నేను అనే భావన పెరిగేలోపే ఆ బాటలో వెళ్లాలి! | Exclusive interview with Victory Venkatesh | Sakshi
Sakshi News home page

నేను అనే భావన పెరిగేలోపే ఆ బాటలో వెళ్లాలి!

Published Sat, Nov 9 2013 10:28 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

Exclusive interview with Victory Venkatesh

 బయట ఉన్నంత ‘రిచ్’గా లోపలా ఉండగలమా?
 లోపల అంటే... మన ఆలోచనల్లో, ఆచరణల్లో.
 రిచ్‌గా అంటే... భౌతిక విలువలకు అతీతంగా, ఆధ్యాత్మికంగా.
 ‘ఉండగలం’ అంటారు విక్టరీ వెంకటేష్.
 ఎలా?
 మానవుడికన్నా మరికాస్త గొప్పగా ఆలోచించాలట!
 అంటే?!
 నంబర్ వన్: నేను, నాది, నా వల్ల... అనుకోకూడదు.
 నంబర్ టు: దేన్నీ  శాశ్వతమని భావించకూడదు.   
 నంబర్ త్రీ: రేపటి గురించి ఆలోచిస్తూ ఇవాళ్టిని వృథా చేయకూడదు.
 బానే ఉంది కానీ..
 మానవుడు మానవుడిలా కాకుండా ఇంకెలా ఆలోచిస్తాడు?
 ఒక సాధువులా, ఒక సద్గురువులా, ఇంకా... హీరో వెంకీలా!
 వెంకీలో అంతుందా! అంత కాదు, ఎంతో ఉంది.
 వెంకీతో ఎంటర్‌టైన్ అవాలనుకునేవారు ఆయన సినిమాలను ఎన్నిసార్లైనా చూడొచ్చు.
 వెంకీతో ఎన్‌లెటైన్ అవాలంటే మాత్రం ఒక్కసారైనా ఈ ‘తారాంతరంగం’ చదవాలి.

  ‘ఐ విల్ కట్ హారిజాంటల్లీ...’ అంటూ వచ్చీ రాని ఇంగ్లిష్‌లో ‘మసాలా’ సినిమాలో డైలాగ్ చెప్పారు. ఒకప్పుడు మీ తెలుగు కూడా అలానే ఉండేది కదా?
 వెంకటేష్: అవును. తెలుగు మాట్లాడటం చాలా కష్టమయ్యేది. నా స్కూలింగ్ అంతా చెన్నయ్‌లోనే. ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లిష్, సెకండ్ లాంగ్వేజ్ హిందీ. పైగా పై చదువుల కోసం విదేశాలు వెళ్లిపోవడం వల్ల తెలుగు మాట్లాడే అవకాశం చాలా చాలా తక్కువ ఉండేది. హీరో అయిన కొత్తలో నా పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి చాలా ఇబ్బందిపడేవాణ్ణి. అప్పట్లో నా తెలుగులో బాగా ఇంగ్లిష్ ఉండేదనేవాళ్లు.
 
 ఓసారి మీ ఫ్లాష్‌బ్యాక్‌కి వెళదాం... సురేష్ ప్రొడక్షన్స్ బేనర్ ఎంబ్లమ్‌లో ‘ఎస్’ అక్షరంపై మీరు, ‘పి’ అక్షరంపై మీ అన్నయ్య సురేష్‌బాబు ఉంటారు. అక్షరాలకు తగ్గట్టు మీరు స్టార్, మీ అన్నయ్య ప్రొడ్యూసర్ అయ్యారు. ఇలా జరుగుతుందని ఎప్పుడైనా అనుకున్నారా?
 వెంకటేష్: అస్సలు అనుకోలేదు. నేను సినిమాల్లోకి వస్తాననే అనుకోలేదు. బేనర్ లోగో తయారు చేయించినప్పుడు అన్నయ్యను, నన్ను నిలబెట్టి నాలుగైదు రకాల స్టయిల్స్‌లో నాన్నగారు లోగో తయారు చేయించారు. మేమిద్దరం బాక్సింగ్ చేస్తున్నట్లు, షేక్‌హ్యాండ్ ఇచ్చుకుంటున్నట్లు.. ఇలా షూట్ చేశారు.
 
 అప్పట్లో మీరేం అవ్వాలనుకునేవారు?

 వెంకటేష్: స్పైసెస్ (సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులు) బిజినెస్ చేద్దామనుకున్నా. ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్‌కి సంబంధించిన బిజినెస్ కదా. ఆ వ్యాపారం అయితే ఎక్కువగా ట్రావెల్ చేయొచ్చు. ఎందుకంటే, నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం.  కానీ, మనం అనుకున్నదేదీ జరగదు కదా! కృష్ణగారు బిజీగా ఉండటంవల్ల నాన్నగారు నన్ను ‘కలియుగ పాండవులు’లో హీరోగా చేయమన్నారు. అప్పుడు అబ్రాడ్‌లో చదువుతున్నాను. నాన్నగారు ఫోన్ చేయగానే, ఇక్కడికొచ్చేశాను. అనుకోకుండా హీరో అవ్వడం... ఇదిగో ఇక్కడిదాకా రావడం.. అందరికీ తెలిసిందే.
 
 గోల్డెన్ స్పూన్‌తో పుట్టారు... మీ లైఫ్ అంతా అద్భుతమే కదూ?

 వెంకటేష్: అసలు గోల్డెన్ స్పూన్ అంటే ఏంటి? ‘మెటీరియల్ వరల్డ్’కి నేను గోల్డెన్ స్పూన్‌తో పుట్టినట్లుగానే ఉంటుంది. దేశంలో ఎంత పెద్ద అయినా, లోపల ‘పూర్’గా ఉంటే జీవితం వృథా అని నా అభిప్రాయం.
 
