నాలుగు బూతులు రాసేసిడబ్బులు సంపాదించే నేచర్ కాదు నాది! | Exclusive interview director maruthi with family | Sakshi
Sakshi News home page

నాలుగు బూతులు రాసేసిడబ్బులు సంపాదించే నేచర్ కాదు నాది!

Published Sat, Jan 4 2014 11:46 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

Exclusive interview director maruthi with family

ఈ రోజుల్లో... హిట్!
 బస్ స్టాఫ్... హిట్!!
 ప్రేమకథాచిత్రమ్... హిట్!!
 కొత్త జంట... హిట్!!!
 హిట్టా!! ఇదింకా రిలీజ్ కాందే?!
 తీసింది మూడు. మూడూ హిట్.
 నాల్గోది మాత్రం ఎందుక్కాదు?
 ఎందుకౌతుంది?
 ఎందుకా?! డెరైక్టర్ ఎవరనుకున్నారు?
 డైలాగులు ఎవరివనుకున్నారు?
 మారుతికి బాగా డబ్బులొచ్చినట్లే కొంత చెడ్డపేరు కూడా వచ్చింది...
 ...యూత్‌ని పాడుచేసేస్తున్నాడని!
 మారుతి కోపగించుకోడు.
 ‘కథలో ఆత్మను పట్టుకోలేకపోతే ఎలా?’ అంటాడు.
 డబ్బుకోసం, పేరుకోసం చూసుకోని కుర్రాడే...
 ఇలా అనగలడు.
 ఇలా తీయగలడు.
 ఇలా మాట పడగలడు.
 ఈవారం ‘తారాంతరంగం’ చదవండి.
 అతడి సినిమాలను మళ్లొకసారి దగ్గరగా చూడాలనిపిస్తుంది.

 
 మీ ఫ్లాష్‌బ్యాక్ సినిమా స్టోరీని తలపిస్తుందట నిజమేనా? అసలు మీ బాల్యం ఎలా సాగింది?
 మారుతి: మాది కృష్ణాజిల్లా మచిలీపట్నం. అక్కడి రాధికా టాకీస్ ఎదురుగా మా నాన్న అరటిపళ్లు అమ్మేవారు. రోజుకి యాభై రూపాయలు సంపాదిస్తే.. గొప్పగా ఫీలయ్యేవారాయన. చిన్నప్పట్నుంచీ మా కుటుంబం మొత్తం కష్టంతోనే బతికింది. అమ్మ ఇంట్లోనే మిషన్ కుట్టేది. నాకు అక్క, తమ్ముడు ఉన్నారు. నేను స్కూల్‌కెళ్లి... మధ్యాహ్నం లంచ్ టైమ్‌లో నాన్న బండి దగ్గరకొచ్చి కూర్చునేవాణ్ణి. చెట్టుకింద ప్లీడర్, కాంచనసీత, ముద్దులమావయ్య.. ఈ సినిమాలన్నీ రాధికా థియేటర్‌లో రిలీజ్ అవుతూ ఉండేవి. నేను ఆ పోస్టర్లు చూస్తూ... వాటి బొమ్మలేస్తూ ఉండేవాణ్ణి. ఆ విధంగా డ్రాయింగ్ అలవాటైంది. తర్వాత ఓ మోటర్ ఏజన్సీ ఆఫీస్‌లో ఆఫీస్‌బోయ్‌లా చేరాను. అక్కడ వాళ్లకు టీలు సప్లయ్ చేయడం, జిరాక్స్‌లు తీయించుకురావడం చేసేవాణ్ణి. అదే ఆఫీస్‌లో నంబర్‌ప్లేట్లకు పెయిటింగ్ కూడా వేస్తుండేవాణ్ణి. అలాచేస్తే.. ప్లేట్‌కి పది రూపాయలు ఇచ్చేవారు. ఆ వచ్చిన ఆదాయంతోనే ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. ఆ తర్వాత స్టిక్కరింగ్ స్టార్ట్ చేశా. స్టిక్కరింగ్ చేయడంలో బందర్‌లోనే నంబర్‌వన్ అయ్యాను. నేను చేసిన నంబర్ ప్లేట్లకు అక్కడ అభిమానులున్నారు. బాపుగారి బొమ్మల్ని కూడా స్టిక్కరింగ్ చేసేవాణ్ణి. రోజుకు వెయ్యి లెటర్లు ఈజీగా కట్ చేసేవాణ్ణి. స్టిక్కరింగ్‌లో నేను చాలా ఫాస్ట్. ఓ వైపు స్టిక్కరింగ్ చేస్తూ... మరోవైపు కష్టపడి బీకాం పూర్తి చేశాను. చిన్నప్పట్నుంచీ కష్టపడతూనే ఉన్నందువల్ల బద్దకం అంటే ఏంటో ఇప్పటికీ నాకు తెలీదు. ఓ విధంగా అదే నన్ను ఈ స్థాయికి తెచ్చిందనుకుంటా. నా దృష్టిలో డబ్బులేని వాడు దరిద్రుడు కాడు. పనిలేనివాడు దరిద్రుడు.
     
