
15, 18, 24.. ఈ మూడు సంవత్సరాల దశల్లో ప్రేమ ఎలా ఉంటుంది? ఆ ప్రేమల్లో గమ్మల్తైన సంగతులేంటి? ఈ ట్రాక్‌లో ఊహించని ఓ ప్రమాదం మొత్తం కథను ఎలా మలుపు తిప్పింది? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘15–18–24 లవ్ స్టోరీ’. నిఖిలేశ్వర్, సాహితి, కీర్తన్, సిమ్రాన్ సానియా, ఉపేంద్ర, పారుల్ బిందల్, ఈషా, ధన్యశ్రీ ప్రధాన పాత్రల్లో మాడుపూరి కిరణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. విమలాద్రి క్రియేషన్స్, మాజేటి మూవీ మేకర్స్, కిరణ్ టాకీస్ బ్యానర్లపై బొద్దుల సుజాత శ్రీనివాస్, స్రవంతి ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా టైటిల్ లోగోని ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు, హీరో రాహుల్ విజయ్, ‘సంతోషం’ అధినేత సురేష్ కొండేటి ఆవిష్కరించారు.
మాడుపూరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘కులుమనాలి, గోవా, హైదరాబాద్‌లో మూడు ప్రేమ జంటల మధ్య సాగే ప్రేమకథా చిత్రమిది. చక్కటి కథ, కథనాలతో ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తుంది. త్వరలోనే ఆడియో, వేసవిలో సినిమా విడుదల చేస్తాం’అన్నారు. ‘‘అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు మా సినిమాలో ఉంటాయి. తప్పకుండా హిట్ అవుతుంది’’ అన్నారు బొద్దుల సుజాత శ్రీనివాస్, స్రవంతి ప్రసాద్. సంగీత దర్శకుడు జయవర్ధన్, నటీనటులు పాల్గొన్నారు. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి. హజారత్ బాబు, కెమెరా: రాజేష్.