ఈ ఎటకారం ఆ నీళ్ల చలవే! | Krishna Bhagwan Exclusive Interview Sakshi family | Sakshi
Sakshi News home page

ఈ ఎటకారం ఆ నీళ్ల చలవే!

Published Sat, Sep 28 2013 11:08 PM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM

Krishna Bhagwan Exclusive Interview Sakshi family

‘గీత’లో ఉన్న గాంభీర్యానికి
 గోదావరి డిక్షన్‌లా ఉంటుంది కృష్ణభగవాన్ మాట!
 అర్జునుడికి కర్మజ్ఞానాది యోగాలు కళ్లు తెరిపిస్తాయ్ కదా, గీతోపదేశంలో...
 కృష్ణభగవాన్‌తో కాసేపు కూర్చున్నా అంతే!
 ఎంత తేలిగ్గా తీసుకున్నాడు లైఫ్‌ని!!
 తేలిగ్గా కూడా కాదు... ‘మినిమమ్’గా.
 అబ్బే, మినిమమ్ అని కూడా కాదు...
 జీవితం ఎలా నడిపిస్తే అలా తిన్నగా వచ్చేశాడు!
 ప్రయత్నం లేదు, ప్రయాస లేదు,పడిందీ లేదు, బాధపడిందీ లేదు.
 కామెడీ చేస్తాడు. ‘పడీపడీ’ చేయడు!
 మాటలు రాస్తాడు. పంచ్‌ల కోసం చూడడు.
 చిన్న వెటకరింపు, ఒక మిటకరింపు.
 రెండూ మ్యాచై, మిక్సై...
 సెలైన్సర్ ఉన్న మిస్సైల్‌లా పేల్తాయి!
 కృష్ణభగవాన్ తీరే అంత.
 యుద్ధాన్ని కూడా ‘ఓస్ ఇంతేనా’ అనిపించేలా...చేయిస్తాడు!
 గీతాసారం పూర్తిగా అర్థం కానివాళ్లు...
 ఈవారం ‘తారాంతరంగం’ చదవొచ్చు.

  ‘గోదావరి వెటకారానికి కేరాఫ్ అడ్రస్ కృష్ణభగవాన్’ అన్నది చాలామంది అభిప్రాయం. మీరేం అంటారు?
 కృష్ణభగవాన్: ఇంతకీ మీరేం అంటారో చెప్పండి?


 మా అభిప్రాయం కూడా అదే...
 కృష్ణభగవాన్: అలాగైతే సరే.
 
 ఈ వెటకారం మీకు ప్లస్ అయ్యిందా, మైనస్ అయ్యిందా?
 కృష్ణభగవాన్: మైనస్ ఎందుకవుతుందండీ... ప్లస్సే. ఆ ఎటకారమే కదా.. నన్ను ఇంటర్‌వ్యూ ఇచ్చే స్థాయికి తెచ్చింది.
 
 చిన్నప్పట్నుంచీ ఇంతేనా?
 కృష్ణభగవాన్: ఇంతకుముందు కొన్ని చోట్ల చెప్పాను. కాటన్‌దొర కారణంగా పంటలు పండటమే కాదు, గోదావరి జిల్లాల్లో ఓ యాస, ఓ సంస్కృతి ఏర్పడిందని. ఈ ఎటకారం ఆ నీళ్ల చలవే. అవి తాగితే చాలు.. మాటలో ఓ రకమైన సాగదీత, ఓ రాగం ఆటోమేటిగ్గా వచ్చేస్తాయి. రావుగోపాలరావు మాట్లాడేవారు గుర్తుందా.. ‘ఏం పాటలూ... యాలం పాటలా...’ అని.. అలా.
 
 పాపారావు చౌదరి..  కృష్ణభగవాన్‌లా ఎలా మారాడు?
 కృష్ణభగవాన్: కాలేజ్ రిజిస్టర్‌లో పాపారావుచౌదరి అనే ఉండేది. అయితే.. నా ముద్దుపేరు కృష్ణ. దాంతో కొందరు కృష్ణ అని, కొందరు కుట్టబాబు అని పిలిచేవారు. సినిమా ఫీల్డ్‌కి కృష్ణబాబు పేరుమీద వచ్చాను. భగవాన్ అనేది డెరైక్టర్ వంశీగారు తగిలించారు.
 
 ఏం చదువుకున్నారు?
 కృష్ణభగవాన్: మా నాన్నకు నా చదువు విషయంలో డౌట్. అందుకే మానిపించేసి వ్యవసాయంలో పెట్టేద్దామనుకున్నారు. కానీ పాపం కుదర్లేదు. నేనే ఎలాగోలా బీకామ్ చదివేశాను. నేను పుస్తకాలు కూడా కొనేవాణ్ణి కాదు. ఆరు చదువుతున్నప్పుడే ఏడో తరగతి వాడితో మంచిగా ఉండేవాణ్ణి. వాడు ఎనిమిదిలోకెళుతున్నాడనగా... పుస్తకాలు అడిగేవాణ్ణి. ఒకవేళ ఆడు తప్పాడనుకోండీ.. ఏడులోనే ఉండిపోయేవాడు. నేనే ఇంకోణ్ణి వెతుక్కోవాల్సొచ్చేది. అందుకే వాడు పాస్ అవ్వాలని వాడికంటే నేనే ఎక్కువ కోరుకునేవాణ్ణి. ఒక్కోసారి నాన్‌డీటైళ్లు (ఉపవాచకాలు) మారుతూ ఉండేవి. దాంతో కొత్తవి కొన క తప్పేది కాదు.
 
 బాగా చదివేవారా?
 కృష్ణభగవాన్: నేనా.. మార్కుల విషయంలో చాలా పిసినిగొట్టుని. 35 అంటే 35 మార్కులే తెచ్చుకునేవాణ్ణి. హిందీ పాస్ మార్కు 18 అయితే.. మనకూ కచ్చితంగా పద్దెనిమిదే!
 
 స్కూల్ డేస్‌లో గుర్తుండిపోయిన సంఘటన ఏదైనా ఉందా?
 కృష్ణభగవాన్: మా హిందీ మాస్టారు ఓ సారి క్లాస్‌లో అందరి ముందూ పట్టుకొని కొట్టాడు. ‘వెధవ... రాయుడు సూర్యనారాయణగాడి దాంట్లో కాపీ కొడతావా’ అని. పైగా నేను క్లాస్ లీడర్‌ని. అందరిముందు పరువుపోయింది. కొట్టినందుకు కాదు నా బాధ. సూర్యనారాయణగాడి దాంట్లో చూసి రాశానని ఎలా తెలిసిందా.. అనేదే నా బాధ!
 
 పక్కపక్కనే కూర్చుంటారనుకుంటా... అతను చేసిన తప్పే మీరూ చేసుంటారు..?
 కృష్ణభగవాన్: అబ్బే అది కాదు. కొశ్చన్ పేపర్‌లో లెటర్ ఇచ్చారు రాయమని. వాడు ఆ లెటర్ చివర్లో ‘ఆప్ కే లియే రాయుడు సూర్యనారాయణ’ అని రాశాడు. కాపీ కొట్టడంలో నేను సిన్సియర్ కదా. నేను కూడా ‘ఆప్ కే లియే రాయుడు సూర్యనారాయణ’ అని రాశా. మరి కొట్టకేం చేస్తాడు.
 
 చదువుకునే రోజుల్లో లవ్ ఎఫైర్ ఏమైనా ఉందా?
 కృష్ణభగవాన్: లవ్ ఎఫైర్ అంటే... భోంచేయకుండా ఉండటం, ఎదురు చూడ్డం.. అలాంటివే కదండీ. అలాంటివైతే లేవండీ.
 
 అంటే... ఏ అమ్మాయినీ ఇష్టపడలేదా?
 కృష్ణభగవాన్: ఆపోజిట్ సెక్స్ కదండీ. అడిగే మీకూ ఉంటుంది. చెప్పే నాకూ ఉంటుంది. ఆ వయసు వచ్చినప్పుడు అంతా అలాగే బిహేవ్ చేస్తారు. నాక్కూడా అలాంటి ఇష్టాలున్నాయి. అయితే.. ప్రేమలేఖలు రాయడాలు, రాత్రుళ్లు నిద్రపోకుండా విరహగీతాలు పాడటాలు, ఆ అమ్మాయికి జ్వరం వస్తే నాకూ జ్వరం రావాలని చంకల్లో  ఉల్లిపాయలు పెట్టుకోవడాలు అలాంటివెప్పుడూ చేయలేదు.
 
 మీ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలనుంది. చెబుతారా?
 కృష్ణభగవాన్: మాది కాకినాడ అండీ. ఎగువ మధ్య తరగతి కుటుంబం. నాన్న వ్యవసాయదారుడు. అమ్మ గృహిణి. మేం ముగ్గురు అన్నదమ్ములం. ఒక అన్నయ్య డాక్టర్. ఒక అన్నయ్య ఇంజినీర్. నేనేమో ఇలా. మా అందరికంటే పెద్ద మా అక్క. అక్క కూడా గృహిణే. సింపుల్‌గా ఇదీ మా కుటుంబం. భగవంతుడి దయవల్ల బాగానే పెరిగామండీ. ఉన్నదాంట్లో ఏ లోటూ లేకుండా పెంచాడు మా నాన్న.
 
 ఒకన్నయ్య ఇంజినీర్, ఒకన్నయ్య డాక్టర్. మరి మీరేంటి? బీకాంతోనే కామ్ అయ్యారు?
 కృష్ణభగవాన్: అదన్నా చదివా సంతోషించండి. ఇంటికొచ్చినోళ్లు మా నాన్నను అడుగుతూ ఉండేవారు. పెద్దోడు ఏం చదువుతున్నాడు? అని. ‘డాక్టర్’ అని చెప్పేవారు. రెండోవాడు?  అనడిగితే... ‘ఇంజినీర్’ అనేవాడు. మరి మూడోవాడు అనగానే.. ‘అడుగో.. అక్కడున్నాడు’ అని నన్ను చూపించేవారు. ఆయన మొహంలో ఏదో కసి కనిపించేది.
 
 ఏదిఏమైనా చివరకు మీరే గెలిచారుగా?
 కృష్ణభగవాన్: అంతా దేవుడి దయ.
 
 అసలు కళలపట్ల ఆసక్తి ఎలా మొదలైంది?
 కృష్ణభగవాన్: నాటకాలు వేసేవాళ్లం. నేను మైమ్ ఆర్టిస్ట్‌ని కూడా. మా అన్నయ్య కూడా మంచి ఆర్టిస్ట్. ఇప్పుడు డాక్టరైపోయి అమెరికాలో ఉంటున్నాడనుకోండి. ఒకప్పుడు మేం ఇద్దరం, మా ఫ్రెండ్సూ కలిసి నాటకాలు వేసేవాళ్లం.
 
 సినిమాల్లో నటించాలని ఎందుకనిపించింది?
 కృష్ణభగవాన్: ఎవడో చప్పట్లు కొట్టాడండీ. అప్పటిదాకా ఎలా బతగ్గలనా అనే మీమాంసలో ఉండేవాణ్ణి. ఆ చప్పట్లు విని ‘నేను ఇందుకే పనికొస్తానేమో’ అనిపించింది. దాంతో ఇలా వచ్చేశా. ఇలా వచ్చి.. మీ ‘సాక్షి’కి ఇంటర్‌వ్యూ ఇచ్చే స్థాయికి ఎదిగా.
 
 ఛాన్‌‌సల కోసం తిప్పలేమైనా పడ్డారా?
 కృష్ణభగవాన్: భోజనం లేకపోవడంతో కుళాయిలో నీళ్లు తాగి సర్దుకోవడం, చొక్కాకు చెమట పట్టి వాసనొస్తుంటే... ఉతుక్కోవడానికి సబ్బు కూడా లేకపోవడం వల్ల.. కాస్త తడి చేసి పౌడర్ జల్లుకొని తొడుక్కోవడం, రోడ్డు మీద ఓ పది రూపాయలు దొరికితే బావుండు.. ఇవాళ టిఫిన్ చేయొచ్చని కలలుగనడం.. ఇవన్నీ నా కెరీర్‌లో కూడా.. జరిగాయనుకుంటున్నారా? జరగలేదండీ. దేవుడి దయవల్ల తేలిగ్గానే అవకాశాలొచ్చాయి.
 
 మీ తొలి సినిమా జంధ్యాలగారి ‘శ్రీవారి శోభనం’ కదా?
 కృష్ణభగవాన్: ఆ విషయం నన్ను ప్రేమించేవాళ్లకు మాత్రమే తెలుసు. చాలామంది ‘మహర్షి’ అనుకుంటుంటారు. ‘ముద్దమందారం’ వందరోజుల వేడుకలో జంధ్యాలగారి ముందు మైమ్ యాక్టింగ్ చేసే అవకాశం ఎస్పీ బాలుగారి ద్వారా కలిగింది. ఆ ప్రోగ్రామ్‌లోనే పదిహేను నిమిషాల పాటు స్లో మోషన్ చేసి చూపించాను. జంధ్యాలగారికి తెగ నచ్చేసింది. దాంతో ‘శ్రీవారి శోభనం’లో అవకాశం ఇచ్చారు. హీరోహీరోయిన్ల శోభనానికి ఏదో అడ్డంకి వస్తుంది. ఆ అడ్డంకిగా నా మైమ్ యాక్టింగ్‌ని అడ్డం పెట్టారు జంధ్యాల.
 
 వంశీతో పరిచయం ఎలా ఏర్పడింది?
 కృష్ణభగవాన్: ‘లేడీస్ టైలర్’ తర్వాత ఆయన సెలక్షన్లు పెట్టారు. వేమూరి సత్యనారాయణ, తనికెళ్లభరణి, క్రాంతికుమార్ జడ్జీలు. అప్పుడు నాతో పాటు సెలక్ట్ అయినవాళ్లలో రాంజగన్, సూర్య కూడా ఉన్నారు. అయితే... ఆ సెలక్షన్లు ‘మహర్షి’ కోసం కాదు. వేరే సినిమా కోసం. ఆ సినిమా ఎందుకో కార్యరూపం దాల్చలేదు. దాంతో వంశీ ‘మహర్షి’ చేయడానికి నిశ్చయించుకున్నారు. ఆ సినిమాలో ‘తిలక్’ పాత్రకు తనికెళ్ల భరణివంశీగారికి నన్ను రికమెండ్ చేశారు. ‘మహర్షి’ అప్పట్లో పెద్దగా ఆడలేదుగానీ, అందులో పాటలన్నీ ముత్యలే.
 
 హీరో అవుదామని వచ్చినట్టున్నారు? ‘మహర్షి’లో మీ బాడీలాంగ్వేజ్ అలానే అనిపిస్తుంది?
 కృష్ణభగవాన్: లేదండీ.. శరత్‌బాబు చేసే పాత్రలు లాంటివి దొరికితే చేద్దామని వచ్చాను.
 
 అలా వచ్చి విలన్‌గా కూడా చేసేశారుగా. ఇప్పుడు నవ్విస్తున్నారు కానీ, ‘ఏప్రిల్ 1 విడుదల’లో గోపిచంద్‌గా మీ విలనిజం చూస్తే ఇప్పటికీ చాలామందికి భయం వేస్తుంది.

  కృష్ణభగవాన్: అది నా గొప్పతనం కాదండీ. ఆ సినిమాల్లోని సిట్యుయేషన్స్ గొప్పతనం. అందులోని నా పాత్ర పేరు కూడా జనాలకు అలా గుర్తుండిపోయింది.
 
 అంత బాగా విలనిజం ఎలా పండించగలిగారు?
 కృష్ణభగవాన్: నేనేం చేయకపోవడమే బాగుంది అందులో. అప్పట్లో విలన్లంటే హంగామాతో ఉండేవారు. ఈ గోపిచందేమో జనాల్లో ఒకడిగా ఉంటాడు. దాంతో భయపడిపోయారు పాపం.
 
 ఆ సినిమా రచన విషయంలో మీ పాత్ర ఉందని అంటారు నిజమేనా?
 కృష్ణభగవాన్: ఏ మాటకామాటే చెప్పాలి... రాశానండీ. టైటిల్స్‌లో పేరుండాలని మాత్రం కోరుకోలేదు.
 
 అంతకుముందు నాటకాలేమైనా రాశారా?
 కృష్ణభగవాన్: లేదండీ.
 
 మరి ఏకంగా సినిమాకెలా రాసేశారు?
 కృష్ణభగవాన్: ‘నువ్వు రాయగలవ్ రాసేయ్’ అన్నారు వంశీ. రాసేశాను. నేను గొప్ప రైటర్‌ని అయితే... ఎదుటివారు బాగాలేదంటే బాధ పడాలి. నేనసలు రైటర్‌నే కాదు. ఇక బాలేదంటే బాధ దేనికీ. అందుకే ధైర్యంగా రాసేశాను. నా అదృష్టం... డైలాగులు కూడా అందరికీ నచ్చాయి. ఆ సినిమాకు రాసినందుకు వేషంతో పాటు నెలకు వెయ్యిరూపాయలు ఇచ్చారు వంశీ.
 
 మరి తర్వాత ఎందుకు కంటిన్యూ అవ్వలేదు?
 కృష్ణభగవాన్: డైలాగులు రాయడం కష్టంతో కూడుకున్న వ్యవహారం. ఇండస్ట్రీలో ముందు మోసపోయేదీ రైటరే. అందుకే ఆ వైపు వెళ్లలా.
 
 ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’కు ముందు మీకు కొంత గ్యాప్ వచ్చింది. ఎందుకు?
 కృష్ణభగవాన్: వంశీగారికి గ్యాప్ వచ్చింది. నాకూ వచ్చింది.
 
 అదేంటి?
 కృష్ణభగవాన్: తొలినాళ్లలో నన్ను చేయిపట్టి నడిపించింది ఆయనే కదా. ఓ సారి ఆయనే అన్నారు. ‘గ్యాప్ తీసుకోవాలయ్యా... ఇలాగే ఎవరో ప్రొడ్యూసర్లు వస్తూ ఉంటారు. మనం చేసేస్తూ ఉంటాం. అవేమో ఆడవు. ఎందుకు’ అని. అన్నట్లే ఏడాదిన్నర పాటు సినిమా ఏదీ ఒప్పుకోలేదాయన. ఆ విరామం తర్వాత ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ చేశారు.
 
 ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’లోనే కదా.. మీరు తొలిసారి గోదావరి స్లాంగ్‌లో మాట్లాడింది?
 కృష్ణభగవాన్: కాదు.. ‘వసంతకోకిల’ సీరియల్‌లో. ఉప్పలపాటి నారాయణరావు డెరైక్టర్. ఆ పాత్రకు నంది అవార్డు వచ్చింది. ఓ సారి ఎందుకో వంశీ ఆ సీరియల్ చూశారు. అప్పటికే ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ షూటింగ్ కూడా పూర్తయిపోయింది. అయినా.. నన్ను పిలిచి ‘షూటింగ్ అయిపోయింది. ‘వసంతకోకిల’లోని నీ పాత్రను.. ఈ కథలో ఇన్వాల్వ్ చేసి రాసుకోగలవా?’ అనడిగారు. ‘రాస్తానండి’ అని చెప్పాను. ‘కొండవలస అనీ..  ఓ కొత్త ఆర్టిస్ట్ ఉన్నాడు. మీ ఇద్దరికీ కలిపి సీన్స్ రాస్కో’ అని చెప్పారు. ఆయన మాట ప్రకారం మా ఎపిసోడ్ రాశాను.
 
 ఆ కామెడీ ట్రాక్ మొత్తం మీరు రాసుకుందేనా?
 కృష్ణభగవాన్: అవును. నేనే రాశాను. ‘మన థాట్స్ ఓల్డ్ అయిపోయాయేమో! ఈ డైలాగులకి యూత్ నవ్వుతారో లేదో’ అని మొదట్లో గిలి ఉండేది. అందుకు తగ్గట్టే.. మా ఎపిసోడ్ తీసేటప్పుడు లొకేషన్లో ఎవరూ నవ్వేవారు కాదు. ఓ రోజు మాపై ఓ కామెడీ సీన్ తీస్తున్నారు వంశీ. ‘ఏంటి కుక్కగారు పొట్రాజుగారిని తీసుకొని బయలుదేరారు’ అనేది నా డైలాగ్. ఎవరూ నవ్వలేదు. వంశీగారికి డౌట్ వచ్చింది. ‘నవ్వుతారంటావా? లేకపోతే... ఇంకోటేదైనా రాసుకుంటావా?’ అనడిగారు. ‘లేదండీ.. ఎటకారంగా ఒకణ్ణి వేపుకు తినడం.. జనాలు బాగానే ఎంజాయ్ చేస్తారు’ అన్నాను. నాపై నమ్మకంతో తీసేశారు వంశీ. ‘చిట్టిబాబు... ఈ డబ్బులు తీసుకెళ్లి డ్రాయర్‌లో పెట్టేయ్’ అంటే...‘నేను డ్రాయర్ వేసుకోలేదు’ అంటా. దానికీ ఎవరూ నవ్వలేదు. ‘చిట్టిబాబు... మొన్న ఆటోలో ఎవరో అమ్మాయితో వెళుతున్నావ్. ఎందాకా వెళ్లావేంటి?’ అనడిగితే.. ‘ముద్దుల్దాకా’ అంటా. ఎవరూ నవ్వలేదు. ‘మీ అక్కని నేను చంపానంటారేంట్రా... ఏదో కడుపులో పురుగులున్నాయంటే.. అవి చస్తాయని కూతంత ఎండ్రిన్ పోశాను’ అనేది జీవా డైలాగ్. దానికీ ఎవరూ నవ్వలేదు. ఇక నాకూ డౌట్ మొదలైంది. ‘ఇదీ మిస్ ఫైర్ అయ్యింది’ అని ఫిక్సయిపోయా. నా అనుమానం నిజం చేస్తూ చివరకు ఎడిటింగ్ రూమ్‌లో కూడా ఎవరూ నవ్వలేదు. ‘దెబ్బకొట్టిందిరా బాబూ’ అనుకుంటుండగా... సింగర్ సునీత డబ్బింగ్ చెబుతూ ‘ఆ సొట్ట చెయ్యతను ఎవరండీ... ఇరగదీసేశాడు’ అని తెగనవ్వేసిందట. కో-డెరైక్టర్ చెప్పాడు. పోన్లే ఒక్కరైనా నవ్వారు అని తృప్తిపడ్డాను. తర్వాత ఎమ్మెస్ నారాయణ డబ్బింగ్ చెప్పారు. నేనూ అక్కడే ఉన్నా. ‘సెలైంట్‌గా మార్కులు కొట్టేశావురా బాబు’ అన్నారు. ఆశ చిగురించింది. సినిమా రిలీజ్‌కి ముందే షిరిడీ వెళ్లాను. అక్కడ జోరున వాన. ఇక్కడ చిరంజీవి ‘ఇంద్ర’ రిలీజ్. ఇక ఈ సినిమా సోదిలో కూడా ఉండదులే అనుకున్నా. రైటర్ శంకరమంచి పార్థసారథి ఫోన్. ‘సినిమా పెద్ద హిట్. ముఖ్యంగా మీకు మంచి పేరొచ్చింది’ అని. ‘హమ్మయ్య...’ అని ఊపిరి పీల్చుకున్నాను. తర్వాత అదే సంస్థపై నిర్మాత వల్లూరిపల్లి రమేష్ ‘కబడ్డీ కబడ్డీ’ సినిమా స్టార్ట్ చేశారు. ఇండస్ట్రీలో తొలి విజయం కంటే మలి విజయం చాలా ముఖ్యం. అది అందరికీ రాదు. రవితేజనే తీసుకోండి. ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ తర్వాత ‘ఇడియట్’ వచ్చింది. ఇక వెనక్కితిరిగి చూసుకోలేదు. నాకేమో ‘కబడ్డీ కబడ్డీ’.
 
 ఆ సినిమా కూడా దాదాపు వంశీ పక్కీలోనే ఉంటుంది కదా?
 కృష్ణభగవాన్: అవును.. అందులో కూడా కామెడీ ట్రాక్ దాదాపుగా నేనే రాశాను. ఓ సీన్‌లో బ్రహ్మానందం డైలాగ్.  ‘‘పుట్టినరోజునాడు పట్టుచీర అడిగింది. కొనలేకపోయాను. తర్వాత ప్రెగ్నెంట్‌ని కదండీ.. మారుతీకారు కొనండి అంటే అదీ కొనలేకపోయాను. ఏవండీ.. పిల్లలు పుట్టేశారు ఓ అపార్ట్‌మెంట్ అయినా కొనండీ అంటే అది కూడా కొనలేకపోయాను. అక్కడ్నుంచి అది అన్నం తినడం మానేసి నన్ను తినడం మొదలెట్టింది. నా పొజిషన్‌లో మీరుంటే ఏం చేస్తారు చెప్పండి?’’ అని. ‘మీ మిసెస్‌ని నేనేం జేసినా బాగుండదు కదండీ’ అంటాను. స్పాంటేనియస్‌గా వచ్చేసిందా డైలాగ్. బ్రహ్మానందం పక్కున నవ్వేశారు. నిజానికి ఆ సీన్ ఇంకా ఉంది. కానీ ఇక తీయనవసరం లేదు అన్నారాయన. అదేంటి? అని డెరైక్టర్ అడిగితే.. ‘భగవాన్ పంచ్‌తో ఫట్’, ఇక ఆ సీన్‌లో నవ్వించడానికి కూడా ఏమీ లేదు అని తేల్చేశారు బ్రహ్మానందం. ‘కబడ్డీ కబడ్డీ’ మంచి స్క్రిప్ట్. దర్శకుడు వెంకీ కష్టపడి చేసుకున్న స్క్రిప్ట్ అది. దానికి మా ఊళ్లో జరిగిన కొన్ని అనుభవాలను అద్దానంతే.
 
 అవన్నీ స్వీయ అనుభవాలా?
 కృష్ణభగవాన్: అలా అని కాదండీ... చూసిన సంఘటనలు కూడా ఉంటాయి కదా. అవే ఫన్నీగా అనిపిస్తాయి. ఉదాహరణకు ‘కబడ్డీ కబడ్డీ’లో పేకాట సీన్ ఉంది. పోలీస్ గెటప్‌లో జయప్రకాష్‌రెడ్డి రాగానే అందరూ పేకలు సర్దేసి పారిపోతారు. మా ఊళ్లో జరిగిన ఓ సంఘటన స్ఫూర్తిగా తీసుకొని ఆ సీన్ రాశాను. మా ఊళ్లో కోళ్ల పందాలు బాగా జరుగుతాయి. పోలీసులొస్తారేమో... అని జువ్వలు చేతికిచ్చి ఊరి పొలిమేరల్లో ఒకణ్ణి నిలబెట్టేవారు. కాలవ గట్టుమీద పోలీస్ జీప్ కనిపించగానే... వాడు జువ్వల్ని వెలిగించేవాడు. వాటి సౌండ్ వినబడటమే ఆలస్యం... అక్కడ లొకేషన్లో అన్నీ సర్దేసేవారు. ఓ సారి నాలాంటోడు ఆ జువ్వలవాడి దగ్గరకొచ్చి... ‘ఆవి పేలవెహె’.. అన్నాడు. ‘ఏయ్.. ఎందుకు పేలవ్.. పేల్తాయి’ అని వీడు. చివరకు పంతం పెరిగి జువ్వల్ని వెలిగించేశాడు. అంతే, ఆ సౌండ్ విని ఊళ్లోని పందేల రాయుళ్లు పరార్.
 
 ఇలాంటి అనుభవాలు ఇంకా ఉన్నాయా?
 కృష్ణభగవాన్: ఎందుకు లేదండీ. అద్భుతమైన సంఘటన ఒకటి చెబుతా. మా ఊళ్లో కుక్కలన్నీ కుక్కల్లానే ఉండేవి. ఓ కుక్కకు మాత్రం ‘ఎందుకిలా కుక్కలా బతకాలి’ అనే రివల్యూషనరీ థింకింగ్ ఏర్పడింది. బ్రౌన్ స్కిన్‌పై నల్లమచ్చలుండేవి దానికి. అది పుట్టడమే ఓ రకంగా పుట్టింది. కోడి పెట్టల్ని చూస్తుంటే చాలు దాని నోట్లో లాలాజలం ఊరేది. కానీ ఓనర్లు, మగాళ్లు, మనుషులు దానికి అడ్డంకి. దాంతో వాళ్లందర్నీ నమ్మించడానికి కోడిపెట్టల మధ్యలో పడుకొనీ.. ‘అసలు మీపై నాకు అలాంటి ఫీలింగే లేదు’ అన్నట్లు నాలుగు కాళ్లు ఎల్లబెట్టి... అలా విరుచుకుంటూ దొర్ల్లుతూ, పెట్టలు పై నుంచి దూకుతుంటే.. ‘అయ్‌బాబోయ్ కితకితలు..’ అన్నట్లుగా రకరకాల హావభావాలు పలికించేది. సడన్‌గా ఓ కోడి మిస్. అది పక్కింటోళ్ల ఖాతాలోకి వెళ్లిపోయేది. మళ్లీ ఎక్కడైనా కోళ్ల గుంపు కనిపిస్తే... మళ్లీ ఇదే వేషాలు. అక్కడా కోడి మాయం. కొన్నాళ్లకు దానికే డౌట్ వచ్చింది. ‘ఇలాగే ఉంటే దొరికిపోవడం ఖాయం’ అనుకుంది. నాలుగు మర్డర్లు చేసిన తర్వాత ఏ నేరస్తుడైనా ఇలాగే ఆలోచిస్తాడు కదా. అడవిలోకి వెళ్లిపోయింది. జనాలకు కనబడకుండా అడవుల్లో ఉంటూ కోళ్లపై రాత్రుళ్లు దాడి చేస్తుండేది. యజమానులకేమో... పక్కింటోళ్ల మీద డౌట్. పక్కింట్లో కోడి ఉడుకుతుంటే... మనకోడే అనుకొని బాధ. కొంతమందయితే... ఇదే సందని కోళ్లను కాజేసేవాళ్లు. అవన్నీ కుక్కఖాతాలోకి వెళ్లిపోయేవి. ఇలా ఆ కుక్క పుణ్యమా అని మా ఊళ్లో కొంతమంది దొంగలయ్యారు. ఫ్రీగా ముక్క దొరుకుతుంది కదా అని కొందరు తాగుబోతులయ్యారు. ఇదిలావుంటే... ఈ కోళ్ల దొంగ ఎవరో ఓ రోజు ఓనర్లకి తెలిసిపోయింది. ఊళ్లో ఈ కుక్క వార్త దావానలంలా వ్యాపించింది. మేమందరం దాన్ని చూడాలని తహతహ లాడిపోయేవాళ్లం. కోళ్ల గంప కదిలిందంటే చాలు... ‘అదొచ్చిందేమో...’ అని పరిగెత్తుకొచ్చేవాళ్లం. అందంటే అంత క్రేజ్. ఈ కుక్కని చంపుతానని పక్క ఊరి నుంచి ఒకడొచ్చాడు. వాడికి ఓ బస్తా బియ్యం ఇస్తామన్నారు జనాలు. వాడు అలాంటి కుక్కనే ఓ దాన్ని చావగొట్టి బస్తా బియ్యం పట్టుకుపోయాడు. మళ్లీ కోళ్లు మాయమవుతున్నాయి. అప్పుడు ఊర్లో మనిషే ఆ కుక్కని చంపి కోళ్లను కాపాడాడు. ‘కోళ్లు తినే కుక్క’ అని దానికి పేరు. ఇప్పటికీ ఆ కుక్క గురించి చెప్పుకుంటుంటారు. నా చిన్ననాటి జ్ఞాపకం అది.
 
 మీ లైఫ్‌లో జరిగిన సంఘటనల్నే సినిమాల్లో వాడితే... వాటికోసమే జనాలు చూస్తారేమో!
 కృష్ణభగవాన్: పల్లెటూళ్లల్లో ఇలాంటివి సహజమండీ. అయితే ఇప్పటి తరానికి ఆ ఆనందం లేదు. ఈ పాశ్చాత్య పోకడలు పల్లెలకు కూడా వ్యాపించాయి. ఈ కారణంగా మన సంస్కృతి చాలా వరకూ అడుగంటిపోయింది. టెక్నాలజీ మనకు చాలా ఇచ్చింది. అలాగే చాలా కోల్పోయేలా చేసింది. మా ఊళ్లో దేవుడి కల్యాణం అంటే నాటకాలు వేసేవారు. హరికథలు పెట్టించేవారు. రికార్డింగ్ డాన్సులుండేవి. జనాలందరం ఒక చోట చేరేవాళ్లం. సందడి సందడిగా ఉండేది. ఇప్పుడేది ఆ సందడి. సినిమా చూడాలంటే అప్పుడు పెద్ద ప్రహసనం. కానీ ఇప్పుడు ఇంట్లో చూసేస్తున్నాం. ప్రయాణంలో చూసేస్తున్నాం. కార్లో చూసేస్తున్నాం. చివరకు జేబులో ఉండే సెల్ ఫోన్లతో కూడా చూసేస్తున్నాం. ఆ రోజుల్లో పాటలు వినాలంటే రేడియోనే ప్రధాన సాధనం. మధ్యాహ్నం రెండు గంటలకు జనరంజని. ‘ఆ... ఏంటి చంటి అక్క... ఏంటి విశేషాలు’ అంటే... ‘ఆ ఏముంది తమ్ముడూ.. ఎండలు మండిపోతున్నాయి’ అంటూ అక్క తమ్ముళ్లు రేడియోలో మాట్లాడుకుంటుంటే.. మధ్యమధ్యలో ఘంటసాల పాటలు వస్తుండేవి. ఇంట్లోవాళ్లందరం సరదాగా పాటలు వినేవాళ్లం. పండగలప్పుడు పందిట్లో మైకు పెట్టేవారు. వరుసగా తొమ్మిదిరోజుల పాటు పాటలే పాటలు. గ్రామ్‌ఫోన్ రికార్డ్ దగ్గర ఒకడు కూర్చునేవాడు. వాణ్ణి మేం ఊరికి మొనగాడులా భావించేవాళ్లం. నేను నిదానంగా వెళ్లి వాడి దగ్గర నిలుచునేవాణ్ణి. ‘ఏం కావాలి?..’ అనేవాడు చిరాగ్గా. ‘బుద్దిమంతుడు’లో ఆ పాట వేయవా’ అని అడిగేవాణ్ణి. ‘ఏం పాటా... వెళ్లి ముందు టీ పట్రా పో..’ అనేవాడు. ఇంట్లో వాళ్లని బతిమాలుకొని.. ఎలాగోలా జాగ్రత్తగా టీ మోసుకొచ్చేవాణ్ణి. ‘బుద్దిమంతుడు’లో ‘టాటా వీడుకోలు’ పాట వేయవా’ అనేవాణ్ణి. ‘వేస్తా పో..’ అనేవాడు. ఫ్రెండ్స్ దగ్గరకెళ్లి నిలబడి ‘ఇప్పుడు ‘బుద్ధిమంతుడు’లో టాటా వీడుకోలు ‘పాటొస్తది చూస్కోండి’ అనేవాణ్ణి దర్పంగా. వాడు పాటేసేవాడు. ‘టాటా... వీడుకోలు...’ మైకులో ఘంటసాల గొంతు వినబడుతుంటే నాకేమో విజయగర్వం. తర్వాత మళ్లీ వెళ్లేవాణ్ణి. ‘రేపంటి రూపం కంటి’ పాటేయవా అనడిగేవాణ్ణి. అదంతా ఓ థ్రిల్లండీ.. దీపావళి పండుగ వచ్చి వెళ్లిపోతే... ప్రేయసి వెళ్లిపోయినంత బాధపడిపోయేవాళ్లం. ఇప్పటి జనరేషన్‌కి ఆ ఆనందం ఏదీ?  
 
 మీలో మంచి భావుకత ఉన్నట్టనిపిస్తుంది... సాహిత్యం బాగా చదువుతారా?
 చలం సాహిత్యం బాగా ఇష్టం. ఆయన మ్యూజింగ్స్ బాగా చదువుతా.
  ఆయన సిద్ధ్దాంతాలతో ఏకీభవిస్తారా?  
 తప్పకుండా. ఇప్పుడు జరుగుతున్నాయిగా. ఆయన నిజాలు రాశాడు. అయితే... ఆయన రచనల్లోని పాత్రల్లా మారండని మాత్రం ఎక్కడా చెప్పలేదు. ఆయన ఏం రాసినా అనుభవించి రాశాడు. చేవ, దమ్ము ఉంటే ఓ గజ్జి కుక్కని తెచ్చి పెంచమంటాడాయన. చెప్పడం కాదు ఆయన అలానే బతికాడు. ఓ విధంగా చెప్పాలంటే... తాను రాసిన దానికంటే గొప్పగా బతికాడు. ఆ ఎక్స్‌ప్రెషన్ అంటే నాకు ప్రాణం. అలాగే పతంజలిగారు కూడా. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. నన్ను ఇంటికి కూడా తీసుకెళ్లేవారాయన. ఎప్పుడో జరిగిన గ్లోబలైజేషన్ గురించి కన్నీరు పెట్టుకునేవారు.
 
 ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
 కృష్ణభగవాన్: నేను చాలా హెల్దీగా ఉండేవాణ్ణండీ. ఇంటర్‌లో బాడీ బిల్డర్‌ని కూడా. ఉన్నట్టుండి కొన్నాళ్ల క్రితం నుంచి బ్యాక్‌పెయిన్ మొదలైంది. ఆయుర్వేదం, హోమియోపతి, ఆక్యుపంక్చర్, అక్యు ప్రెజర్, మర్మకళ ఇలా చాలావాటిని ట్రై చేశా. గుణం కనిపించలా. రెండు నెలల క్రితం భక్తియార్ చౌదరి గారని ఓ డాక్టర్‌గారిని కలిశా. రెండు నిమిషాల పాటు నన్ను గమనించి నా సమస్య ఎక్కడో చెప్పేశారాయన. ఆయన చెప్పినట్టు కొన్ని ఎక్సర్‌సైజులు చేస్తున్నా. ఇప్పుడు గుణం కనిపిస్తోంది.
 
 మీ పిల్లల గురించి చెప్పలేదు?
 కృష్ణభగవాన్: ఒకే అమ్మాయి. ఇంజినీరింగ్ చదివింది. ఆ మధ్య ఉద్యోగం కూడా చేసింది. ఫ్యామిలీ పరంగా నేను హ్యాపీ. ఒవరాల్‌గా జీవితం హ్యాపీగానే సాగుతోంది.


 - బుర్రా నరసింహ
 
 దాన్ని షిరిడీలో వదిలేద్దామనుకుంటున్నా!
 మీరు బాగా బాధ పడ్డ సందర్భం?
 కృష్ణభగవాన్: మందు తాగి స్టేజ్ ఎక్కాడని ఓసారి మీ మీడియావాళ్లే టీవీల్లో రాద్ధాంతం చేశారు.. అప్పుడు. నిజానికి అప్పుడు నేను డ్రింక్ చేయలేదు.
 
 మందు తాగుతారా?
 కృష్ణభగవాన్: అప్పుడప్పుడు
 
 మీ బలహీనత?
 కృష్ణభగవాన్: కోపం ఎక్కువండీ. మీలో ఇంత కోపం ఉందా అని చాలామంది ఆశ్చర్యపోతుంటారు. షిరిడీలో వదిలేద్దామనుకుంటున్నా.
 
 ఇష్టమైన ఫుడ్?
 కృష్ణభగవాన్: ముద్దపప్పు, ఆవకాయ్. దాంట్లో ఫ్రెష్ నెయ్యి ఉండాలి. బిర్యాని అంటే కూడా టెమ్ట్ అవుతా. అది కూడా చికెనే.
 
 ఇష్టమైన దేశం?
 కృష్ణభగవాన్: బ్యాంకాక్ బావుంటుంది.
 
 ఎలాంటి డ్రస్సుల్ని ఇష్టపడతారు?
 కృష్ణభగవాన్: సింపుల్‌గా జీన్స్, టీ షర్ట్స్.
 
 గేమ్స్ ఇష్టపడతారంట?
 కృష్ణభగవాన్: అవును క్రికెట్ అంటే ఇష్టం.
 
 ఆడతారా?
 కృష్ణభగవాన్: చిన్నప్పుడు టెన్నిన్ బంతితో ఆడేవాళ్లం. ఆస్ట్రేలియా వాళ్లను చూసి సున్నం మొహానికి రాసుకునేవాణ్ణి. అది పొక్కిపోయి, దుద్దర్లొచ్చి వికృతంగా తయారయ్యేవాణ్ణి. అలాగే టెన్నిస్ అంటే కూడా చాలా ఇష్టం.
 
 లేడీస్ ఆట చూస్తారా? జెంట్స్ ఆట చూస్తారా?
 కృష్ణభగవాన్: లేడీస్ ఆటే..(నవ్వుతూ)
                                                                         ***********


 నా ఊరి అనుభవాలు ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. అది నా పదమూడో ఏటో పద్నాలుగోయేటో గుర్తు లేదు. మా ఊరి గుళ్లో దేవుడి కల్యాణం. ఆ రోజు రాత్రి రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నానికి డాన్సర్లందరూ కార్లలో దిగారు. ఎంత అందంగా ఉండేవారో... అందులో మణికుమారి అనీ... ఓ ఆవిడ. ఆవిణ్ణి చూడగానే... మా ఊళ్లో ఆడోళ్లందరిపై అసహ్యం వేసింది నాకు. అంత అందగత్తె. మణికుమారికి తిలకం డబ్బా అవసరమైంది. వెంటనే నా మోటర్‌సైకిల్ స్టార్ట్ చేశా. మోటర్‌సైకిల్ అంటే నిజమైన మోటర్ సైకిల్ అనుకునేరు. పరిగెడతానే... మోటర్‌సైకిల్ మీద వెళుతున్న బిల్డప్. అమ్మ నడిగి తిలకం బాటిల్ తీసుకొని మళ్లీ నా మోటర్‌సైకిల్ మీద వేగంగా మణికుమారిని చేరుకున్నా. ఆ రాత్రి రికార్డింగ్ డాన్స్ అయిపోయింది. తెల్లారితే మా ఇంట్లో భోజనాలు. ఆ భోజనాల్లో అందరితో పాటు మణికుమారికి కూడా ఆకు వేసి కూర్చోబెట్టారు. మా నాన్నను చూస్తే కోపమొచ్చేసింది నాకు. ‘మణికుమారిని అందరితో పాటు ఇలా కింద కూర్చోబెడతారా?’ అని బాధ. తను ఏం హర్టయిపోతుందో అని ఆవేదన. తర్వాత రోజు మా పాలేరు రాకపోవడంతో నన్ను గేదెల్ని కాయమన్నాడు నాన్న. తప్పేదిలేక గేదెల్ని తీసుకొని ఊరిబయటకు వెళ్లాను. అప్పుడో బస్ నా పక్కనుంచి వెళుతోంది. మణికుమారి ఆ బస్‌లో ఉంది. ఊరు వదిలి వెళ్లిపోతోంది. గేదెలు కాస్తున్న నన్ను మణికుమారి చూస్తుందేమో అని చెట్టుపక్కన దాక్కున్నా. అసలు మణికుమారికి నేనెవరో కూడా తెలీదు. నా మనసులో ఏముందో కూడా తెలీదు. కానీ ఆ వయసులో ఏదో ఫీలింగ్. తర్వాత ఎప్పుడూ కనిపించలేదు తను. ఇప్పటికీ వంశీగారు అడుగుతుంటారు. ‘ఎలా ఉంటుందయ్యా మణికుమారి’ అని.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement