ఆడవాళ్లకు సినిమా పరిశ్రమలోనే కాదు,
దేవాలయాల్లాంటి ప్రదేశాలలో కూడా
చేదు అనుభవాలు ఎదురౌతున్నాయి.
- కోట్ బై కోవై సరళ
‘ప్రేమించడం హత్య చేసినంత మహా పాపం’.
- కోట్ బై కోవై సరళ
జీవితంలో ఎవరూ ఎవరి మీదా ఆధారపడకూడదు.
- కోట్ బై కోవై సరళ
సినిమాలే నా లైఫు, పర్సనల్ లైఫూ.
- కోట్ బై కోవై సరళ
కోట్ బై అని అంతా చెప్పుకునే స్థాయిలో
చాలా పెద్ద జీవితాన్ని చూశారు కోవై సరళ!
సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లోనే...
జీవితం ఆమెను రెండు వైపుల నుంచి నొక్కేసింది!
ఏం చెప్పినా చిటికెలో చేసేస్తుంది - ఒకవైపు
ఆ అమ్మాయి ఉంటే మేం చెయ్యం - రెండో వైపు.
ఇవాళ పిలిచి అడ్వాన్స్ ఇచ్చేవాళ్లు - ఒకవైపు
మర్నాడు ఫోన్ చేసి ఇచ్చేయ్‌మనేవాళ్లు - రెండో వైపు.
ఇంకా... ఇలాంటివే చాలా, చాలా, చాలా.
అన్నిటినీ తట్టుకుని నిలబడ్డారు కోవై సరళ.
ఈవారం ‘తారాంతరంగం’ చదవండి.
అవడానికి కమెడియనే అయినా...
ఆమె ప్రతి అనుభవంలో మీకు హీరోయినే కనిపిస్తుంది!
ఎస్.
వడివేలును కుమ్మినట్లు...
పరిస్థితులతో తలపడి నిలబడిన ప్రతి స్త్రీ... హీరోయినే.
సరళగారూ... మీ ఇంటి పేరు కోవైనా?
కోవై సరళ: కాదు. మా తమిళంవాళ్లకి ఇంటి పేర్లుండవు. నాన్నగారి పేరు ఇంటిపేరు అవుతుంది. మా సొంత ఊరు కోయంబత్తూర్. ఆ సిటీని ‘కోవై’ అని పిలుస్తారు. ఆ ఊరినుంచి వచ్చిన అమ్మాయిని కాబట్టి, పత్రికలవాళ్లు కోవై సరళ అని రాయడం మొదలుపెట్టారు. దాంతో అది పాపులర్ అయిపోయింది.
అయితే పుట్టి పెరిగిందంతా కోయంబత్తూర్‌లోనేనా?
కోవై సరళ: అవును. నా బాల్యం, చదువూ అంతా అక్కడే. ప్లస్ టూ వరకూ చదివా. ఇంగ్లిష్, తమిళ్‌లో టైప్‌రైటింగ్ హయ్యర్ పాసయ్యాను. అప్పట్లో నేను టైప్ చేస్తుంటే.. అందరూ ఆశ్చర్యంగా చూసేవాళ్లు. అంత స్పీడ్ అన్నమాట. నాకు చిన్నప్పట్నుంచీ సినిమాలంటే ఇష్టం. ప్లస్ టు తర్వాత సినిమాల్లోకి వెళదామనుకున్నాను కానీ ఇంట్లో ఒప్పుకోలేదు.
మీ నాన్నగారు ఏం చేసేవారు?
సరళ: లారీలు, బస్సులు ఉండేవి. ఆ బిజినెస్‌లో నష్టం వచ్చిన తర్వాత ఆయన ఓ ప్రైవేట్ ఉద్యోగంలో చేరారు. మా నాన్న మిలిటరీలో కూడా చేశారు. దాంతో స్ట్రిక్ట్‌గా ఉండేవారు. చిన్న పనైనా ఓ పద్ధతి ప్రకారం చేయాలనేవారు. సినిమాలకు వెళ్లనిచ్చేవారు కాదు. స్కూల్, ఇల్లు, టైప్‌రైటింగ్ క్లాస్ తప్ప వేరే ప్రపంచం తెలియదు.
మీకు బ్రదర్స్, సిస్టర్స్ ఉన్నారా?
సరళ: నలుగురు అక్కయ్యలు, ఓ అన్నయ్య. నాన్నగారు స్ట్రిక్ట్ అయినప్పటికీ నాకేదైనా కావాలంటే మారాం చేసి, మంకు పట్టు పట్టి మరీ సాధించుకునేదాన్ని. డ్రామాల్లో అయినా యాక్ట్ చేయనివ్వాలంటూ స్ట్రైక్ చేశాను. అయినా నాన్న మనసు కరగలేదు. దాంతో ఓ రోజంతా ఉపవాసం ఉన్నాను. ఇక, లాభం లేదనుకుని అనుమతించారు. ఒక డ్రామాలో యాక్ట్ చేశా. భలే అనిపించింది. అమ్మానాన్నను బతిమాలుకుని ఎలాగోలా 20 డ్రామాల్లో యాక్ట్ చేసేశాను. డ్రామాల ద్వారా సంపాదించిన అనుభవంతో సినిమాల్లో యాక్ట్ చేయొచ్చన్నది నా అభిప్రాయం.
మరి... సినిమాల్లోకి రావడానికి ఎంత పెద్ద స్ట్రయిక్ చేశారేంటి?
సరళ: లక్కీగా అలా చేయాల్సిన అవసరంలేదు. డెరైక్టర్ భాగ్యరాజాగారి ఇల్లు మా ఇంటి పక్కనే. నేను చిన్నప్పట్నుంచీ ఆయనకు తెలుసు. ‘‘పెద్దయిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నావు?’’ అని ఆయన అడిగితే.. ‘సినిమా యాక్టర్’ అవుతా అనేదాన్ని. సినిమాల్లోకి రాకముందు భాగ్యరాజాగారు డ్రామాలు వేసేవారు. సినిమా డెరైక్టర్ అయిన తర్వాత, మా నాన్నగారికి ఆరోగ్యం బాగా లేకపోతే భాగ్యరాజాగారు చూడ్డానికి వచ్చారు. నన్ను చూసి, ‘‘ఏం చేస్తున్నావ్’’ అనడిగితే, ై‘టెప్‌రైటింగ్’ చేస్తున్నా అని చెప్పాను. ‘‘నేను ‘ముందానై ముడిచ్చు’ అనే సినిమా చేస్తున్నా. గోపిచెట్టిపాల్యంలో షూటింగ్ జరుగుతోంది. అక్కడికొస్తే, నీకు మంచి కేరక్టర్ ఇస్తాను’’ అన్నారాయన. చెప్పింది భాగ్యరాజాగారు.. పైగా సినిమాల మీద నా పిచ్చి బాగా ముదిరిందని గ్రహించి, పెద్దగా బతిమాలించుకోకుండానే అమ్మానాన్న పర్మిషన్ ఇచ్చారు. దాంతో హుషారుగా కోయంబత్తూర్ టు గోపిచెట్టిపాల్యం బస్సెక్కేశా.
ఫస్ట్ టైమ్ షూటింగ్ ఎలా అనిపించింది?
సరళ: అప్పటివరకు నాది చాలా చిన్నప్రపంచం. లొకేషన్లో చాలామందిని చూసి, ఆశ్చర్యం అనిపించింది. కానీ భయపడలేదు. యాక్టింగ్ అంటే ఇంట్రస్ట్ కాబట్టి, తడబడకుండా చేసేశాను. ‘ముందానై ముడిచ్చు’ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
వెంటనే బోల్డన్ని అవకాశాలు వచ్చి ఉంటాయేమో?
సరళ: ఫలానా కేరక్టర్ చేసింది ఎవరు? అంటూ కొంతమంది దర్శక, నిర్మాతలు ఆరా తీశారు. అయితే నేను ‘ముందానై ముడిచ్చు’ సినిమా చేసి, కోయంబత్తూర్‌లోనే ఉండిపోయాను. అందుకని, నన్ను కాంటాక్ట్ చేయలేకపోయారు. ఆరు నెలలు గడిచిన తర్వాత ఇలా అయితే లాభం లేదనుకుని మద్రాసు వెళ్లాలని నిర్ణయించుకున్నా.
ఊరు కాని ఊరికి పంపించడానికి ఇంట్లోవాళ్లు భయపడలేదా?
సరళ: నాతో పాటు నాన్నగారు కూడా వచ్చారు. మద్రాస్‌లోని తేనాంపేటలో ఓ చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాం. ఇక, నేను మద్రాసు వచ్చానని తెలుసుకుని, చాలామంది అప్రోచ్ అయ్యారు. ‘కళ్యాణరామన్’, ‘ఉయిరే ఉనక్కాగ’... ఇలా నేను చేసిన సినిమాలన్నీ వంద రోజులాడటం, నా కామెడీ నచ్చడంతో పాపులర్ అయ్యాను.
అసలు సినిమాల మీద మీకు ఇష్టం ఏర్పడటానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?
సరళ: నేను ఎమ్జీఆర్‌కి వీరాభిమానిని. ఇంట్లో సినిమాలు చూడనిచ్చేవాళ్లు కాదని చెప్పాను కదా. అప్పుడప్పుడు గొడవపడో, బతిమాలుకునో ఎమ్జీఆర్ సినిమాకెళ్లేదాన్ని. తెరపై ఆయన కనిపించగానే అభిమానులు విజిల్స్ వేయడం, ఆరాధనగా చూడటం భలే అనిపించేది. మనం కూడా సినిమా ఆర్టిస్ట్ అయితే అలానే చూస్తారుగా అనుకునేదాన్ని. సో.. నేను ఆర్టిస్ట్ అవాలనుకోవడానికి ఓ కారణం ఎమ్జీఆర్ అనే చెప్పాలి.
అది సరే... ఎవరైనా హీరోయిన్ అవ్వాలనుకుంటారు... మీరు కామెడీనే ఎందుకు టార్గెట్ చేశారు?
సరళ: నా టార్గెట్ హీరోయినా, కమెడియనా, కేరక్టర్ ఆర్టిస్టా? అని కాదు. స్క్రీన్ మీద నా మొహం కనిపిస్తే చాలనుకున్నాను. పబ్లిక్‌లో కనిపించినప్పుడు ‘అదిగో కోవై సరళ...’ అని నన్ను గుర్తుపడితే ఈ జన్మ సార్ధకమైనట్లు అనుకునేదాన్ని. ఒకవేళ నేను హీరోయిన్‌కి టార్గెట్ చేసి, పరిస్థితుల ప్రభావం వల్ల కామెడీతో సరిపెట్టుకోవాల్సి వస్తే... చాలా అప్‌సెట్ అయ్యుండేదాన్ని.
మీరు రంగప్రవేశం చేసే నాటికి కమెడియన్‌గా, కేరక్టర్ ఆర్టిస్ట్‌గా మనోరమ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. మరి... మీకేమైనా అభద్రతాభావం, భయం ఉండేవా?
సరళ: నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ. సీన్ ఇలా చెప్పగానే అలా చేసేదాన్ని. చెట్లెక్కమంటే ఎక్కేసేదాన్ని, పై నుంచి దూకమంటే అమాంతంగా దూకేసేదాన్ని. దాంతో కోవై సరళ ఏం చెప్పినా, చిటెకెలో చేసేస్తుందని ప్రచారం జరిగింది. అలాగే నేను చేసే కామెడీ కూడా ప్రేక్షకులకు నచ్చడంతో అవకాశాలకు కొదవ ఉండేది కాదు. అందుకే, మనం పెట్టే బేడా సర్దుకుని కోయంబత్తూర్ వెళ్లాల్సి వస్తుందేమోననే భయం ఉండేది కాదు.
మనోరమ.. ఆ తర్వాత మీరు... మీ తర్వాత పెద్దగా హాస్యనటీమణులు రాణించకపోవడానికి కారణం ఏంటి... మగవాళ్లల్లో చాలామంది కమెడియన్లు ఉన్నారు కదా?
సరళ: తమిళ పరిశ్రమకు సంబంధించినంతవరకు మగవాళ్ల డామినేషన్ ఉంటుంది. లేడీస్‌కి తక్కువ ప్రోత్సాహం ఉంటుంది. అందుకే, మా తర్వాత లేడీ కమెడియన్స్ షైన్ అవలేదు. ఒకరిద్దరు వచ్చినా, పూర్తిగా ఇన్‌వాల్వ్ అవ్వలేకపోయారు. ఒకవేళ ఇన్‌వాల్వ్ అయినా ఎంకరేజ్‌మెంట్ లభించలేదు.
నిజం చెప్పండి... ఇక్కడ మీకేమైనా చేదు అనుభవాలు ఎదురయ్యాయా?
సరళ: నన్ను పైకి రానివ్వకుండా చేయాలని కొంతమంది ట్రై చేశారు. ‘ఆ అమ్మాయి ఉంటే మేం సినిమా చెయ్యం’ అని నిర్దాక్షిణ్యంగా చెప్పేవాళ్లు. దాంతో నాకు కొన్ని అవకాశాలు పోయేవి.
అలా చేసినవాళ్లెవరు?... ఆ డామినేషన్‌ని తట్టుకోవడానికి మీరేం చేసేవారు?
సరళ: పేర్లు చెప్పను. నేను కామెడీ ఆర్టిస్ట్‌ని కాబట్టి, నా అవకాశాల విషయంలో హీరోల జోక్యం ఉండదు కదా. కొంతమంది కమెడియన్లే నాతో యాక్ట్ చేయకూడదనుకునేవాళ్లు. అయినా నా పని నేను చేసుకునేదాన్ని. ఓ పది సినిమాలు చేతిలో ఉన్నప్పుడు ఒకటీ రెండు సినిమాలు పోతే ఏమవుతుంది?
అడ్వాన్స్ తీసుకున్న తర్వాత కూడా వెనక్కి వెళ్లిన అవకాశాలు ఉన్నాయా?
సరళ: చాలా ఉన్నాయి. 30 ఏళ్ల క్రితం వెయ్యి రూపాయలంటే పెద్ద విషయం. అప్పట్లో నేనో సినిమా కమిట్ అయ్యానంటే, వెయ్యిరూపాయలు అడ్వాన్స్ ఇచ్చేవారు. అయితే కొంతమంది కమెడియన్లు నేనుంటే.. యాక్ట్ చెయ్యనని చెప్పేయడంతో ఇచ్చిన అడ్వాన్స్‌ని వెనక్కివ్వమని అడిగేవాళ్లు. ఒక సినిమాకి అవకాశం వస్తే.. సంతోషంతో నాకా రోజంతా నిద్రపట్టేది కాదు. కానీ, ఉదయమే అడ్వాన్స్ వెనక్కివ్వమని ఫోన్ రావడమో, డెరైక్ట్‌గా మనిషి రావడమో జరిగేది. అప్పుడు బాగా ఏడ్చేదాన్ని. ఆ సమయంలో మా నాన్నగారు ఇచ్చిన ధైర్యాన్ని నేనెప్పటికీ మర్చిపోలేదు. ‘మనకేది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది. నీకు టాలెంట్ ఉంది’ అంటూ ఊరడించేవారు. నాన్న ముందు కన్విన్స్ అయ్యేదాన్ని కానీ, ఒంటరిగా ఉన్నప్పుడు ఏడ్చేదాన్ని.
ఆ బాధలో బ్యాక్ టు కోయంబత్తూర్ అనే నిర్ణయం ఎప్పుడైనా తీసుకున్నారా?
సరళ: అంత పిరికిగా ఆలోచించలేదు. బాధపడుతూ ఇంట్లో కూర్చునేంత ఖాళీ ఉండేది కాదు. పైగా నేను చేసేది కామెడీ కాబట్టి.. షూటింగ్‌కి వెళ్లగానే బాధ తగ్గేది. అలాగే, ఇక్కడ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా. హాస్యనటుల కెరీర్ మహా అయితే 10, 15 ఏళ్లు ఉంటుంది. వాళ్లతో పోల్చితే నటీమణుల కెరీర్‌కి ఎక్కువ స్పాన్ ఉంటుంది. అందుకు ఉదాహరణ నా 30 ఏళ్ల కెరీరే. నా కళ్లముందే ఎంతోమంది మగ కమెడియన్లు వచ్చారు.. వెళ్లారు. కానీ, నేను మాత్రం అలానే ఉన్నాను. ఎంతమంది కమెడియన్లు వచ్చినా.. వాళ్లకి దీటుగా నిలబడగలననే విషయం నాకు చాలా త్వరగానే అర్థమైంది. దాంతో నా వెనక గోతులు తవ్వినా పట్టించుకునేదాన్ని కాదు. మహా అయితే నాలుగైదేళ్లు ఇతను ఉంటాడేమో.. కానీ మనకు లాంగెవిటీ ఉంటుందనే ఆత్మవిశ్వాసంతో ఉండేదాన్ని. అదే నిజమైంది.
హాస్యనటుల కెరీర్ పదేళ్లే అని ఎలా అంటున్నారు... కోట, బ్రహ్మానందం, బాబుమోహన్, అలీ.. ఇలా చాలామంది ఏళ్ల తరబడి ఏలుతున్నారు కదా?
సరళ: నేను చెప్పింది తమిళ పరిశ్రమ గురించి. నాకు తెలిసి తెలుగులో డెరైక్టర్, ప్రొడ్యూసర్, రైటర్స్ సెలక్ట్ చేసిన కమెడియన్లనే ఎన్నుకుంటున్నారనిపిస్తోంది. తమిళంలోలా ‘నేను కోవై సరళతో యాక్ట్ చేయను’ అని చెప్పే కమెడియన్లు ఇక్కడ లేరు. అందుకే, నాకిక్కడ అవకాశాలొస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితిలో ‘సతీలీలావతి’లో మిమ్మల్ని కమల్‌హాసన్ హీరోయిన్‌గా ఎంపిక చేసినప్పుడు ఎలా అనిపించింది?
సరళ: ఆయన సినిమాలో నేను కామెడీ కేరక్టర్స్ చేశాను.ఆ విధంగా కమల్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. నా మేనేజర్ వచ్చి ‘కమల్‌సార్ సరసన మీరు హీరోయిన్‌గా నటించాలి’ అన్నాడు. జోక్‌లేసి నవ్వించే నాకే జోక్ చెబుతున్నావా? అనడిగాను. ‘కాదు మేడమ్.. సీరియస్‌గానే చెబుతున్నా’ అనడంతో నమ్మకం కుదిరింది. ఆ సినిమా ఓ మర్చిపోలేని మంచి అనుభవం.
మీకు బాగా పేరొచ్చాక కూడా, మిమ్మల్ని తొక్కాలని ఎవరైనా ప్రయత్నించారా?
సరళ: ప్రయత్నించారు. అయితే నాకు పేరొచ్చేసింది కాబట్టి... మొహం మీద చెప్పేవాళ్లు కాదు. లేడీ కమెడియన్‌గా ఎవరు చేస్తున్నారు? అని అడిగి, ‘ఆవిడా.. అయితే మా డేట్స్ ఖాళీగా లేవు’ అని చెబుతుంటారు. ఆ విధంగా ఎవరెవరు చెబుతున్నారో నాకర్థమయ్యింది. అందుకని, నిర్మాతలను ఇబ్బందిపెట్టడం ఇష్టం లేక, ‘ముందు ఆ ఆర్టిస్ట్ దగ్గర డేట్స్ ఓకే చేయించుకోండి. ఒకవేళ ఆయన ఇస్తే.. నాకేం అభ్యంతరం లేదు’ అని చెబుతుంటాను. కానీ, ఆ నిర్మాతలు ఆ తర్వాత నాతో టచ్‌లోకి రారు. అది నేనూహించిందే కాబట్టి, నవ్వేసి ఊరుకుంటాను.
ఎందుకని మీరంటే ఆ ‘కొంతమంది ఆర్టిస్ట్’లకు పడదు?
సరళ: ఒకవేళ యాక్టింగ్‌లో డామినేట్ చేస్తాననో లేక వాళ్లకి ఈక్వల్‌గా యాక్ట్ చేస్తున్నాననే ఫీలింగ్ వల్లో... లేకపోతే ఇంకా ఏమైనా కారణాలున్నాయేమో నాకు తెలియదు.
జనరల్‌గా సినిమా నిడివి ఎక్కువైతే.. కత్తెర పడేది దాదాపు కమెడియన్ల పాత్రలకే. మీ విషయంలో అలా జరిగిన సందర్భలున్నాయా?
సరళ: లెక్కపెట్టలేనన్ని ఉన్నాయి. ఈ పాత్ర మనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని ఓ నమ్మకంతో చేసి, ఆ సినిమా విడుదల కోసం బాగా ఎదురు చూసేదాన్ని. కానీ, సినిమా నిడివి పెరిగినందున నా పాత్ర నిడివి ఆటోమేటిక్‌గా తగ్గిపోయేది. దాంతో రావాల్సినంత పేరు వచ్చేది కాదు. అప్పుడు చాలా నిరుత్సాహపడేదాన్ని. కొన్ని ఎదురు దెబ్బలు మనకు మంచి పాఠాలవుతాయి. ఆ పాఠాలు మన దిశను నిర్దేశిస్తాయి. ఆ విధంగా సినిమాల్లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే నేను ఎంచుకున్న దిశ ‘ఆధ్యాత్మికం’.
ఏ వయసులో ఈ దారిని ఎంచుకున్నారు?
సరళ: అది కరెక్ట్‌గా చెప్పలేను. చిన్నప్పట్నుంచే నా ఆలోచనలు ఆధ్యాత్మికంగా ఉండేవి. అయితే ఆ వయసులో దాని పేరు ఆధ్యాత్మికం అని తెలిసే అవకాశం లేదు కదా. పెద్దయిన తర్వాత వివేకానంద, ఓషో పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. ఆధ్యాత్మికతకు సంబంధించిన క్లాస్‌లకు వెళ్లేదాన్ని. ‘జీవితం నిరంతరం కాదు. ఎప్పటికైనా మట్టిలో కలవాల్సిందే. ఈ రోజు ఉన్నాం. రేపు ఉంటామో లేదో తెలియదు. అందుకని ఈరోజు నవ్వుతూ, హాయిగా ఉందాం. చుట్టుపక్కలవాళ్లని సంతోషపెడదాం’ అనేంత మానసిక పరిపక్వత నాలో రావడానికి కారణం ఆ పుస్తకాలే.
ఓషో ద్వారా ఇంకా ఎలాంటివి తెలుసుకున్నారు?
సరళ: ఉదాహరణకు చెయ్యి మీద పెద్ద దెబ్బ తగిలిందనుకుందాం. ‘రక్తం కారుతోంది’ అని మాత్రం అనుకుంటే, నొప్పి తెలియదు. బాగా నొప్పిగా ఉంది అనుకుంటే, నొప్పి తెలుస్తుంది. అసలు నొప్పే లేదనుకుంటే, నిజంగానే నొప్పి తెలియదు. నేనిది టెస్ట్ చేసి చూసుకున్నా. ఓషో బుక్స్ వల్ల దేన్నయినా తేలికగా తీసుకునే పరిపక్వత వచ్చేసింది.
తెలుగులో మీ పాత్రలకు ఎంచక్కా డబ్బింగ్ చెప్పేస్తున్నారు. అసలు తెలుగు ఎలా నేర్చుకున్నారు?
సరళ: నా డైలాగులన్నీ తమిళంలో రాసుకుని, బట్టీపట్టి లొకేషన్లో చెప్పేస్తుంటాను. తెలుగులో నేను డబ్బింగ్ చెప్పడానికి మొదటి కారణం కోడి రామకృష్ణగారు. ‘పెళ్లాం చెబితే వినాలి’ అప్పుడు ఆయన డబ్బింగ్ చెప్పమన్నారు.. ఆ సినిమాకి కో-డెరైక్టర్‌గా చేసిన రాధాకృష్ణ దగ్గరుండి మరీ నాతో డబ్బింగ్ చెప్పించారు. నాకు బాగానే పేరొచ్చింది.. కానీ నాతో డబ్బింగ్ చెప్పించి, ఆయనకు చుక్కలు కనిపించాయి (నవ్వుతూ). తెలుగు మాట్లాడటానికి నేను ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. తమిళ్ ఎలా మాట్లాడతానో అలాగే మాట్లాడేస్తాను. ఆ శ్లాంగ్ అందరికీ నచ్చడం నా లక్.
మీ సినిమాల్లో కమెడియన్స్‌ని ఫుట్‌బాల్ ఆడేస్తుంటారు. అసలు ఈ కొట్టడం అనేది ఎవరితో మొదలైంది?
సరళ: వడివేలుతో మొదలుపెట్టా. అది బాగా పండటంతో అప్పట్నుంచి నాతో కొట్టించడం ఆనవాయితీ అయ్యింది.
ఈ కొట్టే ప్రక్రియ ఓవర్‌గా ఉంటుందనే విమర్శ ఉంది...?
సరళ: ఏ కొద్దిమందో అంటున్నారేమో. కానీ, మొగుడూ పెళ్లాలూ కొట్టుకోవడం నేను రోడ్డు మీద చాలా చూశాను. మందు కొడితే చాలు.. మృగంలా మారిపోయి, భార్యలను రోడ్డు మీద కొట్టే మగవాళ్లను స్వయంగా చూశాను. అది తట్టుకోలేక తిరగబడ్డ ఆడవాళ్లనూ చూశాను. నేను కొట్టడం ఓవర్ అని మీరంటున్నారు. కానీ, చాలామంది ఆడవాళ్లు.. ‘‘మేడమ్... మీరే మాకు ఇన్‌స్పిరేషన్. మా మగవాళ్లు అడ్డదిడ్డంగా బిహేవ్ చేసినప్పుడు ‘కోవై సరళలా మారతాం... జాగ్రత్త అని బ్లాక్‌మెయిల్ చేస్తుంటాం’’ అంటుంటారు. మగవాళ్లకు నా మీద కోపం ఉంటుందేమో. కానీ, ఆడవాళ్లు తమను తాము రక్షించుకోవడం కోసం నా పేరు వాడుకోవడం నాకు బాగానే అనిపిస్తోంది.
కొంచెం ఫ్రాంక్‌గా మాట్లాడుకుంటే... సినిమా పరిశ్రమలో ఆడవాళ్లు చాలా విషయాల్లో రాజీపడాలంటారు. హీరోయిన్ నుంచి కామెడీ ఆర్టిస్ట్‌ల వరకూ ఇది వర్తిస్తుందా?
సరళ: హీరోయిన్ల నుంచీ కామెడీ ఆర్టిస్ట్‌ల వరకు కాదు.. జూనియర్ ఆర్టిస్టులకూ ఇది వర్తిస్తుంది. అయితే ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది. మన దగ్గర బిర్యానీ తినడానికి డబ్బులు లేకపోతే పచ్చడి మెతుకులతో సరిపెట్టుకోవాలనుకుంటే.. ఏ విషయంలోనూ రాజీపడాల్సిన అవసరంరాదు. కానీ, బిర్యానీయే తినాలనుకుంటే మాత్రం రాజీ పడాలి.
రాజీపడకపోతే.. అవకాశాలు రావంటారు?
సరళ: ఒకట్రెండు సినిమాలు పోతాయేమో. దానికే కంగారుపడిపోతే రాజీపడాలనే ధోరణి మొదలవుతుంది. కానీ, మనకు రావాలని రాసి పెట్టి ఉంటే, వచ్చే అవకాశాలను ఎవరూ ఆపలేరు. నాకు చాలా సినిమాలు మిస్ అయ్యాయి. అయినా డోంట్ కేర్ అన్నట్లుగానే వ్యవహరించాను. ఆడవాళ్లకు సినిమా పరిశ్రమలోనే కాదు.. దేవాలయాల్లాంటి స్కూల్స్, కాలేజ్‌లు, హాస్పిటల్స్‌లో కూడా చేదు అనుభవాలు ఎదురవుతాయి. వాటి నుంచి తప్పించుకునే నేర్పు ఉంటే, సేఫ్‌గా వెళ్లిపోవచ్చు.
ఇక... మీ తోడబుట్టినవాళ్లతో మీ అనుబంధం గురించి?
సరళ: నా అక్కయ్యల పిల్లలు నా దగ్గరే పెరిగారు. అందర్నీ చదివించాను. ఒకబ్బాయి దుబాయ్‌లో, ఇద్దరు యూఎస్‌లో, ఒకరు లండన్‌లో... ఇలా అందరూ మంచి జాబ్స్‌లో సెటిలయ్యారు.
మీ నలుగురు అక్కలు చక్కగా పెళ్లి చేసుకుని, సెటిలయ్యారు.. మీకెప్పుడూ పెళ్లి చేసుకోవాలనిపించలేదా?
సరళ: పెళ్లి గురించి ఆలోచించలేనంత బిజీగా ఉండేదాన్ని. సినిమాలు తప్ప నా పర్సనల్ లైఫ్ ఇలా ఉండాలని ఎప్పుడూ ప్లాన్ చేసుకోలేదు. పైగా సమాజంలో ఎన్నో విడాకుల కేసులు చూశాను. ఇక పెళ్లెందుకు అనిపించేసింది.
అమ్మానాన్న పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయలేదా?
సరళ: పెళ్లి చేసుకో అన్నారు. ఇష్టం లేదంటే, వదిలేశారు. మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్ అని చెప్పాను కదా. స్కూల్‌కి వెళ్లేటప్పుడు వంచిన తల ఎత్తకూడదు. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. ఇలా ఓ స్ట్రిక్ట్ వాతావరణంలో పెరిగినందువల్లో ఏమో నాకు ప్రేమ మీద కూడా దృష్టి మళ్లలేదు. ఒకవేళ అప్పట్లో ఎవరితోనైనా ప్రేమలో పడి ఉంటే, పెళ్లి చేసుకుని ఉండేదాన్నేమో. కానీ, నేను లవ్‌కి ఆపోజిట్. ప్రేమించడం అనేది హత్య చేసినంత మహా పాపం అని నా మనసులో బలంగా ముద్రించుకుపోయింది.
మరి.. మీకు ఎవరూ ‘ఐ లవ్ యు’ చెప్పలేదా?
సరళ: నన్ను చూసి ఎవరైనా ‘ఐ లవ్ యు’ చెబుతారా? నేను చేసిన కేరెక్టర్ల ప్రభావం నా జీవితం మీద కూడా పడి ఉంటుందేమో. సినిమాల్లో సహ నటులను ఓ రేంజ్‌లో కొట్టే నేను నిజజీవితంలో కూడా అలానే ఉంటాననుకుని ఉండొచ్చు. అందుకని, ఎవరూ నాకు ప్రపోజ్ చేయలేదు.
వయసులో ఉన్నంతవరకూ ఓకే. కానీ, వయసు మీద పడిన తర్వాత ఓ తోడు ఉండాలంటారు కదా?
సరళ: పుట్టినప్పుడు మనం ఒంటరిగానే పుడతాం. ఇది మీ అమ్మ.. ఇది నాన్న... వీళ్లు నీ అక్క, చెల్లెళ్లు అని ఎవరో ఒకరు చెబితేనే మనకు తెలుస్తుంది. దాంతో ‘మనవాళ్లు’ అనే భావన మొదలవుతుంది. పెరిగే కొద్దీ అనుబంధం బలపడుతుంది. కానీ, పెళ్లి చేసుకున్న తర్వాత ‘నా కుటుంబం’ అనే భావన మొదలవుతుంది. అప్పుడు తోబుట్టువుల మీద కొంత ప్రేమ తగ్గుతుంది. అలా మెల్లి మెల్లిగా దూరం పెరిగిపోతుంది. ఒకవేళ పెళ్లి చేసుకున్నామే అనుకోండి. భర్త చనిపోతే ఒంటరిగా బతకాల్సిందేగా. అందుకే నేను పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయా. నా దృష్టిలో జీవితంలో ఎవరూ ఎవరి మీదా ఆధారపడకూడదు.
పెళ్లి చేసుకున్న తర్వాత తోడబుట్టినవాళ్లతో అనుబంధాలు తగ్గుతాయన్నారు. మీవాళ్లు ఆ జాబితాకి చెందినవారేనా?
సరళ: ఎంతో కొంత ఆ జాబితాకే చెందుతారు. పెళ్లయిన తర్వాత వాళ్లల్లో మార్పొచ్చింది. ‘నా కుటుంబం, నా పిల్లలు, నా సమస్య’... అంటూ నన్ను వేరు చేసి మాట్లాడుతున్నారు. ‘ఓకే.. నాకు మంచి పాఠం నేర్పించారు’ అని డెరైక్ట్‌గా వాళ్లతోనే చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి.
మీవాళ్లు అలా చేయడం బాధగా లేదా?
సరళ: నేను కూడా మనిషేనండి. ఓషో, వివేకానంద పుస్తకాలు చదివినంత మాత్రాన ప్రతి విషయాన్ని తేలికగా తీసేసుకుంటానని అనుకోవద్దు. అయితే ఒకే ఒక్క విషయంలో నేను ఆనందపడ్డాను. మంచి వయసులో ఉన్నప్పుడే నాకు అందరి మనస్తత్వాలు అర్థం అయ్యాయి. అదే నేను బాగా ముసలిదాన్ని అయిన తర్వాత తెలిసిందనుకోండి.. ఆ వయసులో తట్టుకునేంత ధైర్యం నాకు ఉండేది కాదు. ఇప్పుడు నాకు బాగా స్టామినా ఉంది. మానసికంగా చాలా ధైర్యం ఉంది. అందుకే, తట్టుకున్నాను.
అసలు మీ లైఫ్‌స్టయిల్ ఎలా ఉంటుంది?
సరళ: చాలా నార్మల్‌గా. కొన్ని రోజులు ఉదయం ఐదున్నర గంటలకు వాకింగ్ వెళుతుంటాను. బద్దకం అనిపించినప్పుడు మానేస్తా. చెబితే నమ్మరు కానీ.. పదేళ్ల క్రితం రాత్రి రెండున్నర గంటలకు నిద్రలేచి, మూడుగంటలకల్లా మెరీనా బీచ్‌కి వెళ్లేదాన్ని. ఓ గంట వాక్ చేసి, నాలుగున్నరకి ఇంటికొచ్చేసేదాన్ని. ఆ తర్వాత మేకప్ చేసుకుని ఏడుకల్లా షూటింగ్‌కి వెళ్లేదాన్ని. అలా ఆరు నెలలు చేశాను. ఆ తర్వాత కొన్నాళ్లు వాకింగ్ మానేశాను. ఇంట్లోనే త్రెడ్‌మిల్ మీద వాక్ చేసేదాన్ని. అది వర్కవుట్ కాలేదు. ఈ మధ్య ఉదయం నాలుగున్నరకల్లా నిద్ర లేచి, వాకింగ్, చిన్నపాటి వ్యాయామాలు చేస్తున్నాను. ఆ తర్వాత సింపుల్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను. నాన్‌వెజ్ పెద్దగా తినను.
ఫైనల్‌గా కథానాయికల కెరీర్‌కన్నా మీ కెరీర్‌కి లాంగ్విటీ ఎక్కువ కాబట్టి.. ఎప్పుడైనా హీరోయిన్స్‌కన్నా మనమే బెస్ట్ అనిపించిందా?
సరళ: హీరోయిన్‌గా చేసి ఉంటే.. ఇప్పుడు ‘సాక్షి’కి ఈ ఇంటర్వ్యూ ఇచ్చి ఉండేదాన్ని కాదేమో. మా కోయంబత్తూర్‌లో పాత రోజులను నెమరువేసుకుంటూ కాలక్షేపం చేసేదాన్నేమో. 1983లో సినిమాల్లోకొచ్చాను. ఒకవేళ హీరోయిన్ అయ్యుంటే ఐదు, పదేళ్లకే వెనక్కి వెళ్లిపోయుండేదాన్ని. కామెడీలో ఉన్నాను కాబట్టే 30 ఏళ్లయినా స్టేల్ అవ్వలేదు. ఇప్పటికీ ‘కోవై సరళ’ కామెడీ బోర్ కొట్టలేదు. అందుకే, ‘కామెడీలో నేనే హీరోయిన్’ అనుకుంటాను. నా భర్త, నా పిల్లలు, నా హాబీ సినిమాలే. చివరి శ్వాస వరకు యాక్ట్ చేయాలన్నదే నా కోరిక.
- డి.జి. భవాని
మీరు ఎవరితోనూ ఫోన్‌లో టచ్‌లో ఉండరు... ఎందుకు?
సరళ: ఫోన్లో మాట్లాడటం నాకు అలర్జీ. ఎవరైనా గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుతుంటే, అంతసేపు ఎలా మాట్లాడుతున్నారు? అనుకుంటాను. మీకో విషయం చెప్పనా? ఆరు నెలల క్రితం వెయ్యి రూపాయలతో రీచార్జ్ చేయించు కున్నాను. ఇప్పటికీ నా ఫోన్‌లో బాలెన్స్ ఉంది. దాన్ని బట్టి ఎంత మితంగా ఫోన్ వాడతానో అర్థం చేసుకోవచ్చు.
ఫంక్షన్స్‌లో కూడా ఎక్కువ కనిపించరు?
సరళ: ఫంక్షన్స్‌కి వెళ్లడం చాలా తక్కువ. ఫంక్షన్‌కి వెళ్లాలనుకోండి... దానికోసమే ప్రత్యేకంగా తయారవ్వాలి. తయారై, ట్రాఫిక్‌ని కూడా లెక్క చేయకుండా వెళ్లిన తర్వాత అక్కడ జరిగేది ఏంటి? ‘బాగున్నారా..’.. ‘ఆ బాగున్నాను’ అంటూ పలకరింపులు. వెనక్కి తిరగ్గానే ‘ఆ ఏం బాగులే...’ అని వెక్కిరింతలు. పెదాల మీద నవ్వుని మెయిన్‌టైన్ చెయ్యాలి. ఇంటికొచ్చేసరికి ఆ నవ్వు తాలూకు బుగ్గల నొప్పిని భరించాలి. ఇవన్నీ ఎందుకు? అని ఫంక్షన్స్‌ని తగ్గించేశాను.
ఓ సినిమా సక్సెస్ అయితే హీరో, డెరైక్టర్, హీరోయిన్స్‌కి ఎక్కువ క్రెడిట్ ఇస్తారు. ఆ తర్వాతే కమెడియన్స్ గురించి మాట్లాడుకుంటారు. దీని గురించి మీరేమంటారు?
సరళ: నాకు సంబంధించినంతవరకు అది కరెక్టే అంటాను. ఎందుకంటే, హీరోలు నిజంగానే కష్టపడాలి. ఫిజిక్ మెయిన్‌టైన్ చెయ్యాలి. క్రమం తప్పకుండా వ్యాయామాలు కంపల్సరీ. ఆహార విషయాల్లో కూడా చాలా నియమాలుంటాయి. ఇక, ఫైట్స్ చేయడం అంటే చిన్న విషయం కాదు. సినిమా మొత్తం దాదాపు హీరో మీదే నడుస్తుంది కాబట్టి.. ఎక్కువ శాతం క్రెడిట్ వాళ్లకే ఇవ్వాలి. హీరోయిన్స్ కూడా సన్నగా మెరుపు తీగలా ఉండాలి కాబట్టి... నచ్చిన ఆహారం తినలేరు. డ్యూయెట్ సాంగ్స్‌లో డాన్సులు చేయడం చిన్న విషయం కాదు. అందుకని, హీరోయిన్‌కీ క్రెడిట్ ఇవ్వాలి. సినిమా మొత్తాన్ని ఏకతాటిపై నడిపించేది దర్శకుడు, అసలా సినిమా తీయడానికి కారణం ప్రొడ్యూసర్ కాబట్టి.. ముందు వాళ్ల గురించే మాట్లాడాలి. ఇక, ఆ తర్వాతి క్రెడిట్ విలన్, కమెడియన్స్, క్యారక్టర్ ఆర్టిస్ట్‌లకు దక్కుతుంది.
భర్త, పిల్లలు, హాబీలు.. అన్నీ సినిమానే..!
Published Sun, Oct 27 2013 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 12:00 AM
Advertisement