 మీ నాన్న ఊహించనంత స్థాయికి ఎదిగారు కదా. ఇప్పుడాయన ఫీలింగ్ ఎలా ఉంది?
 మారుతి: నాన్న ఇప్పటికీ బందర్‌లోనే ఉన్నారు. ఆ ఊరు వదిలిపెట్టి రారాయన. ఆయన్ను కారుల్లో తిప్పాలని నాకుంటుంది. ఆయనేమో కారెక్కరు. సాధారణంగా బతకడానికే ఇష్టపడతారు. నాకు చేసిపెట్టడమంటే ఆయనకు ఆనందం. ‘సినిమా పోస్టర్‌పై మీ అబ్బాయ్ పేరు పడింది’ అని ఎవరైనా చెబితే... ఆ పోస్టర్ ముందు ఓ గంట గడిపి వెళతారాయన. సైకిలెక్కి నా పోస్టర్లన్నీ చూస్తూ ఊరంతా తిరుగుతారు. నేనంటే ఆయనకు అంత ఇష్టం. నాకు చిన్నప్పట్నుంచీ నాన్నతో అనుబంధం ఎక్కువ. అందుకే నా ‘బస్‌స్టాప్’ సినిమాలో ఇడ్లీబండి నడిపే వ్యక్తి పాత్రను అచ్చం మా నాన్న పాత్రలాగే డిజైన్ చేశా. ఆ పాత్ర గెటప్ కూడా మా నాన్నదే. అమ్మకు తెలీకుండా అప్పుడప్పుడు నాన్నకు వెయ్యిరూపాయలిస్తుంటా. దానికి ఆయన తెగ సంబరపడిపోతారు. ఆ వెయ్యిని ఆయన పుగాకు చుట్టల ఖర్చుకు వాడుతుంటారు. నాన్న లైఫ్‌లో గొప్ప ఎచీవ్‌మెంట్ ఏంటంటే... ఇదివరకు రాధికా థియేటర్ ఓనర్ వస్తున్నారంటే... నాన్న వెళ్లి గేట్ తీసేవారు. ఈ మధ్య ఆ థియేటర్ దగ్గరకు నాన్న వెళ్లారట. ఆయన్ను చూడగానే... థియేటర్ ఓనర్‌గారు గబగబా బయటకొచ్చి... నాన్నను థియేటర్‌లోకి తీసుకెళ్లి... ‘కుచేల్రావుగారొచ్చారు టీ తీసుకురండ్రా’ అని ఆయనతో టీ తాగించి, నాన్నతో ఓ ఫొటో కూడా దిగారట. ఆ క్షణంలో నాన్న కళ్లవెంట నీళ్లు తిరిగాయట. ఇంటికెళ్లి ఏడుస్తూ నాకు ఫోన్ చేశాడు. మా అమ్మ అయితే... ‘ఎంత ఆనందాన్ని ఇచ్చావురా.. ఇక మేం చచ్చిపోయినా ఫర్లేదు’ అని ఉద్వేగానికి లోనవుతూ మాట్లాడింది. నేను సాధించిందేంటో అప్పుడర్థమైంది నాకు. మా నాన్న అమాయకుడు, కుళ్లు, కుత్సితం తెలీని వాడు. అరటిపళ్ల బండిని నెట్టుకుంటూ... పొద్దున్నే వెళ్లి... మళ్లీ రాత్రి రెండిటికి ఇంటికొచ్చేవాడు. రోజుకు నలభై, యాభై రూపాయలు సంపాదించేవాడు. న్యాయంగా సంపాదించాలనుకునే దాంట్లోనే ఆయన జీవితం మొత్తం అయిపోయింది. అందుకే మా అమ్మానాన్నల్ని కంటికి రెప్పలా చూసుకోవాలనుంటుంది నాకు.
 
 బందరు నుంచి హైదరాబాద్ రావడానికి కారణమేంటి? డెరైక్టర్ అవ్వడానికేనా?
 మారుతి: కాదు.. ‘హార్ట్ యానిమేషన్ అకాడమీ’ పేరుతో అక్కినేని వెంకట్, తదితరులు ఓ ఇనిస్టిట్యూట్ స్థాపించారు. యానిమేషన్‌పై ఉత్సాహం ఉన్న ఆర్టిస్టులు అప్లయ్ చేయొచ్చనే యాడ్ చూసి... అప్లయ్ చేశాను. రమ్మని కబురొచ్చింది. ఓ పదిహేను వేల రూపాయలు తీసుకొని హైదరాబాద్‌లో అడుగుపెట్టా. ఫౌండేషన్ కోర్స్‌కే పదిహేను వేలు అన్నారు. టోటల్ కోర్స్ నేర్చుకోవాలంటే..  లక్షా 30 వేలు అవుతుందని తెలిసింది. ముందు ఫౌండేషన్ కోర్స్‌లో జాయినైపోయాను. నాతోపాటు ఓ రెండుమూడొందలు మంది ఆ కోర్స్‌లో చేరారు. ఓ వైపు కోర్స్ చేస్తూ... మరోవైపు పంజాగుట్టలో నంబర్‌ప్లేట్లు వేస్తూ ఉండేవాణ్ణి. అక్కడ నంబర్‌ప్లేట్లు వేస్తే... రోజుకు వంద రూపాయలిచ్చేవారు. అవి నా ఖర్చులకు సరిపోయేవి. ఫౌండేషన్ కోర్స్ అయ్యాక... మెయిన్ కోర్స్ జాయిన్ అవ్వాలి. ఆ కోర్స్ చేయాలంటే... లక్షా 30 వేల రూపాయలు కట్టాలి. నా దగ్గర అంత స్తోమత లేదు. ఏం చేయాలి? అనుకుంటున్న టైమ్‌లో... బాగా చేసిన ఓ పదిమందికి స్కాలర్‌షిప్ ఇస్తామని నోటీస్ బోర్డ్‌లో పెట్టారు. ఆ పదిమందిలో ఒకరిగా నిలవడానికి రెండొందల మందీ పోటీపడ్డారు. ఎలాగైనా బాగా చేసి ఆ పదిమందిలో నేనూ ఒకణ్ణి కావాలని కష్టపడ్డాను. అదృష్టవశాత్తూ అనుకున్నది సాధించాను. కష్టపడి యానిమేషన్ నేర్చుకున్నాను. కోర్స్ పూర్తయ్యాక శ్రీవెన్ మల్టీటెక్‌లో జాబ్ వచ్చింది. నెలకు నాలుగువేలు జీతం. అక్కడ కొన్నాళ్లు చేశాక డీక్యూలో జాబ్ వచ్చింది. అక్కడ చేసిన నాలుగైదేళ్లలో నెలకు లక్షా 30 వేలు డ్రా చేసే రేంజ్‌కి వచ్చాను. ఆ టైమ్‌లోనే బన్నీతో పరిచయం ఏర్పడింది.
     
 బన్నీతో మీ అనుబంధం గురించి చెప్పండి?

 మారుతి: తాను ఆర్టిస్టు కాకముందు.. యానిమేషన్ నేర్చుకోవాలనుకున్నాడు. మంచి ట్యూటర్ ఎవరని వాకబ్ చేసి, చివరకు నన్ను పిలిపించారు. బన్నీ వాళ్ల అమ్మగారు మాకు దూరపు బంధువు. దాంతో అనుకోకుండా బాగా కలిసిపోయాం. బన్నీకి నా కామెడీ టైమింగ్ అంటే చాలా ఇష్టం. నాతో మాట్లాడటానికి ఇష్టపడేవాడు. ఇప్పటికీ నా సినిమా రిలీజైతే... తప్పకుండా తొలిరోజే చూస్తాడు. త్వరలో మేమిద్దరం కలిసి ఓ సినిమా చేస్తాం. ‘నీతో సినిమా అంటూ చేస్తే... ఆ సినిమా నీ స్టయిల్లోనే ఉండాలి’ అంటాడు తను.
     
 అసలు డెరైక్టర్ అవాలని ఎందుకనిపించింది మీకు?
 మారుతి: నేను టెన్త్ చదువుతున్న టైమ్‌లో ‘శివ’ రిలీజైంది. నాచురాలిటీకి దగ్గరగా సన్నివేశాలుండటం, ఆర్టిస్టులందరూ సెటిల్డ్‌గా మాట్లాడటం... ఇవన్నీ కొత్తగా అనిపించాయి. ‘సినిమా’ అనే మాధ్యమంపై నాకు ఆసక్తిని పెంచిన సినిమా అది. ఓ విధంగా నేను రామ్‌గోపాల్‌వర్మగారికి భక్తుణ్నని చెప్పాలి. ‘శివ’ చూసి ఇంటికెళుతూ.. దారిలో నాలో నేనే మాట్లాడేసుకునేవాణ్ణి. ఒక్కణ్ణే యాక్షన్ చేసుకుంటూ వెళ్లేవాణ్ణి. అలాగే... చిరంజీవిగారి సినిమాల ప్రభావం కూడా నాపై ఉంది. నేను చిన్నప్పట్నుంచీ క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్నవాణ్ణి అవడం, బొమ్మలు బాగా వేయగలిగినవాణ్ణి కావడం వల్ల... కెమెరా బ్లాక్‌లంటే నాకు చాలా ఇష్టం. బాపుగారిలా స్పాట్‌లోనే బొమ్మలతో స్టోరీబోర్డ్ వేసుకునేవాణ్ణి. ఆ విధంగా నాకు తెలీకుండానే...  డెరైక్షన్‌కి చేరువయ్యాను. ఇప్పటికీ స్టోరీబోర్డ్ గీసే... నా కెమెరామేన్‌కి సీన్ వివరిస్తాను. దర్శకత్వం చేయాలంటే... ఎవరిదగ్గరో పనిచేయనవసరం లేదు. సినిమా చూసి కూడా నేర్చుకోవచ్చు. గ్రామర్ అనేది సినిమాలోనే కనిపిస్తుంది.
     
 డెరైక్షన్ సరే... డైలాగులు ఎలా రాయగలుగుతున్నారు?
 మారుతి: నాలో రైటర్ ఉన్నాడని నాకే తెలీదు. పైగా బుక్స్ చదవడం అంటే నాకు పరమ ఎలర్జీ. రైటర్ అనేవాడికి కచ్చితంగా సాహిత్యంపై గ్రిప్ ఉండాలి. కానీ బుకిష్ నాలెడ్జ్ నాకస్సలు లేదు. అలాంటి నాకు రాయడం ఎలా సాధ్యమైంది? అంటే..  అది దైవదత్తమే అంటాను. చిన్నప్పట్నుంచీ ఫ్రెండ్స్‌ని జోకుల్తో నవ్విస్తుండేవాణ్ణి. వాటినే పేపర్‌పై ఎందుకు పెట్టకూడదు? అని రాయడం మొదలుపెట్టాను. నా గత చిత్రాల సంగతేమో కానీ.. ‘కొత్తజంట’లో నా డైలాగుల్ని మాత్రం కచ్చితంగా అందరూ మెచ్చుకుంటారు.
     
 సినిమా ప్రభావం సమాజంపై ఎక్కువగా ఉంటుంది. అది చాలా శక్తిమంతమైన మాధ్యమం. యువతరాన్ని తప్పుదోవ పట్టించే ద్వంద్వార్థ సంభాషణలు సినిమాల్లో చేర్చడం ఒక బాధ్యతగల దర్శకుడిగా కరెక్టేనంటారా?

 మారుతి: పైకి ఎలా కనిపించినా... అంతర్లీనంగా ప్రతి ఒక్కరిలో ఓ క్యారెక్టర్ ఉంటుంది. దాన్ని తెరపైకి తెస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనకు రూపమే ఈ రోజుల్లో, ‘బస్‌స్టాప్’ సినిమాలు. ‘ఒక ప్రాబ్లమ్‌ని డిస్కస్ చేద్దాం’ అనుకొని చేసిన సినిమాలవి. వాటి తర్వాత చాలామంది డబుల్‌మీనింగ్‌లతో సినిమాలు తీశారు. అవన్నీ ఎందుకు ఆడలేదు? బూతులే సినిమాలను ఆడిస్తే... షకీలా సినిమాలు సంవత్సరం ఆడాలి. ఎందుకు ఆడవు? ప్రతికథకు ఆత్మ అనేది ఒకటుంటుంది. కథలోని సోల్ గొప్పదై ఉండాలి. నేను ఏది చెప్పినా సూటిగానే చెబుతాను. అది కొందరికి నచ్చకపోవచ్చు. కానీ... ఎక్కువమందికి నచ్చింది. కాబట్టే నా సినిమాలు హిట్లయ్యాయి. నేను టాలెంట్‌ని నమ్ముకొని వచ్చినవాణ్ణి. ఏదో నాలుగు బూతు డైలాగులు రాసి హిట్లు కొట్టేసి డబ్బులు సంపాదిద్దాం అనుకునే నేచర్ కాదు నాది. ట్రెండ్ మారింది. మనం మాట్లాడుతున్న తీరు మారింది. ప్రతిదీ భూతద్దంలో చూడకూడదు.
     
 అందుకని మరీ ఎడ్యుకేట్ చేసేలా సినిమాలు ఉండకూడదు కదా! ముఖ్యంగా మీ ‘బస్‌స్టాప్’ సినిమాలో కొన్ని సన్నివేశాలైతే.. చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని కొందరి అభిప్రాయం. ఉదాహరణకు బాత్‌రూమ్‌లో ల్యాప్‌టాప్ సీన్. అలా చూపించొచ్చా?

 మారుతి: నేటియువత ఎలా ఉన్నారు అనేది మీకు తెలియందీ కాదు... నాకు తెలియందీ కాదు. నేను చూపించింది టెన్ పర్సెంట్ మాత్రమే. బయట పరిస్థితి చాలా దారుణంగా ఉంది.  ఇళ్లల్లో జరుగుతున్నా సరే... బయట చెప్పుకోలేని పరిస్థితిని ప్రస్తుతం సమాజం ఫేస్ చేస్తోంది. సర్దుకుపోవడం సొసైటీకి అలవాటైపోయింది. కూతురు ఓ కుర్రాడ్ని ప్రేమిస్తుందని తెలిస్తే.. ‘ఈ ఏజ్‌లో కామనేలే’ అని తండ్రులే సర్దుకుపోతున్నారు. టైమొచ్చినప్పుడు, కరెక్టోడు దొరికినప్పుడు ముడిపెట్టేద్దాం అనుకుంటున్నారు. కాస్త మధ్య తరగతి కుటుంబాల్లోనే ఇంకా కట్టుబాట్లు బతికున్నాయి. చదువు కారణంగా  పిల్లలకు కూడా ఫ్రీడమ్ ఇవ్వక మధ్యతరగతి తల్లిదండ్రులకు తప్పడంలేదు. అలాంటి టైమ్‌లో వాళ్లకు కొన్ని నిజాలు తెలియాలి. అందుకే ‘బస్‌స్టాప్’ తీశాను. నేను ఒక జానర్‌ని ఎంచుకున్నా. ‘ఇది నా జానర్’ అని ట్రైలర్‌లోనే చెప్పేస్తున్నా. అది నచ్చినోళ్లే సినిమాకొస్తారు. నచ్చనివారు రారు. దట్సాల్.
     
 ఈ రోజుల్లో, బస్‌స్టాప్ చిత్రాలు మీకు సక్సెస్‌లు ఇచ్చాయి. అలాగే విమర్శలకు కూడా కారణమయ్యాయి. మీపై విమర్శలు వినిపించినప్పుడు మీకు బాధ అనిపించిందా?

 మారుతి: నేను బూతుడైలాగుల్నే నమ్ముకొని వచ్చినవాణ్నయితే.. మీరన్నట్లు భయం, బాధ కలుగుతాయి. కానీ... నన్ను ఇంకా పూర్తిగా ఎవరూ చూడలేదు. నా సామర్థ్యం తెలిసిన వారు ఇక్కడ చాలా తక్కువ. అలాంటప్పుడు నేను బాధ పడటం ఫూలిష్‌నెస్ అవుతుంది. అందుకని విమర్శలను నేను తేలిగ్గా మాత్రం తీసుకోను. నన్ను ఒకరు విమర్శించారంటే... కచ్చితంగా నాలో తప్పు ఉండే ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? రెండోసారి ఆ తప్పు రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఆ విషయంలో నేను చాలా పర్‌ఫెక్ట్‌గా ఉంటాను. నేను క్లీన్ మూవీలు కూడా తీయగలను అని నిరూపించుకోవడానికే ‘ప్రేమకథాచిత్రమ్’ తీశాను.
     
 ‘ప్రేమకథాచిత్రమ్’ మీపై వచ్చిన బ్యాడ్‌ని కొంతవరకు తుడిచేసిందనే చెప్పాలి.
 మారుతి: కచ్చితంగా... ఆ సినిమా నాకిచ్చిన ఎనర్జీ అంతా ఇంతా కాదు. కేవలం ఆ సినిమా వల్లే ఎన్నో కథలు నాలో పుట్టాయి. ‘ప్రేమకథాచిత్రమ్’ని ఎడిటింగ్ రూమ్‌లో చూసిన చాలామంది పెదవి విరిచారు. అది సినిమానే కాదన్నారు. ‘ఆ గిరిగాడు అసలు ఆర్టిస్టే కాదు. వాణ్ణి ఎందుకు నమ్మావ్... వాడి లెంగ్త్‌లు కట్ చేయ్’ అని సలహా ఇచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. కొందరైతే ఇంకో అడుగు ముందుకేసి, ‘ఇలాంటి క్లీన్ సినిమాలు నీ నుంచి చూడరు... నీ నుంచి డబుల్‌మీనింగ్ డైలాగుల్నే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఇందులో అవేం వినబడటం లేదు. ఇది కచ్చితంగా ఆడదు. అందుకే.. ఈ సినిమాకు నీ పేరు వేసుకోకు’ అని చెప్పారు. నిజంగా భయపడిపోయా. ఓసారి తెల్లారుజాముదాకా ఎడిటింగ్ రూమ్‌లోనే కూర్చొని మళ్లీ మళ్లీ సినిమా చూశా. బాగానే ఉందే అనిపించింది. గుడ్డిగా సినిమాను విడుదల చేశాం. మేం ఖర్చుపెట్టిన దానికి ఏడురెట్లు వసూళ్లు చేసిందా సినిమా. ‘నువ్వు కొత్తగా వెళ్లు.. మేం ఆదరిస్తాం’ అని జనాలు నాకిచ్చిన భరోసా ‘ప్రేమకథాచిత్రమ్’.
     
 మీ వయసు మూడు సినిమాలు. ఓ విధంగా మీరే నిలదొక్కుకునే స్టేజ్‌లో ఉన్నారు. కానీ మీరేమో అందుకు భిన్నంగా... మీరు నిలబడుతూ... పదిమందిని నిలబెడుతూ ముందుకెళ్తున్నారు. నేటి దర్శకులకు భిన్నంగా పడుతున్నాయి మీ అడుగులు. ఇది అనుకోకుండా జరుగుతోందా? లేక ఓ ప్లాన్ ప్రకారం వెళుతున్నారా?  
 మారుతి: నేను కష్టపడి పైకొచ్చినవాణ్ణి. అందుకే కష్టపడి పనిచేసేవారంటే నాకిష్టం. క్రియేటివ్ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి.. ప్రతిభను తేలిగ్గా పసిగట్టగలను. బహుశా ఈ లక్షణాల వల్లే పదిమందికి హెల్ప్ అవుతున్నానేమో. ఇండస్ట్రీతో నా అనుబంధం దశాబ్దంపైనే. తొలినాళ్లలో కొన్ని సినిమాలను పంపిణీ కూడా చేశాను. టాలెంట్ ఉండి కూడా వెనుకబడ్డవారిని ఇక్కడ చాలామందిని చూశాను. శక్తి లేనప్పుడు వారిని చూసి బాధపడేవాణ్ణి. ఇప్పుడు నాకు దేవుడు కావాల్సినంత శక్తినిచ్చాడు. అందుకే ప్రోత్సాహాన్నిస్తున్నా. ‘అదృష్టం’ అనే ఫ్లాప్ సినిమాను తీసేసరికి శేఖర్‌సూరిపై అందరూ ఫ్లాప్ డెరైక్టర్ అనే ముద్ర వేశారు. అతని టాలెంట్ నాకు పూర్తి తెలుసు. అందుకే...  ‘ఏ ఫిలింబై అరవింద్’ కథ తాను తయారు చేసుకున్నప్పుడు... ఇండస్ట్రీలో చాలామందికి అతనితో కథ చెప్పించాను. చివరకు వర్కవుట్ అయ్యింది. తీశాడు. పెద్ద హిట్ కొట్టాడు. అందరూ మంచి డెరైక్టర్ అన్నారు. ఒక్క ప్రయత్నంతో ఎవరి ప్రతిభను అంచనా వేయకూడదని, మరొక కోణంలో అతనికి టాలెంట్ ఉండొచ్చని దాన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. అలాంటి వాళ్లను ప్రోత్సహించి, షైన్ చేస్తే... మరిన్ని మంచి సినిమాలొస్తాయి. అందుకే ప్రతిభ ఉన్నవాళ్లను ప్రోత్సహిస్తున్నా. నా గడప తొక్కిన ఎవరైనా సరే... నిరుత్సాహంతో వెనుదిరగడానికి నేనిష్టపడను.
     
 ‘దాసరి’ మారుతి.. సాధ్యమైనంతమేర ఇంటిపేరును సార్థకత చేసుకునే పనిలో ఉన్నట్టున్నారు
 మారుతి: అంతపెద్ద కోరికలేం లేవండీ.. ఒక ప్రణాళిక ప్రకారం నేనెప్పుడూ నడవలేదు. ఏది అనిపిస్తే అది చేసుకుంటూ పోయానంతే. నేను బతకాలి.. ఏం చేస్తే బతకగలను? అనేదే ఫస్ట్ ఆలోచించా. ఆ ఆలోచనే... స్టిక్కరింగ్ వేసుకొని బతికే నన్ను నెలకు లక్షా 30 వేల రూపాయలు డ్రా చేసేలా చేసింది. ‘నేనంటూ ఒకణ్ణి ఉన్నానని అందరికీ తెలియాలి. అందరి దృష్టీ నాపై పడాలి’ అని ఆశించాను. ఆ ఆశే ‘ఈ రోజుల్లో’ సినిమా తీసేలా చేసింది. నా రెండో సినిమా ‘బస్‌స్టాప్’కి నాపై ‘బూతు డెరైక్టర్’ అనే ముద్ర వేశారు. అప్పుడు దర్శకుడిగా నేనేంటో అటు ఇండస్ట్రీకి, ఇటు ప్రేక్షకులకూ తెలియాలి అని కసిగా అనుకున్నా. ఆ కసే ‘ప్రేమకథాచిత్రమ్’ తెరకెక్కించేలా చేసింది.  
     
 వంద సినిమాలు డెరైక్ట్ చేశాక గానీ... దాసరి, రాఘవేంద్రరావు లాంటివాళ్లు ‘దర్శకత్వ పర్యవేక్షణ’ అనే టైటిల్‌కార్డ్ వేసుకోలేదు. మీరు మూడో సినిమాకే ఆ కార్డ్ వేసేసుకున్నారు. ఆ టైటిల్ కార్డ్ చూడగానే.. మారుతీకి అప్పుడే అంత దేనికి? అనుకున్నవారు లేకపోలేదు... మరి మీరేమంటారు?
 మారుతి: నాకు ఏ దారి కరెక్ట్ అనిపిస్తే.. ఆ దారిలో వెళతా. అంతేతప్ప వాళ్లు తిడుతున్నారని, వీళ్లు పొగుడుతున్నారని నా దారి మార్చుకోను. నేను రోడ్డు పక్కన ప్లాట్‌ఫాంపై స్టిక్కరింగులేసుకుని బతికినోణ్ణి. ఈ రోజు ఉన్నట్టుండి పేరుప్రఖ్యాతులు వచ్చాయి. వీటిని శాశ్వతం అని నేను అనుకోను. ఇవన్నీ ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు. పోయినా నేను పెద్దగా ఫీలవ్వను. ఎందుకంటే.. నా విద్య నాకుంది. మళ్లీ రోడ్డుమీదకెళ్లి స్టిక్కరింగులేసుకుంటా. మాటవరసకు చెబుతున్న మాట కాదిది. మళ్లీ చేసి చూపిస్తా. ఇడ్లీ బండి పెట్టుకొని కూడా బతికేయగలను. ‘మారుతీకి అప్పుడే అంత దేనికి?’ అనుకున్నవారికి నేనిచ్చే సమాధానమిది. దర్శకత్వ పర్యవేక్షణ అనే టైటిల్‌కార్డ్ ‘దర్శకత్వం’ అనే టైటిల్‌కార్డ్ కంటే గొప్పదేం కాదు. నాకు తెలిసి దానికి సీనియారిటీతో పనిలేదు.
     
 స్టార్‌డమ్‌ని పట్టించుకోనని మీరంటున్నారు. కానీ బయట మీపై వేరే అభియోగం ఉంది. స్టార్‌డమ్ ఉండగానే ఇంటికి చక్కదిద్దుకుంటున్నారనీ... కనిపించిన ప్రతి సినిమానూ సమర్పించేస్తున్నారనీ, సదరు నిర్మాతల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారని అనుకుంటున్నారు. మీరేం అంటారు?
 మారుతి: నా స్టార్‌డమ్‌ని నేను వాడుకోవడంలా, నా పేరును, నా ఇమేజ్‌ని వేరే వాళ్లు వాడుకుంటున్నారు. ‘మా సినిమాను ‘సమర్పణ’ అని మీ పేరు వేసుకుంటాం. దానికి ప్రతిగా 75 లక్షలిస్తాం’ అని గత ఏడాది నన్నడిగిన వాళ్లు కోకొల్లలు. అలా వచ్చిన ప్రతి ఆఫర్‌నీ నేను ‘ఓకే’ చేసుంటే... ఒక్క ఏడాదిలోనే కోట్లు సంపాదించేవాణ్ణి. కథ గురించి తెలుసుకోకుండా, దర్శకుని ప్రతిభను అంచనా వేయకుండా.. కేవలం డబ్బు తీసుకొని సినిమాలను సమర్పిస్తున్నాననడం అన్యాయం. నిజానికి అక్కడ జరుగుతోంది వేరే. ముందు కథ వినాలి. ఆ ప్రాజెక్ట్‌పై నమ్మకం కుదిరాక, వాళ్లకు మంచి టెక్నీషియన్లను సెట్ చేయాలి. ఇదంతా నా బాధ్యతే. సినిమా తీసినవారికీ, కొన్నవారికీ లాభాలు తెచ్చిపెట్టే విధంగానే బిజినెస్ చేసిపెట్టే బాధ్యత కూడా నాదే. సినిమాకయ్యే ఖర్చు మాత్రం సదరు నిర్మాతే భరిస్తాడు. ఆ సినిమాకు ప్రాఫిట్ వస్తే... నేను పడిన కష్టానికి ప్రతిఫలంగా ప్రాఫిట్‌లో సగం తీసుకుంటా. ప్రాఫిట్ రాకపోతే... ఆ సినిమా నుంచి ఏమీ ఆశించను. చిన్న సినిమాలకు ‘సమర్పణ’గా నా పేరు వేయడం వల్ల.. వాటికి కాస్తంత ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా నా పేరు కాస్త హెల్ప్ అవుతుంది. అలాగే.. నా కింద వందమంది ఎంప్లాయిస్ పనిచేస్తున్నారు. వాళ్లందరికీ పని దొరుకుతుంది. ‘మారుతి సమర్పించు’ అనే టైటిల్ కార్డ్ వెనుక ఇంత కథ ఉంది.
     
 సరే... వెంకటేష్‌తో ‘రాధా’ అంటున్నారు. హోంమినిస్టర్ ప్రేమకథ అంటున్నారు. ఏంటా కబుర్లు?
 మారుతి: మంచి లవ్‌స్టోరీ అది. వెంకటేష్‌గారి ఏజ్‌కి తగ్గట్టుగా ఉంటుంది. సెలబ్రిటీలు కూడా ప్రేమలో పడతారు. అయితే... దాన్ని వ్యక్తవరచడం మాత్రం వారికి కష్టతరమైన విషయం. ఓ సాధారణ స్త్రీని... ఓ హోంమినిస్టర్ ఇష్టపడితే.. దాన్ని తాను ఎలా వ్యక్తపరిచాడు? తద్వారా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అనేది ఈ సినిమా కథ. మారుతి ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్నాడని అందరూ అంటున్నారు కదా. అందుకే... ఆ పేరు చెడకుండా ఈ సినిమా ఉంటుంది. 27ఏళ్ల కెరీర్‌లో దాదాపు అన్ని రకాల పాత్రలూ చేశారు వెంకటేష్. అలాంటి హీరోని కొత్తగా చూపించడం ఎలా? అని ఆలోచించి ఇష్టంతో చేసుకున్న సబ్జెక్ట్ ఇది. నా స్టైల్‌లోకి ఆయన్ను తెచ్చుకొని ఈ కథ రాసుకున్నాను. సరదాగా అందరూ నవ్వుకునేలా సినిమా ఉంటుంది.  
     
 మీరు సృష్టించిన ట్రెండ్‌లోనే ప్రస్తుతం చిన్న సినిమాలన్నీ నడుస్తున్నాయి. ఎటు చూసినా  అవే కథాంశాలు. ఓ విధంగా జనాలు విసిగిపోయారనే చెప్పాలి. ఈ ట్రెండ్‌ని మీరే బ్రేక్ చేయొచ్చుగా?
 మారుతి: తప్పకుండా చేస్తా. ప్రేక్షకులకు కాదు, నాక్కూడా చికాకుగానే ఉంది. గోడలపై ఈ రోజు కనిపించిన పోస్టర్ రేపు కనిపించడం లేదు. బూతులు పెట్టేస్తే సినిమా ఆడేస్తుందనుకొని, విలువలకు తిలోదకాలిచ్చేసి సినిమాలు తీస్తున్నారు. చివరకు దెబ్బతింటున్నారు. ఈ తీరుగా సినిమాలు రాకపోతేనే మంచిది. సినిమా అనేది కాపీ జాబ్ కాదు. క్రియేటివ్ జాబ్. హిట్ సినిమాలను, కొరియన్ సినిమాలను, పరభాషా కథలను కాపీ కొట్టేసి తీసే సినిమాలు నా దృష్టిలో సినిమాలే కాదు. సినిమా అంటే... మనలోంచి పుట్టాలి. మస్తిష్కంలోంచి ఉద్భవించాలి. ప్రాబ్లమ్ సొసైటీలోంచి తీయాలి. అది అందరికీ కనెక్టయ్యేదిగా ఉండాలి. ‘బొమ్మరిల్లు’ ఎందుకు ఆడింది అంటే.. ప్రతి కుటుంబానికి ఆ కథ కనెక్ట్ అయ్యింది.. కొత్త సినిమాలొస్తే ప్రూవ్ అవుతాయ్ అనడానికి ఆ సినిమానే నిదర్శనం.
 

- బుర్రా నరసింహ
 
  ‘ఈ రోజుల్లో’ సినిమా విడుదల ముందురోజు రాత్రి...  మీరు పడిన అంతర్మథనం?
 మారుతి: అది నా జీవితంలో గొప్ప మిరాకిల్. సినిమా అంటేనే తెలీని నేను, 5డి కెమెరాతో సినిమా తీశాను. చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అప్పటికే సినిమాను అమ్మేశాం. వాళ్లిచ్చిన డబ్బులు ఖర్చుపెట్టేశాం. డీటీఎస్ ప్రింట్లు కూడా లేవు. సినిమా రిలీజ్ రోజున ఎవరూలేని ఓ వీధిలో ఓ పక్కగా కారును పార్క్‌చేసి, ‘సినిమా ఎందుకు తీశాన్రా దేవుడా...’ అంటూ కన్నీటి పర్యంతం అయ్యాను. ఆ క్షణాలు నాకింకా కళ్లముందు కదులుతూనే ఉన్నాయి. నాకు ఫస్ట్ నుంచి నెగిటివ్‌గా ఆలోచించడం అలవాటు. ‘రేపు సినిమా రిలీజ్ అవుతుంది. పెద్ద ఫ్లాప్ అవుతుంది. కొన్నవాళ్లందరూ మీద పడతారు. ఏం చేయాలి?’ ఇదే ఆలోచన. అందుకే నాకు రెండు ఫోన్లు ఉంటే... ఒక ఫోన్ స్విచాఫ్ చేసేశాను. ఇంతలో రెండోఫోన్ రింగ్ అయ్యింది. ‘గోకుల్ థియేటర్ దగ్గర జనాలున్నారు...రా’ అంటూ ఫ్రెండ్ ఫోన్. ‘హె... ఈ సినిమాకు జనాలుండటం ఏంటి... ఉట్టిమాట’ అనుకున్నా. మళ్లీ ఫోన్... ‘మన ట్రైలర్స్‌కి మంచి ఇంపాక్ట్ వచ్చినట్టుంది.. ఏలూరులో కూడా జనాలు ఫుల్‌గా ఉన్నారంట’ అని. ఏదో మిరాకిల్ జరుగుతున్నట్టు అనిపించి, గోకుల్ థియటేర్‌కి వెళ్లాను. తలుపు తీసి థియేటర్‌లోకి అడుగుపెట్టగానే.. హాల్లో నాన్‌స్టాప్ నవ్వులు. జనాలు విపరీతంగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు. వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. ఆ రోజునే తొలిసారిగా నాకు వందకు పైగా ఫోన్లొచ్చాయి. ఆ అంకె ఇప్పటికీ తగ్గలేదు. ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ‘ఈ రోజుల్లో’ విషయంలో...  నా మిత్రులు నాన్‌స్టాప్ శ్రీను, ఎస్‌కెఎన్ నాకిచ్చిన మోరల్ సపోర్ట్‌ని మాటల్లో చెప్పలేను. నా ప్రాజెక్ట్‌ని వాళ్లిద్దరూ తీసుకెళ్లి జనాల్లోకి విసిరేశారు. వారిద్దరూ పబ్లిసిటీ చేసిన విధానమే ‘ఈ రోజుల్లో’ సినిమాను నిలబెట్టింది.
 
  ‘ఈ రోజుల్లో’ ముందు, ‘ఈ రోజుల్లో’ తర్వాత మీలో మీరు గమనించిన తేడా?
 మారుతి: ‘ఈ రోజుల్లో’ ముందు పేపర్ బయట ఉండేవాణ్ణి. ‘ఈ రోజుల్లో’ తర్వాత పేపర్‌లోకి వచ్చాను. అంతే తేడా! ఇంతకు మించి నాలో ఏ మార్పూ లేదు. నాలో మార్పు రాదు కూడా. అయితే... ఒకప్పుడు నన్ను తక్కువగా చూసిన వారూ, నన్ను శత్రువుగా భావించిన వారు.. ఇప్పుడు ‘మారుతి మా వాడు’ అన్నట్లు బిహేవ్ చేయడం, నాకు దగ్గర కావడానికి ప్రయత్నించడం... చూస్తుంటే... ఏదో తెలీని చిన్న సంతృప్తి.
 
 ‘ప్రేమకథాచిత్రమ్’ సినిమాకి దర్శకుడు ప్రభాకరరెడ్డి అయితే.. క్రెడిట్ మొత్తం మారుతీ కొట్టేశాడని అనుకునేవాళ్లు చాలామందే ఉన్నారు..?
 మారుతి: ఆ విషయం చెప్పేముందు.. ఈ సినిమాకు ముందు జరిగిన ఓ సంఘటన గురించి చెప్పాలి. ‘ప్రేమకథాచిత్రమ్’ నిర్మాత సుదర్శన్‌రెడ్డి.. ‘ఈ రోజుల్లో’ నుంచీ నాకు పరిచయం. ‘ఈ రోజుల్లో’ చిత్రాన్ని వైజాగ్‌లో రిలీజ్ చేయాలనుకున్నారాయన. అనుకోకుండా ఎడిటింగ్ రూమ్‌లో ఆ సినిమా చూశారు. ఇది ఆడే ప్రసక్తే లేదని, అట్టర్‌ఫ్లాప్ సినిమా అని తేల్చిపారేశారు. ఆయన అభిప్రాయం అదైనప్పుడు ఆయనకే వైజాగ్ అమ్మడం కరెక్ట్ కాదని, వేరే వాళ్లకు ఆ సినిమా ఇచ్చాం. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. కొన్నవాళ్లకు విపరీతమైన లాభాలు తెచ్చిపెట్టింది. సుదర్శన్‌రెడ్డి అప్పుడు నిజంగా షాక్ అయ్యారు. ‘ఇంత హిట్ సినిమాను ఏ దృష్టితో చూశాను’ అని బాధపడిపోయారు. అప్పుడే తనకు ఓ సినిమా చేసిపెట్టమని అడిగారు. ‘బస్‌స్టాప్’ షూటింగ్ టైమ్‌లో అయిదులక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చారు. నేనేమో అప్పటికే గీతా ఆర్ట్స్‌వారికి కమిటై ఉన్నాను. ఇచ్చిన మాట ప్రకారం మూడో సినిమా గీతా ఆర్ట్స్‌కే చేయాలి. అందుకే...‘ కథ, మాటలు ఇచ్చి.. నా కోై-డెరెక్టర్ రాజేష్‌తో సినిమా చేయిస్తాను’ అని చెప్పాను. ఆయన ‘ఓకే’ అన్నారు. హీరోగా సుధీర్‌బాబుని ఫైనల్ చేశారు. అయితే... సుధీర్‌బాబు మాత్రం నేను డెరైక్ట్ చేస్తేనే సినిమా చేస్తానన్నాడు. ‘నేనే డెరైక్ట్ చేస్తాను కానీ.. పేరు మాత్రం వేసుకోలేను’ అని సుధీర్‌కి నిర్మొహమాటంగా చెప్పేశాను. చివరకు ఎలాగో అంగీకరించాడు. అయితే... మా కో-డెరైక్టర్ రాజేష్ మాత్రం ఇబ్బందిగా ఫీలయ్యాడు. ‘మీరు డెరైక్ట్ చేస్తుంటే నేను పక్కన ఉండటం, పేరు మాత్రం నాది వేయడం ఇబ్బందిగా ఉంటుంది. నేను ఈ సినిమా చేయలేను’ అనేశాడు. అలాంటి టైమ్‌లో.. మా కెమెరామేన్ ప్రభాకరరెడ్డి.. ఆయనంతట ఆయనే వచ్చి.. ‘ఎవరి పేర్లో దేనికి? నా పేరు వేసుకో. నా కెలాంటి అభ్యంతరం లేదు’ అని చెప్పడంతో... ప్రభాకరరెడ్డిగారి పేరు మీద ‘ప్రేమకథాచిత్రమ్’ డెరైక్ట్ చేశాను. అయితే.. ఆ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆ సినిమా డెరైక్టర్‌గా నా పేరు లేకపోవడం ఇంట్లోవాళ్లకు కూడా బాధ కలిగించింది. కష్టపడి సినిమా తీసినప్పుడు ప్రతిఫలాన్ని ఆశించడం తప్పుకాదని ఇంట్లోవాళ్లు నచ్చజెప్పడంతో... ఆ సినిమా దర్శకునిగా నేను బయటకు రాక తప్పలేదు. ఈ విషయంలో నాకు సహకరించిన ప్రభాకరరెడ్డిగారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement