నా ప్రేమకథే ఓ సినిమా! | Exclusive interview with Sukumar | Sakshi
Sakshi News home page

నా ప్రేమకథే ఓ సినిమా!

Published Sun, Nov 17 2013 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 12:40 AM

Exclusive interview with Sukumar

సుకుమార్‌ని తిట్టుకోడానికి...
 ఆయన సినిమాలను ఇష్టపడే ప్రతి ప్రేక్షకుడికీ హక్కుంది!
 ‘కోపంగానో, ద్వేషంగానో ఫీల్ మై లవ్’ అనిపించారు కదా
 ఆర్య హీరోతో...
 అలాంటి హక్కన్నమాట ఇది!
 ఆర్య తర్వాత మూడేళ్లకు జగడం.
 జగడం తర్వాత రెండేళ్లకు ఆర్య2
 ఆర్య2 తర్వాత మూడేళ్లకు 100% లవ్.
 100% తర్వాత రెండేళ్లకు... ఇప్పుడు రాబోతున్న 1.
 ఏంటబ్బా ఇంత బద్దకం ఈ మనిషికి?!
 ఫట్‌ఫట్‌మని నాలుగు సిక్సర్లు, ధనాధన్‌మని ఆరు బౌండరీలు బాది పడేయలేడా?!
 సచిన్ నెమ్మదిగా డిఫెన్స్ ఆడుతుండడం...
 సుకుమార్ తీరిగ్గా సినిమా తీస్తూ ఉండడం...
 రెండూ ఒకటే ఫ్యాన్స్‌కి.
 ఉడుకురక్తం ఎన్నాళ్లని ఓపిక పడుతుంది?
 లవ్‌స్టోరీల స్టార్ డెరైక్టర్ సుకుమార్ ఎందుకంత పట్టిపట్టి సినిమా తీస్తారు?
 ప్రేమని ఎందుకంత తేలిగ్గా తీసి పడేయరు?
 ఆయన లవ్ స్టోరీ ఏమిటి?
 ఆయన లైఫ్ స్టైల్ ఏమిటి?
 చదవండి ఈవారం ‘తారాంతరంగం’లో.

  మీ ‘1’ సినిమాను ఎప్పుడు చూపిస్తున్నారు సార్?
 సుకుమార్: జనవరి 10న
 
 ఎలా ఉంటుంది అందులో మహేష్ కేరక్టరైజేషన్?
 సుకుమార్: తినబోతూ రుచి ఎందుకు? చూస్తారుగా.
 
 ఎందుకని మీ సినిమాల్లోని హీరో పాత్రలకు ఏదో ఒక చెడు లక్షణం ఉంటుంది?
 సుకుమార్: హీరో అనేవాడు రాముడిలా ఉండాలనుకోవడం సరికాదు. మనలో ఒకడిగా ఉండాలి. ప్రతిమనిషికీ ఉండే సాధారణమైన లక్షణాలే నా హీరోలకూ ఉంటాయి. వాటిని చెడు లక్షణాలు అనడం కంటే సాధారణ లక్షణాలు అనడం కరెక్ట్. ఒకప్పుడు హీరోహీరోయిన్లు చందమామను చూసి పాటలు పాడుకునేవారు. కనీసం ఒకరినొకరు ముట్టుకునేవారు కూడా కాదు. తర్వాత కాలంలో చేతులు కలుపుకొని పాడుకోవడం మొదలైంది. ఈ డెవలప్‌మెంట్ కౌగిలింతల దాకా వచ్చింది. ఎప్పటికప్పుడు ఈ పరిణామాన్ని కుటుంబప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. తొలి రోజుల్లో ‘మంచి సినిమా అంటే... ఇలా ఉండాలి’ అని ఓ గీత గీసుకున్న ప్రేక్షకుడు... కాలక్రమంలో తన గీతని తానే చెరుపుకుంటూ పోయాడు. ప్రస్తుతం ఐటమ్ సాంగ్‌ని కూడా ఫ్యామిలీ మొత్తం కలిసే చూస్తున్నారు. అప్పుడు చెడు అనిపించినవి, ఇప్పుడు మంచి అయ్యాయి. ఇప్పుడు చెడు అనిపించేవి, రాబోయే తరానికి మంచి అవుతాయి. ఇది కామన్. పాత్రలు కూడా అంతే.  
 
 మీ కథలు.. అందులోని పాత్రలూ... స్వానుభవాలా? లేక ఊహలనుంచి పుట్టినవా?
 సుకుమార్: ఒక సంఘటన, ఒక పుస్తకం, ఒక సినిమా ఇలా ఏదైనా ఇన్‌స్పైర్ చేయొచ్చు. అందుకే పర్టిక్యులర్‌గా ఫలానా అని చెప్పలేను.
 
 తెరపై మీ హీరోలు చిత్రంగా ప్రవర్తిస్తుంటారు కదా. కాలేజ్ టైమ్‌లో మీరెలా బిహేవ్ చేసేవారు?
 సుకుమార్: అందరికీ ఉన్నట్టే నాకూ కోరికలుండేవి. అమ్మాయిలతో మాట్లాడాలని, ఫలానా అమ్మాయిని చూడాలని, ముద్దుపెట్టుకోవాలని... ఇలా అన్నమాట. ఆ వయసులో ఎవరికైనా ఉండే కోరికలే అవి. కానీ వాటిని మనసుని దాటనిచ్చేవాణ్ణి కాదు. నాలోనే ఉంచుకునేవాణ్ణి. నేను చాలా సిగ్గరిని. చాలా కామ్‌గా ఉండేవాణ్ణి. నేనేదో నా పనేదో. ఇతర విషయాల జోలికి అస్సలు వెళ్లేవాణ్ణి కాదు.
 
 అంటే కాలేజ్ ఏజ్‌లో ప్రేమకథలు ఏం లేవా?
 సుకుమార్: ఆ గోల ఇప్పుడెందుకండీ.. అనవసరంగా ఇంట్లో సమస్యలొస్తాయి. (నవ్వుతూ)
 
 సరే మీదీ ప్రేమ వివాహమే కదా. మీ ప్రేమకథైనా చెప్పండి?
 సుకుమార్: నేను డెరైక్టర్ అయ్యాకే నా ప్రేమకథ మొదలైంది. పైగా అది అయిదారేళ్ల కథ. దాన్ని ఓ పది పదిహేను నిమిషాల్లో చెప్పడం కష్టం. ఒకవేళ చెప్పగలిగినా... ఇప్పుడు మాత్రం చెప్పను. ఎందుకంటే... నా ప్రేమ కథే ఓ సినిమా అవుతుంది. ఎప్పటికైనా తీయాలనుకుంటున్నాను.
 
 అంత విషయం ఉన్న కథా?
 సుకుమార్: ఎంతవిషయం ఉందో చూస్తే కదా తెలిసేది.(నవ్వుతూ)
 
 అంటే మీ ప్రేమకథలో హర్డిల్స్ కూడా ఉన్నాయా? మీరప్పటికే స్టార్ డెరైక్టర్ కదా?
 సుకుమార్: డెరైక్టరైనా, అసిస్టెంట్ డెరైక్టరైనా ప్రేమ ముందు అంతా ఒక్కటే. హర్డిల్స్ లేని ప్రేమ ఎక్కడా ఉండదు.
 
 సరే లెక్చరర్‌గా పనిచేస్తున్న టైమ్‌లో.. ‘సుందరకాండ’ లాంటి అనుభవాలేమైనా ఎదురయ్యాయా?
 సుకుమార్: ఆ....
 
 ఏంటి ఆలోచిస్తున్నారు?
 సుకుమార్: చెబితే మీరు నమ్ముతారో లేదో అని.
 
 ఎందుకు నమ్మం? చెప్పండి?
 సుకుమార్: నిజంగా జరగలేదు.
 
 మీకు జరక్కపోతే పోయింది... మీ స్టూడెంట్స్ ప్రేమ వ్యవహారాలైనా మీ వద్దకొచ్చేవా?
 సుకుమార్: బోల్డన్ని. ‘ఆ అమ్మాయి నన్ను ఇష్టపడటం లేదుసార్...’ అంటూ వచ్చేవారు. ‘బాగా చదివి పాసవ్వండ్రా... ఆటోమేటిగ్గా వాళ్లే ఇష్టపడతారు’ అని నచ్చజెప్పేవాణ్ణి. ‘ఈ లోపు ఇంకెవరికైనా సెట్ అయిపోతే...’ అని తెగ ఫీలైపోయేవారు(నవ్వుతూ)
 
 అంటే లెక్చరర్‌గా పనిచేస్తున్న రోజుల్లో మీకు హీరో ఇమేజ్ ఉండేదన్నమాట?
 సుకుమార్: అవును. నా స్టూడెంట్స్ అందరూ నన్ను చాలా ఇష్టపడేవారు. అందరితో క్లోజ్‌గా మూవ్ అయ్యేవాణ్ణి. పైగా ఆ కాలేజ్‌లో నేనే యంగ్ లెక్చరర్‌ని.
 
 అసలు లెక్చరర్ అవాలని ఎందుకనిపించింది మీకు?
 సుకుమార్: మాది మధ్య తరగతి కుటుంబం. రాజోలు సమీపంలోని మట్టపర్రు మా ఊరు. నాన్నది బియ్యం వ్యాపారం. నాకు ముగ్గురు అన్నయ్యలు, ఇద్దరు తోబుట్టువులు. ఇంత సంసారాన్నీ నాన్న ఒక్కరే మొయ్యాలి. స్థిరచరాస్తులు కూడా ఏమీ లేవు. అప్పట్లో ఇల్లు గడవడమే కష్టంగా ఉండేది. నాన్న కష్టపడుతుంటే చాలా బాధగా ఉండేది. మేం కాస్త చేతికంది వచ్చాక ఏదో ఒకటి చేసి నాన్నకు ఆసరాగా నిలవాలనుకున్నాం. ఈ క్రమంలోనే నేను లెక్చరర్ అయ్యాను.
 
 ఉపాధ్యాయ వృత్తికి ఎంతో శిక్షణ అవసరం. ఒకేసారి అంతమంది పిల్లల్ని ఫేస్ చేయడం అంటే సాధారణమైన విషయం కాదు. ఏ శిక్షణా లేకుండా ఎలా లెక్చరర్ అయ్యారు?
 సుకుమార్: అవసరాన్ని మించిన గురువు ప్రపంచంలో వేరొకటి లేదండీ. ‘ట్యూషన్ చెప్పబడును’ అని ఇంటిముందు ఓ బోర్డ్ పెట్టా. ముందు ఓ కుర్రాడు వచ్చాడు. ‘మేం ముగ్గురం వస్తాం. బాగా చెబితే.. ఇక్కడే చదుకుంటాం. లేకపోతే వేరే ట్యూషన్ చూసుకుంటాం’ అన్నాడు. సరే... అని మొదలుపెట్టా. పదిరోజులు తిరిగే సరికి ముగ్గురు కాస్తా ముప్ఫై మంది అయ్యారు. తర్వాత ఆ సంఖ్య మూడొందలకి చేరుకుంది. మా ఇంటిముందు సైకిళ్లు బారులు తీరి ఉండేవి. అన్ని సైకిళ్లు మా ఇంటి ముందు ఉండటం చూసి, మా కాలేజ్ లెక్చరర్, నా గురువు అయిన రామ్మోహనరెడ్డిగారు.. ‘ఏంటి?’ అని వాకబు చేశారట. ఒక ట్యూటర్‌గా అక్కడ నాకెంత మంచి పేరుందో అప్పుడే ఆయనకు తెలిసింది. నేరుగా నన్ను కలిసి, నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు... అని కాకినాడ ఆదిత్య కాలేజ్‌లోనే లెక్చరర్‌గా ఉద్యోగం ఇప్పించారు. అలా తొమ్మిదేళ్లపాటు లెక్చరర్‌గా నా కెరీర్ సాగింది. ప్రస్తుతం నా స్టూడెంట్లు విదేశాల్లో పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో సీఈఓలుగా ఉన్నారు. ఇప్పటికీ వాళ్లు నన్ను అభిమానిస్త్తూనే ఉన్నారు. నా దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న వారిలో ఇద్దరు నా స్టూడెంట్లే.
 
 ఏ క్లాసులు చెప్పేవారు?
 సుకుమార్: మొదట్లో ఇంటర్మీడియట్ క్లాసులు చెప్పేవాణ్ణి. తర్వాత డిగ్రీకి ప్రమోట్ అయ్యాను.
 
 ఆ వయసు పిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం కదా. ఎలా టాకిల్ చేసేవారు?
 సుకుమార్: నిజమే... చురుగ్గా ఉండేవారు. అందుకే... ముందు నేనే వాళ్లలో ఒకడిగా మారిపోయేవాణ్ణి. తర్వాత నిదానంగా వాళ్లను పాఠంలోకి దించేవాణ్ణి. ‘సుకుమార్ సార్ లెసన్ చెప్పే విధానం చాలా బాగుంటుంది’ అనేవారు.
 
