పెళ్లి చేసుకుందాం అని కాదు...పెళ్లంటే ఏంటా? అని ఆలోచిస్తున్నాను... | Exclusive interview with Colors Swathi | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకుందాం అని కాదు...పెళ్లంటే ఏంటా? అని ఆలోచిస్తున్నాను...

Published Sun, Oct 20 2013 12:12 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

Exclusive interview with Colors Swathi

తనకెంతో పేరు తెచ్చిపెట్టిన ‘కలర్స్’ ప్రోగ్రామ్‌ను తన పేరుకు జత చేసి పిలిస్తే స్వాతికి ఎందుకిష్టం ఉండదు?
 డాక్టర్ కావాలని బలంగా అనుకున్న స్వాతి యాక్టర్‌గా మిగలడం వెనుక ఉన్న ‘సైకో’ ఎవరు?
 తనను విక్రమ్‌తో, నిఖిల్‌తో జతకడుతూ వస్తున్న రూమర్లపై స్వాతి ఏమంటుంది?
 పార్టీలకు గాని మరెక్కడికిగాని వెళ్లడానికైనా ఏ టైమ్‌లోనైనా ఎటువంటి జంకూ గొంకూ లేకుండా స్వాతి ‘ఎస్’ చెప్పే ఆ సిక్స్‌ప్యాక్ హీరో ఎవరు?
 ఎంతో నాజూకుగా, చిన్నపిల్లలా కనిపించే స్వాతి ఏకంగా ‘స్కార్పియన్’ని తినాలని ఎందుకనుకుంది?
 ఈ ప్రశ్నలకు సమాధానం... రంగుల ప్రపంచంలోకి వెళ్లడానికి ముందే రంగుల్ని తన ఇంటిపేరుగా మార్చుకున్న రష్యన్ అమ్మాయి  స్వెత్లానా అలియాస్ స్వాతిరెడ్డి అలియాస్ కలర్స్ స్వాతి.
 సినిమారంగంలో పదేళ్ల వయసున్న స్వాతి ‘తారాంతరంగం’ ఈ వారం.

రష్యాలో పుట్టారు కదా...
 స్వాతి: అవును. వ్లాదివోస్టాక్ అనే పోర్ట్‌ప్లేస్‌లో పుట్టాను. నాన్న నేవీలో చేసేవారు. ఆయన ఉద్యోగరీత్యానే ముంబయికి వచ్చాం. ఆ తర్వాత వైజాగ్, తర్వాత హైదరాబాద్!
 
 మరి స్వెత్లానా ఎలా స్వాతి అయ్యారు?

 స్వాతి: రష్యన్ పేరెందుకు... మన భాష పేరు పెట్టుకోవాలని ముంబయి వచ్చాక అమ్మ నా పేరు మార్చింది.  నాకన్నా ఆరేళ్లు పెద్దయిన అన్నయ్య పేరు సిద్ధార్థ. ఇద్దరి పేర్లూ ‘ఎస్’ తో మొదలైతే బాగుంటుందని నాకు స్వాతి అని పెట్టారు.
 
 మీరు పుట్టిన రష్యాకు మళ్లీ ఎప్పుడైనా వెళ్లారా?
 స్వాతి: సరిగ్గా నెలన్నర క్రితమే వెళ్లాను. పసిఫిక్ మెరిడియన్ అని ఫిలింఫెస్టివల్ 11వ వార్షికోత్సవం చేశారు. నేను పుట్టిన వ్లాదివోస్టాక్‌లో ఈ అంతర్జాతీయ చిత్రోత్సవం జరిగింది. భారతీయ సినిమాకు 100ఏళ్లు అయిన సందర్భంగా మన సినిమావాళ్లని కూడా ఆహ్వానించారు.  ముఖ్యంగా వ్లాదివోస్టాక్‌లో  పుట్టి, ప్రపంచవ్యాప్తంగా సినిమా రంగంలో రాణిస్తున్నవారిని గుర్తించి ఆహ్వానించారు. అలా నాకు కూడా ఆహ్వానం అందింది. వెళ్లాను.. చాలా హ్యాపీగా అనిపించింది. నేను పుట్టిన ఆసుపత్రి వార్డు, నా ఫస్ట్ హౌస్ చూశాను.  ఫొటోలు దిగాను. చాలా మెమరబుల్!
 
 మీ అన్నయ్య గురించి...

 స్వాతి: మా అన్నయ్య, నేను చాలా క్లోజ్‌గా ఉంటాం. ‘కలర్స్’ ప్రోగ్రాం టైమ్‌లో ‘బాబోయ్... ఇంట్లో కూడా దీని గోల, టివిలో కూడా దీని గోలే’ అనేవాడు. ‘చానెల్ అయితే మార్చేసుకోవచ్చు కానీ ఇంట్లో అలా కుదరదుగా’ అంటే ‘అదే ఛస్తున్నానురా బాబూ’ అనేవాడు.
 
 డాక్టర్ అవబోయి యాక్టర్ అయినవారిలో మీరూ...
 స్వాతి: నిజంగా అవుదామనుకున్నానండీ. ఇప్పటికీ అప్పుడప్పుడు బాధేస్తుంది. అయితే ఈ మధ్య కొందరు డాక్టర్లను చూసి ‘థాంక్ గాడ్ నేను డాక్టరవ్వలేదు’ అనిపిస్తుంది! ఇట్స్ ఎ వెరీ రెస్సాన్సిబుల్ జాబ్! నాకు చదువంటే ఇష్టం. నేను బాగా చదివేదాన్ని. మెడిసిన్‌లో ఫ్రీ సీట్ సాధించాను. కాని, అప్పటికే ‘కలర్స్’ బాగా పాపు లర్ కావడంతో నన్ను మామూలుగా కాకుండా  ఒక రేంజ్‌లో ర్యాగింగ్ చేశారు. ఓ 30 మంది నన్ను రోజంతా హాస్టల్ రూమ్‌లో  పెట్టి తాళం వేసేశారు. రాత్రంతా డ్యాన్స్ చేయమన్నారు. మా రూమ్ ఎలక్ట్రిసిటీ స్విచ్ బయట ఉండేది. అది ఆఫ్ చేసేసేవారు. అలాగే జూనియర్స్ కూడా నాతో ఉంటే ర్యాగ్ అవుతారని నాతో ఉండేవారు కాదు. సో నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. ‘కలర్స్ స్వాతి’ ఈ కాలేజ్‌లో చదువుతోంది అని తెలిసిన తర్వాత చుట్టుపక్కల ఇంజినీరింగ్ కాలేజ్ వాళ్లు కూడా వచ్చి రాగ్ చేయడం... ఆ ఇంజినీరింగ్ బాయ్స్, మెడికల్ బాయ్స్ అంతా కలిసి రాగ్ చేయడం...స్టేషనరీ ఏదైనా కొందామని వెళ్లినా షాప్‌కు వచ్చి మరీ రాగ్ చేయడం ఎక్కువయ్యాయి. ఎవరు సస్పెండ్ అయినా నన్ను బ్లేమ్ చేసేవారు. అలా నాకు ఏదో ఒక దశలో ఆ వృత్తి మీద ఇంట్రస్ట్ పోయింది. ‘ఇలాంటి వాళ్లు మెడికోస్...  వీరేం డాక్టర్లు అవుతారు? సైకోల్లా ఉన్నారు’ అనిపించింది. ఏదైతేనేం అక్కడ మానేశాను. తర్వాత హైదరాబాద్ యూసఫ్‌గూడలోని సెయింట్ మేరీస్‌లో బయోటెక్నాలజీలో చేరాను. ఆ కాలేజ్ ప్రిన్సిపాల్, స్టాఫ్, స్టూడెంట్స్ నన్ను మెడికల్ కాలేజ్ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ నుంచి తేరుకునేలా చేశారు. అక్కడి కెమిస్ట్రీ లెక్చరర్ ఇప్పటికీ నాతో టచ్‌లో ఉన్నారు.
 
 ‘కలర్స్’ స్వాతి అని పిలిస్తే ఎందుకు ఇష్టం ఉండదు? అది మీ హీరోయిన్ స్టేటస్‌కు తక్కువనా?
 స్వాతి: ఛీఛీ...నాకు అప్పుడే ఇష్టం ఉండేది కాదు. చక్కగా స్వాతి అనే పేరు ఉంది కదా అని. అంతెందుకు... ఆ ప్రోగ్రామ్‌లోనే అనేదాన్ని ‘థాంక్‌గాడ్... నా ప్రోగ్రాం పేరు కలర్స్! ఏ ‘ఇంటింటి మహాలక్ష్మి’నో లేదా ‘పట్టుకుంటే పట్టుచీర’నో అయ్యుంటే! బాబోయ్ అలాంటివి పెట్టలేదు!
 
 కాని, చాలామంది అలా పిలిస్తే క్రెడిట్‌గా ఫీలవుతారు...

 స్వాతి: నేనలా కాదండీ. డిటాచ్డ్ పర్సన్. ‘సుబ్రహ్మణ్యపురం స్వాతి’, ‘డేంజర్ స్వాతి’ అంటే నాకు ఏదోలా ఉంటుంది!
 
 ఇంటి నుంచి పారిపోయైనా సరే సర్కస్‌లో చేరాలి అనుకున్నారట...
 స్వాతి: (గట్టిగా నవ్వేస్తూ) అవును. అది ఎక్కడ విన్నారు మీరు? నిజంగానే నాకు సర్కస్ అంటే బాగా ఇష్టం. ఆ ఇష్టంతోనే 8వ తరగతిలో ఉన్నప్పుడు అందులో చేరడానికి ట్రయల్ కూడా చేశాను! కానీ ఛాన్స్ దొరకలేదు. అలాగే నేవీలో ఉన్నప్పుడు యూనిఫాం నచ్చి అందులో చేరిపోదాం అనుకున్నాను. తర్వాత డాక్టర్...  అవన్నీ దేవుడు పై నుంచి చూసి ఈ అమ్మాయికి చాలా కోరికలున్నాయి కాబట్టి... ఈ అమ్మాయిని యాక్టర్ చేసేద్దాం... అన్నీ అయిపోతుంది (క్యారెక్టర్‌ల పరంగా) అనుకునుంటాడు (నవ్వులు)!
 
 అంత హిట్టయిన ‘కలర్స్’ ప్రోగ్రామ్‌ను ఆపేయడం మొదలుకుని, మెడిసన్‌ను వదులుకోవడం...ఇలా మీ నిర్ణయాల్లో చాలా స్థిరచిత్తం కనిపిస్తుంటుంది... పెద్దగా లైఫ్‌లో స్ట్రగుల్ లేకపోయినా ఇంత స్ట్రాంగ్ ఎలా అయ్యారు?

 స్వాతి: నా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్, నేను పెరిగిన వాతావరణం వల్ల! దట్ వే ఐయామ్ బ్లెస్డ్. అయినా స్ట్రగుల్ అస్సలు లేకుండా ఏమీ లేదు. స్ట్రగుల్ అంటే ఇటుకలు మోసేయడం లాంటివి కాకపోయినా, సాధారణ మధ్యతరగతి జీవనశైలి నుంచి వచ్చాను.  నేవీ ఫీల్డ్ బయట గ్లామరస్‌గా ఉంటుంది కానీ తొంగి చూస్తే చాలా సాధారణంగా ఉంటుంది. అందరి ఇళ్లూ ఒకేలా ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఎకామిడేషన్ తెల్సిందే కదా. నార్మల్ క్వార్టర్స్. కానీ ఇంటలెక్చువల్లీ, కల్చరల్లీ చాలా రిచ్ ఎన్విరాన్మెంట్! పక్కింటోడు ఒక బెంగాలీ ఉంటాడు, పైనో పంజాబీ ఉంటాడు. హోలీ ఆడాం. క్రిస్మస్  చేశాం. వినాయకచవితికి నాటకాలు. దాండియా ఆడాం. సో... క్వార్టర్స్‌లో ఉన్నామేమో కాని, మా కల్చరల్ అప్‌బ్రింగింగ్ వెరీ వెరీ రిచ్!
 
 మూవీస్‌లోకి వెళ్తాననగానే ఇంట్లోవాళ్లు ఏమన్నారు?
 స్వాతి: నేను మూవీస్ చేయడం అన్నకు అస్సలు నచ్చలేదు. ‘డేంజర్’ టైంలో చాలా రోజులు నాతో మాట్లాడలేదు కూడా! చాలా బాధపడ్డాను. సినిమాల్లో చేసే అమ్మాయిల గురించి ఆ వయసు అబ్బాయిలు, ఫ్రెండ్స్ ఏం అనుకుంటారో తెల్సిందే కదా. అందుకే కొంచెం భయపడ్డాడు. అయితే సినిమా చూశాక గర్వంగా ఫీలయ్యాడు. పేరెంట్స్ మాత్రం దీన్నంతా ఒక ప్రాసెస్‌గా భావించారంతే! అలాగని నా విషయంలో ప్రతీదీ వారికి తెలియాలని కోరుకోరు. అదే టైమ్‌లో నాకేం జరుగుతుందో వారికి తెలుసు. నేనే పడతాను. నేనే లేస్తాను. అయితే అన్నీ చెబుతూనే ఉంటాను. సడెన్‌గా ఏమైనా అయినప్పుడు  వాళ్లు షాక్ తినరు!
 
 ‘సినిమాలు మానెయ్’ అని ఎప్పుడూ అనలేదా?

 స్వాతి: మూవీస్ మానేసి ఏం చేస్తా? నేనున్న పరిస్థితుల్లో బ్యాంక్‌లో చేస్తానా? అలా అని నచ్చక చేస్తున్నానని కాదు... ఇష్టం కాబట్టి చేస్తున్నాను. అవసరమైతే ఇంట్లో క్యాండిల్స్ చేసుకుని అమ్ముకుంటూ బతుకుతాను కాని, ఇష్టం లేనిపని చేయను.
 
 మీ మూవీస్ అబ్జర్వ్ చేస్తే  పెర్ఫార్మెన్స్ బేస్డ్‌గా ఉంటాయి. సెలక్టివ్‌గా వెళుతున్నారనుకోవచ్చా?
 స్వాతి: యాక్చువల్లీ  పెర్ఫార్మెన్స్ బేస్డ్ అంటూ ఏమీ ఉండవండీ. ప్రతి సినిమాలోనూ పెర్ఫార్మెన్స్ ఉండాల్సిందే కదా. ఇక అవి నేను ఎంచుకున్నవి కాదు. ఆ సినిమాలే నన్ను ఎంచుకున్నాయి. నాకు పది ఉంటే అందులో నేను రెండు సెలెక్ట్ చేసుకోవచ్చు. కాని, అన్నీ ఎప్పుడూ ఎవరికీ ఉండవు. నా దగ్గరకి వచ్చినవి మంచి ఆఫర్లు  అంతే.
 
 మీరు కనపడినంత చైల్డిష్ కాదు..!
 స్వాతి: అయామ్ జస్ట్ గ్రోయింగ్‌అప్ అండీ! పర్సనల్లీ నేను పేరెంట్స్‌కి చాలా క్లోజ్‌గా ఉంటాను. తల్లిదండ్రులకు సన్నిహితంగా ఉండే పిల్లల లైఫ్ వేరేగా ఉంటుంది. ఎల్లప్పుడూ నేను డిపెండెంట్‌నే. అందులో డౌట్ లేదు. అంటే అది ఫైనాన్షియల్‌గానే కానక్కర్లేదు. ఎమోషనల్‌గా కూడా. నేనంటూ గుడ్డిగా  చేయగలిగేది అమ్మానాన్నని నమ్మడమే.
 
 దేవుణ్ణి నమ్ముతారా?

 స్వాతి: ఇప్పుడు.. డెఫినెట్లీ. ఒక పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ఒక మనిషికి ఒక సిట్యుయేషన్ వల్ల్లో సక్సెస్, ఫెయిల్యూర్ వల్లో టెంపర్‌మెంట్ వల్లో మూడ్స్ వల్లో వేరే థాట్స్ ఉంటాయి. ఓ 5 సంవత్సరాల తర్వాత ఆలోచన మారిపోతుంది. ఇదే ప్రశ్న మీరు నన్ను స్కూల్ టైమ్‌లో అడిగితే వేరే ఆన్సర్ చెప్పేదాన్నేమో. ఇప్పుడు టివి, సినిమాలు, వేరే బాధలు, ఫ్రెండ్స్ పెరగడం, వాళ్ల పెళ్లిళ్లు. ఇవన్నీ చూశాక డెఫినెట్‌లీ దేవుడున్నాడని బాగా నమ్ముతున్నాను.
 
 ఎందుకంత నమ్మకం?

 స్వాతి: మంచివాళ్లకి మంచి జరిగినప్పుడు దేవుడున్నాడు అనిపిస్తుంది. అది తెలిసినవాళ్లకయినా, పర్సనల్‌గా నాకయినా! మా అన్నయ్యకు ఫేటల్ యాక్సిడెంట్ అయింది కొన్ని నెలల క్రితం. సీరియస్ అయింది. బట్ హీ సర్వైవ్డ్ ఇట్. సో...దేవుడున్నాడు అని. ఇప్పుడు చదివేవాళ్లకి ఇది చాలా సిల్లీగా అనిపించవచ్చు. అయితే నా నమ్మకం నాకుంది. నా ఫ్రెండ్స్ చాలా మంది దేవుణ్ణి నమ్మరు. నాతో ఆర్గ్యుమెంట్ కూడా పెట్టుకుంటారు. దేవుడేంటి... అంతా మన చేతుల్లోనే ఉంది అంటారు. కాని, నేను వారితో పెద్దగా ఆర్గ్యూ చేయను. ఎందుకంటే ఇది పూర్తిగా పర్సనల్ థింగ్!
 
 మీ ఫ్రెండ్స్ గురించి...
 స్వాతి: క్లోజ్ ఫ్రెండ్స్ తక్కువండి. అంటే... ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. అందరితో బాగా మాట్లాడతాను. నాకు స్కూల్ అండ్ కాలేజ్ ఫ్రెండ్స్ ఎక్కువ. ఇక సినిమా పరిశ్రమలో స్నేహం గానీ, శతృత్వం గానీ ఎక్కువ కాలం ఉండవు. అయినా ఇట్స్ వన్ లైఫ్ అండీ. గొడవలు ఎందుకు చెప్పండి? యూ నో... హేట్ అనే ఎమోషన్ చాలా డ్రెయినీ. లవ్ కన్నా హేట్ చాలా బలమైందీనూ. మనిషిని చాలా డ్రైన్ చేసేస్తుంది. సో అంత శక్తి నాలో  లేదు.
 
 హీరో సునీల్ మాటకు బాగా విలువిస్తారంటారు...
 స్వాతి: అవును... సునీల్‌తో పొద్దున్న కూడా మాట్లాడాను. ఎక్కడికైనా సరే సునీల్ చెప్తే వెళ్తా. ఒకరోజు సడెన్‌గా పూరీ జగన్‌గారు రాత్రి 9.30కి ఫోన్ చేసి ‘‘స్వాతీ, హరీష్, చార్మి, నేను, ఇంకా రాము... ఇలా అందరం పార్టీకి వెళుతున్నాం వస్తావా?’’ అంటే రానన్నా. అప్పుడు  సునీల్ చేత ఫోన్ చేయించారు. వెళ్లాను. సీ... ఫ్రెండ్షిప్ అంటే అర్థం ఏమిటో నాకు తెలీదండీ. కాని, ఇండస్ట్రీలో నాకు చాలా స్పెషల్ పీపుల్ అయితే ఉన్నారు. ఇందులో సునీల్, శ్రీనివాస్ అవసరాల, ఇంద్రగంటి మోహన్‌కృష్ణ, పార్వతి... అలా... కొందరు ఉన్నారు.
 
 మీ ఏజ్‌గ్రూప్‌వాళ్లతో తక్కువ అనుకుంటా...
 స్వాతి: హహహ(నవ్వులు) నా ఏజ్ గ్రూపోళ్లు తక్కువున్నారనుకుంటా ఇండస్ట్రీలో. అంటే వాళ్లంతా ఇంకెక్కడో ఉన్నారు. వాళ్ల రేంజ్ వేరే. పెద్ద సినిమాల్లో ఉన్నట్టున్నారు.
 
 చిన్నాపెద్దా... అని లెక్కేస్తారా...
 స్వాతి: నేనడం కాదండీ. ఇది జనాలు చెప్పే లెక్కలేనండీ. నాకు అలాంటివి ఉండవు. అందుకేగా ‘కలర్స్’ హిట్టయింది. మనిషిని మనిషిగా ట్రీట్ చేసి మాట్లాడేదాన్ని కాబట్టే అది అంత విజయం సాధించింది!
  ఇప్పటి టీవీ విజృంభణ చూస్తుంటే... మీరు ఇప్పటికీ టీవీలోనే ఉండుంటే స్మాల్ స్క్రీన్ సూపర్‌స్టార్ అయ్యేవారేమో... కమర్షియల్‌గా అదే బాగుండేదేమో...
 స్వాతి: ఏమో.. నాకిప్పటికీ అంత  కమర్షియల్ ఐడియాలజీ లేదండీ. ఆ తెలివితేటలు నాకు లేవు.  గెస్ ్టరోల్స్ కానివ్వండీ ఆ పాటలు కానీ అంతా ఫ్రెండ్లీగానే... ‘స్వాతీ నువ్వు చెయ్ అంటే చేశా తప్ప... ‘నాకేంటి’ అని అంతగా ఆలోచించలేను.
 
 అలా ఆలోచించకపోవడంవల్ల ఏదైనా పోగొట్టుకున్నారా?
 స్వాతి: ఓసారి ఓ సినిమాలో గెస్ట్ రోల్ చేశాక కొంతమంది నాకు ఫోన్ చేసి ‘‘అదేంటి స్వాతి, నువ్వు గెస్ట్ రోల్ చేయకు... హీరోయిన్‌గా చేశాక గెస్ట్ రోల్ చేస్తే రాంగ్ మెసేజ్ వెళుతుంది. వర్క్‌లేక చేశావంటారు’’ అని  అంటే..  ‘అంత సిల్లీ మేటర్ కూడా అర్థం కావడం లేదా’ అని ఫస్ట్‌షాక్ అయ్యాను. నిజానికి అందరి జర్నీ ఒకలా ఉండదండీ. అందరూ సావిత్రి గారిలా ఉండలేరు. అందరూ శ్రీదేవిలు కాలేరు. మన వ్యత్యాసాలే మన ప్రత్యేకతలు  కదా. ఇది నా జీవితం. సో...వీటి నుంచి నేర్చుకున్నానే తప్ప రిగ్రెట్స్ లేవు.
 
 ‘కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం అప్పల్రాజు’ సినిమా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ కాదంటారా?
 స్వాతి: దేన్నీ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ కాదనుకునే బలం ఈ మధ్యే  వచ్చింది. అంతకుముందు బాగా ఫీలయ్యేదాన్ని. ఎందుకంటే మనం అవ్వకపోయినా పక్కనోళ్లు చెప్తారు. కొన్ని రోజుల పాటు కాదు నెలలపాటు ఆ ఫీలింగ్‌లోనే ఉండేదాన్ని! అప్పల్రాజు, గోల్కొండ హైస్కూల్ తర్వాత కాన్షియస్‌గా ఒక బ్రేక్ తీసుకున్నాను. ‘అసలు నేనెందుకున్నానీ ప్రొఫెషన్‌లో?  నాకేం కావాలి?’ అని ఆలోచించుకున్నాను. వై యామ్ ఐ అన్‌హ్యాపీ అని ప్రశ్నించుకున్నాను. అప్పుడు రియలైజ్ అయ్యాను. అప్పుడర్థమైంది ఇతరుల అభిప్రాయాల వినడమే నాకు సమస్య అని. ఇతరుల అభిప్రాయాలపై నా శక్తిని ఎక్కువగా ఖర్చు చేస్తున్నానని. ఒక్కొక్కరు వచ్చి ‘‘‘స్వాతి నువ్వు తెలుగమ్మాయివి...నువ్వు చాలా టాలెంటెడ్...  స్వాతి...నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి’’... ఇలా అంటుంటే వాళ్ల మాటలు విని నాక్కూడా కంగారు వచ్చేసేది. అనేశాక వాళ్లు వెళ్లి హాయిగా పడుకుంటారు. అయినా నాకా థాట్ ఉంటుంది కదా. అది గుర్తించాను. అదే సమయంలో మా అమ్మ ఒక మాట అడిగింది ‘‘లాస్ట్ వన్ ఇయర్‌లో రిలీజైన సినిమాల్లో నువ్వు మిస్సయిన ఒక సినిమా  పేరు చెప్పు’’ అని. ఒక్కటి కూడా చెప్పలేకపోయాను. ఎందుకంటే, ఆ సినిమాలు నచ్చాయి కాని, నేను చేస్తే అవి వర్కవుట్ అయ్యేవి కావు. మళ్లీ అమ్మ ఇంకో క్వశ్చన్ వేసింది. ‘‘స్వాతీ నువ్వు సినిమాల్లోకి ఎందుకు వచ్చావ్?’’ అని! ‘‘యాక్ట్ చేయడానికి’’ అన్నా! అయితే యాక్ట్ చెయ్ అంది. అంతే. ఆ తర్వాత స్వామి రారా, మలయాళ సినిమా ఆమెన్, తమిళ సినిమాలు.. ఇలా... చేసుకుంటూ పోతున్నా. రిజల్ట్ గురించో, ఇంకొకరి అభిప్రాయాల గురించో పట్టించుకోకుండా నా వృత్తి మీద నా లవ్వూ, నా కాన్సన్‌ట్రేషన్   చూపిస్తే మిగతాదంతా లైన్‌లో పడుతుందని రియలైజ్ చేశా!
 
 ఆ తర్వాత...

 స్వాతి: ‘స్వామి రారా’ తర్వాత బాగా ఆఫర్లు వచ్చాయి. అయితే అప్పుడు మళయాళం, తమిళంలో చాలా అర్థవంతమైన సినిమాలు చేస్తున్నాను.
 
 మీ కెరీర్‌లో ఇదే బెస్ట్ టైమ్ అనుకోవచ్చా..?
 స్వాతి: కాదండీ... ద బెస్ట్ టైమ్ వజ్ ఆఫ్టర్ అప్పల్రాజు. ఏడాదిన్నర సమయంలో ఇంటి దగ్గర కూర్చుని ఎన్నో ఇన్నర్ కన్‌ఫ్యూజన్స్‌ను క్లియర్ చేసుకున్నాను.
 
 తెలుగులో చేస్తూ చేస్తూ... సడన్‌గా తమిళంలో ఆఫర్ ఎలా వచ్చింది?

 స్వాతి: తమిళియన్స్ చాలా స్మార్ట్. వాళ్లు కన్నేసి ఉంచుతారు... ఎక్కడంటే అక్కడ. ‘ఆడవాళ్ల మాటలకు అర్థాలే వేరులే’ చూసి, 3 నెలలు ఆగి ఫోన్ చేశారు. ‘‘బాబూ నాకు తమిళం రాదు’’ అంటే ‘‘వెరీగుడ్ తమిళ హీరోయిన్లకు తమిళ్ రాకపోవడం ఒక అడ్వాంటేజ్’’ అంటూ తీసుకెళ్లారు. అలా ‘సుబ్రమణియపురం’ వచ్చింది.
 
 మళయాళం  సినిమా ఛాన్స్  ఎలా వచ్చింది?
 స్వాతి: ‘సుబ్రమణియపురం’ చూసి మలయాళం వాళ్లు ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం అక్కడ 3 సినిమాలు చేస్తున్నాను. అయితే రెమ్యునరేషన్ చాలా తక్కువ. షాప్ ఓపెనింగ్ అంత కూడా రాదు (నవ్వులు). చాలా ఖర్చులు నేనే పెట్టుకుంటుంటాను. అమ్మ అంటుంది ‘మనం చేస్తున్నామా? పెడుతున్నామా?’ అని. కాని మలయాళంలో ఎన్విరాన్మెంట్ బాగుంది! బడ్జెట్ చాలా సింపుల్ ఖర్చుతో గ్రౌండ్‌లెవల్‌లో ఉంటుంది.
 
 పాటలు పాడుతున్నారు. ఈ ‘పాడు’ అలవాటు ఏంటి?

 స్వాతి: అలవాటేం కాదు. మొత్తం ఇప్పటికి 3 సినిమాలకు పాటలు పాడాను. దాంతోపాటే ఒక ఎయిడ్స్ అవగాహనా కార్టూన్ పిక్చర్‌కి వాయిస్ ఇచ్చాను. అదో స్కూల్ ప్రోగ్రామ్! అన్ని గవర్న్‌మెంట్ స్కూల్స్‌కు వెళుతుంది. వ్యక్తిగతంగా మ్యూజిక్ అంటే నా జీవితంలో భాగం. అది నాకు స్ఫూర్తినిస్తుంది. బలాన్నిస్తుంది!
 
 ఫస్ట్ లవ్‌ప్రపోజల్ ఎప్పుడొచ్చింది?
 స్వాతి: స్కూల్లో! సెవెన్త్‌క్లాస్‌లోనే వచ్చింది. అప్పుడు వైజాగ్ నేవీ స్కూల్‌లో చదువుతున్నాను. పెన్సిల్ చెక్కుకుంటుంటే క్లోజ్‌ఫ్రెండ్ వచ్చి ఐ లవ్ యు అన్నాడు. నాకు వెంటనే అర్థం కాక చెక్కుకోవడం ఆపి ‘క్యా’ అంటూ దీర్ఘం తీశాను. ఐ థింక్ ఐ లవ్ యూ అన్నాడు. అంతే... ఆ అబ్బాయితో మాట్లాడడం మానేశాను. వారం తర్వాత కలిసి ‘‘నువ్వేమైనా మిస్ ఇండియావా! ఏమనుకుంటున్నావ్? ఇష్టం లేకపోతే వదిలెయ్,  నాతో మామూలుగా ఉండు’’ అన్నాడు. ఇప్పటికీ ఇద్దరం మంచి ఫ్రెండ్స్‌మే! ఇక కాలేజ్‌లో లవ్ ప్రపోజల్స్ ఏమీరాలేదు. మా అన్నయ్య టీషర్ట్, జీన్స్, జుట్టు ముడి వేసుకుని కాస్త పద్ధతిగా వెళ్లేదాన్ని అందుకేనేమో ఎవరూ పట్టించుకోలేదు (విచారంగా మొహం పెట్టి), ఇండస్ట్రీకి వెళ్లాక చాలా వచ్చాయి. ఇండస్ట్రీలో లవ్‌కన్నా మ్యారేజ్ ప్రపోజల్స్ ఎక్కువొచ్చాయ్. బహుశా నా ఫేస్ అలా అనిపిస్తుందేమో (నవ్వులు). అంటే వాళ్లక్కూడా తెలుసేమో ఈ అమ్మాయితో ఇవన్నీ వేస్ట్ అని! ఇండస్ట్రీలో హరీష్ శంకర్, రవితేజ, బీవీఎస్ రవి అందరూ నన్ను తులసి మొక్క అని ఏడిపిస్తుంటారు.  
 
 మరి అలా ఉంటే డల్‌గా అనిపించదా?
 స్వాతి: ఊహూ... నేనొచ్చిన బ్యాగ్రౌండ్ వల్లేమో అంత అటెన్షన్ హ్యాండిల్ చేయలేను. ఒక బంగళా, కారు, కెమెరాలతో ప్రొటెక్షన్ ఇవన్నీ ఉన్నవాళ్లు హ్యాండిల్ చేయగలరేమో... కాని, నేను చాలా సింపుల్‌గా ఉంటాను!
 
 మీ ఉద్దేశంలో ప్రేమంటే..?
 స్వాతి: నాకు నిజంగా తెలీదు. ఎవరైనా చెబితే బాగుంటుంది. అలాగని ఎవరైనా నాకు తెలియజెప్పాలని అనుకోవడం లేదు. నా పెళ్లి మాత్రం తప్పకుండా ఎరేంజ్డ్ అయి ఉంటుంది.
 
 మీ వల్ల ఎవరైనా దేవదాసులయ్యారా?
 స్వాతి: ఎవరవుతారండీ... ఈ కాలంలో దేవదాసులు? మరీ అయితే ఓ 10రోజులకు అవుతారేమో! అయినా ఓ అమ్మాయి కోసం... ఫీలైపోయి, షేవ్ చేసుకోవడం మానేసి, బాగా తాగేసి ఆ ఫీలింగ్‌ను ఎంజాయ్ చేస్తుంటే ఏం బాగుంటుందండీ?
 
 పార్టీయింగ్‌కు దూరంగా ఉంటారెందుకు?

 స్వాతి: ఏదైనా రీజన్ ఉంటేనే వెళతానండీ! అయితే పార్టీయింగ్ నచ్చదని కాదు. కొన్నిసార్లు వెళ్లానండి. వెళ్లిన తర్వాత నాకేం అనిపించిందంటే... అక్కడికి ఒక్కొక్కరు ఒక్కో రీజన్‌తో వస్తారు. ఒక ఎజెండాతో వస్తారు.  నాకేమో ‘నేనిక్కడ ఏం చేస్తా’ అనిపిస్తుంది. ఆల్‌సో... ఇది చాలా కాంపిటీటివ్ ఇండస్ట్రీ. ఉన్న ఫ్రెండ్షిప్‌లన్నీ వన్ టు వన్ ఉంటాయి. గ్రూప్‌లో ఉన్నప్పుడు ఏమౌతుందంటే... ఓ పది నిమిషాలు బాగుంటారు. ఓ ఇద్దరు అక్కడ నుంచి వెళ్లగానే ఇక వారి గురించి మాట్లాడతారన్నమాట. నే నైనా అక్కడ నుంచి వెళ్లగానే నా మీద కూడా టక్‌టక్‌మని కౌంటర్ పడిపోతుందన్నమాట. అది నాకు తెలుసు. అందుకే దూరంగా ఉంటాను.
 
 సినిమారంగానికి వచ్చి పదేళ్లవుతున్నా పెద్దగా రూమర్స్ లేవేంటి?
 స్వాతి: నేను చాలా బోరింగ్. కొంచెం ఎగ్జయిటింగ్‌గా ఉండేవాళ్ల మీద వస్తాయేమో రూమర్స్! అయినా అవి కూడా చిన్నా చితకా ఉన్నాయిలెండి. ఒక సినిమా హిట్టయిందనుకోండి. వచ్చేస్తాయిక. ఈ ఫీల్డ్‌లో తప్పదనుకుంటా!
 
 విక్రమ్ మీకు బాగా క్లోజ్ అని విన్నాం..?

 స్వాతి: అడిగారా... చెబుతాను! నిజానికి విక్రమ్ అందరితో క్లోజ్‌గా ఉంటాడు. నేషనల్ అవార్డ్ వచ్చినప్పుడు ‘కలర్స్’లో విక్రమ్‌ని  ఇంటర్వ్యూ చేశాను. ఓ నేషనల్ అవార్డ్ విన్నర్ అంటే ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చుంటాడు? అయినా ఆయన ‘కలర్స్’తో చాలా ఇంప్రెస్డ్! అప్పటినుంచి నన్ను ‘తన ఫేవరెట్ మూవీ ప్రెజెంటర్’ అనేవాడు. ఎవరైనా అడిగితే ఆయన పబ్లిగ్గా చెప్పేవాడు... ‘స్వాతి అంటే ఇష్టం’ అని! అలా ఒక ఇమేజ్ వచ్చేసింది. ‘ఆడవారి మాటలకు అర్థాలు వేరులే’ సినిమా అప్పుడు సెల్వరాఘవన్‌కు తనేమీ నన్ను సిఫారసు చేయలేదు. నన్ను తీసుకోవాలనుకున్నాక, ఆ విషయం విక్రమ్‌ని అడిగాడు అంతే!
 
 నిఖిల్‌తో కూడా మీకు ఏదో ఉందని టాక్...
 స్వాతి: అబ్బా! రెండు సినిమాలు కలిసి చేస్తే లింక్ పెట్టేస్తే ఎలా? అలా అయితే జైతో, ‘ఆమెన్’ హీరోతో కూడా రెండో సినిమా చేస్తున్నాను. మొత్తం 3 భాషల్లో ముగ్గురు హీరోలతో రెండో సినిమా చేస్తున్నాను. దానికేమంటారు? అలా చేస్తున్నానంటే దానికి కారణం ఒకటే... నేను నా పని చూసుకుంటాను. వాళ్లు వాళ్ల పని చూసుకుంటారు. అసలు అలాంటి ఎఫైర్‌లు ఉంటే రెండో సినిమా అవ్వదు.  చాలా కాలిక్యులేషన్స్ ఉంటాయి! ఇప్పుడు సినిమా మేకర్స్ చాలా డెరైక్ట్‌గా కూడా చెప్తున్నారు. ‘‘మేం ఎందుకు నటిగా నీకు ప్రాధాన్యమిస్తామంటే  నువ్వు నీ పని చూసుకుంటావ్’’ అని! ఎప్పుడైనా కొంచెం డిస్టెన్స్ మెయిన్‌టెయిన్ చేస్తేనే సంవత్సరాల తరబడి ఉంటుంది ఆ రిలేషన్‌షిప్. ఎక్కువ క్లోజ్ అయిపోతే కట్ అయిపోతుంది!
 
 ఇలాంటి విషయాల్లో ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఫీలవుతారా?
 స్వాతి: లేదండీ. నేనున్న ఫీల్డ్ అలాంటిది కదా. నేను కూడా రణబీర్‌కపూర్ గురించిన వార్తలు అవీ చదువుతాగా. అయితే నన్ను తిక్కగా అడిగితే సమాధానం అంతే తిక్కగా చెబుతాను. పద్ధతిగా అడిగితే బాగానే చెప్తాను!
 
 ఇంతకీ పెళ్లెప్పుడు...
 స్వాతి: ఇంకో రెండు మూడేళ్లలో ఉండొచ్చు... నాకు తెలీదండీ! చెప్పలేం కదా... ఇలాంటి విషయాల్లో. అయినా ఇప్పుడు నేను ‘పెళ్లి చేసుకుందాం’ అని ఆలోచించడంలేదు. ‘పెళ్లంటే ఏంటా?’ అని ఆలోచిస్తున్నాను. ఆ ఇన్‌స్టిట్యూషన్  నాకింకా అర్థం కాలేదు. అయితే ఆ వ్యవస్థను నేను నమ్ముతున్నానంటే అది కూడా నా పేరెంట్స్‌ని చూసి. లేదా మా ఫ్రెండ్స్ పేరెంట్స్. లేదా మా చిన్నాన్న, పిన్ని. లేకపోతే... నాకంతగా సరైన అభిప్రాయం లేదు. ఏదైనా ప్రతి పెళ్లీ డిఫరెంట్.   కొన్ని పెళ్ళిళ్లు అరేంజ్‌మెంట్స్ వల్లో, డీల్స్, లవ్వూ, సోషల్ ఆబ్లిగేషన్... కారణాలతో జరిగినవి చూశాను. నా ఫ్రెండ్స్‌లో కొంతమంది పెళ్లిళ్లు వెరీ లక్కీ. కొంతమందివి ప్చ్... వాళ్ల లైఫ్ అంతే. ఏదైనా మంచి పార్ట్‌నర్ దొరకడం అనేదానికి మనం అదృష్టవంతులం అయి ఉండాలనేది నా ఫీలింగ్!
 
 వచ్చేవాడు ఎలా ఉండాలని..?
 స్వాతి: బాబోయ్... అలా అంటే చెప్పలేను. అస్సలు ఐడియా లేదు! సినీ పరిశ్రమలో అన్ని రకాల మనస్తత్వాలున్న మగవాళ్లని చూశాను.
 
 పెళ్లయ్యాక సినిమాలు చేయడం మానేస్తారా?

 స్వాతి: అది తెలీదు కానీ, కనీసం రెండేళ్లు ఇంటిపట్టునే ఉండిపోతాను. శుభ్రంగా ఇల్లంతా చూసుకుంటూ... వంట చేసుకుంటూ...
 
 ఈ ఇంటర్వ్యూ చదివితే ఈ ఒక్కదెబ్బకు మ్యారేజ్ ఆఫర్స్ గ్యారంటీ...
 స్వాతి: అహ్హహ్హ. కొన్ని సంవత్సరాలైనా నిజంగా అలా ఉండాలనుంది!


 - ఎస్.సత్యబాబు.

                                                         ***************************** 

 పుస్తకాలు చదువుతారా?
 స్వాతి: ఇంట్లో లైబ్రరీ ఉంది. సీరియస్ బుక్స్  ఉన్నాయి. ఇక షిడ్నీషెల్డన్ అవన్నీ జుజుబీస్. నేను ఆలోచించనక్కర్లేదు అన్నప్పుడు నమిలిపడేయాలి అనుకుంటే అవి చదువుతాను.  రకరకాల బుక్స్ చదువుతాను. డిగ్రీ టైమ్‌లో నాకు తెలుగు ఉండేది కాదు. అయితే అష్టాచెమ్మా తర్వాత ఆర్టికల్స్ తెగవచ్చేసేవి. అవి చదవలేక ఫస్ట్రేషన్ వచ్చేసి తెలుగు నేర్చుకున్నా. తెలుగులో బుజ్జిబుజ్జి కధలు చదువుతా. మేకా ఆవు లాంటివి. ఇప్పుడు నా గురించి సాక్షిలో ఏమైనా వస్తే పొద్దున్నే లేచి నిదానంగా చదువుతానన్నమాట!
 
 రెమ్యునరేషన్‌లో నిర్ణయం ఎవరిది?
 స్వాతి: ఆ డిస్కషన్ ఎప్పుడూ రాలేదు. నా సినిమాలకు రీజనబుల్ ప్రొడ్యూసర్లే ఉన్నారు.  అమ్మది కొంచెం జాలిగుండె. అమ్మ వల్లే సినిమాల్లో ట్రీట్‌మెంట్ బాగుంటుంది. తన వల్లే నన్ను బాగా చూసుకుంటారు.అమ్మ ఏమంటుందంటే... ‘ఎక్కువ అడిగేసి పీడించేస్తే... అంత ఇచ్చాం అనే ఫీలింగ్ వాళ్లకి సినిమా పూర్తయ్యేదాకా ఉంటుంది’ అంటుంది. ‘వాళ్లు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీ’ అంటుంది. ఈ విషయంలో అమ్మకంటే నేనే కొంచెం బెటర్. కానీ దీని గురించి ఎప్పుడూ అమ్మతో వాదించను. (నవ్వుతూ) పొద్దున్నే టైమ్‌కి లేవడం అనే విషయంలోనే ఎప్పుడూ అమ్మతో గొడవ.
 
 మీరు రాస్తారని... బ్లాగ్ ఉంది కానీ అడ్రస్ చెప్పరని..!
 స్వాతి: ఏదో రాస్తాలెండి. కవితలూ అవీ. కానీ అవి క్లోజ్ ఫ్రెండ్స్ చదువుకోవడానికి మాత్రమే! డిఫరెంట్ ఇష్యూస్ మీద రాస్తూంటాను. అయితే అవేవో మరీ ఢిల్లీరేప్ అలాంటివి కాదు. పూర్తిగా పర్సనల్. నాకు సంతోషంగా ఉన్నా, బాధగా ఉన్నా. నా బ్లాగ్ కూడా అంతే. పూర్తిగా పర్సనల్!
 
 ఎక్సర్‌సైజ్, జిమ్ లాంటివి..?
 స్వాతి: వర్కవుట్ అనేది నాకు డీస్ట్రెస్ ఏజెంట్! అయితే గోల్కొండ, అప్పల్రాజు సమయంలో మరీ ఎక్కువ చేయడం వల్ల బాగా సన్నగా అయిపోయాను. బాగా అనిపించలేదు. అందుకే ఎంత తినాలో అంత తిని, ఎంత ఎక్సర్‌సైజ్ చేయాలో అంత ఇంట్లోనే చేసుకుంటాను అని తీర్మానించుకున్నా. ఇప్పుడు జస్ట్ మోడరేట్‌గా చేస్తున్నాను.

                                                              *****************************  

  ప్రతి ఏడాది ఎగ్జిబిషన్‌కు వెళ్లడం, జెయింట్‌వీల్ ఎక్కడం, ఎర్రరంగులోని చికెన్‌ని తినడం.. ఇవన్నీ పిచ్చ ఇష్టం.  పబ్లిక్ గుర్తుపట్టి విష్ చేస్తుంటారు. అయితే ఫ్యామిలీస్ చాలా చక్కగా మాట్లాడతారు. కొందరేమో ‘ఏ క్కలర్స్’ అని గట్టిగా అనేసి వెళ్లిపోతారు. నాకు ‘కలర్స్ స్వాతి’ అంటే చిరాకు అనిపించడానికి అదీ ఒక కారణమేమో...  నాకు వినిపించేటట్టు కావాలనే అని, నన్ను చూడకుండా వెళ్లిపోయేవాళ్లని చూస్తే నాకు తిక్కరేగిపోతుంటుంది. నాక్కూడా ఒక ఫ్యాంటసీ ఉంది... రేయ్ అంటూ ఫైట్, ఏ ఢిష్‌కే అని చేయాలని! ‘రేయ్ తియ్‌రా బండి’ అంటే టయోటాలన్నీ, సుమోలన్నీ గాల్లోకి ఎగిరి...
 
 ఐదేళ్ల క్రితం మాకు వేగనార్ కారుండేది. శ్రీనగర్‌కాలనీలో రోడ్‌లో డ్రైవ్ చేస్తుంటే ఎవడో ట్రాలీ లాంటిదేసుకుని వచ్చి థప్‌మని గుద్దాడు. రిపేర్‌కి రూ.20వేలు ఖర్చయింది. అప్పటి నుంచి కార్ డ్రైవ్ చేయడం అంటే భయం! ‘బంగారు కోడిపెట్ట’ కోసం మారుతి డ్రైవ్ చేశాను. 3 కెమెరాలు పెట్టారు. ఎంత భయంగా చేశానో చెప్పలేను. ఇప్పటికీ కారులో కూర్చుంటే ఏదైనా కారు పక్కనుంచి స్పీడ్‌గా వచ్చేస్తుంటే కళ్లు మూసేసుకుంటా. అంత భయం డ్రైవింగ్ అంటే!
 
 ఫేస్‌బుక్‌లో ఎకౌంట్ నాలుగేళ్ల క్రితం క్లోజ్ చేశాను. ఇప్పుడు లేదు. ఇక ట్విట్టర్ వాడే దాకా బాయ్స్‌లో అంత పైత్యం ఉందనేది నాకు తెలీలేదు. ఇంత ఫస్ట్రేటెడ్‌గా ఉన్నారా మన జనరేషన్ అనుకున్నా. రండి నన్ను ఎటాక్ చేయండి అని చెప్పి వాళ్లకి నేను ఛాన్స్ ఇచ్చినట్టుంటుంది కదా...  అని ట్వీట్స్ మానేశా. అందులో ఎవరైనా ఏమైనా రాయచ్చు కదా. ‘ఎవరో నలుగురైదుగురు అంటే ట్విట్టర్ నుంచి వదిలేయడం ఏమిటీ అని’ కొందరన్నారు.  అయితే ప్రతిరోజూ రాయడానికి ఏం ఉంటుంది నాకు? షారూఖ్‌ఖాన్ అయితే దలైలామాను కలిశా అనో ఇంకోటో  రాసుకోవచ్చు. నేనేం రాయాలి? మాపక్కింటివాళ్లని కలిశా అనా? ప్రతిరోజూ ఇంట్రెస్టింగ్‌గా ఏమిరాయగలను?

                                                              ***************************** 

 ఎవరితోనైనా ఒక్కసారి తేడా వస్తే రిలేషన్ కట్ చేసుకునే టైప్ కాదు నేను. ఒక్కటే పట్టుకుని వేలాడకూడదు. వాళ్లకి కూడా మారడానికి, ఎదగడానికి అవకాశం ఇవ్వాలి కదా!
 
 చారిటీ కోసం నా స్టేటస్ దానికి సరిపోదు. ఎవరికైనా  పనికొచ్చేది చేయడం అంత సులభం కాదు.
 
 నంది అవార్డ్ వచ్చాక చాలా మంది విచిత్రంగా రియాక్ట్ అయ్యారు. ‘‘నీకు అవార్డ్ వచ్చిందని తెలుసు కాని...’’ అంటూ. అవార్డ్ అనేది వ్యక్తుల మధ్య తప్పకుండా గ్యాప్ పెంచుతుంది. అవార్డ్స్ రావడమనేది నిజంగా ఒక లాటరీ టిక్కెట్. మీరు బాగా చేస్తే అవార్డ్ రాదు. తల రాత అంతే! నాకివన్నీ ఓవర్‌టైమ్ తెలిసింది. నాకు ఫిల్మ్‌ఫేర్ వచ్చిందనేది ఆ అవార్డ్‌నాకు వచ్చినప్పుడు సింక్ అవలేదు. మూడేళ్ల తర్వాత సింక్ అయింది! ఒక పర్టిక్యులర్ యాక్టర్‌కి వస్తుందని అనుకున్నా. అయితే రాలేదు. కాని రాకుండా వేరే ఎవరికో వచ్చింది. అప్పుడర్థమైంది ఇంత కష్టమా అని! దాని విలువ మూడేళ్ల తర్వాత తెలిసిందన్నమాట!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement