లి. నేనొక రాయి మీద కూర్చుని ఉంటే, నాన్నగారు ‘పెద్దోడు ఉండగా చిన్నోడికి పెళ్లి చేస్తే, పెద్దోడిలో ఏదో లోపం ఉందనుకుంటార్రా’ అంటూ భోరున ఏడ్చారు. అప్పుడు నేను ‘దిగులు పడొద్దు. నేను డెఫినెట్‌గా నంబర్‌వన్ ప్రతినాయకుడు అవుతాను’ అని చాలా పాజిటివ్‌గా చెప్పాను. మీరెవర్నీ ప్రేమించలేదా? మోహన్‌బాబు: టు బీ ఫ్రాంక్... నన్నెవరూ లవ్ చేయలేదు. నేనూ ఎవర్నీ ప్రేమించలేదు. పెళ్లయిన తర్వాత మా ఆవిణ్ణి ప్రేమించడం మొదలుపెట్టాను. ప్రేమిస్తూనే ఉంటాను. ఇంతకీ మీ పెళ్లి ఎలా కుదిరింది? మోహన్‌బాబు: ఓ రోజు నేను ఊళ్లో నడుచుకుంటూ వెళుతుంటే, మా బంధువు ఒకాయన నన్ను చూసి, ఓ సంబంధం కుదిర్చారు. అయితే, ఆ అమ్మాయి ఎమ్మే లిటరేచర్ చదివింది. అందుకని, పెళ్లికూతురి తండ్రి దగ్గర ‘బిఎస్సీ ఫస్ట్ క్లాస్’లో పాసయ్యానని అబద్ధం చెప్పమన్నారు ఆ బంధువు. ఆ అమ్మాయికి నిజం చెప్పి, కాబోయే మామగారికి మాత్రం అబద్ధం చెప్పాను. ఎట్టకేలకు పెళ్లయ్యింది. పెళ్లయిన పదమూడు రోజులకు ‘స్వర్గం నరకం’ సినిమా కోసం దాసరిగారి దగ్గర్నుంచి నాకు పిలుపొచ్చింది. అంతకుముందు ఓ యాభైసార్లు వేషం కోసం ఆయన ఇంటికి వెళ్లుంటాను. అందుకే దాసరిగారి నుంచి పిలుపు రాగానే, వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ‘మీరు తప్పకుండా సెలక్ట్ అవుతారు’ అని నా భార్య చెప్పింది. అదే నిజమైంది. మిగతావాళ్లకి రికమండేషన్స్ ఉన్నాయి. పైగా, నామీద కోపంతో నా టెస్ట్ షూట్‌ని ఓ అసిస్టెంట్ డెరైక్టర్ దాచేశాడు. ‘భక్త టెస్ట్ షూట్ చూశావా?’ అని పద్మగారికి దాసరిగారు ఫోన్ చేసి అడిగితే, దాచిపెట్టిన నా షూట్ బయటికొచ్చింది. అది చూసి, పద్మగారు నన్ను సెలక్ట్ చేశారు. అప్పుడు భక్తవత్సలం నాయుడు అనే నా పేరుని దాసరిగారు ‘మోహన్‌బాబు’గా మార్చారు. సెలక్ట్ అయిన విషయం వెంటనే మీ భార్యకు చెప్పారా? మోహన్‌బాబు: టెస్ట్ షూట్ విజయవాడలో జరిగింది... మేమేమో మద్రాసులో ఉండేవాళ్లం. అప్పట్లో సెల్‌ఫోన్స్ లేవు. నాకు ల్యాండ్ లైన్ ఫోన్ కూడా లేదు. మేం ఓ మేడ పైన చిన్న గదిలో ఉండేవాళ్లం. కింద ఓ మేకప్‌మన్ ఉండేవారు. ఆయన ఇంటికి ఫోన్ చేసి... రిక్వెస్ట్ చేసి, నా భార్యను పిల్వమన్నాను. తను ఫోన్ తీయగానే, ‘సెలక్ట్ అయిన విషయం చెప్పడానికే కదా. సంతోషం. కనకదుర్గమ్మ గుడికి వెళ్లండి’ అని చెప్పింది. ఇక, ఈ వార్తను మా అమ్మానాన్నలకు చేరవేయాలి. మా ఊళ్లో ఫోన్ లేదు. దాంతో, తిరుపతిలో నాకు తెలిసినవాళ్లకి సమాచరం చేరవేసి, వీలు చూసుకుని మా ఇంటికెళ్లి, విషయం చెప్పండన్నాను. ఎందుకంటే, అప్పట్లో మా ఊళ్లో రవాణా సౌకర్యం లేదు.. ఫోన్లు లేవు. మరి.. మీరు డబ్బులు సంపాదించిన తర్వాత మీ ఊరికోసం ఏం చేశారు? మోహన్‌బాబు: నేను రాజ్యసభ సభ్యుణ్ణయ్యాక, నా నిధుల్లోంచి కొంత మా ఊరి అభివృద్ధికి కేటాయించాను. రోడ్లు వేయించాను... బ్రిడ్జ్ కట్టించాను. కానీ, కొంతమంది స్వార్థపరులు నదిలో ఇసుక తవ్వేస్తుండడంతో బ్రిడ్జ్ పరిస్థితి హీనంగా తయారైంది. దాని గురించి ఎంతమందికి ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ప్రయోజనం కనపడలేదు. ఇసుక తవ్వడం ఆపలేదు. అలాగే, ఊళ్లో స్కూలు కోసం స్థలం కొని ఇచ్చాను. ఆ స్కూలు వరండాలో శెనక్కాయలూ వడ్లూ ఆరబోసుకుంటున్నారు. నేనేమో మోడల్ విలేజ్‌లా తీర్చిదిద్దాలనుకున్నా. ప్రజలకే లేనప్పుడు నేను మాత్రం ఏం చేసేది? అందుకే విరక్తి వచ్చేసింది. అప్పట్నుంచీ ఊరి గురించి ఆలోచించడం మానేశాను. అది సరే.. చాలామంది స్టూడియోలు కట్టుకుంటే, మీరెందుకు స్కూల్ కట్టారు? మోహన్‌బాబు: ఓ దశలో హోటల్ పెట్టాలనుకున్నాను. కానీ, వన్ ఫైన్ మార్నింగ్ స్కూల్ పెడితే బాగుంటుందనిపించింది. నటుడిగా రిటైర్ అయిన తర్వాత అక్కడ గడపొచ్చని. ఓ స్కూల్లో వారి కులం కాదని నన్ను తీసేశారు కదా. కాబట్టి స్కూల్ పెడితే, ప్రాస్పెక్టస్‌లో కులం అనేది తీసేయాలనుకున్నాను. అలాగే కుల, మతాలకు అతీతంగా 25 శాతం ఉచిత విద్య అందించాలనుకున్నాను. నా రెండో తమ్ముడు కృష్ణ ‘వద్దన్నయ్యా.. మనం నడపలేం’ అన్నాడు. ‘పెట్టి చూపిస్తారా’ అన్నాను. సరే.. స్కూల్ పెట్టాం. కుల, మతాలకు అతీతంగా 25 శాతం ఉచిత విద్య అందించాలనుకుని, కులాలకు అతీతంగా బాగా మార్కులు వచ్చినవాళ్లని ఎన్నుకుంటాం. మా విద్యానికేతన్‌లో ఒక్క డాక్టర్ కోర్స్ తప్ప లేని కోర్స్ అంటూ లేదు. ఇక, నా రిటైర్మెంట్ విషయానికొస్తే.. ప్రజలు వీడు అసహ్యంగా ఉన్నాడు.. వీడిని ఇక చూడలేం అనుకునే ముందే రిటైర్ అయితే గౌరవంగా ఉంటుందనుకున్నాను. కానీ, ఇప్పటివరకు నాకా అవకాశం రాలేదు. ఇంతకీ మీరు రాజకీయాలకు ఎందుకు దూరమయ్యారు? మోహన్‌బాబు: ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవాళ్లకి రాజకీయం పనికి రాదు. రాజకీయాల్లో ముక్కుసూటితనంగా ఉంటే కుదరదన్నా రు.. మరి సినిమా పరిశ్రమ పరిస్థితి కూడా అంతే కదా? మోహన్‌బాబు: కరెక్టే, కానీ, ఈ ఇండస్ట్రీలో 38 ఏళ్లలో నా గురించి అందరికీ అర్థం అయ్యింది. ‘మోహన్‌బాబు సూటిగా మాట్లాడతాడు. ఉన్నది ఉన్నట్లుగా చెబుతాడు. తనతో జాగ్రత్తగా ఉండాలి.. పద్ధతిగా ఉండాలి’ అనుకుంటారు తప్ప నా గురించి మరో రకంగా అనుకోరు. ఏదైనా చిన్న చిన్న వివాదాలు వచ్చినా, అవి ముంబయ్ నుంచి వచ్చిన థర్డ్ గ్రేడ్ హీరోయిన్ల వల్లే. ‘షూటింగ్‌కి టైమ్ ప్రకారం రండి’ అంటే తప్పా? మనకు అన్నం పెడుతున్న వృత్తిపట్ల క్రమశిక్షణగా ఉండమనడం అన్యాయమా? అదే కనుక అన్యాయం అంటే.. డోంట్ కేర్! మీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడ్డంవల్లే కొంతమంది ‘మోహన్‌బాబుకి నోటి దురుసు’ అంటారు..? మోహన్‌బాబు: శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు మీరు అన్వేషిస్తే ‘మోహన్‌బాబు ముక్కుసూటి మనిషి. కరెక్ట్ మనిషి’ అని చాలామంది నోట వింటారు. మీరు ‘నోటి దురుసు’ అన్నారు. అది తప్పు మాట. ఎవరి మీద పడితే వాళ్ల మీద ఇష్టం వచ్చినట్లు అసందర్భంగా నోరు పారేసుకుంటే అది నోటి దురుసు కింద లెక్క. నేను తప్పుచేసినవాళ్ల గురించే మాట్లాడతాను. చెయ్యనివాళ్లని గౌరవిస్తాను. ఊరికే ఎవడో ఒకడు ‘మోహన్‌బాబుకి నోటి దురుసు’ అంటాడు. అలా అన్నవాడికే దురుసు ఎక్కువ. గురువింద గింజకు తన నలుపు తెలియదన్నట్లు ఎవడి తప్పు వాడికి తెలియదు. ఇక్కడ ఎవరూ సత్యహరిశ్చంద్రులు, ధర్మాత్ములు కాదు, శ్రీరామచంద్రులు కాదు. నాకు హద్దు తెలుసు. అది దాటను. కానీ, మీ దగ్గరకు రావడానికి చాలామంది భయపడతారు! మోహన్‌బాబు: కొంతమంది అలా క్రియేట్ చేశారు. రామారావుగారిని చూస్తే భయపడతారు. కానీ, దగ్గరకెళ్లిన తర్వాతే తెలుస్తుంది ఆయన ఎంత గొప్ప మనిషో. నన్ను నేను ఆ మహానటుడితో పోల్చుకోవడంలేదు. కానీ, ఆయన లక్షణాలు నాలో కొన్ని ఉన్నందుకు నాకెప్పటికీ గర్వంగా ఉంటుంది. ఓ సందర్భంలో ఆయన ‘మేం ఏకగర్భంలో పుట్టకపోయినా అన్నదమ్ములమే. వారి ఆవేశమే మమ్మల్ని వారికి దగ్గర చేసింది’ అన్నారు. అలాగే, మా బావగారు వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డిగారు ‘మోహన్‌బాబుగారు స్నేహానికి ప్రాణం ఇస్తాడు. మాటకు కట్టుబడి ఉంటాడు. ఆయన్ని డీల్ చేయడం కష్టం. కానీ, డీల్ చేసిన తర్వాత, దగ్గరకెళితే అటువంటి మంచి మనిషి ఉండరు’ అన్నారు. మీకు కోపం ముక్కు మీద ఉంటుందనేవారికి మీ సమాధానం ఏంటి? మోహన్‌బాబు: అది వాస్తవమే. అన్యాయాన్ని సహించలేక వచ్చే కోపం అది. నా కళ్లముందు చెడు జరిగితే భరించలేను. మితిమీరిన కోపం ఆరోగ్యానికి చేటు అంటారు కదా? మోహన్‌బాబు: నా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే, కోపం వల్ల నాకు తక్కువమంది స్నేహితులు ఉన్నారు. నేనెవర్నీ మోసం చేయను. ఎవరైనా మోసం చేస్తే భరించలేను.నిర్మాతగా నన్ను చాలామంది ‘గోల్డెన్ పే మాస్టర్’ అంటారు. మీకు పారితోషికాలు ఎగ్గొట్టినవాళ్లు ఉన్నారా? మోహన్‌బాబు: వందల మంది ఉన్నారు. వాళ్లిచ్చిన చెక్‌లు నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావు. అలాగే, కొన్ని సినిమాలు నేను పారితోషికం తీసుకోకుండా చేశాను. ఉదాహరణకు, ఇటీవల చేసిన ‘ఆదిశంకర’. ఎవరైనా ‘నేను ఇవ్వలేను’ అంటే, ఉచితంగా చేసిన రోజులున్నాయి. కానీ, ఇస్తానన్న పారితోషికం ఇవ్వకపోతే మాత్రం కోపం వస్తుంది. సినిమా రంగం నుంచి ఎప్పుడైనా వెళ్లిపోదామను కున్నారా? మోహన్‌బాబు: అలా ఎప్పుడూ అనుకోలేదు. ‘పుణ్యభూమి నా దేశం’ అద్భుతమైన సినిమా. ఓ హిందీ సినిమాకి ఆధారం అది. హిందీలో బ్రహ్మాండంగా ఆడింది. కానీ, తెలుగులో ఆడలేదు. అలాగే ‘పోస్ట్‌మేన్’ కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ‘రాయలసీమ రామన్న చౌదరి’ సినిమాపై కూడా భారీ అంచనాలుండేవి. కానీ, అది ఎబౌ యావరేజ్ అయ్యింది. నిజానికి అది రజనీకాంత్ కథ. ‘కొన్ని మార్పులు చేస్తారా’ అంటే తను ఒప్పుకోలేదు. ఆ మార్పులు చేసి ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. ఆ సినిమాని నేను తెలుగులో చేసిన తర్వాత, ఇతర భాషల్లో చేయాలన్నది రజనీ అభిప్రాయం. ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ‘ఏం చేశావురా.. నేను నీ అంత అద్భుతంగా యాక్ట్ చేయలేను. నా వల్ల కాదురా’ అన్నాడు. గ్రేట్ కాంప్లిమెంట్? మోహన్‌బాబు: స్నేహం అనేది పదానికి అర్థం తెలిసిన వ్యక్తి రజనీకాంత్. నా ‘రాయలసీమ రామన్న చౌదరి’ చూసి, ‘బ్రహ్మాండం’ అని అంటే, అది గొప్ప కాంప్లిమెంట్ అనుకోను. నేను బాగా యాక్ట్ చేశాను కాబట్టి అన్నాడు. నాకంటే వాడు గొప్ప నటుడంటే ఒప్పుకోను. ఏ పాత్రనైనా అవలీలగా చేయగల మంచి నటుడు వాడు. కానీ, వాడికన్నా బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తానని నేననుకుంటాను. మా ఇద్దరిలో ఎవరు గొప్ప నటుడు? అని డిసైడ్ చేయాలంటే మధ్యలో ఓ జడ్జిని పెట్టాలి. మరి... మిమ్మల్ని అభినందించే అవకాశం ఎవరికిస్తారు? మోహన్‌బాబు: ప్రజలకు ఇస్తాను. ఒకప్పుడు సమైక్యాంధ్ర అన్నారు. ఇప్పుడేమంటారు? మోహన్‌బాబు: కలిసుందాం అంటే తప్పయ్యింది. ఆ మాట అన్నదానికి నా స్కూల్ బద్దలు కొట్టారు. ఇంటి మీదకొచ్చారు. నా సినిమాని నిషేధించారు. నేను ఏ రాజకీయ పార్టీకి చెందినవాణ్ణి కాదు. కానీ, నన్ను దోషిని చేశారు. నేను పది పైసలు సంపాదించడానికి కష్టపడ్డాను. నీతిగా, న్యాయంగా సంపాదించాను. ఎవరి పోరాటం వారిది అని ఫిక్స్ అయ్యాను. అన్ని ప్రాంతాలవాళ్లని ప్రేమిస్తాను.. గౌరవిస్తాను. నాకే పోరాటం వద్దు. నాకు నా కుటుంబం, నా సినిమాలు ముఖ్యం. వాస్తవానికి మా మీద దాడి జరిగినప్పుడు ఇటు ఆంధ్రా అటు తెలంగాణ ప్రాంతాలకు చెందిన కొంతమంది ‘అయ్యో.. మీకిలా జరగడమేంటి?’ అని బాధపడ్డారు. కానీ, సినిమా పరిశ్రమలో చాలామంది ‘వీడేమైనా పోటుగాడా’ అంటూ ఎద్దేవాగా మాట్లాడారు. రేపు తెలంగాణ వస్తుందా? ఆంధ్రాగా మిగిలిపోతుందా? అనేది ఆ దేవుడికే తెలియాలి. అసలు మీ ఎమోషన్స్‌ని ఎవరితో పంచుకుంటారు? మోహన్‌బాబు: నేనీ మధ్య అసమర్ధుడిగా బతుకుతున్నాను. అలా ఎందుకంటున్నానంటే.. ఏదీ మాట్లాడకూదని, ఆల్మోస్ట్ నోరు కట్టేసుకున్నాను. బస్టాపుల్లో, సినిమా థియేటర్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చిన్న చిన్న పిల్లలు అడుక్కుంటుంటారు. అక్కడే పోలీసులు నిలబడి ఉన్నా, పట్టించుకోరు. అదే రోడ్డు మీద చీఫ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్.. ఇలా ఎంతోమంది మంత్రులు వెళుతుంటారు. కారు అద్దాల్లోంచి రోడ్లపై దృష్టి పెడితే, ఆ పసిపిల్లలు కనిపిస్తారు. ఈ ఆర్థికంగా వెనకబడినవారి కోసం పభుత్వం కల్పించే అవకాశాలను వారు ఉపయోగించుకోవాలి. పోనీ.. ప్రభుత్వ సంస్థల్లో ఉండే పిల్లలకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయా? ఎప్పుడైనా ఇన్స్పెక్షన్ చేస్తే, ‘అన్నీ బాగున్నాయి’ అని ఆ పిల్లలతో చెప్పిస్తారు. ఇవన్నీ తల్చుకుంటే చాలా ఆవేదనగా ఉంటుంది. కానీ, ఏం చేయలేక అసమర్థుడిగా ఉండిపోతున్నాను. కాకపోతే, నా వంతుగా విద్యానికేతన్‌లో 25 శాతం ఉచితం అందిస్తున్నా. ఇంకా చేతనైన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నా. ఎవరో వస్తారని, ఎదురు చూసి మోసపోకుమా? అని శ్రీశ్రీ అన్నారు. నాకు తెలిసినంత వరకు దానర్థం ఏంటంటే.. ‘అన్యాయం జరుగుతున్నప్పుడు నీకు నువ్వే తిరగబడు’ అని. అలా ఇంటికొకరు తిరగబడినా సమాజం బాగుపడుతుంది. ఫైనల్‌గా మీరేం చెబుతారు? మోహన్‌బాబు: ఇతరుల వస్తువులను మట్టిపెళ్లల్లానే భావించాలని, గౌరవంగా, నీతిగా బతకాలని మా నాన్నగారు చెప్పారు. నాది ఆయన బాటే. ముక్కుసూటిగానే వెళతాను. తప్పుని ఖండిస్తాను. కానీ, ఇప్పుడిప్పుడు పిల్లలు ‘మనకెందుకు నాన్నా’ అంటుంటే, కొంచెం మారుతున్నాను. నిజం చెప్పడంవల్ల ఎవరి మనసైనా బాధ పడుతుందనిపిస్తే, ఆ నిజం చెప్పకుండా ఉండటమే బెటర్ అని ఇప్పుడిప్పుడు అనుకుంటున్నాను. నేను ఒకరి జోలికి వెళ్లను. నా బతుకు నేను బతుకుతూ నాకు చేతనైనంత సహాయం చేస్తాను. కానీ నా జోలికి ఎవరైనా వస్తే.. నన్ను నేను కాపాడుకోవడానికి ఏం చేయడానికైనా వెనకాడను. - డి.జి.భవాని చిరంజీవి, మీరు ఒకప్పుడు క్లోజ్‌గా ఉండేవారట. ఆ తర్వాత మీ మధ్య మనస్పర్థలు ఏర్పడటం.. మళ్లీ స్నేహంగా ఉండటం..వీటి వెనకాల కారణాలేంటి? మోహన్‌బాబు: చిరంజీవి, నేను మంచి కొలీగ్స్. కలిసి, మెలిసి ఉండేవాళ్లం. వజ్రోత్సవాల సమయంలో సినిమా పరిశ్రమలోని కొంతమంది థర్డ్ గ్రేడ్ ఫెలోస్ చిరంజీవిని కాకా పట్టడానికి ఏవేవో చెప్పారు. ఆ మాటలకు తను బాధపడ్డాడు. నేనూ బాధపడ్డాను. అంతేకానీ చిరంజీవి నాకెలాంటి చెడూ తలపెట్టలేదు. నేనూ చిరంజీవికి చెడు చేయాలనుకోలేదు. కానీ, అతని పక్కనే ఉన్నవాళ్లు నాకు చెడు తలపెట్టారు... చెడు చేశారు. ఇప్పుడు అందుకు తగిన ప్రతిఫలం అనుభవిస్తున్నారు. ఏదేమైనా... నేను, చిరంజీవి ఒకటయ్యాం. ఆ రోజు మా మధ్య పొరపొచ్ఛాలు రావడానికి కారణమైనవాళ్లు ఈ రోజున ఆత్మహత్య చేసుకోవాలి. ఎవరైతే అమాయకులైన అభిమానులను రెచ్చగొట్టి, రాళ్లు వేయించారో వాళ్లు సిగ్గుపడాలి. వాళ్లకే అంతా రివర్స్ కొట్టింది. నాకు అపఖ్యాతి తేవాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే.. వాళ్లకే అది వస్తుంది. మీ ముక్కుసూటితనం మీకు మైనస్ కాలేదా? మోహన్‌బాబు: చాలా అయ్యింది. కొంతమంది స్నేహితులు దూరమయ్యారు. ఇంకా వ్యక్తిగతంగా కొన్ని నష్టాలు జరిగాయి. కానీ, ఏ మైనస్ అయినా నాకే జరిగింది. నా ప్రవర్తన ఎవరికీ నష్టం కలిగించలేదు. ధైర్యవంతుడు ఒక్కసారే చస్తాడు. భయపడేవాడు క్షణానికోసారి చస్తాడు. అలా భయపడుతూ బతకడం ఎందుకు? అందుకే నాకు నచ్చినట్టుగా ముక్కుసూటిగా ఉంటాను. -
నా ప్రేమకథే ఓ సినిమా!
సుకుమార్‌ని తిట్టుకోడానికి... ఆయన సినిమాలను ఇష్టపడే ప్రతి ప్రేక్షకుడికీ హక్కుంది! ‘కోపంగానో, ద్వేషంగానో ఫీల్ మై లవ్’ అనిపించారు కదా ఆర్య హీరోతో... అలాంటి హక్కన్నమాట ఇది! ఆర్య తర్వాత మూడేళ్లకు జగడం. జగడం తర్వాత రెండేళ్లకు ఆర్య2 ఆర్య2 తర్వాత మూడేళ్లకు 100% లవ్. 100% తర్వాత రెండేళ్లకు... ఇప్పుడు రాబోతున్న 1. ఏంటబ్బా ఇంత బద్దకం ఈ మనిషికి?! ఫట్‌ఫట్‌మని నాలుగు సిక్సర్లు, ధనాధన్మని ఆరు బౌండరీలు బాది పడేయలేడా?! సచిన్ నెమ్మదిగా డిఫెన్స్ ఆడుతుండడం... సుకుమార్ తీరిగ్గా సినిమా తీస్తూ ఉండడం... రెండూ ఒకటే ఫ్యాన్స్‌కి. ఉడుకురక్తం ఎన్నాళ్లని ఓపిక పడుతుంది? లవ్స్టోరీల స్టార్ డెరైక్టర్ సుకుమార్ ఎందుకంత పట్టిపట్టి సినిమా తీస్తారు? ప్రేమని ఎందుకంత తేలిగ్గా తీసి పడేయరు? ఆయన లవ్ స్టోరీ ఏమిటి? ఆయన లైఫ్ స్టైల్ ఏమిటి? చదవండి ఈవారం ‘తారాంతరంగం’లో. మీ ‘1’ సినిమాను ఎప్పుడు చూపిస్తున్నారు సార్? సుకుమార్: జనవరి 10న ఎలా ఉంటుంది అందులో మహేష్ కేరక్టరైజేషన్? సుకుమార్: తినబోతూ రుచి ఎందుకు? చూస్తారుగా. ఎందుకని మీ సినిమాల్లోని హీరో పాత్రలకు ఏదో ఒక చెడు లక్షణం ఉంటుంది? సుకుమార్: హీరో అనేవాడు రాముడిలా ఉండాలనుకోవడం సరికాదు. మనలో ఒకడిగా ఉండాలి. ప్రతిమనిషికీ ఉండే సాధారణమైన లక్షణాలే నా హీరోలకూ ఉంటాయి. వాటిని చెడు లక్షణాలు అనడం కంటే సాధారణ లక్షణాలు అనడం కరెక్ట్. ఒకప్పుడు హీరోహీరోయిన్లు చందమామను చూసి పాటలు పాడుకునేవారు. కనీసం ఒకరినొకరు ముట్టుకునేవారు కూడా కాదు. తర్వాత కాలంలో చేతులు కలుపుకొని పాడుకోవడం మొదలైంది. ఈ డెవలప్మెంట్ కౌగిలింతల దాకా వచ్చింది. ఎప్పటికప్పుడు ఈ పరిణామాన్ని కుటుంబప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. తొలి రోజుల్లో ‘మంచి సినిమా అంటే... ఇలా ఉండాలి’ అని ఓ గీత గీసుకున్న ప్రేక్షకుడు... కాలక్రమంలో తన గీతని తానే చెరుపుకుంటూ పోయాడు. ప్రస్తుతం ఐటమ్ సాంగ్‌ని కూడా ఫ్యామిలీ మొత్తం కలిసే చూస్తున్నారు. అప్పుడు చెడు అనిపించినవి, ఇప్పుడు మంచి అయ్యాయి. ఇప్పుడు చెడు అనిపించేవి, రాబోయే తరానికి మంచి అవుతాయి. ఇది కామన్. పాత్రలు కూడా అంతే. మీ కథలు.. అందులోని పాత్రలూ... స్వానుభవాలా? లేక ఊహలనుంచి పుట్టినవా? సుకుమార్: ఒక సంఘటన, ఒక పుస్తకం, ఒక సినిమా ఇలా ఏదైనా ఇన్స్పైర్ చేయొచ్చు. అందుకే పర్టిక్యులర్‌గా ఫలానా అని చెప్పలేను. తెరపై మీ హీరోలు చిత్రంగా ప్రవర్తిస్తుంటారు కదా. కాలేజ్ టైమ్‌లో మీరెలా బిహేవ్ చేసేవారు? సుకుమార్: అందరికీ ఉన్నట్టే నాకూ కోరికలుండేవి. అమ్మాయిలతో మాట్లాడాలని, ఫలానా అమ్మాయిని చూడాలని, ముద్దుపెట్టుకోవాలని... ఇలా అన్నమాట. ఆ వయసులో ఎవరికైనా ఉండే కోరికలే అవి. కానీ వాటిని మనసుని దాటనిచ్చేవాణ్ణి కాదు. నాలోనే ఉంచుకునేవాణ్ణి. నేను చాలా సిగ్గరిని. చాలా కామ్‌గా ఉండేవాణ్ణి. నేనేదో నా పనేదో. ఇతర విషయాల జోలికి అస్సలు వెళ్లేవాణ్ణి కాదు. అంటే కాలేజ్ ఏజ్‌లో ప్రేమకథలు ఏం లేవా? సుకుమార్: ఆ గోల ఇప్పుడెందుకండీ.. అనవసరంగా ఇంట్లో సమస్యలొస్తాయి. (నవ్వుతూ) సరే మీదీ ప్రేమ వివాహమే కదా. మీ ప్రేమకథైనా చెప్పండి? సుకుమార్: నేను డెరైక్టర్ అయ్యాకే నా ప్రేమకథ మొదలైంది. పైగా అది అయిదారేళ్ల కథ. దాన్ని ఓ పది పదిహేను నిమిషాల్లో చెప్పడం కష్టం. ఒకవేళ చెప్పగలిగినా... ఇప్పుడు మాత్రం చెప్పను. ఎందుకంటే... నా ప్రేమ కథే ఓ సినిమా అవుతుంది. ఎప్పటికైనా తీయాలనుకుంటున్నాను. అంత విషయం ఉన్న కథా? సుకుమార్: ఎంతవిషయం ఉందో చూస్తే కదా తెలిసేది.(నవ్వుతూ) అంటే మీ ప్రేమకథలో హర్డిల్స్ కూడా ఉన్నాయా? మీరప్పటికే స్టార్ డెరైక్టర్ కదా? సుకుమార్: డెరైక్టరైనా, అసిస్టెంట్ డెరైక్టరైనా ప్రేమ ముందు అంతా ఒక్కటే. హర్డిల్స్ లేని ప్రేమ ఎక్కడా ఉండదు. సరే లెక్చరర్‌గా పనిచేస్తున్న టైమ్‌లో.. ‘సుందరకాండ’ లాంటి అనుభవాలేమైనా ఎదురయ్యాయా? సుకుమార్: ఆ.... ఏంటి ఆలోచిస్తున్నారు? సుకుమార్: చెబితే మీరు నమ్ముతారో లేదో అని. ఎందుకు నమ్మం? చెప్పండి? సుకుమార్: నిజంగా జరగలేదు. మీకు జరక్కపోతే పోయింది... మీ స్టూడెంట్స్ ప్రేమ వ్యవహారాలైనా మీ వద్దకొచ్చేవా? సుకుమార్: బోల్డన్ని. ‘ఆ అమ్మాయి నన్ను ఇష్టపడటం లేదుసార్...’ అంటూ వచ్చేవారు. ‘బాగా చదివి పాసవ్వండ్రా... ఆటోమేటిగ్గా వాళ్లే ఇష్టపడతారు’ అని నచ్చజెప్పేవాణ్ణి. ‘ఈ లోపు ఇంకెవరికైనా సెట్ అయిపోతే...’ అని తెగ ఫీలైపోయేవారు(నవ్వుతూ) అంటే లెక్చరర్‌గా పనిచేస్తున్న రోజుల్లో మీకు హీరో ఇమేజ్ ఉండేదన్నమాట? సుకుమార్: అవును. నా స్టూడెంట్స్ అందరూ నన్ను చాలా ఇష్టపడేవారు. అందరితో క్లోజ్‌గా మూవ్ అయ్యేవాణ్ణి. పైగా ఆ కాలేజ్‌లో నేనే యంగ్ లెక్చరర్ని. అసలు లెక్చరర్ అవాలని ఎందుకనిపించింది మీకు? సుకుమార్: మాది మధ్య తరగతి కుటుంబం. రాజోలు సమీపంలోని మట్టపర్రు మా ఊరు. నాన్నది బియ్యం వ్యాపారం. నాకు ముగ్గురు అన్నయ్యలు, ఇద్దరు తోబుట్టువులు. ఇంత సంసారాన్నీ నాన్న ఒక్కరే మొయ్యాలి. స్థిరచరాస్తులు కూడా ఏమీ లేవు. అప్పట్లో ఇల్లు గడవడమే కష్టంగా ఉండేది. నాన్న కష్టపడుతుంటే చాలా బాధగా ఉండేది. మేం కాస్త చేతికంది వచ్చాక ఏదో ఒకటి చేసి నాన్నకు ఆసరాగా నిలవాలనుకున్నాం. ఈ క్రమంలోనే నేను లెక్చరర్ అయ్యాను. ఉపాధ్యాయ వృత్తికి ఎంతో శిక్షణ అవసరం. ఒకేసారి అంతమంది పిల్లల్ని ఫేస్ చేయడం అంటే సాధారణమైన విషయం కాదు. ఏ శిక్షణా లేకుండా ఎలా లెక్చరర్ అయ్యారు? సుకుమార్: అవసరాన్ని మించిన గురువు ప్రపంచంలో వేరొకటి లేదండీ. ‘ట్యూషన్ చెప్పబడును’ అని ఇంటిముందు ఓ బోర్డ్ పెట్టా. ముందు ఓ కుర్రాడు వచ్చాడు. ‘మేం ముగ్గురం వస్తాం. బాగా చెబితే.. ఇక్కడే చదుకుంటాం. లేకపోతే వేరే ట్యూషన్ చూసుకుంటాం’ అన్నాడు. సరే... అని మొదలుపెట్టా. పదిరోజులు తిరిగే సరికి ముగ్గురు కాస్తా ముప్ఫై మంది అయ్యారు. తర్వాత ఆ సంఖ్య మూడొందలకి చేరుకుంది. మా ఇంటిముందు సైకిళ్లు బారులు తీరి ఉండేవి. అన్ని సైకిళ్లు మా ఇంటి ముందు ఉండటం చూసి, మా కాలేజ్ లెక్చరర్, నా గురువు అయిన రామ్మోహనరెడ్డిగారు.. ‘ఏంటి?’ అని వాకబు చేశారట. ఒక ట్యూటర్‌గా అక్కడ నాకెంత మంచి పేరుందో అప్పుడే ఆయనకు తెలిసింది. నేరుగా నన్ను కలిసి, నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు... అని కాకినాడ ఆదిత్య కాలేజ్‌లోనే లెక్చరర్‌గా ఉద్యోగం ఇప్పించారు. అలా తొమ్మిదేళ్లపాటు లెక్చరర్‌గా నా కెరీర్ సాగింది. ప్రస్తుతం నా స్టూడెంట్లు విదేశాల్లో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల్లో సీఈఓలుగా ఉన్నారు. ఇప్పటికీ వాళ్లు నన్ను అభిమానిస్త్తూనే ఉన్నారు. నా దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న వారిలో ఇద్దరు నా స్టూడెంట్లే. ఏ క్లాసులు చెప్పేవారు? సుకుమార్: మొదట్లో ఇంటర్మీడియట్ క్లాసులు చెప్పేవాణ్ణి. తర్వాత డిగ్రీకి ప్రమోట్ అయ్యాను. ఆ వయసు పిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం కదా. ఎలా టాకిల్ చేసేవారు? సుకుమార్: నిజమే... చురుగ్గా ఉండేవారు. అందుకే... ముందు నేనే వాళ్లలో ఒకడిగా మారిపోయేవాణ్ణి. తర్వాత నిదానంగా వాళ్లను పాఠంలోకి దించేవాణ్ణి. ‘సుకుమార్ సార్ లెసన్ చెప్పే విధానం చాలా బాగుంటుంది’ అనేవారు. మీ సబ్జెక్ట్ ఏంటి? సుకుమార్: మ్యాథ్స్ లెక్కలు అంటే ఇష్టమా? సుకుమార్: కాదు భయం. చిన్నప్పుడు ప్రతిసారీ లెక్కల్లో తప్పులు చేసేవాణ్ణి. మళ్లీ దిద్దుకోవడానికి ఎంతో కష్టపడేవాణ్ణి. అందుకే... లెక్కలు చెబుతున్నప్పుడు... ఎక్కడ అవి టఫ్‌గా అనిపిస్తాయో నాకు బాగా తెలుసు. లెక్చరర్ అయ్యాక... సరిగ్గా ఆ టైమ్‌లోనే పిల్లల దగ్గర జాగ్రత్త పడేవాణ్ణి. నిజంగా పాఠం చెబుతున్నప్పుడు కలిగే సంతృప్తే వేరు.. మనం చెబుతున్న పాఠాలు పిల్లలకు బాగా అర్థం అవుతున్నాయి అనిపిస్తే... ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలుగుతుంది. మరి అంత ఆనందాన్ని వదిలిపెట్టి సినిమాల్లోకి వచ్చారే? సుకుమార్: పేరుప్రఖ్యాతుల కోసం. చిన్నప్పుడు సైంటిస్ట్ అవుదామనుకునేవాణ్ణి. ఐన్‌స్టీన్ లాంటి వాళ్ల పక్కన నా స్టిల్ కూడా ఉంటే ఎంత బావుణ్ణు అని కలలు కనేవాణ్ణి. సమాజానికి ఉపయోగపడే వస్తువు ఏదైనా కనిపెడితే... అది శాశ్వతంగా నిలిచి, మనల్ని కూడా జనహృదయాల్లో శాశ్వతంగా నిలుపుతుంది కదా అని ఆశించేవాణ్ణి. కానీ నేనంత మేధావిని కాను, నా బుర్రలో అంత గుజ్జులేదు అని నాకు ముందే తెలిసిపోయింది. సో... మనం సైంటిస్ట్ కాలేం. మరి ప్రత్యామ్నాయ మార్గం ఏంటి? అని ఆలోచిస్తే...నాకు కనిపించింది సినిమా. చిన్నప్పట్నుంచీ సినిమా అంటే తెలీని మమకారం. మా రాజోలులో ఉన్న రెండు థియేటర్లు మూసేయడంతో తాటిపర్రు వెళ్లి సినిమాలు చూసేవాణ్ణి. రిలీజ్ రోజే సినిమాలు చూసేంత ఆరాటం ఉండేది కాదు కానీ... సినిమాలు మాత్రం బాగానే చూసేవాణ్ణి. అప్పట్లో ఊరి వీధుల్లో తెరలు కట్టి సినిమాలు వేసేవారు. అలా ‘బంట్రోతు భార్య’ సినిమా ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు. పవిత్రబంధం, విచిత్రకుటుంబం లాంటి సినిమాలు అక్కడే చూశా. లెక్చరర్‌గా బిజీగా ఉన్న రోజుల్లో కూడా సెకండ్‌షోలకు వెళ్లే వాణ్ణి. గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాలంటే... అంతకు మించిన మార్గం నాకు కనిపించలేదు. అందుకే చేసే ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టేసి వి.వి.వినాయక్‌గారి వద్ద దర్శకత్వ శాఖలో చేరిపోయాను. తేలిగ్గా డబ్బునూ, పేరు ప్రఖ్యాతుల్నీ సంపాదించుకోవాలంటే సినిమాను మించిన సాధనం ఇంకోటి లేదని నా అభిప్రాయం. విద్యాబోధనలో ఉన్న తృప్తి అపారం అని ఇంతకు ముందే అన్నారు. మరి ఆ వృత్తిని వదిలిపెడుతుంటే బాధ అనిపించలేదా? సుకుమార్: జీవితంలో ఒకటి సాధించాలంటే ఒకటి వదులుకోవాల్సిందే. ఆ వృత్తినే నమ్ముకొని ఉన్నట్లయితే... నాకు ఈ స్థాయి వచ్చేది కాదు కదా. మరో విషయం ఏంటంటే... టీచింగ్‌లో ఉన్న సంతృప్తి సినిమాల్లోకొచ్చాకే నాకు తెలిసింది. ఆ వృత్తిలో ఉన్నప్పుడు తెలీలేదు. విలువ అనేది దగ్గర ఉన్నప్పుడు తెలీదు. దూరమైతేనే తెలిసేది. విద్యారంగం నుంచి వచ్చారు కదా. భవిష్యత్తులో ఏదైనా విద్యాసంస్థను నెలకొల్పాలని ఉందా? సుకుమార్: లేదు... ఇక సినిమానే నా లోకం. ఏం చేయాలన్నా సినిమా ద్వారానే చేస్తాను. మీది మధ్యతరగతి కుటుంబం అన్నారు కదా. మీ బాల్యం ఎలా సాగింది? సుకుమార్: కాలేజ్‌లో నేను కామ్‌గోయింగ్ అని చెప్పాను కదా. దానికి పూర్తి కాంట్రాస్ట్ నా బాల్యం. మా అన్నయ్యలు మా ఊళ్లో కాస్త రఫ్‌గా తిరిగేవారు. వారి అండ చూసుకొని నేను కూడా ఎవర్నిపడితే వాళ్లను కొట్టేసేవాణ్ణి. రక్తం కారేదాకా కొట్టేవాణ్ణి. ఓసారి మా నాన్నకు తెలిసి చితకబాదేశారు. చదువుపై కూడా శ్రద్ధ ఉండేది కాదు. దానికి తోడు ఆస్త్మా. ఊపిరి పీల్చుకోవడానికి కష్టపడేవాణ్ణి. ఎప్పుడూ డల్‌గా ఉండేవాణ్ణి. బీభత్సమైన బద్దకం. ఇప్పుడు క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నా... ఆ బద్దకం ప్రభావం మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. ఇండస్ట్రీకొచ్చి తొమ్మిదేళ్లు అవుతున్నా... అయిదే సినిమాలు చేశానంటే కారణం అదే అనుకుంటా. వృత్తిపరంగా సక్సెస్‌లు కొడుతున్నా... వ్యక్తిగతంగా ప్రతిరోజూ నేను ఫెయిల్ అవుతూనే ఉంటానని ఎప్పుడూ చెబుతుంటా అందుకే. ఇంతకీ మీ బద్దకం ఎప్పుడొదిలింది? సుకుమార్: శేషారెడ్డిగారనీ... మా ఆదిత్య కాలేజ్ అధినేత. ఇప్పుడాయన ఎమ్మెల్యేగా ఉన్నారు. నాలోని లేజీతనాన్ని పారద్రోలింది ఆయనే. అందుకోసం ఆయన నాకు నీతిబోధలేం చేయలేదు. ఆయన జీవించే తీరు చూసి నాకు నేనే రియలైజయ్యాను. నాలోని సోమరితనాన్ని పక్కన పెట్టేశాను. తెల్లవారుజామున 4 గంటలకు నిద్ర లేచేవారాయన. రాత్రి 11 గంటల వరకూ ఉత్సాహం పనిచేసేవారు. రోజుకు 3, 4 గంటలే నిద్రపోతూ ఇంత ఉత్సాహంగా ఎలా పనిచేయగలుగుతున్నారని ఆయన్ను చూసి ఆశ్చర్యపోయేవాణ్ణి. అప్పుడే నా మైండ్‌సెట్‌లో మార్పొచ్చింది. నేనెందుకు అలా ఉండకూడదనే భావన నాలో మొదలైంది. రాత్రింబవళ్లూ అలుపెరగకుండా ఈ రోజు పనిచేయగలుగుతున్నానంటే.. నాలో ఆయన నింపిన స్ఫూర్తే కారణం. చిన్నతనంలో గుర్తుండిపోయిన సంఘటన ఏమైనా..? సుకుమార్: అలాంటిది ఒకటుంది. అప్పట్లో గేదెల్ని తీసుకొని చెరువుకెళ్లేవాణ్ణి. అయితే... నాన్న ఓ షరతు విధించాడు. అదేంటంటే... ‘గేదెలు మాత్రమే చెరువులో దిగాలి. నువ్వు మాత్రం దిగకూడదు’ అని. దాంతో తోటి పిల్లలందరూ నీళ్లల్లో దిగి ఈత కొడుతుంటే... నేను చూస్తూ కూర్చుండేవాణ్ణి. ఇక లాభం లేదని ఓ రోజు ‘నేను కూడా చెరువులో దిగుతా’ అని నాన్నను సూటిగా అడిగేశా. నాన్న మంచి మూడ్‌లో ఉన్నట్లున్నారు.. ‘సర్లే’ అనేశారు. ఇంకేముంది... కొబ్బరికాయ దొరికిన కోతిలా మారిపోయా. గేదెలతో పాటు అమాంతం చెరువులోకి దూకేశా. ప్రపంచాన్ని మరిచిపోయి గజ ఈతగాడి లెవల్లో ఈత కొడుతున్నా. ఈ ఆనందంలో నాకు టైమ్ తెలీలేదు. తీరా తేరుకొని చూస్తే... చెరువంతా నిశ్శబ్దం. గేదెలూ లేవు, తోటి పిల్లలూ లేరు. గేదెలు కూడా నన్ను వదిలేసి ఇంటికి వెళ్లిపోయాయన్న విషయం అర్థమైంది. అప్పుడు వినిపించింది నాన్న కేక. ఎంతసేపట్నుంచీ నాకోసం ఎదురు చూస్తున్నారో తెలీదు కానీ, మంచి కోపం మీద ఉన్నారాయన. ఇంటికి తీసుకెళ్లి చావబాదారు. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తొస్తూనే ఉంటుంది. ఇప్పటికీ మీ ఊరు వెళ్తుంటారా? సుకుమార్: ఎందుకెళ్లను... ఆ మధ్య నాకు సన్మానం కూడా చేశారు. అక్కడ ఒకప్పుడు అల్లరిగా తిరిగిన ఓ కుర్రాడు ఇప్పుడు సినిమా డెరైక్టర్ అంటే... అది గొప్ప విషయమే కదా. అన్నయ్య వాళ్లు అక్కడే ఉంటున్నారు. నాన్న మొన్నటిదాకా నా దగ్గరే ఉన్నారు. కాసేపు సినిమాల విషయానికొద్దాం. మీరు డెరైక్టర్ అవుదామనుకున్న తర్వాత... ఫస్ట్ తయారు చేసుకున్న కథ? సుకుమార్: డెరైక్టర్ అవుదామనుకున్న తర్వాత అని కాదు కానీ... లెక్చరర్‌గా ఉన్న రోజుల్లోనే ‘100% లవ్’ కథ తయారు చేసుకున్నాను. దాదాపు అదే టైమ్‌లో ‘జగడం’ కూడా తయారు చేశా. ‘జగడం’ కథకు ప్రేరణ మా కాలేజ్ లైఫే. మేం చదువుకునే రోజుల్లో కాలేజ్ పాలిటిక్స్ ఓ రేంజ్లో ఉండేవి. మా అన్నయ్యలు అందులో ముందు వరుసలో ఉండేవారు. ‘జగడం’లో హీరో తమ్ముడి క్యారెక్టర్ ఉంది కదా... అది నేనన్నమాట. ఓ విధంగా మా లైఫ్ స్టోరీ అది. మరి ‘ఆర్య’ కథకు ప్రేరణ ఎంటి? ఎవరికోసం ఆ కథ తయారు చేశారు? సుకుమార్: ప్రేరణ అంటూ ఏమీ లేదు. కొత్తగా ఆలోచించానంతే. ప్రేమించడం, ప్రేమను వ్యక్తపరచడం, దాని గొప్పతనాన్ని తెలియజేయడం... ఇన్నాళ్లూ రెండున్నర గంటల పాటు సినిమాల్లో ఇదే చూపించారు. ‘ఆర్య’ కథ ఆ విధానానికి పూర్తి విరుద్ధమైంది. మననుంచి ఏదో ఆశించి సూర్యుడు వెలుగునివ్వడు. మన నుంచి ప్రతిఫలం ఆశించి ప్రకృతి మనల్ని అక్కున చేర్చుకోదు. ‘ఆర్య’లో హీరో కూడా అంతే... తనను ఆ అమ్మాయి ప్రేమిస్తుందా, లేదా అనేది అతనికి అనవసరం. తాను మాత్రం ప్రేమిస్తాడు. ఈ విషయాన్ని ప్రారంభంలోనే చెప్పేస్తాడు. ఆ తర్వాత జరిగే కథే ‘ఆర్య’. వన్‌సైడ్ లవర్స్ తరఫున వకాల్తా పుచ్చుకుని ట్రెండ్‌కి ఎదురెళ్లి మరీ నేను ‘ఆర్య’ తీశాను. అదే జనానికి కూడా నచ్చేసింది. నిజానికి ఈ కథను నేను తయారు చేసుకుంది అల్లు అర్జున్ కోసం కాదు. అల్లరి నరేష్ కోసం. దీనిని ఒక చిన్న సినిమాగా తీద్దాం అనుకున్నా. కానీ దేవుడు వేరేలా తలచాడు. బాలీవుడ్లో, కోలీవుడ్‌లో ప్రయోగాత్మక సినిమాలొస్తున్నాయి. కానీ మనం ఎందుకు ఆ దిశగా ఆలోచించలేకపోతున్నామంటారు? సుకుమార్: ప్రయోగం అనేది చిన్న సినిమాలతోనే చేయగలం. తమిళంలో జరుగుతోంది అదే. బాలీవుడ్ మార్కెట్ పెద్దది కావడంతో అక్కడ పెద్దసినిమాల ద్వారా కూడా ప్రయోగాలు చేస్తున్నారు. కానీ తెలుగులో ఆ పరిస్థితి లేదు. అంతెందుకు... నేను ‘జగడం’ తీశాను. అది నేను రియల్‌గా చూసిన సంఘటనల ఆధారంగా తయారు చేసుకున్న కథ. ‘సమాజానికి ఉపయోగపడే కథ కదా... ఆడుతుందిలే’ అనుకున్నా. కానీ నా అంచనాలు తారుమారయ్యాయి. ‘జగడం’ ఆడితే... అలాంటి ప్రయోగాలే ఇంకొన్ని వచ్చేవి. ఏది ఏమైనా ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటేనే ప్రయోగాలు చేయగలం. సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారు కదా! మీ నుంచి అలాంటి సినిమాలు ఆశించొచ్చా? సుకుమార్: కచ్చితంగా... అలాంటివి చేయడం కోసమే ఈ ప్రొడక్షన్. రాజమౌళి లాంటి దర్శకుడు... సుకుమార్ మాస్ సినిమాలు తీస్తే... నాలాంటి వాళ్లు పక్కకు తప్పుకోవాల్సిందే అన్నారు. ఆయన అలా అనడం మీకెలా అనిపించింది? సుకుమార్: కేవలం అది రాజమౌళిగారి అభిమానం. ఆయన అలా మాట్లాడటం నా బాధ్యతను పెంచింది. ఆయన ప్రశంస నాకు నేషనల్ అవార్డ్‌తో సమానం. అన్ని జానర్లూ టచ్ చేయగలిగిన మీరు... ఎప్పుడూ ప్రేమకథలే తీస్తారేం? సుకుమార్: నాకు చేతనైంది నేను తీస్తున్నాను. ఒకవేళ వేరే జానర్లో సినిమా తీయాలని నాకు అనిపించినా... నా దగ్గరకొచ్చే నిర్మాతలు ఒప్పుకోవడం లేదు. వాళ్లు ప్రేమకథల్నే అడుగుతున్నారు. నేనేం చేసేది! రాబోతున్న ‘1’ నా గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. మీరు ఎవరి మాటా వినని సీతయ్య అని అంటారు. నిజమేనా? సుకుమార్: అదేంలేదు. ఎవర్నీ ఇబ్బంది పెట్టకూడదు, బాధ పెట్టకూడదు అని అందరి మాటా వింటాను. కానీ, అందులో నాకు నచ్చిందే తీసుకుంటాను. నాకు ఫైనల్ అవుట్‌పుట్ ముఖ్యం. దర్శకునిగా మీకు డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? సుకుమార్: థ్రిల్లర్ తీయాలని ఉంది. థ్లిల్లర్, సైన్స్‌ఫిక్షన్ సినిమాలను ప్రపంచం మొత్తం చూస్తుంది. వాటికి హద్దులుండవ్. ఉదాహరణకు ‘ఈగ’. అందుకే ఫ్యూచర్లో ఓ థ్రిల్లర్ సినిమా తీస్తా. వచ్చే ఏడాదైనా మీ నుంచి ఓ రెండు సినిమాలు ఆశించొచ్చా? సుకుమార్: చెప్పాను కదండీ... నా చేతిలో ఏమీ ఉండదు. నాకు త్వరగా తీయాలనే ఉంటుంది. కానీ... పరిస్థితులు సహకరించవు. మీరు పుస్తకాలు బాగా చదువుతారనుకుంటా? సుకుమార్: ఒకప్పుడు బాగా చదివేవాణ్ణి. దర్శకుణ్ణి అయ్యాక.. ఇన్నాళ్లలో ఓ ఆయిదారు పుస్తకాలు చదివుంటా. ఇష్టమైన రచయితలు? సుకుమార్: చలం, యండమూరి వీరేంద్రనాథ్. ఒక సినీ దర్శక, రచయితగా మీకు ఇష్టమైన దర్శక, రచయితలు ఎవరు? సుకుమార్: జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, త్రివిక్రమ్. వారి ప్రభావం కాస్త్త నాపై ఉంది. సినిమా, సాహిత్యం... వీటి తర్వాత మీరు బాగా ఇష్టపడేది? సుకుమార్: గేమ్స్.... అందులోనూ క్రీజ్‌లో సచిన్ ఉన్నాడంటే... ఇక పనులన్నీ అటకెక్కేయాల్సిందే. నా జీవితంలోని చాలా సమయాన్ని సచినే లాగేసుకున్నాడు. ఎస్పీ బాలుగారి విషయంలో కూడా అంతే.. ఆయన పాటల్ని మనం చిన్నప్పట్నుంచీ వింటూ పెరిగాం. పాట వినడానికి మనం కేటాయించేది అయిదు నిమిషాలు. అంటే... మన అయిదు నిమిషాలు బాలుగారు తీసేసుకున్నట్లేగా. అలా సచిన్ నా జీవితంలో చాలా సమయాన్ని తీసేసుకున్నాడు. ప్రపంచం మొత్తం తిరిగి ఉంటారు కదా! ఇష్టమైన దేశం? సుకుమార్: అంత ఇష్టపడే దేశం ఏమీ లేదండీ. ఆ క్షణంలో ఎంజాయ్ చేస్తానంతే. ఇష్టపడే దేశం అంటే ఇండియానే. ఎలాంటి ఫుడ్‌ని ఇష్టపడతారు? సుకుమార్: ఆరేళ్లవయసులోనే నాన్‌వెజ్ తినడం మానేశా. మళ్లీ దేవిశ్రీ ప్రసాద్ కారణంగా నాన్‌వెజ్ అలవాటైంది. తను కేఎఫ్‌సీ చికెన్ బాగా తింటాడు. నాక్కూడా అలవాటు చేశాడు. ఈ మూడ్నాలుగేళ్ల నుంచే కాస్త ఎక్కువగా తింటున్నా. ‘100%లవ్’లో తమన్నా పాత్రకు దేవిశ్రీనే ప్రేరణ అన్నమాట. పాలిటిక్స్... ఫాలో అవుతారా? సుకుమార్: ఇండస్ట్రీకి రాకముందు బాగా ఫాలో అయ్యేవాణ్ణి. పేపర్లు కూడా బాగా చదివేవాణ్ణి. ఎమ్మెల్యే, మంత్రుల పేర్లు కూడా గుర్తుండేవి. ఇప్పుడు మాత్రం సినిమా తప్ప వేరే ఏమీ గుర్తు రావడంలా. సరే మీ ఫ్యామిలీ గురించి కూడా చెప్పేయండి... ఓ పనైపోతుంది? సుకుమార్: మా ఆవిడ పేరు హంసిని. మాకు ఓ పాప, ఓ బాబు. పాపకు నాలుగేళ్లు. పేరు సుకృతివేణి. ప్లే స్కూల్లో చేర్చాం. బాబుకు రెండేళ్లు. పేరు సుక్రాంత్. వాణ్ణి ఇంకా స్కూల్లో వేయలేదు. మా ఇద్దరు పిల్లలకు నా పేరు కలిసొచ్చేలా సుకృతి, సుక్రాంత్ అని పేర్లు పెట్టుకుంది నా భార్య. నేనంటే అంత ఇష్టం తనకు. ‘100% లవ్’ అన్నమాట(నవ్వుతూ) - బుర్రా నరసింహ తెలుగు సినిమాకు స్క్రిప్ట్ రాయడం కంటే... హాలీవుడ్ సినిమాకు స్క్రిప్ట్ రాయడం తేలిక. హాలీవుడ్ సినిమా స్క్రిప్ట్ స్ట్రయిట్‌గా ఒకే ట్రాక్‌పై సాగిపోతుంది. కానీ.. తెలుగు సినిమా స్క్రిప్ట్ అలా కాదు. మధ్య మధ్యలో పాటలుంటాయి. ఆ పాటలకు తగ్గ సన్నివేశాలను ముందు డిజైన్ చేయాలి. ఆ పాట మూలంగా కథ నుంచి బయటకొచ్చిన ప్రేక్షకుణ్ణి మళ్లీ కథలోకి పంపాలి. అలాగే ఫైట్లు. ఆ ఫైట్ కారణంగా కథలో ఏర్పడే డిస్ట్రబెన్స్ని కూడా సరిచేయాలి. ఎప్పటికప్పుడు స్క్రీన్‌ప్లేని ఛేంజ్ చేస్తూ పోవాలి. నా ఉద్దేశంలో కొన్నాళ్ల తర్వాత ఈ పద్ధతి పూర్తిగా నశించిపోతుంది. ఫ్యూచర్లో డ్యూయెట్లంటూ సినిమాల్లో ఉండవ్. కేవలం కథను నడిపించే మాంటేజస్ సాంగులే ఉంటాయి. బాలీవుడ్లో ఆ పద్ధతి ఇప్పుడిప్పుడే మొదలైంది కూడా. ***************** చిన్నప్పట్నుంచీ నేను సుఖపడింది లేదు. ఆ మాటకొస్తే... ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నాను. జీవితంలోని ప్రతి మలుపులోనూ నన్ను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. అయితే... ఆ కష్టమే నాకు ఇష్టం. నా దృష్టిలో తెలివైన విద్యార్థి ఎప్పుడూ మంచి గురువు కాలేడు. బ్యాడ్ స్టూడెంటే గుడ్ లెక్చరర్ అవగలడు. ఎందుకంటే అనుభవాలే వాడికి పాఠాలవుతాయి కాబట్టి, తానెక్కడ తప్పు చేశాడో, ఎక్కడ కష్టంగా ఫీలయ్యాడో వాడికి బాగా తెలుసుకాబట్టి. ఇది నేను స్వానుభవంతో చెబుతున్న మాట. చలం రచనలన్నీ నాటి పరిస్థితుల్ని బట్టే సాగాయి. కాబట్టి అప్పట్లో ఆయన రాసినవన్నీ అక్షరసత్యాలే. ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. ఏది ఏమైనా సాహిత్యలోకంలో చలం ఓ ఆణిముత్యం. ఎంతోమంది చలం సాహిత్యానికి బానిసలు. దేవుణ్ణి నమ్ముతాను... ప్రతిరోజూ దణ్ణం పెట్టుకుంటాను కూడా. అయితే... అది భక్తితో కాదు. భయంతో. ఆయన ఉన్నాడేమో అని భయం... ఒకవేళ ఆయన ఉంటే మనల్ని చూస్తూ ఉంటాడేమోనన్న భయం. నాకు మంచి జరగాలని మాత్రం దేవుణ్ణి రోజూ కోరుకుంటాను. -
నేను అనే భావన పెరిగేలోపే ఆ బాటలో వెళ్లాలి!
బయట ఉన్నంత ‘రిచ్’గా లోపలా ఉండగలమా? లోపల అంటే... మన ఆలోచనల్లో, ఆచరణల్లో. రిచ్‌గా అంటే... భౌతిక విలువలకు అతీతంగా, ఆధ్యాత్మికంగా. ‘ఉండగలం’ అంటారు విక్టరీ వెంకటేష్. ఎలా? మానవుడికన్నా మరికాస్త గొప్పగా ఆలోచించాలట! అంటే?! నంబర్ వన్: నేను, నాది, నా వల్ల... అనుకోకూడదు. నంబర్ టు: దేన్నీ శాశ్వతమని భావించకూడదు. నంబర్ త్రీ: రేపటి గురించి ఆలోచిస్తూ ఇవాళ్టిని వృథా చేయకూడదు. బానే ఉంది కానీ.. మానవుడు మానవుడిలా కాకుండా ఇంకెలా ఆలోచిస్తాడు? ఒక సాధువులా, ఒక సద్గురువులా, ఇంకా... హీరో వెంకీలా! వెంకీలో అంతుందా! అంత కాదు, ఎంతో ఉంది. వెంకీతో ఎంటర్టైన్ అవాలనుకునేవారు ఆయన సినిమాలను ఎన్నిసార్లైనా చూడొచ్చు. వెంకీతో ఎన్లెటైన్ అవాలంటే మాత్రం ఒక్కసారైనా ఈ ‘తారాంతరంగం’ చదవాలి. ‘ఐ విల్ కట్ హారిజాంటల్లీ...’ అంటూ వచ్చీ రాని ఇంగ్లిష్‌లో ‘మసాలా’ సినిమాలో డైలాగ్ చెప్పారు. ఒకప్పుడు మీ తెలుగు కూడా అలానే ఉండేది కదా? వెంకటేష్: అవును. తెలుగు మాట్లాడటం చాలా కష్టమయ్యేది. నా స్కూలింగ్ అంతా చెన్నయ్‌లోనే. ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లిష్, సెకండ్ లాంగ్వేజ్ హిందీ. పైగా పై చదువుల కోసం విదేశాలు వెళ్లిపోవడం వల్ల తెలుగు మాట్లాడే అవకాశం చాలా చాలా తక్కువ ఉండేది. హీరో అయిన కొత్తలో నా పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి చాలా ఇబ్బందిపడేవాణ్ణి. అప్పట్లో నా తెలుగులో బాగా ఇంగ్లిష్ ఉండేదనేవాళ్లు. ఓసారి మీ ఫ్లాష్‌బ్యాక్‌కి వెళదాం... సురేష్ ప్రొడక్షన్స్ బేనర్ ఎంబ్లమ్లో ‘ఎస్’ అక్షరంపై మీరు, ‘పి’ అక్షరంపై మీ అన్నయ్య సురేష్‌బాబు ఉంటారు. అక్షరాలకు తగ్గట్టు మీరు స్టార్, మీ అన్నయ్య ప్రొడ్యూసర్ అయ్యారు. ఇలా జరుగుతుందని ఎప్పుడైనా అనుకున్నారా? వెంకటేష్: అస్సలు అనుకోలేదు. నేను సినిమాల్లోకి వస్తాననే అనుకోలేదు. బేనర్ లోగో తయారు చేయించినప్పుడు అన్నయ్యను, నన్ను నిలబెట్టి నాలుగైదు రకాల స్టయిల్స్‌లో నాన్నగారు లోగో తయారు చేయించారు. మేమిద్దరం బాక్సింగ్ చేస్తున్నట్లు, షేక్‌హ్యాండ్ ఇచ్చుకుంటున్నట్లు.. ఇలా షూట్ చేశారు. అప్పట్లో మీరేం అవ్వాలనుకునేవారు? వెంకటేష్: స్పైసెస్ (సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులు) బిజినెస్ చేద్దామనుకున్నా. ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్‌కి సంబంధించిన బిజినెస్ కదా. ఆ వ్యాపారం అయితే ఎక్కువగా ట్రావెల్ చేయొచ్చు. ఎందుకంటే, నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. కానీ, మనం అనుకున్నదేదీ జరగదు కదా! కృష్ణగారు బిజీగా ఉండటంవల్ల నాన్నగారు నన్ను ‘కలియుగ పాండవులు’లో హీరోగా చేయమన్నారు. అప్పుడు అబ్రాడ్‌లో చదువుతున్నాను. నాన్నగారు ఫోన్ చేయగానే, ఇక్కడికొచ్చేశాను. అనుకోకుండా హీరో అవ్వడం... ఇదిగో ఇక్కడిదాకా రావడం.. అందరికీ తెలిసిందే. గోల్డెన్ స్పూన్‌తో పుట్టారు... మీ లైఫ్ అంతా అద్భుతమే కదూ? వెంకటేష్: అసలు గోల్డెన్ స్పూన్ అంటే ఏంటి? ‘మెటీరియల్ వరల్డ్’కి నేను గోల్డెన్ స్పూన్‌తో పుట్టినట్లుగానే ఉంటుంది. దేశంలో ఎంత పెద్ద అయినా, లోపల ‘పూర్’గా ఉంటే జీవితం వృథా అని నా అభిప్రాయం. లోపల బీదగా ఉండటం అంటే..? వెంకటేష్: బయటికి నేను బాగా రిచ్‌గా ఉండొచ్చు. కానీ, లోపల ఎంత ఆనందంగా ఉన్నారో మీకెలా తెలుస్తుంది? ఆధ్యాత్మిక అవగాహన ఉంటేనే నా దృష్టిలో ‘రిచ్’ కింద లెక్క. మరి... మీరు ధనవంతులేనా? వెంకటేష్: యస్..! ఆధ్యాత్మిక అవగాహన ఉంటేనే ‘రిచ్’ అని ఎలా అంటారు? వెంకటేష్: ఓకె.. కొంచెం విపులంగా మాట్లాడుకుందాం. నా కెరీర్‌ని తీసుకుందాం. రెండు సినిమాలు సూపర్ హిట్. బ్రహ్మరథం పడతారు. ఆ తర్వాత రెండు ఫట్లు... ఎవరూ దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడరు. సో.. సక్సెస్ అనేది అశాశ్వతమే కదా. అలాగే, స్నేహితులతోనూ బంధువులతోనూ అనుబంధాన్ని తీసుకుందాం. ఎక్కడైనా చిన్న మాటలో తేడా వస్తే.. ఆ అనుబంధం ఏమవుతుంది? కాబట్టి అనుబంధాలూ అశాశ్వతమే. వేసుకునే బట్టలు, వాడే వస్తువులు.. ఏదీ జీవితాంతం మనతోపాటు ఉండిపోవుగా. మరి.. శాశ్వతం కాని వాటి గురించి పాకులాడటం దేనికి? సో.. ఏది శాశ్వతం.. ‘ఇన్నర్ స్ట్రెంగ్తే కదా...’. ఆ బలం ఎప్పుడు వస్తుంది? ఆధ్యాత్మిక బాటలో వెళుతూ.. ‘జీవిత సత్యం ఏంటో? శాశ్వతం ఏదో’ తెలుసుకున్నప్పుడు. ఇన్నర్‌గా మనం ఎప్పుడైతే బలంగా ఉంటామో అప్పుడు దేనికీ భయపడం. మనలో ఓ ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది! దేనికీ భయపడం అంటే... చివరికి మరణానికి కూడానా? వెంకటేష్: ఎగ్జాక్ట్లీ... మరణానికి కూడా భయపడం. అసలు చావంటే ఏంటో తెలుసుకోకుండా భయపడిపోతుంటాం. అయితే, మరణం అనేది శరీరానికి మాత్రమే అనుకున్నప్పుడు భయం ఉండదు. మన శరీరం చనిపోగానే, అందులో ఉన్న ఆత్మ వేరే తల్లి కడుపులో పడుతుందనే సత్యం తెలుసుకుంటే మరణం గురించి భయపడం! డబ్బు, నగలు, వస్తువులు.. ఇష్టపడేవారికి వాటి ద్వారా ఆనందం లభిస్తుంది. మరి.. మీకు ఎందులో ఆనందం లభిస్తుంది? వెంకటేష్: నేను మానవుణ్ణి కాదు.. ఇంకా ఏదో అనుకున్నప్పుడు శాశ్వతమైన ఆనందం లభిస్తుంది. ఒక మానవుడికన్నా ఇంకా గొప్పగా ఆలోచించగలిగినప్పుడు ఆనందంగా ఉంటుంది. మీరంటే చిన్నప్పట్నుంచీ అన్ని సౌకర్యాలూ అనుభవించారు కాబట్టి, ‘మెటీరియల్స్’ మీద వ్యామోహం పోయి ఉంటుంది. దాంతో... ‘ఆధ్యాత్మికం’ అంటున్నారు. కానీ, ఏమీ అనుభవించనివాళ్లు మీరు అంటున్న అశాశ్వత ఆనందాన్నే కోరుకుంటారేమో? వెంకటేష్: మితిమీరిన ఆశ ఉంటే.. ఎవరికీ ఎప్పుడూ దేనిలోనూ ఆనందం లభించదు. ఉదాహరణకు.. చిన్న కారు కొనుక్కోవాలనుకున్నారు. అది కొన్న తర్వాత ఇంకా లగ్జరీ కారుని కోరుకుంటారు. చిన్న ఇల్లుతో మొదలుపెట్టి.. ఆ తర్వాత పెద్ద ఇంటి వరకు ఆశ పెరిగిపోతుంది. అలాంటివాళ్లకి ఎప్పుడూ ఆనందం దొరకదు. ఇక.. మీరన్నది కరెక్టే. ఏ సౌకర్యాలూ అనుభవించకుండా ఈ బాటలో వెళ్లలేం. నేను అన్ని సౌకర్యాలు అనుభవించాను కాబట్టే, చాలా త్వరగా ‘ఆధ్యాత్మిక బాట’కు ఆకర్షితుణ్ణయ్యాను. అసలేమీ అనుభవించకుండా ఈ భావన అంత సులువుగా రాదు. మీ మాటలు దాదాపు ఎడ్యుకేట్ చేసే విధంగానే ఉన్నాయి. కానీ, కాసేపు సరదాగా మాట్లాడుకుందాం. చిన్నప్పుడు మీరెలా ఉండేవారో తెలుసుకోవాలని ఉంది... వెంకటేష్: చాలా జోష్‌గా ఉండేవాణ్ణి. అల్లరి పిల్లాణ్ణే. నాకో చిన్న గ్యాంగ్ ఉండేది. స్కూల్లో అందరితో బాగుండటం, ఎంజాయ్ చేయడం అలా ఉండేవాణ్ణి. నా క్లాస్‌తో పాటు ఇతర క్లాసుల పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండేవాణ్ణి. చదువుపరంగా చెప్పాలంటే యావరేజ్. స్పోర్ట్స్‌లో బాగా పార్టిసిపేట్ చేసేవాణ్ణి. స్కూల్లో ‘సిస్టమ్’కి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే భరించేవాణ్ణి కాదు. ఉన్నవాళ్ల పిల్లలను ఓ రకంగా, లేనివాళ్లను ఓ రకంగా ట్రీట్ చేస్తే ఊరుకునేవాణ్ణి కాదు. పిల్లలందరికీ ఫ్రెండ్... టీచర్స్‌కి మాత్రం విలన్నే. అయితే.. కాలేజ్‌లో ఇంకా రెబల్‌గా ఉండేవారేమో? వెంకటేష్: అవును. పక్క కాలేజీవాళ్లకీ మా కాలేజీవాళ్లతో మాటా మాటా వచ్చినప్పుడు గొడవపడటానికి ముందుండేవాణ్ణి. రామానాయుడి కొడుకు కాబట్టి.. స్కూల్, కాలేజ్‌లో మీరేం చేసినా చెల్లుబాటు అయ్యుంటుందేమో? వెంకటేష్: స్కూల్లో నన్నెప్పుడూ ప్రత్యేకంగా చూడలేదు. అల్లరి చేసినప్పుడు ‘గో అవుట్’ అంటూ టీచర్స్ నన్ను బయట నిలబెట్టిన రోజులు చాలానే ఉన్నాయి. నేను ‘రామానాయుడు కొడుకు’ అని ఎవరి దగ్గరా చెప్పుకునేవాణ్ణి కాదు. ‘నేను మామూలు వ్యక్తిని’ అనుకున్నప్పుడే లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేయగలుగుతాం అని నేను చిన్నప్పట్నుంచీ నమ్మేవాణ్ణి. కాలేజ్ డేస్‌లో బైక్ మీద ఫ్రెండ్స్‌తో బాగానే హల్చల్ చేసేవారా? వెంకటేష్: బీకామ్ ఫస్ట్ ఇయర్లో యమహా కొనుక్కున్నాను. ఫస్ట్ బైక్ థ్రిల్లే వేరు. ఆ బైక్‌ని మాడిఫై చేయించుకోవడం, గారేజ్కి తీసుకెళ్లి, పెయింటింగ్‌లు వేయించుకోవడం అంతా బాగుండేది. కొన్నాళ్లు హాయిగానే సాగింది. కానీ ఓసారి యాక్సిడెంట్ జరగడంతో ఇంట్లోవాళ్లు ఇక బైక్ వద్దన్నారు. ఆ విధంగా నా బైక్ రైడ్‌కి బ్రేక్ పడింది. అది సరే... ‘ప్రేమనగర్’లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశారు కదా.. ఆ తర్వాత ఎందుకు కంటిన్యూ అవ్వలేదు? వెంకటేష్: అది అనుకోకుండా జరిగింది. ఓ రోజు నేనేదో ఆడుకుంటుంటే, మా మేనేజర్ అనుకుంటా.. నా దగ్గరికొచ్చి ‘నాన్నగారు రమ్మంటున్నారు.. యాక్ట్ చేయాలట. చేస్తే మీ బ్యాంక్‌లో డబ్బులు వేస్తారట’ అన్నాడు. సరే.. వెళ్లాను. చేశాను. అంతేకానీ నాకు ప్రత్యేకంగా ఇంట్రస్ట్ ఏమీ లేదు. కనీసం చిన్నప్పుడు అద్దం ముందు నిలబడి, యాక్ట్ చేసి చూసుకోవడం కూడా చేసేవారు కాదా? వెంకటేష్: సినిమా వాతావరణంలో పెరిగినందువల్లో ఏమో.. మా ఆఫీస్ పైన ఉన్న కాస్ట్యూమ్ రూమ్‌లోకెళ్లి.. మా జానపద సినిమాలకు సంబంధించిన డ్రెస్‌లేసుకుని, అద్దం ముందు నిలబడి, ఏవో పిచ్చి పిచ్చి సైగలు చేయడం ఇంకా గుర్తుంది. అలాగే, మావాళ్లు అప్పుడప్పుడు, నన్ను డాన్స్ చేయమనేవాళ్లట. కొంతమంది స్టార్స్‌ని ఇమిటేట్ చేసేవాణ్ణట. ఇలాంటివన్నీ అన్నయ్య చెయ్యలేదు. నేనే చేశానంటే.. ఏదో మూల నాలో యాక్టింగ్ మీద ఇంట్రస్ట్ ఉండేదేమో...! అన్నయ్య, మీరు చిన్నప్పుడు ఎలా ఉండేవారు? వెంకటేష్: మా ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ లేదు కాబట్టి చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్లం. ఇప్పుడూ అలానే ఉంటాం. అన్నయ్య మంచి స్పోర్ట్స్‌మేన్. క్రికెట్ బాగా ఆడేవాడు. ఫాస్ట్ బౌలర్. స్కూల్లో స్పోర్ట్స్ అంటే... అన్నయ్య పార్టిసిపేషన్ కంపల్సరీ. సౌత్‌లో నిర్మాతల కొడుకుల్లో మీ అంతగా సక్సెస్ అయినవాళ్లు లేరు. భవిష్యత్తుని ప్లాన్ చేయనన్నారు కాబట్టి... ఈ ఊహించని సక్సెస్ ఎలా అనిపిస్తోంది? వెంకటేష్: నా మొదటి సినిమా తర్వాత వరుసగా నాలుగైదు ఫ్లాప్‌లు వచ్చాయి. దాంతో, చాలా కామెంట్స్ వచ్చాయి. ‘నిర్మాతల కొడుకులు కష్టం’ అని కొందరు, ‘ఈ అబ్బాయికి యాక్టింగ్‌కి కుదరదు’ అని మరికొందరు వ్యాఖ్యలు చేశారు. అప్పటికే చిరంజీవిగారు, బాలకృష్ణగారు, నాగార్జునగారు సినిమాలు చేస్తున్నారు. ఆ సమయంలో ఓ నిర్మాత కొడుకుగా నేను ఎంటరయ్యాను. అయినా ఎవరి విమర్శలనీ పట్టించుకోలేదు. హిట్, ఫ్లాప్ గురించీ ఆలోచించలేదు. ఫస్ట్ సినిమాలో నన్ను నేను చూసుకుని ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, నేనెలాంటి ట్రైనింగ్ తీసుకోలేదు. అబ్రాడ్ నుంచి రావడం రావడమే యాక్టింగ్ మొదలుపెట్టాను. డెరైక్టర్, ఫైట్ మాస్టర్, డాన్స్ మాస్టర్ ఏం చెబితే అది చేశాను. కొన్ని ఫ్లాపుల తర్వాత స్వర్ణకమలం, ప్రేమ, శ్రీనివాస కల్యాణం లాంటి డిఫరెంట్ మూవీస్‌కి అవకాశం వచ్చింది. దాంతో మంచి పేరొచ్చింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పాటు డిఫరెంట్ మూవీస్ చేయడం, ఆడియన్స్ నన్ను అంగీకరించడం... అంతా కూల్‌గా జరిగిపోయింది. సో.. ముందుగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ప్రేక్షకులకే. మీ కామెడీ టైమింగ్ బాగుంటుంది.. బేసిక్‌గా మీలో సెన్సాఫ్ హ్యుమర్ ఉందా? వెంకటేష్: ఇన్నర్‌గా హ్యుమర్ ఉంటే.. కామెడీ టైమింగ్ బాగా కుదురుతుంది. చిన్న వయసులో మాస్ సినిమాలు చేసి, ఆ తర్వాత ప్రేమకథా చిత్రాల్లో నటించారెందుకని? వెంకటేష్: రక్తతిలకం, బ్రహ్మపుత్రుడు, కూలీ నెం. 1 ఇలా వరుసగా మాస్, ఆ తర్వాత లవ్‌స్టోరీస్ చేశాను. మాస్ సినిమాలు చేసినప్పుడు ‘మెడ’కు గాయం తగిలింది. అది చాలా సివియర్‌గా ఉండేది. దాంతో మాస్ సినిమాలకన్నా కొంచెం సాఫ్ట్‌గా ఉండేవి చేస్తే బాగుంటుందనుకున్నా. అప్పుడు లవ్‌స్టోరీస్ చేశాను. అవి బాగా ఆడాయి. కాబట్టి.. ఆ గాయం తగలడం కూడా మేలే అయ్యిందని, ఏది జరిగినా అది మన మంచికే అనిపించింది. నాకున్న అనుభవంతో చెబుతున్నా. రిజల్ట్ అనేది 50 శాతం మనం హార్డ్‌వర్క్ చేసినందుకు వస్తుంది. మిగతా 50 శాతం రిజల్ట్ మిస్టీరియస్‌గా వచ్చేస్తుంది. అవతలి హీరోలు బిజీగా ఉన్నప్పుడు, వాళ్లు చేయాల్సిన మంచి సినిమా నాకు వచ్చి ఉండొచ్చు. లేకపోతే మనం ఖాళీగా ఉన్నాం కదా అని మనల్ని ఆ సినిమా కోసం అడిగి ఉండొచ్చు. అందుకే ఏ సక్సెస్ అయినా ‘నాది’ అనుకోను. అది అందరిదీ... ఆ టైమ్దీ అనుకుంటాను. ‘నా వల్ల, నేను’ అనే ఆలోచన మైండ్‌కి వస్తే.. మనం అయిపోయినట్లే. అది చాలా డేంజరస్ ఇగో. మీకు చిన్నప్పట్నుంచీ ‘ఇగో’ లేదా? వెంకటేష్: నిరాడంబరంగా ఉండటం అనేది మా అమ్మానాన్నల జీన్స్ నుంచి సంక్రమించినది. తనో పెద్ద నిర్మాత అని నాన్నగారు ఎప్పుడూ ఫీలవ్వలేదు. అమ్మ చాలా నిరాడంబరంగా ఉంటుంది. నా బ్రదర్, సిస్టర్ కూడా చాలా సింపుల్ పీపుల్. నాది, నేను.. అనే ఆలోచన నాకు రాకపోవడం నా అదృష్టం. ఇంకో విషయం ఏంటంటే.. ఇగో ఉన్నవాళ్లని కూడా నేను నిందించను. ఎవరైనా ఎప్పుడైనా అగ్రెసివ్‌గా బిహేవ్ చేశారనుకోండి.. నేను వాళ్లని కామెంట్ చేయను. అప్పటి తన పరిస్థితి వల్ల, టైమ్ వల్ల, తను నేర్చుకున్న విషయాల ద్వారా అతను అలా చేశాడని అనుకుంటాను. అందుకే నేనెవరి మీద జడ్జ్మెంట్ పాస్ చేయను. అలాగే, ఎవరైనా తప్పు చేస్తే.. వెంటనే కాకుండా ఆ తర్వాత రియాక్ట్ అవ్వాలనేది నా సిద్ధాంతం. సో.. ఎవరి గురించీ తప్పుగా ఆలోచించరన్నమాట.. అయితే మీరు తప్పులు కూడా చేయరా? వెంకటేష్: సాధ్యమైనంతవరకు నేనవెరి గురించీ తప్పుగా ఆలోచించను. ఒకవేళ ఎవరైనా తప్పులు చేసినా.. ఏమో వాళ్లు ఏ పరిస్థితిలో ఉన్నారో అనుకుంటా. ఇక, తప్పులు చేయరా? అనడిగారు. గొప్ప గొప్పవాళ్లూ తప్పులు చేస్తారు. కానీ, ఒక్కోసారి సాదాసీదా వ్యక్తులు కూడా గొప్పగా ఆలోచిస్తారు. అదే జీవితం. కానీ తప్పులు చేయని మానవులు ఉండరు. ఓకే.. ఇప్పుడు మళ్లీ ‘ఆధ్యాత్మికత’ విషయానికొద్దాం.. అసలు మీకీ వైపుగా దృష్టి మళ్లడానికి గల కారణం ఏదైనా ఉందా? వెంకటేష్: నా సినిమాలు ఘనవిజయం సాధించినప్పుడు కూడా నేను మామూలుగా ఉండేవాణ్ణి. ఏదీ పెద్దగా ఆనందాన్నిచ్చేది కాదు. ఒకానొక దశలో ‘ఏంటి ఇలా ఉంటున్నాం. అన్నిటికీ సమానంగా స్పందిస్తున్నాం. అసలు మనం ఏంటి? మనం ఎవరు?’ అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఆ ప్రశ్నలు ఆధ్యాత్మిక బాటలో మళ్లేలా చేశాయి. ‘ప్రేమించుకుందాం రా’ సమయంలో ఈ మార్పు మొదలైంది. ఆ ఆధ్యాత్మిక ప్రయాణం అలా నిరాటంకంగా సాగుతోంది. జనరల్‌గా ఫిఫ్టీ ప్లస్‌లో ఆధ్యాత్మిక బాటలోకి వెళుతుంటారని అంటుంటారు. కానీ, మీరు చిన్న వయసులోనే ఇటువైపు ఎట్రాక్ట్ అయ్యారు... వెంకటేష్: ఆధ్యాత్మికతకు వయసుతో సంబంధం లేదు. మనం అన్ని విషయాల మీద అవగాహన పెంచుకున్న తర్వాత, ‘మనం అనుకున్నదే కరెక్ట్’ అనే భావనలో పడిపోతాం. అప్పుడు ఏ బాటలోనూ అంత సులువుగా వెళ్లలేం. చిన్నపిల్లలను ఓ ఉదాహరణగా తీసుకుందాం. వాళ్లు ఏదైనా త్వరగా నేర్చేసుకుంటారు. ఎందుకంటే, వాళ్లకి ‘నేను’ అనేది తెలియదు. వాళ్ల గురించి వాళ్లు ఒక ఇమేజ్‌లో పడిపోరు. అందుకే ‘నేను’ అనే భావన పెరిగేలోపే ఈ బాటలో వెళ్లాలి. ఎందుకంటే, ఆ తర్వాత వెళ్లలేం. అంతే తప్ప, అన్నీ అనుభవించేసిన తర్వాత చూద్దాంలే అనుకుంటే కరెక్ట్ కాదు. ‘ఆధ్యాత్మికం’ అంటారు కానీ, ఆడంబరాలు మాత్రం వదులుకోలేదని మీపై ఓ విమర్శ ఉంది. ఎందుకంటే, మణికొండ ఏరియాలో వైభవంగా ఇల్లు కట్టించుకున్నారు కదా? వెంకటేష్: ఆధ్యాత్మికం అంటే నిరాడంబరంగా ఉండాల్సిన అవసరం లేదు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు రాజ్యాలే ఏలారు. వైభవాలను అనుభవించారు. అదే విధంగా అంతర్గతంగా తామేంటో తెలుసుకున్నారు. శాశ్వతం, అశాశ్వతాలకు వ్యత్యాసాన్ని తెలుసుకున్నారు. దీన్నే ‘రాయల్ మిడిల్ పాత్’ అంటాం. ఆధ్యాత్మికం అంటే.. అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోవడం కాదు. నేనిక్కడ పుట్టాను కాబట్టి.. ఇక్కడ ఉండాల్సిందే. ఒకవేళ నేను అడవిలో ఎవరికో పుట్టి ఉంటే.. ఆ పరిస్థితులకు తగ్గట్టు ఉండి ఉండేవాణ్ణి. ఏది దొరికిందో అది యాక్సెప్ట్ చేస్తూ.. అది చేసుకుంటూ వెళ్లడమే. ఆధ్యాత్మిక బాటలో వెళ్లేవాళ్లు సంపాదించకూడదు, వాళ్లకి కుటుంబం ఉండకూడదు అనుకుంటే తప్పు.. ఇవేవీ లేకుండా ఉండాల్సిన అవసరంలేదు. నేనేం సన్యాసిని కాదు కదా. మీరిలా ‘నిజం తెలుసుకోవాలి.. నేనెవర్నో తెలుసుకోవాలి’లాంటివి మాట్లాడినప్పుడు మీ ఇంట్లోవాళ్లు భయపడలేదా? వెంకటేష్: మొదట్లో భయపడ్డారనుకుంటా! అయితే, ఆ తర్వాత వాళ్లు నా లైఫ్‌స్టయిల్‌ని గమనించారు. హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నానని, చక్కగా సంపాదించుకుంటున్నానని, కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నానని... అర్థం చేసుకున్నాక రిలాక్స్ అయ్యారు. మీ నలుగురు పిల్లల దగ్గర ఆధ్యాత్మికత గురించి మాట్లాడుతుంటారా? వెంకటేష్: కొన్ని బోధిస్తాను. గైడ్ చేస్తాను. కానీ, నా అభిప్రాయాలను వాళ్ల మీద రుద్దను. ఇది ‘మెటీరియలిస్టిక్ వరల్డ్’ కాబట్టి.. ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదు?లాంటివి చెబుతుంటాను. అలాగే వాళ్ల అనుభవాల ద్వారా కూడా జీవితం మీద అవగాహన కలిగించుకోవాలనుకుంటాను. చెప్పాల్సిన విషయాలు సరైన టైమ్‌లో చెప్పకపోతే ‘అయ్యయ్యో.. అప్పుడు చెప్పి ఉంటే బాగుండేది కదా’ అనుకోవాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడు చెప్పాల్సినది అప్పుడు చెప్పెయ్యాలి. చిన్నప్పుడు మీరు యాక్ట్ చేశారు కదా.. మరి.. మీ అబ్బాయి (అర్జున్ రామ్‌నాథ్)ని చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎందుకు చేయించలేదు? వెంకటేష్: టైమ్ రావాలి. వాడూ ఏదో ఒకటి చేస్తాడు. చూద్దాం.. ఏం చేస్తాడో? ఇప్పుడు వాడికి పదేళ్లు. నేను నిర్మాత కొడుకుని. వాడు స్టార్ కొడుకు. వాడి ఆలోచనలు ఎలా ఉంటాయో చూడాలి. భవిష్యత్తులో తనేం అవుతాడో తనే డిసైడ్ చేసుకుంటాడు. మీ పిల్లలు సింపుల్‌గానే ఉంటారా... స్టార్ కిడ్స్ స్టేటస్‌కి తగ్గట్టుగా ఉంటారా? వెంకటేష్: వాళ్లు చాలా ‘సింపుల్ చిల్డ్రన్’. నా పిల్లలే కాదు.. ఎవరైనా సరే సింపుల్‌గానే ఉండాలంటాను. నా పిల్లలు ‘వండర్ఫుల్’. వాళ్ల వల్ల నాకు, నా భార్యకూ ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. మీ పిల్లలను ఎప్పుడూ చూడలేదు కాబట్టి.. వాళ్లల్లో మీ మేనరిజమ్స్ గురించి చెప్పలేం. కానీ, నాగచైతన్య నడక, కొన్ని మేనరిజమ్స్ మీలానే ఉంటాయి. ఓ మేనమామగా మీ ఫీలింగ్? వెంకటేష్: వండర్ఫుల్ ఫీలింగ్. నాగచైతన్య ‘నైస్ బోయ్’. నా సిస్టర్ (నాగచైతన్య తల్లి లక్ష్మి)కి నేను చాలా క్లోజ్. అలానే చైతన్య! ‘ఐయామ్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్’. ఆ మాటకొస్తే.. ‘ఐయామ్ ఓపెన్ టు ఎవ్రిబడీ’. సినిమాలు కాకుండా మీకు నచ్చేవి? వెంకటేష్: చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. ఎందుకంటే, వాళ్లకి కల్లా కపటం తెలియదు. ఇగోలు, ఇండివిడ్యువాలిటీ ఉండవు. అలాంటివాళ్లతో గడపడం నాకిష్టం. పిల్లలు దైవసమానులని నా ఫీలింగ్. 27ఏళ్ల కెరీర్ గ్రాఫ్ మీది. ఇన్నేళ్లు నిరాటంకంగా కొనసాగడం ఎలా ఉంది? వెంకటేష్: ఇదంతా బోనస్సే. ఎందుకంటే, ఏదైనా ఉద్యోగం లేదా వ్యాపారంతో.. ఎంతో కొంత డబ్బు సంపాదించుకునేవాణ్ణేమో. కానీ, దేవుడు నాకు చాలా ఇచ్చాడు. అందుకే ఎప్పుడో శాటిస్ఫేక్షన్ వచ్చేసింది. మీరెప్పుడూ దేనికీ బానిస అవ్వలేదా? వెంకటేష్: ఆధ్యాత్మికతకు బానిస అయ్యాను. ఇప్పుడు ఫర్వాలేదు కానీ.. ఒకప్పుడు ఎప్పుడు ఎక్కడికెళ్లాలనిపిస్తే.. అక్కడికి వెళ్లిపోయేవాణ్ణి. రిషికేష్, హిమాలయాస్... అప్పటికప్పుడు అనుకోవడం... వెళ్లిపోవడం. అంతే. అక్కడికి వెళితే ఏవో నిజాలు తెలుస్తాయని.. జీవిత సత్యాలు తెలుస్తాయని ఆరాటం. కానీ, ఇప్పుడు అది లేదు. కళ్లు మూసుకుని, హిమాలయాలు ముందున్నట్లుగా ఊహించుకోగలను. దేవుడు నా చుట్టుపక్కలే ఉన్నాడని ఊహించగలను. అంత పరిపక్వత వచ్చేసింది. మళ్లీ సినిమాల్లోకి వద్దాం... మీరు చేసిన సినిమాల్లో ‘సక్సెస్ రేట్’ ఎక్కువ. కానీ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలతో పోల్చితే మీకు అభిమానుల సంఖ్య తక్కువ. ఎందుకలా? వెంకటేష్: ఈ మాట నాతో చాలామంది అంటారు. 99వ రోజున థియేటర్లోంచి తీసేసిన నా సినిమాలు చాలా ఉన్నాయి. అభిమానులు వచ్చి అడిగితే, ‘అభిమానంతో మీరు ఇన్నాళ్లు చూశారు. నాకది చాలు’ అని చెప్పేస్తుంటాను. అంతకుమించి నేను రికార్డ్స్ గురించి ఆలోచించడం కానీ, అభిమానులను ఎంకరేజ్ చేయడం కానీ చేయలేదు. అఫ్కోర్స్.. ఇతర హీరోలు అలా చేశారని చెప్పడంలేదు. నేను నా గురించి చెప్పుకుంటున్నాను. ఏదీ శాశ్వతం కాదని నమ్ముతాను కాబట్టి.. రికార్డ్స్ గురించి పెద్దగా పట్టించుకోను. నాకెంతమంది అభిమానులు ఉండాలని రాసిపెట్టి ఉందో అంతమందే ఉంటారు. ఈ 16కి రామానాయుడుగారు నిర్మాతగా 50ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు.. మీరేం బహుమతి ఇవ్వాలనుకుంటున్నారు? వెంకటేష్: బహుమతులు ఇచ్చి, పుచ్చుకోవడం మాకు అలవాటు లేదు. ‘ఈరోజు ప్రత్యేకం’ అని నేనెప్పుడూ అనుకోను. అన్ని రోజులూ అలానే ఉంటే ఏం? అనుకుంటాను. కాకపోతే, ఒక్కోసారి సెలబ్రేషన్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. వాటిని కాదనను. ఓ పది, పదిహేనేళ్ల తర్వాత రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తారా? వెంకటేష్: ఆలోచిస్తాను. కానీ, ఏదీ మన చేతుల్లో ఉండదని కూడా తెలుసు. అప్పట్లో ఒకసారి శోభన్‌బాబుగారి దగ్గర ‘నాకు రిటైర్ అవ్వాలనే ఆలోచన వస్తోంది’ అన్నాను. కానీ, ఇప్పుడే కాదు... దానికి ఇంకా చాలా టైముంది అన్నారాయన. ఆ తర్వాత ఎప్పుడూ దాని గురించి ఆలోచించలేదు. ఎందుకంటే, మనం అనుకున్నదేదీ జరగదని నాకు తెలుసు. భవిష్యత్తు గురించి ఊహలు, కలలు వేస్ట్ అంటారా? వెంకటేష్: వేస్ట్ అనే అంటాను. రేపు గురించి ఆలోచిస్తూ కూర్చుంటే, ఇవాళ సగం ఎనర్జీని వేస్ట్ చేసుకున్నట్లే. భవిష్యత్తులో ఏం జరగాలని ఉంటే అది జరుగుతుంది. కానీ అనవసరంగా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించి, ఈరోజు సగం ఎనర్జీని వేస్ట్ చేసేసుకుంటాం. అసలు, మనిషికి మనశ్శాంతి తగ్గేది ఎక్కువగా భవిష్యత్తు గురించి ఆలోచించడంవల్లే. అందుకే, ఈరోజుని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. ఫైనల్‌గా... ఓ వ్యక్తిగా మీ జర్నీ గురించి ఏం చెబుతారు? వెంకటేష్: వండర్ఫుల్ జర్నీ. నా జీవితం గురించి నాకెలాంటి కంప్లయింట్స్ లేవు. ఇటు సినిమా పరిశ్రమ, అటు ప్రేక్షకుల ద్వారా నాకెలాంటి చేదు జ్ఞాపకాలు లేవు. కెరీర్ చాలా స్మూత్‌గా వెళ్లడం చాలా ఆనందంగా ఉంది. సో.. నాకంతా బోనస్‌లా ఉంది! - డి.జి. భవాని అప్పట్లో నా చెయ్యి మెడ దగ్గరకు వెళితే... యూనిట్ అంతా పరార్! సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో నాకు కొంచెం కోపం ఎక్కువగా ఉండేది. అయితే అది అప్పటి పరిస్థితి వల్ల. అప్పట్లో నా మెడకు దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తాలూకు ప్రభావం నా మీద చాలా ఉండేది. ఆ ఇరిటేషన్లో కోపంగా ఉండేవాణ్ణి. (నవ్వుతూ) అప్పట్లో నా చెయ్యి మెడ దగ్గరకు వెళితే.. యూనిట్ అంతా పరార్. అందులోనూ ఆ రోజుల్లో నాకు తెలుగు సరిగ్గా వచ్చేది కాదు.. నచ్చని సీన్స్ ఒకవైపు, నొప్పి ఒకవైపు, దాంతో సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోయేవాణ్ణి. అయితే ఆ కోపం అంతా నా ఆరోగ్య పరిస్థితి వల్లే. అందుకే, అంటాను.. ఎవరికైనా కోపం వస్తే.. ఆ వ్యక్తికి ఎందుకు కోపం వచ్చింది? అతను ఏ పరిస్థితిలో ఉన్నాడో అని ఆలోచించాలి. అంతేకానీ, తొందరపడి ఆ వ్యక్తి గురించి ఓ నిర్ణయానికి వచ్చేయకూడదు. ************* కష్టాల్లో ఉన్నప్పుడే దేవుడు గుర్తొస్తాడు చాలామందికి. కానీ, ఎప్పుడూ ఆ దేవుడి గురించి ఆలోచిస్తే.. ఆపదలో ఉన్నప్పుడు వస్తాడు. కష్టాలొచ్చాయి కదా అని గుడికెళితే, ఎందుకు రెస్పాండ్ అవుతాడు? అందుకే, ఆ దేవుడు మనపక్కనే ఉన్నాడని ఎప్పుడూ అనుకోవాలి. ఎక్కడో లేడు.. మనలోనే ఉన్నాడనుకునేంత పరిపక్వత వస్తే.. ఇన్నర్‌గా చాలా బలంగా ఉంటాం. ఒక బుక్‌షాప్‌కి వెళ్లారనుకోండి.. త్వరగా డబ్బు సంపాదించడం ఎలా?, సక్సెస్ అవ్వడం ఎలా? అనే పుస్తకాలను కొంటుంటారు. వాటితో పాటు ఆధ్యాత్మికతకకు సంబంధించిన బుక్స్ కూడా కొనుక్కోవచ్చు కదా. కొంచెం జ్ఞానం సంపాదించుకుంటే ఏం పోతుంది? ఆధ్యాత్మిక సైడ్ వెళ్లిపోతే బద్ధకించేస్తాం. పనీ పాటా చెయ్యం అని కొంతమంది ఊహిస్తారు. అది తప్పు. ఈ బాటలో వెళ్లడంవల్ల ఇంకా షార్ప్ అవుతాం. నన్ను తీసుకోండి.. హాయిగా సినిమాలు చేసుకుంటున్నాగా.. బాగానే సంపాదిస్తున్నాగా. మనం అవతలివాడి గురించే ఎక్కువ ఆలోచిస్తాం. వాడికి సలహా ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఈ ప్రపంచంలో వచ్చే సమస్యలన్నీ ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించడంవల్లే అని నా అభిప్రాయం. మొదట్లో ఏడుపు సీన్స్‌లో చేసేటప్పుడు... చిన్నప్పుడు చనిపోయిన నా ఫ్రెండ్‌ని తల్చుకునేవాణ్ణి. అప్పుడప్పుడు ఎస్వీ రంగారావుగారు, కైకాల సత్యనారాయణగారు, కమల్హాసన్గారిలాంటివాళ్లు చేసిన ఎమోషనల్ సీన్స్‌ని గుర్తు చేసుకుంటుంటాను. ************** ‘చంటి’ చేసేటప్పుడు చాలామంది నవ్వారు. ‘పాపం మీవాడు రిస్క్ తీసుకుంటున్నాడు’ అని నాన్నగారితో అన్నారు. అందరూ ఇలా అంటున్నారేంటి? అని నేను కూడా కొంచెం సందేహపడ్డాను. అద్దం ముందు నిలబడి, సైడ్ పాపిడి తీసి, మొహానికి చిన్న బొట్టు పెట్టుకుని, అమాయకంగా మొహం పెట్టి, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ట్రై చేసేవాణ్ణి. ‘బాగానే ఉంది కదా’ అనిపించి, ఆ సినిమా చేయడానికే నిర్ణయించుకున్నాను. ఓ నమ్మకంతో ‘చంటి’ చేశాను. ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు. కొత్త తరంవారికి నా బొబ్బిలి రాజా, ప్రేమించుకుందారా, రాజా సినిమాలు తెలియదు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటివే తెలుసు. పదేళ్లలోపు పిల్లలు కూడా నన్ను ‘పెద్దోడు’ అంటున్నారు. సో.. న్యూ జనరేషన్‌కి రీచ్ అవుతున్నానని ఆనందంగా ఉంది. అసలు తను మనలోనే ఉన్నాడని చాలామంది అర్థం చేసుకోవడంలేదు. దేవుణ్ణి మనం బయటపెట్టుకుంటే తను అక్కడే ఉండిపోతాడు. లోపలికి తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. మానవులు ఎప్పుడూ ఏదో కోరుతుంటారని దేవుడు పైకి వెళ్లిపోయాడు. అక్కడున్నా మానవులు వదల్లేదు. ఆ తర్వాత నీళ్ల లోపలకి కూడా వెళ్లిపోయాడు. అక్కడా వదిలిపెట్టలేదు. ఇక లాభం లేదని, ఇంతకంటే సేఫ్ ప్లేస్ లేదని మనలోనే ఉండిపోయాడు. అది తెలుసుకోలేక మనం బయట వెతుకుతున్నాం. అదే మనలోనే ఉన్నాడని గ్రహిస్తే... దేవుడు మనవాడే అనే ఫీలింగ్ కలుగుతుంది. మనం ‘గాడ్ ఫియరింగ్ నుంచి గాడ్ లవింగ్ అవ్వాలి’. అప్పుడు ఇక, మనకేం భయం లేదనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. -
భర్త, పిల్లలు, హాబీలు.. అన్నీ సినిమానే..!
ఆడవాళ్లకు సినిమా పరిశ్రమలోనే కాదు, దేవాలయాల్లాంటి ప్రదేశాలలో కూడా చేదు అనుభవాలు ఎదురౌతున్నాయి. - కోట్ బై కోవై సరళ ‘ప్రేమించడం హత్య చేసినంత మహా పాపం’. - కోట్ బై కోవై సరళ జీవితంలో ఎవరూ ఎవరి మీదా ఆధారపడకూడదు. - కోట్ బై కోవై సరళ సినిమాలే నా లైఫు, పర్సనల్ లైఫూ. - కోట్ బై కోవై సరళ కోట్ బై అని అంతా చెప్పుకునే స్థాయిలో చాలా పెద్ద జీవితాన్ని చూశారు కోవై సరళ! సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లోనే... జీవితం ఆమెను రెండు వైపుల నుంచి నొక్కేసింది! ఏం చెప్పినా చిటికెలో చేసేస్తుంది - ఒకవైపు ఆ అమ్మాయి ఉంటే మేం చెయ్యం - రెండో వైపు. ఇవాళ పిలిచి అడ్వాన్స్ ఇచ్చేవాళ్లు - ఒకవైపు మర్నాడు ఫోన్ చేసి ఇచ్చేయ్మనేవాళ్లు - రెండో వైపు. ఇంకా... ఇలాంటివే చాలా, చాలా, చాలా. అన్నిటినీ తట్టుకుని నిలబడ్డారు కోవై సరళ. ఈవారం ‘తారాంతరంగం’ చదవండి. అవడానికి కమెడియనే అయినా... ఆమె ప్రతి అనుభవంలో మీకు హీరోయినే కనిపిస్తుంది! ఎస్. వడివేలును కుమ్మినట్లు... పరిస్థితులతో తలపడి నిలబడిన ప్రతి స్త్రీ... హీరోయినే. సరళగారూ... మీ ఇంటి పేరు కోవైనా? కోవై సరళ: కాదు. మా తమిళంవాళ్లకి ఇంటి పేర్లుండవు. నాన్నగారి పేరు ఇంటిపేరు అవుతుంది. మా సొంత ఊరు కోయంబత్తూర్. ఆ సిటీని ‘కోవై’ అని పిలుస్తారు. ఆ ఊరినుంచి వచ్చిన అమ్మాయిని కాబట్టి, పత్రికలవాళ్లు కోవై సరళ అని రాయడం మొదలుపెట్టారు. దాంతో అది పాపులర్ అయిపోయింది. అయితే పుట్టి పెరిగిందంతా కోయంబత్తూర్లోనేనా? కోవై సరళ: అవును. నా బాల్యం, చదువూ అంతా అక్కడే. ప్లస్ టూ వరకూ చదివా. ఇంగ్లిష్, తమిళ్లో టైప్‌రైటింగ్ హయ్యర్ పాసయ్యాను. అప్పట్లో నేను టైప్ చేస్తుంటే.. అందరూ ఆశ్చర్యంగా చూసేవాళ్లు. అంత స్పీడ్ అన్నమాట. నాకు చిన్నప్పట్నుంచీ సినిమాలంటే ఇష్టం. ప్లస్ టు తర్వాత సినిమాల్లోకి వెళదామనుకున్నాను కానీ ఇంట్లో ఒప్పుకోలేదు. మీ నాన్నగారు ఏం చేసేవారు? సరళ: లారీలు, బస్సులు ఉండేవి. ఆ బిజినెస్‌లో నష్టం వచ్చిన తర్వాత ఆయన ఓ ప్రైవేట్ ఉద్యోగంలో చేరారు. మా నాన్న మిలిటరీలో కూడా చేశారు. దాంతో స్ట్రిక్ట్‌గా ఉండేవారు. చిన్న పనైనా ఓ పద్ధతి ప్రకారం చేయాలనేవారు. సినిమాలకు వెళ్లనిచ్చేవారు కాదు. స్కూల్, ఇల్లు, టైప్‌రైటింగ్ క్లాస్ తప్ప వేరే ప్రపంచం తెలియదు. మీకు బ్రదర్స్, సిస్టర్స్ ఉన్నారా? సరళ: నలుగురు అక్కయ్యలు, ఓ అన్నయ్య. నాన్నగారు స్ట్రిక్ట్ అయినప్పటికీ నాకేదైనా కావాలంటే మారాం చేసి, మంకు పట్టు పట్టి మరీ సాధించుకునేదాన్ని. డ్రామాల్లో అయినా యాక్ట్ చేయనివ్వాలంటూ స్ట్రైక్ చేశాను. అయినా నాన్న మనసు కరగలేదు. దాంతో ఓ రోజంతా ఉపవాసం ఉన్నాను. ఇక, లాభం లేదనుకుని అనుమతించారు. ఒక డ్రామాలో యాక్ట్ చేశా. భలే అనిపించింది. అమ్మానాన్నను బతిమాలుకుని ఎలాగోలా 20 డ్రామాల్లో యాక్ట్ చేసేశాను. డ్రామాల ద్వారా సంపాదించిన అనుభవంతో సినిమాల్లో యాక్ట్ చేయొచ్చన్నది నా అభిప్రాయం. మరి... సినిమాల్లోకి రావడానికి ఎంత పెద్ద స్ట్రయిక్ చేశారేంటి? సరళ: లక్కీగా అలా చేయాల్సిన అవసరంలేదు. డెరైక్టర్ భాగ్యరాజాగారి ఇల్లు మా ఇంటి పక్కనే. నేను చిన్నప్పట్నుంచీ ఆయనకు తెలుసు. ‘‘పెద్దయిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నావు?’’ అని ఆయన అడిగితే.. ‘సినిమా యాక్టర్’ అవుతా అనేదాన్ని. సినిమాల్లోకి రాకముందు భాగ్యరాజాగారు డ్రామాలు వేసేవారు. సినిమా డెరైక్టర్ అయిన తర్వాత, మా నాన్నగారికి ఆరోగ్యం బాగా లేకపోతే భాగ్యరాజాగారు చూడ్డానికి వచ్చారు. నన్ను చూసి, ‘‘ఏం చేస్తున్నావ్’’ అనడిగితే, ై‘టెప్రైటింగ్’ చేస్తున్నా అని చెప్పాను. ‘‘నేను ‘ముందానై ముడిచ్చు’ అనే సినిమా చేస్తున్నా. గోపిచెట్టిపాల్యంలో షూటింగ్ జరుగుతోంది. అక్కడికొస్తే, నీకు మంచి కేరక్టర్ ఇస్తాను’’ అన్నారాయన. చెప్పింది భాగ్యరాజాగారు.. పైగా సినిమాల మీద నా పిచ్చి బాగా ముదిరిందని గ్రహించి, పెద్దగా బతిమాలించుకోకుండానే అమ్మానాన్న పర్మిషన్ ఇచ్చారు. దాంతో హుషారుగా కోయంబత్తూర్ టు గోపిచెట్టిపాల్యం బస్సెక్కేశా. ఫస్ట్ టైమ్ షూటింగ్ ఎలా అనిపించింది? సరళ: అప్పటివరకు నాది చాలా చిన్నప్రపంచం. లొకేషన్లో చాలామందిని చూసి, ఆశ్చర్యం అనిపించింది. కానీ భయపడలేదు. యాక్టింగ్ అంటే ఇంట్రస్ట్ కాబట్టి, తడబడకుండా చేసేశాను. ‘ముందానై ముడిచ్చు’ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. వెంటనే బోల్డన్ని అవకాశాలు వచ్చి ఉంటాయేమో? సరళ: ఫలానా కేరక్టర్ చేసింది ఎవరు? అంటూ కొంతమంది దర్శక, నిర్మాతలు ఆరా తీశారు. అయితే నేను ‘ముందానై ముడిచ్చు’ సినిమా చేసి, కోయంబత్తూర్‌లోనే ఉండిపోయాను. అందుకని, నన్ను కాంటాక్ట్ చేయలేకపోయారు. ఆరు నెలలు గడిచిన తర్వాత ఇలా అయితే లాభం లేదనుకుని మద్రాసు వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఊరు కాని ఊరికి పంపించడానికి ఇంట్లోవాళ్లు భయపడలేదా? సరళ: నాతో పాటు నాన్నగారు కూడా వచ్చారు. మద్రాస్‌లోని తేనాంపేటలో ఓ చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాం. ఇక, నేను మద్రాసు వచ్చానని తెలుసుకుని, చాలామంది అప్రోచ్ అయ్యారు. ‘కళ్యాణరామన్’, ‘ఉయిరే ఉనక్కాగ’... ఇలా నేను చేసిన సినిమాలన్నీ వంద రోజులాడటం, నా కామెడీ నచ్చడంతో పాపులర్ అయ్యాను. అసలు సినిమాల మీద మీకు ఇష్టం ఏర్పడటానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? సరళ: నేను ఎమ్జీఆర్‌కి వీరాభిమానిని. ఇంట్లో సినిమాలు చూడనిచ్చేవాళ్లు కాదని చెప్పాను కదా. అప్పుడప్పుడు గొడవపడో, బతిమాలుకునో ఎమ్జీఆర్ సినిమాకెళ్లేదాన్ని. తెరపై ఆయన కనిపించగానే అభిమానులు విజిల్స్ వేయడం, ఆరాధనగా చూడటం భలే అనిపించేది. మనం కూడా సినిమా ఆర్టిస్ట్ అయితే అలానే చూస్తారుగా అనుకునేదాన్ని. సో.. నేను ఆర్టిస్ట్ అవాలనుకోవడానికి ఓ కారణం ఎమ్జీఆర్ అనే చెప్పాలి. అది సరే... ఎవరైనా హీరోయిన్ అవ్వాలనుకుంటారు... మీరు కామెడీనే ఎందుకు టార్గెట్ చేశారు? సరళ: నా టార్గెట్ హీరోయినా, కమెడియనా, కేరక్టర్ ఆర్టిస్టా? అని కాదు. స్క్రీన్ మీద నా మొహం కనిపిస్తే చాలనుకున్నాను. పబ్లిక్‌లో కనిపించినప్పుడు ‘అదిగో కోవై సరళ...’ అని నన్ను గుర్తుపడితే ఈ జన్మ సార్ధకమైనట్లు అనుకునేదాన్ని. ఒకవేళ నేను హీరోయిన్‌కి టార్గెట్ చేసి, పరిస్థితుల ప్రభావం వల్ల కామెడీతో సరిపెట్టుకోవాల్సి వస్తే... చాలా అప్సెట్ అయ్యుండేదాన్ని. మీరు రంగప్రవేశం చేసే నాటికి కమెడియన్‌గా, కేరక్టర్ ఆర్టిస్ట్‌గా మనోరమ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. మరి... మీకేమైనా అభద్రతాభావం, భయం ఉండేవా? సరళ: నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ. సీన్ ఇలా చెప్పగానే అలా చేసేదాన్ని. చెట్లెక్కమంటే ఎక్కేసేదాన్ని, పై నుంచి దూకమంటే అమాంతంగా దూకేసేదాన్ని. దాంతో కోవై సరళ ఏం చెప్పినా, చిటెకెలో చేసేస్తుందని ప్రచారం జరిగింది. అలాగే నేను చేసే కామెడీ కూడా ప్రేక్షకులకు నచ్చడంతో అవకాశాలకు కొదవ ఉండేది కాదు. అందుకే, మనం పెట్టే బేడా సర్దుకుని కోయంబత్తూర్ వెళ్లాల్సి వస్తుందేమోననే భయం ఉండేది కాదు. మనోరమ.. ఆ తర్వాత మీరు... మీ తర్వాత పెద్దగా హాస్యనటీమణులు రాణించకపోవడానికి కారణం ఏంటి... మగవాళ్లల్లో చాలామంది కమెడియన్లు ఉన్నారు కదా? సరళ: తమిళ పరిశ్రమకు సంబంధించినంతవరకు మగవాళ్ల డామినేషన్ ఉంటుంది. లేడీస్‌కి తక్కువ ప్రోత్సాహం ఉంటుంది. అందుకే, మా తర్వాత లేడీ కమెడియన్స్ షైన్ అవలేదు. ఒకరిద్దరు వచ్చినా, పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వలేకపోయారు. ఒకవేళ ఇన్వాల్వ్ అయినా ఎంకరేజ్మెంట్ లభించలేదు. నిజం చెప్పండి... ఇక్కడ మీకేమైనా చేదు అనుభవాలు ఎదురయ్యాయా? సరళ: నన్ను పైకి రానివ్వకుండా చేయాలని కొంతమంది ట్రై చేశారు. ‘ఆ అమ్మాయి ఉంటే మేం సినిమా చెయ్యం’ అని నిర్దాక్షిణ్యంగా చెప్పేవాళ్లు. దాంతో నాకు కొన్ని అవకాశాలు పోయేవి. అలా చేసినవాళ్లెవరు?... ఆ డామినేషన్‌ని తట్టుకోవడానికి మీరేం చేసేవారు? సరళ: పేర్లు చెప్పను. నేను కామెడీ ఆర్టిస్ట్‌ని కాబట్టి, నా అవకాశాల విషయంలో హీరోల జోక్యం ఉండదు కదా. కొంతమంది కమెడియన్లే నాతో యాక్ట్ చేయకూడదనుకునేవాళ్లు. అయినా నా పని నేను చేసుకునేదాన్ని. ఓ పది సినిమాలు చేతిలో ఉన్నప్పుడు ఒకటీ రెండు సినిమాలు పోతే ఏమవుతుంది? అడ్వాన్స్ తీసుకున్న తర్వాత కూడా వెనక్కి వెళ్లిన అవకాశాలు ఉన్నాయా? సరళ: చాలా ఉన్నాయి. 30 ఏళ్ల క్రితం వెయ్యి రూపాయలంటే పెద్ద విషయం. అప్పట్లో నేనో సినిమా కమిట్ అయ్యానంటే, వెయ్యిరూపాయలు అడ్వాన్స్ ఇచ్చేవారు. అయితే కొంతమంది కమెడియన్లు నేనుంటే.. యాక్ట్ చెయ్యనని చెప్పేయడంతో ఇచ్చిన అడ్వాన్స్‌ని వెనక్కివ్వమని అడిగేవాళ్లు. ఒక సినిమాకి అవకాశం వస్తే.. సంతోషంతో నాకా రోజంతా నిద్రపట్టేది కాదు. కానీ, ఉదయమే అడ్వాన్స్ వెనక్కివ్వమని ఫోన్ రావడమో, డెరైక్ట్‌గా మనిషి రావడమో జరిగేది. అప్పుడు బాగా ఏడ్చేదాన్ని. ఆ సమయంలో మా నాన్నగారు ఇచ్చిన ధైర్యాన్ని నేనెప్పటికీ మర్చిపోలేదు. ‘మనకేది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది. నీకు టాలెంట్ ఉంది’ అంటూ ఊరడించేవారు. నాన్న ముందు కన్విన్స్ అయ్యేదాన్ని కానీ, ఒంటరిగా ఉన్నప్పుడు ఏడ్చేదాన్ని. ఆ బాధలో బ్యాక్ టు కోయంబత్తూర్ అనే నిర్ణయం ఎప్పుడైనా తీసుకున్నారా? సరళ: అంత పిరికిగా ఆలోచించలేదు. బాధపడుతూ ఇంట్లో కూర్చునేంత ఖాళీ ఉండేది కాదు. పైగా నేను చేసేది కామెడీ కాబట్టి.. షూటింగ్‌కి వెళ్లగానే బాధ తగ్గేది. అలాగే, ఇక్కడ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా. హాస్యనటుల కెరీర్ మహా అయితే 10, 15 ఏళ్లు ఉంటుంది. వాళ్లతో పోల్చితే నటీమణుల కెరీర్‌కి ఎక్కువ స్పాన్ ఉంటుంది. అందుకు ఉదాహరణ నా 30 ఏళ్ల కెరీరే. నా కళ్లముందే ఎంతోమంది మగ కమెడియన్లు వచ్చారు.. వెళ్లారు. కానీ, నేను మాత్రం అలానే ఉన్నాను. ఎంతమంది కమెడియన్లు వచ్చినా.. వాళ్లకి దీటుగా నిలబడగలననే విషయం నాకు చాలా త్వరగానే అర్థమైంది. దాంతో నా వెనక గోతులు తవ్వినా పట్టించుకునేదాన్ని కాదు. మహా అయితే నాలుగైదేళ్లు ఇతను ఉంటాడేమో.. కానీ మనకు లాంగెవిటీ ఉంటుందనే ఆత్మవిశ్వాసంతో ఉండేదాన్ని. అదే నిజమైంది. హాస్యనటుల కెరీర్ పదేళ్లే అని ఎలా అంటున్నారు... కోట, బ్రహ్మానందం, బాబుమోహన్, అలీ.. ఇలా చాలామంది ఏళ్ల తరబడి ఏలుతున్నారు కదా? సరళ: నేను చెప్పింది తమిళ పరిశ్రమ గురించి. నాకు తెలిసి తెలుగులో డెరైక్టర్, ప్రొడ్యూసర్, రైటర్స్ సెలక్ట్ చేసిన కమెడియన్లనే ఎన్నుకుంటున్నారనిపిస్తోంది. తమిళంలోలా ‘నేను కోవై సరళతో యాక్ట్ చేయను’ అని చెప్పే కమెడియన్లు ఇక్కడ లేరు. అందుకే, నాకిక్కడ అవకాశాలొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ‘సతీలీలావతి’లో మిమ్మల్ని కమల్‌హాసన్ హీరోయిన్గా ఎంపిక చేసినప్పుడు ఎలా అనిపించింది? సరళ: ఆయన సినిమాలో నేను కామెడీ కేరక్టర్స్ చేశాను.ఆ విధంగా కమల్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. నా మేనేజర్ వచ్చి ‘కమల్‌సార్ సరసన మీరు హీరోయిన్గా నటించాలి’ అన్నాడు. జోక్‌లేసి నవ్వించే నాకే జోక్ చెబుతున్నావా? అనడిగాను. ‘కాదు మేడమ్.. సీరియస్‌గానే చెబుతున్నా’ అనడంతో నమ్మకం కుదిరింది. ఆ సినిమా ఓ మర్చిపోలేని మంచి అనుభవం. మీకు బాగా పేరొచ్చాక కూడా, మిమ్మల్ని తొక్కాలని ఎవరైనా ప్రయత్నించారా? సరళ: ప్రయత్నించారు. అయితే నాకు పేరొచ్చేసింది కాబట్టి... మొహం మీద చెప్పేవాళ్లు కాదు. లేడీ కమెడియన్‌గా ఎవరు చేస్తున్నారు? అని అడిగి, ‘ఆవిడా.. అయితే మా డేట్స్ ఖాళీగా లేవు’ అని చెబుతుంటారు. ఆ విధంగా ఎవరెవరు చెబుతున్నారో నాకర్థమయ్యింది. అందుకని, నిర్మాతలను ఇబ్బందిపెట్టడం ఇష్టం లేక, ‘ముందు ఆ ఆర్టిస్ట్ దగ్గర డేట్స్ ఓకే చేయించుకోండి. ఒకవేళ ఆయన ఇస్తే.. నాకేం అభ్యంతరం లేదు’ అని చెబుతుంటాను. కానీ, ఆ నిర్మాతలు ఆ తర్వాత నాతో టచ్‌లోకి రారు. అది నేనూహించిందే కాబట్టి, నవ్వేసి ఊరుకుంటాను. ఎందుకని మీరంటే ఆ ‘కొంతమంది ఆర్టిస్ట్’లకు పడదు? సరళ: ఒకవేళ యాక్టింగ్‌లో డామినేట్ చేస్తాననో లేక వాళ్లకి ఈక్వల్‌గా యాక్ట్ చేస్తున్నాననే ఫీలింగ్ వల్లో... లేకపోతే ఇంకా ఏమైనా కారణాలున్నాయేమో నాకు తెలియదు. జనరల్‌గా సినిమా నిడివి ఎక్కువైతే.. కత్తెర పడేది దాదాపు కమెడియన్ల పాత్రలకే. మీ విషయంలో అలా జరిగిన సందర్భలున్నాయా? సరళ: లెక్కపెట్టలేనన్ని ఉన్నాయి. ఈ పాత్ర మనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని ఓ నమ్మకంతో చేసి, ఆ సినిమా విడుదల కోసం బాగా ఎదురు చూసేదాన్ని. కానీ, సినిమా నిడివి పెరిగినందున నా పాత్ర నిడివి ఆటోమేటిక్‌గా తగ్గిపోయేది. దాంతో రావాల్సినంత పేరు వచ్చేది కాదు. అప్పుడు చాలా నిరుత్సాహపడేదాన్ని. కొన్ని ఎదురు దెబ్బలు మనకు మంచి పాఠాలవుతాయి. ఆ పాఠాలు మన దిశను నిర్దేశిస్తాయి. ఆ విధంగా సినిమాల్లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే నేను ఎంచుకున్న దిశ ‘ఆధ్యాత్మికం’. ఏ వయసులో ఈ దారిని ఎంచుకున్నారు? సరళ: అది కరెక్ట్‌గా చెప్పలేను. చిన్నప్పట్నుంచే నా ఆలోచనలు ఆధ్యాత్మికంగా ఉండేవి. అయితే ఆ వయసులో దాని పేరు ఆధ్యాత్మికం అని తెలిసే అవకాశం లేదు కదా. పెద్దయిన తర్వాత వివేకానంద, ఓషో పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. ఆధ్యాత్మికతకు సంబంధించిన క్లాస్‌లకు వెళ్లేదాన్ని. ‘జీవితం నిరంతరం కాదు. ఎప్పటికైనా మట్టిలో కలవాల్సిందే. ఈ రోజు ఉన్నాం. రేపు ఉంటామో లేదో తెలియదు. అందుకని ఈరోజు నవ్వుతూ, హాయిగా ఉందాం. చుట్టుపక్కలవాళ్లని సంతోషపెడదాం’ అనేంత మానసిక పరిపక్వత నాలో రావడానికి కారణం ఆ పుస్తకాలే. ఓషో ద్వారా ఇంకా ఎలాంటివి తెలుసుకున్నారు? సరళ: ఉదాహరణకు చెయ్యి మీద పెద్ద దెబ్బ తగిలిందనుకుందాం. ‘రక్తం కారుతోంది’ అని మాత్రం అనుకుంటే, నొప్పి తెలియదు. బాగా నొప్పిగా ఉంది అనుకుంటే, నొప్పి తెలుస్తుంది. అసలు నొప్పే లేదనుకుంటే, నిజంగానే నొప్పి తెలియదు. నేనిది టెస్ట్ చేసి చూసుకున్నా. ఓషో బుక్స్ వల్ల దేన్నయినా తేలికగా తీసుకునే పరిపక్వత వచ్చేసింది. తెలుగులో మీ పాత్రలకు ఎంచక్కా డబ్బింగ్ చెప్పేస్తున్నారు. అసలు తెలుగు ఎలా నేర్చుకున్నారు? సరళ: నా డైలాగులన్నీ తమిళంలో రాసుకుని, బట్టీపట్టి లొకేషన్లో చెప్పేస్తుంటాను. తెలుగులో నేను డబ్బింగ్ చెప్పడానికి మొదటి కారణం కోడి రామకృష్ణగారు. ‘పెళ్లాం చెబితే వినాలి’ అప్పుడు ఆయన డబ్బింగ్ చెప్పమన్నారు.. ఆ సినిమాకి కో-డెరైక్టర్‌గా చేసిన రాధాకృష్ణ దగ్గరుండి మరీ నాతో డబ్బింగ్ చెప్పించారు. నాకు బాగానే పేరొచ్చింది.. కానీ నాతో డబ్బింగ్ చెప్పించి, ఆయనకు చుక్కలు కనిపించాయి (నవ్వుతూ). తెలుగు మాట్లాడటానికి నేను ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. తమిళ్ ఎలా మాట్లాడతానో అలాగే మాట్లాడేస్తాను. ఆ శ్లాంగ్ అందరికీ నచ్చడం నా లక్. మీ సినిమాల్లో కమెడియన్స్‌ని ఫుట్‌బాల్ ఆడేస్తుంటారు. అసలు ఈ కొట్టడం అనేది ఎవరితో మొదలైంది? సరళ: వడివేలుతో మొదలుపెట్టా. అది బాగా పండటంతో అప్పట్నుంచి నాతో కొట్టించడం ఆనవాయితీ అయ్యింది. ఈ కొట్టే ప్రక్రియ ఓవర్‌గా ఉంటుందనే విమర్శ ఉంది...? సరళ: ఏ కొద్దిమందో అంటున్నారేమో. కానీ, మొగుడూ పెళ్లాలూ కొట్టుకోవడం నేను రోడ్డు మీద చాలా చూశాను. మందు కొడితే చాలు.. మృగంలా మారిపోయి, భార్యలను రోడ్డు మీద కొట్టే మగవాళ్లను స్వయంగా చూశాను. అది తట్టుకోలేక తిరగబడ్డ ఆడవాళ్లనూ చూశాను. నేను కొట్టడం ఓవర్ అని మీరంటున్నారు. కానీ, చాలామంది ఆడవాళ్లు.. ‘‘మేడమ్... మీరే మాకు ఇన్స్పిరేషన్. మా మగవాళ్లు అడ్డదిడ్డంగా బిహేవ్ చేసినప్పుడు ‘కోవై సరళలా మారతాం... జాగ్రత్త అని బ్లాక్మెయిల్ చేస్తుంటాం’’ అంటుంటారు. మగవాళ్లకు నా మీద కోపం ఉంటుందేమో. కానీ, ఆడవాళ్లు తమను తాము రక్షించుకోవడం కోసం నా పేరు వాడుకోవడం నాకు బాగానే అనిపిస్తోంది. కొంచెం ఫ్రాంక్‌గా మాట్లాడుకుంటే... సినిమా పరిశ్రమలో ఆడవాళ్లు చాలా విషయాల్లో రాజీపడాలంటారు. హీరోయిన్ నుంచి కామెడీ ఆర్టిస్ట్‌ల వరకూ ఇది వర్తిస్తుందా? సరళ: హీరోయిన్ల నుంచీ కామెడీ ఆర్టిస్ట్‌ల వరకు కాదు.. జూనియర్ ఆర్టిస్టులకూ ఇది వర్తిస్తుంది. అయితే ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది. మన దగ్గర బిర్యానీ తినడానికి డబ్బులు లేకపోతే పచ్చడి మెతుకులతో సరిపెట్టుకోవాలనుకుంటే.. ఏ విషయంలోనూ రాజీపడాల్సిన అవసరంరాదు. కానీ, బిర్యానీయే తినాలనుకుంటే మాత్రం రాజీ పడాలి. రాజీపడకపోతే.. అవకాశాలు రావంటారు? సరళ: ఒకట్రెండు సినిమాలు పోతాయేమో. దానికే కంగారుపడిపోతే రాజీపడాలనే ధోరణి మొదలవుతుంది. కానీ, మనకు రావాలని రాసి పెట్టి ఉంటే, వచ్చే అవకాశాలను ఎవరూ ఆపలేరు. నాకు చాలా సినిమాలు మిస్ అయ్యాయి. అయినా డోంట్ కేర్ అన్నట్లుగానే వ్యవహరించాను. ఆడవాళ్లకు సినిమా పరిశ్రమలోనే కాదు.. దేవాలయాల్లాంటి స్కూల్స్, కాలేజ్‌లు, హాస్పిటల్స్‌లో కూడా చేదు అనుభవాలు ఎదురవుతాయి. వాటి నుంచి తప్పించుకునే నేర్పు ఉంటే, సేఫ్‌గా వెళ్లిపోవచ్చు. ఇక... మీ తోడబుట్టినవాళ్లతో మీ అనుబంధం గురించి? సరళ: నా అక్కయ్యల పిల్లలు నా దగ్గరే పెరిగారు. అందర్నీ చదివించాను. ఒకబ్బాయి దుబాయ్‌లో, ఇద్దరు యూఎస్‌లో, ఒకరు లండన్‌లో... ఇలా అందరూ మంచి జాబ్స్‌లో సెటిలయ్యారు. మీ నలుగురు అక్కలు చక్కగా పెళ్లి చేసుకుని, సెటిలయ్యారు.. మీకెప్పుడూ పెళ్లి చేసుకోవాలనిపించలేదా? సరళ: పెళ్లి గురించి ఆలోచించలేనంత బిజీగా ఉండేదాన్ని. సినిమాలు తప్ప నా పర్సనల్ లైఫ్ ఇలా ఉండాలని ఎప్పుడూ ప్లాన్ చేసుకోలేదు. పైగా సమాజంలో ఎన్నో విడాకుల కేసులు చూశాను. ఇక పెళ్లెందుకు అనిపించేసింది. అమ్మానాన్న పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయలేదా? సరళ: పెళ్లి చేసుకో అన్నారు. ఇష్టం లేదంటే, వదిలేశారు. మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్ అని చెప్పాను కదా. స్కూల్‌కి వెళ్లేటప్పుడు వంచిన తల ఎత్తకూడదు. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. ఇలా ఓ స్ట్రిక్ట్ వాతావరణంలో పెరిగినందువల్లో ఏమో నాకు ప్రేమ మీద కూడా దృష్టి మళ్లలేదు. ఒకవేళ అప్పట్లో ఎవరితోనైనా ప్రేమలో పడి ఉంటే, పెళ్లి చేసుకుని ఉండేదాన్నేమో. కానీ, నేను లవ్‌కి ఆపోజిట్. ప్రేమించడం అనేది హత్య చేసినంత మహా పాపం అని నా మనసులో బలంగా ముద్రించుకుపోయింది. మరి.. మీకు ఎవరూ ‘ఐ లవ్ యు’ చెప్పలేదా? సరళ: నన్ను చూసి ఎవరైనా ‘ఐ లవ్ యు’ చెబుతారా? నేను చేసిన కేరెక్టర్ల ప్రభావం నా జీవితం మీద కూడా పడి ఉంటుందేమో. సినిమాల్లో సహ నటులను ఓ రేంజ్లో కొట్టే నేను నిజజీవితంలో కూడా అలానే ఉంటాననుకుని ఉండొచ్చు. అందుకని, ఎవరూ నాకు ప్రపోజ్ చేయలేదు. వయసులో ఉన్నంతవరకూ ఓకే. కానీ, వయసు మీద పడిన తర్వాత ఓ తోడు ఉండాలంటారు కదా? సరళ: పుట్టినప్పుడు మనం ఒంటరిగానే పుడతాం. ఇది మీ అమ్మ.. ఇది నాన్న... వీళ్లు నీ అక్క, చెల్లెళ్లు అని ఎవరో ఒకరు చెబితేనే మనకు తెలుస్తుంది. దాంతో ‘మనవాళ్లు’ అనే భావన మొదలవుతుంది. పెరిగే కొద్దీ అనుబంధం బలపడుతుంది. కానీ, పెళ్లి చేసుకున్న తర్వాత ‘నా కుటుంబం’ అనే భావన మొదలవుతుంది. అప్పుడు తోబుట్టువుల మీద కొంత ప్రేమ తగ్గుతుంది. అలా మెల్లి మెల్లిగా దూరం పెరిగిపోతుంది. ఒకవేళ పెళ్లి చేసుకున్నామే అనుకోండి. భర్త చనిపోతే ఒంటరిగా బతకాల్సిందేగా. అందుకే నేను పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయా. నా దృష్టిలో జీవితంలో ఎవరూ ఎవరి మీదా ఆధారపడకూడదు. పెళ్లి చేసుకున్న తర్వాత తోడబుట్టినవాళ్లతో అనుబంధాలు తగ్గుతాయన్నారు. మీవాళ్లు ఆ జాబితాకి చెందినవారేనా? సరళ: ఎంతో కొంత ఆ జాబితాకే చెందుతారు. పెళ్లయిన తర్వాత వాళ్లల్లో మార్పొచ్చింది. ‘నా కుటుంబం, నా పిల్లలు, నా సమస్య’... అంటూ నన్ను వేరు చేసి మాట్లాడుతున్నారు. ‘ఓకే.. నాకు మంచి పాఠం నేర్పించారు’ అని డెరైక్ట్‌గా వాళ్లతోనే చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీవాళ్లు అలా చేయడం బాధగా లేదా? సరళ: నేను కూడా మనిషేనండి. ఓషో, వివేకానంద పుస్తకాలు చదివినంత మాత్రాన ప్రతి విషయాన్ని తేలికగా తీసేసుకుంటానని అనుకోవద్దు. అయితే ఒకే ఒక్క విషయంలో నేను ఆనందపడ్డాను. మంచి వయసులో ఉన్నప్పుడే నాకు అందరి మనస్తత్వాలు అర్థం అయ్యాయి. అదే నేను బాగా ముసలిదాన్ని అయిన తర్వాత తెలిసిందనుకోండి.. ఆ వయసులో తట్టుకునేంత ధైర్యం నాకు ఉండేది కాదు. ఇప్పుడు నాకు బాగా స్టామినా ఉంది. మానసికంగా చాలా ధైర్యం ఉంది. అందుకే, తట్టుకున్నాను. అసలు మీ లైఫ్‌స్టయిల్ ఎలా ఉంటుంది? సరళ: చాలా నార్మల్‌గా. కొన్ని రోజులు ఉదయం ఐదున్నర గంటలకు వాకింగ్ వెళుతుంటాను. బద్దకం అనిపించినప్పుడు మానేస్తా. చెబితే నమ్మరు కానీ.. పదేళ్ల క్రితం రాత్రి రెండున్నర గంటలకు నిద్రలేచి, మూడుగంటలకల్లా మెరీనా బీచ్‌కి వెళ్లేదాన్ని. ఓ గంట వాక్ చేసి, నాలుగున్నరకి ఇంటికొచ్చేసేదాన్ని. ఆ తర్వాత మేకప్ చేసుకుని ఏడుకల్లా షూటింగ్‌కి వెళ్లేదాన్ని. అలా ఆరు నెలలు చేశాను. ఆ తర్వాత కొన్నాళ్లు వాకింగ్ మానేశాను. ఇంట్లోనే త్రెడ్మిల్ మీద వాక్ చేసేదాన్ని. అది వర్కవుట్ కాలేదు. ఈ మధ్య ఉదయం నాలుగున్నరకల్లా నిద్ర లేచి, వాకింగ్, చిన్నపాటి వ్యాయామాలు చేస్తున్నాను. ఆ తర్వాత సింపుల్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను. నాన్‌వెజ్ పెద్దగా తినను. ఫైనల్‌గా కథానాయికల కెరీర్‌కన్నా మీ కెరీర్‌కి లాంగ్విటీ ఎక్కువ కాబట్టి.. ఎప్పుడైనా హీరోయిన్స్‌కన్నా మనమే బెస్ట్ అనిపించిందా? సరళ: హీరోయిన్గా చేసి ఉంటే.. ఇప్పుడు ‘సాక్షి’కి ఈ ఇంటర్వ్యూ ఇచ్చి ఉండేదాన్ని కాదేమో. మా కోయంబత్తూర్‌లో పాత రోజులను నెమరువేసుకుంటూ కాలక్షేపం చేసేదాన్నేమో. 1983లో సినిమాల్లోకొచ్చాను. ఒకవేళ హీరోయిన్ అయ్యుంటే ఐదు, పదేళ్లకే వెనక్కి వెళ్లిపోయుండేదాన్ని. కామెడీలో ఉన్నాను కాబట్టే 30 ఏళ్లయినా స్టేల్ అవ్వలేదు. ఇప్పటికీ ‘కోవై సరళ’ కామెడీ బోర్ కొట్టలేదు. అందుకే, ‘కామెడీలో నేనే హీరోయిన్’ అనుకుంటాను. నా భర్త, నా పిల్లలు, నా హాబీ సినిమాలే. చివరి శ్వాస వరకు యాక్ట్ చేయాలన్నదే నా కోరిక. - డి.జి. భవాని మీరు ఎవరితోనూ ఫోన్లో టచ్‌లో ఉండరు... ఎందుకు? సరళ: ఫోన్లో మాట్లాడటం నాకు అలర్జీ. ఎవరైనా గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుతుంటే, అంతసేపు ఎలా మాట్లాడుతున్నారు? అనుకుంటాను. మీకో విషయం చెప్పనా? ఆరు నెలల క్రితం వెయ్యి రూపాయలతో రీచార్జ్ చేయించు కున్నాను. ఇప్పటికీ నా ఫోన్లో బాలెన్స్ ఉంది. దాన్ని బట్టి ఎంత మితంగా ఫోన్ వాడతానో అర్థం చేసుకోవచ్చు. ఫంక్షన్స్‌లో కూడా ఎక్కువ కనిపించరు? సరళ: ఫంక్షన్స్‌కి వెళ్లడం చాలా తక్కువ. ఫంక్షన్‌కి వెళ్లాలనుకోండి... దానికోసమే ప్రత్యేకంగా తయారవ్వాలి. తయారై, ట్రాఫిక్ని కూడా లెక్క చేయకుండా వెళ్లిన తర్వాత అక్కడ జరిగేది ఏంటి? ‘బాగున్నారా..’.. ‘ఆ బాగున్నాను’ అంటూ పలకరింపులు. వెనక్కి తిరగ్గానే ‘ఆ ఏం బాగులే...’ అని వెక్కిరింతలు. పెదాల మీద నవ్వుని మెయిన్టైన్ చెయ్యాలి. ఇంటికొచ్చేసరికి ఆ నవ్వు తాలూకు బుగ్గల నొప్పిని భరించాలి. ఇవన్నీ ఎందుకు? అని ఫంక్షన్స్‌ని తగ్గించేశాను. ఓ సినిమా సక్సెస్ అయితే హీరో, డెరైక్టర్, హీరోయిన్స్‌కి ఎక్కువ క్రెడిట్ ఇస్తారు. ఆ తర్వాతే కమెడియన్స్ గురించి మాట్లాడుకుంటారు. దీని గురించి మీరేమంటారు? సరళ: నాకు సంబంధించినంతవరకు అది కరెక్టే అంటాను. ఎందుకంటే, హీరోలు నిజంగానే కష్టపడాలి. ఫిజిక్ మెయిన్టైన్ చెయ్యాలి. క్రమం తప్పకుండా వ్యాయామాలు కంపల్సరీ. ఆహార విషయాల్లో కూడా చాలా నియమాలుంటాయి. ఇక, ఫైట్స్ చేయడం అంటే చిన్న విషయం కాదు. సినిమా మొత్తం దాదాపు హీరో మీదే నడుస్తుంది కాబట్టి.. ఎక్కువ శాతం క్రెడిట్ వాళ్లకే ఇవ్వాలి. హీరోయిన్స్ కూడా సన్నగా మెరుపు తీగలా ఉండాలి కాబట్టి... నచ్చిన ఆహారం తినలేరు. డ్యూయెట్ సాంగ్స్‌లో డాన్సులు చేయడం చిన్న విషయం కాదు. అందుకని, హీరోయిన్‌కీ క్రెడిట్ ఇవ్వాలి. సినిమా మొత్తాన్ని ఏకతాటిపై నడిపించేది దర్శకుడు, అసలా సినిమా తీయడానికి కారణం ప్రొడ్యూసర్ కాబట్టి.. ముందు వాళ్ల గురించే మాట్లాడాలి. ఇక, ఆ తర్వాతి క్రెడిట్ విలన్, కమెడియన్స్, క్యారక్టర్ ఆర్టిస్ట్‌లకు దక్కుతుంది. -
పెళ్లి చేసుకుందాం అని కాదు...పెళ్లంటే ఏంటా? అని ఆలోచిస్తున్నాను...
తనకెంతో పేరు తెచ్చిపెట్టిన ‘కలర్స్’ ప్రోగ్రామ్‌ను తన పేరుకు జత చేసి పిలిస్తే స్వాతికి ఎందుకిష్టం ఉండదు? డాక్టర్ కావాలని బలంగా అనుకున్న స్వాతి యాక్టర్‌గా మిగలడం వెనుక ఉన్న ‘సైకో’ ఎవరు? తనను విక్రమ్‌తో, నిఖిల్‌తో జతకడుతూ వస్తున్న రూమర్లపై స్వాతి ఏమంటుంది? పార్టీలకు గాని మరెక్కడికిగాని వెళ్లడానికైనా ఏ టైమ్‌లోనైనా ఎటువంటి జంకూ గొంకూ లేకుండా స్వాతి ‘ఎస్’ చెప్పే ఆ సిక్స్‌ప్యాక్ హీరో ఎవరు? ఎంతో నాజూకుగా, చిన్నపిల్లలా కనిపించే స్వాతి ఏకంగా ‘స్కార్పియన్’ని తినాలని ఎందుకనుకుంది? ఈ ప్రశ్నలకు సమాధానం... రంగుల ప్రపంచంలోకి వెళ్లడానికి ముందే రంగుల్ని తన ఇంటిపేరుగా మార్చుకున్న రష్యన్ అమ్మాయి స్వెత్లానా అలియాస్ స్వాతిరెడ్డి అలియాస్ కలర్స్ స్వాతి. సినిమారంగంలో పదేళ్ల వయసున్న స్వాతి ‘తారాంతరంగం’ ఈ వారం. రష్యాలో పుట్టారు కదా... స్వాతి: అవును. వ్లాదివోస్టాక్ అనే పోర్ట్ప్లేస్లో పుట్టాను. నాన్న నేవీలో చేసేవారు. ఆయన ఉద్యోగరీత్యానే ముంబయికి వచ్చాం. ఆ తర్వాత వైజాగ్, తర్వాత హైదరాబాద్! మరి స్వెత్లానా ఎలా స్వాతి అయ్యారు? స్వాతి: రష్యన్ పేరెందుకు... మన భాష పేరు పెట్టుకోవాలని ముంబయి వచ్చాక అమ్మ నా పేరు మార్చింది. నాకన్నా ఆరేళ్లు పెద్దయిన అన్నయ్య పేరు సిద్ధార్థ. ఇద్దరి పేర్లూ ‘ఎస్’ తో మొదలైతే బాగుంటుందని నాకు స్వాతి అని పెట్టారు. మీరు పుట్టిన రష్యాకు మళ్లీ ఎప్పుడైనా వెళ్లారా? స్వాతి: సరిగ్గా నెలన్నర క్రితమే వెళ్లాను. పసిఫిక్ మెరిడియన్ అని ఫిలింఫెస్టివల్ 11వ వార్షికోత్సవం చేశారు. నేను పుట్టిన వ్లాదివోస్టాక్‌లో ఈ అంతర్జాతీయ చిత్రోత్సవం జరిగింది. భారతీయ సినిమాకు 100ఏళ్లు అయిన సందర్భంగా మన సినిమావాళ్లని కూడా ఆహ్వానించారు. ముఖ్యంగా వ్లాదివోస్టాక్‌లో పుట్టి, ప్రపంచవ్యాప్తంగా సినిమా రంగంలో రాణిస్తున్నవారిని గుర్తించి ఆహ్వానించారు. అలా నాకు కూడా ఆహ్వానం అందింది. వెళ్లాను.. చాలా హ్యాపీగా అనిపించింది. నేను పుట్టిన ఆసుపత్రి వార్డు, నా ఫస్ట్ హౌస్ చూశాను. ఫొటోలు దిగాను. చాలా మెమరబుల్! మీ అన్నయ్య గురించి... స్వాతి: మా అన్నయ్య, నేను చాలా క్లోజ్‌గా ఉంటాం. ‘కలర్స్’ ప్రోగ్రాం టైమ్‌లో ‘బాబోయ్... ఇంట్లో కూడా దీని గోల, టివిలో కూడా దీని గోలే’ అనేవాడు. ‘చానెల్ అయితే మార్చేసుకోవచ్చు కానీ ఇంట్లో అలా కుదరదుగా’ అంటే ‘అదే ఛస్తున్నానురా బాబూ’ అనేవాడు. డాక్టర్ అవబోయి యాక్టర్ అయినవారిలో మీరూ... స్వాతి: నిజంగా అవుదామనుకున్నానండీ. ఇప్పటికీ అప్పుడప్పుడు బాధేస్తుంది. అయితే ఈ మధ్య కొందరు డాక్టర్లను చూసి ‘థాంక్ గాడ్ నేను డాక్టరవ్వలేదు’ అనిపిస్తుంది! ఇట్స్ ఎ వెరీ రెస్సాన్సిబుల్ జాబ్! నాకు చదువంటే ఇష్టం. నేను బాగా చదివేదాన్ని. మెడిసిన్‌లో ఫ్రీ సీట్ సాధించాను. కాని, అప్పటికే ‘కలర్స్’ బాగా పాపు లర్ కావడంతో నన్ను మామూలుగా కాకుండా ఒక రేంజ్లో ర్యాగింగ్ చేశారు. ఓ 30 మంది నన్ను రోజంతా హాస్టల్ రూమ్‌లో పెట్టి తాళం వేసేశారు. రాత్రంతా డ్యాన్స్ చేయమన్నారు. మా రూమ్ ఎలక్ట్రిసిటీ స్విచ్ బయట ఉండేది. అది ఆఫ్ చేసేసేవారు. అలాగే జూనియర్స్ కూడా నాతో ఉంటే ర్యాగ్ అవుతారని నాతో ఉండేవారు కాదు. సో నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. ‘కలర్స్ స్వాతి’ ఈ కాలేజ్‌లో చదువుతోంది అని తెలిసిన తర్వాత చుట్టుపక్కల ఇంజినీరింగ్ కాలేజ్ వాళ్లు కూడా వచ్చి రాగ్ చేయడం... ఆ ఇంజినీరింగ్ బాయ్స్, మెడికల్ బాయ్స్ అంతా కలిసి రాగ్ చేయడం...స్టేషనరీ ఏదైనా కొందామని వెళ్లినా షాప్‌కు వచ్చి మరీ రాగ్ చేయడం ఎక్కువయ్యాయి. ఎవరు సస్పెండ్ అయినా నన్ను బ్లేమ్ చేసేవారు. అలా నాకు ఏదో ఒక దశలో ఆ వృత్తి మీద ఇంట్రస్ట్ పోయింది. ‘ఇలాంటి వాళ్లు మెడికోస్... వీరేం డాక్టర్లు అవుతారు? సైకోల్లా ఉన్నారు’ అనిపించింది. ఏదైతేనేం అక్కడ మానేశాను. తర్వాత హైదరాబాద్ యూసఫ్‌గూడలోని సెయింట్ మేరీస్‌లో బయోటెక్నాలజీలో చేరాను. ఆ కాలేజ్ ప్రిన్సిపాల్, స్టాఫ్, స్టూడెంట్స్ నన్ను మెడికల్ కాలేజ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నుంచి తేరుకునేలా చేశారు. అక్కడి కెమిస్ట్రీ లెక్చరర్ ఇప్పటికీ నాతో టచ్‌లో ఉన్నారు. ‘కలర్స్’ స్వాతి అని పిలిస్తే ఎందుకు ఇష్టం ఉండదు? అది మీ హీరోయిన్ స్టేటస్‌కు తక్కువనా? స్వాతి: ఛీఛీ...నాకు అప్పుడే ఇష్టం ఉండేది కాదు. చక్కగా స్వాతి అనే పేరు ఉంది కదా అని. అంతెందుకు... ఆ ప్రోగ్రామ్‌లోనే అనేదాన్ని ‘థాంక్గాడ్... నా ప్రోగ్రాం పేరు కలర్స్! ఏ ‘ఇంటింటి మహాలక్ష్మి’నో లేదా ‘పట్టుకుంటే పట్టుచీర’నో అయ్యుంటే! బాబోయ్ అలాంటివి పెట్టలేదు! కాని, చాలామంది అలా పిలిస్తే క్రెడిట్‌గా ఫీలవుతారు... స్వాతి: నేనలా కాదండీ. డిటాచ్డ్ పర్సన్. ‘సుబ్రహ్మణ్యపురం స్వాతి’, ‘డేంజర్ స్వాతి’ అంటే నాకు ఏదోలా ఉంటుంది! ఇంటి నుంచి పారిపోయైనా సరే సర్కస్‌లో చేరాలి అనుకున్నారట... స్వాతి: (గట్టిగా నవ్వేస్తూ) అవును. అది ఎక్కడ విన్నారు మీరు? నిజంగానే నాకు సర్కస్ అంటే బాగా ఇష్టం. ఆ ఇష్టంతోనే 8వ తరగతిలో ఉన్నప్పుడు అందులో చేరడానికి ట్రయల్ కూడా చేశాను! కానీ ఛాన్స్ దొరకలేదు. అలాగే నేవీలో ఉన్నప్పుడు యూనిఫాం నచ్చి అందులో చేరిపోదాం అనుకున్నాను. తర్వాత డాక్టర్... అవన్నీ దేవుడు పై నుంచి చూసి ఈ అమ్మాయికి చాలా కోరికలున్నాయి కాబట్టి... ఈ అమ్మాయిని యాక్టర్ చేసేద్దాం... అన్నీ అయిపోతుంది (క్యారెక్టర్ల పరంగా) అనుకునుంటాడు (నవ్వులు)! అంత హిట్టయిన ‘కలర్స్’ ప్రోగ్రామ్‌ను ఆపేయడం మొదలుకుని, మెడిసన్‌ను వదులుకోవడం...ఇలా మీ నిర్ణయాల్లో చాలా స్థిరచిత్తం కనిపిస్తుంటుంది... పెద్దగా లైఫ్‌లో స్ట్రగుల్ లేకపోయినా ఇంత స్ట్రాంగ్ ఎలా అయ్యారు? స్వాతి: నా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్, నేను పెరిగిన వాతావరణం వల్ల! దట్ వే ఐయామ్ బ్లెస్డ్. అయినా స్ట్రగుల్ అస్సలు లేకుండా ఏమీ లేదు. స్ట్రగుల్ అంటే ఇటుకలు మోసేయడం లాంటివి కాకపోయినా, సాధారణ మధ్యతరగతి జీవనశైలి నుంచి వచ్చాను. నేవీ ఫీల్డ్ బయట గ్లామరస్‌గా ఉంటుంది కానీ తొంగి చూస్తే చాలా సాధారణంగా ఉంటుంది. అందరి ఇళ్లూ ఒకేలా ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఎకామిడేషన్ తెల్సిందే కదా. నార్మల్ క్వార్టర్స్. కానీ ఇంటలెక్చువల్లీ, కల్చరల్లీ చాలా రిచ్ ఎన్విరాన్మెంట్! పక్కింటోడు ఒక బెంగాలీ ఉంటాడు, పైనో పంజాబీ ఉంటాడు. హోలీ ఆడాం. క్రిస్మస్ చేశాం. వినాయకచవితికి నాటకాలు. దాండియా ఆడాం. సో... క్వార్టర్స్‌లో ఉన్నామేమో కాని, మా కల్చరల్ అప్బ్రింగింగ్ వెరీ వెరీ రిచ్! మూవీస్‌లోకి వెళ్తాననగానే ఇంట్లోవాళ్లు ఏమన్నారు? స్వాతి: నేను మూవీస్ చేయడం అన్నకు అస్సలు నచ్చలేదు. ‘డేంజర్’ టైంలో చాలా రోజులు నాతో మాట్లాడలేదు కూడా! చాలా బాధపడ్డాను. సినిమాల్లో చేసే అమ్మాయిల గురించి ఆ వయసు అబ్బాయిలు, ఫ్రెండ్స్ ఏం అనుకుంటారో తెల్సిందే కదా. అందుకే కొంచెం భయపడ్డాడు. అయితే సినిమా చూశాక గర్వంగా ఫీలయ్యాడు. పేరెంట్స్ మాత్రం దీన్నంతా ఒక ప్రాసెస్‌గా భావించారంతే! అలాగని నా విషయంలో ప్రతీదీ వారికి తెలియాలని కోరుకోరు. అదే టైమ్‌లో నాకేం జరుగుతుందో వారికి తెలుసు. నేనే పడతాను. నేనే లేస్తాను. అయితే అన్నీ చెబుతూనే ఉంటాను. సడెన్‌గా ఏమైనా అయినప్పుడు వాళ్లు షాక్ తినరు! ‘సినిమాలు మానెయ్’ అని ఎప్పుడూ అనలేదా? స్వాతి: మూవీస్ మానేసి ఏం చేస్తా? నేనున్న పరిస్థితుల్లో బ్యాంక్‌లో చేస్తానా? అలా అని నచ్చక చేస్తున్నానని కాదు... ఇష్టం కాబట్టి చేస్తున్నాను. అవసరమైతే ఇంట్లో క్యాండిల్స్ చేసుకుని అమ్ముకుంటూ బతుకుతాను కాని, ఇష్టం లేనిపని చేయను. మీ మూవీస్ అబ్జర్వ్ చేస్తే పెర్ఫార్మెన్స్ బేస్డ్గా ఉంటాయి. సెలక్టివ్‌గా వెళుతున్నారనుకోవచ్చా? స్వాతి: యాక్చువల్లీ పెర్ఫార్మెన్స్ బేస్డ్ అంటూ ఏమీ ఉండవండీ. ప్రతి సినిమాలోనూ పెర్ఫార్మెన్స్ ఉండాల్సిందే కదా. ఇక అవి నేను ఎంచుకున్నవి కాదు. ఆ సినిమాలే నన్ను ఎంచుకున్నాయి. నాకు పది ఉంటే అందులో నేను రెండు సెలెక్ట్ చేసుకోవచ్చు. కాని, అన్నీ ఎప్పుడూ ఎవరికీ ఉండవు. నా దగ్గరకి వచ్చినవి మంచి ఆఫర్లు అంతే. మీరు కనపడినంత చైల్డిష్ కాదు..! స్వాతి: అయామ్ జస్ట్ గ్రోయింగ్అప్ అండీ! పర్సనల్లీ నేను పేరెంట్స్‌కి చాలా క్లోజ్‌గా ఉంటాను. తల్లిదండ్రులకు సన్నిహితంగా ఉండే పిల్లల లైఫ్ వేరేగా ఉంటుంది. ఎల్లప్పుడూ నేను డిపెండెంట్నే. అందులో డౌట్ లేదు. అంటే అది ఫైనాన్షియల్‌గానే కానక్కర్లేదు. ఎమోషనల్‌గా కూడా. నేనంటూ గుడ్డిగా చేయగలిగేది అమ్మానాన్నని నమ్మడమే. దేవుణ్ణి నమ్ముతారా? స్వాతి: ఇప్పుడు.. డెఫినెట్లీ. ఒక పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ఒక మనిషికి ఒక సిట్యుయేషన్ వల్ల్లో సక్సెస్, ఫెయిల్యూర్ వల్లో టెంపర్మెంట్ వల్లో మూడ్స్ వల్లో వేరే థాట్స్ ఉంటాయి. ఓ 5 సంవత్సరాల తర్వాత ఆలోచన మారిపోతుంది. ఇదే ప్రశ్న మీరు నన్ను స్కూల్ టైమ్‌లో అడిగితే వేరే ఆన్సర్ చెప్పేదాన్నేమో. ఇప్పుడు టివి, సినిమాలు, వేరే బాధలు, ఫ్రెండ్స్ పెరగడం, వాళ్ల పెళ్లిళ్లు. ఇవన్నీ చూశాక డెఫినెట్లీ దేవుడున్నాడని బాగా నమ్ముతున్నాను. ఎందుకంత నమ్మకం? స్వాతి: మంచివాళ్లకి మంచి జరిగినప్పుడు దేవుడున్నాడు అనిపిస్తుంది. అది తెలిసినవాళ్లకయినా, పర్సనల్‌గా నాకయినా! మా అన్నయ్యకు ఫేటల్ యాక్సిడెంట్ అయింది కొన్ని నెలల క్రితం. సీరియస్ అయింది. బట్ హీ సర్వైవ్డ్ ఇట్. సో...దేవుడున్నాడు అని. ఇప్పుడు చదివేవాళ్లకి ఇది చాలా సిల్లీగా అనిపించవచ్చు. అయితే నా నమ్మకం నాకుంది. నా ఫ్రెండ్స్ చాలా మంది దేవుణ్ణి నమ్మరు. నాతో ఆర్గ్యుమెంట్ కూడా పెట్టుకుంటారు. దేవుడేంటి... అంతా మన చేతుల్లోనే ఉంది అంటారు. కాని, నేను వారితో పెద్దగా ఆర్గ్యూ చేయను. ఎందుకంటే ఇది పూర్తిగా పర్సనల్ థింగ్! మీ ఫ్రెండ్స్ గురించి... స్వాతి: క్లోజ్ ఫ్రెండ్స్ తక్కువండి. అంటే... ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. అందరితో బాగా మాట్లాడతాను. నాకు స్కూల్ అండ్ కాలేజ్ ఫ్రెండ్స్ ఎక్కువ. ఇక సినిమా పరిశ్రమలో స్నేహం గానీ, శతృత్వం గానీ ఎక్కువ కాలం ఉండవు. అయినా ఇట్స్ వన్ లైఫ్ అండీ. గొడవలు ఎందుకు చెప్పండి? యూ నో... హేట్ అనే ఎమోషన్ చాలా డ్రెయినీ. లవ్ కన్నా హేట్ చాలా బలమైందీనూ. మనిషిని చాలా డ్రైన్ చేసేస్తుంది. సో అంత శక్తి నాలో లేదు. హీరో సునీల్ మాటకు బాగా విలువిస్తారంటారు... స్వాతి: అవును... సునీల్‌తో పొద్దున్న కూడా మాట్లాడాను. ఎక్కడికైనా సరే సునీల్ చెప్తే వెళ్తా. ఒకరోజు సడెన్‌గా పూరీ జగన్‌గారు రాత్రి 9.30కి ఫోన్ చేసి ‘‘స్వాతీ, హరీష్, చార్మి, నేను, ఇంకా రాము... ఇలా అందరం పార్టీకి వెళుతున్నాం వస్తావా?’’ అంటే రానన్నా. అప్పుడు సునీల్ చేత ఫోన్ చేయించారు. వెళ్లాను. సీ... ఫ్రెండ్షిప్ అంటే అర్థం ఏమిటో నాకు తెలీదండీ. కాని, ఇండస్ట్రీలో నాకు చాలా స్పెషల్ పీపుల్ అయితే ఉన్నారు. ఇందులో సునీల్, శ్రీనివాస్ అవసరాల, ఇంద్రగంటి మోహన్‌కృష్ణ, పార్వతి... అలా... కొందరు ఉన్నారు. మీ ఏజ్గ్రూప్వాళ్లతో తక్కువ అనుకుంటా... స్వాతి: హహహ(నవ్వులు) నా ఏజ్ గ్రూపోళ్లు తక్కువున్నారనుకుంటా ఇండస్ట్రీలో. అంటే వాళ్లంతా ఇంకెక్కడో ఉన్నారు. వాళ్ల రేంజ్ వేరే. పెద్ద సినిమాల్లో ఉన్నట్టున్నారు. చిన్నాపెద్దా... అని లెక్కేస్తారా... స్వాతి: నేనడం కాదండీ. ఇది జనాలు చెప్పే లెక్కలేనండీ. నాకు అలాంటివి ఉండవు. అందుకేగా ‘కలర్స్’ హిట్టయింది. మనిషిని మనిషిగా ట్రీట్ చేసి మాట్లాడేదాన్ని కాబట్టే అది అంత విజయం సాధించింది! ఇప్పటి టీవీ విజృంభణ చూస్తుంటే... మీరు ఇప్పటికీ టీవీలోనే ఉండుంటే స్మాల్ స్క్రీన్ సూపర్‌స్టార్ అయ్యేవారేమో... కమర్షియల్‌గా అదే బాగుండేదేమో... స్వాతి: ఏమో.. నాకిప్పటికీ అంత కమర్షియల్ ఐడియాలజీ లేదండీ. ఆ తెలివితేటలు నాకు లేవు. గెస్ ్టరోల్స్ కానివ్వండీ ఆ పాటలు కానీ అంతా ఫ్రెండ్లీగానే... ‘స్వాతీ నువ్వు చెయ్ అంటే చేశా తప్ప... ‘నాకేంటి’ అని అంతగా ఆలోచించలేను. అలా ఆలోచించకపోవడంవల్ల ఏదైనా పోగొట్టుకున్నారా? స్వాతి: ఓసారి ఓ సినిమాలో గెస్ట్ రోల్ చేశాక కొంతమంది నాకు ఫోన్ చేసి ‘‘అదేంటి స్వాతి, నువ్వు గెస్ట్ రోల్ చేయకు... హీరోయిన్గా చేశాక గెస్ట్ రోల్ చేస్తే రాంగ్ మెసేజ్ వెళుతుంది. వర్క్లేక చేశావంటారు’’ అని అంటే.. ‘అంత సిల్లీ మేటర్ కూడా అర్థం కావడం లేదా’ అని ఫస్ట్‌షాక్ అయ్యాను. నిజానికి అందరి జర్నీ ఒకలా ఉండదండీ. అందరూ సావిత్రి గారిలా ఉండలేరు. అందరూ శ్రీదేవిలు కాలేరు. మన వ్యత్యాసాలే మన ప్రత్యేకతలు కదా. ఇది నా జీవితం. సో...వీటి నుంచి నేర్చుకున్నానే తప్ప రిగ్రెట్స్ లేవు. ‘కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం అప్పల్రాజు’ సినిమా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కాదంటారా? స్వాతి: దేన్నీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కాదనుకునే బలం ఈ మధ్యే వచ్చింది. అంతకుముందు బాగా ఫీలయ్యేదాన్ని. ఎందుకంటే మనం అవ్వకపోయినా పక్కనోళ్లు చెప్తారు. కొన్ని రోజుల పాటు కాదు నెలలపాటు ఆ ఫీలింగ్‌లోనే ఉండేదాన్ని! అప్పల్రాజు, గోల్కొండ హైస్కూల్ తర్వాత కాన్షియస్గా ఒక బ్రేక్ తీసుకున్నాను. ‘అసలు నేనెందుకున్నానీ ప్రొఫెషన్లో? నాకేం కావాలి?’ అని ఆలోచించుకున్నాను. వై యామ్ ఐ అన్‌హ్యాపీ అని ప్రశ్నించుకున్నాను. అప్పుడు రియలైజ్ అయ్యాను. అప్పుడర్థమైంది ఇతరుల అభిప్రాయాల వినడమే నాకు సమస్య అని. ఇతరుల అభిప్రాయాలపై నా శక్తిని ఎక్కువగా ఖర్చు చేస్తున్నానని. ఒక్కొక్కరు వచ్చి ‘‘‘స్వాతి నువ్వు తెలుగమ్మాయివి...నువ్వు చాలా టాలెంటెడ్... స్వాతి...నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి’’... ఇలా అంటుంటే వాళ్ల మాటలు విని నాక్కూడా కంగారు వచ్చేసేది. అనేశాక వాళ్లు వెళ్లి హాయిగా పడుకుంటారు. అయినా నాకా థాట్ ఉంటుంది కదా. అది గుర్తించాను. అదే సమయంలో మా అమ్మ ఒక మాట అడిగింది ‘‘లాస్ట్ వన్ ఇయర్లో రిలీజైన సినిమాల్లో నువ్వు మిస్సయిన ఒక సినిమా పేరు చెప్పు’’ అని. ఒక్కటి కూడా చెప్పలేకపోయాను. ఎందుకంటే, ఆ సినిమాలు నచ్చాయి కాని, నేను చేస్తే అవి వర్కవుట్ అయ్యేవి కావు. మళ్లీ అమ్మ ఇంకో క్వశ్చన్ వేసింది. ‘‘స్వాతీ నువ్వు సినిమాల్లోకి ఎందుకు వచ్చావ్?’’ అని! ‘‘యాక్ట్ చేయడానికి’’ అన్నా! అయితే యాక్ట్ చెయ్ అంది. అంతే. ఆ తర్వాత స్వామి రారా, మలయాళ సినిమా ఆమెన్, తమిళ సినిమాలు.. ఇలా... చేసుకుంటూ పోతున్నా. రిజల్ట్ గురించో, ఇంకొకరి అభిప్రాయాల గురించో పట్టించుకోకుండా నా వృత్తి మీద నా లవ్వూ, నా కాన్సన్ట్రేషన్ చూపిస్తే మిగతాదంతా లైన్లో పడుతుందని రియలైజ్ చేశా! ఆ తర్వాత... స్వాతి: ‘స్వామి రారా’ తర్వాత బాగా ఆఫర్లు వచ్చాయి. అయితే అప్పుడు మళయాళం, తమిళంలో చాలా అర్థవంతమైన సినిమాలు చేస్తున్నాను. మీ కెరీర్లో ఇదే బెస్ట్ టైమ్ అనుకోవచ్చా..? స్వాతి: కాదండీ... ద బెస్ట్ టైమ్ వజ్ ఆఫ్టర్ అప్పల్రాజు. ఏడాదిన్నర సమయంలో ఇంటి దగ్గర కూర్చుని ఎన్నో ఇన్నర్ కన్ఫ్యూజన్స్ను క్లియర్ చేసుకున్నాను. తెలుగులో చేస్తూ చేస్తూ... సడన్‌గా తమిళంలో ఆఫర్ ఎలా వచ్చింది? స్వాతి: తమిళియన్స్ చాలా స్మార్ట్. వాళ్లు కన్నేసి ఉంచుతారు... ఎక్కడంటే అక్కడ. ‘ఆడవాళ్ల మాటలకు అర్థాలే వేరులే’ చూసి, 3 నెలలు ఆగి ఫోన్ చేశారు. ‘‘బాబూ నాకు తమిళం రాదు’’ అంటే ‘‘వెరీగుడ్ తమిళ హీరోయిన్లకు తమిళ్ రాకపోవడం ఒక అడ్వాంటేజ్’’ అంటూ తీసుకెళ్లారు. అలా ‘సుబ్రమణియపురం’ వచ్చింది. మళయాళం సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది? స్వాతి: ‘సుబ్రమణియపురం’ చూసి మలయాళం వాళ్లు ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం అక్కడ 3 సినిమాలు చేస్తున్నాను. అయితే రెమ్యునరేషన్ చాలా తక్కువ. షాప్ ఓపెనింగ్ అంత కూడా రాదు (నవ్వులు). చాలా ఖర్చులు నేనే పెట్టుకుంటుంటాను. అమ్మ అంటుంది ‘మనం చేస్తున్నామా? పెడుతున్నామా?’ అని. కాని మలయాళంలో ఎన్విరాన్మెంట్ బాగుంది! బడ్జెట్ చాలా సింపుల్ ఖర్చుతో గ్రౌండ్లెవల్లో ఉంటుంది. పాటలు పాడుతున్నారు. ఈ ‘పాడు’ అలవాటు ఏంటి? స్వాతి: అలవాటేం కాదు. మొత్తం ఇప్పటికి 3 సినిమాలకు పాటలు పాడాను. దాంతోపాటే ఒక ఎయిడ్స్ అవగాహనా కార్టూన్ పిక్చర్‌కి వాయిస్ ఇచ్చాను. అదో స్కూల్ ప్రోగ్రామ్! అన్ని గవర్న్మెంట్ స్కూల్స్‌కు వెళుతుంది. వ్యక్తిగతంగా మ్యూజిక్ అంటే నా జీవితంలో భాగం. అది నాకు స్ఫూర్తినిస్తుంది. బలాన్నిస్తుంది! ఫస్ట్ లవ్‌ప్రపోజల్ ఎప్పుడొచ్చింది? స్వాతి: స్కూల్లో! సెవెన్త్‌క్లాస్‌లోనే వచ్చింది. అప్పుడు వైజాగ్ నేవీ స్కూల్లో చదువుతున్నాను. పెన్సిల్ చెక్కుకుంటుంటే క్లోజ్‌ఫ్రెండ్ వచ్చి ఐ లవ్ యు అన్నాడు. నాకు వెంటనే అర్థం కాక చెక్కుకోవడం ఆపి ‘క్యా’ అంటూ దీర్ఘం తీశాను. ఐ థింక్ ఐ లవ్ యూ అన్నాడు. అంతే... ఆ అబ్బాయితో మాట్లాడడం మానేశాను. వారం తర్వాత కలిసి ‘‘నువ్వేమైనా మిస్ ఇండియావా! ఏమనుకుంటున్నావ్? ఇష్టం లేకపోతే వదిలెయ్, నాతో మామూలుగా ఉండు’’ అన్నాడు. ఇప్పటికీ ఇద్దరం మంచి ఫ్రెండ్స్‌మే! ఇక కాలేజ్‌లో లవ్ ప్రపోజల్స్ ఏమీరాలేదు. మా అన్నయ్య టీషర్ట్, జీన్స్, జుట్టు ముడి వేసుకుని కాస్త పద్ధతిగా వెళ్లేదాన్ని అందుకేనేమో ఎవరూ పట్టించుకోలేదు (విచారంగా మొహం పెట్టి), ఇండస్ట్రీకి వెళ్లాక చాలా వచ్చాయి. ఇండస్ట్రీలో లవ్‌కన్నా మ్యారేజ్ ప్రపోజల్స్ ఎక్కువొచ్చాయ్. బహుశా నా ఫేస్ అలా అనిపిస్తుందేమో (నవ్వులు). అంటే వాళ్లక్కూడా తెలుసేమో ఈ అమ్మాయితో ఇవన్నీ వేస్ట్ అని! ఇండస్ట్రీలో హరీష్ శంకర్, రవితేజ, బీవీఎస్ రవి అందరూ నన్ను తులసి మొక్క అని ఏడిపిస్తుంటారు. మరి అలా ఉంటే డల్‌గా అనిపించదా? స్వాతి: ఊహూ... నేనొచ్చిన బ్యాగ్రౌండ్ వల్లేమో అంత అటెన్షన్ హ్యాండిల్ చేయలేను. ఒక బంగళా, కారు, కెమెరాలతో ప్రొటెక్షన్ ఇవన్నీ ఉన్నవాళ్లు హ్యాండిల్ చేయగలరేమో... కాని, నేను చాలా సింపుల్‌గా ఉంటాను! మీ ఉద్దేశంలో ప్రేమంటే..? స్వాతి: నాకు నిజంగా తెలీదు. ఎవరైనా చెబితే బాగుంటుంది. అలాగని ఎవరైనా నాకు తెలియజెప్పాలని అనుకోవడం లేదు. నా పెళ్లి మాత్రం తప్పకుండా ఎరేంజ్డ్ అయి ఉంటుంది. మీ వల్ల ఎవరైనా దేవదాసులయ్యారా? స్వాతి: ఎవరవుతారండీ... ఈ కాలంలో దేవదాసులు? మరీ అయితే ఓ 10రోజులకు అవుతారేమో! అయినా ఓ అమ్మాయి కోసం... ఫీలైపోయి, షేవ్ చేసుకోవడం మానేసి, బాగా తాగేసి ఆ ఫీలింగ్‌ను ఎంజాయ్ చేస్తుంటే ఏం బాగుంటుందండీ? పార్టీయింగ్‌కు దూరంగా ఉంటారెందుకు? స్వాతి: ఏదైనా రీజన్ ఉంటేనే వెళతానండీ! అయితే పార్టీయింగ్ నచ్చదని కాదు. కొన్నిసార్లు వెళ్లానండి. వెళ్లిన తర్వాత నాకేం అనిపించిందంటే... అక్కడికి ఒక్కొక్కరు ఒక్కో రీజన్‌తో వస్తారు. ఒక ఎజెండాతో వస్తారు. నాకేమో ‘నేనిక్కడ ఏం చేస్తా’ అనిపిస్తుంది. ఆల్సో... ఇది చాలా కాంపిటీటివ్ ఇండస్ట్రీ. ఉన్న ఫ్రెండ్షిప్లన్నీ వన్ టు వన్ ఉంటాయి. గ్రూప్‌లో ఉన్నప్పుడు ఏమౌతుందంటే... ఓ పది నిమిషాలు బాగుంటారు. ఓ ఇద్దరు అక్కడ నుంచి వెళ్లగానే ఇక వారి గురించి మాట్లాడతారన్నమాట. నే నైనా అక్కడ నుంచి వెళ్లగానే నా మీద కూడా టక్‌టక్‌మని కౌంటర్ పడిపోతుందన్నమాట. అది నాకు తెలుసు. అందుకే దూరంగా ఉంటాను. సినిమారంగానికి వచ్చి పదేళ్లవుతున్నా పెద్దగా రూమర్స్ లేవేంటి? స్వాతి: నేను చాలా బోరింగ్. కొంచెం ఎగ్జయిటింగ్‌గా ఉండేవాళ్ల మీద వస్తాయేమో రూమర్స్! అయినా అవి కూడా చిన్నా చితకా ఉన్నాయిలెండి. ఒక సినిమా హిట్టయిందనుకోండి. వచ్చేస్తాయిక. ఈ ఫీల్డ్‌లో తప్పదనుకుంటా! విక్రమ్ మీకు బాగా క్లోజ్ అని విన్నాం..? స్వాతి: అడిగారా... చెబుతాను! నిజానికి విక్రమ్ అందరితో క్లోజ్‌గా ఉంటాడు. నేషనల్ అవార్డ్ వచ్చినప్పుడు ‘కలర్స్’లో విక్రమ్‌ని ఇంటర్వ్యూ చేశాను. ఓ నేషనల్ అవార్డ్ విన్నర్ అంటే ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చుంటాడు? అయినా ఆయన ‘కలర్స్’తో చాలా ఇంప్రెస్డ్! అప్పటినుంచి నన్ను ‘తన ఫేవరెట్ మూవీ ప్రెజెంటర్’ అనేవాడు. ఎవరైనా అడిగితే ఆయన పబ్లిగ్గా చెప్పేవాడు... ‘స్వాతి అంటే ఇష్టం’ అని! అలా ఒక ఇమేజ్ వచ్చేసింది. ‘ఆడవారి మాటలకు అర్థాలు వేరులే’ సినిమా అప్పుడు సెల్వరాఘవన్‌కు తనేమీ నన్ను సిఫారసు చేయలేదు. నన్ను తీసుకోవాలనుకున్నాక, ఆ విషయం విక్రమ్‌ని అడిగాడు అంతే! నిఖిల్‌తో కూడా మీకు ఏదో ఉందని టాక్... స్వాతి: అబ్బా! రెండు సినిమాలు కలిసి చేస్తే లింక్ పెట్టేస్తే ఎలా? అలా అయితే జైతో, ‘ఆమెన్’ హీరోతో కూడా రెండో సినిమా చేస్తున్నాను. మొత్తం 3 భాషల్లో ముగ్గురు హీరోలతో రెండో సినిమా చేస్తున్నాను. దానికేమంటారు? అలా చేస్తున్నానంటే దానికి కారణం ఒకటే... నేను నా పని చూసుకుంటాను. వాళ్లు వాళ్ల పని చూసుకుంటారు. అసలు అలాంటి ఎఫైర్లు ఉంటే రెండో సినిమా అవ్వదు. చాలా కాలిక్యులేషన్స్ ఉంటాయి! ఇప్పుడు సినిమా మేకర్స్ చాలా డెరైక్ట్‌గా కూడా చెప్తున్నారు. ‘‘మేం ఎందుకు నటిగా నీకు ప్రాధాన్యమిస్తామంటే నువ్వు నీ పని చూసుకుంటావ్’’ అని! ఎప్పుడైనా కొంచెం డిస్టెన్స్ మెయిన్‌టెయిన్ చేస్తేనే సంవత్సరాల తరబడి ఉంటుంది ఆ రిలేషన్షిప్. ఎక్కువ క్లోజ్ అయిపోతే కట్ అయిపోతుంది! ఇలాంటి విషయాల్లో ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఫీలవుతారా? స్వాతి: లేదండీ. నేనున్న ఫీల్డ్ అలాంటిది కదా. నేను కూడా రణబీర్‌కపూర్ గురించిన వార్తలు అవీ చదువుతాగా. అయితే నన్ను తిక్కగా అడిగితే సమాధానం అంతే తిక్కగా చెబుతాను. పద్ధతిగా అడిగితే బాగానే చెప్తాను! ఇంతకీ పెళ్లెప్పుడు... స్వాతి: ఇంకో రెండు మూడేళ్లలో ఉండొచ్చు... నాకు తెలీదండీ! చెప్పలేం కదా... ఇలాంటి విషయాల్లో. అయినా ఇప్పుడు నేను ‘పెళ్లి చేసుకుందాం’ అని ఆలోచించడంలేదు. ‘పెళ్లంటే ఏంటా?’ అని ఆలోచిస్తున్నాను. ఆ ఇన్స్టిట్యూషన్ నాకింకా అర్థం కాలేదు. అయితే ఆ వ్యవస్థను నేను నమ్ముతున్నానంటే అది కూడా నా పేరెంట్స్‌ని చూసి. లేదా మా ఫ్రెండ్స్ పేరెంట్స్. లేదా మా చిన్నాన్న, పిన్ని. లేకపోతే... నాకంతగా సరైన అభిప్రాయం లేదు. ఏదైనా ప్రతి పెళ్లీ డిఫరెంట్. కొన్ని పెళ్ళిళ్లు అరేంజ్మెంట్స్ వల్లో, డీల్స్, లవ్వూ, సోషల్ ఆబ్లిగేషన్... కారణాలతో జరిగినవి చూశాను. నా ఫ్రెండ్స్‌లో కొంతమంది పెళ్లిళ్లు వెరీ లక్కీ. కొంతమందివి ప్చ్... వాళ్ల లైఫ్ అంతే. ఏదైనా మంచి పార్ట్నర్ దొరకడం అనేదానికి మనం అదృష్టవంతులం అయి ఉండాలనేది నా ఫీలింగ్! వచ్చేవాడు ఎలా ఉండాలని..? స్వాతి: బాబోయ్... అలా అంటే చెప్పలేను. అస్సలు ఐడియా లేదు! సినీ పరిశ్రమలో అన్ని రకాల మనస్తత్వాలున్న మగవాళ్లని చూశాను. పెళ్లయ్యాక సినిమాలు చేయడం మానేస్తారా? స్వాతి: అది తెలీదు కానీ, కనీసం రెండేళ్లు ఇంటిపట్టునే ఉండిపోతాను. శుభ్రంగా ఇల్లంతా చూసుకుంటూ... వంట చేసుకుంటూ... ఈ ఇంటర్వ్యూ చదివితే ఈ ఒక్కదెబ్బకు మ్యారేజ్ ఆఫర్స్ గ్యారంటీ... స్వాతి: అహ్హహ్హ. కొన్ని సంవత్సరాలైనా నిజంగా అలా ఉండాలనుంది! - ఎస్.సత్యబాబు. ***************************** పుస్తకాలు చదువుతారా? స్వాతి: ఇంట్లో లైబ్రరీ ఉంది. సీరియస్ బుక్స్ ఉన్నాయి. ఇక షిడ్నీషెల్డన్ అవన్నీ జుజుబీస్. నేను ఆలోచించనక్కర్లేదు అన్నప్పుడు నమిలిపడేయాలి అనుకుంటే అవి చదువుతాను. రకరకాల బుక్స్ చదువుతాను. డిగ్రీ టైమ్‌లో నాకు తెలుగు ఉండేది కాదు. అయితే అష్టాచెమ్మా తర్వాత ఆర్టికల్స్ తెగవచ్చేసేవి. అవి చదవలేక ఫస్ట్రేషన్ వచ్చేసి తెలుగు నేర్చుకున్నా. తెలుగులో బుజ్జిబుజ్జి కధలు చదువుతా. మేకా ఆవు లాంటివి. ఇప్పుడు నా గురించి సాక్షిలో ఏమైనా వస్తే పొద్దున్నే లేచి నిదానంగా చదువుతానన్నమాట! రెమ్యునరేషన్లో నిర్ణయం ఎవరిది? స్వాతి: ఆ డిస్కషన్ ఎప్పుడూ రాలేదు. నా సినిమాలకు రీజనబుల్ ప్రొడ్యూసర్లే ఉన్నారు. అమ్మది కొంచెం జాలిగుండె. అమ్మ వల్లే సినిమాల్లో ట్రీట్మెంట్ బాగుంటుంది. తన వల్లే నన్ను బాగా చూసుకుంటారు.అమ్మ ఏమంటుందంటే... ‘ఎక్కువ అడిగేసి పీడించేస్తే... అంత ఇచ్చాం అనే ఫీలింగ్ వాళ్లకి సినిమా పూర్తయ్యేదాకా ఉంటుంది’ అంటుంది. ‘వాళ్లు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీ’ అంటుంది. ఈ విషయంలో అమ్మకంటే నేనే కొంచెం బెటర్. కానీ దీని గురించి ఎప్పుడూ అమ్మతో వాదించను. (నవ్వుతూ) పొద్దున్నే టైమ్‌కి లేవడం అనే విషయంలోనే ఎప్పుడూ అమ్మతో గొడవ. మీరు రాస్తారని... బ్లాగ్ ఉంది కానీ అడ్రస్ చెప్పరని..! స్వాతి: ఏదో రాస్తాలెండి. కవితలూ అవీ. కానీ అవి క్లోజ్ ఫ్రెండ్స్ చదువుకోవడానికి మాత్రమే! డిఫరెంట్ ఇష్యూస్ మీద రాస్తూంటాను. అయితే అవేవో మరీ ఢిల్లీరేప్ అలాంటివి కాదు. పూర్తిగా పర్సనల్. నాకు సంతోషంగా ఉన్నా, బాధగా ఉన్నా. నా బ్లాగ్ కూడా అంతే. పూర్తిగా పర్సనల్! ఎక్సర్సైజ్, జిమ్ లాంటివి..? స్వాతి: వర్కవుట్ అనేది నాకు డీస్ట్రెస్ ఏజెంట్! అయితే గోల్కొండ, అప్పల్రాజు సమయంలో మరీ ఎక్కువ చేయడం వల్ల బాగా సన్నగా అయిపోయాను. బాగా అనిపించలేదు. అందుకే ఎంత తినాలో అంత తిని, ఎంత ఎక్సర్సైజ్ చేయాలో అంత ఇంట్లోనే చేసుకుంటాను అని తీర్మానించుకున్నా. ఇప్పుడు జస్ట్ మోడరేట్‌గా చేస్తున్నాను. ***************************** ప్రతి ఏడాది ఎగ్జిబిషన్‌కు వెళ్లడం, జెయింట్‌వీల్ ఎక్కడం, ఎర్రరంగులోని చికెన్‌ని తినడం.. ఇవన్నీ పిచ్చ ఇష్టం. పబ్లిక్ గుర్తుపట్టి విష్ చేస్తుంటారు. అయితే ఫ్యామిలీస్ చాలా చక్కగా మాట్లాడతారు. కొందరేమో ‘ఏ క్కలర్స్’ అని గట్టిగా అనేసి వెళ్లిపోతారు. నాకు ‘కలర్స్ స్వాతి’ అంటే చిరాకు అనిపించడానికి అదీ ఒక కారణమేమో... నాకు వినిపించేటట్టు కావాలనే అని, నన్ను చూడకుండా వెళ్లిపోయేవాళ్లని చూస్తే నాకు తిక్కరేగిపోతుంటుంది. నాక్కూడా ఒక ఫ్యాంటసీ ఉంది... రేయ్ అంటూ ఫైట్, ఏ ఢిష్కే అని చేయాలని! ‘రేయ్ తియ్రా బండి’ అంటే టయోటాలన్నీ, సుమోలన్నీ గాల్లోకి ఎగిరి... ఐదేళ్ల క్రితం మాకు వేగనార్ కారుండేది. శ్రీనగర్‌కాలనీలో రోడ్లో డ్రైవ్ చేస్తుంటే ఎవడో ట్రాలీ లాంటిదేసుకుని వచ్చి థప్మని గుద్దాడు. రిపేర్‌కి రూ.20వేలు ఖర్చయింది. అప్పటి నుంచి కార్ డ్రైవ్ చేయడం అంటే భయం! ‘బంగారు కోడిపెట్ట’ కోసం మారుతి డ్రైవ్ చేశాను. 3 కెమెరాలు పెట్టారు. ఎంత భయంగా చేశానో చెప్పలేను. ఇప్పటికీ కారులో కూర్చుంటే ఏదైనా కారు పక్కనుంచి స్పీడ్‌గా వచ్చేస్తుంటే కళ్లు మూసేసుకుంటా. అంత భయం డ్రైవింగ్ అంటే! ఫేస్బుక్లో ఎకౌంట్ నాలుగేళ్ల క్రితం క్లోజ్ చేశాను. ఇప్పుడు లేదు. ఇక ట్విట్టర్ వాడే దాకా బాయ్స్‌లో అంత పైత్యం ఉందనేది నాకు తెలీలేదు. ఇంత ఫస్ట్రేటెడ్‌గా ఉన్నారా మన జనరేషన్ అనుకున్నా. రండి నన్ను ఎటాక్ చేయండి అని చెప్పి వాళ్లకి నేను ఛాన్స్ ఇచ్చినట్టుంటుంది కదా... అని ట్వీట్స్ మానేశా. అందులో ఎవరైనా ఏమైనా రాయచ్చు కదా. ‘ఎవరో నలుగురైదుగురు అంటే ట్విట్టర్ నుంచి వదిలేయడం ఏమిటీ అని’ కొందరన్నారు. అయితే ప్రతిరోజూ రాయడానికి ఏం ఉంటుంది నాకు? షారూఖ్‌ఖాన్ అయితే దలైలామాను కలిశా అనో ఇంకోటో రాసుకోవచ్చు. నేనేం రాయాలి? మాపక్కింటివాళ్లని కలిశా అనా? ప్రతిరోజూ ఇంట్రెస్టింగ్గా ఏమిరాయగలను? ***************************** ఎవరితోనైనా ఒక్కసారి తేడా వస్తే రిలేషన్ కట్ చేసుకునే టైప్ కాదు నేను. ఒక్కటే పట్టుకుని వేలాడకూడదు. వాళ్లకి కూడా మారడానికి, ఎదగడానికి అవకాశం ఇవ్వాలి కదా! చారిటీ కోసం నా స్టేటస్ దానికి సరిపోదు. ఎవరికైనా పనికొచ్చేది చేయడం అంత సులభం కాదు. నంది అవార్డ్ వచ్చాక చాలా మంది విచిత్రంగా రియాక్ట్ అయ్యారు. ‘‘నీకు అవార్డ్ వచ్చిందని తెలుసు కాని...’’ అంటూ. అవార్డ్ అనేది వ్యక్తుల మధ్య తప్పకుండా గ్యాప్ పెంచుతుంది. అవార్డ్స్ రావడమనేది నిజంగా ఒక లాటరీ టిక్కెట్. మీరు బాగా చేస్తే అవార్డ్ రాదు. తల రాత అంతే! నాకివన్నీ ఓవర్‌టైమ్ తెలిసింది. నాకు ఫిల్మ్‌ఫేర్ వచ్చిందనేది ఆ అవార్డ్నాకు వచ్చినప్పుడు సింక్ అవలేదు. మూడేళ్ల తర్వాత సింక్ అయింది! ఒక పర్టిక్యులర్ యాక్టర్‌కి వస్తుందని అనుకున్నా. అయితే రాలేదు. కాని రాకుండా వేరే ఎవరికో వచ్చింది. అప్పుడర్థమైంది ఇంత కష్టమా అని! దాని విలువ మూడేళ్ల తర్వాత తెలిసిందన్నమాట! -
ఈ ఎటకారం ఆ నీళ్ల చలవే!
‘గీత’లో ఉన్న గాంభీర్యానికి గోదావరి డిక్షన్‌లా ఉంటుంది కృష్ణభగవాన్ మాట! అర్జునుడికి కర్మజ్ఞానాది యోగాలు కళ్లు తెరిపిస్తాయ్ కదా, గీతోపదేశంలో... కృష్ణభగవాన్‌తో కాసేపు కూర్చున్నా అంతే! ఎంత తేలిగ్గా తీసుకున్నాడు లైఫ్‌ని!! తేలిగ్గా కూడా కాదు... ‘మినిమమ్’గా. అబ్బే, మినిమమ్ అని కూడా కాదు... జీవితం ఎలా నడిపిస్తే అలా తిన్నగా వచ్చేశాడు! ప్రయత్నం లేదు, ప్రయాస లేదు,పడిందీ లేదు, బాధపడిందీ లేదు. కామెడీ చేస్తాడు. ‘పడీపడీ’ చేయడు! మాటలు రాస్తాడు. పంచ్‌ల కోసం చూడడు. చిన్న వెటకరింపు, ఒక మిటకరింపు. రెండూ మ్యాచై, మిక్సై... సెలైన్సర్ ఉన్న మిస్సైల్లా పేల్తాయి! కృష్ణభగవాన్ తీరే అంత. యుద్ధాన్ని కూడా ‘ఓస్ ఇంతేనా’ అనిపించేలా...చేయిస్తాడు! గీతాసారం పూర్తిగా అర్థం కానివాళ్లు... ఈవారం ‘తారాంతరంగం’ చదవొచ్చు. ‘గోదావరి వెటకారానికి కేరాఫ్ అడ్రస్ కృష్ణభగవాన్’ అన్నది చాలామంది అభిప్రాయం. మీరేం అంటారు? కృష్ణభగవాన్: ఇంతకీ మీరేం అంటారో చెప్పండి? మా అభిప్రాయం కూడా అదే... కృష్ణభగవాన్: అలాగైతే సరే. ఈ వెటకారం మీకు ప్లస్ అయ్యిందా, మైనస్ అయ్యిందా? కృష్ణభగవాన్: మైనస్ ఎందుకవుతుందండీ... ప్లస్సే. ఆ ఎటకారమే కదా.. నన్ను ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి తెచ్చింది. చిన్నప్పట్నుంచీ ఇంతేనా? కృష్ణభగవాన్: ఇంతకుముందు కొన్ని చోట్ల చెప్పాను. కాటన్దొర కారణంగా పంటలు పండటమే కాదు, గోదావరి జిల్లాల్లో ఓ యాస, ఓ సంస్కృతి ఏర్పడిందని. ఈ ఎటకారం ఆ నీళ్ల చలవే. అవి తాగితే చాలు.. మాటలో ఓ రకమైన సాగదీత, ఓ రాగం ఆటోమేటిగ్గా వచ్చేస్తాయి. రావుగోపాలరావు మాట్లాడేవారు గుర్తుందా.. ‘ఏం పాటలూ... యాలం పాటలా...’ అని.. అలా. పాపారావు చౌదరి.. కృష్ణభగవాన్లా ఎలా మారాడు? కృష్ణభగవాన్: కాలేజ్ రిజిస్టర్లో పాపారావుచౌదరి అనే ఉండేది. అయితే.. నా ముద్దుపేరు కృష్ణ. దాంతో కొందరు కృష్ణ అని, కొందరు కుట్టబాబు అని పిలిచేవారు. సినిమా ఫీల్డ్కి కృష్ణబాబు పేరుమీద వచ్చాను. భగవాన్ అనేది డెరైక్టర్ వంశీగారు తగిలించారు. ఏం చదువుకున్నారు? కృష్ణభగవాన్: మా నాన్నకు నా చదువు విషయంలో డౌట్. అందుకే మానిపించేసి వ్యవసాయంలో పెట్టేద్దామనుకున్నారు. కానీ పాపం కుదర్లేదు. నేనే ఎలాగోలా బీకామ్ చదివేశాను. నేను పుస్తకాలు కూడా కొనేవాణ్ణి కాదు. ఆరు చదువుతున్నప్పుడే ఏడో తరగతి వాడితో మంచిగా ఉండేవాణ్ణి. వాడు ఎనిమిదిలోకెళుతున్నాడనగా... పుస్తకాలు అడిగేవాణ్ణి. ఒకవేళ ఆడు తప్పాడనుకోండీ.. ఏడులోనే ఉండిపోయేవాడు. నేనే ఇంకోణ్ణి వెతుక్కోవాల్సొచ్చేది. అందుకే వాడు పాస్ అవ్వాలని వాడికంటే నేనే ఎక్కువ కోరుకునేవాణ్ణి. ఒక్కోసారి నాన్డీటైళ్లు (ఉపవాచకాలు) మారుతూ ఉండేవి. దాంతో కొత్తవి కొన క తప్పేది కాదు. బాగా చదివేవారా? కృష్ణభగవాన్: నేనా.. మార్కుల విషయంలో చాలా పిసినిగొట్టుని. 35 అంటే 35 మార్కులే తెచ్చుకునేవాణ్ణి. హిందీ పాస్ మార్కు 18 అయితే.. మనకూ కచ్చితంగా పద్దెనిమిదే! స్కూల్ డేస్‌లో గుర్తుండిపోయిన సంఘటన ఏదైనా ఉందా? కృష్ణభగవాన్: మా హిందీ మాస్టారు ఓ సారి క్లాస్‌లో అందరి ముందూ పట్టుకొని కొట్టాడు. ‘వెధవ... రాయుడు సూర్యనారాయణగాడి దాంట్లో కాపీ కొడతావా’ అని. పైగా నేను క్లాస్ లీడర్ని. అందరిముందు పరువుపోయింది. కొట్టినందుకు కాదు నా బాధ. సూర్యనారాయణగాడి దాంట్లో చూసి రాశానని ఎలా తెలిసిందా.. అనేదే నా బాధ! పక్కపక్కనే కూర్చుంటారనుకుంటా... అతను చేసిన తప్పే మీరూ చేసుంటారు..? కృష్ణభగవాన్: అబ్బే అది కాదు. కొశ్చన్ పేపర్లో లెటర్ ఇచ్చారు రాయమని. వాడు ఆ లెటర్ చివర్లో ‘ఆప్ కే లియే రాయుడు సూర్యనారాయణ’ అని రాశాడు. కాపీ కొట్టడంలో నేను సిన్సియర్ కదా. నేను కూడా ‘ఆప్ కే లియే రాయుడు సూర్యనారాయణ’ అని రాశా. మరి కొట్టకేం చేస్తాడు. చదువుకునే రోజుల్లో లవ్ ఎఫైర్ ఏమైనా ఉందా? కృష్ణభగవాన్: లవ్ ఎఫైర్ అంటే... భోంచేయకుండా ఉండటం, ఎదురు చూడ్డం.. అలాంటివే కదండీ. అలాంటివైతే లేవండీ. అంటే... ఏ అమ్మాయినీ ఇష్టపడలేదా? కృష్ణభగవాన్: ఆపోజిట్ సెక్స్ కదండీ. అడిగే మీకూ ఉంటుంది. చెప్పే నాకూ ఉంటుంది. ఆ వయసు వచ్చినప్పుడు అంతా అలాగే బిహేవ్ చేస్తారు. నాక్కూడా అలాంటి ఇష్టాలున్నాయి. అయితే.. ప్రేమలేఖలు రాయడాలు, రాత్రుళ్లు నిద్రపోకుండా విరహగీతాలు పాడటాలు, ఆ అమ్మాయికి జ్వరం వస్తే నాకూ జ్వరం రావాలని చంకల్లో ఉల్లిపాయలు పెట్టుకోవడాలు అలాంటివెప్పుడూ చేయలేదు. మీ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలనుంది. చెబుతారా? కృష్ణభగవాన్: మాది కాకినాడ అండీ. ఎగువ మధ్య తరగతి కుటుంబం. నాన్న వ్యవసాయదారుడు. అమ్మ గృహిణి. మేం ముగ్గురు అన్నదమ్ములం. ఒక అన్నయ్య డాక్టర్. ఒక అన్నయ్య ఇంజినీర్. నేనేమో ఇలా. మా అందరికంటే పెద్ద మా అక్క. అక్క కూడా గృహిణే. సింపుల్‌గా ఇదీ మా కుటుంబం. భగవంతుడి దయవల్ల బాగానే పెరిగామండీ. ఉన్నదాంట్లో ఏ లోటూ లేకుండా పెంచాడు మా నాన్న. ఒకన్నయ్య ఇంజినీర్, ఒకన్నయ్య డాక్టర్. మరి మీరేంటి? బీకాంతోనే కామ్ అయ్యారు? కృష్ణభగవాన్: అదన్నా చదివా సంతోషించండి. ఇంటికొచ్చినోళ్లు మా నాన్నను అడుగుతూ ఉండేవారు. పెద్దోడు ఏం చదువుతున్నాడు? అని. ‘డాక్టర్’ అని చెప్పేవారు. రెండోవాడు? అనడిగితే... ‘ఇంజినీర్’ అనేవాడు. మరి మూడోవాడు అనగానే.. ‘అడుగో.. అక్కడున్నాడు’ అని నన్ను చూపించేవారు. ఆయన మొహంలో ఏదో కసి కనిపించేది. ఏదిఏమైనా చివరకు మీరే గెలిచారుగా? కృష్ణభగవాన్: అంతా దేవుడి దయ. అసలు కళలపట్ల ఆసక్తి ఎలా మొదలైంది? కృష్ణభగవాన్: నాటకాలు వేసేవాళ్లం. నేను మైమ్ ఆర్టిస్ట్‌ని కూడా. మా అన్నయ్య కూడా మంచి ఆర్టిస్ట్. ఇప్పుడు డాక్టరైపోయి అమెరికాలో ఉంటున్నాడనుకోండి. ఒకప్పుడు మేం ఇద్దరం, మా ఫ్రెండ్సూ కలిసి నాటకాలు వేసేవాళ్లం. సినిమాల్లో నటించాలని ఎందుకనిపించింది? కృష్ణభగవాన్: ఎవడో చప్పట్లు కొట్టాడండీ. అప్పటిదాకా ఎలా బతగ్గలనా అనే మీమాంసలో ఉండేవాణ్ణి. ఆ చప్పట్లు విని ‘నేను ఇందుకే పనికొస్తానేమో’ అనిపించింది. దాంతో ఇలా వచ్చేశా. ఇలా వచ్చి.. మీ ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి ఎదిగా. ఛాన్సల కోసం తిప్పలేమైనా పడ్డారా? కృష్ణభగవాన్: భోజనం లేకపోవడంతో కుళాయిలో నీళ్లు తాగి సర్దుకోవడం, చొక్కాకు చెమట పట్టి వాసనొస్తుంటే... ఉతుక్కోవడానికి సబ్బు కూడా లేకపోవడం వల్ల.. కాస్త తడి చేసి పౌడర్ జల్లుకొని తొడుక్కోవడం, రోడ్డు మీద ఓ పది రూపాయలు దొరికితే బావుండు.. ఇవాళ టిఫిన్ చేయొచ్చని కలలుగనడం.. ఇవన్నీ నా కెరీర్లో కూడా.. జరిగాయనుకుంటున్నారా? జరగలేదండీ. దేవుడి దయవల్ల తేలిగ్గానే అవకాశాలొచ్చాయి. మీ తొలి సినిమా జంధ్యాలగారి ‘శ్రీవారి శోభనం’ కదా? కృష్ణభగవాన్: ఆ విషయం నన్ను ప్రేమించేవాళ్లకు మాత్రమే తెలుసు. చాలామంది ‘మహర్షి’ అనుకుంటుంటారు. ‘ముద్దమందారం’ వందరోజుల వేడుకలో జంధ్యాలగారి ముందు మైమ్ యాక్టింగ్ చేసే అవకాశం ఎస్పీ బాలుగారి ద్వారా కలిగింది. ఆ ప్రోగ్రామ్‌లోనే పదిహేను నిమిషాల పాటు స్లో మోషన్ చేసి చూపించాను. జంధ్యాలగారికి తెగ నచ్చేసింది. దాంతో ‘శ్రీవారి శోభనం’లో అవకాశం ఇచ్చారు. హీరోహీరోయిన్ల శోభనానికి ఏదో అడ్డంకి వస్తుంది. ఆ అడ్డంకిగా నా మైమ్ యాక్టింగ్‌ని అడ్డం పెట్టారు జంధ్యాల. వంశీతో పరిచయం ఎలా ఏర్పడింది? కృష్ణభగవాన్: ‘లేడీస్ టైలర్’ తర్వాత ఆయన సెలక్షన్లు పెట్టారు. వేమూరి సత్యనారాయణ, తనికెళ్లభరణి, క్రాంతికుమార్ జడ్జీలు. అప్పుడు నాతో పాటు సెలక్ట్ అయినవాళ్లలో రాంజగన్, సూర్య కూడా ఉన్నారు. అయితే... ఆ సెలక్షన్లు ‘మహర్షి’ కోసం కాదు. వేరే సినిమా కోసం. ఆ సినిమా ఎందుకో కార్యరూపం దాల్చలేదు. దాంతో వంశీ ‘మహర్షి’ చేయడానికి నిశ్చయించుకున్నారు. ఆ సినిమాలో ‘తిలక్’ పాత్రకు తనికెళ్ల భరణివంశీగారికి నన్ను రికమెండ్ చేశారు. ‘మహర్షి’ అప్పట్లో పెద్దగా ఆడలేదుగానీ, అందులో పాటలన్నీ ముత్యలే. హీరో అవుదామని వచ్చినట్టున్నారు? ‘మహర్షి’లో మీ బాడీలాంగ్వేజ్ అలానే అనిపిస్తుంది? కృష్ణభగవాన్: లేదండీ.. శరత్‌బాబు చేసే పాత్రలు లాంటివి దొరికితే చేద్దామని వచ్చాను. అలా వచ్చి విలన్‌గా కూడా చేసేశారుగా. ఇప్పుడు నవ్విస్తున్నారు కానీ, ‘ఏప్రిల్ 1 విడుదల’లో గోపిచంద్గా మీ విలనిజం చూస్తే ఇప్పటికీ చాలామందికి భయం వేస్తుంది. కృష్ణభగవాన్: అది నా గొప్పతనం కాదండీ. ఆ సినిమాల్లోని సిట్యుయేషన్స్ గొప్పతనం. అందులోని నా పాత్ర పేరు కూడా జనాలకు అలా గుర్తుండిపోయింది. అంత బాగా విలనిజం ఎలా పండించగలిగారు? కృష్ణభగవాన్: నేనేం చేయకపోవడమే బాగుంది అందులో. అప్పట్లో విలన్లంటే హంగామాతో ఉండేవారు. ఈ గోపిచందేమో జనాల్లో ఒకడిగా ఉంటాడు. దాంతో భయపడిపోయారు పాపం. ఆ సినిమా రచన విషయంలో మీ పాత్ర ఉందని అంటారు నిజమేనా? కృష్ణభగవాన్: ఏ మాటకామాటే చెప్పాలి... రాశానండీ. టైటిల్స్‌లో పేరుండాలని మాత్రం కోరుకోలేదు. అంతకుముందు నాటకాలేమైనా రాశారా? కృష్ణభగవాన్: లేదండీ. మరి ఏకంగా సినిమాకెలా రాసేశారు? కృష్ణభగవాన్: ‘నువ్వు రాయగలవ్ రాసేయ్’ అన్నారు వంశీ. రాసేశాను. నేను గొప్ప రైటర్ని అయితే... ఎదుటివారు బాగాలేదంటే బాధ పడాలి. నేనసలు రైటర్నే కాదు. ఇక బాలేదంటే బాధ దేనికీ. అందుకే ధైర్యంగా రాసేశాను. నా అదృష్టం... డైలాగులు కూడా అందరికీ నచ్చాయి. ఆ సినిమాకు రాసినందుకు వేషంతో పాటు నెలకు వెయ్యిరూపాయలు ఇచ్చారు వంశీ. మరి తర్వాత ఎందుకు కంటిన్యూ అవ్వలేదు? కృష్ణభగవాన్: డైలాగులు రాయడం కష్టంతో కూడుకున్న వ్యవహారం. ఇండస్ట్రీలో ముందు మోసపోయేదీ రైటరే. అందుకే ఆ వైపు వెళ్లలా. ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’కు ముందు మీకు కొంత గ్యాప్ వచ్చింది. ఎందుకు? కృష్ణభగవాన్: వంశీగారికి గ్యాప్ వచ్చింది. నాకూ వచ్చింది. అదేంటి? కృష్ణభగవాన్: తొలినాళ్లలో నన్ను చేయిపట్టి నడిపించింది ఆయనే కదా. ఓ సారి ఆయనే అన్నారు. ‘గ్యాప్ తీసుకోవాలయ్యా... ఇలాగే ఎవరో ప్రొడ్యూసర్లు వస్తూ ఉంటారు. మనం చేసేస్తూ ఉంటాం. అవేమో ఆడవు. ఎందుకు’ అని. అన్నట్లే ఏడాదిన్నర పాటు సినిమా ఏదీ ఒప్పుకోలేదాయన. ఆ విరామం తర్వాత ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ చేశారు. ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’లోనే కదా.. మీరు తొలిసారి గోదావరి స్లాంగ్‌లో మాట్లాడింది? కృష్ణభగవాన్: కాదు.. ‘వసంతకోకిల’ సీరియల్లో. ఉప్పలపాటి నారాయణరావు డెరైక్టర్. ఆ పాత్రకు నంది అవార్డు వచ్చింది. ఓ సారి ఎందుకో వంశీ ఆ సీరియల్ చూశారు. అప్పటికే ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ షూటింగ్ కూడా పూర్తయిపోయింది. అయినా.. నన్ను పిలిచి ‘షూటింగ్ అయిపోయింది. ‘వసంతకోకిల’లోని నీ పాత్రను.. ఈ కథలో ఇన్వాల్వ్ చేసి రాసుకోగలవా?’ అనడిగారు. ‘రాస్తానండి’ అని చెప్పాను. ‘కొండవలస అనీ.. ఓ కొత్త ఆర్టిస్ట్ ఉన్నాడు. మీ ఇద్దరికీ కలిపి సీన్స్ రాస్కో’ అని చెప్పారు. ఆయన మాట ప్రకారం మా ఎపిసోడ్ రాశాను. ఆ కామెడీ ట్రాక్ మొత్తం మీరు రాసుకుందేనా? కృష్ణభగవాన్: అవును. నేనే రాశాను. ‘మన థాట్స్ ఓల్డ్ అయిపోయాయేమో! ఈ డైలాగులకి యూత్ నవ్వుతారో లేదో’ అని మొదట్లో గిలి ఉండేది. అందుకు తగ్గట్టే.. మా ఎపిసోడ్ తీసేటప్పుడు లొకేషన్లో ఎవరూ నవ్వేవారు కాదు. ఓ రోజు మాపై ఓ కామెడీ సీన్ తీస్తున్నారు వంశీ. ‘ఏంటి కుక్కగారు పొట్రాజుగారిని తీసుకొని బయలుదేరారు’ అనేది నా డైలాగ్. ఎవరూ నవ్వలేదు. వంశీగారికి డౌట్ వచ్చింది. ‘నవ్వుతారంటావా? లేకపోతే... ఇంకోటేదైనా రాసుకుంటావా?’ అనడిగారు. ‘లేదండీ.. ఎటకారంగా ఒకణ్ణి వేపుకు తినడం.. జనాలు బాగానే ఎంజాయ్ చేస్తారు’ అన్నాను. నాపై నమ్మకంతో తీసేశారు వంశీ. ‘చిట్టిబాబు... ఈ డబ్బులు తీసుకెళ్లి డ్రాయర్లో పెట్టేయ్’ అంటే...‘నేను డ్రాయర్ వేసుకోలేదు’ అంటా. దానికీ ఎవరూ నవ్వలేదు. ‘చిట్టిబాబు... మొన్న ఆటోలో ఎవరో అమ్మాయితో వెళుతున్నావ్. ఎందాకా వెళ్లావేంటి?’ అనడిగితే.. ‘ముద్దుల్దాకా’ అంటా. ఎవరూ నవ్వలేదు. ‘మీ అక్కని నేను చంపానంటారేంట్రా... ఏదో కడుపులో పురుగులున్నాయంటే.. అవి చస్తాయని కూతంత ఎండ్రిన్ పోశాను’ అనేది జీవా డైలాగ్. దానికీ ఎవరూ నవ్వలేదు. ఇక నాకూ డౌట్ మొదలైంది. ‘ఇదీ మిస్ ఫైర్ అయ్యింది’ అని ఫిక్సయిపోయా. నా అనుమానం నిజం చేస్తూ చివరకు ఎడిటింగ్ రూమ్‌లో కూడా ఎవరూ నవ్వలేదు. ‘దెబ్బకొట్టిందిరా బాబూ’ అనుకుంటుండగా... సింగర్ సునీత డబ్బింగ్ చెబుతూ ‘ఆ సొట్ట చెయ్యతను ఎవరండీ... ఇరగదీసేశాడు’ అని తెగనవ్వేసిందట. కో-డెరైక్టర్ చెప్పాడు. పోన్లే ఒక్కరైనా నవ్వారు అని తృప్తిపడ్డాను. తర్వాత ఎమ్మెస్ నారాయణ డబ్బింగ్ చెప్పారు. నేనూ అక్కడే ఉన్నా. ‘సెలైంట్‌గా మార్కులు కొట్టేశావురా బాబు’ అన్నారు. ఆశ చిగురించింది. సినిమా రిలీజ్‌కి ముందే షిరిడీ వెళ్లాను. అక్కడ జోరున వాన. ఇక్కడ చిరంజీవి ‘ఇంద్ర’ రిలీజ్. ఇక ఈ సినిమా సోదిలో కూడా ఉండదులే అనుకున్నా. రైటర్ శంకరమంచి పార్థసారథి ఫోన్. ‘సినిమా పెద్ద హిట్. ముఖ్యంగా మీకు మంచి పేరొచ్చింది’ అని. ‘హమ్మయ్య...’ అని ఊపిరి పీల్చుకున్నాను. తర్వాత అదే సంస్థపై నిర్మాత వల్లూరిపల్లి రమేష్ ‘కబడ్డీ కబడ్డీ’ సినిమా స్టార్ట్ చేశారు. ఇండస్ట్రీలో తొలి విజయం కంటే మలి విజయం చాలా ముఖ్యం. అది అందరికీ రాదు. రవితేజనే తీసుకోండి. ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ తర్వాత ‘ఇడియట్’ వచ్చింది. ఇక వెనక్కితిరిగి చూసుకోలేదు. నాకేమో ‘కబడ్డీ కబడ్డీ’. ఆ సినిమా కూడా దాదాపు వంశీ పక్కీలోనే ఉంటుంది కదా? కృష్ణభగవాన్: అవును.. అందులో కూడా కామెడీ ట్రాక్ దాదాపుగా నేనే రాశాను. ఓ సీన్లో బ్రహ్మానందం డైలాగ్. ‘‘పుట్టినరోజునాడు పట్టుచీర అడిగింది. కొనలేకపోయాను. తర్వాత ప్రెగ్నెంట్‌ని కదండీ.. మారుతీకారు కొనండి అంటే అదీ కొనలేకపోయాను. ఏవండీ.. పిల్లలు పుట్టేశారు ఓ అపార్ట్మెంట్ అయినా కొనండీ అంటే అది కూడా కొనలేకపోయాను. అక్కడ్నుంచి అది అన్నం తినడం మానేసి నన్ను తినడం మొదలెట్టింది. నా పొజిషన్లో మీరుంటే ఏం చేస్తారు చెప్పండి?’’ అని. ‘మీ మిసెస్‌ని నేనేం జేసినా బాగుండదు కదండీ’ అంటాను. స్పాంటేనియస్‌గా వచ్చేసిందా డైలాగ్. బ్రహ్మానందం పక్కున నవ్వేశారు. నిజానికి ఆ సీన్ ఇంకా ఉంది. కానీ ఇక తీయనవసరం లేదు అన్నారాయన. అదేంటి? అని డెరైక్టర్ అడిగితే.. ‘భగవాన్ పంచ్‌తో ఫట్’, ఇక ఆ సీన్లో నవ్వించడానికి కూడా ఏమీ లేదు అని తేల్చేశారు బ్రహ్మానందం. ‘కబడ్డీ కబడ్డీ’ మంచి స్క్రిప్ట్. దర్శకుడు వెంకీ కష్టపడి చేసుకున్న స్క్రిప్ట్ అది. దానికి మా ఊళ్లో జరిగిన కొన్ని అనుభవాలను అద్దానంతే. అవన్నీ స్వీయ అనుభవాలా? కృష్ణభగవాన్: అలా అని కాదండీ... చూసిన సంఘటనలు కూడా ఉంటాయి కదా. అవే ఫన్నీగా అనిపిస్తాయి. ఉదాహరణకు ‘కబడ్డీ కబడ్డీ’లో పేకాట సీన్ ఉంది. పోలీస్ గెటప్‌లో జయప్రకాష్‌రెడ్డి రాగానే అందరూ పేకలు సర్దేసి పారిపోతారు. మా ఊళ్లో జరిగిన ఓ సంఘటన స్ఫూర్తిగా తీసుకొని ఆ సీన్ రాశాను. మా ఊళ్లో కోళ్ల పందాలు బాగా జరుగుతాయి. పోలీసులొస్తారేమో... అని జువ్వలు చేతికిచ్చి ఊరి పొలిమేరల్లో ఒకణ్ణి నిలబెట్టేవారు. కాలవ గట్టుమీద పోలీస్ జీప్ కనిపించగానే... వాడు జువ్వల్ని వెలిగించేవాడు. వాటి సౌండ్ వినబడటమే ఆలస్యం... అక్కడ లొకేషన్లో అన్నీ సర్దేసేవారు. ఓ సారి నాలాంటోడు ఆ జువ్వలవాడి దగ్గరకొచ్చి... ‘ఆవి పేలవెహె’.. అన్నాడు. ‘ఏయ్.. ఎందుకు పేలవ్.. పేల్తాయి’ అని వీడు. చివరకు పంతం పెరిగి జువ్వల్ని వెలిగించేశాడు. అంతే, ఆ సౌండ్ విని ఊళ్లోని పందేల రాయుళ్లు పరార్. ఇలాంటి అనుభవాలు ఇంకా ఉన్నాయా? కృష్ణభగవాన్: ఎందుకు లేదండీ. అద్భుతమైన సంఘటన ఒకటి చెబుతా. మా ఊళ్లో కుక్కలన్నీ కుక్కల్లానే ఉండేవి. ఓ కుక్కకు మాత్రం ‘ఎందుకిలా కుక్కలా బతకాలి’ అనే రివల్యూషనరీ థింకింగ్ ఏర్పడింది. బ్రౌన్ స్కిన్‌పై నల్లమచ్చలుండేవి దానికి. అది పుట్టడమే ఓ రకంగా పుట్టింది. కోడి పెట్టల్ని చూస్తుంటే చాలు దాని నోట్లో లాలాజలం ఊరేది. కానీ ఓనర్లు, మగాళ్లు, మనుషులు దానికి అడ్డంకి. దాంతో వాళ్లందర్నీ నమ్మించడానికి కోడిపెట్టల మధ్యలో పడుకొనీ.. ‘అసలు మీపై నాకు అలాంటి ఫీలింగే లేదు’ అన్నట్లు నాలుగు కాళ్లు ఎల్లబెట్టి... అలా విరుచుకుంటూ దొర్ల్లుతూ, పెట్టలు పై నుంచి దూకుతుంటే.. ‘అయ్బాబోయ్ కితకితలు..’ అన్నట్లుగా రకరకాల హావభావాలు పలికించేది. సడన్‌గా ఓ కోడి మిస్. అది పక్కింటోళ్ల ఖాతాలోకి వెళ్లిపోయేది. మళ్లీ ఎక్కడైనా కోళ్ల గుంపు కనిపిస్తే... మళ్లీ ఇదే వేషాలు. అక్కడా కోడి మాయం. కొన్నాళ్లకు దానికే డౌట్ వచ్చింది. ‘ఇలాగే ఉంటే దొరికిపోవడం ఖాయం’ అనుకుంది. నాలుగు మర్డర్లు చేసిన తర్వాత ఏ నేరస్తుడైనా ఇలాగే ఆలోచిస్తాడు కదా. అడవిలోకి వెళ్లిపోయింది. జనాలకు కనబడకుండా అడవుల్లో ఉంటూ కోళ్లపై రాత్రుళ్లు దాడి చేస్తుండేది. యజమానులకేమో... పక్కింటోళ్ల మీద డౌట్. పక్కింట్లో కోడి ఉడుకుతుంటే... మనకోడే అనుకొని బాధ. కొంతమందయితే... ఇదే సందని కోళ్లను కాజేసేవాళ్లు. అవన్నీ కుక్కఖాతాలోకి వెళ్లిపోయేవి. ఇలా ఆ కుక్క పుణ్యమా అని మా ఊళ్లో కొంతమంది దొంగలయ్యారు. ఫ్రీగా ముక్క దొరుకుతుంది కదా అని కొందరు తాగుబోతులయ్యారు. ఇదిలావుంటే... ఈ కోళ్ల దొంగ ఎవరో ఓ రోజు ఓనర్లకి తెలిసిపోయింది. ఊళ్లో ఈ కుక్క వార్త దావానలంలా వ్యాపించింది. మేమందరం దాన్ని చూడాలని తహతహ లాడిపోయేవాళ్లం. కోళ్ల గంప కదిలిందంటే చాలు... ‘అదొచ్చిందేమో...’ అని పరిగెత్తుకొచ్చేవాళ్లం. అందంటే అంత క్రేజ్. ఈ కుక్కని చంపుతానని పక్క ఊరి నుంచి ఒకడొచ్చాడు. వాడికి ఓ బస్తా బియ్యం ఇస్తామన్నారు జనాలు. వాడు అలాంటి కుక్కనే ఓ దాన్ని చావగొట్టి బస్తా బియ్యం పట్టుకుపోయాడు. మళ్లీ కోళ్లు మాయమవుతున్నాయి. అప్పుడు ఊర్లో మనిషే ఆ కుక్కని చంపి కోళ్లను కాపాడాడు. ‘కోళ్లు తినే కుక్క’ అని దానికి పేరు. ఇప్పటికీ ఆ కుక్క గురించి చెప్పుకుంటుంటారు. నా చిన్ననాటి జ్ఞాపకం అది. మీ లైఫ్‌లో జరిగిన సంఘటనల్నే సినిమాల్లో వాడితే... వాటికోసమే జనాలు చూస్తారేమో! కృష్ణభగవాన్: పల్లెటూళ్లల్లో ఇలాంటివి సహజమండీ. అయితే ఇప్పటి తరానికి ఆ ఆనందం లేదు. ఈ పాశ్చాత్య పోకడలు పల్లెలకు కూడా వ్యాపించాయి. ఈ కారణంగా మన సంస్కృతి చాలా వరకూ అడుగంటిపోయింది. టెక్నాలజీ మనకు చాలా ఇచ్చింది. అలాగే చాలా కోల్పోయేలా చేసింది. మా ఊళ్లో దేవుడి కల్యాణం అంటే నాటకాలు వేసేవారు. హరికథలు పెట్టించేవారు. రికార్డింగ్ డాన్సులుండేవి. జనాలందరం ఒక చోట చేరేవాళ్లం. సందడి సందడిగా ఉండేది. ఇప్పుడేది ఆ సందడి. సినిమా చూడాలంటే అప్పుడు పెద్ద ప్రహసనం. కానీ ఇప్పుడు ఇంట్లో చూసేస్తున్నాం. ప్రయాణంలో చూసేస్తున్నాం. కార్లో చూసేస్తున్నాం. చివరకు జేబులో ఉండే సెల్ ఫోన్లతో కూడా చూసేస్తున్నాం. ఆ రోజుల్లో పాటలు వినాలంటే రేడియోనే ప్రధాన సాధనం. మధ్యాహ్నం రెండు గంటలకు జనరంజని. ‘ఆ... ఏంటి చంటి అక్క... ఏంటి విశేషాలు’ అంటే... ‘ఆ ఏముంది తమ్ముడూ.. ఎండలు మండిపోతున్నాయి’ అంటూ అక్క తమ్ముళ్లు రేడియోలో మాట్లాడుకుంటుంటే.. మధ్యమధ్యలో ఘంటసాల పాటలు వస్తుండేవి. ఇంట్లోవాళ్లందరం సరదాగా పాటలు వినేవాళ్లం. పండగలప్పుడు పందిట్లో మైకు పెట్టేవారు. వరుసగా తొమ్మిదిరోజుల పాటు పాటలే పాటలు. గ్రామ్‌ఫోన్ రికార్డ్ దగ్గర ఒకడు కూర్చునేవాడు. వాణ్ణి మేం ఊరికి మొనగాడులా భావించేవాళ్లం. నేను నిదానంగా వెళ్లి వాడి దగ్గర నిలుచునేవాణ్ణి. ‘ఏం కావాలి?..’ అనేవాడు చిరాగ్గా. ‘బుద్దిమంతుడు’లో ఆ పాట వేయవా’ అని అడిగేవాణ్ణి. ‘ఏం పాటా... వెళ్లి ముందు టీ పట్రా పో..’ అనేవాడు. ఇంట్లో వాళ్లని బతిమాలుకొని.. ఎలాగోలా జాగ్రత్తగా టీ మోసుకొచ్చేవాణ్ణి. ‘బుద్దిమంతుడు’లో ‘టాటా వీడుకోలు’ పాట వేయవా’ అనేవాణ్ణి. ‘వేస్తా పో..’ అనేవాడు. ఫ్రెండ్స్ దగ్గరకెళ్లి నిలబడి ‘ఇప్పుడు ‘బుద్ధిమంతుడు’లో టాటా వీడుకోలు ‘పాటొస్తది చూస్కోండి’ అనేవాణ్ణి దర్పంగా. వాడు పాటేసేవాడు. ‘టాటా... వీడుకోలు...’ మైకులో ఘంటసాల గొంతు వినబడుతుంటే నాకేమో విజయగర్వం. తర్వాత మళ్లీ వెళ్లేవాణ్ణి. ‘రేపంటి రూపం కంటి’ పాటేయవా అనడిగేవాణ్ణి. అదంతా ఓ థ్రిల్లండీ.. దీపావళి పండుగ వచ్చి వెళ్లిపోతే... ప్రేయసి వెళ్లిపోయినంత బాధపడిపోయేవాళ్లం. ఇప్పటి జనరేషన్‌కి ఆ ఆనందం ఏదీ? మీలో మంచి భావుకత ఉన్నట్టనిపిస్తుంది... సాహిత్యం బాగా చదువుతారా? చలం సాహిత్యం బాగా ఇష్టం. ఆయన మ్యూజింగ్స్ బాగా చదువుతా. ఆయన సిద్ధ్దాంతాలతో ఏకీభవిస్తారా? తప్పకుండా. ఇప్పుడు జరుగుతున్నాయిగా. ఆయన నిజాలు రాశాడు. అయితే... ఆయన రచనల్లోని పాత్రల్లా మారండని మాత్రం ఎక్కడా చెప్పలేదు. ఆయన ఏం రాసినా అనుభవించి రాశాడు. చేవ, దమ్ము ఉంటే ఓ గజ్జి కుక్కని తెచ్చి పెంచమంటాడాయన. చెప్పడం కాదు ఆయన అలానే బతికాడు. ఓ విధంగా చెప్పాలంటే... తాను రాసిన దానికంటే గొప్పగా బతికాడు. ఆ ఎక్స్ప్రెషన్ అంటే నాకు ప్రాణం. అలాగే పతంజలిగారు కూడా. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. నన్ను ఇంటికి కూడా తీసుకెళ్లేవారాయన. ఎప్పుడో జరిగిన గ్లోబలైజేషన్ గురించి కన్నీరు పెట్టుకునేవారు. ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? కృష్ణభగవాన్: నేను చాలా హెల్దీగా ఉండేవాణ్ణండీ. ఇంటర్లో బాడీ బిల్డర్‌ని కూడా. ఉన్నట్టుండి కొన్నాళ్ల క్రితం నుంచి బ్యాక్‌పెయిన్ మొదలైంది. ఆయుర్వేదం, హోమియోపతి, ఆక్యుపంక్చర్, అక్యు ప్రెజర్, మర్మకళ ఇలా చాలావాటిని ట్రై చేశా. గుణం కనిపించలా. రెండు నెలల క్రితం భక్తియార్ చౌదరి గారని ఓ డాక్టర్గారిని కలిశా. రెండు నిమిషాల పాటు నన్ను గమనించి నా సమస్య ఎక్కడో చెప్పేశారాయన. ఆయన చెప్పినట్టు కొన్ని ఎక్సర్సైజులు చేస్తున్నా. ఇప్పుడు గుణం కనిపిస్తోంది. మీ పిల్లల గురించి చెప్పలేదు? కృష్ణభగవాన్: ఒకే అమ్మాయి. ఇంజినీరింగ్ చదివింది. ఆ మధ్య ఉద్యోగం కూడా చేసింది. ఫ్యామిలీ పరంగా నేను హ్యాపీ. ఒవరాల్‌గా జీవితం హ్యాపీగానే సాగుతోంది. - బుర్రా నరసింహ దాన్ని షిరిడీలో వదిలేద్దామనుకుంటున్నా! మీరు బాగా బాధ పడ్డ సందర్భం? కృష్ణభగవాన్: మందు తాగి స్టేజ్ ఎక్కాడని ఓసారి మీ మీడియావాళ్లే టీవీల్లో రాద్ధాంతం చేశారు.. అప్పుడు. నిజానికి అప్పుడు నేను డ్రింక్ చేయలేదు. మందు తాగుతారా? కృష్ణభగవాన్: అప్పుడప్పుడు మీ బలహీనత? కృష్ణభగవాన్: కోపం ఎక్కువండీ. మీలో ఇంత కోపం ఉందా అని చాలామంది ఆశ్చర్యపోతుంటారు. షిరిడీలో వదిలేద్దామనుకుంటున్నా. ఇష్టమైన ఫుడ్? కృష్ణభగవాన్: ముద్దపప్పు, ఆవకాయ్. దాంట్లో ఫ్రెష్ నెయ్యి ఉండాలి. బిర్యాని అంటే కూడా టెమ్ట్ అవుతా. అది కూడా చికెనే. ఇష్టమైన దేశం? కృష్ణభగవాన్: బ్యాంకాక్ బావుంటుంది. ఎలాంటి డ్రస్సుల్ని ఇష్టపడతారు? కృష్ణభగవాన్: సింపుల్‌గా జీన్స్, టీ షర్ట్స్. గేమ్స్ ఇష్టపడతారంట? కృష్ణభగవాన్: అవును క్రికెట్ అంటే ఇష్టం. ఆడతారా? కృష్ణభగవాన్: చిన్నప్పుడు టెన్నిన్ బంతితో ఆడేవాళ్లం. ఆస్ట్రేలియా వాళ్లను చూసి సున్నం మొహానికి రాసుకునేవాణ్ణి. అది పొక్కిపోయి, దుద్దర్లొచ్చి వికృతంగా తయారయ్యేవాణ్ణి. అలాగే టెన్నిస్ అంటే కూడా చాలా ఇష్టం. లేడీస్ ఆట చూస్తారా? జెంట్స్ ఆట చూస్తారా? కృష్ణభగవాన్: లేడీస్ ఆటే..(నవ్వుతూ) *********** నా ఊరి అనుభవాలు ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. అది నా పదమూడో ఏటో పద్నాలుగోయేటో గుర్తు లేదు. మా ఊరి గుళ్లో దేవుడి కల్యాణం. ఆ రోజు రాత్రి రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నానికి డాన్సర్లందరూ కార్లలో దిగారు. ఎంత అందంగా ఉండేవారో... అందులో మణికుమారి అనీ... ఓ ఆవిడ. ఆవిణ్ణి చూడగానే... మా ఊళ్లో ఆడోళ్లందరిపై అసహ్యం వేసింది నాకు. అంత అందగత్తె. మణికుమారికి తిలకం డబ్బా అవసరమైంది. వెంటనే నా మోటర్‌సైకిల్ స్టార్ట్ చేశా. మోటర్‌సైకిల్ అంటే నిజమైన మోటర్ సైకిల్ అనుకునేరు. పరిగెడతానే... మోటర్‌సైకిల్ మీద వెళుతున్న బిల్డప్. అమ్మ నడిగి తిలకం బాటిల్ తీసుకొని మళ్లీ నా మోటర్‌సైకిల్ మీద వేగంగా మణికుమారిని చేరుకున్నా. ఆ రాత్రి రికార్డింగ్ డాన్స్ అయిపోయింది. తెల్లారితే మా ఇంట్లో భోజనాలు. ఆ భోజనాల్లో అందరితో పాటు మణికుమారికి కూడా ఆకు వేసి కూర్చోబెట్టారు. మా నాన్నను చూస్తే కోపమొచ్చేసింది నాకు. ‘మణికుమారిని అందరితో పాటు ఇలా కింద కూర్చోబెడతారా?’ అని బాధ. తను ఏం హర్టయిపోతుందో అని ఆవేదన. తర్వాత రోజు మా పాలేరు రాకపోవడంతో నన్ను గేదెల్ని కాయమన్నాడు నాన్న. తప్పేదిలేక గేదెల్ని తీసుకొని ఊరిబయటకు వెళ్లాను. అప్పుడో బస్ నా పక్కనుంచి వెళుతోంది. మణికుమారి ఆ బస్‌లో ఉంది. ఊరు వదిలి వెళ్లిపోతోంది. గేదెలు కాస్తున్న నన్ను మణికుమారి చూస్తుందేమో అని చెట్టుపక్కన దాక్కున్నా. అసలు మణికుమారికి నేనెవరో కూడా తెలీదు. నా మనసులో ఏముందో కూడా తెలీదు. కానీ ఆ వయసులో ఏదో ఫీలింగ్. తర్వాత ఎప్పుడూ కనిపించలేదు తను. ఇప్పటికీ వంశీగారు అడుగుతుంటారు. ‘ఎలా ఉంటుందయ్యా మణికుమారి’ అని. -
ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్లు...ప్రయత్నం విరమిస్తే మరణించినట్లు!
ప్రయత్నం... ఎలాగైనా ఉండొచ్చు. అసలంటూ ఉండాలి. ఎమ్మెస్ నారాయణ చాలా ప్రయత్నాలు చేశారు. చదువుకోడానికో ప్రయత్నం. (నాన్నకు ఇష్టం లేదు) లెక్చరర్ అవడానికో ప్రయత్నం. (జీతం ఎక్కువ రాదు) సినీ రచయిత అయే ప్రయత్నం. (పడిన కష్టం ఒకటి కాదు) నటుడిగా నిలబడే ప్రయత్నం. (నో రెస్ట్, నో ఫియర్) కొడుకుని హీరో చేసే ప్రయత్నం. (లాస్‌ని లెక్కే చేయలేదు). గెలిచామా ఓడామా అని కాదు... ప్రయత్నం చేశామా? లేదా? ఇదీ ఎమ్మెస్ ఫిలాసఫీ! జీవితం ఆయనకి ఫస్ట్ టెస్ట్ పెట్టినరోజు... చిన్న కాగితం ముక్కమీద ఏం రాసుకున్నారో తెలుసా? ‘ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్లు... ప్రయత్నం విరమిస్తే మరణించినట్లు’. ఇలాంటి మనిషిని... ఎన్ని టెస్టులు మాత్రం ఏం చెయ్యగలవు? ఈవారం ‘తారాంతరంగం’ చదవండి. అప్రయత్నంగా మీరూ ఏదో ఒకజీవిత సత్యాన్ని... కాగితం ముక్కపై రాసుకుంటారు! ఎమ్మెస్గారూ... ఓసారి మీ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్దామా? ఎమ్మెస్: పశ్చిమ గోదావరి జిల్లాలో నిడమర్రు అనే అందమైన పల్లెటూరు మాది. మేం ఏడుగురు అన్నదమ్ములం, ముగ్గురు అక్కాచెల్లెళ్లు. అప్పటికి ఊరినిండా మట్టి రోడ్లు. అందరికీ సైకిళ్లే ఆధారం. మోటార్ సైకిల్ ఉందంటే దొరబాబు కింద లెక్క. ఊళ్లో పెద్దగా చదువుకున్నవాళ్లు లేరు. మా మేనమామ సత్యంగారు బీఏ చదివితేనే గ్రేట్‌గా చూసేవాళ్లు. నాన్నగారు వ్యవసాయం చేసేవారు. చదువంటే ఆసక్తి లేదాయనకు. నాకేమో బాగా చదువుకోవాలని ఉండేది. కానీ నాన్నగారు నాతో పొలం పనులు, పశువుల కాపలా చేయించేవారు. మరి మీ చదువు ఎలా సాగింది? ఎమ్మెస్: నాన్న ఎన్ని చెప్పినా నా దారి నాదే. ఆయన అలా వెళ్లగానే ఇలా నేను పొలం నుంచి పారిపోయేవాణ్ణి. మళ్లీ మా నాన్నగారు స్కూల్‌కి వచ్చి తీసుకెళ్లేవారు. అలా చిన్నప్పట్నుంచి చదువు, వ్యవసాయం రెండూ కలగలుపుగా పెరిగాను. అలా అలా ఐదోతరగతి వరకు బండి లాగించాను. ఆ తర్వాత మా ఊళ్లో హైస్కూల్ పెట్టారు. మూర్తిరాజుగారని పత్తేపురంలో ఓరియంటల్ కాలేజ్ పెట్టారు. పెద్ద చరిత్ర ఉన్న వ్యక్తి. మంత్రిగా కూడా చేశారు. ఆయన వెస్ట్ గోదావరిలో 60 స్కూల్స్, 12 కాలేజీలు పెట్టారు. మూర్తిరాజుగారితో నాకు మంచి అనుబంధం ఏర్పడి, ఆయన పెట్టిన హైస్కూల్లో చదువుకుని, ఆ తర్వాత పత్తేపురంలోని ఓరియంటెల్ కాలేజీలో చదివాను. అక్కడే భాషా ప్రవీణ పాసయ్యాను. ఆ తర్వాత ఆయన స్కూల్లోనే ఉద్యోగం ఇచ్చారు. మీ చదువు విషయంలో మీ అమ్మగారి ప్రోత్సాహం ఎలా ఉండేది? ఎమ్మెస్: మా నాన్నగారు చదువుకోలేదు కానీ, మా అమ్మగారు చదువుకున్నారు. ఆవిడ బాగా ప్రోత్సహించేవారు. పత్తేపురం కాలేజీలో చదువుతున్నప్పుడు నాన్నగారికి తెలియకుండా అమ్మ నాకు బట్టలు, బియ్యం పంపించేవారు. అసలు మీ నాన్నగారికి చదువంటే ఎందుకిష్టం లేదు? ఎమ్మెస్: మనుషులను నమ్మితే లాభం లేదు.. మట్టిని నమ్ముకుంటే అన్నం పెడుతుంది అనేవారు. కానీ ఓసారి నా చదువు గురించి మా ఊరి కరణంగారు, మరికొంతమంది ‘మీవాడు సంస్కృతం చదువుతున్నాడు. మా పిల్లల్ని చదివించాలని ఉన్నా చదువుకోలేకపోతున్నారు’ అనడంతో నాన్నగారు కన్విన్స్ అయ్యి, అప్పట్నుంచీ చదువుకోమని ప్రోత్సహించారు. ఆ సమయంలోనే కొన్ని రచనలు చేశారట? ఎమ్మెస్: హైస్కూల్లో పని చేస్తున్న సమయంలో 1977 నవంబర్ 19 అర్ధరాత్రి దివిసీమ ఉప్పెనలు వచ్చాయి. అక్కడికెళ్లి, శవాలను చూసి కదిలిపోయాను. ఆ మానసిక స్థితి నన్ను ‘జీవచ్ఛవాలు’ అనే నాటిక రాసేలా ప్రేరేపించింది. ఆ నాటికను జిల్లా అంతా ప్రదర్శించి, బట్టలు, బియ్యం సేకరించి, బాధితులకు అందజేశాం. ఆ నాటికలో నేను యాక్ట్ చేయలేదు. హైస్కూల్ పిల్లలతో యాక్ట్ చేయించాను. నాది రచన, దర్శకత్వం మాత్రమే. టీచర్‌గా మీ ప్రస్థానం గురించి... ఎమ్మెస్: తెలుగు పండిట్‌గా చేస్తూ.. ఎంఏకి కట్టాను. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాను. భీమవరంలోని కేజీఆర్ కాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగం సంపాదించాను. అదప్పుడు ఎయిడెడ్ కాలేజ్ కాదు... అన్ఎయిడెడ్. అందుకని నాకు 250 రూపాయలు మాత్రమే జీతం ఇచ్చేవారు. కానీ అంతకు ముందు మున్సిపల్ హైస్కూల్లో నాకు ఎనిమిది వేల రూపాయలు వచ్చేవి. లెక్చరర్ అవాలనే ఆకాంక్షతో ఆ జాబ్‌కి రిజైన్ చేసి, తక్కువ జీతమైనా కాలేజీలో చేరాను. ఆ తర్వాత రెండేళ్లకు ఎయిడెడ్ అయ్యింది. దాంతో పూర్తి జీతం వచ్చింది. కాలేజ్‌లో పని చేస్తున్నప్పుడూ మీ నాటక రచన కంటిన్యూ అయ్యిందా? ఎమ్మెస్: మా కాలేజీకి నేనే ఫైన్ఆర్ట్స్ కన్వీనర్‌ని. నాటకాల మీద ఇంట్రస్ట్ ఉన్నవారిని తీసుకుని, ‘ప్లస్ అండ్ ఇంటూ ఆర్ ఈక్వల్’ అనే నాటిక రాశాను. ప్లస్ అంటే కలిసి ఉండటానికి గుర్తు. ఇంటూ అనేది వ్యతిరేకతకు గుర్తు. కానీ ఈ రెండూ ఏదో ఒకచోట కలవక తప్పదనేది ఈ నాటిక సారాంశం. ఆంధ్రా యూనివర్శిటీ ‘యూత్ ఫెస్టివల్’లో ఈ నాటికను ప్రదర్శించాం. అక్కడ ఎనిమిది ప్రైజులుంటే, మా నాటికకు ఆరు వచ్చాయి. దాంతో అందరి దృష్టీ నా మీద పడింది! ‘నీలో చాలా టాలెంట్ ఉంది. సినిమా ఫీల్డ్కి వెళ్లొచ్చుగా’ అన్నారు చాలామంది. ఇదేదో బావుందనుకుని, సర్కార్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి, మద్రాస్ వెళ్లాను. ఆ రకంగా ఆ నాటిక నా సినిమా జీవితానికి నాంది అయ్యింది. అప్పటికి మీకు పెళ్లయ్యిందా? ఎమ్మెస్: అప్పటికే (1972) పెళ్లయ్యింది. జనరల్‌గా సినిమా పరిశ్రమ అంటే పంపించడానికి ఇష్టపడరు. కానీ మా ఆవిడ నన్ను ప్రోత్సహించింది. దాంతో ఓ నమ్మకంతో మద్రాసు ప్రయాణమయ్యాను. మీది ప్రేమ వివాహమటగా? ఎమ్మెస్: అవును. నేను భాషాప్రవీణ చదువుతున్నప్పుడు తను నా క్లాస్మేట్. ప్రేమించి పెళ్లాడాను. ఇద్దరివీ వేర్వేరు కులాలు. ఆ రోజుల్లో కులాంతర వివాహం అంటే చిన్న విషయం కాదు.. మరి మీ ఇంట్లో ఒప్పుకున్నారా? ఎమ్మెస్: మా ఇద్దరి ఇళ్లలోనూ ఒప్పుకోలేదు. నేను భాషాప్రవీణ చదువుతున్నప్పుడు పరుచూరి గోపాలకృష్ణగారు ఫైనల్ ఇయర్లో మాకు లెక్చరర్. కమ్యూనిస్టు భావాలున్న వ్యక్తి. ఆయన ఆధ్వర్యంలోనే పెళ్లి చేసుకున్నాం. అప్పుడే నాకు భీమవరంలో జాబ్ వచ్చింది. మా ఆవిణ్ణి కూడా భాషాప్రవీణ చదివించాను. ఆవిడకీ భీమవరం హైస్కూల్లో జాబ్ వచ్చింది. ఇంతకూ మీ పెద్దలు ఎప్పటికి ఒప్పుకున్నారు? ఎమ్మెస్: నాలుగైదేళ్లు మేం పెద్దలకు దూరంగానే ఉన్నాం. మా అన్నదమ్ములు మాత్రం వస్తుండేవాళ్లు. ఆ తర్వాత నాలుగేళ్లకు మా నాన్నగారు మమ్మల్ని రానిచ్చారు. నటుడిగా మీ వైభవాన్ని మీ అమ్మానాన్నలు చూశారా? ఎమ్మెస్: మా నాన్నగారు చూడలేదు. రచయితగా నేను ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ‘ఎందుకు రా జీవితాన్ని పాడు చేసుకుంటున్నావ్.. పిచ్చి వెధవా’ అని తిట్టేవారాయన. ఆ తర్వాత ‘పేకాట పాపారావు’ సినిమాకి రచయితగా నా పేరు చూసి, ఆనందించారు. అమ్మ రెండేళ్ల క్రితమే చనిపోయారు. ఆమె నా ఎదుగుదలను పూర్తిస్థాయిలో చూశారు. మద్రాసు లైఫ్కొద్దాం... ఊరు కాని ఊరు. లైఫ్ ఎలా ఉండింది? ఎమ్మెస్: ఆకురాజు పున్నంరావుగారని మా ప్రిన్సిపాల్ ఉండేవారు. ఓసారి ఆయన ‘ఒరేయ్.. మీ దగ్గర డిక్షనరీ ఉందా’ అని అడిగి, అందులో ‘ఫియర్, రెస్ట్ ’ అనే పదాలను కొట్టేయండన్నారు. అప్పట్నుంచీ ఇప్పటివరకూ నా జీవితంలో ఆ రెండూ లేవు. మా నాన్నగారు చదువుకోకపోయినా మహత్తరమైన వ్యక్తి! ఆయన ఓసారి ఏం చెప్పారంటే, ‘నిద్ర వచ్చినప్పుడే పడుకో. నిద్ర రాకుండా పడుకోవద్దు. ఏదో ఒక పని చేస్తుండు’ అన్నారు. అది ఫాలో అవుతుంటాను. ఖాళీ సమయంలో ఏదైనా పుస్తకం చదవడమో, ఏదో ఒక పని చేయడమో నాకు అలవాటు. అంతేకానీ ఖాళీ దొరికినప్పుడల్లా సోఫాలోనో, మంచం మీదో వాలిపోను. మద్రాసు వెళ్లేటప్పుడు ఒకటే అనుకుని రెలైక్కా - ‘మనం చేసేది మంచిపని. ఎవర్నీ మోసం చేయబోవడంలేదు. ప్రతిభ ఉంది కాబట్టి.. ఓ ప్రయత్నం చేయబోతున్నాం’ అని! అంటే.. ఆర్థికపరమైన భయం కూడా లేదా? ఎమ్మెస్: లేదు! దానికి కారణం మా ఆవిడ. నేను మంచి రచయితనవుతాననే నమ్మకం ఆవిడకి బలంగా ఉండేది. అప్పటికి మాకిద్దరు పిల్లలు. ఇద్దర్నీ చూసుకుంటాను మీరు వెళ్లండని భరోసా ఇచ్చింది. మరి ఉద్యోగం ఏమయింది? ఎమ్మెస్: శని, ఆదివారాల్లో మద్రాస్ వెళ్లేవాణ్ణి. బోల్డన్ని కథలు రాసుకుని, ఓ ఐదేళ్లపాటు చాలామందికి వినిపించాను. కానీ ఫలితం కనిపించకపోయేసరికి ‘లాస్ ఆఫ్ పే’ పెట్టి, మద్రాసులోనే ఉండటం మొదలుపెట్టాను. దాంతో అలెగ్జాండర్, పేకాట పాపారావు, హలో నీకు నాకు పెళ్లంట, ప్రయత్నం... ఇలా ఎనిమిది సినిమాలకు కథలందించగలిగాను. అప్పుడే రవిరాజా పినిశెట్టిగారితో పరిచయం ఏర్పడింది. ఆయన దర్శకత్వం వహించిన ‘ఎమ్. ధర్మరాజు ఎం.ఎ’లో వేషం ఇచ్చారు. అది నేనూహించలేదు! ఊహించని ఆ మలుపుకి ఎలా రియాక్ట్ అయ్యారు? ఎమ్మెస్: రవిరాజాగారితో ‘కాలేజీలో జాబ్ చేస్తున్నా.. వీలు పడదేమో’ అంటే, ‘మీరు మంచి నటుడవుతారు’ అని నమ్మకంగా చెప్పారాయన. ఆ మాటకు ఆ సినిమాలో యాక్ట్ చేశా. ఆ పాత్ర పండింది. ఆ తర్వాత ఆయనే పెదరాయుడు, అరణ్యం, రాయుడు... ఇలా వరసగా ఏడు సినిమాలకు అవకాశం ఇచ్చారు. ఏడో సినిమానే ‘రుక్మిణి’! అందులో మంచి వేషం చేశాను. కథ కూడా ఇచ్చాను. సినిమా అద్భుతంగా ఆడలేదు కానీ, నా పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. అది చూసి, ఈవీవీ సత్యనారాయణగారు ‘మా నాన్నకి పెళ్లి’లో మంచి కేరక్టర్ ఇచ్చారు. ఆ పాత్ర నా జీవితానికే మలుపయ్యింది. ఎలాంటి మలుపు అంటే ఒక వృత్తి నుంచి ఇంకో వృత్తికి మారేంత. ఆ సినిమా తర్వాత లెక్చరర్ జాబ్‌కి రిజైన్ చేయాలని నిర్ణయించుకున్నారా? ఎమ్మెస్: నేను డిసైడ్ చేయలేదు. ఇండస్ట్రీ డిసైడ్ చేసింది. ‘మా నాన్నకి పెళ్లి’ రిలీజైన ఐదారు రోజులకి ఇరవై సినిమాలు కమిట్ అయ్యాను. అది మొదలు ఇప్పటివరకు వెనక్కి తిరిగి చూసే పరిస్థితి రాలేదు. 1997 డిసెంబర్లో ‘మా నాన్నకి పెళ్లి’ చేశాను. ఆ సినిమాకి నంది వచ్చింది. ఆ తర్వాత 1999, 2000, 2003 సంవత్సరాల్లో నంది అవార్డులు తెచ్చుకున్నాను. ఇటీవల ‘దూకుడు’తో ఐదో నంది అందుకున్నాను. దాదాపు పది, పదిహేను సినిమాలు తక్కువగా 700 సినిమాలు చేశాను. ఒక లక్ష్యం సాధించిన తర్వాత జీవితం పూలబాట అవుతుంది. కానీ లక్ష్యసాధనలో భాగంగా పడిన కష్టాలు మామూలుగా ఉండవు. మరి.. బ్రేక్ వచ్చేంతవరకు మీరు పడిన బాధలు, అవమానాలు ఏమైనా ఉన్నాయా? ఎమ్మెస్: చాలా ఉన్నాయి! దాదాపు పన్నెండేళ్లు నేను పడిన కష్టాలు భయంకరం! ఎవరూ తట్టుకోలేరు. వెనక్కెళ్లిపోతారు. ఒక దశలో విరక్తి చెంది, మా ఊరెళ్లిపోదామనుకున్నాను. మర్నాడు రెలైక్కడానికి టిక్కెట్ కూడా తెచ్చుకున్నా. ఆ రాత్రి రూమ్‌లో కూర్చుని ఆలోచనలో పడ్డాను. ఆ ఆలోచనలను పేపర్ మీద పెట్టడం మొదలుపెట్టాను. అప్పుడు నేను రాసిన కథలు గుర్తొచ్చాయి. నా అన్ని కథల్లో హీరో సినిమా మొత్తం కష్టపడి చివరికి అనుకున్నది సాధిస్తాడు. ‘మనం రాసిన కథల్లో హీరోలు మాత్రం అష్టకష్టాలు పడాలి. మనం పడకూడదా?’ అని ఎందుకో అనిపించింది. అంతే.. ‘ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్లు... ప్రయత్నం విరమిస్తే మరణించినట్లు’ అని పేపర్ మీద రాసుకున్నా. దాన్ని గోడకి అంటించి, టికెట్ చించేశాను. ఆ తర్వాతే రవిరాజాగారికి ‘సవ్యసాచి’ అనే కథ ఇచ్చాను. ఆ కథను తీసుకున్నారాయన. అప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందిపడేవాణ్ణి. మా ఆవిడే డబ్బులిచ్చేది. రవిరాజాగారు ఆ కథ తీసుకుని, ‘ఎంతివ్వమంటారు’ అనడిగారు. ఎంతడగాలో తెలియక ‘మీ ఇష్టం’ అన్నాను. ‘యాభైవేలిస్తా’ అనగానే, ‘నా గుండె ఆగినంత పనయ్యింది’. అదే స్వీట్ షాక్ అంటే... ‘మీరు చెప్పిన పద్ధతికి ఓ ఐదు వేలు బహుమతి’ అంటూ మొత్తం యాభైఐదు వేలిచ్చారు రవిరాజాగారు. ఇదంతా ఆర్టిస్ట్ అవకముందు దశ. ఆ తర్వాతే ‘ఎమ్. ధర్మరాజు ఎంఎ’తో నన్ను నటుణ్ణి చేశారు. ఆ సినిమా తర్వాత పార్టీ ఇచ్చి, ‘మీరు నంబర్‌వన్ కమెడియన్ అవుతారు’ అన్నారు. అది సాధించడానికి చాలాకాలం పట్టింది. కానీ దర్శకుడిగా ఆయన విజన్‌ని మాత్రం అభినందించాల్సిందే. నటించగలిగింది నటుడే కావచ్చు.. కానీ నటుణ్ణి కనిపెట్టగలిగేది దర్శకుడే. అందుకే దర్శకుడు గ్రేట్. లెక్చరర్‌గా చేస్తూ కొన్నేళ్లపాటు ప్రతి శనివారం మద్రాసు వెళ్లేవాణ్ణన్నారు. కష్టమనిపించలేదా? ఎమ్మెస్: ‘స్ట్రగుల్ ఫర్ ఎచీవ్మెంట్’ పేరుతో ఒకాయన పుస్తకం రాస్తున్నారు. ఓ ఏడాదిలో ఆ పుస్తకం వచ్చేస్తుంది. ఒకటి ఎచీవ్ చేయడానికి నేనెంత స్ట్రగుల్ పడ్డానో వాటి సమాహారంతో ఈ పుస్తకం ఉంటుంది. నిడమర్రు టు మద్రాసు సాగించిన ప్రయాణాల్లో నేను పడ్డ కష్టాలు ఎనలేనవి. అవెలాంటి కష్టాలు? ఎమ్మెస్: ఓసారి టిక్కెట్ తీసుకుని, హాయిగా నా బెర్త్ మీద పడుకున్నాను. మిగతా బెర్తుల్లో ఉన్న ఏడుగురు విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్లడానికి అర్జంటుగా రెలైక్కడంతో టిక్కెట్స్ తీసుకోలేదట. ఆ విషయం గురించి వాళ్లు మాట్లాడుకుంటూ.. పక్క స్టేషన్లో దిగి, టికెట్ తీసుకోవాలనుకుంటున్నారు. అక్కడే ఉన్న మరో వ్యక్తి వీళ్ల మాటలు విని, ‘స్టేషన్ మాస్టర్ మా బాబాయే. ఒంగోలులో దిగి, నేను టిక్కెట్స్ తీసుకొస్తా’ అంటూ వాళ్ల దగ్గర డబ్బులు తీసుకున్నాడు. పైన నిద్రపోతున్న నన్ను చూపించి ‘తను నా తమ్ముడే.. చూసుకోండి’ అంటూ నన్ను తాకట్టు పెట్టి, ట్రైన్ దిగాడు. ఇక వెనక్కి రాలేదు. దాంతో, వాళ్లు నన్ను నిద్ర లేపి, ‘మీ అన్నయ్య ఇంకా రాలేదేంటి’ అనడిగితే, నేను షాకయ్యాను! ‘మా అన్నయ్య ఎవరూ లేరు’ అని చెప్పినా వినకుండా, నా సూట్‌కేస్ లాకున్నారు. కొట్టడానికి సిద్ధపడితే, ‘కొట్టొద్దు.. చైన్ లాగేసి, పోలీసులకు పట్టిస్తా’ అని రివర్స్‌లో బెదిరించాను. నా సూట్‌కేస్ ఇవ్వకపోతుంటే, గూడూరులో ట్రైన్ ఆగగానే, పరిగెత్తుకుంటూ వెళ్లి.. స్టేషన్ మాస్ట్టర్ దగ్గర, నా టిక్కెట్ చూపించి, జరిగినదంతా చెప్పాను. దాంతో వాళ్ల దగ్గర్నుంచి సూట్‌కేసు లాక్కుని, నాకిచ్చి వాళ్లని కిందకు దించేశారు. నా ప్రయాణాల్లో ఇలాంటి చేదు అనుభవాలు బోల్డన్ని ఎదుర్కొన్నాను. నటుడిగా మారిన తర్వాత రచనకు దూరమయ్యారు కదా! అసలు రచయితగా మీకు తీరని కోరిక ఏమైనా ఉండేదా? ఎమ్మెస్: ఏ సినిమా సక్సెస్కైనా కథే ప్రధానం. సినిమా సక్సెస్‌కి హీరోయే కారణం అయితే.. ప్రతి సినిమా ఆడాలి కదా. కానీ ఆడటంలేదే. బాగున్న కథలే విజయం సాధిస్తున్నాయి. రచయిత అనేవాడు మంచి కథ ఇస్తేనే కదా, ఇళయరాజాలాంటి సంగీతదర్శకులు పాటలిచ్చేది. అలాంటప్పుడు, వారి ఫొటోలు పోస్టర్‌పైన వేస్తున్నప్పుడు, అన్నిటికీ మూలమైన రచయిత ఫొటో ఎందుకు వేయకూడదు అనిపించేది. కాబట్టి రచయిత బొమ్మ వేసేదాకా రాయాలని బలంగా నిర్ణయించుకున్నాను. కథలు బోల్డన్ని రాసుకుని, సినిమా ఆఫీసులకు వెళ్లేవాణ్ణి. మొదట్లో అన్ని ఆఫీసులకు కాలినడకన, ఆ తర్వాత అద్దె సైకిలు మీద వెళ్లేవాణ్ణి. అప్పుడు ఓ కో-డెరైక్టర్ ‘సైకిల్ మీద రాకండి. కథలు వినరు. ఓ స్టేచర్ ఉండాలి’ అన్నాడు. దాంతో వెళ్లగలిగితే ఆటోలో, లేకపోతే నడుచుకుంటూ వెళ్లేవాణ్ణి. అలాంటి సమయంలో ఓ దర్శకుడు నా కథ తీసుకున్నాడు. రచయితగా నా పేరు వేశారు. నేను మా ఊరెళ్లి మా కాలేజీలో కూడా చూపించుకున్నాను. కానీ ఆ తర్వాత నా పేరు తీసేసి ఇంకో రచయిత పేరు వేశారు. దాంతో కాలేజీలో నా పరువు పోయినంత పనయింది. అదో అవమానంగా భావించాను. ఆ నిర్మాతను అడిగితే, నా పేరు, ఇంకో రచయిత పేరు కలిపి వేశారు. ఆ సినిమాకి కథ, మాటలు మొత్తం నేనే అందించాను. ఆ కథను నిర్మాతకు, అతని బావమరిదికి, దర్శకుడికి... ఇలా ఒకే రోజులో ఏడుగురికి చెప్పించారు. ఇక, నా కష్టం ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆ రోజు నేను కష్టపడ్డాను. కానీ, నన్ను కష్టపెట్టినవారికన్నా నా భవిష్యత్తే బాగుంది. భగవంతుడు నాకే మంచి మార్గం చూపించాడు. దానికి కారణం నా నిజాయితీ, ప్రతిభ, నా కష్టమే. వాల్‌పోస్టర్ మీద రచయితగా మీ బొమ్మ చూసుకోకుండానే, రచనలు మానేశారు... బాధ అనిపించలేదా? ఎమ్మెస్: రచయిత అనేవాడు పుస్తకాలు రాయకపోయినా, రచన అనేది అతని జీవన పరిధిలో ప్రతిచోటా ఉపయోగపడుతుంది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, ప్రవర్తించేటప్పుడు, నటించేటప్పుడు ఉపయోగపడుతుంది. జీవితాన్ని రచించుకోగలిగినవాడే మంచి రచయిత. ఆ విధంగా నాలో రచయిత మరుగునపడిపోలేదు. కానీ పేపర్ మీద రాయలేదనే ఫీలింగ్ కొంత ఉంది. నటన సులువు కాదు. పైగా నేను షిఫ్టులవారీగా చేయడంతో, ఒత్తిడికి గురవుతుంటాను. ఆ ఒత్తిడిలో ఇక ఏం రాయగలను? కానీ నాలోని రచయిత షూటింగ్స్‌లో సీన్స్‌కి ఉపయోగపడతాడు. లెక్చరర్ అంటే.. కొంచెం గంభీరంగా ఉంటారు. దానికి పూర్తి వ్యతిరేకంగా నవ్వించే పనిని అంగీకరించారు మీరు. అసలు మీకు సెన్సాఫ్ హ్యుమర్ ఎలా అలవడింది? ఎమ్మెస్: లెక్చరర్స్ అందరూ గంభీరంగా ఉండరు. కొంతమంది మాత్రమే. అలాగే వారిలో సెన్సాఫ్ హ్యూమర్ ఉన్నవాళ్లూ ఉంటారు. నాకు చిన్నప్పట్నుంచీ సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ. క్లాస్‌రూమ్‌లో నేను పాఠాలు చెప్పేటప్పుడు సందర్భోచితమైన ఛలోక్తులు కలిపి చెప్పేవాణ్ణి. దాంతో పక్క క్లాసువాళ్లు కూడా వచ్చి వినేవాళ్లు. పిల్లలను విపరీతంగా నవ్వించేవాణ్ణి. భారత రామాయణాలని సోషలైజ్ చేసి, చెప్పేవాణ్ణి. అయితే స్టూడెంట్స్‌లో బాగా ఫాలోయింగ్ వచ్చుండాలే...! ఎమ్మెస్: అవును, సినిమాల్లోకి రాకముందు నాకు ఫాన్స్ ఉండేవారు. మా ‘నారాయణ మాస్టార్’ అంటూ అభిమానంగా ఉండేవాళ్లు. నా శిష్యుల్లో ఎంతోమంది జిల్లా కలెక్టర్లు, ఐఏయస్, ఐపీఎస్ ఆఫీసర్లు, అమెరికాలో జాబ్ చేస్తున్నవాళ్లు ఉన్నారు. ‘దేవదాస్’ సినిమా షూటింగ్ కోసం అమెరికా వెళ్లినప్పుడు పన్నెండు మంది శిష్యులు ప్రతి రాత్రి కార్లేసుకొచ్చి, అమెరికా అంతాతిప్పారు. జనరల్‌గా మన దగ్గర చదువుకున్న పిల్లలు, మనకన్నా గొప్పవాళ్లు అవుతారు. ఏ కలెక్టర్‌గానో, ఐపీఎస్గానో... అలా! కానీ నా శిష్యులతో పాటు నేనూ ఎదిగాను (నవ్వుతూ) ఓ మోస్తరు ఎక్కువగానే! నేను సాధించింది వాళ్లు సాధించినట్లుగా ఆనందపడేంత శిష్యులు ఉన్నారు నాకు. మీ అబ్బాయి గురించి మాట్లాడదాం... విక్రమ్ కెరీర్ విషయంలో ఎదురుదెబ్బ తిన్నట్టున్నారు? ఎమ్మెస్: నా ఇమేజ్ వాడికి అడ్డంకి అయ్యింది. నాలాగే వాడూ నవ్విస్తాడనుకున్నారు ప్రేక్షకులు. అందుకే ‘కొడుకు’ సినిమా వాళ్లని నిరుత్సాహపరిచింది. నాకు ఫైన్ ఆర్ట్స్ తెలుసు కానీ కామర్స్ తెలియదు. నేను చదివింది బీఏ... బీకామ్ కాదు. అందుకని కమర్షియల్ ఎస్టిమేషన్ తెలియలేదు. పెద్దపెద్ద నిర్మాతలే వాళ్ల తనయుల్ని సక్సెస్ చేయలేకపోతున్నారు. నేనెంత? డబ్బుపెట్టి, మంచి సినిమా తీయడం మాత్రమే కాదు.. ఆ సినిమాని కమర్షియల్‌గా వర్కవుట్ చేసుకోవడం కూడా తెలియాలి. మా అబ్బాయి హీరోగా నేను ‘కొడుకు’ సినిమాని బాగానే తీశాను. నన్నెవరూ తప్పు పట్టలేదు. విక్రమ్‌నీ తప్పు పట్టలేదు. బాక్సాఫీస్ దగ్గర సరిగ్గా రిలీజ్ చేయడం చేత కాలేదు. పంపిణీ వ్యవస్థ గురించి నాకిప్పటికీ తెలియదు. థియేటర్లో ప్రేక్షకులు కొనుక్కునే టికెట్ డబ్బు నిర్మాతకు ఎలా చేరుతుందో తెలియదు. ఆ మార్గం తెలిసుంటే ‘కొడుకు’ సేఫ్ ప్రాజెక్టే. కమెడియన్ కొడుకు కమెడియనే ఎందుకవ్వాలి.. హీరోగా ఎందుకు చేయకూడదని మీ అబ్బాయిని హీరోని చేశారా? లేక మీ అబ్బాయి హీరో మెటీరియలే అని నమ్మి చేశారా? ఎమ్మెస్: కమెడియన్ కొడుకు కమెడియనే ఎందుకవ్వాలి అని మనం అనుకోవచ్చు. కానీ ప్రేక్షకులు అనుకోరు. వాళ్ల అభిప్రాయాన్ని మార్చలేముగా! విక్రమ్‌తో సినిమా చేసేటప్పుడు.. నగేష్గారి కొడుకు ఆనంద్ సక్సెస్ అవ్వలేదు. ఇంకా కొంతమంది హాస్యనటుల కొడుకులు సక్సెస్ అవ్వలేదని కొంతమంది ఉదాహరణలు చెప్పారు. మా అబ్బాయి పక్కా హీరో మెటీరియలే అనే కాన్ఫిడెన్స్‌తోనే తీశాను. కెమెరా ముందు హైటు ప్రాబ్లమ్ ఉండదు. ఉదాహరణకు మన హీరోల్లో.. హైటు తక్కువ ఉన్నవాళ్లల్లో కూడా అద్భుతమైన హీరోలు ఉన్నారు. ఇతర భాషల్లో కూడా హైటు తక్కువ ఉన్నవాళ్లల్లో మంచి హీరోలు చాలామందే ఉన్నారు. ఆ చిత్రం ద్వారా ఆర్థికంగా బాగానే నష్టపోయారు కదా..? ఎమ్మెస్: అవును. అయినా అదేం పెద్ద లెక్క కాదు. ఎందుకంటే, దానికంటే ఎక్కువే సంపాదించాను. ఓ ప్రయత్నం చేయాలనుకుని చేశాను. దాన్ని ఓటమి అనుకోవడంలేదు. మళ్లీ మీ అబ్బాయి విక్రమ్ సినిమా చేస్తారా? ఎమ్మెస్: చేయొచ్చు. తన ప్లానింగ్స్ ఏవో తనకున్నాయి. ఆ ప్లాన్స్ గురించి తనే చెబుతాడు. ‘దుబాయ్ శీను’ సినిమాలో సాల్మన్ రాజు పాత్రకు ఓ పెద్ద నటుణ్ణి అనుకరించారు. ఆ తర్వాత కూడా అలాంటి పాత్రలు చేశారు. అలా చేయడం వివాదాస్పదం అవుతుందని ఎప్పుడూ అనిపించలేదా? ఎమ్మెస్: ఓ ఆర్టిస్ట్‌గా దర్శకుడు ఏం చెబితే అది చేయడమే నా బాధ్యత. ఆ స్టార్ ఎంతో ఫేమస్ అయితేనే దర్శకుడు పేరడీ చేయిస్తాడు. అయినా ఆ పేరడీలు వివాదం అవుతాయనుకోలేదు. ఎందుకంటే, అవన్నీ కామెడీ కోసమే. మందు కొట్టే పాత్రలను అద్భుతంగా పండిస్తారు. నిజంగా అలవాటుంది కాబట్టే.. అంతలా పండిస్తున్నారా? ఎమ్మెస్: రియల్ లైఫ్ అలవాటుకీ దానికీ సంబంధం లేదు. ఎందుకంటే, నిజజీవితంలో అలవాటుంది కాబట్టే.. బాగా చేస్తున్నానని అంటే, మరి ఆ పాత్రలు చేసేటప్పుడు తాగి నటించాలిగా. నేనలా చేయను. రవిరాజాగారు ఫస్ట్ తాగుబోతు పాత్ర ఇచ్చినప్పుడు, అసలు తాగినవాడు నత్తిగానే ఎందుకు మాట్లాడాలి? కిక్కుండాలి.. నత్తి ఉండకూడదని మంచి డిక్షన్‌తో డైలాగ్ చెప్పాను. ఆ మాడ్యులేషన్లో ఓ స్వీట్నెస్ ఉంటుంది. అది ప్రేక్షకులకు నచ్చింది. నేను చేసే తాగుబోతు పాత్రలు సక్సెస్ అవ్వడానికి కారణం, ఆ పాత్ర మర్డర్లు, మానభంగాలు చేయదు, దుష్ట పనులేవీ చేయదు. నవ్విస్తుంది. అందుకే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఓ సినిమాలో మందు తాగే పాత్రలో ‘నేను టాక్స్ పేయర్’ని అంటూ తాగడాన్ని కన్విన్సింగ్‌గా డైలాగ్ రూపంలో చెప్పారు? నిజంగా కూడా అలానే ఫీలై, తాగుతారా? మందు తాగడం మంచిది కాదని మీకు తెలియదా...? ఎమ్మెస్: మందు నాకు హాని కాదు. నా లైఫ్‌ని తీసుకుందాం. షూటింగ్స్ కారణంగా రెస్ట్‌లెస్‌గా ఉంటాను. ఆ అలసట పోగొట్టుకోవడానికి చిన్న పెగ్ తీసుకుని, హాయిగా నిద్రపోతాను. దానివల్ల నాకు ఎనర్జీ వస్తుందే తప్ప, జీవితం నాశనం అయిపోయే రేంజ్ ఉండదు. ఇంకోటి ఏంటంటే, ఆరోగ్యాన్ని పాడు చేసే చీప్ లిక్కర్ జోలికి వెళ్లను. చాలామంది ప్రచారం చేస్తున్నట్లుగా నేను బీభత్సమైన తాగుబోతుని కాదు! అలా మీ మీద దుష్ర్పచారం చేస్తున్నదెవరంటారు...? ఎమ్మెస్: పేర్లు అనవసరం. అసూయతో ప్రచారం చేస్తుంటారు. అవన్నీ పట్టించుకోను. మనం గొప్పవాళ్లమైతేనే ఎదుటివాళ్లకు అసూయ కలుగుతుంది. అలాగే ఎప్పుడైతే మన గురించి అలా లేనిది ప్రచారం చేస్తున్నారో అప్పుడు వాళ్లు మనకు భయపడుతున్నట్లే లెక్క. నేనెప్పుడూ నా గురించి ఆలోచిస్తాను. ఎదుటివాడి గురించి అస్సలు ఆలోచించను. - డి.జి. భవాని *********** నా పూర్తి పేరు మైలవరపు సూర్యనారాయణ. స్కూల్లో ఎమ్మెస్గారనేవారు. పెద్దవాళ్లు ‘సూన్నారాయణ’ అనేవాళ్లు. లెక్చరర్ అయ్యాక తొలి ఉగాదికి ‘ఎమ్మెస్ నారాయణ’ అని మార్చుకున్నాను. అప్పుడో గేయం రాశాను. ఇంత పొడుగు పేరెందుకని, ‘ఎమ్మెస్ నారాయణ’ అని పెట్టుకున్నాను. నేను ‘కాళిదాసు’ని ఎక్కువగా చదివాను. ఎంఏ ప్రీవియస్‌లో ‘ఇండియా ఈజ్ కాళిదాస్’ అని రాశాను. ఎందుకంటే, భారతదేశం అంటే.. నా దృష్టిలో ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాదిన సముద్రం.. ఇది కాదు.. ‘కల్చర్’. వాటీజ్ ది ఇండియన్ కల్చర్ అనేది కాళిదాసు రాశారు... వివేకానందుడు ప్రపంచానికి చెప్పారు. 1921లో చికాగోలో జరిగిన హిందూ మత మహాసభల్లో వివేకానందుడు మాట్లాడి ఉండకపోతే.. మన దేశం గురించి ప్రపంచ దేశాలకు తెలిసి ఉండేది కాదు. దేవుణ్ణి నమ్ముతాను. పొద్దుటే లేచి, నమస్కారం పెట్టుకుంటాను. అప్పుడు నా మనసులో ఏమీ ఉండదు. దేవుడి ముందు ఎలాంటి ఎజెండాలూ పెట్టను. భగవంతుడి ముందు ఒక ఎజెండాను పెట్టడం ఆయన్ను ఫూల్ చేసినట్లేనని నా అభిప్రాయం. ఎందుకంటే నీ గురించి ఆ దేవుడికి తెలియదా? ఒకవేళ తెలియదని నీకనిపిస్తే.. సమస్యలు తెలియని దేవుడికి దణ్ణం పెట్టుకోవడం ఎందుకు? నీ గురించి ఆయనకు తెలుసు.. ఏం చేయాలో అది చేస్తాడు. పానగల్ పార్కులో పస్తులున్నవాళ్లల్లో పైకొచ్చినవాళ్లు చాలామంది ఉన్నారని ఎక్కడో చదివాను. ఆ జాబితాలో చిత్తూరు నాగయ్యగారు కూడా ఉన్నారు. అందుకని నా జేబులో డబ్బులున్నప్పటికీ కావాలనే భోజనం చేయకుండా, ఓ రోజంతా పానగల్ పార్క్‌లో గడిపాను (నవ్వుతూ). -
జగమంత కుటుంబంపాట కాదు... నా జీవితం!
పాట తప్ప, సీతారామశాస్త్రికి... వేరే స్వరూపం లేదు, సారూప్యం లేదు, సదృశమూ లేదు. పోనీ మాటల్లో? ‘బూడిదిచ్చేవాడినేది అడిగేది’ అని కదా అన్నాడు... అహాన్ని దహనం చేసుకుని, ఆ బూడిదగా కూడా మిగలని వాడితో... ఏం మాట్లాడి ఏం రాబడతాం? ఏం రాబట్టి ఏం రాస్తాం? ఒకర్ని ఒక మాట అనడు, అననివ్వడు. ‘మీరు గ్రేట్ సర్ ’ అంటే ఒప్పుకోడు. తనలోని జగమంత కుటుంబాన్ని చూపిస్తాడు. అందులో ఆయన తప్ప అంతా గ్రేట్‌గా కనిపించేలా చేస్తాడు! జీవితాన్ని, జీవితంలోని ప్రేమను, కవినీ, కవి డిగ్నిటీని... కళ్లకద్దుకుంటూ మాత్రమే తను కనిపిస్తాడు. మరెలా ఆయన్ని క్యాచ్ చెయ్యడం? కాని పని. నిర్నిమిత్తంలో, నిర్వికారంలో, నిరహంకారంలో... లుప్తమై విశ్వవ్యాప్తమైన సృజనశీలి ‘సిరివెన్నెల’! ఆ వెన్నెలలో లభించిన ఒకటీఅరా సాక్షాత్కారాలే... ఈవారం మన ‘తారాంతరంగం’! జీవితంలో సక్సెస్ మొదలయ్యేది మన ప్రజ్ఞ మనం తెలుసుకున్నప్పుడే. మీలో ఓ కవి ఉన్నాడని మీకెప్పుడు తెలిసింది? సిరివెన్నెల: అటు పల్లెటూరు, ఇటు పట్టణం.. రెండూ కాని ఓ ప్రాంతం. చదువుకున్నదేమో గవర్నమెంట్ బడి. ‘పాడిన వారు ఘంటసాల, సుశీల’ అని రేడియోలో చెబుతుంటే... ‘అదేంటి? పాడింది అక్కినేని, సావిత్రి అయితే.. ఘంటసాల, సుశీల అంటారు?’ అని నాకు నేనే ప్రశ్నించుకునే ఇన్నోసెన్స్. ఇలాంటి పరిస్థితుల్లో పెరిగిన నాకు... రాయడం అనే ఒక ప్రక్రియ ఉంటుందని, రాస్తారని ఎలా తెలుస్తుంది? కానీ ఏదో రాస్తూ ఉండేవాణ్ణి... నాకు తెలీకుండానే! నేను రాస్తున్నది కవిత్వం అని ఓ రోజు నా తమ్ముడు చెబితే కానీ నాకు అర్థంకాలేదు. అంటే.. బాల్యం నుంచీ అక్షరసాన్నిహిత్యం ఉండేదన్నమాట! సిరివెన్నెల: పుస్తకాల్లో అక్షరాలు కనిపిస్తే చాలు, నమిలి మింగేసేవాణ్ణి. మా నాన్నగారు గొప్ప పండితుడు, మానవతావాది, సాహితీ ప్రేమికుడు, గొప్ప ఫిలాసఫర్. హిమాలయ శిఖరం అంచుని నేలపై నిలబడి చూస్తే కనిపించదు... ఆయన కూడా అంతటి వారే! కానీ దురదృష్టం ఆయన 40 ఏళ్లకే స్వర్గస్థులయ్యారు. ఇప్పుడుంటే అద్భుతాలు చేసి ఉండేవారు. ఆయన ద్వారా నాకు సంక్రమించిన ఆస్తే నాకు అక్షరం. మీ నాన్నగారితో మరచిపోలేని సంఘటన ఏమైనా ఉందా? సిరివెన్నెల: నాకు చిన్నప్పుడు డైరీ రాసే అలవాటు ఉండేది. ఓరోజు ఆయన నా డైరీని చదువుతూ కనిపించారు. నాకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ‘అదేంటి? ఒకరి డైరీని అలా చదవడం కుసంస్కారం కాదా?’ అని ఆయన్ను సీరియస్‌గా ప్రశ్నించాను. ‘ఏం? దొంగల డైరీలు పోలీసులు చదవడంలేదా?’ అన్నారు నింపాదిగా నాన్న. ‘నేను దొంగనా...’ అన్నాను ఉక్రోషంగా. ‘నువ్వు దొంగవు కాకపోవచ్చు, కానీ నేను పోలీసునే. నా కొడుకు ఆలోచనాధోరణి ఎలా ఉందో తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది’ అన్నారు. పరులకు తెలియకూడని పనులు నువ్వెందుకు చేయాలి? పోనీ చేశావే అనుకో... అవన్నీ పుస్తకాల్లో రాయడమేంటి అర్థం లేకుండా? అవి నేను చూస్తే సంస్కారం లేదా అని నన్నడగటం ఏంటి?’ అంటూ ఆపకుండా అక్షింతలు వేశారు. ‘చూడు నాయనా... ప్రైవసీ, సీక్రెసీ అని రెండు ఉంటాయి. ప్రైవసీ అందరికీ ఉండాలి.. కానీ, సీక్రెసీ మాత్రం ఉండకూడదు. శరీరం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అలాగని బట్టలు విప్పేసి తిరగం కదా’ అని నాన్న చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తుండిపోయాయి. ఒక కవిగా సాహిత్యానికి మీరిచ్చే నిర్వచనం? సిరివెన్నెల: సాహిత్యం.. ఓ విరాట్ స్వరూపం! ఆ విరాట్ స్వరూపాన్ని ఒక్కసారిగా చూడలేక దాన్ని మనం విభజించుకున్నాం. కథ, కథానిక, కవిత, నాటకం, నాటిక, వ్యాసం... ఇలా! ఇది పాశ్చాత్యుల ప్రభావంతో జరిగిన విభజన. సాహిత్యానికి అసలైన రూపం మహాభారతం! అందులో వచనం ఉంటుంది, వర్ణనలుంటాయి, శ్లేషలు, ధ్వనులు ఉంటాయి. ‘సిరివెన్నెల వంటి సాహితీవేత్త సినీరంగంలోకి రావడం సినిమా అదృష్టం.. ఆయన చేసుకున్న దురదృష్టం. ప్రేక్షకుడి స్థాయిని పెంచిన కవి ఆయన’ అని ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ మీ గురించి అన్నారు. దానికి మీరు ఏకీభవిస్తారా? సిరివెన్నెల: కచ్చితంగా ఏకీభవించను! ఓ వ్యక్తి నా గురించి వ్యక్తపరిచిన అభిప్రాయం మాత్రమే అది. అదేం గీటురాయి కాదు, సర్టిఫికెట్ కాదు.. శిలాశాసనం అంతకన్నా కాదు. ‘ప్రేక్షకుడి స్థాయిని పెంచిన కవి సీతారామశాస్త్రి’ అంటే.. ప్రేక్షకులకు స్థాయి లేదనా? ఇప్పటివరకూ అందరూ స్థాయిలేని పాటలు రాశారనా? శ్రీశ్రీ, ఆత్రేయ, ఆరుద్ర, సినారె ఇత్యాది కవుల పాటలను ఆదరించిన అలనాటి శ్రోతలు స్థాయి లేనివారనా? అది తప్పు. సినిమాను నేను మరోతల్లిగా భావిస్తాను. నా భావాలను, ప్రతిభను ప్రపంచానికి వ్యక్తపరచడానికి సినిమా ఓ వేదిక అయ్యింది. అంతకంటే ఓ కళాకారుడికి ఏం కావాలి? సినిమా అంటే సకల కళల సమన్వయ వేదిక. ‘కావ్యేషు నాటకం రమ్యం’ అనే పదానికి పరిపూర్ణమైన రూపం సినిమా. అలాంటి సినిమాలో నేనూ ఓ భాగం అయినందుకు ఎప్పుడూ గర్విస్తాను. నాపై ఉన్న అభిమానంతో నా గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడాడు త్రివిక్రమ్. అనేకమంది భావాలను తన మాటగా వ్యక్తపరచినందుకు తివిక్రమ్‌కి రుణపడి ఉంటానని ఆ వేదికపైనే చెప్పాను. అంతేకానీ ‘అక్షర సత్యాలు మాట్లాడాడు త్రివిక్రమ్’ అని చెప్పలేదే! సినిమా సకల కళల సమన్వయ స్వరూపం అన్నారు. కానీ ప్రస్తుతం సినిమా అలా లేదు కదా? సిరివెన్నెల: నేను చెబుతున్నది సినిమా గొప్ప వేదిక అని! అందులో ఏ మాత్రం సందేహం లేదు. వేదిక గొప్పతనాన్ని ప్రతిబింబించేలా సినిమా లేకపోతే.. చూడకండి. శుభ్రంగా చాగంటి కోటేశ్వరరావుగారితో పురాణ కాలక్షేపం చెప్పించుకోండి. ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ‘పాడుతా తీయగా’ చూసుకోండి. సినిమా ఎవరు చూడమన్నారు? వేదిక అనేది పరమేశ్వర స్వరూపం. అది ఎప్పుడూ పూజనీయమైనదే! పాట ద్వారా సాహిత్యాన్ని వినిపించడమే కాదు, ఆ పదాల అర్థాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస పెంచిన రచయిత సిరివెన్నెల అని చాలామంది అభిప్రాయం... సిరివెన్నెల: అవునా.. ‘చిలక తత్తడి రౌతా.. ఎందుకీ హూంకరింత..’. మల్లాది రామకృష్ణశాస్త్రిగారు రాసిన ‘రహస్యం’ సినిమాలోని ఈ పాటను శ్రోతలు వినలేదా? ‘చిలక తత్తడి రౌతా..’ అంటే.. చిలకను వాహనంగా కలిగినవాడా. అంటే... ‘మన్మథుడా..’ అని! జనాలు విన్నారు... అర్థం తెలుసుకున్నారు. శ్రోతల మేథస్సును తక్కువ అంచనా వేయకూడదు. నా ‘విధాత తలపున’ పాటను అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారంటే కారణం.. నేను ఆ పాటను ‘సిరివెన్నెల’ సినిమా కోసం రాశాను కాబట్టి! అదే ఏ ‘యమకింకరుడు’ కోసమో రాసుంటే ఆ పాట గురించి మాట్లాడుకునేవారా? మీకు తెలీని విషయం ఏంటంటే... నేను కొన్ని రకాల పాటలు ఇప్పటికీ రాయలేను. మీరు రాయలేని పాటలు కూడా ఉన్నాయా? సిరివెన్నెల: ఎందుకుండవు? కొన్నికొన్ని పాటలుంటాయి. భలే తమాషాగా, తిక్కగా ఉంటాయి. ఉదాహరణకు ‘ప్రేమికుడు’ సినిమాలోని ‘మండపేట.. మలక్‌పేట.. నాయుడుపేట.. పేటర్యాప్..’ పాటనే తీసుకోండి. భలే ఉంటుంది ఆ పాట. ఎప్పుడు విన్నా కూడా ‘ఇలా రాయడం నావల్ల కాదేమో’ అనిపిస్తుంది. ‘జీన్స్’ సినిమాలో ‘కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవూ’ పాట విన్నప్పుడూ అలాంటి ఫీలింగ్ కలుగుతుంది. డెఫినిట్‌గా అలాంటివి నేను రాయలేను. మీ ఫ్లాష్‌బ్యాక్‌లోకి ఓసారి వెళితే.. అసలు ఇంతటి సాహితీ ప్రియులు టెలిఫోన్ శాఖలో ఎలా ఇమడగలిగారు? సిరివెన్నెల: జీవన కర్మక్షేత్రంలో తనకివ్వబడ్డ పనిని చేసుకొని పోవడం మానవధర్మం. ఇందులో ఇమడకపోవడానికి ఏముంది? ఇప్పుడు నేను చేస్తున్నది అదే! సద్గురువు సాంగత్యం లేకపోతే... ఇంత జ్ఞానసంపద అసాధ్యం! మీ గురువుల గురించి... సిరివెన్నెల: జన్మసిద్ధంగా మా నాన్నగారి నుంచి నాకు చాలా లక్షణాలు అలవడ్డాయి. సో... ఆ విధంగా నా తొలి గురువు ఆయనే! నా రెండో గురువు జీవితం! ప్రపంచంలో నేను చూసిన ప్రతి ఒక్కటీ నాకు గురువే! ఇష్టపడేవారు, ఇష్టపడనివారు... ఇలా అందరూ నాకు గురువులే! యోగీశ్వరులు శివానందమూర్తిగారు నా మూడో గురువు! కెరీర్ ప్రారంభంలోనే ‘విధాత తలపున’ లాంటి గొప్ప సాహిత్యంతో పాటలు రాసిన మీరు... కొన్ని సాధారణమైన పాటలు రాయడానికి అంతర్మథనానికి లోనౌతారా? సిరివెన్నెల: మీరంటున్న నా ‘సాధారణమైన పాట’... నా ‘విధాత తలపున’ కంటే ఏ విధంగా తక్కువో చెప్పండి. అప్పుడు అది రాయడానికి నేను పడ్డ అంతర్మథనం ఏంటో చెబుతాను. సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం లాంటి సినిమాల్లోని మీ పాటలన్నీ కావ్యాలని చాలామంది అభిప్రాయం... సిరివెన్నెల: ‘గుండెనిండా గుడిగంటలు, గువ్వల గొంతులు, ఎన్నో మోగుతుంటే... కంటి నిండా సంక్రాంతులు, సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే... వెంటనే.. పోల్చాను నీ చిరునామా ప్రేమా...’ ఈ కాన్సెప్ట్‌ని ఏ విధంగా వాటికంటే తక్కువ చేసి చూస్తారు మీరు? ఈ పాటలు ఆ పాటలంత గౌరవాన్ని పొందాయంటారా? సిరివెన్నెల: ఎందుకు పొందలేదు? ఎన్నో రసాల సమ్మేళనం జీవితం. ఒక చెట్టుని నువ్వు ఎన్ని రకాలుగా చూస్తే అన్ని రకాలుగా కనిపిస్తుంది. జీవితం కూడా అంతే. నీ బిడ్డను చూస్తూ... ‘అబ్బా... పువ్వులా నవ్వుతుంది...’ అని నీ భార్యతో మురిపెంగా నువ్వంటున్నప్పుడు నువ్వో తండ్రివి. నీ భార్యను చూసి ‘నువ్వు ఈ రోజు ఎంతో నాజూగ్గా, తాజా పువ్వులా ఉన్నావ్’ అన్నప్పుడు నువ్వొక ప్రేమికుడివి. ఇవన్నీ జీవితానికి అవసరమే. కాబట్టి ‘విధాత తలపున’ రాస్తేనే పాట, ‘గుండెనిండా గుడిగంటలు’ రాస్తే పాటకాదు అనడం అసమంజసం. ‘గుండెనిండా గుడి గంటలు’ లాంటి సాహిత్యాన్ని రాయవలసి వచ్చినప్పుడు.. ‘ఎలా రాస్తే దానికి ఆ డిగ్నిటీ వస్తుంది’ అని ఆలోచించి రాసినప్పుడే కవిగా నీ డిగ్నిటీ ఏంటో తెలుస్తుంది. శృంగారం అనేది ఓ చెడు ప్రక్రియే అయితే... ఈ సృష్టే లేదు గుర్తుంచుకోండి. కాబట్టే శృంగారగీతం ఎంతో బాధ్యతాయుతమైనదని తెలుసుకోండి. ఇంకా ఎక్కువ పూజనీయమైనది, ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిందని అర్థం చేసుకోండి. ఆ పాటల్ని తక్కువ చేసి మాట్లాడటం లేదు. గొప్ప సాహిత్యంతో పాటలు రాసిన మీరు... నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా రాయవలసి వచ్చినప్పుడు పడే అంతర్మథనం గురించి అడుగుతున్నా... సిరివెన్నెల: నాకు ట్రెండ్ అనేది లేదు. ‘కళ్లు’లో ‘తెల్లారింది లెగండో..’ పాట నేనే రాశాను. మొన్నమొన్ననే ‘ఓనమాలు’లో ‘పిల్లలూ బాగున్నారా?’ అనే సందేశాత్మక గీతాన్నీ నేనే రాశాను. ‘కృష్ణంవందే జగద్గురుమ్’లో దశావతార రూపకం నేనే రాశాను. ఆ పక్కనే యూత్‌కోసం ‘స్పైసీ స్పైసీగాళ్...’ పాటనూ నేనే రాశాను. ‘స్పైసీ స్పైసీగాళ్’ పాటలో ఎక్కడైనా మీకు అశ్లీలత స్ఫురించిందేమో చెప్పండి. సో, ఇక్కడ అంతర్మథనానికి తావేది? ఓ పక్క ఆధ్యాత్మికం, మరో పక్క శృంగారం, ఇంకో పక్క విప్లవం.... ఓ వ్యక్తిలో ఇన్ని కోణాలా? సిరివెన్నెల: ప్రకృతి ఎన్ని రకాలుగా ఉంటుందో చెప్పగలిగే సహజ లక్షణం మనిషికి మాత్రమే ఉంది. అవన్నీ చూపించకపోతేనే తప్పు. మనిషి శరీరంలో ప్రతి అవయవం పనిచేయాలి. అందులో ఒక్కటి పనిచేయకపోయినా... ‘వికలాంగుడు’ అంటారు. ఇదీ అంతే! మీరు రాసిన కొన్ని పాటలు వింటుంటే.. సమాజంపై మీకు కోపమేమో అనిపిస్తుంది సిరివెన్నెల: ‘సమాజం వేరు.. నేను వేరు’ అని అనుకోను. నాకు జ్వరం వస్తే.. నాపై నేను ఆగ్రహం వ్యక్తం చేసుకోను కదా. ‘కాస్త ఇబ్బందిగానే ఉందండీ’ అంటాను. కారణం... అది నాకొచ్చింది కనుక. నన్ను నేను ప్రేమించుకుంటాను కనుక. ఇక్కడ సమాజమే నేను! సమాజంలోని అవకతవకలన్నీ నావే! అలాంటప్పుడు కోపానికి తావెక్కడిది. వర్మ, కృష్ణవంశీ, త్రివిక్రమ్, క్రిష్.. ఇలా కొందరు దర్శకులతో మీకు అటాచ్మెంట్ ఎక్కువ అంటారు. నిజమేనా? సిరివెన్నెల: కొందరితో అటాచ్మెంట్, కొందరితో డిటాచ్మెంట్ ఉండదు. ఉదాహరణకు మనిద్దరం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఆసక్తి ఉన్నంతవరకూ మీరు నా మాటలు వింటారు. ఎక్కడో ఒక చోట ఆ ఆసక్తి తెగిపోతుంది. దాంతో ఏదో కారణం చెప్పి నా దగ్గరనుంచి తప్పుకుంటారు. దానికి కారణం కోపమే కానక్కరలేదు. దీన్నే మామూలుగా మాట్లాడుకునేటప్పుడు ‘వేవ్‌లెంగ్త్ కలవడం’ అంటుంటాం. సో... వాళ్ల అభిరుచికి తగ్గ సినిమా వాళ్లు తీస్తున్నప్పుడు ఆ సినిమాకు సంబంధించిన నా ఒపీనియన్స్ కానీ, సలహాలు కానీ వాళ్లకు నచ్చి ఉండొచ్చు. దాంతో వాళ్లు నాతో కలిసి పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడున్న దర్శకుల్లో మీకు ప్రియమైనవాళ్ళు... సిరివెన్నెల: ఏ రంగంలోనూ, ఏ అంశంలోనూ ఒక వ్యక్తిని ఇష్టపడటం ఉండదు నాకు. నాకే కాదు... ఎవరికీ ఉండకూడదు. ప్రతి దర్శకుడూ ఓ మంచి సినిమా తీసే ఉంటాడు. అలాగే ప్రతి దర్శకుడూ ఓ చెత్త సినిమా కూడా తీసే ఉంటాడు. వారి పనిని ఇష్టపడతాను కానీ.. వ్యక్తిని కాదు! కవిగా మీకు సాటి, పోటీ ఎవరనుకుంటున్నారు? సిరివెన్నెల: బాగుందా, లేదా అని చెప్పగలం కానీ... ఒక శిల్పంతో మరో శిల్పాన్ని ఎలా పోల్చగలం? వంద మీటర్ల పరుగుపందెంలో ఒకడు ఫస్ట్ వస్తాడు. ఆ వంద మీటర్లను రెండొందల మీటర్లు చేస్తే... ఆ ఫస్ట్ వచ్చినవాడే థర్డ్ రావచ్చు. చెప్పలేం కదా. సో... పోటీ అనేది తీసుకునే సంవిధానాన్ని బట్టి ఉంటుంది. ‘వశిష్టుడు’ అనే ఓ వేల్యూని చూసుకుంటూ... ‘బ్రహ్మర్షి’ అనే స్కేల్ పెట్టుకొని... విశ్వామిత్రుడు తన ధర్మప్రయాణాన్ని సాగించాడు. ఆ సంవిధానాన్నే పోటీ అంటారు. అలా ప్రయాణిస్తే జ్ఞానం సమృద్ధి అవుతుంది! రాయడంలో ఎప్పుడైనా బోర్‌గా ఫీలయ్యారా? సిరివెన్నెల: నా జీవితంలో మార్పు లేని రెండే విషయాలు నా భార్య, నా పాట. ఈ రెండూ నాకెప్పుడూ బోర్ కొట్టవు. ఆ విషయం మా ఆవిడక్కూడా తెలుసు. ఇంతటి జ్ఞానితో జీవితాన్ని పంచుకున్న మీ సహధర్మచారిణి గురించి తెలుసుకోవాలని ఉంది... సిరివెన్నెల: ‘సహ.. ధర్మ.. చారిణి’ అని మీరే అన్నారు. ధర్మంగా తను నడుస్తూ.. తనతో పాటు తన భర్తనూ నడిపించేది సహధర్మచారిణి. ఆ పదానికి అక్షరాలా యోగ్యురాలు నా భార్య పద్మావతి. నేను ఓ అద్భుతమైన శిల్పాన్ని అనుకుంటే... ఆ ‘అద్భుతం’ అనే పదం చెందాల్సింది ఆవిడకే. ఎందుకంటే... ఈ శిల్పాన్ని చెక్కింది తనే. అందమైన పాటలా నా జీవితం సాగిపోవడానికి కారణం ఆవిడ. నన్ను ఈ విధంగా మలచడానికి తన జీవితంలో చాలా భాగాన్ని పణంగా పెట్టి, తాను చాలా కోల్పోయి, నేను చాలా పొందేలా చేసిన త్యాగమయి నా భార్య. షీఈజ్ మై బెటర్ త్రీఫోర్త్! నేను వన్ ఫోర్త్ మాత్రమే. అందులో అసత్యం కానీ, నిష్టూరం కానీ, అతిశయోక్తి కానీ ఏమీ లేదు. ఒక తల్లిగా, ఒక భార్యగా, ఓ ఇంటి కోడలిగా తన ప్రతి బాధ్యతనూ పరిపూర్ణంగా నిర్వర్తించింది కాబట్టే.. నా ఒక్క బాధ్యతను నేను గొప్పగా నిర్వర్తించగలిగాను. మీకోసం మీ భార్య ‘ఎంతో కోల్పోయింది’ అన్నారు. అదేంటో కాస్త వివరంగా చెబుతారా? సిరివెన్నెల: నేను మీ ముందు కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చేంత స్థాయికి రాగలిగానంటే, ఇన్ని వందల పాటలు రాయగలిగానంటే.. నాకెంత విశ్రాంతి లభించి ఉండాలి? ఈ విశ్రాంతి కోసం ఎన్ని బాధ్యతల నుంచి నేను తప్పుకొని ఉండాలి? చెప్పండి? ‘నీ బిడ్డలమైన మాకు.. ఓ తండ్రిగా నువ్వు ఏ మాత్రం ప్రేమనందించావ్?’ అని నా పిల్లలు నన్ను ప్రశ్నించొచ్చుగా? ‘అందరు తండ్రుల్లా ఏనాడైనా నువ్వు మమ్మల్ని సినిమాకు తీసుకెళ్లావా? పేరెంట్స్డేకి ఎన్నిసార్లు నువ్వు కాలేజీకొచ్చావ్? అసలు మేం చదువుతున్న స్కూళ్ల పేర్లయినా నీకు తెలుసా?’... ఈ ప్రశ్నలన్నీ నా పిల్లలు నాపై సంధించొచ్చుగా? అడక్కపోగా నన్ను గౌరవిస్తున్నారెందుకు? దీని వెనుక ఏ మెకానిజం ఉండుండాలి? పెళ్లిళ్లనీ, అశుభాలనీ, చుట్టాలనీ, పక్కాలనీ... అందరిలా తానూ ఓ పద్ధతి ప్రకారం జీవిస్తానంటే... ఇంత తపస్సు నాకు సాధ్యమయ్యేదా? రోజుకి 19 గంటల పాటు ఏకాంతంగా... ఏకధాటిగా 30 ఏళ్లు గడపగలిగానంటే... ఎన్ని సామాజికమైన బాధ్యతల నుంచి నేను తప్పుకొని ఉండి ఉండాలి? నేను సామాజిక బాధ్యతల నుంచి తప్పుకోలేదని జనాలు అనుకుంటున్నారు. అలా అనిపిచేలా చేసింది ఆవిడ కదా? దానికి ఆమె ఎంత సమయాన్ని కేటాయించి ఉండాలి? తన జీవితం తాను జీవిస్తూ ..ఇన్ని రకాలుగా నా ఖాళీలను పూరిస్తూ.. ఆమె ముందుకెళ్లింది కాబట్టే, ఈ రోజు బంధువుల్లో కూడా నన్నెవరూ బాధ్యతారహితుడనట్లేదు. ఓ యోధుణ్ణి కవచం కాపాడటం మనం చూస్తాం. కానీ ఆ కవచానికి తగిలే బల్లేల దెబ్బలు మనం చూస్తామా? నా కవచమే నా భార్య. మా చిన్నబ్బాయి ఇలాంటి డిస్కషన్ వచ్చినప్పుడే ఓసారి ఇదే విషయాన్ని అందంగా, క్లారిటీతో చెప్పాడు. ‘మాకు మీకంటే అమ్మంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే.. మిమ్మల్ని ప్రేమించడం ఎలాగో అమ్మే మాకు నేర్పించింది’ అని. మీకోసం ఇంత చేసిన ఆమెకోసం మీరేమి చేశారు. ఆమె కోసం కొంతైనా చేయాలని మీకు అనిపించలేదా? సిరివెన్నెల: అరవైకి దగ్గరపడ్డాను. ఎవ్వరికీ రుణపడకుండా రిటైర్ అవ్వాలనేదే నా కోరిక! నిజంగా కూడా నేనెవ్వరికీ రుణపడిలేను... నా భార్యకు తప్ప! తన రుణం మాత్రం తప్పకుండా తీర్చుకుంటా. 30 ఏళ్ల సంసారంలో ఏనాడూ ఆమె ఒక్క పుణ్యక్షేత్రానికి కూడా వెళ్లలేదంటే నమ్ముతారా! అంతెందుకు... తన పుట్టింటికి కూడా నేను లేకుండా ఆమె వెళ్లలేదు. ఎందుకంటే... నేను లేని జీవితాన్ని ఆమె కోరుకోదు. అంతెందుకు.. ఇప్పుడామెను ‘ఏదైనా కోరుకో’ అంటే.. మహా అయితే.. ‘తిరుపతి తీసుకెళ్లండి’ అంటుంది. స్త్రీ అంటే ఏంటో.. స్త్రీత్వం అంటే ఏంటో.. తెలీని ఈ కాలంలో... అనవసరమైన బాధలు కొనితెచ్చుకుంటూ జీవితాన్ని నరకం చేసుకుంటున్న ఈ రోజుల్లో, ‘ఇవ్వడం ద్వారా ఏం పొందచ్చు’ అనే విషయం తెలుసుకోవడానికి నా భార్య గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. తను ఎంతో ఇచ్చింది. తద్వారా అన్నీ పొందింది. మీ మాటల్ని బట్టి చూస్తుంటే... మీది ప్రేమ వివాహమేమో అనిపిస్తోంది. సిరివెన్నెల: ప్రేమించి పెళ్లి చేసుకోవడం, పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించడం... ఇలాంటి కాన్సెప్టుల మీద నాకు సరైన అవగాహన లేదు. ప్రేమించడం ‘ఒక పని’ అని నేను అనుకోను. ఒకానొక క్షణంలో ఒకానొక చోట అది మొదలవుతుందని కూడా భావించను. నా పెళ్లి పెద్దల సమక్షంలో సంప్రదాయబద్ధంగానే జరిగింది. ఇక స్త్రీ, పురుషుల మధ్య ఉండవలసిన సహవాసం, సహచర్యం, సాన్నిహిత్యం, సాంగత్యం... ఇవన్నీ ప్రేమ అనే కాన్సెప్ట్‌లో ఉంటే కనుక... మాది కచ్చితంగా ప్రేమే! తెలుగులో ఓ సామెత ఉంది. ‘పేదవాడికి గంజే పరమాన్నం. పెళ్లామే ప్రియురాలు’ అని! దానితో నేను వందశాతం ఏకీభవిస్తా. అసలు ప్రేమ అనే కాన్సెప్ట్‌ని మీరు నమ్ముతారా? సిరివెన్నెల: సత్యాన్ని నమ్మడమేంటి? పగలు అనే కాన్సెప్ట్‌ని నమ్ముతారా? రాత్రి అనే కాన్సెప్ట్‌ని నమ్ముతారా? అనడిగితే ఏం సమాధానం చెబుతాం. ప్రేమ అనేది ఈ రోజు మనం ప్రశ్నించే స్థితికి దిగజారిందంటే... కారణం దానికి మనం వేరే వేరే అర్థాలు ఆపాదించడం వల్లే. ఈ విశ్వంలో ప్రేమ కానిది ఏది? ఎండ ప్రేమకాదా? వాన ప్రేమ కాదా? జీవితం పట్ల మనకున్నది ప్రేమ కాదా? మనపట్ల జీవితానికి ఉన్నది ప్రేమకాదా? ప్రేమ సర్వాంతర్యామి. భగవంతుడు ఆదిమధ్యాంతరహితుడంటూ గుళ్లూ గోపురాలు తిరిగే ఈ మనిషి... సర్వే సర్వత్రా ఉన్న ప్రేమను మాత్రం గుర్తించలేకపోతున్నాడు. ఇంతకీ మీరు ప్రేమికుడా? భక్తుడా? లేక విప్లవకారుడా? సిరివెన్నెల: మనిషిని. మనిషంటే ఇవన్నీ ఉండాలి. మీకు బలహీనతలున్నాయా? సిరివెన్నెల: మనిషంటే అవి కూడా ఉంటాయి కదా. మానవత్వానికి మహత్తరమైన కానుక మనదేశమే మనకిచ్చింది. అదే ‘రామాయణం’. మనిషితనానికి ప్రతిరూపం రాముడు. వాల్మీకి అనే కవి.. రాముడు అనే పాత్రను సృష్టించి, మనిషి అనేవాడు ఎలా బతకాలో సమాజానికి తెలియజేశాడు. ‘రాముడు మహావిష్ణువు అవతారం’ అని రామాయణంలో వాల్మీకి ఎక్కడా చెప్పలేదు. ‘నేను దశరథుని కుమారుడును.. రాముడను’ అని విజిటింగ్ కార్డు పట్టుకొని తిరిగాడు రాముడు. ఏం... ఆయన ఏడవలేదా? ఆయనకు కోపం రాలేదా? ఆయనకు నొప్పి కలగలేదా? ఒక మనిషికి ఎన్ని లక్షణాలుంటాయో రాముణ్ణి చూస్తే తెలుస్తుంది. మనల్ని రాముడితో పోల్చి చూస్తే కొన్ని ఆయన కంటే ఎక్కువ క్వాలిటీలు కనిపిస్తాయి. కొన్ని తక్కువ క్వాలిటీలు కనిపిస్తాయి. ఇక్కడ ఎక్కువైనా రోగమే, తక్కువైనా రోగమే. అదే మనం గ్రహించాల్సింది. వాటినే ‘బలహీతనలు’ అంటాం. అవి నాకూ ఉన్నాయి. మీ అబ్బాయ్ యోగీశ్వరశర్మ స్వరపరచిన తొలి గీతం విని మౌనం వహించారట కారణం? సిరివెన్నెల: నేను ఇంతవరకూ వినని ఓ నోవెల్ ప్రయోగం చేశాడు తను! అది వినడానికి చాలా బావుంది. కానీ రాయలేకపోయాను. దాంతో ఓ ముప్ఫై రోజుల పాటు నాలో నేను స్టడీ చేసి ఆ పాట రాశాను. సెలైంట్‌గా ఉండటం అనేది పాజిటివ్ కాంప్లిమెంటే కానీ, కామెంటూ కాదు, విమర్శ అంతకన్నా కాదు. తాను సంగీత దర్శకుడవ్వడంలో మీ ప్రోద్బలం ఉందా? సిరివెన్నెల: వాళ్ల అభిరుచిని, పాండిత్యాన్నీ వాళ్లే పెంపొందించుకున్నారు. దానికి తగ్గ కృషి వాళ్లే చేసుకున్నారు. ఇందులో నా ప్రోద్బలం లేదు అనడం కంటే.. నా ‘అడ్డు లేదు’ అనడం కరెక్ట్. సినిమాలోకి రావాలనేది వాళ్ల కోరిక. దాన్ని ఏనాడూ నాపై రుద్దలేదు. వాళ్ల ప్రయత్నాలు వాళ్లే చేసుకున్నారు. ప్రోత్సహించేవారు ప్రోత్సహించారు. ఒక తండ్రిగా.. సాయం చేసినవారికి థ్యాంక్స్ చెబుతుంటా. దర్శకుడు సందర్భం చెబుతాడు. దానికి తగ్గట్టు గేయరచయిత పాట రాస్తాడు. ప్రస్తుతం ఈ పద్ధతే నడుస్తోంది. కానీ మీరు మాత్రం అందుకు భిన్నంగా... సినిమా కథంతా తెలుసుకుంటారు. దాని ఆత్మను గ్రహిస్తారు. దాన్ని బట్టి పాట రాస్తారు. ఇంకా ఒకడుగు ముందుకేసి, దర్శకులుగా వాళ్లేమైనా తప్పులు చేస్తే సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు. ఇంత స్ట్రగులు అవసరమా? సిరివెన్నెల: ఎముకల డాక్టర్లు చాలా మందే ఉంటారు. కానీ ఒకరిద్దరి పేర్లే గొప్పగా ఎందుకు చెప్పుకుంటాం? అందరు చదివిందీ అదే చదువుగా?... అంటే.. ఎక్కడో వారి వ్యక్తిత్వాన్ని పనిలో లీనం చేస్తున్నారు వాళ్లు. తాము తెలుసుకున్న విషయాన్ని కొత్తగా ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నేనూ అంతే. సినిమా కథ ఎలాంటిదైనా అది మనిషి జీవితానికి నీడలా ఉండాలని కోరుకుంటాను. నా పాటను నా తాత్వికాన్వేషణను ఆవిష్కరించే సాధనంగా భావిస్తాను. ఓ అమ్మాయి ఏడుస్తుంది. దానికి ఓ పాట రాయాలి. ‘ఏడవకమ్మా ఏడవకు..’ అని ఏదో ఓ పాట రాయొచ్చు. కానీ నేను అలా రాయను. ‘కన్నీళ్లే కురవాలా లోకానికి తెలిసేలా..? ముస్తాబే చెదరాలా.. నిను చూస్తే అద్దం దడిచేలా’ అని రాస్తా. ఏదో చెప్పాలి. అందులో ఫన్ ఉండొచ్చు. పరామర్శ ఉండొచ్చు. ప్రతిఘటన ఉండొచ్చు. అలా ఉండాలంటే.. కథ ఆత్మ తెలుసుకోవడం ఎంతైనా అవసరం. కథకు పాట సరిపోతే చాలదు. ఆ తర్వాత కూడా శ్రోత హృదయంలో ఆ పాట చిరస్థాయిగా నిలవాలి. అంత కష్టపడేది అందుకే. గీత రచయితగా ఎంతో సాధించారు. పద్మశ్రీ రాలేదని ఎప్పుడైనా బాధపడ్డారా? సిరివెన్నెల: మెడ ల్ కోసం మెడలు వంచడం నాకు చేతకాదు. అయినా, పద్మశ్రీ కోసం నేను పాటలు రాయలేదు. దాని మీద నాకు ఆసక్తి కూడా లేదు. ఇంతమంది అభిమానాన్ని పొందగలిగాను. ఇన్ని కోట్లమందికి కుటుంబ సభ్యుణ్ణి కాగలిగాను. ‘జగమంత కుటుంబం నాది’ అని ఓ పాట రాశాను. తాము రాసిన పాట ఎంతమంది రచయితల జీవితాల్లో నిజమయ్యాయంటారు? నాకు మాత్రం నిజమైంది. ఇప్పుడు నాది ‘జగమంత కుటుంబం’... ఇంతకంటే గొప్ప అవార్డు ఇంకేదైనా ఉంటుందా? అందుకే అంటాను... ‘జగమంత కుటుంబం పాట కాదు... నా జీవితం’ అని! - బుర్రా నరసింహా *********** మీకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయి? సిరివెన్నెల: నచ్చే సినిమా అనే సైంటిఫిక్ ఫార్ములా ఉంటే... ఆ ఫార్ములాను ఫాలో అవుతూ అందరూ సినిమాలు తీసేస్తారుగా. ఈ మధ్య ‘పా’ సినిమా చూశా. నచ్చింది. ఆ మధ్య ‘అదుర్స్’ అనే సినిమా చూశా. అదీ నచ్చింది. ఫలానా సినిమాలే నచ్చుతాయనేం లేదు. తప్పక రాసిన పాట ఏమైనా ఉందా? సిరివెన్నెల: అసలు అలాంటి పాటల్ని నేను రాయను. మీ కెరీర్లో కష్టపడి రాసిన పాట? సిరివెన్నెల: పాట రాయడం ఎప్పుడూ కష్టంగా ఫీలవ్వను. అయినా... కష్టపడి కోసే మామిడిపండు మహత్తరంగా ఉంటుంది. పాట కూడా అంతే. *********** ఇల్లాలుగా కాకుండా... ఆమెలో మీరు చూసిన అదనపు ప్రత్యేకతలేమైనా ఉన్నాయా? మొన్నటిదాకా నాకూ తెలీదు. ఈ మధ్య తెలిసింది. తాను అద్భుతంగా రాస్తుంది. ఆ మాటకొస్తే నాకన్నా బాగా రాస్తుంది. కొన్ని కొన్ని విషయాలను నేను సింపుల్‌గా చెప్పలేను. మా ఆవిడ అలా కాదు. ‘సంసారం-బంధములు’ అనే విషయాన్ని సరిగ్గా ఒకటిన్నర పేజీలో.. అయిదు పేరాల్లో విపులంగా చెప్పేసింది. అది చదివి షాక్ అయ్యాను. ఎందుకంటే.. అంతకు మించి చెప్పడానికి నాకేమీ కనిపించలేదు. అంత అద్భుతంగా రాసింది తను. మా నాన్నగారి గురించి వ్యాసాలు రాస్తున్నప్పుడు, తనూ ఓ భాగం రాసిచ్చింది. ఆమెలో నేను రచయిత్రిని చూసింది అప్పుడే. ఆమె శైలిని, వాక్య నిర్మాణాన్ని చూసి ఆశ్చర్యానికి లోనయ్యాను. అందుకే ఆ వ్యాసంలో మనసు విప్పి ఓ మాట చెప్పాను. ‘మా తమ్ముడంత సరళంగా, నా భార్య అంత గొప్పగా నేను రాయలేకపోయానేమో’ అని. మరి నవ రచయిత్రికి అభినందన ఎలా తెలిపారు? కెరీర్ ప్రారంభంలో అనంతశ్రీరామ్ నా దగ్గరకొచ్చాడు. అప్పటికి అతను ఓ నాలుగైదు పాటలు రాసుంటాడు. ‘నువ్వు రాసిన పాటల్లో నీకు బాగా నచ్చిన పాట ఒకటి చెప్పు’ అనడిగాను. తను చెప్పాడు. పల్లవిలోనే నాలుగైదు తప్పులు చెప్పాను. ‘నువ్వు గొప్పగా రాయబోతున్నావ్. నీ భవిష్యత్తు చాలా గొప్పగా ఉండబోతోంది. సో... నిరంతరం నీ తప్పుల్ని వెతికి చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను. మెచ్చుకోడానికి లేను’ అని చెప్పాను. తను నా మాటల్ని స్పోర్టీవ్‌గానే తీసుకున్నాడు. బాగా రాసేవాళ్లను నేను అభినందించను. వాళ్ల విషయం కఠువుగా ప్రవర్తిస్తా. ఎందుకంటే నిజమైన రచయిత అభినందనలకోసం చూడడు. మెప్పులు పొందకపోయినా.. అక్షరంతోనే జర్నీ చేస్తాడు. అలాంటి వాళ్లు ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే.. నా భార్య విషయంలోనే కూడా అలాగే ఉన్నాను. ‘గొప్పగా రాశావ్. రాయడంలో ఆనందాన్ని పొందు. ఇంకొకరికి చూపించి మెప్పు పొందాలని మాత్రం చూడకు. అలా చేస్తే రాయాలనే తపన ఆగిపోయే ప్రమాదం ఉంది’ అని చెప్పాను. అలా అన్నానని నాపై అలిగింది తను.