 మీ సబ్జెక్ట్ ఏంటి?
 సుకుమార్: మ్యాథ్స్
 
 లెక్కలు అంటే ఇష్టమా?
 సుకుమార్: కాదు భయం. చిన్నప్పుడు ప్రతిసారీ లెక్కల్లో తప్పులు చేసేవాణ్ణి. మళ్లీ దిద్దుకోవడానికి ఎంతో కష్టపడేవాణ్ణి. అందుకే... లెక్కలు చెబుతున్నప్పుడు... ఎక్కడ అవి టఫ్‌గా అనిపిస్తాయో నాకు బాగా తెలుసు. లెక్చరర్ అయ్యాక... సరిగ్గా ఆ టైమ్‌లోనే పిల్లల దగ్గర జాగ్రత్త పడేవాణ్ణి. నిజంగా పాఠం చెబుతున్నప్పుడు కలిగే సంతృప్తే వేరు.. మనం చెబుతున్న పాఠాలు పిల్లలకు బాగా అర్థం అవుతున్నాయి అనిపిస్తే... ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలుగుతుంది.
  మరి అంత ఆనందాన్ని వదిలిపెట్టి సినిమాల్లోకి వచ్చారే?
 సుకుమార్: పేరుప్రఖ్యాతుల కోసం. చిన్నప్పుడు సైంటిస్ట్ అవుదామనుకునేవాణ్ణి. ఐన్‌స్టీన్ లాంటి వాళ్ల పక్కన నా స్టిల్ కూడా ఉంటే ఎంత బావుణ్ణు అని కలలు కనేవాణ్ణి. సమాజానికి ఉపయోగపడే వస్తువు ఏదైనా కనిపెడితే... అది శాశ్వతంగా నిలిచి, మనల్ని కూడా జనహృదయాల్లో శాశ్వతంగా నిలుపుతుంది కదా అని ఆశించేవాణ్ణి. కానీ నేనంత మేధావిని కాను, నా బుర్రలో అంత గుజ్జులేదు అని నాకు ముందే తెలిసిపోయింది. సో... మనం సైంటిస్ట్ కాలేం. మరి ప్రత్యామ్నాయ మార్గం ఏంటి? అని ఆలోచిస్తే...నాకు కనిపించింది సినిమా. చిన్నప్పట్నుంచీ సినిమా అంటే తెలీని మమకారం. మా రాజోలులో ఉన్న రెండు థియేటర్లు మూసేయడంతో తాటిపర్రు వెళ్లి సినిమాలు చూసేవాణ్ణి. రిలీజ్ రోజే సినిమాలు చూసేంత ఆరాటం ఉండేది కాదు కానీ... సినిమాలు మాత్రం బాగానే చూసేవాణ్ణి. అప్పట్లో ఊరి వీధుల్లో తెరలు కట్టి సినిమాలు వేసేవారు. అలా ‘బంట్రోతు భార్య’ సినిమా ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు. పవిత్రబంధం, విచిత్రకుటుంబం లాంటి సినిమాలు అక్కడే చూశా. లెక్చరర్‌గా బిజీగా ఉన్న రోజుల్లో కూడా సెకండ్‌షోలకు వెళ్లే వాణ్ణి. గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాలంటే... అంతకు మించిన మార్గం నాకు కనిపించలేదు. అందుకే చేసే ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టేసి వి.వి.వినాయక్‌గారి వద్ద దర్శకత్వ శాఖలో చేరిపోయాను. తేలిగ్గా డబ్బునూ, పేరు ప్రఖ్యాతుల్నీ సంపాదించుకోవాలంటే సినిమాను మించిన సాధనం ఇంకోటి లేదని నా అభిప్రాయం.
 
 విద్యాబోధనలో ఉన్న తృప్తి అపారం అని ఇంతకు ముందే అన్నారు. మరి ఆ వృత్తిని వదిలిపెడుతుంటే బాధ అనిపించలేదా?
 సుకుమార్: జీవితంలో ఒకటి సాధించాలంటే ఒకటి వదులుకోవాల్సిందే. ఆ వృత్తినే నమ్ముకొని ఉన్నట్లయితే... నాకు ఈ స్థాయి వచ్చేది కాదు కదా. మరో విషయం ఏంటంటే... టీచింగ్‌లో ఉన్న సంతృప్తి సినిమాల్లోకొచ్చాకే నాకు తెలిసింది. ఆ వృత్తిలో ఉన్నప్పుడు తెలీలేదు. విలువ అనేది దగ్గర ఉన్నప్పుడు తెలీదు. దూరమైతేనే తెలిసేది.
 
 విద్యారంగం నుంచి వచ్చారు కదా. భవిష్యత్తులో ఏదైనా విద్యాసంస్థను నెలకొల్పాలని ఉందా?
 సుకుమార్: లేదు... ఇక సినిమానే నా లోకం. ఏం చేయాలన్నా సినిమా ద్వారానే చేస్తాను.
 
 మీది మధ్యతరగతి కుటుంబం అన్నారు కదా. మీ బాల్యం ఎలా సాగింది?
 సుకుమార్: కాలేజ్‌లో నేను కామ్‌గోయింగ్ అని చెప్పాను కదా. దానికి పూర్తి కాంట్రాస్ట్ నా బాల్యం. మా అన్నయ్యలు మా ఊళ్లో కాస్త రఫ్‌గా తిరిగేవారు. వారి అండ చూసుకొని నేను కూడా ఎవర్నిపడితే వాళ్లను కొట్టేసేవాణ్ణి. రక్తం కారేదాకా కొట్టేవాణ్ణి. ఓసారి మా నాన్నకు తెలిసి చితకబాదేశారు. చదువుపై కూడా శ్రద్ధ ఉండేది కాదు. దానికి తోడు ఆస్త్మా. ఊపిరి పీల్చుకోవడానికి కష్టపడేవాణ్ణి. ఎప్పుడూ డల్‌గా ఉండేవాణ్ణి. బీభత్సమైన బద్దకం. ఇప్పుడు క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నా... ఆ బద్దకం ప్రభావం మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. ఇండస్ట్రీకొచ్చి తొమ్మిదేళ్లు అవుతున్నా... అయిదే సినిమాలు చేశానంటే కారణం అదే అనుకుంటా. వృత్తిపరంగా సక్సెస్‌లు కొడుతున్నా... వ్యక్తిగతంగా ప్రతిరోజూ నేను ఫెయిల్ అవుతూనే ఉంటానని ఎప్పుడూ చెబుతుంటా అందుకే.  
 
 ఇంతకీ మీ బద్దకం ఎప్పుడొదిలింది?
 సుకుమార్: శేషారెడ్డిగారనీ... మా ఆదిత్య కాలేజ్ అధినేత. ఇప్పుడాయన ఎమ్మెల్యేగా ఉన్నారు. నాలోని లేజీతనాన్ని పారద్రోలింది ఆయనే. అందుకోసం ఆయన నాకు నీతిబోధలేం చేయలేదు. ఆయన జీవించే తీరు చూసి నాకు నేనే రియలైజయ్యాను. నాలోని సోమరితనాన్ని పక్కన పెట్టేశాను. తెల్లవారుజామున 4 గంటలకు నిద్ర లేచేవారాయన. రాత్రి 11 గంటల వరకూ ఉత్సాహం పనిచేసేవారు. రోజుకు 3, 4 గంటలే నిద్రపోతూ ఇంత ఉత్సాహంగా ఎలా పనిచేయగలుగుతున్నారని ఆయన్ను చూసి ఆశ్చర్యపోయేవాణ్ణి. అప్పుడే నా మైండ్‌సెట్‌లో మార్పొచ్చింది. నేనెందుకు అలా ఉండకూడదనే భావన నాలో మొదలైంది. రాత్రింబవళ్లూ అలుపెరగకుండా ఈ రోజు పనిచేయగలుగుతున్నానంటే.. నాలో ఆయన నింపిన స్ఫూర్తే కారణం.
 
 చిన్నతనంలో గుర్తుండిపోయిన సంఘటన ఏమైనా..?
 సుకుమార్: అలాంటిది ఒకటుంది. అప్పట్లో గేదెల్ని తీసుకొని చెరువుకెళ్లేవాణ్ణి. అయితే... నాన్న ఓ షరతు విధించాడు. అదేంటంటే... ‘గేదెలు మాత్రమే చెరువులో దిగాలి. నువ్వు మాత్రం దిగకూడదు’ అని. దాంతో తోటి పిల్లలందరూ నీళ్లల్లో దిగి ఈత కొడుతుంటే... నేను చూస్తూ కూర్చుండేవాణ్ణి. ఇక లాభం లేదని ఓ రోజు ‘నేను కూడా చెరువులో దిగుతా’ అని నాన్నను సూటిగా అడిగేశా. నాన్న మంచి మూడ్‌లో ఉన్నట్లున్నారు.. ‘సర్లే’ అనేశారు. ఇంకేముంది... కొబ్బరికాయ దొరికిన కోతిలా మారిపోయా. గేదెలతో పాటు అమాంతం చెరువులోకి దూకేశా. ప్రపంచాన్ని మరిచిపోయి గజ ఈతగాడి లెవల్లో ఈత కొడుతున్నా. ఈ ఆనందంలో నాకు టైమ్ తెలీలేదు. తీరా తేరుకొని చూస్తే... చెరువంతా నిశ్శబ్దం. గేదెలూ లేవు, తోటి పిల్లలూ లేరు. గేదెలు కూడా నన్ను వదిలేసి ఇంటికి వెళ్లిపోయాయన్న విషయం అర్థమైంది. అప్పుడు వినిపించింది నాన్న కేక. ఎంతసేపట్నుంచీ నాకోసం ఎదురు చూస్తున్నారో తెలీదు కానీ, మంచి కోపం మీద ఉన్నారాయన. ఇంటికి తీసుకెళ్లి చావబాదారు. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తొస్తూనే ఉంటుంది.
 
 ఇప్పటికీ మీ ఊరు వెళ్తుంటారా?
 సుకుమార్: ఎందుకెళ్లను... ఆ మధ్య నాకు సన్మానం కూడా చేశారు. అక్కడ ఒకప్పుడు అల్లరిగా తిరిగిన ఓ కుర్రాడు ఇప్పుడు సినిమా డెరైక్టర్ అంటే... అది గొప్ప విషయమే కదా. అన్నయ్య వాళ్లు అక్కడే ఉంటున్నారు. నాన్న మొన్నటిదాకా నా దగ్గరే ఉన్నారు.
 
 కాసేపు సినిమాల విషయానికొద్దాం. మీరు డెరైక్టర్ అవుదామనుకున్న తర్వాత... ఫస్ట్ తయారు చేసుకున్న కథ?
 సుకుమార్: డెరైక్టర్ అవుదామనుకున్న తర్వాత అని కాదు కానీ... లెక్చరర్‌గా ఉన్న రోజుల్లోనే ‘100% లవ్’ కథ తయారు చేసుకున్నాను. దాదాపు అదే టైమ్‌లో ‘జగడం’ కూడా తయారు చేశా. ‘జగడం’ కథకు ప్రేరణ మా కాలేజ్ లైఫే. మేం చదువుకునే రోజుల్లో కాలేజ్ పాలిటిక్స్ ఓ రేంజ్‌లో ఉండేవి. మా అన్నయ్యలు అందులో ముందు వరుసలో ఉండేవారు. ‘జగడం’లో హీరో తమ్ముడి క్యారెక్టర్ ఉంది కదా... అది నేనన్నమాట. ఓ విధంగా మా లైఫ్ స్టోరీ అది.
 
 మరి ‘ఆర్య’ కథకు ప్రేరణ ఎంటి? ఎవరికోసం ఆ కథ తయారు చేశారు?
 సుకుమార్: ప్రేరణ అంటూ ఏమీ లేదు. కొత్తగా ఆలోచించానంతే. ప్రేమించడం, ప్రేమను వ్యక్తపరచడం, దాని గొప్పతనాన్ని తెలియజేయడం... ఇన్నాళ్లూ రెండున్నర గంటల పాటు సినిమాల్లో ఇదే చూపించారు. ‘ఆర్య’ కథ ఆ విధానానికి పూర్తి విరుద్ధమైంది. మననుంచి ఏదో ఆశించి సూర్యుడు వెలుగునివ్వడు. మన నుంచి ప్రతిఫలం ఆశించి ప్రకృతి మనల్ని అక్కున చేర్చుకోదు. ‘ఆర్య’లో హీరో కూడా అంతే... తనను ఆ అమ్మాయి ప్రేమిస్తుందా, లేదా అనేది అతనికి అనవసరం. తాను మాత్రం ప్రేమిస్తాడు. ఈ విషయాన్ని ప్రారంభంలోనే చెప్పేస్తాడు. ఆ తర్వాత జరిగే కథే ‘ఆర్య’. వన్‌సైడ్ లవర్స్ తరఫున వకాల్తా పుచ్చుకుని ట్రెండ్‌కి ఎదురెళ్లి మరీ నేను ‘ఆర్య’ తీశాను. అదే జనానికి కూడా నచ్చేసింది. నిజానికి ఈ కథను నేను తయారు చేసుకుంది అల్లు అర్జున్ కోసం కాదు. అల్లరి నరేష్ కోసం. దీనిని ఒక చిన్న సినిమాగా తీద్దాం అనుకున్నా. కానీ దేవుడు వేరేలా తలచాడు.
 
 బాలీవుడ్‌లో, కోలీవుడ్‌లో ప్రయోగాత్మక సినిమాలొస్తున్నాయి. కానీ మనం ఎందుకు ఆ దిశగా ఆలోచించలేకపోతున్నామంటారు?
 సుకుమార్: ప్రయోగం అనేది చిన్న సినిమాలతోనే చేయగలం. తమిళంలో జరుగుతోంది అదే. బాలీవుడ్ మార్కెట్ పెద్దది కావడంతో అక్కడ పెద్దసినిమాల ద్వారా కూడా ప్రయోగాలు చేస్తున్నారు. కానీ తెలుగులో ఆ పరిస్థితి లేదు. అంతెందుకు... నేను ‘జగడం’ తీశాను. అది నేను రియల్‌గా చూసిన సంఘటనల ఆధారంగా తయారు చేసుకున్న కథ. ‘సమాజానికి ఉపయోగపడే కథ కదా... ఆడుతుందిలే’ అనుకున్నా. కానీ నా అంచనాలు తారుమారయ్యాయి. ‘జగడం’ ఆడితే... అలాంటి ప్రయోగాలే ఇంకొన్ని వచ్చేవి. ఏది ఏమైనా ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటేనే ప్రయోగాలు చేయగలం.
  సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారు కదా! మీ నుంచి అలాంటి సినిమాలు ఆశించొచ్చా?
 సుకుమార్: కచ్చితంగా... అలాంటివి చేయడం కోసమే ఈ ప్రొడక్షన్.
 
 రాజమౌళి లాంటి దర్శకుడు... సుకుమార్ మాస్ సినిమాలు తీస్తే... నాలాంటి వాళ్లు పక్కకు తప్పుకోవాల్సిందే అన్నారు. ఆయన అలా అనడం మీకెలా అనిపించింది?
 సుకుమార్: కేవలం అది రాజమౌళిగారి అభిమానం. ఆయన అలా మాట్లాడటం నా బాధ్యతను పెంచింది. ఆయన ప్రశంస నాకు నేషనల్ అవార్డ్‌తో సమానం.
 
 అన్ని జానర్లూ టచ్ చేయగలిగిన మీరు... ఎప్పుడూ ప్రేమకథలే తీస్తారేం?
 సుకుమార్: నాకు చేతనైంది నేను తీస్తున్నాను. ఒకవేళ వేరే జానర్‌లో సినిమా తీయాలని నాకు అనిపించినా... నా దగ్గరకొచ్చే నిర్మాతలు ఒప్పుకోవడం లేదు. వాళ్లు ప్రేమకథల్నే అడుగుతున్నారు. నేనేం చేసేది! రాబోతున్న ‘1’ నా గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది.
 
 మీరు ఎవరి మాటా వినని సీతయ్య అని అంటారు. నిజమేనా?
 సుకుమార్: అదేంలేదు. ఎవర్నీ ఇబ్బంది పెట్టకూడదు, బాధ పెట్టకూడదు అని అందరి మాటా వింటాను.  కానీ, అందులో నాకు నచ్చిందే తీసుకుంటాను. నాకు ఫైనల్ అవుట్‌పుట్ ముఖ్యం.  
 
 దర్శకునిగా మీకు డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందా?
 సుకుమార్: థ్రిల్లర్ తీయాలని ఉంది. థ్లిల్లర్, సైన్స్‌ఫిక్షన్ సినిమాలను ప్రపంచం మొత్తం చూస్తుంది. వాటికి హద్దులుండవ్. ఉదాహరణకు ‘ఈగ’. అందుకే ఫ్యూచర్‌లో ఓ థ్రిల్లర్ సినిమా తీస్తా.
 
 వచ్చే ఏడాదైనా మీ నుంచి ఓ రెండు సినిమాలు ఆశించొచ్చా?
 సుకుమార్: చెప్పాను కదండీ... నా చేతిలో ఏమీ ఉండదు. నాకు త్వరగా తీయాలనే ఉంటుంది. కానీ... పరిస్థితులు సహకరించవు.
 
 మీరు పుస్తకాలు బాగా చదువుతారనుకుంటా?
 సుకుమార్: ఒకప్పుడు బాగా చదివేవాణ్ణి. దర్శకుణ్ణి అయ్యాక.. ఇన్నాళ్లలో ఓ ఆయిదారు పుస్తకాలు చదివుంటా.
 
 ఇష్టమైన రచయితలు?
 సుకుమార్: చలం, యండమూరి వీరేంద్రనాథ్.
 
 ఒక సినీ దర్శక, రచయితగా మీకు ఇష్టమైన దర్శక, రచయితలు ఎవరు?
 సుకుమార్: జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, త్రివిక్రమ్. వారి ప్రభావం కాస్త్త నాపై ఉంది.
 
 సినిమా, సాహిత్యం... వీటి తర్వాత మీరు బాగా ఇష్టపడేది?
 సుకుమార్: గేమ్స్.... అందులోనూ క్రీజ్‌లో సచిన్ ఉన్నాడంటే... ఇక పనులన్నీ అటకెక్కేయాల్సిందే. నా జీవితంలోని చాలా సమయాన్ని సచినే లాగేసుకున్నాడు. ఎస్పీ బాలుగారి విషయంలో కూడా అంతే.. ఆయన పాటల్ని మనం చిన్నప్పట్నుంచీ వింటూ పెరిగాం. పాట వినడానికి మనం కేటాయించేది అయిదు నిమిషాలు. అంటే... మన అయిదు నిమిషాలు బాలుగారు తీసేసుకున్నట్లేగా. అలా సచిన్ నా జీవితంలో చాలా సమయాన్ని తీసేసుకున్నాడు.
 
 ప్రపంచం మొత్తం తిరిగి ఉంటారు కదా! ఇష్టమైన దేశం?
 సుకుమార్: అంత ఇష్టపడే దేశం ఏమీ లేదండీ. ఆ క్షణంలో ఎంజాయ్ చేస్తానంతే. ఇష్టపడే దేశం అంటే ఇండియానే.
 
 ఎలాంటి ఫుడ్‌ని ఇష్టపడతారు?
 సుకుమార్: ఆరేళ్లవయసులోనే నాన్‌వెజ్ తినడం మానేశా. మళ్లీ దేవిశ్రీ ప్రసాద్ కారణంగా నాన్‌వెజ్ అలవాటైంది. తను కేఎఫ్‌సీ చికెన్ బాగా తింటాడు. నాక్కూడా అలవాటు చేశాడు. ఈ మూడ్నాలుగేళ్ల నుంచే కాస్త ఎక్కువగా తింటున్నా. ‘100%లవ్’లో తమన్నా పాత్రకు దేవిశ్రీనే ప్రేరణ అన్నమాట.
 
 పాలిటిక్స్... ఫాలో అవుతారా?
 సుకుమార్: ఇండస్ట్రీకి రాకముందు బాగా ఫాలో అయ్యేవాణ్ణి. పేపర్లు కూడా బాగా చదివేవాణ్ణి. ఎమ్మెల్యే, మంత్రుల పేర్లు కూడా గుర్తుండేవి. ఇప్పుడు మాత్రం సినిమా తప్ప వేరే ఏమీ గుర్తు రావడంలా.
 
 సరే మీ ఫ్యామిలీ గురించి కూడా చెప్పేయండి... ఓ పనైపోతుంది?
 సుకుమార్: మా ఆవిడ పేరు హంసిని. మాకు ఓ పాప, ఓ బాబు. పాపకు నాలుగేళ్లు. పేరు సుకృతివేణి. ప్లే స్కూల్‌లో చేర్చాం. బాబుకు రెండేళ్లు. పేరు సుక్రాంత్. వాణ్ణి ఇంకా స్కూల్‌లో వేయలేదు. మా ఇద్దరు పిల్లలకు నా పేరు కలిసొచ్చేలా సుకృతి, సుక్రాంత్ అని పేర్లు పెట్టుకుంది నా భార్య. నేనంటే అంత ఇష్టం తనకు. ‘100% లవ్’ అన్నమాట(నవ్వుతూ)
 
 - బుర్రా నరసింహ
 
 తెలుగు సినిమాకు స్క్రిప్ట్ రాయడం కంటే... హాలీవుడ్ సినిమాకు స్క్రిప్ట్ రాయడం తేలిక. హాలీవుడ్ సినిమా స్క్రిప్ట్ స్ట్రయిట్‌గా ఒకే ట్రాక్‌పై సాగిపోతుంది. కానీ.. తెలుగు సినిమా స్క్రిప్ట్ అలా కాదు. మధ్య మధ్యలో పాటలుంటాయి. ఆ పాటలకు తగ్గ సన్నివేశాలను ముందు డిజైన్ చేయాలి. ఆ పాట మూలంగా కథ నుంచి బయటకొచ్చిన ప్రేక్షకుణ్ణి మళ్లీ కథలోకి పంపాలి. అలాగే  ఫైట్లు. ఆ ఫైట్ కారణంగా కథలో ఏర్పడే డిస్ట్రబెన్స్‌ని కూడా సరిచేయాలి. ఎప్పటికప్పుడు స్క్రీన్‌ప్లేని ఛేంజ్ చేస్తూ పోవాలి. నా ఉద్దేశంలో కొన్నాళ్ల తర్వాత ఈ పద్ధతి పూర్తిగా నశించిపోతుంది. ఫ్యూచర్లో డ్యూయెట్లంటూ సినిమాల్లో ఉండవ్. కేవలం కథను నడిపించే మాంటేజస్ సాంగులే ఉంటాయి. బాలీవుడ్‌లో ఆ పద్ధతి ఇప్పుడిప్పుడే మొదలైంది కూడా.

                                 *****************

 చిన్నప్పట్నుంచీ నేను సుఖపడింది లేదు. ఆ మాటకొస్తే... ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నాను. జీవితంలోని ప్రతి మలుపులోనూ నన్ను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. అయితే... ఆ కష్టమే నాకు ఇష్టం.
     
 నా దృష్టిలో తెలివైన విద్యార్థి ఎప్పుడూ మంచి గురువు కాలేడు. బ్యాడ్ స్టూడెంటే గుడ్ లెక్చరర్ అవగలడు. ఎందుకంటే అనుభవాలే వాడికి పాఠాలవుతాయి కాబట్టి, తానెక్కడ తప్పు చేశాడో, ఎక్కడ కష్టంగా ఫీలయ్యాడో వాడికి బాగా తెలుసుకాబట్టి. ఇది నేను స్వానుభవంతో చెబుతున్న మాట.
     
 చలం రచనలన్నీ నాటి పరిస్థితుల్ని బట్టే సాగాయి. కాబట్టి అప్పట్లో ఆయన రాసినవన్నీ అక్షరసత్యాలే. ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. ఏది ఏమైనా సాహిత్యలోకంలో చలం ఓ ఆణిముత్యం. ఎంతోమంది చలం సాహిత్యానికి బానిసలు.
     
 దేవుణ్ణి నమ్ముతాను... ప్రతిరోజూ దణ్ణం పెట్టుకుంటాను కూడా. అయితే... అది భక్తితో కాదు. భయంతో. ఆయన ఉన్నాడేమో అని భయం... ఒకవేళ ఆయన ఉంటే మనల్ని చూస్తూ ఉంటాడేమోనన్న భయం. నాకు మంచి జరగాలని మాత్రం దేవుణ్ణి రోజూ కోరుకుంటాను.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement