ఓ ఊరిక‌థ‌.. సంక్రాంతి అంటే బెదరు! | - | Sakshi
Sakshi News home page

ఓ ఊరిక‌థ‌.. సంక్రాంతి అంటే బెదరు!

Published Thu, Jan 9 2025 12:35 AM | Last Updated on Fri, Jan 10 2025 5:44 PM

-

ఆత్మకూరు మండలం పి.కొత్తపల్లిలో వింత ఆచారం 

శతాబ్దాలుగా పండుగ సంబరాలకు దూరంగా బోదపాటి వంశీకులు

సంక్రాంతి పండగ అంటే పల్లెల్లో ఎంతో సందడి ఉంటుంది. జనవరి నెల మొదలు కాగానే అన్ని గ్రామాల్లో ఈ పండుగ వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రతి రోజూ ఇంటి ముందు ముగ్గులు వేయడం, హరిదాసుల సంకీర్తనలు, అందరూ కలసి ఒక చోట చేరి ఆడిపాడి సందడి చేయడం, ముగ్గుల పోటీలు నిర్వహించడం, వివిధ క్రీడా పోటీలు లాంటి కార్యక్రమాలు ఎంతో సందడిగా జరుగుతుంటాయి. అయితే ఇందుకు భిన్నంగా కొన్ని శతాబ్దాలుగా సంక్రాంతి పండుగకు ఓ గ్రామంలో సగానికి పైగా ప్రజలు దూరంగా ఉంటున్నారు. ఇందుకు గల కారణాలు... విశేషాలు తెలుసుకోవాలంటే అనంతపురం జిల్లా పి.కొత్తపల్లి గ్రామాన్ని సందర్శించి తీరాల్సిందే.               
 – ఆత్మకూరు: 

అనంత‌పురం జిల్లా ఆత్మకూరు నుంచి కళ్యాణదుర్గం వెళ్లే మార్గంలో ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే జాతీయ రహదారికి ఓ కిలోమీటరు దూరంలో పి.కొత్తపల్లి గ్రామం వస్తుంది. ఈ గ్రామంలో కమ్మ, బోయ, ఎస్సీ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. దాదాపు 300 గడపలున్న ఈ గ్రామ ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. వరి, చీనీ, వేరుశనగ, టమాట పంటల సాగుతో జీవనం సాగిస్తున్నారు. గ్రామం చుట్టూ ఎటు చూసినా పచ్చని పంట పొలాలు కనువిందు చేస్తుంటాయి. సమైక్య జీవనానికి, స్వశక్తికి, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపాలుగా ఈ గ్రామస్తులు నిలుస్తున్నారు.

అనాదిగా వస్తున్న ఆచారాన్ని గౌరవిస్తూ..
సంక్రాంతి పండుగ విషయంలో బోదపాటి వారి భయాందోళనకు కారణమూ లేకపోలేదు. ఇందుకు సంబంధించి ఓ పురాతన కథను నేటికీ పూర్వీకులు చెబుతున్నారు. శతాబ్దాల క్రితం సంక్రాంతి సరుకుల కొనుగోలు కోసమని గ్రామానికి చెందిన బోదపాటి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఆత్మకూరు సంతకు వచ్చారు. ఆ సమయంలో ఉన్నఫళంగా ఆయన కుప్పకూలి మృతి చెందాడు. ఇదేదో సాధారణ మృతిగానే అందరూ అప్పట్లో భావించారు. అయితే ఆ మరుసటి సంవత్సరం సంక్రాంతి పండుగ సరుకులు కొనుగోలు చేసేందుకు వచ్చిన బోదపాటి కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఇలా వరుసగా ఏటా సంక్రాంతి పండుగ చేయాలనే ఉద్దేశంతో సరుకులు కొనుగోలు చేసేందుకు వచ్చిన బోదపాటి కుటుంబంలోని ఎవరో ఒకరు మృత్యువాత పడుతుండడంతో ఒక్కసారిగా వారిలో ఆందోళన మొదలైంది. దీంతో సంక్రాంతి పండుగ జరుపుకోకూడదని బోదపాటి కుటుంబీకులు నిర్ణయించుకున్నారు. నాటి నుంచి నేటి వరకూ సంక్రాంతి పండుగకు బోదపాటి కుటుంబీకులు దూరంగా ఉంటూ వస్తున్నారు.

సంక్రాంతి అంటే బెదరు
హిందూ సంప్రదాయంలో వచ్చే ప్రతి పండుగనూ పి.కొత్తపల్లి వాసులు ఎంతో సంబరంగా జరుపుకుంటారు. అయితే సంక్రాంతి అంటే చాలు ఈ గ్రామంలో సగానికి పైగా జనాభా ఉన్న కమ్మ సామాజిక వర్గంలోని బోదపాటి వారు బెదిరిపోతుంటారు. సంక్రాంతి సందర్భంగా ప్రతి ఇంటి ముంగిట కనిపించే రంగవల్లులు వీరి ఇళ్ల ముందు కనిపించవు. గొబ్బెమ్మలు ఉండవు. పిండి వంటలు, నూతన వస్త్రాలకు దూరంగా ఉంటారు. ఇక గ్రామంలో జరిగే సంక్రాంతి సంబరాలకు సైతం బోదపాటి వారు దూరంగా ఉంటారు. రైతు కుటుంబంలో సాధారణంగా భోగి నాడు కనిపించే సందడి ఊసే ఉండదు. పశువులకు, పొలాల్లో నవధాన్యాలకు, ఇంట్లో పూజలు చేయరు. ఒక్క మాటలో చెప్పాలంటే సంక్రాంతి పండుగ నాడు కనీసం స్నానం చేయాలన్నా వీరు భయపడుతుంటారు.

నేను పుట్టినప్పటి నుంచి చూడలేదు
ప్రస్తుతం నాకు 45 సంవత్సరాలు. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ బోదపాటి వారు సంక్రాంతి పండుగను జరుపుకున్నది చూడలేదు. మా తాతల కాలం నుంచి కూడా ఇదే పద్ధతి కొనసాగుతూ వస్తోంది. ఒకవేళ బోదపాటి కుటుంబీకులు ఎవరైనా ధైర్యం చేసి పండుగ చేసేందుకు సిద్ధమైతే ఏదో ఒక ప్రమాదం బారిన పడుతున్నారు. దీంతో సంక్రాంతి నాడు ఇంట్లో పూజలు కూడా చేయం.
– గోపాల్‌, పి,కొత్తపల్లి, ఆత్మకూరు మండలం

పెద్దల ఆచారాలు గౌరవిస్తున్నాం
సంక్రాంతి పండుగ అంటే మా పల్లెల్లో అందరూ ఎంతో ఆనందంగా గడుపుతారు. కొత్త అల్లుళ్ల రాకతో ప్రతి ఇంట్లోనూ సందడిగా ఉంటుంది. కానీ, బోదపాటి వంశానికి చెందిన దాదాపు వంద కుటుంబాల వారు సంక్రాంతి పండుగ చేసుకోం. పెద్దల ఆచారాలు గౌరవిస్తూ ఇళ్ల ముందు ముగ్గులు వేయడం, ఇల్లు, వాకిలి శుభ్రం చేయడం ఇతర ఆచారాలు ఏవీ చేయం.
– రమాదేవి, పి,కొత్తపల్లి, ఆత్మకూరు మండలం

స్నానం కూడా చేయం
సంక్రాంతి అంటే అందరూ ఆనందంగా జరుపుకుంటారు. కానీ మా బోదపాటి వారు స్నానాలు కూడా చేయరు. పండుగ చేసుకుంటే ఏం జరుగుతుందో అనే భయం అందరిలోనూ ఉంది. దీంతో చాలా ఏళ్లుగా పండుగనాడు కూడా సాధారణ వంటకాలతోనే సరిపెట్టుకుంటాం.
– రాజప్ప, పి.కొత్తపల్లి, ఆత్మకూరు మండలం

No comments yet. Be the first to comment!
Add a comment
సంక్రాంతి పండగ అంటే పల్లెల్లో ఎంతో సందడి ఉంటుంది. 1
1/4

గోపాల్‌2
2/4

ర‌మాదేవి3
3/4

రాజ‌ప్ప‌4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement