ప్రేమను బతికిద్దామా! చావును ప్రేమిద్దామా? | Special Article About Love Storys | Sakshi
Sakshi News home page

ప్రేమను బతికిద్దామా! చావును ప్రేమిద్దామా?

Published Mon, Jul 22 2019 8:03 AM | Last Updated on Mon, Jul 22 2019 8:04 AM

Special Article About Love Storys - Sakshi

నీతో గడిపిన ప్రతి నిమిషమూ మధురమే. నీవు వెంట ఉంటే ప్రతిదీ విజయమే. నిన్ను చూస్తే చాలు మనసు నిండా ఆనందమే. నీవు లేని మరుక్షణం నాకు మరణమే.. ఇది ప్రేమికుల భాష. ఆయుష్మాన్‌ భవ అంటూ దీవించిన తల్లిదండ్రులు ఆ సమయంలో గుర్తుకు రారు. ఉజ్వల భవిష్యత్తు కోసం తపన పడిన అమ్మానాన్నల కష్టం కంటికి కనిపించదు. చదువుల తల్లి ఒడిలో పిల్లలు ఒదిగి ఒక్కో మెట్టు పైకి ఎగబాకుతుంటే తల్లిదండ్రుల కళ్లు ఆనందంతో వర్షిస్తుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే అవి ఎడారిలా మారిన తమ బతుకుల్లో ఒయాసిస్సులా మారబోతున్న బిడ్డల ఉజ్వల భవిష్యత్తును తలుచుకుని కురిసే ఆనందబాష్పాలు. అయితే ప్రేమ పేరుతో బిడ్డలు అర్ధంతరంగా తనువు చాలిస్తుంటే అవి కాస్తా కన్నీటి జలపాతాలవుతున్నాయి. మనసు ఒక్క చోట స్థిమితంగా నిలవదు. బిడ్డల ఉజ్వల భవిష్యత్తుకు తాము కొవ్వొత్తిలా ఎలా కరిగామో.. బిడ్డలు ఎలా దూరమయ్యారో.. ఎందుకు తమను మరిచారో..  మలివయసులో తోడుంటారనుకుంటే ఒంటరిని చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందో.. తలుచుకుంటే అన్నీ జవాబు లేని ప్రశ్నలే. కాలం విషాద గీతాన్ని ఆలపిస్తుంటే సమాధానం దొరికినట్లే దొరికి చివరికది ప్రశ్నగానే మిగిలిపోతోంది. ప్రేమంటే ఇదేనా? అన్నింటికీ పరిష్కారం చావేనా?  – అనంతపురం కల్చరల్‌/ఎస్కేయూ/న్యూసిటీ 

ఏడాది క్రితం అనంతపురం రూరల్‌ మండలానికి చెందిన 19 ఏళ్ల కుర్రాడు ప్రేమ మోజులో పడి ప్రాణాలు తీసుకున్నాడు. సాధారణ కుటుంబమే అయినా.. చిన్నప్పటి నుంచి అతన్ని తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచారు. చెన్నైలోని ఓ ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో చేర్పించారు. ప్రేమ మోజులో పడి వ్యసనాలకు బానిసై, చివరకు తల్లిదండ్రులపై దాడి చేసే స్థాయికి దిగజారాడు. మానసికంగా కృంగిపోయి చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు.  

యాడికి మండలం నగరూరు గ్రామంలో తమ ప్రేమను కుటుంబ పెద్దలు అంగీకరించలేదంటూ ఓ జంట ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల యాడికి మండలంలో 14 ఆత్మహత్య కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. యువత మానసిక స్థితి ఎంత బలహీనంగా ఉందో దీనిని బట్టి అవగతమవుతోంది.  

పెదపప్పూరు మండలం జూటూరు గ్రామానికి చెందిన రమేష్‌బాబు (అనంతపురం వన్‌టౌన్‌ కానిస్టేబుల్‌), సవిత ఏళ్ల తరబడి ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబ సభ్యులు ప్రేమ పెళ్లికి అంగీకరించలేదు. రమేష్‌బాబుకు వేరే అమ్మాయితో పెళ్లి చేయాలని చూశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఇద్దరూ కడప జిల్లా వల్లూరు మండలం గంగాయపల్లి రైల్వే ట్రాక్‌పై ఈ ఏడాది మే 21న ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.  

మానసిక ఉల్లాసం ఏదీ? 
రోజూ గంట పాటు వ్యాయామం, ఏవైనా క్రీడలు ఉంటే మానసిక ఉల్లాసం ఉంటుంది. ఇది వైద్య నిపుణులు, మన పూర్వీకులు చెప్పిన మాట. కానీ ప్రస్తుత రోజుల్లో అటువంటి పరిస్థితి లేదు. కేవలం సెల్‌ఫోన్‌తోనే ఆడుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తున్నారు. రోజూ గంట పాటు వివిధ రకాల క్రీడలు, డ్యాన్స్, యుద్ధ క్రీడలు వంటివి నేర్పించాలి. దీని ద్వారా మానసిక పరిపక్వత చెందడంతో పాటు మనిషి శారీరంగా, మానసికంగా మరింత దృఢంగా మారే అవకాశం ఉంది.  

కౌమారం..  
ఉత్తర కౌమార దశ 18–21 వరకు ఉంటుంది. వాస్తవానికి శారీరక అవయవాలు ఈ దశలోనే వేగంగా మార్పు చెందుతాయి. బరువు, ఎత్తు, ఆకారం గరిష్టంగా అభివృద్ధి చెందుతుంది. లైంగిక అవయవాల పెరుగుదల అధికంగా ఉంది. బాలికల్లో అండోత్పత్తి, బాలురలో శుక్రకణాల ఉత్పత్తి ప్రారంభం ఇక్కడే అవుతుంది. ఇలాంటి దశలోనే శారీరక మార్పులను అవగాహన చేసుకోలేక ఆందోళన, ఉద్రిక్తతకు గురై ఒత్తిడికి లోనవుతుంటారు. అలాగే ఈ దశలో అభద్రతాభావమూ ఎక్కువగా ఉంటుంది. జీవితంపై సందిగ్ధత ఉంటుంది. 

ఊహల్లో బతకడం
ఎక్కువగా తార్కికంగా ఆలోచించడం, వివేచన, విమర్శనాత్మకధోరణి కౌమర దశలో ఎక్కువగా ఉంటుంది. ప్రతి అంశాన్ని వ్యతిరేకించే విమర్శనాత్మకధోరణి అలవడుతుంది. పగటి కలలు కంటూ ఊహాజనితమైన జీవితాన్ని గడుపుతారు. గుర్తింపు కోసం.. ఇతర లైంగిక వర్గాలను ఆకట్టుకునే విధంగా వ్యవహరిస్తారు. బాలురు,, బాలికల పట్ల గుర్తింపు కోసం తాపత్రపడతారు. వస్త్రధారణ, అలంకరణపై శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. 

ఉద్వేగ లక్షణాలు 
కౌమార దశలో ఉద్వేగ లక్షణాలు తీవ్రస్థాయిలో కనిపిస్తాయి. క్షణానికి ఒక తరహాగా ప్రవర్తించే నైజం ఉంటుంది. మనసు నిలకడగా ఉండదు. ఆతృత కూడా ఎక్కువ. ఎవరైనా విమర్శిస్తే అధికంగా ప్రతిస్పందిస్తారు. తన కోరికలు నెరవేరనపుడు ఏర్పడే ఒడిదొడుకులను తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేస్తారు. ఒక ఉపాధ్యాయుడిని గానీ, సినీతారలను గానీ, క్రికెటర్లును గానీ, రాజకీయ నాయకుల గానీ ఎక్కువగా ఆరాధిస్తారు.  

సామాజిక లక్షణాలు 
కౌమార దశలోనే సామాజిక స్పృహ అతివేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇతరుల చేత అభినందన, గుర్తింపు కోరుకుంటారు. వ్యక్తిగతమైన విలువల కంటే సామాజికమైన విలువలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. సమస్యలను స్నేహ బృందంతో నిస్సందేహంగా, నిస్సంకోచంగా, నిర్భయంగా ప్రకటిస్తారు. స్నేహ బృందాన్ని విమర్శించే తల్లిదండ్రులను కూడా ఎదిరిస్తారు. స్నేహానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు.  

శారీరక మార్పుల వల్ల వచ్చే సమస్యలు 
అవయవాల్లో మార్పులు రావడం.. బాలికల్లో రుతుస్రావం, బాలురలో ఇంద్రియస్కలనం సంభవించడం వల్ల ఆందోళన మొదలవుతుంది. ప్రతి ఒక్క శారీరక మార్పును బాలికలు ఇతరులతో పోల్చికుంటారు. శారీరక మార్పు అధికమైన, తక్కువగా ఉన్నా.. వెంటనే ఆత్మన్యూనత భావానికి లోనవుతారు. ఈ దశలో మార్పులు సహజమని, అనివార్యమని, బిడియ పడాల్సిన అవసరం లేదని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ధైర్యం చెప్పి వాళ్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి.  

ఉద్వేగ సమస్యలు 
భయాందోళనలు, పెద్దల విమర్శల వల్ల ఏర్పడే వ్యాకులత, భవిష్యత్‌ పట్ల ఆందోళన, బాల్యాన్ని కోల్పోతున్నామన్న ఆలోచన, వాస్తవ  అంశాలకు, ఊహాజనిత అంశాల మధ్య పొంతన లేకపోవడం కౌమార దశలో ఉద్వేగానికి కారణమవుతాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కౌమార దశలో ఉన్న విద్యార్థులకు వాళ్ల వ్యక్తిత్వానికి విలువనిచ్చి స్నేహ పూర్వకంగా వారితో వ్యవహరించి వాస్తవికతను ఆమోదింపచేసేలా వ్యవరించాలి.  

అవగాహన లేక
యుక్త వయసు గల వారికి లైంగిక విజ్ఞానం పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల కలత మిగిలిపోతుంది. ఇది అశ్లీల సాహిత్యాన్ని చదవడం, లైంగిక వాంఛలు కలిగే వ్యతిరేక లింగ వర్గీయుల పట్ల ఆకర్షణ ఏర్పడి దురలవాట్లకు లోనై .. లైంగిక నేరాలకు పాల్పడేందుకు కారణమవుతుంది. ఈ సమస్యను నివారించడానికి లైంగిక విద్యను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టి శాస్త్రపరంగా సంబంధిత సమాచారాన్ని వివరించేందుకు నిష్ణాతులైన మనో విజ్ఞాన (సైకాలజీ)శాస్త్రం పట్ల అవగాహన కలిగిన ఉపాధ్యాయులతో శిక్షణ ఇప్పించాలి. తద్వారా లైంగిక దురలవాట్లను నిరోధించవచ్చు.  

సామాజిక సమస్యలు 
సమాజంలో ఆచార వ్యవహారాలు, సంప్రదాయలు, నమ్మకాలు, కట్టుబాట్లకు విరుద్ధంగా పాఠశాలలో చెప్పే అంశాలు.. ఇంటిలో గమనించే అంశాలకు పొంతన కుదరక కౌమార దశలో ద్వంద వైఖరిని కలిగి ఉంటారు. ఈ దశలో ఉపాధ్యాయుడు నైతిక విద్య బోధనతో విద్యార్థుల్లో మానవతా విలువలను పెంపొందించాలి. సామాజిక సేవా కార్యక్రమాల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేయడం వల్ల సమాజం పట్ల అవగాహన ఏర్పడుతుంది.   

పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేక 
యాడికిలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన యువతీ, యువకుడు రెండేళ్ల క్రితం ప్రేమించుకున్నారు. ఇద్దరివీ వేర్వేరు కులాలు. వీరికి ఇరువైపులా పెద్దలు అంగీకరించలేదు. యువకుడిని తల్లిదండ్రులు ముదిగుబ్బలో ఉన్న తమ కూతురి వద్దకు పంపించారు. యువతి తల్లిదండ్రులు ఆమెకు యాడికిలో పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని అమ్మాయి.. ముదిగుబ్బకు వెళ్లి ప్రియుడితో కలిసింది. అనంతరం ఇద్దరూ రైలు పట్టాలపై శవమై తేలారు. ఈ ఘటన అప్పట్లో ముదిగుబ్బ పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది.     – యాడికి 

జీవితాన్ని వరంగా భావించాలి 
సిరోటోనిన్‌ అనే జీవరసాయన పదార్థ లోపం వల్ల ఆత్మహత్యలకు కారణమవుతోంది. విద్యార్థి దశ నుంచి పిల్లల మానసిక స్థితిని సైన్స్‌ బోధించే ఉపాధ్యాయులు గ్రహించాలి. వారిలో ఆధ్యాత్మిక పరమైన, కుటుంబపరమైన ఆలోచనలు నింపితే ఎట్టి పరిస్థితుల్లోనూ క్షణికావేశం అనేది ఉండదు. జీవితం అనేది ఓ వరంగా ప్రతి ఒక్కరూ భావించాలి.  
– రవికిరణ్, మానసిక వైద్యనిపుణుడు, అనంతపురం 

పిల్లల్లో నైతికతను పెంచేలేని దారుణ స్ధితిలోకి మారుతున్న కాలం నెట్టేస్తోంది. దీంతో లక్ష్యం నిర్దేశించుకోలేక యువత బలహీన మనస్ధత్వాలతో కొట్టుమిట్టాడుతోంది. ఆకర్షణనే ప్రేమ అని నమ్ముతుండడం వల్ల అనేక అనర్ధాలు చోటు చేసుకుంటున్నాయి. ర్యాంకులు, మార్కులు మాత్రమే చదువులు అని బలవంతంగా పిల్లల మనోభావాలపై రుద్దుతున్న కార్పొరేట్‌ సంస్కృతికి, పాఠశాలల యాజమాన్యాల వల్ల తల్లిదండ్రులకు వారు దూరమైపోతున్నారు. ఆత్మవిశ్వాసంతో, ఆనందంగా నిండు నూరేళ్లు బతకాల్సిన యువత ప్రేమ పేరుతో వంచన చేసుకుంటున్నారు. గంపెడు ఆశలను తమపై పెట్టుకున్న తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలను కాదని చావును ఆహ్వానిస్తూ కడుపుకోత మిగిలిస్తున్నారు. దీనికంతటికి కారణం జీవితం పట్ల నిబద్ధత నిర్దేశించలేని పస లేని చదువులదేనని నిపుణులు అంటున్నారు.  

పెడదోవ పట్టిస్తున్న సోషల్‌ మీడియా  
విజ్ఞాన శాస్త్రం మానవాళికి అందించిన ఎన్నో వరాలు తిరోగమన దిశలో ప్రయాణిస్తూ శాపాలుగా మారుతున్నాయి. ఇలాంటి వాటిలో వాట్సాప్, ఫేస్‌బుక్, ఇంటర్నెట్, యూట్యూబు ముందు వరుసలో ఉన్నాయి. ప్రపంచమంతా కళ్ల ముందుకొచ్చేయడంతో అన్నిటినీ తొందరగా చూసేయాలన్న తపన అందరిలోనూ పెరిగిపోతోంది. ప్రధానంగా ఆధునాతన టెక్నాలజీని సరైన విధానంలో వినియోగించుకోవడంలో యువత విఫలమైంది. ఫలితంగా పచ్చి సోమరులుగా మారుతున్నారు. తరగతి గదుల్లో పాఠాలు వల్లెవేయడం కన్నా.. వాట్సాప్, ఫేస్‌బుక్కుల్లో చాటింగ్‌ చేస్తున్న వారి సంఖ్య మరీ ఎక్కువగా ఉండిపోతోంది. నీలిచిత్రాలు, ఏ మాత్రం ఉపయోగపడని గాసిప్స్‌ యువతను పెడదోవ పట్టిస్తున్నాయి. ఇటీవల వచ్చిన టిక్‌టాక్‌ యాప్‌  దాదాపు వందల సంఖ్యలో కుటుంబాల మధ్య దూరం పెంచేసింది. కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడిన సంఘటనలూ ఉన్నాయి.  

లోపించిన మానసిక సమతుల్యత  
మారుతున్న జీవన విధానంలో ఎదురవుతున్న సంఘర్షణలు, ఒత్తిళ్లు..  విద్యార్థులు, యువతను ఆత్మహత్యల వైపుగా ప్రేరేపిస్తున్నాయి. విద్య మనిషి సమగ్ర వికాసానికి ఉపయోగపడే సాధనంగానే పెద్దలు తీర్చిదిద్దారు. అయితే ఈరోజుల్లో చదువు ఒక వ్యాపార వస్తువుగా, ఆదాయ వనరుగా మారిపోయింది. పోటీ ప్రపంచంలో గెలవడానికి శక్తికి మించి బట్టీ పట్టి నెగ్గడమే తప్ప అవగాహన చేసుకునే సామర్ధ్యం తగ్గిపోయింది. ఫలితంగా విద్యార్థుల మానసిక సమతుల్యత దెబ్బతిని, అర్ధంతరంగా బతుకులను ముగించుకునేందుకు కారణమవుతోంది. సినిమాలు, మీడియాల ప్రభావంతో యువత అవగాహన లేని ప్రేమలో పడి చాలా సమయం, జీవితం వృధా చేసుకుంటున్నారు. పెద్దలు నిశ్చయించినది ఇష్టపడకపోయినా సరైన వ్యక్తిని ఎంపిక చేసుకోవడంలో పరిపక్వత వస్తే జీవిత లక్ష్యం కొనసాగుతుంది. ఈ విచక్షణ జ్ఞానాన్ని  విద్యాలయాలలో నేర్పాలి. దురదృష్టవశాత్తు అది లేకపోవడంతోనే అనర్ధాలు చోటు చేసుకుంటున్నాయని నిపుణులు అంటున్నారు.  

ఒంటరిగా అదృశ్యం...జంటగా ప్రత్యక్షం 
ఒంటరిగా అదృశ్యమైన యువతీ యువకులు ప్రేమించిన వారితో పెళ్లాడి కొద్ది రోజులకే జంటలుగా పోలీస్టేషన్‌కు వస్తున్నారు. ఈ పరిస్థితి యాడికిలో ఎక్కువగా ఉంటోంది. ఒకవైపు ఇరువురి బంధువులూ వారి కోసం వెతుకుతుంటే మరోవైపు ప్రేమ వివాహాలు చేసుకుని  కుటుంబసభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ నేరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి తాడిపత్రి మండలంలో ఐదు కేసులు, యాడికి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మూడు కేసులు ఈ తరహాలోనేవి కావడం గమనార్హం. మార్చి నుంచి జూలై మధ్యలో వేసవి సెలవుల్లోనే ఈ తరహా కేసులు నమోదవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.  – యాడికి 

పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలి 
పామిడి రూరల్‌ సర్కిల్‌లోని యాడికి పోలీస్టేషన్‌ పరిధిలో ఈ ఏడాది మూడు మిస్సింగ్‌ కేసులు కాగా వాటిని  నమోదు చేసి పరిష్కరించాం. ముఖ్యంగా 18 సంవత్సరాలు పూర్తి అయిన వారికి మాత్రమే వివాహాలు చేయాలి. తల్లిదండ్రులు నిరంతరం వారి పిల్లలను గమనిస్తూ ఉండాలి. తమ కూతురు సెల్‌ఫోన్‌తో ఎవరితో మాట్లాడుతోంది, కాలేజీ నుంచి ఎన్ని గంటలకు ఇంటికి తిరిగి వస్తుందో గుర్తించాలి. విద్యార్థినులు కూడా ఆకర్షణకు లోను కాకుండా తల్లిదండ్రులు పడే శ్రమను తెలుసుకోవాలి.  
– రవిశంకరరెడ్డి, సీఐ, పామిడి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ 

మనోవికాస శిక్షణ అవసరం 
విద్యార్థుల్లో విశ్వాసాన్ని నింపే ప్రయత్నాన్ని క్లాస్‌రూం వేదికగా చేపట్టాం. సమాజంలో కష్టాలను నెగ్గుకొచ్చిన వారి జీవిత చరిత్రలను విద్యార్థులతో చదివించాలి. సమస్యల నుంచి బయట పడే శక్తి పొందే అవకాశం కల్పించేలా సాహిత్య అద్యయనం, శతకాలు, వీరుల కథలు చదివించాలి.  ముఖ్యంగా ఆటలు ఆడించడం ద్వారా ఓటమిని స్వీకరించే గుణాన్ని అలవాటు చేయాలి. ఏకాకిగా సమాజంతో ఇమడని స్వభావం ఉన్న విద్యార్ధులను గుర్తించి వారికి ప్రత్యేక మార్గనిర్దేశం చేయాలి. ప్రతి పాఠశాలకు ఒక మనోవికాస శిక్షకుడు తప్పక ఉండాలి. విద్యార్ధి దశలోనే  ఏ సమస్య ఎదురైనా ఎలా నెగ్గుకొని రావాలో చెప్పే శిక్షణ కేంద్రాలుగా పాఠశాలలు నిలిచినప్పుడే ఆత్మహత్యలు, ప్రేమ గోలలు ఉండవు.  
– ఎ.అరుణకుమారి, సావిత్రీబాయిపూలే అవార్డు గ్రహీత, అగళి మండలం  

ఆనంద వేదిక 
ఇటీవల అన్ని తరహా పాఠశాలల్లో ఆనంద వేదిక అనే కొత్త కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రారంభించింది. విద్యార్థులకు ఒత్తిడి లేని, ఆనందకరమైన జీవన విధానంపై అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమం కొనసాగాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఉపాధ్యాయులందరూ సహకరిస్తే ఇది విజయవంతమవుతుందనేది అక్షర సత్యం. విద్యార్థుల్లో గొప్ప మార్పు తేవడానికి ఆనంద వేదిక ఉండాలని కొందరు ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.   

ప్రేమ అంటేనే ధైర్యం 
ప్రేమ వివాహాలు సమాజంలో సమానత్వాన్ని తీసుకురావడానికి ఉపయోగపడగాయి. అయితే అన్ని ప్రేమలు విజయాన్ని సాధించలేవు. పెద్దల్ని ఒప్పించేందుకు ప్రయత్నం చేయాలి. కొన్ని సందర్భాల్లో ఒప్పుకోకపోవచ్చు. ఇలాంటి సమయంలోనే ప్రేమను నిలబెట్టుకోవాలి. పిరికితనంతో చావకూడదు. ప్రేమ అంటే ధైర్యం. చచ్చే ధైర్యాన్ని బతకడంలో చూపితే కచ్చితంగా ఆ ప్రేమ విజయతీరాలను చేరుతుంది. నేనూ కులాంతర వివాహం చేసుకున్నా. జీవితంలో ఒడిదొడుకులు ఎన్నో ఎదుర్కొన్నా. వాటిని అధిగమించి పెద్దలను ప్రసన్నం చేసుకున్నాం.  
– డాక్టర్‌ బత్తల అశోక్‌ కుమార్, సోషల్‌ ఎక్స్‌క్లూజివ్‌ అండ్‌ ఇన్‌క్లూజన్‌ విభాగం, ఎస్కేయూ  

మానసిక పరిపక్వత ఉండాలి 
మానసిక పరిపక్వత లేక చిన్న వయసులోనే ప్రేమలో పడుతున్నారు. ఏదైనా జరిగితే దానిని తట్టుకునే ఆత్మవిశ్వాసం లోపిస్తోంది. విద్యార్థి దశలోనే ఆత్మ విశ్వాసం పెంపొందేలా విద్యా ప్రణాళికలో సమూలమైన మార్పులు రావాలి. చరిత్రలో వీరుల విజయగాథలను విద్యార్థులు బాగా చదవాలి. నైతిక విలువలు పెంపొందే బోధన, అభ్యసనం ఉండాలి. ప్రతి పాఠశాల, కళాశాలలోనూ మనో విజ్ఞాన శాస్త్రం అందించే అధ్యాపకులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఉండాలి.   –ప్రొఫెసర్‌ కేవీ రమణా రెడ్డి, ఎస్కేయూ. 

ఫ్యాషన్‌ అయిపోయింది 
ప్రేమ అనేది ఫ్యాషన్‌గా మారిపోయింది. సినిమాలు, సీరియళ్లు, స్మార్ట్‌ సెల్‌ఫోన్లను అతిగా చూడడం వల్ల బానిసలవడంతో పాటు మానసిక దృఢత్వం కోల్పోతున్నారు. సరైన అవగాహన లేకపోవడంతో ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు.  ప్రేమ తప్పు కాదు. జీవితంలో వారి కాళ్ల మీద వారు నిలబడి ప్రేమను జయించుకోవాలి.     – పద్మజ, మహిళా న్యాయవాది, అనంతపురం  

నిలకడలేని మనసులు 
నిలకడలేని మనసులు కల్గిన వారే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చిన్నప్పటి నుంచి విలువలు లేకుండా పెరగడమే ఇందుకు కారణం. ఏది మంచి, చెడు, చిన్నాపెద్దా అనే విషయాలు వారికి తెలియాలి. సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచాలి. ఇందులో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. అతి గారబంతో వారు ఏమి అడిగినా వెంటనే తీసిచ్చి వారిలోని పరిక్వతను చంపేస్తున్నారు. పెద్దయ్యాక ఇక తల్లిదండ్రుల మాట ఏం వింటారు? ప్రేమించడం చచ్చిపోవడానికి కాదు.     
– ప్రొఫెసర్‌ డాక్టర్‌ యండ్లూరి ప్రభాకర్, అనంతపురం   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement