Love Storys
-
ప్రేమను బతికిద్దామా! చావును ప్రేమిద్దామా?
నీతో గడిపిన ప్రతి నిమిషమూ మధురమే. నీవు వెంట ఉంటే ప్రతిదీ విజయమే. నిన్ను చూస్తే చాలు మనసు నిండా ఆనందమే. నీవు లేని మరుక్షణం నాకు మరణమే.. ఇది ప్రేమికుల భాష. ఆయుష్మాన్ భవ అంటూ దీవించిన తల్లిదండ్రులు ఆ సమయంలో గుర్తుకు రారు. ఉజ్వల భవిష్యత్తు కోసం తపన పడిన అమ్మానాన్నల కష్టం కంటికి కనిపించదు. చదువుల తల్లి ఒడిలో పిల్లలు ఒదిగి ఒక్కో మెట్టు పైకి ఎగబాకుతుంటే తల్లిదండ్రుల కళ్లు ఆనందంతో వర్షిస్తుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే అవి ఎడారిలా మారిన తమ బతుకుల్లో ఒయాసిస్సులా మారబోతున్న బిడ్డల ఉజ్వల భవిష్యత్తును తలుచుకుని కురిసే ఆనందబాష్పాలు. అయితే ప్రేమ పేరుతో బిడ్డలు అర్ధంతరంగా తనువు చాలిస్తుంటే అవి కాస్తా కన్నీటి జలపాతాలవుతున్నాయి. మనసు ఒక్క చోట స్థిమితంగా నిలవదు. బిడ్డల ఉజ్వల భవిష్యత్తుకు తాము కొవ్వొత్తిలా ఎలా కరిగామో.. బిడ్డలు ఎలా దూరమయ్యారో.. ఎందుకు తమను మరిచారో.. మలివయసులో తోడుంటారనుకుంటే ఒంటరిని చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందో.. తలుచుకుంటే అన్నీ జవాబు లేని ప్రశ్నలే. కాలం విషాద గీతాన్ని ఆలపిస్తుంటే సమాధానం దొరికినట్లే దొరికి చివరికది ప్రశ్నగానే మిగిలిపోతోంది. ప్రేమంటే ఇదేనా? అన్నింటికీ పరిష్కారం చావేనా? – అనంతపురం కల్చరల్/ఎస్కేయూ/న్యూసిటీ ఏడాది క్రితం అనంతపురం రూరల్ మండలానికి చెందిన 19 ఏళ్ల కుర్రాడు ప్రేమ మోజులో పడి ప్రాణాలు తీసుకున్నాడు. సాధారణ కుటుంబమే అయినా.. చిన్నప్పటి నుంచి అతన్ని తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచారు. చెన్నైలోని ఓ ఇంజినీరింగ్ కాలేజ్‌లో చేర్పించారు. ప్రేమ మోజులో పడి వ్యసనాలకు బానిసై, చివరకు తల్లిదండ్రులపై దాడి చేసే స్థాయికి దిగజారాడు. మానసికంగా కృంగిపోయి చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. యాడికి మండలం నగరూరు గ్రామంలో తమ ప్రేమను కుటుంబ పెద్దలు అంగీకరించలేదంటూ ఓ జంట ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల యాడికి మండలంలో 14 ఆత్మహత్య కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. యువత మానసిక స్థితి ఎంత బలహీనంగా ఉందో దీనిని బట్టి అవగతమవుతోంది. పెదపప్పూరు మండలం జూటూరు గ్రామానికి చెందిన రమేష్‌బాబు (అనంతపురం వన్‌టౌన్ కానిస్టేబుల్), సవిత ఏళ్ల తరబడి ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబ సభ్యులు ప్రేమ పెళ్లికి అంగీకరించలేదు. రమేష్‌బాబుకు వేరే అమ్మాయితో పెళ్లి చేయాలని చూశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఇద్దరూ కడప జిల్లా వల్లూరు మండలం గంగాయపల్లి రైల్వే ట్రాక్‌పై ఈ ఏడాది మే 21న ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. మానసిక ఉల్లాసం ఏదీ? రోజూ గంట పాటు వ్యాయామం, ఏవైనా క్రీడలు ఉంటే మానసిక ఉల్లాసం ఉంటుంది. ఇది వైద్య నిపుణులు, మన పూర్వీకులు చెప్పిన మాట. కానీ ప్రస్తుత రోజుల్లో అటువంటి పరిస్థితి లేదు. కేవలం సెల్‌ఫోన్‌తోనే ఆడుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తున్నారు. రోజూ గంట పాటు వివిధ రకాల క్రీడలు, డ్యాన్స్, యుద్ధ క్రీడలు వంటివి నేర్పించాలి. దీని ద్వారా మానసిక పరిపక్వత చెందడంతో పాటు మనిషి శారీరంగా, మానసికంగా మరింత దృఢంగా మారే అవకాశం ఉంది. కౌమారం.. ఉత్తర కౌమార దశ 18–21 వరకు ఉంటుంది. వాస్తవానికి శారీరక అవయవాలు ఈ దశలోనే వేగంగా మార్పు చెందుతాయి. బరువు, ఎత్తు, ఆకారం గరిష్టంగా అభివృద్ధి చెందుతుంది. లైంగిక అవయవాల పెరుగుదల అధికంగా ఉంది. బాలికల్లో అండోత్పత్తి, బాలురలో శుక్రకణాల ఉత్పత్తి ప్రారంభం ఇక్కడే అవుతుంది. ఇలాంటి దశలోనే శారీరక మార్పులను అవగాహన చేసుకోలేక ఆందోళన, ఉద్రిక్తతకు గురై ఒత్తిడికి లోనవుతుంటారు. అలాగే ఈ దశలో అభద్రతాభావమూ ఎక్కువగా ఉంటుంది. జీవితంపై సందిగ్ధత ఉంటుంది. ఊహల్లో బతకడం ఎక్కువగా తార్కికంగా ఆలోచించడం, వివేచన, విమర్శనాత్మకధోరణి కౌమర దశలో ఎక్కువగా ఉంటుంది. ప్రతి అంశాన్ని వ్యతిరేకించే విమర్శనాత్మకధోరణి అలవడుతుంది. పగటి కలలు కంటూ ఊహాజనితమైన జీవితాన్ని గడుపుతారు. గుర్తింపు కోసం.. ఇతర లైంగిక వర్గాలను ఆకట్టుకునే విధంగా వ్యవహరిస్తారు. బాలురు,, బాలికల పట్ల గుర్తింపు కోసం తాపత్రపడతారు. వస్త్రధారణ, అలంకరణపై శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. ఉద్వేగ లక్షణాలు కౌమార దశలో ఉద్వేగ లక్షణాలు తీవ్రస్థాయిలో కనిపిస్తాయి. క్షణానికి ఒక తరహాగా ప్రవర్తించే నైజం ఉంటుంది. మనసు నిలకడగా ఉండదు. ఆతృత కూడా ఎక్కువ. ఎవరైనా విమర్శిస్తే అధికంగా ప్రతిస్పందిస్తారు. తన కోరికలు నెరవేరనపుడు ఏర్పడే ఒడిదొడుకులను తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేస్తారు. ఒక ఉపాధ్యాయుడిని గానీ, సినీతారలను గానీ, క్రికెటర్లును గానీ, రాజకీయ నాయకుల గానీ ఎక్కువగా ఆరాధిస్తారు. సామాజిక లక్షణాలు కౌమార దశలోనే సామాజిక స్పృహ అతివేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇతరుల చేత అభినందన, గుర్తింపు కోరుకుంటారు. వ్యక్తిగతమైన విలువల కంటే సామాజికమైన విలువలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. సమస్యలను స్నేహ బృందంతో నిస్సందేహంగా, నిస్సంకోచంగా, నిర్భయంగా ప్రకటిస్తారు. స్నేహ బృందాన్ని విమర్శించే తల్లిదండ్రులను కూడా ఎదిరిస్తారు. స్నేహానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. శారీరక మార్పుల వల్ల వచ్చే సమస్యలు అవయవాల్లో మార్పులు రావడం.. బాలికల్లో రుతుస్రావం, బాలురలో ఇంద్రియస్కలనం సంభవించడం వల్ల ఆందోళన మొదలవుతుంది. ప్రతి ఒక్క శారీరక మార్పును బాలికలు ఇతరులతో పోల్చికుంటారు. శారీరక మార్పు అధికమైన, తక్కువగా ఉన్నా.. వెంటనే ఆత్మన్యూనత భావానికి లోనవుతారు. ఈ దశలో మార్పులు సహజమని, అనివార్యమని, బిడియ పడాల్సిన అవసరం లేదని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ధైర్యం చెప్పి వాళ్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. ఉద్వేగ సమస్యలు భయాందోళనలు, పెద్దల విమర్శల వల్ల ఏర్పడే వ్యాకులత, భవిష్యత్ పట్ల ఆందోళన, బాల్యాన్ని కోల్పోతున్నామన్న ఆలోచన, వాస్తవ అంశాలకు, ఊహాజనిత అంశాల మధ్య పొంతన లేకపోవడం కౌమార దశలో ఉద్వేగానికి కారణమవుతాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కౌమార దశలో ఉన్న విద్యార్థులకు వాళ్ల వ్యక్తిత్వానికి విలువనిచ్చి స్నేహ పూర్వకంగా వారితో వ్యవహరించి వాస్తవికతను ఆమోదింపచేసేలా వ్యవరించాలి. అవగాహన లేక యుక్త వయసు గల వారికి లైంగిక విజ్ఞానం పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల కలత మిగిలిపోతుంది. ఇది అశ్లీల సాహిత్యాన్ని చదవడం, లైంగిక వాంఛలు కలిగే వ్యతిరేక లింగ వర్గీయుల పట్ల ఆకర్షణ ఏర్పడి దురలవాట్లకు లోనై .. లైంగిక నేరాలకు పాల్పడేందుకు కారణమవుతుంది. ఈ సమస్యను నివారించడానికి లైంగిక విద్యను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టి శాస్త్రపరంగా సంబంధిత సమాచారాన్ని వివరించేందుకు నిష్ణాతులైన మనో విజ్ఞాన (సైకాలజీ)శాస్త్రం పట్ల అవగాహన కలిగిన ఉపాధ్యాయులతో శిక్షణ ఇప్పించాలి. తద్వారా లైంగిక దురలవాట్లను నిరోధించవచ్చు. సామాజిక సమస్యలు సమాజంలో ఆచార వ్యవహారాలు, సంప్రదాయలు, నమ్మకాలు, కట్టుబాట్లకు విరుద్ధంగా పాఠశాలలో చెప్పే అంశాలు.. ఇంటిలో గమనించే అంశాలకు పొంతన కుదరక కౌమార దశలో ద్వంద వైఖరిని కలిగి ఉంటారు. ఈ దశలో ఉపాధ్యాయుడు నైతిక విద్య బోధనతో విద్యార్థుల్లో మానవతా విలువలను పెంపొందించాలి. సామాజిక సేవా కార్యక్రమాల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేయడం వల్ల సమాజం పట్ల అవగాహన ఏర్పడుతుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేక యాడికిలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన యువతీ, యువకుడు రెండేళ్ల క్రితం ప్రేమించుకున్నారు. ఇద్దరివీ వేర్వేరు కులాలు. వీరికి ఇరువైపులా పెద్దలు అంగీకరించలేదు. యువకుడిని తల్లిదండ్రులు ముదిగుబ్బలో ఉన్న తమ కూతురి వద్దకు పంపించారు. యువతి తల్లిదండ్రులు ఆమెకు యాడికిలో పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని అమ్మాయి.. ముదిగుబ్బకు వెళ్లి ప్రియుడితో కలిసింది. అనంతరం ఇద్దరూ రైలు పట్టాలపై శవమై తేలారు. ఈ ఘటన అప్పట్లో ముదిగుబ్బ పోలీస్టేషన్లో కేసు నమోదైంది. – యాడికి జీవితాన్ని వరంగా భావించాలి సిరోటోనిన్ అనే జీవరసాయన పదార్థ లోపం వల్ల ఆత్మహత్యలకు కారణమవుతోంది. విద్యార్థి దశ నుంచి పిల్లల మానసిక స్థితిని సైన్స్ బోధించే ఉపాధ్యాయులు గ్రహించాలి. వారిలో ఆధ్యాత్మిక పరమైన, కుటుంబపరమైన ఆలోచనలు నింపితే ఎట్టి పరిస్థితుల్లోనూ క్షణికావేశం అనేది ఉండదు. జీవితం అనేది ఓ వరంగా ప్రతి ఒక్కరూ భావించాలి. – రవికిరణ్, మానసిక వైద్యనిపుణుడు, అనంతపురం పిల్లల్లో నైతికతను పెంచేలేని దారుణ స్ధితిలోకి మారుతున్న కాలం నెట్టేస్తోంది. దీంతో లక్ష్యం నిర్దేశించుకోలేక యువత బలహీన మనస్ధత్వాలతో కొట్టుమిట్టాడుతోంది. ఆకర్షణనే ప్రేమ అని నమ్ముతుండడం వల్ల అనేక అనర్ధాలు చోటు చేసుకుంటున్నాయి. ర్యాంకులు, మార్కులు మాత్రమే చదువులు అని బలవంతంగా పిల్లల మనోభావాలపై రుద్దుతున్న కార్పొరేట్ సంస్కృతికి, పాఠశాలల యాజమాన్యాల వల్ల తల్లిదండ్రులకు వారు దూరమైపోతున్నారు. ఆత్మవిశ్వాసంతో, ఆనందంగా నిండు నూరేళ్లు బతకాల్సిన యువత ప్రేమ పేరుతో వంచన చేసుకుంటున్నారు. గంపెడు ఆశలను తమపై పెట్టుకున్న తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలను కాదని చావును ఆహ్వానిస్తూ కడుపుకోత మిగిలిస్తున్నారు. దీనికంతటికి కారణం జీవితం పట్ల నిబద్ధత నిర్దేశించలేని పస లేని చదువులదేనని నిపుణులు అంటున్నారు. పెడదోవ పట్టిస్తున్న సోషల్ మీడియా విజ్ఞాన శాస్త్రం మానవాళికి అందించిన ఎన్నో వరాలు తిరోగమన దిశలో ప్రయాణిస్తూ శాపాలుగా మారుతున్నాయి. ఇలాంటి వాటిలో వాట్సాప్, ఫేస్బుక్, ఇంటర్నెట్, యూట్యూబు ముందు వరుసలో ఉన్నాయి. ప్రపంచమంతా కళ్ల ముందుకొచ్చేయడంతో అన్నిటినీ తొందరగా చూసేయాలన్న తపన అందరిలోనూ పెరిగిపోతోంది. ప్రధానంగా ఆధునాతన టెక్నాలజీని సరైన విధానంలో వినియోగించుకోవడంలో యువత విఫలమైంది. ఫలితంగా పచ్చి సోమరులుగా మారుతున్నారు. తరగతి గదుల్లో పాఠాలు వల్లెవేయడం కన్నా.. వాట్సాప్, ఫేస్బుక్కుల్లో చాటింగ్ చేస్తున్న వారి సంఖ్య మరీ ఎక్కువగా ఉండిపోతోంది. నీలిచిత్రాలు, ఏ మాత్రం ఉపయోగపడని గాసిప్స్ యువతను పెడదోవ పట్టిస్తున్నాయి. ఇటీవల వచ్చిన టిక్‌టాక్ యాప్ దాదాపు వందల సంఖ్యలో కుటుంబాల మధ్య దూరం పెంచేసింది. కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడిన సంఘటనలూ ఉన్నాయి. లోపించిన మానసిక సమతుల్యత మారుతున్న జీవన విధానంలో ఎదురవుతున్న సంఘర్షణలు, ఒత్తిళ్లు.. విద్యార్థులు, యువతను ఆత్మహత్యల వైపుగా ప్రేరేపిస్తున్నాయి. విద్య మనిషి సమగ్ర వికాసానికి ఉపయోగపడే సాధనంగానే పెద్దలు తీర్చిదిద్దారు. అయితే ఈరోజుల్లో చదువు ఒక వ్యాపార వస్తువుగా, ఆదాయ వనరుగా మారిపోయింది. పోటీ ప్రపంచంలో గెలవడానికి శక్తికి మించి బట్టీ పట్టి నెగ్గడమే తప్ప అవగాహన చేసుకునే సామర్ధ్యం తగ్గిపోయింది. ఫలితంగా విద్యార్థుల మానసిక సమతుల్యత దెబ్బతిని, అర్ధంతరంగా బతుకులను ముగించుకునేందుకు కారణమవుతోంది. సినిమాలు, మీడియాల ప్రభావంతో యువత అవగాహన లేని ప్రేమలో పడి చాలా సమయం, జీవితం వృధా చేసుకుంటున్నారు. పెద్దలు నిశ్చయించినది ఇష్టపడకపోయినా సరైన వ్యక్తిని ఎంపిక చేసుకోవడంలో పరిపక్వత వస్తే జీవిత లక్ష్యం కొనసాగుతుంది. ఈ విచక్షణ జ్ఞానాన్ని విద్యాలయాలలో నేర్పాలి. దురదృష్టవశాత్తు అది లేకపోవడంతోనే అనర్ధాలు చోటు చేసుకుంటున్నాయని నిపుణులు అంటున్నారు. ఒంటరిగా అదృశ్యం...జంటగా ప్రత్యక్షం ఒంటరిగా అదృశ్యమైన యువతీ యువకులు ప్రేమించిన వారితో పెళ్లాడి కొద్ది రోజులకే జంటలుగా పోలీస్టేషన్‌కు వస్తున్నారు. ఈ పరిస్థితి యాడికిలో ఎక్కువగా ఉంటోంది. ఒకవైపు ఇరువురి బంధువులూ వారి కోసం వెతుకుతుంటే మరోవైపు ప్రేమ వివాహాలు చేసుకుని కుటుంబసభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ నేరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి తాడిపత్రి మండలంలో ఐదు కేసులు, యాడికి పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు కేసులు ఈ తరహాలోనేవి కావడం గమనార్హం. మార్చి నుంచి జూలై మధ్యలో వేసవి సెలవుల్లోనే ఈ తరహా కేసులు నమోదవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. – యాడికి పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలి పామిడి రూరల్ సర్కిల్లోని యాడికి పోలీస్టేషన్ పరిధిలో ఈ ఏడాది మూడు మిస్సింగ్ కేసులు కాగా వాటిని నమోదు చేసి పరిష్కరించాం. ముఖ్యంగా 18 సంవత్సరాలు పూర్తి అయిన వారికి మాత్రమే వివాహాలు చేయాలి. తల్లిదండ్రులు నిరంతరం వారి పిల్లలను గమనిస్తూ ఉండాలి. తమ కూతురు సెల్‌ఫోన్‌తో ఎవరితో మాట్లాడుతోంది, కాలేజీ నుంచి ఎన్ని గంటలకు ఇంటికి తిరిగి వస్తుందో గుర్తించాలి. విద్యార్థినులు కూడా ఆకర్షణకు లోను కాకుండా తల్లిదండ్రులు పడే శ్రమను తెలుసుకోవాలి. – రవిశంకరరెడ్డి, సీఐ, పామిడి రూరల్ పోలీస్ స్టేషన్ మనోవికాస శిక్షణ అవసరం విద్యార్థుల్లో విశ్వాసాన్ని నింపే ప్రయత్నాన్ని క్లాస్‌రూం వేదికగా చేపట్టాం. సమాజంలో కష్టాలను నెగ్గుకొచ్చిన వారి జీవిత చరిత్రలను విద్యార్థులతో చదివించాలి. సమస్యల నుంచి బయట పడే శక్తి పొందే అవకాశం కల్పించేలా సాహిత్య అద్యయనం, శతకాలు, వీరుల కథలు చదివించాలి. ముఖ్యంగా ఆటలు ఆడించడం ద్వారా ఓటమిని స్వీకరించే గుణాన్ని అలవాటు చేయాలి. ఏకాకిగా సమాజంతో ఇమడని స్వభావం ఉన్న విద్యార్ధులను గుర్తించి వారికి ప్రత్యేక మార్గనిర్దేశం చేయాలి. ప్రతి పాఠశాలకు ఒక మనోవికాస శిక్షకుడు తప్పక ఉండాలి. విద్యార్ధి దశలోనే ఏ సమస్య ఎదురైనా ఎలా నెగ్గుకొని రావాలో చెప్పే శిక్షణ కేంద్రాలుగా పాఠశాలలు నిలిచినప్పుడే ఆత్మహత్యలు, ప్రేమ గోలలు ఉండవు. – ఎ.అరుణకుమారి, సావిత్రీబాయిపూలే అవార్డు గ్రహీత, అగళి మండలం ఆనంద వేదిక ఇటీవల అన్ని తరహా పాఠశాలల్లో ఆనంద వేదిక అనే కొత్త కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రారంభించింది. విద్యార్థులకు ఒత్తిడి లేని, ఆనందకరమైన జీవన విధానంపై అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమం కొనసాగాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఉపాధ్యాయులందరూ సహకరిస్తే ఇది విజయవంతమవుతుందనేది అక్షర సత్యం. విద్యార్థుల్లో గొప్ప మార్పు తేవడానికి ఆనంద వేదిక ఉండాలని కొందరు ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. ప్రేమ అంటేనే ధైర్యం ప్రేమ వివాహాలు సమాజంలో సమానత్వాన్ని తీసుకురావడానికి ఉపయోగపడగాయి. అయితే అన్ని ప్రేమలు విజయాన్ని సాధించలేవు. పెద్దల్ని ఒప్పించేందుకు ప్రయత్నం చేయాలి. కొన్ని సందర్భాల్లో ఒప్పుకోకపోవచ్చు. ఇలాంటి సమయంలోనే ప్రేమను నిలబెట్టుకోవాలి. పిరికితనంతో చావకూడదు. ప్రేమ అంటే ధైర్యం. చచ్చే ధైర్యాన్ని బతకడంలో చూపితే కచ్చితంగా ఆ ప్రేమ విజయతీరాలను చేరుతుంది. నేనూ కులాంతర వివాహం చేసుకున్నా. జీవితంలో ఒడిదొడుకులు ఎన్నో ఎదుర్కొన్నా. వాటిని అధిగమించి పెద్దలను ప్రసన్నం చేసుకున్నాం. – డాక్టర్ బత్తల అశోక్ కుమార్, సోషల్ ఎక్స్‌క్లూజివ్ అండ్ ఇన్‌క్లూజన్ విభాగం, ఎస్కేయూ మానసిక పరిపక్వత ఉండాలి మానసిక పరిపక్వత లేక చిన్న వయసులోనే ప్రేమలో పడుతున్నారు. ఏదైనా జరిగితే దానిని తట్టుకునే ఆత్మవిశ్వాసం లోపిస్తోంది. విద్యార్థి దశలోనే ఆత్మ విశ్వాసం పెంపొందేలా విద్యా ప్రణాళికలో సమూలమైన మార్పులు రావాలి. చరిత్రలో వీరుల విజయగాథలను విద్యార్థులు బాగా చదవాలి. నైతిక విలువలు పెంపొందే బోధన, అభ్యసనం ఉండాలి. ప్రతి పాఠశాల, కళాశాలలోనూ మనో విజ్ఞాన శాస్త్రం అందించే అధ్యాపకులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఉండాలి. –ప్రొఫెసర్ కేవీ రమణా రెడ్డి, ఎస్కేయూ. ఫ్యాషన్ అయిపోయింది ప్రేమ అనేది ఫ్యాషన్‌గా మారిపోయింది. సినిమాలు, సీరియళ్లు, స్మార్ట్ సెల్ఫోన్లను అతిగా చూడడం వల్ల బానిసలవడంతో పాటు మానసిక దృఢత్వం కోల్పోతున్నారు. సరైన అవగాహన లేకపోవడంతో ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రేమ తప్పు కాదు. జీవితంలో వారి కాళ్ల మీద వారు నిలబడి ప్రేమను జయించుకోవాలి. – పద్మజ, మహిళా న్యాయవాది, అనంతపురం నిలకడలేని మనసులు నిలకడలేని మనసులు కల్గిన వారే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చిన్నప్పటి నుంచి విలువలు లేకుండా పెరగడమే ఇందుకు కారణం. ఏది మంచి, చెడు, చిన్నాపెద్దా అనే విషయాలు వారికి తెలియాలి. సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచాలి. ఇందులో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. అతి గారబంతో వారు ఏమి అడిగినా వెంటనే తీసిచ్చి వారిలోని పరిక్వతను చంపేస్తున్నారు. పెద్దయ్యాక ఇక తల్లిదండ్రుల మాట ఏం వింటారు? ప్రేమించడం చచ్చిపోవడానికి కాదు. – ప్రొఫెసర్ డాక్టర్ యండ్లూరి ప్రభాకర్, అనంతపురం -
మూడు జంటల ప్రేమకథ
15, 18, 24.. ఈ మూడు సంవత్సరాల దశల్లో ప్రేమ ఎలా ఉంటుంది? ఆ ప్రేమల్లో గమ్మల్తైన సంగతులేంటి? ఈ ట్రాక్‌లో ఊహించని ఓ ప్రమాదం మొత్తం కథను ఎలా మలుపు తిప్పింది? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘15–18–24 లవ్ స్టోరీ’. నిఖిలేశ్వర్, సాహితి, కీర్తన్, సిమ్రాన్ సానియా, ఉపేంద్ర, పారుల్ బిందల్, ఈషా, ధన్యశ్రీ ప్రధాన పాత్రల్లో మాడుపూరి కిరణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. విమలాద్రి క్రియేషన్స్, మాజేటి మూవీ మేకర్స్, కిరణ్ టాకీస్ బ్యానర్లపై బొద్దుల సుజాత శ్రీనివాస్, స్రవంతి ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా టైటిల్ లోగోని ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు, హీరో రాహుల్ విజయ్, ‘సంతోషం’ అధినేత సురేష్ కొండేటి ఆవిష్కరించారు. మాడుపూరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘కులుమనాలి, గోవా, హైదరాబాద్‌లో మూడు ప్రేమ జంటల మధ్య సాగే ప్రేమకథా చిత్రమిది. చక్కటి కథ, కథనాలతో ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తుంది. త్వరలోనే ఆడియో, వేసవిలో సినిమా విడుదల చేస్తాం’అన్నారు. ‘‘అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు మా సినిమాలో ఉంటాయి. తప్పకుండా హిట్ అవుతుంది’’ అన్నారు బొద్దుల సుజాత శ్రీనివాస్, స్రవంతి ప్రసాద్. సంగీత దర్శకుడు జయవర్ధన్, నటీనటులు పాల్గొన్నారు. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి. హజారత్ బాబు, కెమెరా: రాజేష్. -
'ప్రేమ కథలు ఎలా ఉన్నా ఇష్టం'
త్వరలో ఫితుర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతోన్న కత్రినా, సినిమా ప్రమోషన్లో భాగంగా తన అభిమానులతో ముచ్చటించింది. ఈసందర్భంగా తనకు లవ్ స్టోరీస్ అంటే ఎంతో ఇష్టమని ఎలాంటి సినిమాల్లో నటించినా, ఎక్కువగా లవ్ స్టోరీసే చూస్తానని తెలిపింది. 'సినిమాల్లో లవ్ స్టోరీస్ నాకిష్టమైన జానర్, విషాదాంతలైన, స్ఫూర్తినిచ్చే కథలైన లవ్ స్టోరీస్ ఎలా రూపొందించినా ఆకట్టుకుంటాయి' అంటూ తనకు నచ్చిన సినిమాల జానర్‌ను అభిమానులకు తెలియజేసింది. చార్లెస్ డికెన్స్ నవల గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఫితూర్ సినిమాలో ఆదిత్యరాయ్ కపూర్‌కు జోడిగా నటిస్తోంది ఈ బ్యూటి. టబు, లారాదత్త, అదితిరావ్ హైదరీలు ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 12న రిలీజ్ అవుతోంది. అభిషేక్ కపూర్ దర్వకత్వం చేయడంతో పాటు సిద్దార్థ్ రాయ్ కపూర్ తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
నా ప్రేమకథే ఓ సినిమా!
సుకుమార్‌ని తిట్టుకోడానికి... ఆయన సినిమాలను ఇష్టపడే ప్రతి ప్రేక్షకుడికీ హక్కుంది! ‘కోపంగానో, ద్వేషంగానో ఫీల్ మై లవ్’ అనిపించారు కదా ఆర్య హీరోతో... అలాంటి హక్కన్నమాట ఇది! ఆర్య తర్వాత మూడేళ్లకు జగడం. జగడం తర్వాత రెండేళ్లకు ఆర్య2 ఆర్య2 తర్వాత మూడేళ్లకు 100% లవ్. 100% తర్వాత రెండేళ్లకు... ఇప్పుడు రాబోతున్న 1. ఏంటబ్బా ఇంత బద్దకం ఈ మనిషికి?! ఫట్‌ఫట్‌మని నాలుగు సిక్సర్లు, ధనాధన్మని ఆరు బౌండరీలు బాది పడేయలేడా?! సచిన్ నెమ్మదిగా డిఫెన్స్ ఆడుతుండడం... సుకుమార్ తీరిగ్గా సినిమా తీస్తూ ఉండడం... రెండూ ఒకటే ఫ్యాన్స్‌కి. ఉడుకురక్తం ఎన్నాళ్లని ఓపిక పడుతుంది? లవ్స్టోరీల స్టార్ డెరైక్టర్ సుకుమార్ ఎందుకంత పట్టిపట్టి సినిమా తీస్తారు? ప్రేమని ఎందుకంత తేలిగ్గా తీసి పడేయరు? ఆయన లవ్ స్టోరీ ఏమిటి? ఆయన లైఫ్ స్టైల్ ఏమిటి? చదవండి ఈవారం ‘తారాంతరంగం’లో. మీ ‘1’ సినిమాను ఎప్పుడు చూపిస్తున్నారు సార్? సుకుమార్: జనవరి 10న ఎలా ఉంటుంది అందులో మహేష్ కేరక్టరైజేషన్? సుకుమార్: తినబోతూ రుచి ఎందుకు? చూస్తారుగా. ఎందుకని మీ సినిమాల్లోని హీరో పాత్రలకు ఏదో ఒక చెడు లక్షణం ఉంటుంది? సుకుమార్: హీరో అనేవాడు రాముడిలా ఉండాలనుకోవడం సరికాదు. మనలో ఒకడిగా ఉండాలి. ప్రతిమనిషికీ ఉండే సాధారణమైన లక్షణాలే నా హీరోలకూ ఉంటాయి. వాటిని చెడు లక్షణాలు అనడం కంటే సాధారణ లక్షణాలు అనడం కరెక్ట్. ఒకప్పుడు హీరోహీరోయిన్లు చందమామను చూసి పాటలు పాడుకునేవారు. కనీసం ఒకరినొకరు ముట్టుకునేవారు కూడా కాదు. తర్వాత కాలంలో చేతులు కలుపుకొని పాడుకోవడం మొదలైంది. ఈ డెవలప్మెంట్ కౌగిలింతల దాకా వచ్చింది. ఎప్పటికప్పుడు ఈ పరిణామాన్ని కుటుంబప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. తొలి రోజుల్లో ‘మంచి సినిమా అంటే... ఇలా ఉండాలి’ అని ఓ గీత గీసుకున్న ప్రేక్షకుడు... కాలక్రమంలో తన గీతని తానే చెరుపుకుంటూ పోయాడు. ప్రస్తుతం ఐటమ్ సాంగ్‌ని కూడా ఫ్యామిలీ మొత్తం కలిసే చూస్తున్నారు. అప్పుడు చెడు అనిపించినవి, ఇప్పుడు మంచి అయ్యాయి. ఇప్పుడు చెడు అనిపించేవి, రాబోయే తరానికి మంచి అవుతాయి. ఇది కామన్. పాత్రలు కూడా అంతే. మీ కథలు.. అందులోని పాత్రలూ... స్వానుభవాలా? లేక ఊహలనుంచి పుట్టినవా? సుకుమార్: ఒక సంఘటన, ఒక పుస్తకం, ఒక సినిమా ఇలా ఏదైనా ఇన్స్పైర్ చేయొచ్చు. అందుకే పర్టిక్యులర్‌గా ఫలానా అని చెప్పలేను. తెరపై మీ హీరోలు చిత్రంగా ప్రవర్తిస్తుంటారు కదా. కాలేజ్ టైమ్‌లో మీరెలా బిహేవ్ చేసేవారు? సుకుమార్: అందరికీ ఉన్నట్టే నాకూ కోరికలుండేవి. అమ్మాయిలతో మాట్లాడాలని, ఫలానా అమ్మాయిని చూడాలని, ముద్దుపెట్టుకోవాలని... ఇలా అన్నమాట. ఆ వయసులో ఎవరికైనా ఉండే కోరికలే అవి. కానీ వాటిని మనసుని దాటనిచ్చేవాణ్ణి కాదు. నాలోనే ఉంచుకునేవాణ్ణి. నేను చాలా సిగ్గరిని. చాలా కామ్‌గా ఉండేవాణ్ణి. నేనేదో నా పనేదో. ఇతర విషయాల జోలికి అస్సలు వెళ్లేవాణ్ణి కాదు. అంటే కాలేజ్ ఏజ్‌లో ప్రేమకథలు ఏం లేవా? సుకుమార్: ఆ గోల ఇప్పుడెందుకండీ.. అనవసరంగా ఇంట్లో సమస్యలొస్తాయి. (నవ్వుతూ) సరే మీదీ ప్రేమ వివాహమే కదా. మీ ప్రేమకథైనా చెప్పండి? సుకుమార్: నేను డెరైక్టర్ అయ్యాకే నా ప్రేమకథ మొదలైంది. పైగా అది అయిదారేళ్ల కథ. దాన్ని ఓ పది పదిహేను నిమిషాల్లో చెప్పడం కష్టం. ఒకవేళ చెప్పగలిగినా... ఇప్పుడు మాత్రం చెప్పను. ఎందుకంటే... నా ప్రేమ కథే ఓ సినిమా అవుతుంది. ఎప్పటికైనా తీయాలనుకుంటున్నాను. అంత విషయం ఉన్న కథా? సుకుమార్: ఎంతవిషయం ఉందో చూస్తే కదా తెలిసేది.(నవ్వుతూ) అంటే మీ ప్రేమకథలో హర్డిల్స్ కూడా ఉన్నాయా? మీరప్పటికే స్టార్ డెరైక్టర్ కదా? సుకుమార్: డెరైక్టరైనా, అసిస్టెంట్ డెరైక్టరైనా ప్రేమ ముందు అంతా ఒక్కటే. హర్డిల్స్ లేని ప్రేమ ఎక్కడా ఉండదు. సరే లెక్చరర్‌గా పనిచేస్తున్న టైమ్‌లో.. ‘సుందరకాండ’ లాంటి అనుభవాలేమైనా ఎదురయ్యాయా? సుకుమార్: ఆ.... ఏంటి ఆలోచిస్తున్నారు? సుకుమార్: చెబితే మీరు నమ్ముతారో లేదో అని. ఎందుకు నమ్మం? చెప్పండి? సుకుమార్: నిజంగా జరగలేదు. మీకు జరక్కపోతే పోయింది... మీ స్టూడెంట్స్ ప్రేమ వ్యవహారాలైనా మీ వద్దకొచ్చేవా? సుకుమార్: బోల్డన్ని. ‘ఆ అమ్మాయి నన్ను ఇష్టపడటం లేదుసార్...’ అంటూ వచ్చేవారు. ‘బాగా చదివి పాసవ్వండ్రా... ఆటోమేటిగ్గా వాళ్లే ఇష్టపడతారు’ అని నచ్చజెప్పేవాణ్ణి. ‘ఈ లోపు ఇంకెవరికైనా సెట్ అయిపోతే...’ అని తెగ ఫీలైపోయేవారు(నవ్వుతూ) అంటే లెక్చరర్‌గా పనిచేస్తున్న రోజుల్లో మీకు హీరో ఇమేజ్ ఉండేదన్నమాట? సుకుమార్: అవును. నా స్టూడెంట్స్ అందరూ నన్ను చాలా ఇష్టపడేవారు. అందరితో క్లోజ్‌గా మూవ్ అయ్యేవాణ్ణి. పైగా ఆ కాలేజ్‌లో నేనే యంగ్ లెక్చరర్ని. అసలు లెక్చరర్ అవాలని ఎందుకనిపించింది మీకు? సుకుమార్: మాది మధ్య తరగతి కుటుంబం. రాజోలు సమీపంలోని మట్టపర్రు మా ఊరు. నాన్నది బియ్యం వ్యాపారం. నాకు ముగ్గురు అన్నయ్యలు, ఇద్దరు తోబుట్టువులు. ఇంత సంసారాన్నీ నాన్న ఒక్కరే మొయ్యాలి. స్థిరచరాస్తులు కూడా ఏమీ లేవు. అప్పట్లో ఇల్లు గడవడమే కష్టంగా ఉండేది. నాన్న కష్టపడుతుంటే చాలా బాధగా ఉండేది. మేం కాస్త చేతికంది వచ్చాక ఏదో ఒకటి చేసి నాన్నకు ఆసరాగా నిలవాలనుకున్నాం. ఈ క్రమంలోనే నేను లెక్చరర్ అయ్యాను. ఉపాధ్యాయ వృత్తికి ఎంతో శిక్షణ అవసరం. ఒకేసారి అంతమంది పిల్లల్ని ఫేస్ చేయడం అంటే సాధారణమైన విషయం కాదు. ఏ శిక్షణా లేకుండా ఎలా లెక్చరర్ అయ్యారు? సుకుమార్: అవసరాన్ని మించిన గురువు ప్రపంచంలో వేరొకటి లేదండీ. ‘ట్యూషన్ చెప్పబడును’ అని ఇంటిముందు ఓ బోర్డ్ పెట్టా. ముందు ఓ కుర్రాడు వచ్చాడు. ‘మేం ముగ్గురం వస్తాం. బాగా చెబితే.. ఇక్కడే చదుకుంటాం. లేకపోతే వేరే ట్యూషన్ చూసుకుంటాం’ అన్నాడు. సరే... అని మొదలుపెట్టా. పదిరోజులు తిరిగే సరికి ముగ్గురు కాస్తా ముప్ఫై మంది అయ్యారు. తర్వాత ఆ సంఖ్య మూడొందలకి చేరుకుంది. మా ఇంటిముందు సైకిళ్లు బారులు తీరి ఉండేవి. అన్ని సైకిళ్లు మా ఇంటి ముందు ఉండటం చూసి, మా కాలేజ్ లెక్చరర్, నా గురువు అయిన రామ్మోహనరెడ్డిగారు.. ‘ఏంటి?’ అని వాకబు చేశారట. ఒక ట్యూటర్‌గా అక్కడ నాకెంత మంచి పేరుందో అప్పుడే ఆయనకు తెలిసింది. నేరుగా నన్ను కలిసి, నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు... అని కాకినాడ ఆదిత్య కాలేజ్‌లోనే లెక్చరర్‌గా ఉద్యోగం ఇప్పించారు. అలా తొమ్మిదేళ్లపాటు లెక్చరర్‌గా నా కెరీర్ సాగింది. ప్రస్తుతం నా స్టూడెంట్లు విదేశాల్లో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల్లో సీఈఓలుగా ఉన్నారు. ఇప్పటికీ వాళ్లు నన్ను అభిమానిస్త్తూనే ఉన్నారు. నా దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న వారిలో ఇద్దరు నా స్టూడెంట్లే. ఏ క్లాసులు చెప్పేవారు? సుకుమార్: మొదట్లో ఇంటర్మీడియట్ క్లాసులు చెప్పేవాణ్ణి. తర్వాత డిగ్రీకి ప్రమోట్ అయ్యాను. ఆ వయసు పిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం కదా. ఎలా టాకిల్ చేసేవారు? సుకుమార్: నిజమే... చురుగ్గా ఉండేవారు. అందుకే... ముందు నేనే వాళ్లలో ఒకడిగా మారిపోయేవాణ్ణి. తర్వాత నిదానంగా వాళ్లను పాఠంలోకి దించేవాణ్ణి. ‘సుకుమార్ సార్ లెసన్ చెప్పే విధానం చాలా బాగుంటుంది’ అనేవారు. మీ సబ్జెక్ట్ ఏంటి? సుకుమార్: మ్యాథ్స్ లెక్కలు అంటే ఇష్టమా? సుకుమార్: కాదు భయం. చిన్నప్పుడు ప్రతిసారీ లెక్కల్లో తప్పులు చేసేవాణ్ణి. మళ్లీ దిద్దుకోవడానికి ఎంతో కష్టపడేవాణ్ణి. అందుకే... లెక్కలు చెబుతున్నప్పుడు... ఎక్కడ అవి టఫ్‌గా అనిపిస్తాయో నాకు బాగా తెలుసు. లెక్చరర్ అయ్యాక... సరిగ్గా ఆ టైమ్‌లోనే పిల్లల దగ్గర జాగ్రత్త పడేవాణ్ణి. నిజంగా పాఠం చెబుతున్నప్పుడు కలిగే సంతృప్తే వేరు.. మనం చెబుతున్న పాఠాలు పిల్లలకు బాగా అర్థం అవుతున్నాయి అనిపిస్తే... ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలుగుతుంది. మరి అంత ఆనందాన్ని వదిలిపెట్టి సినిమాల్లోకి వచ్చారే? సుకుమార్: పేరుప్రఖ్యాతుల కోసం. చిన్నప్పుడు సైంటిస్ట్ అవుదామనుకునేవాణ్ణి. ఐన్‌స్టీన్ లాంటి వాళ్ల పక్కన నా స్టిల్ కూడా ఉంటే ఎంత బావుణ్ణు అని కలలు కనేవాణ్ణి. సమాజానికి ఉపయోగపడే వస్తువు ఏదైనా కనిపెడితే... అది శాశ్వతంగా నిలిచి, మనల్ని కూడా జనహృదయాల్లో శాశ్వతంగా నిలుపుతుంది కదా అని ఆశించేవాణ్ణి. కానీ నేనంత మేధావిని కాను, నా బుర్రలో అంత గుజ్జులేదు అని నాకు ముందే తెలిసిపోయింది. సో... మనం సైంటిస్ట్ కాలేం. మరి ప్రత్యామ్నాయ మార్గం ఏంటి? అని ఆలోచిస్తే...నాకు కనిపించింది సినిమా. చిన్నప్పట్నుంచీ సినిమా అంటే తెలీని మమకారం. మా రాజోలులో ఉన్న రెండు థియేటర్లు మూసేయడంతో తాటిపర్రు వెళ్లి సినిమాలు చూసేవాణ్ణి. రిలీజ్ రోజే సినిమాలు చూసేంత ఆరాటం ఉండేది కాదు కానీ... సినిమాలు మాత్రం బాగానే చూసేవాణ్ణి. అప్పట్లో ఊరి వీధుల్లో తెరలు కట్టి సినిమాలు వేసేవారు. అలా ‘బంట్రోతు భార్య’ సినిమా ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు. పవిత్రబంధం, విచిత్రకుటుంబం లాంటి సినిమాలు అక్కడే చూశా. లెక్చరర్‌గా బిజీగా ఉన్న రోజుల్లో కూడా సెకండ్‌షోలకు వెళ్లే వాణ్ణి. గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాలంటే... అంతకు మించిన మార్గం నాకు కనిపించలేదు. అందుకే చేసే ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టేసి వి.వి.వినాయక్‌గారి వద్ద దర్శకత్వ శాఖలో చేరిపోయాను. తేలిగ్గా డబ్బునూ, పేరు ప్రఖ్యాతుల్నీ సంపాదించుకోవాలంటే సినిమాను మించిన సాధనం ఇంకోటి లేదని నా అభిప్రాయం. విద్యాబోధనలో ఉన్న తృప్తి అపారం అని ఇంతకు ముందే అన్నారు. మరి ఆ వృత్తిని వదిలిపెడుతుంటే బాధ అనిపించలేదా? సుకుమార్: జీవితంలో ఒకటి సాధించాలంటే ఒకటి వదులుకోవాల్సిందే. ఆ వృత్తినే నమ్ముకొని ఉన్నట్లయితే... నాకు ఈ స్థాయి వచ్చేది కాదు కదా. మరో విషయం ఏంటంటే... టీచింగ్‌లో ఉన్న సంతృప్తి సినిమాల్లోకొచ్చాకే నాకు తెలిసింది. ఆ వృత్తిలో ఉన్నప్పుడు తెలీలేదు. విలువ అనేది దగ్గర ఉన్నప్పుడు తెలీదు. దూరమైతేనే తెలిసేది. విద్యారంగం నుంచి వచ్చారు కదా. భవిష్యత్తులో ఏదైనా విద్యాసంస్థను నెలకొల్పాలని ఉందా? సుకుమార్: లేదు... ఇక సినిమానే నా లోకం. ఏం చేయాలన్నా సినిమా ద్వారానే చేస్తాను. మీది మధ్యతరగతి కుటుంబం అన్నారు కదా. మీ బాల్యం ఎలా సాగింది? సుకుమార్: కాలేజ్‌లో నేను కామ్‌గోయింగ్ అని చెప్పాను కదా. దానికి పూర్తి కాంట్రాస్ట్ నా బాల్యం. మా అన్నయ్యలు మా ఊళ్లో కాస్త రఫ్‌గా తిరిగేవారు. వారి అండ చూసుకొని నేను కూడా ఎవర్నిపడితే వాళ్లను కొట్టేసేవాణ్ణి. రక్తం కారేదాకా కొట్టేవాణ్ణి. ఓసారి మా నాన్నకు తెలిసి చితకబాదేశారు. చదువుపై కూడా శ్రద్ధ ఉండేది కాదు. దానికి తోడు ఆస్త్మా. ఊపిరి పీల్చుకోవడానికి కష్టపడేవాణ్ణి. ఎప్పుడూ డల్‌గా ఉండేవాణ్ణి. బీభత్సమైన బద్దకం. ఇప్పుడు క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నా... ఆ బద్దకం ప్రభావం మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. ఇండస్ట్రీకొచ్చి తొమ్మిదేళ్లు అవుతున్నా... అయిదే సినిమాలు చేశానంటే కారణం అదే అనుకుంటా. వృత్తిపరంగా సక్సెస్‌లు కొడుతున్నా... వ్యక్తిగతంగా ప్రతిరోజూ నేను ఫెయిల్ అవుతూనే ఉంటానని ఎప్పుడూ చెబుతుంటా అందుకే. ఇంతకీ మీ బద్దకం ఎప్పుడొదిలింది? సుకుమార్: శేషారెడ్డిగారనీ... మా ఆదిత్య కాలేజ్ అధినేత. ఇప్పుడాయన ఎమ్మెల్యేగా ఉన్నారు. నాలోని లేజీతనాన్ని పారద్రోలింది ఆయనే. అందుకోసం ఆయన నాకు నీతిబోధలేం చేయలేదు. ఆయన జీవించే తీరు చూసి నాకు నేనే రియలైజయ్యాను. నాలోని సోమరితనాన్ని పక్కన పెట్టేశాను. తెల్లవారుజామున 4 గంటలకు నిద్ర లేచేవారాయన. రాత్రి 11 గంటల వరకూ ఉత్సాహం పనిచేసేవారు. రోజుకు 3, 4 గంటలే నిద్రపోతూ ఇంత ఉత్సాహంగా ఎలా పనిచేయగలుగుతున్నారని ఆయన్ను చూసి ఆశ్చర్యపోయేవాణ్ణి. అప్పుడే నా మైండ్‌సెట్‌లో మార్పొచ్చింది. నేనెందుకు అలా ఉండకూడదనే భావన నాలో మొదలైంది. రాత్రింబవళ్లూ అలుపెరగకుండా ఈ రోజు పనిచేయగలుగుతున్నానంటే.. నాలో ఆయన నింపిన స్ఫూర్తే కారణం. చిన్నతనంలో గుర్తుండిపోయిన సంఘటన ఏమైనా..? సుకుమార్: అలాంటిది ఒకటుంది. అప్పట్లో గేదెల్ని తీసుకొని చెరువుకెళ్లేవాణ్ణి. అయితే... నాన్న ఓ షరతు విధించాడు. అదేంటంటే... ‘గేదెలు మాత్రమే చెరువులో దిగాలి. నువ్వు మాత్రం దిగకూడదు’ అని. దాంతో తోటి పిల్లలందరూ నీళ్లల్లో దిగి ఈత కొడుతుంటే... నేను చూస్తూ కూర్చుండేవాణ్ణి. ఇక లాభం లేదని ఓ రోజు ‘నేను కూడా చెరువులో దిగుతా’ అని నాన్నను సూటిగా అడిగేశా. నాన్న మంచి మూడ్‌లో ఉన్నట్లున్నారు.. ‘సర్లే’ అనేశారు. ఇంకేముంది... కొబ్బరికాయ దొరికిన కోతిలా మారిపోయా. గేదెలతో పాటు అమాంతం చెరువులోకి దూకేశా. ప్రపంచాన్ని మరిచిపోయి గజ ఈతగాడి లెవల్లో ఈత కొడుతున్నా. ఈ ఆనందంలో నాకు టైమ్ తెలీలేదు. తీరా తేరుకొని చూస్తే... చెరువంతా నిశ్శబ్దం. గేదెలూ లేవు, తోటి పిల్లలూ లేరు. గేదెలు కూడా నన్ను వదిలేసి ఇంటికి వెళ్లిపోయాయన్న విషయం అర్థమైంది. అప్పుడు వినిపించింది నాన్న కేక. ఎంతసేపట్నుంచీ నాకోసం ఎదురు చూస్తున్నారో తెలీదు కానీ, మంచి కోపం మీద ఉన్నారాయన. ఇంటికి తీసుకెళ్లి చావబాదారు. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తొస్తూనే ఉంటుంది. ఇప్పటికీ మీ ఊరు వెళ్తుంటారా? సుకుమార్: ఎందుకెళ్లను... ఆ మధ్య నాకు సన్మానం కూడా చేశారు. అక్కడ ఒకప్పుడు అల్లరిగా తిరిగిన ఓ కుర్రాడు ఇప్పుడు సినిమా డెరైక్టర్ అంటే... అది గొప్ప విషయమే కదా. అన్నయ్య వాళ్లు అక్కడే ఉంటున్నారు. నాన్న మొన్నటిదాకా నా దగ్గరే ఉన్నారు. కాసేపు సినిమాల విషయానికొద్దాం. మీరు డెరైక్టర్ అవుదామనుకున్న తర్వాత... ఫస్ట్ తయారు చేసుకున్న కథ? సుకుమార్: డెరైక్టర్ అవుదామనుకున్న తర్వాత అని కాదు కానీ... లెక్చరర్‌గా ఉన్న రోజుల్లోనే ‘100% లవ్’ కథ తయారు చేసుకున్నాను. దాదాపు అదే టైమ్‌లో ‘జగడం’ కూడా తయారు చేశా. ‘జగడం’ కథకు ప్రేరణ మా కాలేజ్ లైఫే. మేం చదువుకునే రోజుల్లో కాలేజ్ పాలిటిక్స్ ఓ రేంజ్లో ఉండేవి. మా అన్నయ్యలు అందులో ముందు వరుసలో ఉండేవారు. ‘జగడం’లో హీరో తమ్ముడి క్యారెక్టర్ ఉంది కదా... అది నేనన్నమాట. ఓ విధంగా మా లైఫ్ స్టోరీ అది. మరి ‘ఆర్య’ కథకు ప్రేరణ ఎంటి? ఎవరికోసం ఆ కథ తయారు చేశారు? సుకుమార్: ప్రేరణ అంటూ ఏమీ లేదు. కొత్తగా ఆలోచించానంతే. ప్రేమించడం, ప్రేమను వ్యక్తపరచడం, దాని గొప్పతనాన్ని తెలియజేయడం... ఇన్నాళ్లూ రెండున్నర గంటల పాటు సినిమాల్లో ఇదే చూపించారు. ‘ఆర్య’ కథ ఆ విధానానికి పూర్తి విరుద్ధమైంది. మననుంచి ఏదో ఆశించి సూర్యుడు వెలుగునివ్వడు. మన నుంచి ప్రతిఫలం ఆశించి ప్రకృతి మనల్ని అక్కున చేర్చుకోదు. ‘ఆర్య’లో హీరో కూడా అంతే... తనను ఆ అమ్మాయి ప్రేమిస్తుందా, లేదా అనేది అతనికి అనవసరం. తాను మాత్రం ప్రేమిస్తాడు. ఈ విషయాన్ని ప్రారంభంలోనే చెప్పేస్తాడు. ఆ తర్వాత జరిగే కథే ‘ఆర్య’. వన్‌సైడ్ లవర్స్ తరఫున వకాల్తా పుచ్చుకుని ట్రెండ్‌కి ఎదురెళ్లి మరీ నేను ‘ఆర్య’ తీశాను. అదే జనానికి కూడా నచ్చేసింది. నిజానికి ఈ కథను నేను తయారు చేసుకుంది అల్లు అర్జున్ కోసం కాదు. అల్లరి నరేష్ కోసం. దీనిని ఒక చిన్న సినిమాగా తీద్దాం అనుకున్నా. కానీ దేవుడు వేరేలా తలచాడు. బాలీవుడ్లో, కోలీవుడ్‌లో ప్రయోగాత్మక సినిమాలొస్తున్నాయి. కానీ మనం ఎందుకు ఆ దిశగా ఆలోచించలేకపోతున్నామంటారు? సుకుమార్: ప్రయోగం అనేది చిన్న సినిమాలతోనే చేయగలం. తమిళంలో జరుగుతోంది అదే. బాలీవుడ్ మార్కెట్ పెద్దది కావడంతో అక్కడ పెద్దసినిమాల ద్వారా కూడా ప్రయోగాలు చేస్తున్నారు. కానీ తెలుగులో ఆ పరిస్థితి లేదు. అంతెందుకు... నేను ‘జగడం’ తీశాను. అది నేను రియల్‌గా చూసిన సంఘటనల ఆధారంగా తయారు చేసుకున్న కథ. ‘సమాజానికి ఉపయోగపడే కథ కదా... ఆడుతుందిలే’ అనుకున్నా. కానీ నా అంచనాలు తారుమారయ్యాయి. ‘జగడం’ ఆడితే... అలాంటి ప్రయోగాలే ఇంకొన్ని వచ్చేవి. ఏది ఏమైనా ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటేనే ప్రయోగాలు చేయగలం. సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారు కదా! మీ నుంచి అలాంటి సినిమాలు ఆశించొచ్చా? సుకుమార్: కచ్చితంగా... అలాంటివి చేయడం కోసమే ఈ ప్రొడక్షన్. రాజమౌళి లాంటి దర్శకుడు... సుకుమార్ మాస్ సినిమాలు తీస్తే... నాలాంటి వాళ్లు పక్కకు తప్పుకోవాల్సిందే అన్నారు. ఆయన అలా అనడం మీకెలా అనిపించింది? సుకుమార్: కేవలం అది రాజమౌళిగారి అభిమానం. ఆయన అలా మాట్లాడటం నా బాధ్యతను పెంచింది. ఆయన ప్రశంస నాకు నేషనల్ అవార్డ్‌తో సమానం. అన్ని జానర్లూ టచ్ చేయగలిగిన మీరు... ఎప్పుడూ ప్రేమకథలే తీస్తారేం? సుకుమార్: నాకు చేతనైంది నేను తీస్తున్నాను. ఒకవేళ వేరే జానర్లో సినిమా తీయాలని నాకు అనిపించినా... నా దగ్గరకొచ్చే నిర్మాతలు ఒప్పుకోవడం లేదు. వాళ్లు ప్రేమకథల్నే అడుగుతున్నారు. నేనేం చేసేది! రాబోతున్న ‘1’ నా గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. మీరు ఎవరి మాటా వినని సీతయ్య అని అంటారు. నిజమేనా? సుకుమార్: అదేంలేదు. ఎవర్నీ ఇబ్బంది పెట్టకూడదు, బాధ పెట్టకూడదు అని అందరి మాటా వింటాను. కానీ, అందులో నాకు నచ్చిందే తీసుకుంటాను. నాకు ఫైనల్ అవుట్‌పుట్ ముఖ్యం. దర్శకునిగా మీకు డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? సుకుమార్: థ్రిల్లర్ తీయాలని ఉంది. థ్లిల్లర్, సైన్స్‌ఫిక్షన్ సినిమాలను ప్రపంచం మొత్తం చూస్తుంది. వాటికి హద్దులుండవ్. ఉదాహరణకు ‘ఈగ’. అందుకే ఫ్యూచర్లో ఓ థ్రిల్లర్ సినిమా తీస్తా. వచ్చే ఏడాదైనా మీ నుంచి ఓ రెండు సినిమాలు ఆశించొచ్చా? సుకుమార్: చెప్పాను కదండీ... నా చేతిలో ఏమీ ఉండదు. నాకు త్వరగా తీయాలనే ఉంటుంది. కానీ... పరిస్థితులు సహకరించవు. మీరు పుస్తకాలు బాగా చదువుతారనుకుంటా? సుకుమార్: ఒకప్పుడు బాగా చదివేవాణ్ణి. దర్శకుణ్ణి అయ్యాక.. ఇన్నాళ్లలో ఓ ఆయిదారు పుస్తకాలు చదివుంటా. ఇష్టమైన రచయితలు? సుకుమార్: చలం, యండమూరి వీరేంద్రనాథ్. ఒక సినీ దర్శక, రచయితగా మీకు ఇష్టమైన దర్శక, రచయితలు ఎవరు? సుకుమార్: జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, త్రివిక్రమ్. వారి ప్రభావం కాస్త్త నాపై ఉంది. సినిమా, సాహిత్యం... వీటి తర్వాత మీరు బాగా ఇష్టపడేది? సుకుమార్: గేమ్స్.... అందులోనూ క్రీజ్‌లో సచిన్ ఉన్నాడంటే... ఇక పనులన్నీ అటకెక్కేయాల్సిందే. నా జీవితంలోని చాలా సమయాన్ని సచినే లాగేసుకున్నాడు. ఎస్పీ బాలుగారి విషయంలో కూడా అంతే.. ఆయన పాటల్ని మనం చిన్నప్పట్నుంచీ వింటూ పెరిగాం. పాట వినడానికి మనం కేటాయించేది అయిదు నిమిషాలు. అంటే... మన అయిదు నిమిషాలు బాలుగారు తీసేసుకున్నట్లేగా. అలా సచిన్ నా జీవితంలో చాలా సమయాన్ని తీసేసుకున్నాడు. ప్రపంచం మొత్తం తిరిగి ఉంటారు కదా! ఇష్టమైన దేశం? సుకుమార్: అంత ఇష్టపడే దేశం ఏమీ లేదండీ. ఆ క్షణంలో ఎంజాయ్ చేస్తానంతే. ఇష్టపడే దేశం అంటే ఇండియానే. ఎలాంటి ఫుడ్‌ని ఇష్టపడతారు? సుకుమార్: ఆరేళ్లవయసులోనే నాన్‌వెజ్ తినడం మానేశా. మళ్లీ దేవిశ్రీ ప్రసాద్ కారణంగా నాన్‌వెజ్ అలవాటైంది. తను కేఎఫ్‌సీ చికెన్ బాగా తింటాడు. నాక్కూడా అలవాటు చేశాడు. ఈ మూడ్నాలుగేళ్ల నుంచే కాస్త ఎక్కువగా తింటున్నా. ‘100%లవ్’లో తమన్నా పాత్రకు దేవిశ్రీనే ప్రేరణ అన్నమాట. పాలిటిక్స్... ఫాలో అవుతారా? సుకుమార్: ఇండస్ట్రీకి రాకముందు బాగా ఫాలో అయ్యేవాణ్ణి. పేపర్లు కూడా బాగా చదివేవాణ్ణి. ఎమ్మెల్యే, మంత్రుల పేర్లు కూడా గుర్తుండేవి. ఇప్పుడు మాత్రం సినిమా తప్ప వేరే ఏమీ గుర్తు రావడంలా. సరే మీ ఫ్యామిలీ గురించి కూడా చెప్పేయండి... ఓ పనైపోతుంది? సుకుమార్: మా ఆవిడ పేరు హంసిని. మాకు ఓ పాప, ఓ బాబు. పాపకు నాలుగేళ్లు. పేరు సుకృతివేణి. ప్లే స్కూల్లో చేర్చాం. బాబుకు రెండేళ్లు. పేరు సుక్రాంత్. వాణ్ణి ఇంకా స్కూల్లో వేయలేదు. మా ఇద్దరు పిల్లలకు నా పేరు కలిసొచ్చేలా సుకృతి, సుక్రాంత్ అని పేర్లు పెట్టుకుంది నా భార్య. నేనంటే అంత ఇష్టం తనకు. ‘100% లవ్’ అన్నమాట(నవ్వుతూ) - బుర్రా నరసింహ తెలుగు సినిమాకు స్క్రిప్ట్ రాయడం కంటే... హాలీవుడ్ సినిమాకు స్క్రిప్ట్ రాయడం తేలిక. హాలీవుడ్ సినిమా స్క్రిప్ట్ స్ట్రయిట్‌గా ఒకే ట్రాక్‌పై సాగిపోతుంది. కానీ.. తెలుగు సినిమా స్క్రిప్ట్ అలా కాదు. మధ్య మధ్యలో పాటలుంటాయి. ఆ పాటలకు తగ్గ సన్నివేశాలను ముందు డిజైన్ చేయాలి. ఆ పాట మూలంగా కథ నుంచి బయటకొచ్చిన ప్రేక్షకుణ్ణి మళ్లీ కథలోకి పంపాలి. అలాగే ఫైట్లు. ఆ ఫైట్ కారణంగా కథలో ఏర్పడే డిస్ట్రబెన్స్ని కూడా సరిచేయాలి. ఎప్పటికప్పుడు స్క్రీన్‌ప్లేని ఛేంజ్ చేస్తూ పోవాలి. నా ఉద్దేశంలో కొన్నాళ్ల తర్వాత ఈ పద్ధతి పూర్తిగా నశించిపోతుంది. ఫ్యూచర్లో డ్యూయెట్లంటూ సినిమాల్లో ఉండవ్. కేవలం కథను నడిపించే మాంటేజస్ సాంగులే ఉంటాయి. బాలీవుడ్లో ఆ పద్ధతి ఇప్పుడిప్పుడే మొదలైంది కూడా. ***************** చిన్నప్పట్నుంచీ నేను సుఖపడింది లేదు. ఆ మాటకొస్తే... ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నాను. జీవితంలోని ప్రతి మలుపులోనూ నన్ను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. అయితే... ఆ కష్టమే నాకు ఇష్టం. నా దృష్టిలో తెలివైన విద్యార్థి ఎప్పుడూ మంచి గురువు కాలేడు. బ్యాడ్ స్టూడెంటే గుడ్ లెక్చరర్ అవగలడు. ఎందుకంటే అనుభవాలే వాడికి పాఠాలవుతాయి కాబట్టి, తానెక్కడ తప్పు చేశాడో, ఎక్కడ కష్టంగా ఫీలయ్యాడో వాడికి బాగా తెలుసుకాబట్టి. ఇది నేను స్వానుభవంతో చెబుతున్న మాట. చలం రచనలన్నీ నాటి పరిస్థితుల్ని బట్టే సాగాయి. కాబట్టి అప్పట్లో ఆయన రాసినవన్నీ అక్షరసత్యాలే. ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. ఏది ఏమైనా సాహిత్యలోకంలో చలం ఓ ఆణిముత్యం. ఎంతోమంది చలం సాహిత్యానికి బానిసలు. దేవుణ్ణి నమ్ముతాను... ప్రతిరోజూ దణ్ణం పెట్టుకుంటాను కూడా. అయితే... అది భక్తితో కాదు. భయంతో. ఆయన ఉన్నాడేమో అని భయం... ఒకవేళ ఆయన ఉంటే మనల్ని చూస్తూ ఉంటాడేమోనన్న భయం. నాకు మంచి జరగాలని మాత్రం దేవుణ్ణి రోజూ కోరుకుంటాను.