 లోపల బీదగా ఉండటం అంటే..?
 వెంకటేష్: బయటికి నేను బాగా రిచ్‌గా ఉండొచ్చు. కానీ, లోపల ఎంత ఆనందంగా ఉన్నారో మీకెలా తెలుస్తుంది? ఆధ్యాత్మిక అవగాహన ఉంటేనే నా దృష్టిలో ‘రిచ్’ కింద లెక్క.
 
 మరి... మీరు ధనవంతులేనా?
 వెంకటేష్: యస్..!
 
 ఆధ్యాత్మిక అవగాహన ఉంటేనే ‘రిచ్’ అని ఎలా అంటారు?
 వెంకటేష్: ఓకె.. కొంచెం విపులంగా మాట్లాడుకుందాం. నా కెరీర్‌ని తీసుకుందాం. రెండు సినిమాలు సూపర్ హిట్. బ్రహ్మరథం పడతారు. ఆ తర్వాత రెండు ఫట్లు... ఎవరూ దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడరు. సో.. సక్సెస్ అనేది అశాశ్వతమే కదా. అలాగే, స్నేహితులతోనూ బంధువులతోనూ అనుబంధాన్ని తీసుకుందాం. ఎక్కడైనా చిన్న మాటలో తేడా వస్తే.. ఆ అనుబంధం ఏమవుతుంది? కాబట్టి అనుబంధాలూ అశాశ్వతమే. వేసుకునే బట్టలు, వాడే వస్తువులు.. ఏదీ జీవితాంతం మనతోపాటు ఉండిపోవుగా. మరి.. శాశ్వతం కాని వాటి గురించి పాకులాడటం దేనికి? సో.. ఏది శాశ్వతం.. ‘ఇన్నర్ స్ట్రెంగ్తే కదా...’. ఆ బలం ఎప్పుడు వస్తుంది? ఆధ్యాత్మిక బాటలో వెళుతూ.. ‘జీవిత సత్యం ఏంటో? శాశ్వతం ఏదో’ తెలుసుకున్నప్పుడు. ఇన్నర్‌గా మనం ఎప్పుడైతే బలంగా ఉంటామో అప్పుడు దేనికీ భయపడం. మనలో ఓ ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది!
 
 దేనికీ భయపడం అంటే... చివరికి మరణానికి కూడానా?
 వెంకటేష్: ఎగ్జాక్ట్‌లీ... మరణానికి కూడా భయపడం. అసలు చావంటే ఏంటో తెలుసుకోకుండా భయపడిపోతుంటాం. అయితే, మరణం అనేది శరీరానికి మాత్రమే అనుకున్నప్పుడు భయం ఉండదు. మన శరీరం చనిపోగానే, అందులో ఉన్న ఆత్మ వేరే తల్లి కడుపులో పడుతుందనే సత్యం తెలుసుకుంటే మరణం గురించి భయపడం!
 
 డబ్బు, నగలు, వస్తువులు.. ఇష్టపడేవారికి వాటి ద్వారా ఆనందం లభిస్తుంది. మరి.. మీకు ఎందులో ఆనందం లభిస్తుంది?
 వెంకటేష్: నేను మానవుణ్ణి కాదు.. ఇంకా ఏదో అనుకున్నప్పుడు శాశ్వతమైన ఆనందం లభిస్తుంది. ఒక మానవుడికన్నా ఇంకా గొప్పగా ఆలోచించగలిగినప్పుడు ఆనందంగా ఉంటుంది.
 
 మీరంటే చిన్నప్పట్నుంచీ అన్ని సౌకర్యాలూ అనుభవించారు కాబట్టి, ‘మెటీరియల్స్’ మీద వ్యామోహం పోయి ఉంటుంది. దాంతో... ‘ఆధ్యాత్మికం’ అంటున్నారు. కానీ, ఏమీ అనుభవించనివాళ్లు  మీరు అంటున్న అశాశ్వత ఆనందాన్నే కోరుకుంటారేమో?

 వెంకటేష్: మితిమీరిన ఆశ ఉంటే.. ఎవరికీ ఎప్పుడూ దేనిలోనూ ఆనందం లభించదు. ఉదాహరణకు.. చిన్న కారు కొనుక్కోవాలనుకున్నారు. అది కొన్న తర్వాత ఇంకా లగ్జరీ కారుని కోరుకుంటారు. చిన్న ఇల్లుతో మొదలుపెట్టి.. ఆ తర్వాత పెద్ద ఇంటి వరకు ఆశ పెరిగిపోతుంది. అలాంటివాళ్లకి ఎప్పుడూ ఆనందం దొరకదు. ఇక.. మీరన్నది కరెక్టే. ఏ సౌకర్యాలూ అనుభవించకుండా ఈ బాటలో వెళ్లలేం. నేను అన్ని సౌకర్యాలు అనుభవించాను కాబట్టే, చాలా త్వరగా ‘ఆధ్యాత్మిక బాట’కు ఆకర్షితుణ్ణయ్యాను. అసలేమీ అనుభవించకుండా ఈ భావన  అంత సులువుగా రాదు.
 
 మీ మాటలు దాదాపు ఎడ్యుకేట్ చేసే విధంగానే ఉన్నాయి. కానీ, కాసేపు సరదాగా మాట్లాడుకుందాం. చిన్నప్పుడు మీరెలా ఉండేవారో తెలుసుకోవాలని ఉంది...
 వెంకటేష్: చాలా జోష్‌గా ఉండేవాణ్ణి. అల్లరి పిల్లాణ్ణే.  నాకో చిన్న గ్యాంగ్ ఉండేది. స్కూల్లో అందరితో బాగుండటం, ఎంజాయ్ చేయడం అలా ఉండేవాణ్ణి. నా క్లాస్‌తో పాటు ఇతర క్లాసుల పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండేవాణ్ణి. చదువుపరంగా చెప్పాలంటే యావరేజ్. స్పోర్ట్స్‌లో బాగా పార్టిసిపేట్ చేసేవాణ్ణి. స్కూల్లో ‘సిస్టమ్’కి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే భరించేవాణ్ణి కాదు. ఉన్నవాళ్ల పిల్లలను ఓ రకంగా, లేనివాళ్లను ఓ రకంగా ట్రీట్ చేస్తే ఊరుకునేవాణ్ణి కాదు. పిల్లలందరికీ ఫ్రెండ్... టీచర్స్‌కి మాత్రం విలన్‌నే.
 
 అయితే.. కాలేజ్‌లో ఇంకా రెబల్‌గా ఉండేవారేమో?
 వెంకటేష్: అవును. పక్క కాలేజీవాళ్లకీ మా కాలేజీవాళ్లతో మాటా మాటా వచ్చినప్పుడు గొడవపడటానికి ముందుండేవాణ్ణి.
 
 రామానాయుడి కొడుకు కాబట్టి.. స్కూల్, కాలేజ్‌లో మీరేం చేసినా చెల్లుబాటు అయ్యుంటుందేమో?
 వెంకటేష్: స్కూల్లో నన్నెప్పుడూ ప్రత్యేకంగా చూడలేదు. అల్లరి చేసినప్పుడు ‘గో అవుట్’ అంటూ టీచర్స్ నన్ను బయట నిలబెట్టిన రోజులు చాలానే ఉన్నాయి. నేను ‘రామానాయుడు కొడుకు’ అని ఎవరి దగ్గరా చెప్పుకునేవాణ్ణి కాదు. ‘నేను మామూలు వ్యక్తిని’ అనుకున్నప్పుడే లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేయగలుగుతాం అని నేను చిన్నప్పట్నుంచీ నమ్మేవాణ్ణి.
 
 కాలేజ్ డేస్‌లో బైక్ మీద ఫ్రెండ్స్‌తో బాగానే హల్‌చల్ చేసేవారా?
 వెంకటేష్: బీకామ్ ఫస్ట్ ఇయర్‌లో యమహా కొనుక్కున్నాను. ఫస్ట్ బైక్ థ్రిల్లే వేరు. ఆ బైక్‌ని మాడిఫై చేయించుకోవడం, గారేజ్‌కి తీసుకెళ్లి, పెయింటింగ్‌లు వేయించుకోవడం అంతా బాగుండేది. కొన్నాళ్లు హాయిగానే సాగింది. కానీ ఓసారి యాక్సిడెంట్ జరగడంతో ఇంట్లోవాళ్లు ఇక బైక్ వద్దన్నారు. ఆ విధంగా నా బైక్ రైడ్‌కి బ్రేక్ పడింది.
 
 అది సరే... ‘ప్రేమనగర్’లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశారు కదా.. ఆ తర్వాత ఎందుకు కంటిన్యూ అవ్వలేదు?
 వెంకటేష్: అది అనుకోకుండా జరిగింది. ఓ రోజు నేనేదో ఆడుకుంటుంటే, మా మేనేజర్ అనుకుంటా.. నా దగ్గరికొచ్చి ‘నాన్నగారు రమ్మంటున్నారు.. యాక్ట్ చేయాలట. చేస్తే మీ బ్యాంక్‌లో డబ్బులు వేస్తారట’ అన్నాడు.  సరే.. వెళ్లాను. చేశాను. అంతేకానీ నాకు ప్రత్యేకంగా ఇంట్రస్ట్ ఏమీ లేదు.
 
 కనీసం చిన్నప్పుడు అద్దం ముందు నిలబడి, యాక్ట్ చేసి చూసుకోవడం కూడా చేసేవారు కాదా?
 వెంకటేష్: సినిమా వాతావరణంలో పెరిగినందువల్లో ఏమో.. మా ఆఫీస్ పైన ఉన్న కాస్ట్యూమ్ రూమ్‌లోకెళ్లి.. మా జానపద సినిమాలకు సంబంధించిన డ్రెస్‌లేసుకుని, అద్దం ముందు నిలబడి, ఏవో పిచ్చి పిచ్చి సైగలు చేయడం ఇంకా గుర్తుంది. అలాగే, మావాళ్లు అప్పుడప్పుడు, నన్ను డాన్స్ చేయమనేవాళ్లట. కొంతమంది స్టార్స్‌ని ఇమిటేట్ చేసేవాణ్ణట. ఇలాంటివన్నీ అన్నయ్య చెయ్యలేదు. నేనే చేశానంటే.. ఏదో మూల నాలో యాక్టింగ్ మీద ఇంట్రస్ట్ ఉండేదేమో...!
  అన్నయ్య, మీరు చిన్నప్పుడు ఎలా ఉండేవారు?
 వెంకటేష్: మా ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ లేదు కాబట్టి చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్లం. ఇప్పుడూ అలానే ఉంటాం. అన్నయ్య మంచి స్పోర్ట్స్‌మేన్. క్రికెట్ బాగా ఆడేవాడు. ఫాస్ట్ బౌలర్. స్కూల్లో స్పోర్ట్స్ అంటే... అన్నయ్య పార్టిసిపేషన్ కంపల్సరీ.
 
 సౌత్‌లో నిర్మాతల కొడుకుల్లో మీ అంతగా సక్సెస్ అయినవాళ్లు లేరు. భవిష్యత్తుని ప్లాన్ చేయనన్నారు కాబట్టి... ఈ ఊహించని సక్సెస్ ఎలా అనిపిస్తోంది?
 వెంకటేష్: నా మొదటి సినిమా తర్వాత వరుసగా నాలుగైదు ఫ్లాప్‌లు వచ్చాయి. దాంతో, చాలా కామెంట్స్ వచ్చాయి. ‘నిర్మాతల కొడుకులు కష్టం’ అని కొందరు, ‘ఈ అబ్బాయికి యాక్టింగ్‌కి కుదరదు’ అని మరికొందరు వ్యాఖ్యలు చేశారు. అప్పటికే చిరంజీవిగారు, బాలకృష్ణగారు, నాగార్జునగారు సినిమాలు చేస్తున్నారు. ఆ సమయంలో ఓ నిర్మాత కొడుకుగా నేను ఎంటరయ్యాను. అయినా ఎవరి విమర్శలనీ పట్టించుకోలేదు. హిట్, ఫ్లాప్ గురించీ ఆలోచించలేదు. ఫస్ట్ సినిమాలో నన్ను నేను చూసుకుని ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, నేనెలాంటి ట్రైనింగ్ తీసుకోలేదు. అబ్రాడ్ నుంచి రావడం రావడమే యాక్టింగ్ మొదలుపెట్టాను. డెరైక్టర్, ఫైట్ మాస్టర్, డాన్స్ మాస్టర్ ఏం చెబితే అది చేశాను. కొన్ని ఫ్లాపుల తర్వాత స్వర్ణకమలం, ప్రేమ, శ్రీనివాస కల్యాణం లాంటి డిఫరెంట్ మూవీస్‌కి అవకాశం వచ్చింది. దాంతో మంచి పేరొచ్చింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పాటు డిఫరెంట్ మూవీస్ చేయడం, ఆడియన్స్ నన్ను అంగీకరించడం... అంతా కూల్‌గా జరిగిపోయింది. సో.. ముందుగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ప్రేక్షకులకే.
 
 మీ కామెడీ టైమింగ్ బాగుంటుంది.. బేసిక్‌గా మీలో సెన్సాఫ్ హ్యుమర్ ఉందా?
 వెంకటేష్: ఇన్నర్‌గా హ్యుమర్ ఉంటే.. కామెడీ టైమింగ్ బాగా కుదురుతుంది.
 
 చిన్న వయసులో మాస్ సినిమాలు చేసి, ఆ తర్వాత ప్రేమకథా చిత్రాల్లో నటించారెందుకని?
 వెంకటేష్: రక్తతిలకం, బ్రహ్మపుత్రుడు, కూలీ నెం. 1 ఇలా వరుసగా మాస్, ఆ తర్వాత లవ్‌స్టోరీస్ చేశాను. మాస్ సినిమాలు చేసినప్పుడు ‘మెడ’కు గాయం తగిలింది. అది చాలా సివియర్‌గా ఉండేది. దాంతో మాస్ సినిమాలకన్నా కొంచెం సాఫ్ట్‌గా ఉండేవి చేస్తే బాగుంటుందనుకున్నా. అప్పుడు లవ్‌స్టోరీస్ చేశాను. అవి బాగా ఆడాయి. కాబట్టి.. ఆ గాయం తగలడం కూడా మేలే అయ్యిందని, ఏది జరిగినా అది మన మంచికే అనిపించింది. నాకున్న అనుభవంతో చెబుతున్నా. రిజల్ట్ అనేది 50 శాతం మనం హార్డ్‌వర్క్ చేసినందుకు వస్తుంది. మిగతా 50 శాతం రిజల్ట్ మిస్టీరియస్‌గా వచ్చేస్తుంది. అవతలి హీరోలు బిజీగా ఉన్నప్పుడు, వాళ్లు చేయాల్సిన మంచి సినిమా నాకు వచ్చి ఉండొచ్చు. లేకపోతే మనం ఖాళీగా ఉన్నాం కదా అని మనల్ని ఆ సినిమా కోసం అడిగి ఉండొచ్చు. అందుకే ఏ సక్సెస్ అయినా ‘నాది’ అనుకోను. అది అందరిదీ... ఆ టైమ్‌దీ అనుకుంటాను. ‘నా వల్ల, నేను’ అనే ఆలోచన మైండ్‌కి వస్తే.. మనం అయిపోయినట్లే. అది చాలా డేంజరస్ ఇగో.
 
 మీకు చిన్నప్పట్నుంచీ ‘ఇగో’ లేదా?
 వెంకటేష్: నిరాడంబరంగా ఉండటం అనేది మా అమ్మానాన్నల జీన్స్ నుంచి సంక్రమించినది. తనో పెద్ద నిర్మాత అని నాన్నగారు ఎప్పుడూ ఫీలవ్వలేదు. అమ్మ చాలా నిరాడంబరంగా ఉంటుంది. నా బ్రదర్, సిస్టర్ కూడా చాలా సింపుల్ పీపుల్. నాది, నేను.. అనే ఆలోచన నాకు రాకపోవడం నా అదృష్టం. ఇంకో విషయం ఏంటంటే.. ఇగో ఉన్నవాళ్లని కూడా నేను నిందించను. ఎవరైనా ఎప్పుడైనా అగ్రెసివ్‌గా బిహేవ్ చేశారనుకోండి.. నేను వాళ్లని కామెంట్ చేయను. అప్పటి తన పరిస్థితి వల్ల, టైమ్ వల్ల, తను నేర్చుకున్న విషయాల ద్వారా అతను అలా చేశాడని అనుకుంటాను. అందుకే నేనెవరి మీద జడ్జ్‌మెంట్ పాస్ చేయను. అలాగే, ఎవరైనా తప్పు చేస్తే.. వెంటనే కాకుండా ఆ తర్వాత రియాక్ట్ అవ్వాలనేది నా సిద్ధాంతం.
 
 సో.. ఎవరి గురించీ తప్పుగా ఆలోచించరన్నమాట.. అయితే మీరు తప్పులు కూడా చేయరా?

 వెంకటేష్: సాధ్యమైనంతవరకు నేనవెరి గురించీ తప్పుగా ఆలోచించను. ఒకవేళ ఎవరైనా తప్పులు చేసినా.. ఏమో వాళ్లు ఏ పరిస్థితిలో ఉన్నారో అనుకుంటా. ఇక, తప్పులు చేయరా? అనడిగారు. గొప్ప గొప్పవాళ్లూ తప్పులు చేస్తారు. కానీ, ఒక్కోసారి సాదాసీదా వ్యక్తులు కూడా గొప్పగా ఆలోచిస్తారు. అదే జీవితం. కానీ తప్పులు చేయని మానవులు ఉండరు.
 
 ఓకే.. ఇప్పుడు మళ్లీ ‘ఆధ్యాత్మికత’ విషయానికొద్దాం.. అసలు మీకీ వైపుగా దృష్టి మళ్లడానికి గల కారణం ఏదైనా ఉందా?
 వెంకటేష్: నా సినిమాలు ఘనవిజయం సాధించినప్పుడు కూడా నేను మామూలుగా ఉండేవాణ్ణి. ఏదీ పెద్దగా ఆనందాన్నిచ్చేది కాదు. ఒకానొక దశలో ‘ఏంటి ఇలా ఉంటున్నాం. అన్నిటికీ సమానంగా స్పందిస్తున్నాం. అసలు మనం ఏంటి? మనం ఎవరు?’ అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఆ ప్రశ్నలు ఆధ్యాత్మిక బాటలో మళ్లేలా చేశాయి. ‘ప్రేమించుకుందాం రా’ సమయంలో ఈ మార్పు మొదలైంది. ఆ ఆధ్యాత్మిక ప్రయాణం అలా నిరాటంకంగా సాగుతోంది.
 
 జనరల్‌గా ఫిఫ్టీ ప్లస్‌లో ఆధ్యాత్మిక బాటలోకి వెళుతుంటారని అంటుంటారు. కానీ, మీరు చిన్న వయసులోనే ఇటువైపు ఎట్రాక్ట్ అయ్యారు...
 వెంకటేష్: ఆధ్యాత్మికతకు వయసుతో సంబంధం లేదు. మనం అన్ని విషయాల మీద అవగాహన పెంచుకున్న తర్వాత, ‘మనం అనుకున్నదే కరెక్ట్’ అనే భావనలో పడిపోతాం. అప్పుడు ఏ బాటలోనూ అంత సులువుగా వెళ్లలేం. చిన్నపిల్లలను ఓ ఉదాహరణగా తీసుకుందాం. వాళ్లు ఏదైనా త్వరగా నేర్చేసుకుంటారు. ఎందుకంటే, వాళ్లకి ‘నేను’ అనేది తెలియదు. వాళ్ల గురించి వాళ్లు ఒక ఇమేజ్‌లో పడిపోరు. అందుకే ‘నేను’ అనే భావన పెరిగేలోపే ఈ బాటలో వెళ్లాలి. ఎందుకంటే, ఆ తర్వాత వెళ్లలేం. అంతే తప్ప, అన్నీ అనుభవించేసిన తర్వాత చూద్దాంలే అనుకుంటే కరెక్ట్ కాదు.
 
 ‘ఆధ్యాత్మికం’ అంటారు కానీ, ఆడంబరాలు మాత్రం వదులుకోలేదని మీపై ఓ విమర్శ ఉంది. ఎందుకంటే, మణికొండ ఏరియాలో వైభవంగా ఇల్లు కట్టించుకున్నారు కదా?
 వెంకటేష్: ఆధ్యాత్మికం అంటే నిరాడంబరంగా ఉండాల్సిన అవసరం లేదు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు రాజ్యాలే ఏలారు. వైభవాలను అనుభవించారు. అదే విధంగా అంతర్గతంగా తామేంటో తెలుసుకున్నారు. శాశ్వతం, అశాశ్వతాలకు వ్యత్యాసాన్ని తెలుసుకున్నారు. దీన్నే ‘రాయల్ మిడిల్ పాత్’ అంటాం. ఆధ్యాత్మికం అంటే.. అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోవడం కాదు. నేనిక్కడ పుట్టాను కాబట్టి.. ఇక్కడ ఉండాల్సిందే. ఒకవేళ నేను అడవిలో ఎవరికో పుట్టి ఉంటే.. ఆ పరిస్థితులకు తగ్గట్టు ఉండి ఉండేవాణ్ణి. ఏది దొరికిందో అది యాక్సెప్ట్ చేస్తూ.. అది చేసుకుంటూ వెళ్లడమే. ఆధ్యాత్మిక బాటలో వెళ్లేవాళ్లు సంపాదించకూడదు, వాళ్లకి కుటుంబం ఉండకూడదు అనుకుంటే తప్పు.. ఇవేవీ లేకుండా ఉండాల్సిన అవసరంలేదు. నేనేం సన్యాసిని కాదు కదా.
 
 మీరిలా ‘నిజం తెలుసుకోవాలి.. నేనెవర్నో తెలుసుకోవాలి’లాంటివి మాట్లాడినప్పుడు మీ ఇంట్లోవాళ్లు భయపడలేదా?

 వెంకటేష్: మొదట్లో భయపడ్డారనుకుంటా! అయితే, ఆ తర్వాత వాళ్లు నా లైఫ్‌స్టయిల్‌ని గమనించారు. హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నానని, చక్కగా సంపాదించుకుంటున్నానని, కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నానని... అర్థం చేసుకున్నాక రిలాక్స్ అయ్యారు.
 
 మీ నలుగురు పిల్లల దగ్గర ఆధ్యాత్మికత గురించి మాట్లాడుతుంటారా?
 వెంకటేష్: కొన్ని బోధిస్తాను. గైడ్ చేస్తాను. కానీ, నా అభిప్రాయాలను వాళ్ల మీద రుద్దను. ఇది ‘మెటీరియలిస్టిక్ వరల్డ్’ కాబట్టి.. ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదు?లాంటివి చెబుతుంటాను. అలాగే వాళ్ల అనుభవాల ద్వారా కూడా జీవితం మీద అవగాహన కలిగించుకోవాలనుకుంటాను. చెప్పాల్సిన విషయాలు సరైన టైమ్‌లో చెప్పకపోతే ‘అయ్యయ్యో.. అప్పుడు చెప్పి ఉంటే బాగుండేది కదా’ అనుకోవాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడు చెప్పాల్సినది అప్పుడు చెప్పెయ్యాలి.
 
 చిన్నప్పుడు మీరు యాక్ట్ చేశారు కదా.. మరి.. మీ అబ్బాయి (అర్జున్ రామ్‌నాథ్)ని చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎందుకు చేయించలేదు?

 వెంకటేష్: టైమ్ రావాలి. వాడూ ఏదో ఒకటి చేస్తాడు. చూద్దాం.. ఏం చేస్తాడో? ఇప్పుడు వాడికి పదేళ్లు. నేను నిర్మాత కొడుకుని. వాడు స్టార్ కొడుకు. వాడి ఆలోచనలు ఎలా ఉంటాయో చూడాలి. భవిష్యత్తులో తనేం అవుతాడో తనే డిసైడ్ చేసుకుంటాడు.
 
 మీ పిల్లలు సింపుల్‌గానే ఉంటారా... స్టార్ కిడ్స్ స్టేటస్‌కి తగ్గట్టుగా ఉంటారా?
 వెంకటేష్: వాళ్లు చాలా ‘సింపుల్ చిల్డ్రన్’. నా పిల్లలే కాదు.. ఎవరైనా సరే సింపుల్‌గానే ఉండాలంటాను. నా పిల్లలు ‘వండర్‌ఫుల్’. వాళ్ల వల్ల నాకు, నా భార్యకూ ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.
 
 మీ పిల్లలను ఎప్పుడూ చూడలేదు కాబట్టి.. వాళ్లల్లో మీ మేనరిజమ్స్ గురించి చెప్పలేం. కానీ, నాగచైతన్య నడక, కొన్ని మేనరిజమ్స్ మీలానే ఉంటాయి. ఓ మేనమామగా మీ ఫీలింగ్?

 వెంకటేష్: వండర్‌ఫుల్ ఫీలింగ్. నాగచైతన్య ‘నైస్ బోయ్’. నా సిస్టర్ (నాగచైతన్య తల్లి లక్ష్మి)కి నేను చాలా క్లోజ్. అలానే చైతన్య! ‘ఐయామ్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్’. ఆ మాటకొస్తే.. ‘ఐయామ్ ఓపెన్ టు ఎవ్రిబడీ’.
 
 సినిమాలు కాకుండా మీకు నచ్చేవి?
 వెంకటేష్: చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. ఎందుకంటే, వాళ్లకి కల్లా కపటం తెలియదు. ఇగోలు, ఇండివిడ్యువాలిటీ ఉండవు. అలాంటివాళ్లతో గడపడం నాకిష్టం. పిల్లలు దైవసమానులని నా ఫీలింగ్.
 
 27ఏళ్ల కెరీర్ గ్రాఫ్ మీది. ఇన్నేళ్లు నిరాటంకంగా కొనసాగడం ఎలా ఉంది?

 వెంకటేష్: ఇదంతా బోనస్సే. ఎందుకంటే, ఏదైనా ఉద్యోగం లేదా వ్యాపారంతో.. ఎంతో కొంత డబ్బు సంపాదించుకునేవాణ్ణేమో. కానీ, దేవుడు నాకు చాలా ఇచ్చాడు. అందుకే ఎప్పుడో శాటిస్‌ఫేక్షన్ వచ్చేసింది.
 
 మీరెప్పుడూ దేనికీ బానిస అవ్వలేదా?
 వెంకటేష్: ఆధ్యాత్మికతకు బానిస అయ్యాను. ఇప్పుడు ఫర్వాలేదు కానీ.. ఒకప్పుడు ఎప్పుడు ఎక్కడికెళ్లాలనిపిస్తే.. అక్కడికి వెళ్లిపోయేవాణ్ణి. రిషికేష్, హిమాలయాస్... అప్పటికప్పుడు అనుకోవడం... వెళ్లిపోవడం. అంతే. అక్కడికి వెళితే ఏవో నిజాలు తెలుస్తాయని.. జీవిత సత్యాలు తెలుస్తాయని ఆరాటం. కానీ, ఇప్పుడు అది లేదు. కళ్లు మూసుకుని, హిమాలయాలు ముందున్నట్లుగా ఊహించుకోగలను. దేవుడు నా చుట్టుపక్కలే ఉన్నాడని ఊహించగలను. అంత పరిపక్వత వచ్చేసింది.
 
 మళ్లీ సినిమాల్లోకి వద్దాం... మీరు చేసిన సినిమాల్లో ‘సక్సెస్ రేట్’ ఎక్కువ. కానీ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలతో పోల్చితే మీకు అభిమానుల సంఖ్య తక్కువ. ఎందుకలా?
 వెంకటేష్: ఈ మాట నాతో చాలామంది అంటారు. 99వ రోజున థియేటర్లోంచి తీసేసిన నా సినిమాలు చాలా ఉన్నాయి. అభిమానులు వచ్చి అడిగితే, ‘అభిమానంతో మీరు ఇన్నాళ్లు చూశారు. నాకది చాలు’ అని చెప్పేస్తుంటాను. అంతకుమించి నేను రికార్డ్స్ గురించి ఆలోచించడం కానీ, అభిమానులను ఎంకరేజ్ చేయడం కానీ చేయలేదు. అఫ్‌కోర్స్.. ఇతర హీరోలు అలా చేశారని చెప్పడంలేదు. నేను నా గురించి చెప్పుకుంటున్నాను. ఏదీ శాశ్వతం కాదని నమ్ముతాను కాబట్టి.. రికార్డ్స్ గురించి పెద్దగా పట్టించుకోను. నాకెంతమంది అభిమానులు ఉండాలని రాసిపెట్టి ఉందో అంతమందే ఉంటారు.
 
 ఈ 16కి రామానాయుడుగారు నిర్మాతగా 50ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు.. మీరేం బహుమతి ఇవ్వాలనుకుంటున్నారు?

 వెంకటేష్: బహుమతులు ఇచ్చి, పుచ్చుకోవడం మాకు అలవాటు లేదు. ‘ఈరోజు ప్రత్యేకం’ అని నేనెప్పుడూ అనుకోను. అన్ని రోజులూ అలానే ఉంటే ఏం? అనుకుంటాను. కాకపోతే, ఒక్కోసారి సెలబ్రేషన్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. వాటిని కాదనను.
 
 ఓ పది, పదిహేనేళ్ల తర్వాత రిటైర్‌మెంట్ గురించి ఆలోచిస్తారా?
 వెంకటేష్: ఆలోచిస్తాను. కానీ, ఏదీ మన చేతుల్లో ఉండదని కూడా తెలుసు. అప్పట్లో ఒకసారి శోభన్‌బాబుగారి దగ్గర ‘నాకు రిటైర్ అవ్వాలనే ఆలోచన వస్తోంది’ అన్నాను. కానీ, ఇప్పుడే కాదు... దానికి ఇంకా చాలా టైముంది అన్నారాయన. ఆ తర్వాత ఎప్పుడూ దాని గురించి ఆలోచించలేదు. ఎందుకంటే, మనం అనుకున్నదేదీ జరగదని నాకు తెలుసు.
 
 భవిష్యత్తు గురించి ఊహలు, కలలు వేస్ట్ అంటారా?
 వెంకటేష్: వేస్ట్ అనే అంటాను. రేపు గురించి ఆలోచిస్తూ కూర్చుంటే, ఇవాళ సగం ఎనర్జీని వేస్ట్ చేసుకున్నట్లే. భవిష్యత్తులో ఏం జరగాలని ఉంటే అది జరుగుతుంది. కానీ అనవసరంగా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించి, ఈరోజు సగం ఎనర్జీని వేస్ట్ చేసేసుకుంటాం. అసలు, మనిషికి మనశ్శాంతి తగ్గేది ఎక్కువగా భవిష్యత్తు గురించి ఆలోచించడంవల్లే. అందుకే, ఈరోజుని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి.
 
 ఫైనల్‌గా... ఓ వ్యక్తిగా మీ జర్నీ గురించి ఏం చెబుతారు?
 వెంకటేష్: వండర్‌ఫుల్ జర్నీ. నా జీవితం గురించి నాకెలాంటి కంప్లయింట్స్ లేవు. ఇటు సినిమా పరిశ్రమ, అటు ప్రేక్షకుల ద్వారా నాకెలాంటి చేదు జ్ఞాపకాలు లేవు. కెరీర్ చాలా స్మూత్‌గా వెళ్లడం చాలా ఆనందంగా ఉంది. సో.. నాకంతా బోనస్‌లా ఉంది!
 

- డి.జి. భవాని
 
 అప్పట్లో నా చెయ్యి మెడ దగ్గరకు వెళితే... యూనిట్ అంతా పరార్!
 సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో నాకు కొంచెం కోపం ఎక్కువగా ఉండేది. అయితే అది అప్పటి పరిస్థితి వల్ల. అప్పట్లో నా మెడకు దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తాలూకు ప్రభావం నా మీద చాలా ఉండేది. ఆ ఇరిటేషన్‌లో కోపంగా ఉండేవాణ్ణి. (నవ్వుతూ) అప్పట్లో నా చెయ్యి మెడ దగ్గరకు వెళితే.. యూనిట్ అంతా పరార్. అందులోనూ ఆ రోజుల్లో నాకు తెలుగు సరిగ్గా వచ్చేది కాదు.. నచ్చని సీన్స్ ఒకవైపు, నొప్పి ఒకవైపు, దాంతో సరిగ్గా పెర్‌ఫార్మ్ చేయలేకపోయేవాణ్ణి.  అయితే ఆ కోపం అంతా నా ఆరోగ్య పరిస్థితి వల్లే. అందుకే, అంటాను.. ఎవరికైనా కోపం వస్తే.. ఆ వ్యక్తికి ఎందుకు కోపం వచ్చింది? అతను ఏ పరిస్థితిలో ఉన్నాడో అని ఆలోచించాలి. అంతేకానీ, తొందరపడి ఆ వ్యక్తి గురించి ఓ నిర్ణయానికి వచ్చేయకూడదు.
 
                           *************
 
 కష్టాల్లో ఉన్నప్పుడే దేవుడు గుర్తొస్తాడు చాలామందికి. కానీ, ఎప్పుడూ ఆ దేవుడి గురించి ఆలోచిస్తే.. ఆపదలో ఉన్నప్పుడు వస్తాడు. కష్టాలొచ్చాయి కదా అని గుడికెళితే, ఎందుకు రెస్పాండ్ అవుతాడు? అందుకే, ఆ దేవుడు మనపక్కనే ఉన్నాడని ఎప్పుడూ అనుకోవాలి. ఎక్కడో లేడు.. మనలోనే ఉన్నాడనుకునేంత పరిపక్వత వస్తే.. ఇన్నర్‌గా చాలా బలంగా ఉంటాం.
 
 ఒక బుక్‌షాప్‌కి వెళ్లారనుకోండి.. త్వరగా డబ్బు సంపాదించడం ఎలా?, సక్సెస్ అవ్వడం ఎలా? అనే పుస్తకాలను కొంటుంటారు. వాటితో పాటు ఆధ్యాత్మికతకకు సంబంధించిన బుక్స్ కూడా కొనుక్కోవచ్చు కదా. కొంచెం జ్ఞానం సంపాదించుకుంటే ఏం పోతుంది? ఆధ్యాత్మిక సైడ్ వెళ్లిపోతే బద్ధకించేస్తాం. పనీ పాటా చెయ్యం అని కొంతమంది ఊహిస్తారు. అది తప్పు. ఈ బాటలో వెళ్లడంవల్ల ఇంకా షార్ప్ అవుతాం. నన్ను తీసుకోండి.. హాయిగా సినిమాలు చేసుకుంటున్నాగా.. బాగానే సంపాదిస్తున్నాగా.
 
 మనం అవతలివాడి గురించే ఎక్కువ ఆలోచిస్తాం. వాడికి సలహా ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఈ ప్రపంచంలో వచ్చే సమస్యలన్నీ ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించడంవల్లే అని నా అభిప్రాయం.
 
 మొదట్లో ఏడుపు సీన్స్‌లో చేసేటప్పుడు... చిన్నప్పుడు చనిపోయిన నా ఫ్రెండ్‌ని తల్చుకునేవాణ్ణి. అప్పుడప్పుడు ఎస్వీ రంగారావుగారు, కైకాల సత్యనారాయణగారు, కమల్‌హాసన్‌గారిలాంటివాళ్లు చేసిన ఎమోషనల్ సీన్స్‌ని గుర్తు చేసుకుంటుంటాను.


                                   **************
 
 ‘చంటి’ చేసేటప్పుడు చాలామంది నవ్వారు. ‘పాపం మీవాడు రిస్క్ తీసుకుంటున్నాడు’ అని నాన్నగారితో అన్నారు. అందరూ ఇలా అంటున్నారేంటి? అని నేను కూడా కొంచెం సందేహపడ్డాను. అద్దం ముందు నిలబడి, సైడ్ పాపిడి తీసి, మొహానికి చిన్న బొట్టు పెట్టుకుని, అమాయకంగా మొహం పెట్టి, చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్ ట్రై చేసేవాణ్ణి. ‘బాగానే ఉంది కదా’ అనిపించి, ఆ సినిమా చేయడానికే నిర్ణయించుకున్నాను. ఓ నమ్మకంతో ‘చంటి’ చేశాను. ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు.
 
 కొత్త తరంవారికి నా బొబ్బిలి రాజా, ప్రేమించుకుందారా, రాజా సినిమాలు తెలియదు.  ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటివే తెలుసు. పదేళ్లలోపు పిల్లలు కూడా నన్ను ‘పెద్దోడు’ అంటున్నారు. సో.. న్యూ జనరేషన్‌కి రీచ్ అవుతున్నానని ఆనందంగా ఉంది.
 అసలు తను మనలోనే ఉన్నాడని చాలామంది అర్థం చేసుకోవడంలేదు. దేవుణ్ణి మనం బయటపెట్టుకుంటే తను అక్కడే ఉండిపోతాడు. లోపలికి తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. మానవులు ఎప్పుడూ ఏదో కోరుతుంటారని దేవుడు పైకి వెళ్లిపోయాడు. అక్కడున్నా మానవులు వదల్లేదు. ఆ తర్వాత నీళ్ల లోపలకి కూడా వెళ్లిపోయాడు. అక్కడా వదిలిపెట్టలేదు. ఇక లాభం లేదని, ఇంతకంటే సేఫ్ ప్లేస్ లేదని మనలోనే ఉండిపోయాడు. అది తెలుసుకోలేక మనం బయట వెతుకుతున్నాం. అదే మనలోనే ఉన్నాడని గ్రహిస్తే... దేవుడు మనవాడే అనే ఫీలింగ్ కలుగుతుంది. మనం ‘గాడ్ ఫియరింగ్ నుంచి గాడ్ లవింగ్ అవ్వాలి’. అప్పుడు ఇక, మనకేం భయం లేదనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement